English | తెలుగు | हिन्दी

అధ్యాయం 6

నాలుగవ దర్శనం

అత్యంత గొప్ప రహస్యం · బఖ్త్ సింగ్

నాలుగవ దర్శనం

మన ప్రభువు యొక్క నాలుగవ దర్శనము యెరూషలేము నుండి ఎమ్మాయు అను గ్రామమునకు వెళ్ళుచున్న ఇద్దరు శిష్యులకు కలిగెను. వారు యెరూషలేములో జరిగిన వింత సంగతులను గూర్చి మాటలాడుకొనుచుండిరి. సమాధి యొద్దకు వెళ్ళిన స్త్రీలు తాము ప్రభువును చూచితిమని వారితో చెప్పియుండిరి. ఆయన మృతులలో నుండి లేచియున్నాడని దూతలు ఆ స్త్రీలతో చెప్పియుండిరి. వారు వెళ్ళుచుండగా ప్రభువైన యేసుక్రీస్తు ఆ ఇద్దరు శిష్యులతో కూడ చాలాదూరము నడిచి, గొప్ప అధికారముతో లేఖనములను వారికి విశదపరచెను, కాని వారు ఆయనను గుర్తింపలేకపోయిరి. సాయంకాలము వారి కోరిక ప్రకారము ఆయన వారితోకూడ ఉండుటకు వచ్చినప్పుడు, భోజన సమయమున, యూదుల ఆచారము చొప్పున, ఆయన రొట్టెను తీసికొని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దానిని విరిచెను. అప్పుడు వారు ఆయనను గుర్తించిరి; రొట్టెను విరుచు ఆ క్రియలో, చివరి రాత్రి భోజన సమయమున ఆయన చెప్పిన మాటలను వారు జ్ఞాపకము చేసికొనిరి, "పుచ్చుకొనుడి, భుజించుడి, ఇది మీ కొరకు విరుచుచున్న నా శరీరము." అప్పుడు వారు, ప్రజలందరి పాపముల ప్రాయశ్చిత్తముగా తన శరీరమును విరుగగొట్టబడనిచ్చి, తన అమూల్యమైన రక్తమును చిందించనిచ్చెదనని ఆయన చేసిన ప్రకటన యొక్క ప్రాముఖ్యతను గ్రహించిరి.

మన కొరకు తానే మృతిచెందినందుకు, మన పాపముల కొరకు సిలువపై మృతిచెంది, మనకొరకు తన సర్వశరీరమును విరుగగొట్టబడనిచ్చినందుకు, మన హృదయమంతటితో మన ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునప్పుడే మనము ఈ అద్భుతమైన పునరుత్థాన శక్తిని అనుభవించుట ఆరంభించుదుము. అందుకనే ప్రభువు బల్ల చుట్టూ ఆదివారము ఉదయము మన ఆరాధన సమావేశము ఎంతో అమూల్యమైనదిగాను, సహాయకరముగాను ఉన్నది. ఎక్కడైతే విశ్వాసులు ఆయన బోధించిన రీతిలో ఆయన మరణమును జ్ఞాపకము చేసికొనుటకును, స్వచ్ఛమైన హృదయపూర్వక ఆరాధనలో తగినంత సమయమును గడుపుటకును, అటుపిమ్మట తమ హృదయములను పరీక్షించుకొని విషయములను సరిదిద్దుకొనిన తరువాత ప్రభువు బల్లలో పాల్గొనుటకును ఆదివారము ఆదివారము ప్రభువు బల్ల చుట్టూ కూడుకొనుట నేర్చుకొనిరో, అక్కడ ఆధ్యాత్మిక వృద్ధియు విస్తరణయు కలిగియున్నదని మనము చూచియున్నాము. దురదృష్టవశాత్తు, అనేకమంది విశ్వాసులకు ప్రభువు బల్ల ఒక ఆచారముగాను, కర్మకాండగాను మారియున్నది. ప్రభువు బల్లలో పాల్గొనుటకు ముందు స్వచ్ఛమైన ఆరాధన యొక్క విలువను వారు గ్రహింపరు. అందుకనే వారి జీవితములు బీడుగాను, పోల్చిచూడగా పొడిగాను ఉండిపోవుచున్నవి. ఆయన బల్ల చుట్టూ ప్రభువును ఆరాధించుట నేర్చుకొనుట విశ్వాసులకు మిక్కిలి ప్రాముఖ్యమైనది. అప్పుడు వారియందు ఆధ్యాత్మికముగా అతివేగవంతమైన వృద్ధి కలుగును, వారు దేవుని కృపయందును జ్ఞానమునందును వృద్ధిచెందుదురు.

↑ పైకి వెళ్ళండి ← పుస్తకానికి వెనుకకు ← పుస్తక భాండాగారానికి

↑