English | తెలుగు | हिन्दी

అధ్యాయం 7

ఐదవ దర్శనం

అత్యంత గొప్ప రహస్యం · బఖ్త్ సింగ్

ఐదవ దర్శనం

ఐదవ దర్శనం (John 20: 19,25)

శిష్యులు యెరూషలేములో ఒక గదిలో కూడుకొనియున్నప్పుడు, ఈస్టర్ సాయంకాలమునందే ప్రభువు ఐదవసారి దర్శనమిచ్చెను. తలుపులు మూయబడియుండగా ప్రభువు ఆ గదిలోనికి వచ్చి, వారి మధ్యను నిలిచెను. ఆయన మొదటి మాటలు, "మీకు సమాధానము కలుగునుగాక" అనునవి (John 20: 19). 21వ వచనమునందు ఆయన ఈ మాటలను మరల చెప్పెను, ఆ విధముగా మన సమాధానమును కాపాడుకొనుటచేతనే ఆయన పునరుత్థాన శక్తిని మనము కొనసాగించి అనుభవించగలమని మనకు చూపెను. శత్రువు మన సమాధానమును చెరుపుటకు పూనుకొనియున్నాడు. ఇందుకొరకు అతడు అన్నివిధములైన భయములను, సందేహములను, శరీర సంబంధమైన సూక్ష్మమైన శోధనలను మన హృదయములలోనికి తీసికొనివచ్చును. కాని మనలను మనము తగ్గించుకొని, ఆయన అమూల్యమైన రక్తము యొక్క శుద్ధిచేయు శక్తిని కోరుకొనుచునే యుండునపుడు, సమస్త బుద్ధికిని మించిన ఆయన మహా సమాధానమును మనము అనుభవించగలము. దేవుని వాక్యము ఇలా చెప్పుచున్నది, "నీ ధర్మశాస్త్రమును ప్రేమించువారికి గొప్ప నెమ్మది కలదు, దేనివలనను వారికి అభ్యంతరము కలుగదు." (Psa. 119: 165) మరియు "సమాధానకర్తయైన దేవుడు శీఘ్రముగా సాతానును మీ పాదముల క్రింద అణగద్రొక్కును" (Rom. 16: 20). మనకు సమాధానము ఎంత ఎక్కువగా ఉండునో అంతగా శత్రువు దాడిపైన విజయమును మనము అనుభవించగలము. కాని ఈ సమాధానము మన హృదయమునందు ఏలుబడి చేయుటకును, నదివలె ప్రవహించుటకును, శత్రువు మన సమాధానమును దొంగిలింపనీయకుండుటకును మనము మన విశ్వాసమును మరింత బలముగా వినియోగించవలెను. దేవునితోను మనుష్యులతోను ఏదైనా విషయమును సరిదిద్దుకొనవలసివచ్చినయెడల, మనము వెంటనే ఆయన కృపచేతను వినయముతోను అలా చేయవలెను. నీతికార్యఫలము సమాధానమే గనుక, పెరుగుచు, విస్తరించుచునున్న ఈ అంతరంగిక ఆధ్యాత్మిక సమాధానము ద్వారానే ఆయన చిత్తమును గూర్చి మనము నిశ్చయత కలిగియుండగలము (Isa. 32: 17). మరల, మన ప్రభువు శిష్యులతో ఇలా చెప్పెను John 20: 21, "….తండ్రి నన్ను పంపినట్లు నేనును మిమ్మును పంపుచున్నాను." ఈ అంతరంగిక సమాధానము మనకు ఉన్నప్పుడే ఆయన మనలను పంపు ప్రతిచోటికిని వెళ్ళుటకును, ఆయన మహిమకొరకు ఆయన కోరునదంతయు ఏ ప్రశ్నయు లేకుండా ఆయనకిచ్చుటకును సిద్ధముగానుందుము. ఆయన శిష్యులతో ఇలా చెప్పిన తరువాత వారిపై ఊదెను, "పరిశుద్ధాత్మను పొందుకొనుడి" (22వ వచనం) అని చెప్పెను. మనము ఆయనకు విధేయులమగుచుండగా, ఆయన ఆజ్ఞలను సంతోషముగా నెరవేర్చుటకు సహాయపడుటకై ఆయన మనలను పరిశుద్ధాత్మతో క్రొత్తగా అభిషేకించుచున్నాడు.

↑ పైకి వెళ్ళండి ← పుస్తకానికి వెనుకకు ← పుస్తక భాండాగారానికి

↑