మన పిలుపు యొక్క గొప్పతనం: నూతన సృష్టి
మన పిలుపు యొక్క గొప్పతనం:
నూతన సృష్టి
రెండవ అధ్యాయంలో, మనలను రక్షించుటలో ప్రభువుకు గల ఉన్నతమైన సంకల్పం గురించి, మరియు ఆయన మనలను పిలిచిన ఉన్నత పిలుపు గురించి అపొస్తలుడు వ్రాస్తున్నాడు. మనం జాగ్రత్తగా లేకుంటే, మనం లీకయ్యే పాత్రతో పోల్చబడ్డాము. కొన్నిసార్లు మట్టి పాత్రలో చిన్న పగులు ఉంటుంది. అది చాలా చిన్నదిగా ఉండి కనిపించదు, కానీ పాత్రలోని విషయాలు క్రమంగా లీకై అదృశ్యమవుతాయి. మన రక్షణ విషయంలో మనం జాగ్రత్తగా, శ్రద్ధగా లేకుంటే, మనం గొప్ప నష్టాన్ని అనుభవిస్తాము. మన రక్షకుడయ్యేందుకు ప్రభువు తనను తాను శూన్యపరచుకొని, తన సింహాసనాన్ని, తన మహిమను విడిచిపెట్టి, గాడిపాకలో పుట్టవలసి వచ్చింది. మనకొరకు ఆయన దరిద్రుడయ్యాడు, తన శరీరమంతా విరుగగొట్టబడుటకు, తన రక్తం చిందించబడుటకు ఇచ్చాడు. మన రక్షకుడయ్యేందుకు ఆయన వ్యక్తపరచిన శక్తి, యావత్తు సృష్టిని కలిగించుటకు, నిలబెట్టుటకు, నాశనం చేయుటకు వ్యక్తపరచిన శక్తికంటే ఎంతో గొప్పది. అందుకే ఒక్క విశ్వాసి కూడా ఆయన దృష్టిలో యావత్తు విశ్వం కంటే ఎంతో అమూల్యమైనవాడు.
ఒక విశ్వాసి ఎంత దరిద్రుడైనా, బలహీనుడైనా, అమర శరీరంతో నిత్యత్వం జీవిస్తాడు. బైబిల్‌లో విశ్వాసులు దేవుని ప్రత్యేక సొత్తు, అమూల్యమైన ముత్యం, దేవుని సహకార్యకర్తలు, దేవుని భాగస్వాములు అని పిలువబడ్డారు. ఈ పేర్లు ఆకాశములకు ఇవ్వబడలేదు. దేవుడు ఆకాశములను తన ప్రత్యేక సొత్తు, తన భాగం, తన భాగస్వామి లేదా తన స్వాస్థ్యం అని పిలవడు. దూతలకు కూడా ఈ పేర్లు పెట్టబడలేదు, “యెహోవా యాకోబును తనకొరకు, ఇశ్రాయేలును తన ప్రత్యేక సొత్తుగా ఏర్పరచుకొనెను” (Psa. 135:4). యాకోబు అనే పేరుకు మోసగాడు అని అర్థం. ఇశ్రాయేలు అనగా రాజకుమారుడు అని అర్థం. పాపులముగా మనకు యాకోబు స్వభావం ఉంది; కానీ ప్రభువైన యేసుక్రీస్తు వద్దకు వచ్చుటవలన మనం రూపాంతరంఅయ్యి ఇశ్రాయేలుగా, దేవుని నిత్యమైన ప్రత్యేక సొత్తుగా మారతాము. కావున మనలను రక్షించుటలో మన ప్రభువుకు గొప్ప సంకల్పం ఉందని మనం స్పష్టంగా చూస్తున్నాము, ఎందుకంటే మనలను రక్షించుటకు ఆయన తనకున్నదంతా చెల్లించాడు. పాపం మూలంగా మనం మురికిగుడ్డల వంటివారమైనప్పటికీ, మన ప్రభువు మనలను తన ప్రత్యేక సొత్తుగా చేసుకున్నాడు.
రాబోవు లోకం లేదా నూతన సృష్టి గురించి అపొస్తలుడు ఇలా మాట్లాడుతున్నాడు Hebrews 2:5. ఆ నూతన సృష్టి నిత్యత్వం వరకూ దేవుని మహిమను వెల్లడిస్తుంది. ఆ నూతన సృష్టిలో ఇక మరణం లేదు, బాధ గాని కన్నీరు గాని ఉండదు (Rev. 21:3-5). అది పాప శాపము నుండి విముక్తమై, ఎప్పటికీ నిలిచియుంటుంది. ఈ నూతన సృష్టి దూతలచేత పరిపాలింపబడదని మనకు తెలుపబడింది (Heb. 2:5), వారు శక్తిమంతులైన దూతలై, ఎల్లప్పుడూ దేవుని చిత్తాన్ని, ఆనందాన్ని జరిగించినప్పటికీ. కానీ అది ప్రభువైన యేసుక్రీస్తుచేత వెదకబడి రక్షింపబడినవారిచేత పరిపాలింపబడుతుంది. Psalm 103:20 లో చెప్పబడింది, దూతలు బలములో శ్రేష్ఠులై, ఆయన ఆజ్ఞలను జరిగించుచు, దేవుని స్వరాన్ని నిరంతరం వింటారు. వారు తిరుగుబాటు చేయరు, అవిధేయత చూపరు. వారు శక్తిమంతులు, తేజోమయులు (Luke 24:4), సంఖ్యలో అసంఖ్యాకులు (Rev. 5:11). అయినప్పటికీ, దేవుని మహిమతో నిండిన రాబోవు నూతన సృష్టి దూతలచేత పరిపాలింపబడదని లేఖనము చెప్తుంది. హెబ్రీయుల మొదటి అధ్యాయంలో దూతలు మనకు పరిచర్య చేయు ఆత్మలుగా చేయబడతారని మనం చూశాము. రాబోవు నూతన సృష్టి మహిమలో కొంత భాగాన్ని తెలుపుటకు ప్రభువైన యేసుక్రీస్తు సమస్త దూతలను సమకూర్చు దినమును ఊహించుకోండి. రాబోవు సృష్టి మహిమను వారికి తెలియజేసినప్పుడు వారు ఆశ్చర్యంతో నిండిపోతారు. రాబోవు నూతన సృష్టి మహిమను దూతలకు తెలియజేసిన తరువాత, ప్రభువు వారికి అది తమచేత కాక, తన కృపచేత వెదకబడి రక్షింపబడిన మనుష్యులచేత పరిపాలింపబడుతుందని కూడా వెల్లడిస్తాడు. యూదా వచనం 24 ప్రకారం, ఒకనాడు మనం దేవుని యెదుట నిర్దోషులుగా నిలబెట్టబడతాము. అప్పుడు మనం దూతలకంటే కూడా మహిమాన్వితులుగా ఉంటాము. ప్రభువు తనను తాను శూన్యపరచుకొని తన అమూల్యమైన రక్తంతో మనలను కొనుక్కొని, మనకు ఇంత ఉన్నతమైన పిలుపును, స్థానమును అనుగ్రహించాడు.
ప్రభువు కోరుకుంటే, ఆయన దూతలాగా లోకంలోకి రావచ్చు. కానీ ఒక ప్రత్యేక సంకల్పం కొరకు ఆయన మనలో ఒకరిలాగా అయ్యాడు (Heb. 2:16, 17). నలభై దినములు ఆయన సాతానును తనవద్దకు ఏ మనుష్యునికైనా రాగలిగే సమస్త శోధనలను తీసుకురానిచ్చాడు (Luke 4:12). మనకొరకు ఆయన ఆ శోధనలన్నింటినీ జయించాడు. కావున మనం ఎదుర్కొంటున్న శోధన ఎలాంటిదో ఆయనకు సరిగ్గా తెలుసు. మనకు ఏదైనా బలహీనత లేదా శోధన కలిగినప్పుడు, దానిని జయించుటకు ప్రభువు మనకు సహాయం చేస్తాడు. ఆయన కృప, ప్రేమ, అమూల్యమైన రక్తం ద్వారా మనం ప్రతిదినం ఆయన పోలికలోకి రూపాంతరం చెందుతున్నాము. ఒకనాడు మనం ఆయనను చూసి, ఆయనవలె అయ్యి, ఆయన మహిమలో, సౌందర్యంలో పాలుపొందుతాము. ఆ మహిమతో మనం నూతన సృష్టిని పరిపాలిస్తాము. ఇప్పుడు మన భూసంబంధమైన శోధనలు, పరీక్షలు, బాధలు మనలను నూతన సృష్టి కొరకు సిద్ధపరుస్తున్నాయి. మనలను రక్షించుటలో మన ప్రభువుకు ఎంత ఉన్నతమైన సంకల్పం ఉంది, మనం ఇంత మూఢులమైనప్పటికీ! కొందరు ధనిక తల్లిదండ్రులకు తమ పిల్లల కొరకు ఉన్నతమైన సంకల్పాలు ఉంటాయి. వారు జీవితంలో ఉన్నత స్థానాలు పొందాలని కోరుకుంటారు; కానీ చిన్న పిల్లవానిని పెద్దయ్యాక ఏమి కావాలని అడిగితే, తాను పోలీసు కావాలని అంటాడు! కారణం అడిగితే, “నేను ట్రాఫిక్ అంతటినీ ఆపగలను” అని చెబుతాడు. పిల్లలుగా వారు తమ తండ్రి తమ జీవితాల కొరకు గల గొప్ప సంకల్పాన్ని అర్థం చేసుకోలేరు. మనం కూడా కొన్నిసార్లు మన పరలోకపు తండ్రి మన జీవితాల కొరకు గల గొప్ప సంకల్పాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాము. అనేకమంది విశ్వాసులు దేవుడు తమను రక్షించుటలో గల గొప్ప సంకల్పాన్ని అర్థం చేసుకోలేక, భూమిపై బిచ్చగాళ్ళవలె జీవిస్తూ, ఓటమి, అవమానముల జీవితం గడుపుతున్నారు. “ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసినయెడల మనమేలాగు తప్పించుకొందుము?” మన రక్షణ విషయంలో మనం అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా ఉంటే మనం ఎంత గొప్ప నష్టాన్ని పొందుతామో కదా! మనం అప్రమత్తంగా, ప్రార్థనాపూర్వకంగా, శ్రద్ధగా, జాగ్రత్తగా ఉండాలి.
అధ్యాయం III
మన పిలుపు యొక్క గొప్పతనం:
↑ పైకి వెళ్ళండి ← పుస్తకానికి వెనుకకు ← పుస్తక భాండాగారానికి
