UECF.NET › Books › మోషే ప్రత్యక్షపు గుడారము
ఉపోద్ఘాతము
Introduction · ముద్రిత పుటలు iv–ix · 875 పదాలు · ≈7 నిమిషాలు
దేవుడు అనాది కాలము నుండి మానవుని ప్రేమించి, అతనితో సహవాసము కలిగియుండవలెనని కోరుచున్నాడు. ఏదేను వనంలో ఆదాము, హవ్వలతో సహవాసము చేసెను (ఆదికాండం 2:8, 22, 3:8). హానోకుతో సహవాసము చేసెను (ఆదికాండం 5:22). అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో సంభాషించెను (ఆదికాండం 17:1, 26:24, 35:1). ఇశ్రాయేలీయులు అరణ్య మార్గములో కనాను దేశమునకు వెళ్లుతున్నప్పుడు, “నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను” అని దేవుడు మోషేతో చెప్పెను (నిర్గమకాండం 25:8). “నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి, వారికి దేవుడనైయుందును” (నిర్గమకాండం 29:45). ఇది ప్రస్తుత పాఠ్యాంశమైయున్నది.
తదుపరి దేవుడు సొలోమోను మందిరము (1రాజులు 8:10-11), జిరుబ్బాబెలు మందిరము (హగ్గయి 2; 7-9)ల ద్వారా ఇశ్రాయేలీయులతో సహవాసము కలిగి, వారి మధ్య నివసించెను. ప్రస్తుత కాలములోనైతే, దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుగా తనను తాను బయలుపరచుకొని, మనతో సహవాసము కలిగియుండుటకు ఇష్టపడుచున్నాడు. ప్రభువైన యేసు క్రీస్తునందు దైవత్వము యొక్క సర్వ సంపూర్ణత నివసించుచున్నది (కొలస్సీ 1:15-20;, 2:9). ఆయన దేవుని వాక్యమైయుండి శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసిస్తున్నాడు (యోహాను 1:14). ఆయన యందు విశ్వాసముంచిన వారి హృదయములలో నివసిస్తున్నాడు (ఎఫెసీ 3:17; యోహాను 14:23). స్థానిక సార్వత్రిక సంఘములో నివసిస్తున్నాడు (1 పేతురు: 5; 1 కొరింథీ 38:16-17; 2 కొరింథీ 6:15-18; ఎఫెసీ 2:20-22, 1 తిమోతి 3:15). చివరిగా దేవుడు “నూతన యెరూషలేము” లో తన పరిశుద్ధులందరితో సదాకాలము సహవాసము కలిగియుండనైయున్నాడు (ప్రకటన 21:1-3). పైన చెప్పబడిన మాటలలో దేవుడు మానవులను టపైమించి, వారి మధ్య నివసించాలని కోరుకుంటున్నట్లు చూచితిమి. ఇశ్రాయేలీయులు అరణ్య మార్గములో కనాను దేశమునకు వెళ్లుతున్నప్పుడు “నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెనని” దేవుడు మోషేతో చెప్పెను (నిర్గమకాండం 25:8). ఈ పరిశుద్ధ స్థలమే “మందిరము” (నిర్గమకాండం 25:9), ప్రత్యక్షపు గుడారము” (నిర్గమకాండం 27:21), “సాక్ష్యపు గుడారము” (నిర్గమకాండం 29:42), “ఆలయము” (నిర్గమకాండం 38:31) గా చెప్పబడినది. ప్రత్యక్షపు గుడారము యొక్క వివరణలోనికి వెళ్లుటకుముందు దానిని గురించి ఈ క్రింది విషయములు గమనించవచ్చును.
(1) ప్రత్యక్షపు గుడారము యేసు క్రీస్తును మరియు మానవుల నిమిత్తమైన క్రీస్తు రక్షణ కార్యమును గురించి వర్ణిస్తున్నది. పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చియున్నాను (హెబ్రీ 10:7; కీర్తన 40:7). మోషే నన్ను గూర్చి వ్రాసెనని యేసుక్రీస్తు సెలవిచ్చెను (యోహాను 5:46).
(2) ప్రత్యక్షపు గుడారము ప్రస్తుత కాలములో దేవుని నివాస స్థలమైనట్టి స్థానిక, సార్వత్రిక సంఘములకు సూచనగా వుంటున్నది. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద వుంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయైయున్నది (ఎఫెసి 1:22, 238),
(3) ప్రత్యక్షపు గుడారము పరలోక సంబంధ వస్తువుల ఛాయారూపకముగా వున్నది (ప్రకటన 15:5; హెబ్రీ 8:1-5, 9:21-24). ప్రత్యక్షపు గుడారములో అహరోను యొక్క ప్రధానయాజకత్వము క్రీస్తు ప్రధాన యాజకత్వమునకు సూచనగావున్నది (హెబ్రీ 9:25-28).
(4) ప్రత్యక్షపు గుడారము ఇశ్రాయేలీయులకు అరణ్య ప్రయాణములో ఒక “తాత్కాలిక మందిరము”గా నుండెను. వారు కనాను దేశములో ప్రవేశించిన తరువాత “సౌలోమోను మందిరము” కట్టబడెను. గుడారము యాత్రాజీవితమును తలపిస్తున్నది. విశ్వాసులు యీ భూమిమీద పరదేశులును, యాత్రికులైయున్నారని, దేవుడు దేనికి శిల్పియు, నిర్మాణకుడునై యున్నాడో, పునాదులు గల ఆ పట్టణము కొరకు యెదురుచూస్తున్నారని దేవుని వాక్యము సెలవిస్తున్నది (హెబ్రీ 11:10-13).
(5) ప్రత్యక్షపు గుడార నిర్మాణమును గమనించినయెడల, యీ కింది విషయములు మనము తెలుసుకొనగలము.
(a) ప్రత్యక్షపు గుడార నిర్మాణమునకు కావలసిన బంగారం, వెండి, యిత్తడి మరియు యితర పరికరములు ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల యొద్ద సమకూర్చుకొనియుండిరి. దేవుడు అబ్రహాముతో ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి మిక్కిలి ఆస్తితో బయలు దేరి వచ్చెదరని వాగ్దానము చేసియుండెను (ఆదికాండం 15:12-16; నిర్గమకాండం 3:21-22, 12:33-36). దేవుని పనికి కావలసిన ధనము, పరికరములు దేవుడే తన ప్రజలకు అనుగ్రహించును.
(b) ప్రత్యక్షపు గుడార నిర్మాణమునకు కావలసిన సామాగిని ఇశ్రాయేలీయులు “మనఃపూర్వకముగా” తీసుకొని వచ్చిరి (నిర్గమకాండం 25:2, 35:29, 36:3). ఎవరి హృదయము వారిని రేపెనో, ఎవరి మనసు వారిని రేపెనో, వారందరు ప్రత్యక్షపు గుడారము యొక్క పనికొరకు అర్పణను తెచ్చిరి (నిర్గమకాండం 35:21, 22, 29) వివేక హృదయముగల స్రీలు, జ్జ హృదయము గల స్రీలు అర్పణలను తెచ్చిరి (నిర్గమకాండం 85:25, 26),
దేవుని పనికొరకు యిచ్చువారు బయటికి కనబడవలెనను ఉద్దేశ్యముతో కాక (మత్తయి6:1-4), తాము వర్ధిల్లిన కొలదీ (1 కొరింథీ 16:1, 2) యివ్వవలెను. పూర్ణమనస్సుతో యివ్వవలెను (1 దినవృత్తాంతములు 29:1-9). సణుగు కొనకయు, బలవంతముగా కాకయు, ఉత్సాహముతో యివ్వవలెను (2 కొరింథీ 9:6-15). బీద విధవరాలు తనకు కలిగిన జీవనమంతయు (రెండు కాసులు) కానుకలపెట్టెలో వేసెనని యేసు క్రీస్తు చెప్పెను (లూకా 21:1-4).
(c) ప్రత్యక్షపు గుడార నిర్మాణము నిమిత్తము దేవుడు బెసలేలును, అహోలియాబును, యితర ప్రజ్ఞావంతులను తన ఆత్మతో నింపి, పని చేయుటకు కావలసిన ప్రజ్ఞ, జ్ఞానము, వివేకము వారికనుగ్రహించెను (నిర్గమకాండం 385:10, 25, 30-385, 86:1-8). ప్రస్తుత కాలములో కూడా, దేవుడు తన పని నిమిత్తము తన ప్రజలను పరిశుద్ధాత్మతో నింపి, తన తలాంతులను వారికనుగ్రహించి, తన పరిచర్యను కొనసాగిస్తున్నాడని మనము గమనించగలము (1 కొరింథీ 12:4-11; ఎఫెసీ 2:19-22, 4:11-16).

(d) ప్రత్యక్షపు గుడార నిర్మాణ విషయములో దేవుడు మోషేతో, “కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము” అని చెప్పెను (నిర్గమకాండం 25:40, 26:30, 278:8; సంఖ్యాకాండం 8:4; హెబ్రీ 8:5; అపొ.కా, 7:44). మోషే తనకు చెప్పబడిన ప్రకారము నిర్మాణమును పూర్తి చేసెను. నిర్గమకాండం 39, 40 అధ్యాయములలో, “యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు? అను మాట 17 సార్లు వ్రాయబడినట్లు మనము గమనించగలము. దేవుని పని దేవుని ఆజ్ఞ ప్రకారమే, దేవుడు కనపరచిన క్రమము ప్రకారమే జరిగించాలన్న సత్యమును యీమాటల ద్వారా తెలుసుకొనుచున్నాము (కొలొస్సీ 4:17; యోహాను 17:1-6, 19:30).
(e) ప్రత్యక్షపు గుడారము తన ఆజ్ఞలు, తన మాటల చొప్పున పూర్తి చేయబడినందున, మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మెనని, యెహోవా తేజస్సు అందులో నింపబడెనని నిర్గమకాండం 40:34, 85లలో చదువుచున్నాము. అంతేగాక, పగటివేళ యెహోవా మేఘస్తంభముగాను, రాత్రివేళ అగ్ని స్తంభముగాను వుండి, ఇశ్రాయేలీయులను నడిపించెనని గమనించుదుము (నిర్గమకాండం 138:21, 22, 40:36-38). దేవుడు తన ప్రజలను ముందుండి, నడిపించును (యెషయా 58:11; కీర్తనలు 73:24, 78:52; యోహాను 10:1-18).
(f) చివరిగా పటము-1లో చూపబడినట్లు ప్రత్యక్షపు గుడారము మరియు దాని చుట్టునున్న ఇశ్రాయేలీయుల గుడారపు ఏర్పాటు ఒక “సిలువను సూచిస్తున్నది. సంఖ్యాకాండం 2:3-31 వచనములలో ప్రత్యక్షపు గుడారము చుట్టూ ఇశ్రాయేలీయులు తమ తమ గోత్రముల చొప్పున విడిది చేయవలసిన క్రమము తెలుపబడినది. ఇది ఒక సిలువ ఆకారమును తలపించడమనేది ఒక గొప్ప దైవికమైన సందేశమును మనకు తెలియజేయుచున్నది. అదేమనగా దేవుడు మానవులతో నివసించడమనేది కేవలము సిలువ” ఆధారితమైయున్నది. దేవునికి, మానవునికి మధ్యనున్న శతృత్వము యేసు క్రీస్తు సిలువలో తనను తాను బలియాగముగా అర్పించుకొనుట ద్వారా తొలగిపోయినది (కొలొస్సీ 1:20, 2:14; ఎఫెసీ 2:1-8). యేసు క్రీస్తు మానవులందరి పాపముల కొరకై సిలువ మరణము పొందునంతగా తనను తాను తగ్గించుకొనెను (ఫిలిప్పీ 2:8). తన యెదుట వుంచబడిన ఆనందము కొరకై సిలువను సహించెను(హెబ్రీ12:2).
యేసు క్రీస్తును వెంబడించు వారు తమను తాము ఉపేక్షించుకొని, సిలువనెత్తికొని ఆయనను వెంబడించుదురు (మత్తయి 16:25). ఈ సిలువను గూర్చిన వార్త లోకమునకు వెర్రితనముగా వున్నది గాని, క్రీస్తును వెంబడించు వారికి దేవుని శక్తియెయున్నది (1కొరింథీ 1:17-18). యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరిదేనియందును నేను అతిశయించనని పౌలు సెలవిచ్చెను(గలతీ 6:14),
ప్రియులారా, పై మాటలను బట్టి, దేవునితో మనలను సమాధాన పరచి, దేవుని సన్నిధి మనకు అనుగ్రహించుటకు యేసు క్రీస్తు సిలువలో మరణించెనని తెలుసుకొనుచున్నాము. ఇట్టి సిలువను గూర్చిన జ్ఞానము దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ప్రత్యక్షపు గుడారము ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులను నడిపించినట్లు సిలువను గూర్చిన సత్యము ద్వారా మనలను కూడా నడిపించును గాక!
ప్రత్యక్షపు గుడార అధ్యయనము కొరకు ఈ పుస్తకము మూడు భాగములుగా విభజింపబడినది. మొదటి భాగములో పటము-2 లో చూపబడినట్లు వెలుపలి ఆవరణము (కంచె, ఆవరణ ద్వారము), బలిపీఠము, గంగాళము, ప్రత్యక్షపు గుడార పలకలు, తెరలు, పైకప్పు తెరలు, ఉపకరణములను గురించిన వర్ణన యివ్వబడినది. రెండవ భాగములో బలిపీఠపు అర్పణలు, మూడవ భాగములో యాజకత్వమును గురించి వర్ణింపబడినది. వీటి అధ్యయనము అనేకులకు ఆత్మీయమైన మేలు కలుగజేయవలెనని ప్రభువును ప్రార్ధించుచున్నాను.
సహో. ధర్మా మల్లు Email: dmbooks075@gmail.com