ఈ పుస్తకములో వెతకండి
Ctrl K
నిర్గమకాండము 20:2–17
- 1. «నేను నిన్ను ఐగుప్తు దేశములోనుండి, దాస్యగృహములోనుండి రప్పించిన నీ దేవుడనైన యెహోవాను. నాకు ముందు నీకు అన్యదేవతలు ఉండకూడదు.»
- 2. పైన ఆకాశమందేగాని క్రింద భూమియందేగాని భూమి క్రింద నీళ్లయందేగాని ఉన్న దేని ప్రతిరూపమైన విగ్రహమునైనను ప్రతిమనైనను నీవు చేసికొనకూడదు. నీవు వాటికి నమస్కరింపకూడదు, వాటిని సేవింపకూడదు; ఏలయనగా నీ దేవుడనైన యెహోవా అసూయగల దేవుడను; నన్ను ద్వేషించువారి మూడవ నాలుగవ తరమువరకు తండ్రుల దోషమును పిల్లలమీదికి తెచ్చువాడను; నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొనువారికి వేలకు కృపచూపువాడను.
- 3. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు; ఏలయనగా తన నామమును వ్యర్థముగా నుచ్చరించువానిని యెహోవా నిరపరాధిగా ఎంచడు.
- 4. విశ్రాంతిదినమును పరిశుద్ధపరచుటకై దానిని జ్ఞాపకముంచుకొనుము. ఆరు దినములు నీవు పనిచేసి నీ పనులన్నియు చేయవలెను; అయితే ఏడవదినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము; అందులో నీవేగాని నీ కుమారుడేగాని నీ కుమార్తెయేగాని నీ దాసుడేగాని నీ దాసియేగాని నీ పశువేగాని నీ గవనులలోనున్న పరదేశియేగాని యే పనియు చేయకూడదు; ఏలయనగా ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోనున్న సమస్తమును సృజించి ఏడవ దినమున విశ్రమించెను; కాబట్టి యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను.
- 5. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము; అప్పుడు నీ దేవుడైన యెహోవా నీకిచ్చు దేశమందు నీ దినములు దీర్ఘమగును.
- 6. నరహత్య చేయకూడదు.
- 7. వ్యభిచారము చేయకూడదు.
- 8. దొంగిలించకూడదు.
- 9. నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు.
- 10. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు; నీ పొరుగువాని భార్యనేగాని అతని దాసునిగాని అతని దాసినిగాని అతని ఎద్దునేగాని అతని గాడిదనేగాని నీ పొరుగువానిదేదియు ఆశింపకూడదు.
