రెండవ దర్శనం
రెండవది, ప్రభువైన యేసుక్రీస్తు సమాధిని ఖాళీగా చూచి తిరిగివచ్చుచున్న కొందరు స్త్రీలకు దర్శనమిచ్చెను. ఒక దూత సమాధి యొద్ద ఈ మాటలతో వారిని ఓదార్చెను: "మీరు భయపడకుడి; సిలువవేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నేనెరుగుదును. ఆయన ఇక్కడ లేడు; తాను చెప్పినట్లు లేచియున్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలమును చూడుడి. త్వరగా వెళ్లి, ఆయన మృతులలో నుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియజెప్పుడి; ఇదిగో, ఆయన మీకంటె ముందుగా గలిలయకు వెళ్లుచున్నాడు; అక్కడ మీరు ఆయనను చూతురు; ఇదిగో నేను మీతో చెప్పితిని ... వారు ఆయన శిష్యులకు తెలియజెప్పబోవుచుండగా, ఇదిగో యేసు వారిని ఎదుర్కొని, "సంతోషముగా ఉండుడి" అనెను. వారు దగ్గరకు వచ్చి ఆయన పాదములను పట్టుకొని ఆయనను ఆరాధించిరి (Matt. 28: 5-9).
ఈ దర్శనము ద్వారా, ఆయన పునరుత్థాన శక్తిని అనుభవించు రహస్యము సంతోషముతో కూడిన శీఘ్ర విధేయతయే అని ప్రభువు మనకు చూపుచున్నాడు. ప్రభువు మనతో ఏదైనా విషయమును గూర్చి మాటలాడినయెడల మనము ఏ ప్రశ్నయు వేయకుండా ఆయనకు విధేయులముకావలెను, అప్పుడు ఈ శక్తిని ప్రతిదినము మరింత అధికముగా అనుభవించు భాగ్యము మనకు కలుగును. ఈ స్త్రీలు దూత తమకిచ్చిన సందేశమును స్పష్టముగా తెలియజేసినప్పటికిని, శిష్యులు సందేహించిరని మనము చదువుతాము Luke 24: 11: "వారి మాటలు వారికి పనికిమాలిన కథలవలె తోచెను, వారు వారిని నమ్మలేదు." సందేహము, అవిశ్వాసముల మూలముగానే మనము ఈ శక్తిని అనుభవించుటలో విఫలమగుచున్నాము. ఏ ప్రశ్నయు, సందేహమును లేకుండా, ఆయన కోరునది ఏదైనను ఆయనకిచ్చుటకును, ఆయన మనలను పంపు ప్రతిచోటికిని సంతోషముతో వెళ్లుటకును సిద్ధముగానుండి, మనము ఆయనకు ఎంత సంతోషముతో, శీఘ్రముగా విధేయులమగుదుమో, ఆయన మనచేత చేయించదలచిన కార్యము కొరకు ఈ అద్భుతమైన శక్తి మనకు అంతగా అనుగ్రహింపబడును.
↑ పైకి వెళ్ళండి ← పుస్తకానికి వెనుకకు ← పుస్తక భాండాగారానికి
