ఈ పుస్తకములో వెతకండి
అదే వ్యక్తికి.
మీ కోరిక చొప్పున మిమ్మును కొంచెము ఉపశమింపజేసినందుకు మన ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నేను తరచుగా మరణమునకు సమీపముగా ఉంటిని, అయితే అప్పుడు అంతగా తృప్తి పొందలేదు. అందుచేత ఏ ఉపశమనమునకైనను ప్రార్థింపలేదు, ధైర్యముతోను వినయముతోను ప్రేమతోను శ్రమపడు శక్తి కొరకు ప్రార్థించితిని. ఆహా, దేవునితో శ్రమపడుట ఎంత మధురము! శ్రమలు ఎంత గొప్పవైనను వాటిని ప్రేమతో అంగీకరించుడి. ఆయనతో శ్రమపడుట పరలోకము; గనుక ఈ జీవితములో పరలోక శాంతిని అనుభవింపగోరినయెడల, ఆయనతో స్నేహపూర్వకమైన, వినయమైన, ప్రేమాసక్తమైన సంభాషణకు అలవాటు పడవలెను. ఏ సందర్భములోనైనను మన ఆత్మలు ఆయననుండి తిరిగిపోకుండ అడ్డగింపవలెను. నిరంతరము ఆయనను ఆరాధించుటకు మన హృదయమును ఆత్మీయ ఆలయముగా చేసికొనవలెను. ఆయనకు అయిష్టమైనది చేయకుండను పలుకకుండను తలంపకుండను నిరంతరము మనలను మనము కావలి కాయవలెను. మన మనస్సులు ఇట్లు దేవునియందు నిమగ్నమైనప్పుడు, శ్రమ అభిషేకముతోను ఆదరణతోను నిండును.
ఈ స్థితికి చేరుటకు ఆరంభము మిక్కిలి కష్టమని ఎరుగుదును, ఎందుకనగా శుద్ధముగా విశ్వాసములో నడవవలెను. అయితే కష్టమైనను, ఆతురతతో అడుగువారికి ఆయన ఎన్నడు నిరాకరింపని దేవుని కృపతో మనము సమస్తము చేయగలమని కూడా ఎరుగుదుము. తట్టుడు, తట్టుటలో నిలువుడు, ఆయన తన తగిన కాలములో మీకు తలుపు తెరచి, అనేక సంవత్సరములు ఆలస్యము చేసినదంతయు ఒక్కసారిగా దయచేయునని నేను హామీ ఇచ్చుచున్నాను. వీడ్కోలు! నేను ఆయనను మీకొరకు ప్రార్థించునట్లు మీరు ఆయనను నాకొరకు ప్రార్థించుడు. త్వరలో ఆయనను చూచెదనని నిరీక్షించుచున్నాను.
మీవాడను, మొదలగు.
