ఈ పుస్తకములో వెతకండి
ఈ దినము సోదరి —— నుండి రెండు గ్రంథములును ఒక పత్రికయు అందెను; ఆమె తన దీక్షా ప్రమాణము చేయ సిద్ధపడుచున్నది, ఆ కారణముగా మీ పరిశుద్ధ సమాజపు ప్రార్థనలను, ముఖ్యముగా మీ ప్రార్థనలను కోరుచున్నది. వాటిపై ఆమె మిక్కిలి ఆధారపడుచున్నదని గ్రహించుచున్నాను; దయచేసి ఆమెను నిరాశపరచకుడు. ఆయన ప్రేమ దృష్టితో మాత్రమే తన బలిని అర్పించునట్లును, సంపూర్ణముగా ఆయనకు అంకితురాలగుటకు దృఢ నిశ్చయముతో ఉండునట్లును దేవుని వేడుకొనుడు. దేవుని సన్నిధిని గూర్చు ఈ గ్రంథములలో ఒకటి మీకు పంపెదను; నా అభిప్రాయములో ఈ విషయము సమస్త ఆత్మీయ జీవితమును కలిగి యున్నది; దీనిని సరిగా అభ్యసించువాడు త్వరలో ఆత్మీయుడగునని నాకు తోచును.
దీనిని సరిగా అభ్యసించుటకు హృదయము ఇతర వాటన్నిటి నుండి ఖాళీగా ఉండవలెనని ఎరుగుదును; ఎందుకనగా దేవుడు హృదయమును ఒంటరిగా స్వాధీనపరచుకొనగోరును; మిగిలినదంతయు ఖాళీ చేయకుండ ఆయన దానిని ఒంటరిగా స్వాధీనపరచుకొనలేడు గనుక, ఆయనకు ఖాళీగా విడువబడనియెడల అక్కడ పని చేసి తనకిష్టమైనది చేయలేడు.
దేవునితో నిరంతర సంభాషణ యొక్క జీవితముకంటె లోకములో మరింత మధురమైన రమ్యమైన జీవితము లేదు. దీనిని అభ్యసించి అనుభవించువారు మాత్రమే దీనిని గ్రహింపగలరు; అయినను ఆ కారణమువలన చేయుమని మీకు సలహా ఇయ్యను. ఈ అభ్యాసములో మనము వెదకవలసినది సుఖము కాదు; ప్రేమా సూత్రమువలనను, దేవుడు మనలను అట్లు కోరును గనుకను చేయుదము.
నేను ప్రసంగికుడనైనయెడల, ఇతర వాటన్నిటికంటె దేవుని సన్నిధి సాధనను ప్రసంగించెదను; నేను నిర్దేశకుడనైనయెడల, లోకమంతటికి దీనిని చేయుమని సలహా ఇచ్చెదను; ఇది అంత అవసరమనియు అంత సులభమనియు భావించుచున్నాను.
ఆహా! దేవుని కృపయు సహాయమును మనకెంత అవసరమో మనకు తెలిసినయెడల, ఒక్క క్షణమైనను ఆయనను చూపు నుండి తప్పింపకుందుము. నన్ను నమ్ముడు; ఇకను ఇష్టపూర్వకముగా ఆయనను మరువననియు, మిగిలిన దినములను ఆయన పరిశుద్ధ సన్నిధిలో గడుపుదుననియు, ఆయనకు ఇష్టమైనయెడల ఆయన ప్రేమ నిమిత్తము సమస్త ఆదరణలు లేకుండ ఉందుననియు వెంటనే పరిశుద్ధమైన దృఢ నిశ్చయము చేసికొనుడు.
హృదయపూర్వకముగా ఈ పని మొదలుపెట్టుడు; తగినట్లు చేసినయెడల దాని ఫలితములు త్వరలో కనుగొందురని నిశ్చయపడుడు. నా దీనమైన ప్రార్థనలతో మీకు సహాయపడెదను. మీ ప్రార్థనలకును మీ పరిశుద్ధ సమాజపు ప్రార్థనలకును నన్ను ఆతురతతో సిఫారసు చేసికొనుచున్నాను; వారివాడను, ముఖ్యముగా
మీవాడను, మొదలగు.
