English | తెలుగు | हिन्दी

అధ్యాయం 12

శుద్ధీకరణ

మన వారసత్వం · బఖ్త్ సింగ్

శుద్ధీకరణ

ఇశ్రాయేలీయులు యొర్దాను నదిని దాటిన తరువాత, ప్రభువు యెహోషువకు ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములలో ప్రతి గోత్రము నుండి ఒక్కొక్క మనుష్యుని ఏర్పరచుకొనమనియు, యొర్దాను నది మధ్యనుండి పండ్రెండు రాళ్ళను తీసికొని రమ్మనియు ఆజ్ఞాపించెను, ఆ రాళ్ళు గిల్గాలులో నిలువబెట్టబడెను (Josh. 4:20).

గిల్గాలు అనగా “దొర్లింపబడినది” అని అర్థము. ఐగుప్తులోని జీవితము నింద భరితమైన జీవితము. ఇప్పుడు గిల్గాలులో వారి నింద దొర్లింపబడెను. దేవుడు వారి గత వైఫల్యములను, అపజయములను, సిగ్గును, నిందను దొర్లించి తీసివేసెను. మనలను ఓడించియుంచుటకు సాతాను ఉపయోగించు బలమైన ఆయుధములలో ఒకటి, మన గత వైఫల్యములను మనకు నిరంతరము గుర్తుచేయుచుండుటయే. ఆ వైఫల్యము గురించి, ఆ అపజయము గురించి, ఆ పాపము గురించి ఏమంటావు అని అతడు మనతో పలుకుచునేయుండును. దీనివలన మనము నిరుత్సాహపడి, “నా వంటివాడు క్రీస్తునందలి వారసత్వమును స్వాధీనము చేసికొనగలనని ఎలా అనుకోగలడు?” అని చెప్పుకొందుము. ఈ విధముగా అనేకమంది విశ్వాసులు తీర్పు క్రిందను శిక్షావిధి క్రిందను వచ్చెదరు. మనము అటువంటి పాప అపరాధభావము క్రింద ఉండనవసరము లేదు: మన పాపముల మరకలను కడిగివేయుటకు ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన రక్తమును నిరంతరము క్లెయిమ్ చేసికొనగలము. ఆయన రక్తమునందు విశ్వాసముంచుట ద్వారా మనము పవిత్రులముగాను శుద్ధులముగాను ఉండగలము. Acts 15:9 విశ్వాసము ద్వారానే మనము మన అపవిత్రతలన్నిటినుండి నిరంతరము కడుగబడి శుద్ధిచేయబడగలము. తలంపు ద్వారానో, మాట ద్వారానో, క్రియ ద్వారానో మనము అపవిత్రపరచబడిన ప్రతిసారి, “ప్రభువైన యేసూ, నేను అపవిత్రుడనైతిని. దయచేసి నన్ను క్షమించుము, నీ రక్తములో నన్ను కడిగి శుద్ధిచేయుము” అని చెప్పుకొనగలము. అప్పుడు ఆయన మనలను శుద్ధిచేయును. కానీ మనము ఆయన రక్తము క్రిందికి రాకపోయినయెడల, మనము తీర్పు క్రిందను శిక్షావిధి క్రిందను ఉండిపోవుదుము. విశ్వాసముతో ఆయనయొద్దకు రండి, ఆయన మీ నిందను దొర్లించివేయును. మనము మనలను మనము తగ్గించుకొని, మన వైఫల్యములను ఒప్పుకొని, అమూల్యమైన రక్తము క్రిందికి మనలను మనము తెచ్చుకొనినయెడల, ప్రభువు మనలను క్షమించి మన పాపములన్నిటిని కడిగివేయును.

↑ పైకి వెళ్ళండి ← పుస్తకానికి వెనుకకు ← పుస్తక భాండాగారానికి

↑