ఈ పుస్తకములో వెతకండి
1830వ సంవత్సరం మధ్య వేసవిలో, న్యూయార్క్ రాష్ట్రంలోని కొలంబియాలో సభలు జరిపించమని ఫిన్నీని బలవంతం చేశారు. అక్కడ ఒక పెద్ద జర్మన్ సంఘం ఉండేది గాని, హృదయ పరివర్తన అంటే ఏమిటో తెలిసినవారు అందులో సుమారు పదిమంది మాత్రమే ఉండేవారు. ఆ యువ కాపరి ఒక జర్మన్ వేదాంత శాస్త్ర పండితుని వద్ద వేదాంతశాస్త్రం అభ్యసించాడు. అతని సహాధ్యాయులలో ఒకడు భక్తి మొగ్గు కలిగినవాడై, తన అంతరంగపు గదిలో ప్రార్థన చేసుకొనేవాడు. వారి గురువుకు ఈ విషయం అనుమానం కలిగి, ఏదో ఒక విధంగా అది నిజమేనని తెలుసుకున్నాడు. ఆయన
ఆ యువకుని హెచ్చరిస్తూ, ఇది చాలా ప్రమాదకరమైన అలవాటు అని, దీనిని కొనసాగిస్తే అతడు మతిభ్రమించిపోతాడని, అలాంటి మార్గాన్ని అనుసరించనిచ్చినందుకు తానే నిందకు గురి కావలసి వస్తుందని చెప్పాడు. ఆ యువ కాపరియైన హెచ్____ గారు ఇటీవలి వరకూ తనకు నిజమైన భక్తి లేదని చెప్పాడు. అతడు బాప్తిస్మము, ధృఢీకరణము అనే మామూలు పద్ధతిలో సంఘంలో చేరాడే గాని, పరిచారకుడు కావాలంటే భక్తి విషయంలో మరేదైనా అవసరమని ఎన్నడూ అనుకోలేదు. కాని అతనికి భక్తిపరురాలైన తల్లి ఉండేది; ఆమెకు నిజం తెలుసు గనుక, తన కుమారుడు మార్పు చెందకుండానే పరిశుద్ధ పరిచర్యలో ప్రవేశించడం చూసి ఎంతో వేదన చెందేది. ఆమె ప్రార్థనలు, ప్రభావం అతనిని ఒప్పింపజేసి మార్పు చెందించాయి; తరువాత అతని భార్య కూడా మారుమనస్సు పొందింది. అప్పుడు అతడు ఫిన్నీని పిలిపించి, ఆయన ప్రసంగాన్ని అణచుకోలేని ఆనందంతో వినసాగాడు. సంఘం అంతా ఏకమనస్సుతో దేవుని వైపు తిరిగింది, పునరుజ్జీవనము ఆ పట్టణమంతటా వ్యాపించి దాదాపు అందరు నివాసులను మార్చివేసింది. ఇల్లినాయిస్‌లోని గేల్స్‌బర్గ్ పట్టణం కొలంబియా నుండి వెళ్లిన ఒక వలస బృందంచే స్థాపించబడింది; వారిలో చాలామంది ఈ పునరుజ్జీవనములో మారినవారే. ఆ వలస బృందానికి, అక్కడి నాక్స్ కళాశాలకు స్థాపకుడు మిస్టర్ గేల్ - ఫిన్నీ గారి వేదాంతశాస్త్ర గురువు.
న్యూయార్క్ నగరం
న్యూయార్క్ నగరానికి చెందిన అన్సన్ ఓ. ఫెల్ప్స్ అనే వ్యక్తి - తరువాతి కాలంలో తన గొప్ప దానధర్మాలకు ప్రసిద్ధి చెందినవాడు - నగరంలోని పల్పిట్లకు ఫిన్నీని ఆహ్వానించలేదని విని, వాండ్‌వాటర్ వీధిలో ఖాళీగా ఉన్న ఒక చర్చిని అద్దెకు తీసుకొని, అక్కడికి వచ్చి ప్రసంగించమని ఫిన్నీకి తీవ్రమైన విజ్ఞప్తి పంపాడు. ఫిన్నీ వెళ్లి, అంత శక్తితో, అంత విజయవంతంగా ప్రసంగించాడంటే, మూడు నెలలు గడవకముందే మిస్టర్ ఫెల్ప్స్ బ్రాడ్‌వే సమీపంలోని ప్రిన్స్ వీధిలో ఒక చర్చిని కొనుగోలు చేశాడు; అక్కడ ఫిన్నీ దాదాపు ప్రతి రాత్రి ఒక సంవత్సరం పాటు కిక్కిరిసిన సభలకు ప్రసంగించాడు. ప్రముఖ న్యాయవాదులు, అగ్రగామి వ్యాపారులు, అసంఖ్యాకమైన ప్రజలు దేవుని కనుగొన్నారు. మరే ఇతర సంఘంతో సంబంధం లేని మారుమనస్సు పొందినవారితో, ఉచిత ఆసనాలు కలిగిన ఒక సంఘం స్థాపించబడింది. ఆ సంవత్సరం ముగియకముందే నగరంలోని అనేకమంది పరిచారకులు తమ సంఘాలలో ఫిన్నీ పరిచర్య చేయాలని ఎంతో ఆశపడేవారు.
దానకర్త అయిన మిస్టర్ ఆర్థర్ టప్పన్, న్యూయార్క్‌లో ఉన్నప్పుడు ఫిన్నీతో జీవితాంతం నిలిచిన స్నేహాన్ని ఏర్పరచుకున్నాడు. అతని సోదరుడు లూయిస్ బోస్టన్‌లో నివసిస్తూ యూనిటేరియన్ మతస్థుడిగా ఉండేవాడు. ఫిన్నీ అర్ధపిచ్చివాడైన మతోన్మాది అని, తనను తాను "యేసుక్రీస్తు యొక్క బ్రిగేడియర్-జనరల్"గా ప్రకటించుకున్నాడని యూనిటేరియన్ పత్రికలలో అతడు చదివాడు. ఈ వార్తను, ఇలాంటి ఇతర వార్తలను లూయిస్ ఉదహరిస్తూ, అవి నిజమేనని పట్టుబట్టి, తన సోదరుడు ఆర్థర్‌తో వాటిని నిజమని నిరూపిస్తే ఐదువందల డాలర్లు పందెం కాస్తానని అన్నాడు. అందుకు ఆర్థర్ ఇలా బదులిచ్చాడు: "లూయిస్, నేను పందేలు కాయనని నీకు తెలుసు; కాని విశ్వసనీయమైన సాక్ష్యాధారాలతో ఫిన్నీ గురించి వచ్చిన ఈ వార్తలు నిజమని నీవు నిరూపిస్తే, నేను నీకు ఐదువందల డాలర్లు ఇస్తాను. నీవు దర్యాప్తు చేయాలని నేను ఈ ప్రతిపాదన చేస్తున్నాను. ఈ కథలు పూర్తిగా అవిశ్వసనీయమైనవని నీకు తెలియాలని నా కోరిక."
లూయిస్ టప్పన్ న్యూయార్క్‌లోని ట్రెంటన్ ఫాల్స్‌లో ఉన్న ఒక యూనిటేరియన్ పరిచారకునికి లేఖ రాసి, అవసరమైతే ఐదువందల డాలర్లు ఖర్చు చేసి, "న్యాయస్థానంలో నిలబడగల సాక్ష్యాధారాలను సేకరించమని" అధికారం ఇచ్చాడు. అనేక నెలలపాటు అత్యంత శ్రద్ధతో, జాగ్రత్తగా వెతికినా, ఆ ప్రయత్నం పూర్తిగా విఫలమైంది. ఇది లూయిస్ టప్పన్ ఒప్పింపబడటానికి, మారుమనస్సు పొందటానికి, యూనిటేరియన్ మతం నుండి సనాతన విశ్వాసానికి మారటానికి దారితీసింది. తన మిగిలిన జీవితమంతా అతడు కూడా ఫిన్నీకి భక్తిగల మిత్రుడిగా ఉన్నాడు.
రోచెస్టర్, 1831
1831వ సంవత్సరం వేసవిలో, తన భార్య తల్లిదండ్రులతో కొంత విశ్రాంతి తీసుకోవడానికి న్యూయార్క్ నగరాన్ని వదిలిపెట్టినప్పుడు, రోచెస్టర్‌లోని మూడవ ప్రెస్బిటేరియన్ సంఘంలో పరిచర్య చేయమని ఫిన్నీని బలవంతం చేశారు; ఆ సంఘపు పల్పిట్ అప్పుడు ఖాళీగా ఉండేది. ఆ సమయంలో సంఘంలోనూ, వివిధ సంఘాల మధ్యనూ గణనీయమైన చీలిక ఉండేది, అందువల్ల రోచెస్టర్ ఆశాజనకమైన క్షేత్రంగా ఏమాత్రం కనిపించేది కాదు. ఫిన్నీ, అతని భార్య తమ పెట్టెలను సర్దుకుని, తాను పరిచర్య చేయవలసిన క్షేత్రాన్ని ఎంపిక చేసుకొనేందుకు దైవమార్గదర్శకత్వం కోసం ప్రార్థించమని యూటికాలోని పరిశుద్ధులను సమావేశపరిచారు. అనేక క్షేత్రాలు తెరిచి ఉండేవి. వాటన్నింటిలో రోచెస్టర్ మాత్రమే అత్యంత ఆకర్షణలేని క్షేత్రం.
న్యూయార్క్‌తో గాని, ఫిలడెల్ఫియాతో గాని పోల్చితే రోచెస్టర్‌ను ఆశాజనకమైన క్షేత్రంగా పేర్కొనలేమని సోదరులందరూ ఏకాభిప్రాయంతో అన్నారు. ఫిన్నీకి కూడా ఇదే నమ్మకం ఉండేది; వారు ఆ సాయంత్రం విడిపోయారు, ఉదయం న్యూయార్క్‌కు బయలుదేరే పడవ ఎక్కాలని అతడు పూర్తిగా అనుకున్నాడు. కాని విశ్రాంతికి వెళ్లకముందు, దేవునితో ఒంటరిగా ఉన్నప్పుడు, రోచెస్టర్‌కు వెళ్లడమే దేవుని నడిపింపు అని అతనికి బలమైన అనుభూతి కలిగింది. ఉదయం ప్యాకెట్ పడవ వచ్చింది; వారు దానిలో ఎక్కి, తూర్పు వైపుకు కాక పశ్చిమం వైపుకు ప్రయాణించారు.
త్వరలోనే క్రైస్తవులు ఏకమవడం మొదలుపెట్టారు. ఉన్నత హోదా, సంస్కారము, విస్తృత ప్రభావం కలిగిన ఒక ప్రముఖ న్యాయవాది భార్య మొదట మారుమనస్సు పొందినవారిలో ఒకరు. ఆమె అంతకుముందు ఆనందభరితమైన, ఇహలోక సుఖాలకు ప్రాధాన్యమిచ్చే స్త్రీగా ఉండేది, సాంఘిక జీవితమంటే మక్కువ ఎక్కువ; ఫిన్నీ రాకను చూసి ఆమె ఎంతో విచారించింది, ఎందుకంటే రాబోయే శీతాకాలపు ఆనందాలకు అడ్డుతగిలేలా పునరుజ్జీవనము వస్తుందేమోనని ఆమెకు భయం కలిగింది. ఆమె అద్భుతమైన మారుమనస్సు ఆమె చెందిన వర్గం ప్రజలలో గొప్ప కలకలం రేకెత్తించింది.
ఆతురాసనం
"నేను రోచెస్టర్‌కు వెళ్లేవరకు," అని ఫిన్నీ రాశాడు, "అరుదైన సందర్భాలు తప్ప, తరువాత 'ఆతురాసనం' అని పిలువబడిన దానిని పునరుజ్జీవనములను ప్రోత్సహించే సాధనంగా ఎన్నడూ ఉపయోగించలేదు. కొన్నిసార్లు సభలో ఉన్నవారిని లేచి నిలబడమని అడిగేవాడిని; కాని దీనిని తరచుగా చేయలేదు. అయితే, ఈ విషయంపై ఆలోచన చేస్తున్నప్పుడు, పాపులను ఒక నిర్ణయానికి తీసుకువచ్చే ఏదో ఒక చర్య అవసరమని నాకు అనిపించింది. నా స్వంత అనుభవం, పరిశీలన ద్వారా నేను గ్రహించినదేమిటంటే, ముఖ్యంగా ఉన్నత వర్గాల వారిలో, తాము ఆత్మవిషయమై ఆందోళనగలవారిగా తెలియడం అనే భయమే అధిగమించవలసిన అతిపెద్ద అవరోధం. తమ ఆత్మల గురించి తాము ఆందోళన చెందుతున్నామని ఇతరులకు తెలియజేసే ఏ స్థితిని అంగీకరించడానికి కూడా వారు మరీ గర్వంగా ఉండేవారు."
"వారు వెంటనే తమ హృదయాలను అప్పగించవలసి ఉందని వారిపై ముద్ర వేసేందుకు ఏదో ఒకటి అవసరమని కూడా నేను గ్రహించాను; వారిని చర్యకు పురికొల్పేది, తాము పాపంలో బహిరంగంగా జీవించినట్లే ఇప్పుడు లోకం ముందు బహిరంగంగా చర్య తీసుకొనేలా చేసేది; క్రీస్తు సేవకు వారిని బహిరంగంగా అంకితం చేయించేది ఏదో అవసరం. వారిని కేవలం బహిరంగ సభలో లేచి నిలబడమని పిలిచినప్పుడు, దీని ఫలితం చాలా మంచిదని నేను గ్రహించాను; అది ఉద్దేశించబడిన పరిమితి వరకు తన లక్ష్యాన్ని నెరవేర్చింది. కాని అంతిమంగా, భక్తిహీనుల సమూహం నుండి వారిని బయటకు తీసుకువచ్చి, వారి దుష్టమార్గాలను బహిరంగంగా విడనాడేలా, తమను తాము బహిరంగంగా దేవునికి అప్పగించుకొనేలా చేయడానికి ఏదో అవసరమని కొంతకాలంగా నాకు అనిపిస్తూ వచ్చింది. రోచెస్టర్‌లో నేను మొదటిసారి ఈ చర్యను ప్రవేశపెట్టాను."
పైన పేర్కొనబడిన ఆ ప్రముఖ మహిళ మారుమనస్సు పొందిన కొద్ది రోజుల తరువాత, తమ పాపాలను విడనాడి దేవునికి తమను తాము అప్పగించుకోవడానికి సిద్ధంగా ఉన్న వారందరినీ, ఖాళీ చేయమని తాను కోరిన కొన్ని ఆసనాల వద్దకు ముందుకు వచ్చి, తమను తాము సమర్పించుకోవాలని
దేవునికి అప్పగించుకోవాలని పిలుపునిచ్చాడు, వారి కోసం తాను ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అనేకమంది ముందుకు వచ్చారు, వారిలో కొందరు చాలా ప్రముఖులు కూడా ఉన్నారు. "ప్రభువు సమాజంలోని అత్యున్నత వర్గాలనే లక్ష్యంగా చేసుకుంటున్నాడని త్వరలోనే స్పష్టమైంది. నా సభలు వెంటనే ఆ వర్గం వారితో నిండిపోయాయి. న్యాయవాదులు, వైద్యులు, వర్తకులు, నిజానికి అత్యంత బుద్ధిమంతులైన వారందరూ మరింత ఆసక్తి కనబరుస్తూ, మరింత సులభంగా ప్రభావితమవుతూ వచ్చారు." "న్యాయవాదులలో అనేకమంది, దాదాపు న్యాయమూర్తులందరూ, బ్యాంకర్లు, వర్తకులు, నైపుణ్యంగల కళాకారులు, నగరంలోని అగ్రగామి పురుషులు, స్త్రీలు మారుమనస్సు పొందారు." ఈ పునరుజ్జీవనములో ప్రార్థనాత్మ అద్భుతంగా ప్రవహించింది. "ప్రార్థనాత్మ ఎంత శక్తివంతంగా కుమ్మరించబడిందంటే, కొందరు ప్రసంగాల సమయంలో తమ భావోద్వేగాలను అణచుకోలేక, బహిరంగ సభలకు దూరంగా ఉండి ప్రార్థన చేసుకొనేవారు."
మిస్టర్ ఏబెల్ క్లారి అనే వ్యక్తి ఫిన్నీతో పాటు అదే పునరుజ్జీవనములో మారుమనస్సు పొంది, ప్రసంగించడానికి అనుమతి పొందాడు. కాని అతని ప్రార్థనాత్మ ఎంత తీవ్రంగా ఉండేదంటే, మనుష్యుల ఆత్మల భారం అతనిపై అంతగా ఉండేదంటే, అతడు ఎక్కువగా ప్రసంగించలేకపోయేవాడు; తన సమయమంతా, శక్తినంతా ప్రార్థనకే అర్పించేవాడు. అతని ఆత్మ భారం తరచుగా ఎంత గొప్పగా ఉండేదంటే, నిలబడలేకపోయేవాడు, వేదనతో మెలికలు తిరుగుతూ మూలుగుతూ ఉండేవాడు. ఫిన్నీకి తెలియకుండానే, అతని కోసం ప్రార్థిస్తూ కొన్ని రోజులు రోచెస్టర్‌లో ఉన్నాడు. అతడు ఉన్న ఇంటివాడు ఫిన్నీతో ఇలా అన్నాడు: "అతడు సభలకు రాలేడు. రాత్రింబగళ్లు దాదాపు ఎల్లప్పుడూ ప్రార్థిస్తూనే ఉంటాడు, మనసులో అంత వేదనతో ఉంటాడంటే దానిని ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియదు. కొన్నిసార్లు మోకాళ్లపై కూడా నిలబడలేక, నేలపై బోర్లా పడుకుని, నన్ను ఆశ్చర్యపరిచే రీతిలో మూలుగుతూ ప్రార్థిస్తూ ఉంటాడు." ఫాదర్ నాష్, ముగ్గురు డీకన్లు కూడా దాదాపు ఇదే రీతిలో ఫిన్నీ కోసం ప్రార్థనకు తమను తాము అప్పగించుకున్నారు.
ఫిన్నీ యొక్క శక్తివంతమైన ప్రసంగాన్ని, ఈ ప్రబలమైన ప్రార్థననంతటినీ దేవుడు అద్భుతంగా ఆశీర్వదించాడు. పరిసర పట్టణాల నుండి, నగరాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి కూడా పరిచారకులు, ప్రముఖులు దేవుని ఈ మహత్తర కార్యాన్ని చూడడానికి రోచెస్టర్‌కు వచ్చి, పునరుజ్జీవనము అగ్నిని తమతో తీసుకువెళ్లారు. ఈ కార్యం అన్ని దిశలలో అలలవలె వ్యాపించింది. ఫిన్నీ రోచెస్టర్‌ను కేంద్రంగా ఉంచుకుని, పరిసర పట్టణాలకు, నగరాలకు వెళ్లి కొన్ని రోజులు ప్రసంగించేవాడు. పరిసర ప్రాంతాలలోని ప్రెస్బిటేరియన్ సంఘాలలో పన్నెండు వందల మంది చేరారు, ఇతర సంఘాలలో చేరిన అసంఖ్యాక ప్రజలు దీనికి అదనం.
ఈ కార్యం యొక్క గొప్పతనం ఎంతటిదంటే, న్యూ ఇంగ్లండ్‌లోను, ఇతర రాష్ట్రాలలోను ఉన్న పరిచారకుల, క్రైస్తవుల దృష్టిని అది ఆకర్షించింది; దాని ఖ్యాతియే ఈ దేశం ఇంతవరకు చూడని అతిపెద్ద మత పునరుజ్జీవనమును ప్రోత్సహించడానికి దేవుని చేతిలో ఒక సమర్థమైన సాధనమైంది. దీని గురించి డాక్టర్ బీచర్ ఇలా అన్నాడు: "ఇంత తక్కువ కాలంలో లోకం ఎన్నడూ చూడని దేవుని అత్యంత గొప్ప కార్యమూ, అత్యంత గొప్ప మత పునరుజ్జీవనమూ ఇదే. ఆ గొప్ప పునరుజ్జీవనము ఫలితంగా లక్ష మంది సంఘాలలో చేరినట్లు నివేదించబడింది. ఇది సంఘ చరిత్రలో, మత ప్రగతిలో సాటిలేనిది. క్రైస్తవ యుగంలో ఏ సంవత్సరమూ ఇంత గొప్ప మత పునరుజ్జీవనము గురించిన వృత్తాంతం మనకు లేదు."
న్యూ లెబనాన్ మహాసభ తరువాత ఫిన్నీ కార్యానికి వ్యతిరేకత చాలావరకు తగ్గిపోయి, క్రమంగా మరింత తగ్గుతూ వచ్చింది. రోచెస్టర్‌లో అతడు దానిని ఏమాత్రం అనుభవించలేదు. పరిచారకులు, అత్యంత భక్తిహీనులైన పాపులు కూడా ఆ కార్యం దేవుని నుండి వచ్చినదేనని ఒప్పుకున్నారు. అతడు ప్రభుత్వ పాఠశాలలో ప్రసంగించగా, అనేకమంది విద్యార్థులు దేవుని వైపు తిరిగారు. వారిలో నలభైమందికి పైగా తరువాత పరిచారకులయ్యారని తెలిసింది. నగరంలో ఉన్న ఒకే ఒక నాటకశాల గుర్రపు శాలగా మార్చబడింది.
ఆబర్న్‌లో పునరుజ్జీవనము
ఫిన్నీ రోచెస్టర్‌లో ఆరు నెలలు పరిచర్య చేశాడు. షెనెక్టడీలోని యూనియన్ కళాశాల అధ్యక్షుడైన డాక్టర్ నాట్, తన విద్యార్థులతో పరిచర్య చేయడానికి రావలసిందని ఫిన్నీని ఆహ్వానించాడు. అతిగా పునరుజ్జీవన పరిచర్యలు చేయడం వల్ల ఫిన్నీ ఎంతగా అలసిపోయాడంటే, అతడు క్షయవ్యాధితో మరణిస్తాడని ప్రజలు అనుకున్నారు. అయినప్పటికీ అతడు షెనెక్టడీకి బయలుదేరాడు. దారులు చాలా చెడుగా ఉండటం వల్ల, కోచిలో ప్రయాణం ఎంతో అలసటగా ఉండటం వల్ల, విశ్రాంతి కోసం అతడు ఆబర్న్‌లో ఆగిపోయాడు. అతడు అక్కడ ఉన్న సంగతి తెలియగానే, 1826లో అతని కార్యాన్ని వ్యతిరేకించిన అనేకమంది ప్రభావశీలురే స్వయంగా సంతకాలు చేసి ఒక పెద్ద విజ్ఞప్తిపత్రాన్ని తయారుచేసి, తమ పూర్వపు వ్యతిరేకతను క్షమించమని, ఆగి తమకు సువార్త ప్రసంగించమని ఆయనను వేడుకున్నారు.
ఇది దేవుని పిలుపేనని ఫిన్నీ భావించి, తన అనారోగ్య స్థితిలో సాహసించగలిగినంత మేరకు, వారానికి నాలుగుసార్లు ప్రసంగిస్తూ అక్కడే ఉండటానికి ఒప్పుకున్నాడు. రెండవ విశ్రాంతి దినాన సభలో ఏబెల్ క్లారి గంభీరమైన ముఖాన్ని అతడు చూశాడు. అతడు ఫిన్నీ కోసం ప్రార్థించడానికి వచ్చాడు, రోచెస్టర్‌లో తన మల్లయుద్ధ ప్రార్థనకు గుర్తుగా నిలిచిన అదే శక్తివంతమైన ఆత్మ మూలుగుతో ప్రార్థించాడు. మొదట ఆతురాసనం వద్దకు వచ్చినవారిలో ఒకడు ఐదేళ్ల క్రితం వ్యతిరేకతకు నాయకత్వం వహించినవాడే. విజ్ఞప్తిపత్రంపై సంతకం చేసినవారిలో దాదాపు అందరూ లేదా అందరూ మారుమనస్సు పొందారు; మొత్తం ఐదువందల మంది.
బఫెలో
ఆబర్న్ నుండి అతడు బఫెలోకు వెళ్లాడు. ఆబర్న్‌లో, రోచెస్టర్‌లో వలెనే అక్కడ కూడా ఈ కార్యం అగ్రగామి వర్గాలలో సాధారణంగా ప్రభావం చూపింది. అప్పట్లో న్యాయవాదిగా ఉన్న రెవ. డాక్టర్ లార్డ్ మారుమనస్సు పొందినవారిలో ఒకడు. నగరంలోని అత్యంత సంపన్నులలో ఒకడు అతనిని తీవ్రంగా వ్యతిరేకించాడు; 'పాపి చేయలేను' అనేది కేవలం 'చేయను' మాత్రమే అనే అతని వాదనను, "అధిగమించవలసిన ఏకైక కష్టం పాపుల స్వేచ్ఛాపూర్వక దుష్టత్వమేనని, వారు క్రైస్తవులు కావడానికి పూర్తిగా ఇష్టపడనివారని" ఖండిస్తూ తీవ్రంగా విమర్శించాడు. ఈ ధనవంతుడు ఇలాంటి బోధను తీవ్రంగా వ్యతిరేకించి, తన విషయంలో అది అబద్ధమని పట్టుబట్టాడు, ఎందుకంటే తాను క్రైస్తవుడు కావడానికి ఇష్టపడుతున్నానని తనకు తెలుసు గాని దేవుడు తనను క్రైస్తవుడిగా చేయలేదని అతని వాదన.
ఆ తరువాత ఈ వ్యక్తి తీవ్రంగా ఒప్పింపబడి, ప్రార్థించడానికి ప్రయత్నించాడు గాని, ప్రభువు ప్రార్థనలోని "నీ చిత్తం నెరవేరును గాక" అనే మాటలను తాను ప్రార్థించలేకపోతున్నానని గ్రహించాడు. అప్పుడు తన హృదయాంతరంగంలో తాను దేవునికి విరోధిగా ఉన్నానని, యేసు తనపై రాజ్యం చేయడాన్ని తాను కోరుకోలేదని, ఎన్నడూ దానికి ఇష్టపడలేదని అతడు గ్రహించాడు. చివరకు అతడు పూర్ణహృదయంతో దేవుని వైపు తిరిగి, ఫిన్నీ చెప్పింది సరైనదేనని ఒప్పుకుని, తరువాత ఆనందంగా అతనితో సహకరించాడు. అక్కడి నుండి ఫిన్నీ శరదృతువులో ప్రావిడెన్స్‌కు వెళ్లాడు.
ప్రావిడెన్స్
కృపా కార్యం వెంటనే మొదలై, అత్యంత ఆసక్తికరమైన రీతిలో ముందుకు సాగింది. కాని, తెలుపబడని ఏదో కారణం వల్ల, అతని మూడు వారాల నివాసం, ఇతర ప్రాంతాలలో తాను చూసినంతటి కృపాపూర్వక ఫలితాలను సాధించడానికి చాలా తక్కువ కాలమైంది.
ఆ కాలంలో, ఈ దేశంలో వివిధ మతశాఖల మధ్య సరిహద్దులు చాలా కఠినంగా గీయబడి ఉండేవి, తరువాత మూడీ కాలంలో జరిగినట్లుగా, అన్ని మతశాఖలకు చెందిన సంఘాలు ఏకమై ఒక సువార్తికుడిని నగరానికి పిలిచి పరిచర్య చేయించే పద్ధతి అప్పుడు లేదు. అలాంటి ఉద్యమాలకు ఆ యుగం ఇంకా పరిపక్వం చెందలేదు. ఫిన్నీ ఏ నగరానికి వెళ్లినా, సాధారణంగా మతాంధత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ తన దారి చేసుకోవలసి వచ్చేది,
శాఖాభిమానం, మతశాఖల మధ్య అసూయ, అలాగే కాల్వినిస్టు వేదాంతశాస్త్రం, ఆచారబద్ధత, యూనిటేరియనిజం, యూనివర్సలిజం, సాతానుతో పోరాడవలసి వచ్చేది. అయినప్పటికీ, మారుమనస్సుకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి, మారుమనస్సు పొందినవారిలో అనేకమంది నగరంలోని క్రైస్తవ కార్యానికి జీవితాంతం నాయకులయ్యారు. ఇతర మారినవారిలో ఆ ప్రాంతంలో అత్యంత ప్రసిద్ధమైన అందగత్తె అయిన ఒక యువతి కూడా ఉంది. ఆమె చివరకు ఎంతగా లోతైన ఒప్పింపును పొందిందంటే, తనంతట తానే ఫిన్నీ వద్దకు వచ్చి ఇలా ఒప్పుకుంది: "నా గర్వం, నా కీర్తి పట్ల నాకున్న శ్రద్ధ లేకపోయి ఉంటే, ప్రావిడెన్స్‌లో ఉన్నంతటి దుష్టురాలిని నేనయ్యేదాన్ని. నా జీవితం గర్వం వల్లనూ, నా కీర్తి పట్ల శ్రద్ధ వల్లనూ మాత్రమే నియంత్రించబడిందని, దేవుని పట్ల గాని, ఆయన ధర్మశాస్త్రం పట్ల గాని, సువార్త పట్ల గాని ఏమాత్రం శ్రద్ధ వల్ల కాదని నాకు స్పష్టంగా తెలుస్తోంది. నా గర్వాన్ని, నా ఆశయాన్ని ఉపయోగించి అవమానకరమైన దుష్కార్యాల నుండి దేవుడు నన్ను ఆపాడని నేను గ్రహించగలను. నన్ను ముద్దుపెట్టి పొగిడారు, నేను నా గౌరవంపై నిలబడి, పూర్తిగా స్వార్థపూరిత ఉద్దేశాలతో నా కీర్తిని కాపాడుకున్నాను." ఈ విధంగా ఆమె తన నాగరిక, ఇహలోక దుష్టత్వాన్ని ఒప్పుకుని, యేసు ముందు తలవంచి, క్రీస్తుకు సాత్వికమైన, వినయమైన అనుచరురాలైంది. తరువాత ఆమె న్యూయార్క్ నగరంలోని ఒక అత్యంత సంపన్నుడిని వివాహం చేసుకుంది గాని, దేవునికి నమ్మకంగా ఉండిపోయింది.
బోస్టన్, 1832
ఫిన్నీ ప్రావిడెన్స్‌లో పరిచర్య చేస్తున్నప్పుడు, బోస్టన్ పరిచారకులు ఓల్డ్ సౌత్ చర్చి కాపరియైన డాక్టర్ విస్నర్‌ను, ప్రావిడెన్స్‌లోని కార్యాన్ని గమనించి నివేదించడానికి ఒక గూఢచారిగా పంపారు. దీని ఫలితంగా ఫిన్నీని బోస్టన్‌కు ఆహ్వానించడం జరిగింది. డాక్టర్ లైమన్ బీచర్ బౌడోయిన్ వీధి కాంగ్రిగేషనల్ సంఘంలో కాపరిగా ఉండేవాడు. ఇతడే ఐదేళ్ల క్రితం మాత్రమే, న్యూ ఇంగ్లండ్ అంతటా ఫిన్నీతో పోరాడతానని బెదిరించినవాడు. అతని ప్రతిభాశాలి కుమారుడు ఎడ్వర్డ్ బీచర్ పార్క్ వీధి సంఘంలో కాపరిగా ఉండేవాడు. యాభై ఏడు సంవత్సరాల తరువాత, 1889 నవంబర్ 6న, అతడు ఇలా రాశాడు: "ఫిన్నీని బోస్టన్‌లో ప్రసంగించడానికి మొదటిసారి ఆహ్వానించినప్పుడు నేను పార్క్ వీధి సంఘపు కాపరిగా ఉన్నాను, నా కోసం ప్రసంగించమని నేనే అతనిని ఆహ్వానించాను. అతడు నా విన్నపాన్ని అంగీకరించి, నేను ఎన్నడూ విననంత ప్రభావవంతమైన, శక్తివంతమైన ప్రసంగాన్ని ఇచ్చాడు. అతని విజ్ఞప్తి యొక్క శక్తిని ఎవరూ ఊహించలేరు. అది నేటికీ నా చెవుల్లో మారుమోగుతూ ఉంటుంది. అది విన్నవారందరిలో మంచి ఫలితాలను కలిగించింది, యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, పౌలు వలె నిజంగా దేవుని చిత్తాన్ని ప్రకటించడానికి నియమింపబడినవానిగా వారు అతనిని ఎల్లప్పుడూ గౌరవించి, ప్రేమించారు."
ఫిన్నీ ప్రసంగం గురించిన ఈ అభిప్రాయాన్ని ఇక్కడ పొందుపరచడానికి కథను కొద్దిసేపు ఆపుతున్నాను, ఎందుకంటే ఎడ్వర్డ్ బీచర్ తండ్రి, డాక్టర్ లైమన్ బీచర్, తన కాలంలో అత్యంత ప్రసిద్ధులైన, శక్తివంతమైన ప్రసంగీకులలో ఒకడు; ఎడ్వర్డ్ బీచర్ చిన్న సోదరుడు హెన్రీ వార్డ్ బీచర్, శతాబ్దాలలోని అత్యంత శక్తివంతమైన ప్రసంగీకులలో ఒకడిగా లోకమంతటా తన ఖ్యాతిని నింపాడు. అయినప్పటికీ, తన ప్రఖ్యాత తండ్రినీ, తన అమరుడైన సోదరుడినీ అనేకమార్లు ప్రసంగించగా విన్న, తన కాలంలోని ఇతర గొప్ప ప్రసంగీకులందరినీ వ్యక్తిగతంగా ఎరిగిన డాక్టర్ ఎడ్వర్డ్ బీచర్, ఫిన్నీ ప్రసంగం గురించి ఇలా అంటాడు: "నేను విన్నవాటిలోకెల్లా అత్యంత ప్రభావవంతమైన, శక్తివంతమైన ప్రసంగం అదే."
ఇది ఫిన్నీ ప్రసంగం గురించి నా అభిప్రాయాన్ని ధృవీకరిస్తుంది - మంచి కోసం మనుష్యులను ప్రభావితం చేయగల సాటిలేని శక్తి విషయంలో, నేను విన్నవారిలో అతడే నిస్సందేహంగా అత్యంత గొప్ప ప్రసంగీకుడు; ఆ శతాబ్దంలోనే అతడు గొప్పవాడని నేను భావిస్తున్నాను.
అదే సంవత్సరం ఎవరో ఫిన్నీని బోస్టన్ నుండి పిలిచి, ఆండోవర్ వేదాంత సెమినరీ ఉన్న ఆండోవర్‌లో మూడు రోజులు ప్రసంగించమని ఆహ్వానించారు. అది యాదృచ్ఛికంగా సెమినరీ పట్టభద్రోత్సవ కార్యక్రమాల సమయంలోనే జరిగింది. యువకులు నలభైరెండు ప్రసంగాలు సిద్ధం చేసుకున్నారు. ఫిన్నీ ప్రసంగ సభలతో ఢీకొన్న వాటిలో సగం ప్రసంగాలను వదులుకోవలసి వచ్చింది.
అప్పట్లో న్యూ ఇంగ్లండ్‌లో ప్రజాదరణ పొందిన ప్రసంగీకుడైన రెవ. జస్టిన్ ఎడ్వర్డ్స్, డి.డి., ఒక సాయంత్రం సెమినరీ పూర్వవిద్యార్థుల ముందు ప్రసంగించవలసి ఉండేది. "సెమినరీలోని ఆచార్యులలో, విద్యార్థులలో మిస్టర్ ఫిన్నీ పట్ల నిశ్చితమైన వ్యతిరేకత ఉండేది," అని సెమినరీకి ఎన్నడూ లేనంత ప్రసిద్ధుడైన ప్రొఫెసర్ పార్క్ చెబుతాడు. ఆ సందర్భాన్ని, ఫిన్నీ ప్రసంగాన్ని అతడు ఇలా వర్ణిస్తాడు:
"మిస్టర్ ఫిన్నీ ఖ్యాతి ఎంతటిదంటే, మేము మా కార్యక్రమాలను విరమించుకోవలసి వచ్చింది. డాక్టర్ ఎడ్వర్డ్స్ ప్రసంగం వినడానికి కేవలం ముప్పైమంది మాత్రమే గుమిగూడారు, వారు కూడా సభను ముగించుకున్నారు. శ్రోతలలో రెండువందల నుండి మూడువందల మంది వరకు పరిచారకులు, పరిచర్య కోసం చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నారు. మిస్టర్ ఫిన్నీ ప్రసంగం ఎన్నడూ ముద్రించలేని, సులభంగా మరచిపోలేని ఒక ప్రసంగం. దానిని వినని వారు దాని వాగ్ధాటిని అర్థం చేసుకోలేరు. దాని లేఖనభాగం 1 తిమోతి 2:5 - 'దేవునికి మనుష్యులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన మనుష్యుడైన క్రీస్తుయేసు.' అతని ప్రసంగం సరిగ్గా వందనిమిషాల నిడివి కలిగి ఉంది. మా సెమినరీ కార్యక్రమాలకు అతని జోక్యాన్ని వ్యతిరేకించినవారితో సహా, శ్రోతలందరి అవిచ్ఛిన్నమైన శ్రద్ధను అది నిలబెట్టుకుంది. అది నిజమైన వాదనలతో, ఆశ్చర్యకరమైన మలుపులతో నిండి ఉండేది. అది నాటకీయమని పిలవడానికి చాలా నిజాయితీగా ఉండేది, కాని ఆ మాటకు గొప్ప అర్థంలో దానిని 'నాటకీయం' అని పిలుస్తారు. అతని వాక్చాతుర్యంలోని కొన్ని మాటలను వర్ణించడం అసాధ్యం. వాటిలో ఒకదానిని నేను ప్రస్తావిస్తాను, కాని ఆ ప్రస్తావన దాని గురించి తగినంత భావనను ఇవ్వదని నాకు తెలుసు."
"న్యాయం అనే ఆధారంపై రక్షింపబడాలని ఆశించే మనుష్యుల మూర్ఖత్వాన్ని అతడు వివరిస్తున్నాడు; బహుశా మరణానంతరం శిక్షింపబడవచ్చు గాని, తాము అర్హులైన శిక్షనంతటినీ అనుభవించిన తరువాత పరలోకంలోకి అనుమతింపబడతామని అనుకునేవారి గురించి. రక్షింపబడేవారందరూ కృప ద్వారానే రక్షింపబడతారని, వారు క్షమింపబడతారని; తమ పాపాలు కడిగివేయబడిన ప్రతిక్షేప ప్రాయశ్చిత్తాన్ని మహిమపరచడంలోనే వారి పరలోకం ఇమిడి ఉంటుందని బైబిలు ఏకస్వరంతో ఇచ్చే సాక్ష్యానికి అతడు విజ్ఞప్తి చేస్తున్నాడు. దైవిక ధర్మశాస్త్రపు శిక్షను తాను ఇప్పటికే అనుభవించానని ఎవరైనా చొరబాటుదారుడు వాదిస్తే, పరిశుద్ధుల గీతాలకు కలిగే భంగాన్ని అతడు వర్ణిస్తున్నాడు. అప్పుడు ప్రసంగీకుని స్వరం మధురంగా, సంగీతభరితంగా మారింది, అతడు 'పదివేల పదివేల మంది, వేల వేల మంది' అనే మాటలను పునరావృతం చేస్తూ, గొప్ప స్వరంతో, 'వధింపబడిన గొఱ్ఱెపిల్ల శక్తిని, ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని, బలాన్ని, ఘనతను, మహిమను, స్తోత్రాన్ని పొందడానికి యోగ్యుడు' అని చెప్పాడు. 'స్తోత్రం' అనే మాటను పలికిన వెంటనే, అతడు వెనక్కు అదిరిపడి, తన ముందున్న శ్రోతల సమూహం నుండి తన ముఖాన్ని తిప్పుకుని, తన కుడివైపు ఉన్న గ్యాలరీపై తన కళ్లను తీక్షణంగా నిలిపి, దైవారాధనలో ఆకస్మిక అంతరాయం వల్ల భయపడిన వ్యక్తి లక్షణాలన్నింటినీ ప్రదర్శించాడు. గంభీరమైన స్వరంతో అతడు కేకవేశాడు: 'నేను చూస్తున్నదేమిటి? ఇక్కడికి వస్తున్న ఈ మూర్ఖుల గుంపు అర్థమేమిటి? వినండి! వారి కేకలు వినండి! వారి మాటలు వినండి: "నరకాగ్నికి కృతజ్ఞతలు! మేము మా కాలాన్ని పూర్తి చేశాం. కృతజ్ఞతలు! కృతజ్ఞతలు! మేము మా కాలాన్ని పూర్తి చేశాం. నరకాగ్నికి కృతజ్ఞతలు!"' అప్పుడు ప్రసంగీకుడు పక్క గ్యాలరీ నుండి తన ముఖాన్ని తిప్పుకుని, మళ్లీ శ్రోతల సమూహంపై చూపు నిలిపాడు, ఒక సుదీర్ఘమైన విరామం తరువాత - ఆ సమయంలో సభామందిరమంతా భయంకరమైన నిశ్శబ్దం అలముకుంది - మృదువైన స్వరంతో ఇలా అన్నాడు: 'ఇదేనా పరిశుద్ధుల ఆత్మ? ఇదేనా పైలోకపు సంగీతం? "పరలోకంలోనూ, భూమిమీదనూ, భూమి క్రిందనూ, సముద్రంలోనూ ఉన్న సమస్త సృష్టి, వాటిలో ఉన్నవన్నీ, సింహాసనంపై కూర్చున్నవానికిని గొఱ్ఱెపిల్లకును స్తోత్రమును, ప్రభావమును, ఘనతను, మహిమను యుగయుగములు కలుగును గాక అని చెప్పడం నేను వింటిని. ఆ నాలుగు జీవులు ఆమేన్ అని పలికెను' అని ఆయన చెప్పాడు."
"ఈ నాటకీయ దృశ్యం జరుగుతుండగా, హఠాత్తుగా నడవలో తీసుకువచ్చి ఒక కుర్చీ నుండి మరో కుర్చీకి పరచబడిన ఒక పలక మీద ఐదారుగురు మనుష్యులు కూర్చుని ఉన్నారు. వారితో పాటు నేను కూడా
కూర్చుని ఉన్నాను. ఆ పలక నిజంగా మా క్రింద కంపించింది. ప్రతి ఒక్కరూ ఉద్వేగంతో వణుకుతున్నారు. ఆ ప్రసంగం మొత్తం యొక్క శక్తి ఆ ఉద్వేగభరిత ఉచ్ఛారణలో కేంద్రీకృతమై ఉంది. నేను ఆ ప్రసంగాన్ని విని యాభైయెనిమిది సంవత్సరాలకు పైగా అయ్యింది. నాకు అది బాగా గుర్తుంది. అర్ధశతాబ్దం క్రితం అనుభవించినంత స్పష్టంగా దాని ముద్రను నేను గుర్తుతెచ్చుకోగలను; కాని దానిలోని ప్రతి మాటా ముద్రించిన పేజీపై ఉన్నా, అది ఆ సజీవ ప్రసంగీకుని అసలు ప్రసంగంగా ఉండదు." (రైట్ యొక్క "చార్లెస్ జి. ఫిన్నీ," పేజీలు 71-74.)
ఫిన్నీ చూసినట్లుగా, అప్పుడు న్యూ ఇంగ్లండ్ ఆలోచననూ, జీవితాన్నీ ముంచెత్తి, ఇప్పటికీ దానిని శపిస్తున్న యూనివర్సలిజం సిద్ధాంతానికి ఇది ఒక భయంకరమైన దెబ్బ. ఇలాంటి ప్రసంగం క్రింద యూనివర్సలిస్టులు తమ అబద్ధపు ఆశ్రయాల నుండి తరిమివేయబడి యేసు ముందు తలవంచడం, లేదా భయాందోళనతో ఆ ప్రసంగీకుని సన్నిధి నుండి పారిపోయి, ఫిన్నీపై కేకలువేసి అతనిని దూషించడం ఆశ్చర్యం కలిగించదు.
చివరకు అలాంటి ఒక ప్రసంగీకుడు బోస్టన్‌లో ఉన్నాడు; బహుశా అంతకంటే గొప్పవానిని బోస్టన్ ఎన్నడూ వినలేదు. వేదికపై శక్తి విషయంలో అతనితో పోల్చదగినవాడు బహుశా వైట్‌ఫీల్డ్ మాత్రమే. ఈ కార్యం గురించి అతని వ్యాఖ్య ఇక్కడ ఇస్తున్నాను: "విశ్రాంతి దినాన నేను వివిధ సంఘాలలో తిరుగుతూ ప్రసంగించడం మొదలుపెట్టాను, వారంలో సాయంత్రాలు పార్క్ వీధిలో ప్రసంగించాను. దేవుని వాక్యం ప్రభావం చూపుతోందని, రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోందని త్వరలోనే గ్రహించాను. కాని ప్రకటిత క్రైస్తవుల మధ్య ఒక గొప్ప పరిశోధన అవసరమని కూడా నాకు అనిపించింది. పశ్చిమాన, న్యూయార్క్ నగరంలో జరిగిన పునరుజ్జీవనలలో ప్రబలిన ప్రార్థనాత్మ వంటిది ఇక్కడ వారిలో ఏమాత్రం ఉందని నేను గుర్తించలేకపోయాను. అక్కడ ఏదో విలక్షణమైన మతస్వభావం ఉన్నట్లు కనిపించింది, న్యూయార్క్‌లో నేను చూడటానికి అలవాటుపడిన ఆ స్వేచ్ఛనూ, విశ్వాసబలాన్నీ అది చూపలేదు. అందువల్ల, క్రైస్తవులకు కొన్ని పరిశోధనాత్మక ప్రసంగాలు చేయడం మొదలుపెట్టాను. కాని ఈ ప్రసంగాలు బోస్టన్ క్రైస్తవులకు ఏమాత్రం రుచించలేదని త్వరలోనే గ్రహించాను. ఇది నాకు కొత్తగా అనిపించింది. ఇంతకుముందెన్నడూ, ఆ సమయంలో బోస్టన్‌లో జరిగినట్లుగా, ప్రకటిత క్రైస్తవులు పరిశోధనాత్మక ప్రసంగాల నుండి వెనుకకు తగ్గడం నేను చూడలేదు. కాని ఇలాంటి మాటలు మళ్లీమళ్లీ నా చెవిన పడేవి: సనాతనులమైన మా విషయంలో ఇలాంటివి నిజమైతే యూనిటేరియన్లు ఏమంటారు? మిస్టర్ ఫిన్నీ మాకు ఈ విధంగా ప్రసంగిస్తే, యూనిటేరియన్లు మనపై విజయం సాధించి, కనీసం సనాతనులు యూనిటేరియన్ల కంటే మెరుగైన క్రైస్తవులు కారని అంటారు. నా నిష్కపటమైన వ్యవహారాన్ని వారు కొంతమేరకు అసంతృప్తితో చూశారని, నా పరిశోధనాత్మక ప్రసంగాలు వారిలో చాలామందిని ఆశ్చర్యపరచడమే కాక కించపరచాయని స్పష్టమైంది. అయితే, కార్యం ముందుకు సాగుతుండగా, ఈ పరిస్థితి బాగా మారింది; కొన్ని వారాల తరువాత వారు పరిశోధనాత్మక ప్రసంగాలను వినడం ప్రారంభించి, వాటిని మెచ్చుకోసాగారు. మాకు ఆశీర్వాదకరమైన కృపా కార్యం జరిగింది, నగరంలోని వివిధ భాగాలలో అనేకమంది మారుమనస్సు పొందారు."
అయితే, ఈ సమయంలో గాని, తరువాత బోస్టన్‌లో జరిగిన నాలుగు పునరుజ్జీవనలలో దేనిలో గాని, ఫిన్నీ ప్రసంగం ఇతర కొన్ని ప్రాంతాలలో వలె అంత విస్తృతమైన ఉద్యమానికి దారితీయలేదని స్పష్టమవుతుంది. బోస్టన్‌లో జరిగిన అతని ఐదు పునరుజ్జీవన ప్రయత్నాలలోనూ, "అతని పరిచర్యకు విస్తృతమైన పునరుజ్జీవనలు తోడుగా ఉన్నాయి, తమకు తోడుగా ఉన్న మరే ఇతర పునరుజ్జీవన ప్రసంగీకుని కృషి ఫలితంగా జరిగిన మార్పులకంటే, ఈ మార్పులు ఎక్కువ శాశ్వతత్వాన్ని కలిగి ఉన్నాయనేది ఆ కాలం నుండి బ్రతికి ఉన్న పార్క్ వీధి సంఘం సభ్యులందరూ ఏకగ్రీవంగా ఇచ్చే సాక్ష్యం." (రైట్ యొక్క "ఫిన్నీ," పేజీ 106.)
ఫిన్నీ తన సూక్ష్మమైన వివేచనతో, "బోస్టన్‌లోని మతస్వభావం విలక్షణమైనది" అని గుర్తించాడు. ఇది ఒక శతాబ్దం నుండి అలాగే ఉంది. న్యూ ఇంగ్లండ్ హృదయపు తీక్షణమైన, అత్యంత చురుకైన, సూక్ష్మమైన బుద్ధి, సరైన ఆలోచనా మార్గాలలో, ఆరోగ్యకరమైన మత జీవితంలో కొనసాగాలంటే దానికి తగినంత లోతైన ఆధ్యాత్మికత సరిజోడి కావాలి. అలా లేకపోతే, ఆ యాంకీ బుద్ధి దారి తప్పుతుంది,
కేవలం వ్యాపారంలోకి, ధనార్జనలోకి మాత్రమే కాదు, తత్వశాస్త్రంలో, వేదాంతశాస్త్రంలో ఊహాగానాలలోకి కూడా దారితప్పుతుంది. ఒక శతాబ్దం క్రితం అతిగా ఉన్న కాల్వినిజం క్రింద భక్తి క్షీణించింది. తరువాత ఒక ప్రతిచర్య కలిగి, యూనిటేరియనిజం, యూనివర్సలిజం వరదలా ముంచెత్తాయి. బోస్టన్, దాని పరిసర ప్రాంతాలు అప్పటినుండి ప్రతి కొత్త ఆలోచనాధోరణికి, మతోన్మాదానికి, ప్రతి రకమైన అవిశ్వాసానికి సహజమైన నిలయంగా, పెంపొందించే క్షేత్రంగా మారాయి. మిల్లరిజం, స్పిరిచ్యువలిజం, టామ్-పెయిన్-ఇజం, క్రిస్టియన్-సైన్స్-ఇజం, స్వీడెన్‌బోర్గియనిజం, యూనిటేరియనిజం, యూనివర్సలిజం, ఫ్రీ-థాట్-ఇజం, ఫ్రీ-లవ్-ఇజం, అజ్ఞేయవాదం, సంశయవాదం - ఇవన్నీ అక్కడ సింహాసనాసీనమై, వర్ధిల్లుతున్నాయి. మసాచుసెట్స్ కుమారుడైన ఒక వేదాంతశాస్త్ర పండితుడు ఒకసారి నాతో ఇలా అన్నాడు, "అమెరికన్ ఆలోచననూ, జీవితాన్నీ శపించిన ఏ 'ఇజం' అయినా బోస్టన్‌కు యాభై మైళ్ల లోపల పుట్టలేదని, నివసించలేదని నీవు చెప్పలేవు."
ఈ 'ఇజం'ల సమూహపు వాదులు, అనుచరులు అందరూ కూడి, ఒకరితో ఒకరు వివాహ సంబంధాలు కలుపుకున్నారు. మతోపదేశకుని పెదవులు ఇప్పుడు మూతపడ్డాయి; అతడు యేసుక్రీస్తు యొక్క మహాశక్తిగల సువార్తను దాని పరిపూర్ణతతో ప్రకటించకూడదు, అలా చేస్తే, డీకన్ ఏ____ యూనిటేరియన్ అల్లునిపైన, లేదా డీకన్ బి____ యూనివర్సలిస్టు కోడలిపైన, లేదా డీకన్ సి____ స్పిరిచ్యువలిస్టు సోదరిపైన, లేదా ధనవంతుడైన మిస్టర్ డి____ యొక్క క్రిస్టియన్ సైంటిస్టులైన బంధువులపైన, మేనమామలపైన, మేనత్తలపైన నింద మోపినట్లే అవుతుంది. వారందరూ ఎంతో మంచివారు, బోస్టన్ సమాజంలో ఎంతో గౌరవప్రదంగా నిలుస్తారు గనుక, వారు దేవునికి ఎంతో ఇష్టులై ఉండి తీరాలి! బోస్టన్‌లో పుట్టినవాడు ఎంత మంచి వంశంలో పుట్టాడంటే, అతడు మరల జన్మించవలసిన అవసరం లేదు; ముఖ్యంగా, హార్వర్డ్ నుండి గాని, "బోస్టన్ టెక్" నుండి గాని, వెల్లస్లీ నుండి గాని పొందిన డిప్లొమా "పరలోకానికి తప్పనిసరి పాసుపోర్టు." అందువల్లనే, న్యూ ఇంగ్లండ్ బుద్ధిజీవుల రాజధానిలో, ఫిన్నీ విలక్షణమైనదిగా భావించిన - స్వీయసంతృప్తి, స్వీయ ఆత్మసంతోషం, స్వీయాభిమానం కలిగిన, విశాలదృక్పథంగల, స్వేచ్ఛాచింతనగల, ఎవరి ఇష్టం వారిదన్నట్టుగా, ఎవరికి ఏది నమ్మకం అనిపిస్తే అది నమ్మేలా, మనమందరం కలిసి పరలోకానికి వెళ్తాము అన్నట్టుండే మతస్వభావం అభివృద్ధి చెందింది. మతభక్తులైనవారు ఆధ్యాత్మిక విషయాల యొక్క మూలానికీ, సారానికీ దిగి, తమ ఆధ్యాత్మిక నిరీక్షణలకు పునాదిగా ఉన్న బండను తాకేంతవరకు 'పరిశోధింపబడటాన్ని,' పరీక్షించబడటాన్ని అది కోరుకోలేదు. నీతికొరకు, నిజమైన పరిశుద్ధతకొరకు పరిశుద్ధాత్మతో కలిగే మహాబాప్తిస్మము తప్ప మరేదీ బోస్టన్* ఆలోచననను సంశయవాదం నుండి, ఆమె భక్తిని ఉదాసీనత అనే కుళ్లు నుండి కాపాడలేదు.
*బోస్టన్ గురించి బీచర్, ఫిన్నీల అభిప్రాయాల కోసం 12వ అధ్యాయము చివరి భాగం చూడండి.
