English | తెలుగు | हिन्दी

అధ్యాయం 11

తొమ్మిదవ దర్శనం

అత్యంత గొప్ప రహస్యం · బఖ్త్ సింగ్

తొమ్మిదవ దర్శనం

తొమ్మిదవ దర్శనం (John. 21: 1-23)

గలిలయలోని తిబెరియ సముద్రము యొద్ద, చేపలు పట్టుటకు వెళ్ళియున్న శిష్యులకు ప్రభువు దర్శనమిచ్చెను. శిష్యులు రాత్రియంతయు ప్రయాసపడియు ఏమియు పట్టలేదు. తెల్లవారుజామున ప్రభువైన యేసుక్రీస్తు వారికి దర్శనమిచ్చి, "పిల్లలారా, మీయొద్ద ఏమైనను ఆహారము కలదా?" అని అడిగెను. వారు ఆయనతో, "లేదు" అని బదులుపలికిరి. అప్పుడు ఆయన వారితో, "దోనె కుడిప్రక్కను వల వేయుడి, మీకు దొరకును" అని చెప్పెను. (John 21: 5,6). వారు వెంటనే ఆయనకు విధేయులై, చేపలు అధికముగా ఉండుటవలన వలను దోనెలోనికి లాగలేకపోయిరి. అక్కడ 153 పెద్ద చేపలుండెను, అయినను వల చినగలేదు (John 21: 11). ఈ అద్భుతము ద్వారా, ప్రభువు తన సేవకులైన శిష్యులకు తన సేవలో సమృద్ధిగా ఫలభరితమైన పరిచర్య యొక్క రహస్యమును బోధించెను. మనలో అనేకులు ప్రభువు కార్యమునందు కష్టపడుచునేయుందుము, అయినను దేవుని ప్రణాళికను కనుగొనకుండా ఇటునటు తిరుగుటవలన ఫలితమేమియు కనబడదు. మనము మన సొంత ఆసక్తిపైనను, జ్ఞానముపైనను మిక్కిలిగా ఆధారపడుదుము. కాని మన సాధారణ కార్యకలాపముల కొరకు దేవుని ప్రణాళికను కనుగొను రహస్యమును నేర్చుకొనినప్పుడు, ప్రభువు వచ్చి మన శ్రమను ఫలభరితము చేయుటను మనము కనుగొందుము. అదేసమయమున, చేపలు ప్రభువైన యేసుక్రీస్తుకు విధేయత చూపినట్లు ఆయన వాటిని ఏ ప్రయాసయు లేకుండా వలలోనికి వెళ్ళుమని ఆజ్ఞాపించినప్పుడు, మనము కూడ ఆయన ఆజ్ఞకు విధేయులమై, ఆయన అడుగునది చేసి, ఆయన మనలను కోరునది ఆయనకివ్వవలెను. ఈ గొప్ప చేపలు, తమ సృష్టికర్త స్వరమును వినినందున, ఏ మారాముగాని లేకుండా ఎంతటి క్రమబద్ధమైన రీతిలో వలలోనికి వచ్చెనో! అదేవిధముగా, ఆయన సేవయందు, మనము ఎట్టి పోటీతత్వ స్పూర్తికిగాని, అసూయకుగాని తావియ్యకుండా, ఆయనకు లోబడియుండవలెను.

శిష్యులు ఒడ్డుకు వచ్చినప్పుడు వారు నిప్పు, దానిపైన చేపను, రొట్టెను చూచిరి (John 21: 9). అక్కడ ప్రభువు వారికిచ్చే వెల్లడిచేసెను, తాము ఆయనకు విధేయులగుచుండగా, తమ అవసరములన్నింటి కొరకు ప్రతి ఏర్పాటును ఆయన చేసెనని. మనకును ఇదే వర్తించును. అగ్ని, వారిని వెచ్చగా ఉంచుటకు ఆయన దానిని సిద్ధపరచిన ప్రేమను తెలుపుచున్నది. అదేసమయమున, మనము ఆయనకు సంపూర్ణముగా విధేయులమైనప్పుడు ఆయన సేవలో మనము అనుభవించు ఆత్మ యొక్క పరిపూర్ణతను కూడ ఇది తెలుపుచున్నది. చేప, మనము ఆయన ఆజ్ఞలకు విధేయులమగుచుండగా మనద్వారా రక్షింపబడు ఆత్మలను తెలుపుచున్నది, రొట్టె, అదనపు బలమును పొందుకొనుటకు మనము ప్రతిదినము భుజింపవలసిన దేవుని వాక్యమును తెలుపుచున్నది. అప్పుడు ప్రభువు పేతురును, "యోహాను కుమారుడవైన సీమోనూ, వీరికంటె నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ……నా గొఱ్ఱెపిల్లలను మేపుము …. నా గొఱ్ఱెలను మేపుము" అని ప్రశ్నించెను (John 21: 15,16). ఆయన గొఱ్ఱెపిల్లలను, గొఱ్ఱెలను మేపి, వాటిని కాచుట నేర్చుకొనునప్పుడే మన ప్రేమ నిజమైనదిగా ఉండగలదని ఇది తెలుపుచున్నది. ఇతరులకు వారి అవసరతలో సహాయపడుటచేతను, సంతోషముతోను త్యాగముతోను ఒకరిభారము నొకరు మోయుటచేతను మాత్రమే, మన గొప్ప ముఖ్య కాపరియైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమగల హృదయమునకు మనము తృప్తిని కలుగజేయగలము.

↑ పైకి వెళ్ళండి ← పుస్తకానికి వెనుకకు ← పుస్తక భాండాగారానికి

↑