ఈ పుస్తకములో వెతకండి
మీ గూర్చి మిక్కిలి జాలిపడుచున్నాను. మీ కార్యముల జాగ్రత్తను ——కు విడిచి, మిగిలిన జీవితమును దేవుని ఆరాధించుటలో మాత్రమే గడుపగలిగినయెడల అది గొప్ప ప్రయోజనకరమగును. ఆయన మనలనుండి గొప్పవి కోరడు; అప్పుడప్పుడు ఆయనను కొంచెము స్మరించుట; కొంచెము ఆరాధన; కొన్నిసార్లు ఆయన కృప కొరకు ప్రార్థించుట, కొన్నిసార్లు మీ శ్రమలను ఆయనకు అర్పించుట, కొన్నిసార్లు మీ కష్టముల మధ్యను ఆయన ఇచ్చినవాటికిని ఇంకను ఇచ్చుచున్నవాటికిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, కుదిరినంత తరచుగా ఆయనతో ఆదరణ పొందుట. కొన్నిసార్లు భోజనములోను సహవాసములోను కూడా హృదయమును ఆయనవైపు ఎత్తుడు: అతి చిన్న స్మరణయు ఆయనకు ఎల్లప్పుడు అంగీకారయోగ్యము. మీరు గట్టిగా కేకవేయనక్కరలేదు; మనము ఎరుగుటకంటె ఆయన మనకు సమీపముగా ఉన్నాడు.
దేవునితో ఉండుటకు ఎల్లప్పుడు ఆలయములో ఉండవలసిన అవసరము లేదు: మన హృదయమును ప్రార్థనాలయముగా చేసికొని, అప్పుడప్పుడు అక్కడికి తిరిగి వెళ్లి సాత్వికముతోను వినయముతోను ప్రేమతోను ఆయనతో సంభాషింపవచ్చును. దేవునితో అట్టి స్నేహపూర్వక సంభాషణకు ప్రతివాడును సమర్థుడు, కొందరు ఎక్కువగా, కొందరు తక్కువగా: మనము చేయగలిగినది ఆయన ఎరుగును. అట్లు మొదలుపెట్టుదము గాక. బహుశా మన వంతున ఒక్క ఉదార నిశ్చయము మాత్రమే ఆయన ఎదురుచూచుచున్నాడు. ధైర్యము తెచ్చుకొనుడు. జీవించుటకు మనకు కొద్ది కాలమే ఉన్నది; మీరు అరువది నాలుగు సంవత్సరములకు సమీపము, నేను దాదాపు ఎనుబది. దేవునితో జీవించి చనిపోదము గాక. ఆయనతో ఉన్నంతవరకు శ్రమలు మనకు మధురమును రమ్యమునగును; ఆయన లేకుండ అతి గొప్ప సుఖములు మనకు క్రూరమైన శిక్ష అగును. సమస్తమునకు ఆయన స్తుతింపబడును గాక. ఆమెన్.
అట్లు క్రమముగా ఆయనను ఆరాధించుటకు, ఆయన కృపను వేడుకొనుటకు, మీ పని మధ్యను అప్పుడప్పుడు, శక్తి ఉన్నయెడల ప్రతి క్షణము, మీ హృదయమును ఆయనకు అర్పించుటకు అలవాటు పడుడు. కొన్ని నియమములకైనను విశేష భక్తి రూపములకైనను ఎల్లప్పుడు సంకుచితముగా మిమ్మును బంధించుకొనకుడి; దేవునియందు సాధారణ నమ్మకముతోను ప్రేమతోను వినయముతోను నడుచుడు. నా దీనమైన ప్రార్థనలను గూర్చియు నేను వారి సేవకుడననియు ——కు నిశ్చయపరచవచ్చును, ముఖ్యముగా
మన ప్రభువునందు మీవాడను, మొదలగు.
