✨ Testimony

Pastor Bellamkonda Shivaji Raju — Life Testimony

పాస్టర్ బెల్లంకొండ శివాజి రాజు గారి జీవిత సాక్ష్యం — “ఇది నా సాక్ష్యం”

Listen to Pastor Bellamkonda Shivaji Raju — founder-editor of the Telugu Christian magazine Swarnadeepika — share his life testimony in Telugu or English: his childhood, his years at Raghu Gurukulam, his journey into journalism and the press, discovering the Bible, his baptism, founding Swarnadeepika, and God’s faithfulness through every trial — with the full text of every chapter alongside the audio, told in ten chapters.

🎧 పూర్తి ఆడియోబుక్ వినండి

అన్ని 10 అధ్యాయాలు ఒకే ఫైల్‌లో, అధ్యాయాల మధ్య చిన్న విరామంతో.

అధ్యాయం 1

నా బాల్యం

దేహములోని దేహికి నేను నమస్కరిస్తున్నాను. అంతా నిండిన ఆత్మారాముని సేవలు చేస్తున్నాను. ఈ వేదాంతంతోనే నా బాల్యం ముగిసింది.

కౌమారదశకు చేరుకునేటప్పటికి "ఎర్రజెండెర్ర జెండెర్ర జెండెన్నియుల్లో" అంటూ కమ్యూనిష్టు పార్టీలో చేరిపోయి నాస్తిక వాదానికి చేరువయ్యాను. కౌమారదశ నుండి యవ్వనదశకు చేరుకునే సరికి బైబిల్ పరిచయం అయ్యింది. బైబిల్ వేదగ్రంథంలోని సామెతల గ్రంథం నన్ను ఆలోచింపచేసింది.

నా చిన్నతనంలోనే నాకు తెలిసీ తెలియని విధంగా నా తండ్రి వెంకటరాజు గారు అనారోగ్యంతో, ఊబకాయంతో ఉండేవారు. నా తల్లిగారిది పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం, పోడూరు స్వగ్రామం. రుద్రరాజు సోమరాజు గారి సంతానం నా తల్లి రుద్రరాజు సూరమ్మగారు.

నా తండ్రిగారు బెల్లంకొండ వెంకటరాజు గారు. నాన్నగారు పోడూరు ఓస్లర్ హాస్పిటల్‌లో రాజుగారి హాస్పిటల్‌లో పని చేసేవారు. 1962లో పోడూరు ఓస్లర్ హాస్పిటల్‌లో నా తల్లి నాకు జన్మనిచ్చింది. నా తల్లికి ఐదుగురు సంతానం. ముగ్గురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. మొదటివారు దైవసేవకులు బంగార్రాజుగారు, రెండవవారు దైవసేవకులు సుబ్బరాజుగారు, నేను మూడవవాడిని. మనుధర్మ శాస్త్ర కుల విభజన వరుసలో రెండవ జాతికి చెందిన క్షత్రియ కుటుంబం మాది. పూర్తి సనాతన విగ్రహారాధికుల కుటుంబం.

నా తల్లిగారు నన్ను చిన్నతనంలోనే సనాతన విద్యను అందించే గురుకులంలో చేర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విస్సాకోడేరు వద్దగల వేగిరాజు రామకృష్ణం రాజు ప్రకృతి ఆశ్రమానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో మామిడి, జీడిమామిడి, సరుగుడు తోటల మధ్య కొన్ని ఎకరాల విస్తీర్ణంలో మా రఘు గురుకులం ఉండేది. చిన్ననాటి గురుకుల అనుభవాలు ఇప్పటికీ జ్ఞాపకం.

అధ్యాయం 2

రఘు గురుకులంలో నా విద్యాభ్యాసం

సనాతన విద్య, సూర్య నమస్కారాలు, యోగా భ్యాసం, కూరగాయల స్వయం పంటలు, ఇంకుడు గుంతల్లో నీరునిల్వ, హ్యూమన్ కంపోస్ట్ తయారీలతో పాటు, ఆటలు, పాటలు, కర్రసాము, కోలాటం, భజనలతో ముప్పై మంది విద్యార్థులం కలసి, మెలసి జీవించేవారము. మాతో పాటే మా రఘు గురుకులాన్ని నిర్వహిస్తూ మమ్మల్ని పోషించే, మేము నాన్నగారుగా పిలువబడే, శ్రీ స్వామి చైతన్యానంద సరస్వతి, సంస్కృత, తెలుగు, హిందీ, ఆంగ్ల భాషా పండితులు శ్రీ కలిదిండి నరసింహారాజుగారు కూడా మాతో కలిసే జీవితం గడిపేవారు.

సహనావతు, సహనౌభునక్తు, సహవీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు, మా విద్విషావహై! అన్న సంస్కృత శ్లోకార్థం గురుకులం మూలసిద్ధాంతం. ఆ సిద్ధాంతం పునాదిగానే గురువులు, శిష్యులు అయిన మేము కలసి మెలసి మా దైనందిన జీవితం సాగుతుండేది. రమారమి 1970 నుండి 1977 వరకు నా జీవన ప్రస్థానం గురుకులంలోనే సాగింది.

నేను గురుకులంలో చేరేసరికి మా కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. నాకు ఏడేళ్ళు వచ్చేసరికే నాకు కష్టం తెలిసింది. ఆ కారణంగా నా తల్లి గారితో నన్ను ఎక్కడైనా పంపించమని అడిగితే, గురుకులం గురించి తెలుసుకొని మా తల్లిగారు అక్కడ నన్ను చేర్పించారు. నేను గురుకులంలో అడుగుపెట్టిన తొలిసమయంలో అక్కడ స్వామీజీ నన్ను ఇంటర్వ్యూ చేసారు. ఆ ఇంటర్వ్యూలో ఏదైనా ఒక పద్యం చెప్పమన్నారు. చెప్పాను. ఆయన మెచ్చుకున్నారు. నా చేతికి ఒక తాయత్తు, మెడలో ఒక తాయత్తు ఉంది. అవి చూసిన స్వామీజీ అవేమిటీ అని అడిగారు. నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చి మా అమ్మగారు మంత్రం తాయత్తు కట్టించారు అని సమాధానం చెప్పాను.

నన్ను మాత్రం నీ తాయత్తులు తీసి పడేసి, పూర్తిగా గుండు కొట్టించుకొని కట్టుబట్టలతో మాత్రమే రమ్మని స్వామీజీ నాతో స్వయంగా చెప్పారు. వారం తిరగకుండా ఆయన చెప్పిన విధంగా మా తల్లిగారు నన్ను గురుకులంలో అప్పగించి వెళ్ళిపోయారు.

అప్పటికే పది నుండి పదిహేను మంది నా సమవయస్కులు అక్కడ ఉన్నారు. మొదటి రెండు రోజులు కొంత భయంగా ఉన్నా, ఆ తరువాత వారితో కలిసిపోయాను. దగ్గరలో ఉన్న ప్రకృతి ఆశ్రమం డాక్టరు గారిని పిలిపించి నా హెల్త్ చెకప్ చేయించారు. కుర్రాడు గుండె బలహీనంగా ఉన్నాడని చెప్పి వెళ్ళిపోయారు. ఆ రోజునుండి నెల రోజుల పాటు నన్ను ఏ క్లాసులోనూ చేర్పించుకోలేదు. మేము ఉన్న ప్రాంతం పూర్తిగా ఇసుక నేల. నాకు నెలరోజుల పాటు రోజు చేయగలిగినంత వరకు ఒక పారతో ఉదయం, సాయంత్రం నేలను తిరగవేయమనేవారు. నాకు మూడు వంతులు ఆకుకూర, ఒక వంతు రైస్ పెట్టి కడుపునిండా తినమనేవారు. కష్టమైనా తప్పని స్థితి. నెల తరువాత మళ్ళీ ప్రకృతి వైద్యం డాక్టర్ గారిని పిలిపించి ఆరోగ్యం టెస్ట్ చేయించారు. పూర్వపు బలహీనత లేనట్లుగా తేల్చిచెప్పి వెళ్ళారు.

ఆ మరుసటి రోజునుండి నన్ను ఒకటో తరగతిలో కూర్చోబెట్టారు. సంవత్సరానికి రెండుక్లాసులు చొప్పున పదవ తరగతి వయసప్ప సరిపడే సమయానికి సెక్యులర్ విద్య అక్కడే పూర్తి చేశాను. సెక్యులర్ విద్యతో పాటు ఓరియంటల్ సనాతన విద్య ప్రథమంగా ఉండేది. ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు పూర్తిగా దినచర్య ఉండేది. ఉదయాన్నే ప్రార్థన, వేదపారాయణంతో ఉండేది. ఒక గంట చదివేవారము. ఒక గంట సూర్య నమస్కారాలు, యోగా సనాలు వేసేవారము. ఆ తదనంతరం తోటపనిలో భాగంగా పాడి పశువులను స్వయంగా పోషించుకొనేవారము. మా విద్యలో భాగంగా వేదశ్లోకాలు, భగవద్గీతలోని కొన్ని అధ్యాయాలు కంఠత చేయించేవారు. రఘు వంశ కావ్యం, స్వప్నవాసవదత్త, కిరాతార్జునీయం, భర్తృహరి, మొదలగు సంస్కృత పాఠాలు ఇప్పటికీ జ్ఞాపకాలే. కానీ సెక్యులర్ విద్యలో, ముఖ్యంగా ఇంగ్లీష్ భాషలో వెనుకబడి పోవటం జరిగింది. రమారమి ఏడు సంవత్సరాల పాటు కనీసం మా ఇంటికి కూడా స్వామీజీ పంపకుండా ఒక ఆశయంతో చదివించే ఉద్దేశంతో మమ్మల్ని పంజరంలో పక్షుల్లా గురుకుల వాతావరణంలోనే పెంచారు.

చెట్టూ, పుట్టా, పాములు, తేళ్ళ మధ్య ఆడుతూ, పాడుతూ మా జీవితాన్ని కొనసాగించేశాము. మామిడి, జీడిమామిడి, లేత కూరగాయల పిందెలు, ముంజెలు, తాటికాయలు, తేగలు మా చిరుతిళ్ళు. నేను గురుకులంలో విద్యాభ్యాసం చదువుతున్న సమయంలోనే నా తండ్రిగారు అనారోగ్యంతో మరణించారు. కనీసం చివరి చూపుకైనా నేను నోచుకోలేదు. ఇంటికి పంపిస్తే వీడి చదువు పాడవుతుంది అనే ఆలోచనతో స్వామీజీ నన్ను పంపలేదు. జ్వరం వచ్చినా, జలుబు చేసినా, గాయమైనా కేవలం ప్రకృతి వైద్యం తప్పితే, ఎటువంటి మందులు వాడకం ఆరోజుల్లో మాకు తెలియవు. ఆచార్య వినోబాభావే, సరిహద్దు గాంధీ గఫార్ఖాన్, మొరార్జీ దేశాయ్ వంటి ప్రముఖుల సహచర్యం మా స్వామీజీకి ఉండేది. ఆనాటి దేవాదాయ శాఖామంత్రి, గాంధేయవాది చింతలపాటి వరప్రసాదమూర్తి రాజుగారు స్వామీజీకి అత్యంత సన్నిహితులు. గురుకులానికి కొంత ఆర్థిక సహాయం మూర్తిరాజుగారు అందించేవారు.

ఆ రీతిగా 1977 వరకు గురుకుల విద్యలో కొనసాగుతూ పదవ తరగతి భీమవరం ప్రైవేట్ కాన్వెంటు ద్వారా పరీక్ష వ్రాయించి మొదటిసారిగా మా గృహాలకు పంపించారు. అక్కడితో పంజరం వీడిన పక్షుల్లా ఎక్కడెక్కడికో మేం వెళ్ళిపోయాం. ఏ ఒక్కరూ తిరిగి గురుకులానికి చేరలేదు కదా, స్వామీజీ ఆశలు అడియాశలు గాను, మా చదువులు అరకొరగానూ మిగిలిపోవటం.

అక్కడ నుండి ఎగిరిన నేను విజయవాడలో వాలాను. నా విషయంలో అయితే అది దేవుని చిత్తమని నేటి నా అవగాహన.

అధ్యాయం 3

విజయవాడకు నా ప్రయాణం

నా బాల్యం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రఘు గురుకులం ప్రకృతి ఆశ్రమంతో ముడిపడి సనాతన విద్యతో కూడిన పదవ తరగతి విద్యతో ముగిసింది. భీమవరం నుండి సరాసరి విజయవాడ రైలు ఎక్కాను. నానాగు మీసాల లేత క్రొత్తనం. రైలుబండి మొదటి అనుభవం. రాత్రి పాసింజర్ బండి ఎక్కాను. ప్రయాణం క్రొత్త. బండి కదిలింది.

గ్రుడ్డి బిక్షగాడి ఆలాపన "నాది నాదంటావు నీ గూడు ఎక్కడే చిలకా" అంటూ వేదాంతం ఒలగబోస్తూ భలే చక్కగా అడుక్కుంటున్నాడు. నేను కూర్చున్న బోగీలో ఆ బిక్షగాడు అడుక్కుంటున్నంతసేపు నా కళ్ళు, నా మనసు అతని మీద, అతని వేదాంతపు పాట మీద ఉండిపోయింది. నేను కిటికీ ప్రక్కగా కూర్చున్న కారణంగా బండి కుదుపులకి కిటికి షట్టర్ అమాంతం జారి నా కుడిచేతి మీద పడింది. కుడిచేతి మధ్య వ్రేళ్లు చిట్లి రక్తం కారసాగింది. నా ముందు నాతో కూర్చున్నవారు వెంటనే వారి ఖర్చీపు తడిపి గట్టిగా కట్టి ఫస్ట్ ఎయిడ్ చేసారు. బిక్షగాడి వేదాంతం నుండి తేరుకున్నాను. గుడివాడ రానే వచ్చింది. గాయం అయిన కారణంగానో, చిన్నవాడినైన కారణంగానో, నాపై జాలితోనో తెలియదు కాని నాకు మాత్రం టీ, మంచినీళ్ళు బోగీలో ఉన్న పెద్దవాళ్ళు నాకందించి పరిచర్య చేసి నా మౌహమాటానికి చెక్ పెట్టారు.

అక్కడనుండి నేనెవరు? ఎక్కడి నుండి వస్తున్నావు? ఏమి చదువుతున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? అన్న ప్రశ్నలు నా సమాధానాలతో నాకు తెలియకుండానే విజయవాడ స్టేషన్‌కు చేరిపోయాను. నా అడ్రస్సుకు రిక్షా ఎక్కించి నాకు టాటా చెప్పారు. అది ఉదయం తెలతెల్లవారుతున్న సమయం ఆరు గంటలు. దర్జాగా రిక్షా ఎక్కి కూర్చున్నాను. అంతలోనే నా గుండెదడ, భయం మొదలయ్యింది. నాకు విజయవాడ తెలియదు. నా అడ్రస్సుకు కరెక్ట్‌గా తీసుకు వెళ్తున్నాడా? అన్న అనుమానం కానసాగింది. ఇంతలో రిక్షావాడు నాతో ఇలా అన్నాడు, "మంచి... వుంది" అంటూ. ముచ్చెమటలు పట్టాయి. చుట్టుగుంట మా అన్నయ్యగారింటికి వెళ్తున్నాను అన్నాను అమాయకంగా.

కొద్దిసేపు మౌనంగా ఊపిరి బిగబెట్టుకొని కూర్చున్నాను. చుట్టుగుంట సెంటర్ నుండి విశాలాంధ్ర రోడ్డు మీదుగా వీనస్ షట్టర్ కంపెనీ ఎదురుగా ఉన్న రోడ్డు ఎంట్రన్స్‌లోని వీధి కుళాయి దగ్గర నుండి "అన్నయ్యా! అన్నయ్యా! అన్నయ్యా!" అంటూ మా చెల్లి కేకలు వినపడి ప్రక్కకు తిరిగాను, మాచెల్లే. ప్రాణం లేచొచ్చింది. రిక్షావాడికి నా సలాం. మా చెల్లి కూడా అప్పటికి అన్నయ్య గారింటికి కొన్ని రోజులుండామని వచ్చింది.

కొండపైన అన్నయ్య బంగార్రాజుగారిల్లు. కొండ క్రింద వున్న మెయిన్ రోడ్డుకు దగ్గరగా వున్న వీధి కుళాయి దగ్గర నీళ్ళు పట్టుకోవటానికి వరసబిందెల్లో బిందె పెట్టి మా చెల్లి దిక్కులు చూస్తూ తన చూపు నావైపు వేసింది. చెల్లిని చూడగానే నా కళ్ళు చెమ్మగిల్లినాయి. చుట్టుగుంట కొండమీద అన్నయ్యగారిల్లు. కొండ ఎక్కుతుండటం అదీ క్రొత్త అనుభవమే. అలా విజయవాడ అన్నగారింటికి చేరాను. నేను వెళ్ళిన కొద్ది రోజులకే నా చెల్లి పోడూరు మా ఇంటికి వెళ్ళిపోయింది.

అక్కడి నుండి అన్నయ్యగారింట్లో నా చెల్లి డ్యూటీస్ నాకు పడ్డాయి. కుళాయి నాకు అలవాటు పడింది. మొత్తానికి బెజవాడ నాకు పరిచయమయ్యింది. అలా ఒక వారం, పదిరోజులు గడిచింది. అన్నయ్య బంగార్రాజుగారు నాకు పని వెతికే పనిలో పడ్డారు. దగ్గరలో ఉన్న విశాలాంధ్ర దినపత్రిక ఆఫీసులో పనిచేసే ఒకరు అన్నయ్యకు పరిచయం ఉన్న కారణంగా, వారి ద్వారా నన్ను కమ్యూనిస్టు పార్టీ దినపత్రిక విశాలాంధ్రకు అనుబంధంగా ఉన్న స్వతంత్ర ఆర్ట్ ప్రింటర్స్ విభాగంలో "హ్యాండ్ కంపోజ్" అక్షరాల కూర్పు పని నేర్చుకోవటానికి టెంపరరిగా పంపించారు. చాలా ఆసక్తిగానే నేర్చుకున్నాను. ఆరు మాసాల్లో కంపోజర్ అయ్యాను. అరవై రూపాయలు జీతం కూడా తీసుకునే పరిస్థితికి చేరుకున్నాను.

అధ్యాయం 4

ముద్రణాలయంలో, కమ్యూనిజంలో నా అడుగులు

ఆ విధంగా ప్రెస్‌వర్క్స్, దిన పత్రిక పరిచయాలతో పాటు కమ్యూనిజం కూడా పరిచయం అయ్యింది. నా సీనియర్ ప్రెస్ వర్కర్స్ నాకు బాగా సహకరించారు. నన్ను ప్రోత్సహించారు. కాకపోతే గోదావరి "ఐ" యాస భాషను బట్టి నన్ను అప్పుడప్పుడూ ఆట పట్టించేవారు. ప్రెస్ వర్క్‌లో ఎక్కువ శాతం కమ్యూనిజం భావజాల వ్యాసాలకు సంబంధించిన పుస్తకాలు, నాస్తిక వాద పుస్తకాలు, విమర్శనాత్మక పుస్తకాలు నాటి పెద్ద రచయితలు శ్రీశ్రీ, చెరబండరాజు, తాపీ ధర్మారావు, కొడవటిగంటి వంటి విప్లవకారుల రచనలు, అభ్యుదయ కవుల రచనలు, మత గ్రంథాలపై విమర్శనాత్మక పుస్తకాలు అచ్చువుతూ ఉండేవి. కంపోజింగ్ విభాగంలో ఉన్న కారణంగా కమ్యూనిస్టు పార్టీకి చేరువయ్యాను. దాసరి నాగభూషణం, గిరిప్రసాద్ వంటి కొందరు నాటి ప్రముఖుల ఉపన్యాసాలు, రాజకీయ తరగతులు కూడా వారంలో ఒకరోజు కార్మికులందరికీ ఉండేవి. ఆ ఉపన్యాసాల ప్రభావాలతో నేను పూర్తిగా కమ్యూనిస్టు పార్టీకి చేరువయ్యాను. నేను సభ్యుడనై పోయాను. శ్రీశ్రీ మహాప్రస్థానం నన్ను బాగా ప్రభావితం చేసింది. మొత్తం బట్టీ పట్టేశాను.

అప్పటికే రెండో అన్నయ్య సుబ్బరాజుగారు కూడా విజయవాడ తన కుటుంబంతో సహ వచ్చేసారు. పెద్ద అన్నయ్యగారింటి దగ్గర నుండి సుబ్బరాజు అన్నయ్య ఇంటికి నేను షిఫ్ట్ అయ్యాను. ఈ తరుణంలో పెద్దన్నయ్యగారి ఇంటివద్ద నాకు ఒక వింతైన అనుభవం కలచివేసింది. నేను ఎరుగని నాకు తెలియని క్రైస్తవ ప్రార్థన కూటం ప్రతివారం ఒకరోజు అన్నయ్యగారి ఇంటి వరండాలో జరగడం. నా మనసుకు నచ్చేది కాదు. నేను సనాతన ధర్మం నుండి వచ్చిన వాడిని. కానీ ఇక్కడ ఈ తంతు నాకర్థం కానిది. ఆ తదనంతర కాలంలో ఒకసారి నన్ను కూడా అన్నయ్య బంగార్రాజుగారు చర్చికి తీసుకెళ్ళారు. అక్కడ పాస్టర్ గారు నేను దేవుడిగా భావించే వ్యక్తిని విమర్శించారు. అదీ నా మొదటి చర్చి అనుభవం. దానితో నేను మరింత బిగుసుకు పోయాను.

ఒకరోజు విశాలాంధ్రలో ఒక పుస్తకం కంపోజుకు వచ్చింది. ఏటుకూరి బలరామమూర్తి గారి రచన "భారతదేశం - మతాలు". దానిలో క్రైస్తవ మతం, రోమన్ కాథలిక్స్ గురించి విపులీకరించిన విధానంలో పేదవారికి బట్టలు, రొట్టెలు, గోధుమలు ఇచ్చి వారిని ఆకట్టుకోగలిగారు అన్నట్లుగా నేను చదవటం నాకు గుర్తు. దానితో క్రైస్తవ్యంపై వ్యతిరేకత చూరగొన్నాను. ఆ తదనంతరం వెలగా వెంకటప్పయ్యగారి రామాయణ, భారతంలోని అనేక సంఘటనలపై విమర్శనాత్మక వ్యాసాలు చదివాను. అక్కడితో క్రైస్తవ్యం, హైందవ మతాలపై కొంత చులకన భావం ఏర్పడింది. అక్కడినుండి పూర్తిగా కమ్యూనిస్టు సాహిత్యంపైనా, నాస్తిక సాహిత్యంపైనా, సమసమాజ స్థాపన భావనలపైనా ఎక్కువగా శ్రద్ధ చూపేవాడిని.

సుబ్బరాజు అన్నయ్యగారు నివాసం ఉంటున్న ప్రాంతానికి చెందిన కమ్యూనిస్టులకు చేరువయ్యాను. అనతి కాలంలోనే స్థానిక యువజన నాయకుడిగా ఎదిగాను. అక్కడినుండి ప్రజానాట్య మండలి నాకు పరిచయం అయ్యింది. ప్రజానాట్యమండలి పాటల దళంలోనే ఒక సభ్యుడిగా స్థానికంగా కొనసాగాను. నా కష్టాలు నేనెరుగుదును. పేదలపట్ల ఎక్కువగా నా భుజం కాచేవాడిని. కారణంగా కొంత ప్రభుత్వ భూమిని ఆక్రమించి రమారమి పదిహేడు పేద కుటుంబాలకు కేటాయించడం కూడా జరిగింది. అవన్నీ ఇప్పుడు పర్మినెంటు ఇళ్ళుగా కూడా మారిపోయాయి. ఆ విధంగా యువకుడిగా ప్రజలలో మమేకమై పోయేవాడిని.

ఈ విధంగా నా జీవిత ప్రయాణం విశాలాంధ్ర స్వతంత్ర ఆర్ట్ ప్రింటర్స్‌లో, కమ్యూనిస్టు పార్టీతో ముడిపడి కొనసాగుతుండగా నేను పని చేస్తున్న స్వతంత్ర ఆర్ట్ ప్రింటర్స్ లాక్ అవుప్‌కు గురైంది. నేను రోడ్డున పడ్డాను. కమ్యూనిస్టు పార్టీ ప్రెస్ అయివుండి కూడా ఇలా ఎందుకు జరిగింది? కలత చెందాను. కొన్ని నెలల పాటు ప్రైవేట్ ప్రెస్‌లో పనిచేసి ఎ.పి.ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా సహాయం పొంది స్వయంగా చిన్న ప్రెస్ ప్రారంభించాను. కరపత్రాలు, శుభలేఖలు, బిల్లుపుస్తకాలు వంటివి ముద్రిస్తూ ఉండేవాడను. అదే సమయంలో నా ప్రెస్‌కు క్రైస్తవులు వచ్చి సువార్త కరపత్రికలు, సభల కరపత్రికలు ముద్రణకు వస్తుండేవారు. వారి ద్వారా కొందరు క్రైస్తవ మిత్రులు పరిచయం అయ్యారు.

అధ్యాయం 5

బైబిల్ నా జీవితంలోకి

వారిలో ఒకరు నా మిత్రుడు ఇందుపల్లి శ్యాంబాబుతో ఎక్కువగా మిత్రత్వం చేసేవాడను. ఒకసారి మిత్రుడు నాతో బైబిల్ చదవమని చెప్పడం జరిగింది. అంతకు పూర్వమే అన్నయ్యగారు నాకు బైబిల్ క్రొత్త నిబంధన ఇచ్చి చదవమన్నారు. కానీ, చదవడం నావల్ల కాలేదు. కారణం, మత్తయి సువార్త వంశావళి నన్ను ముందుకు చదువ నివ్వలేదు. ఈ విషయం మిత్రునితో పంచుకున్నాను. తాను పాత, క్రొత్త నిబంధనలు కలిసి ఉన్న మొత్తం బైబిల్ గిఫ్ట్‌గా ఇచ్చి మొదట సామెతలు చదవమని చెప్పడం జరిగింది. సామెతలు నన్ను ఆకర్షించాయి. చదువుతున్నంతసేపు సమాంతర భావాలు గల తెలుగు పద్యాలు, సంస్కృత శ్లోకాలు కూడా జ్ఞాపకం వస్తుండేవి. సామెతలు నన్ను కట్టిపడేశాయి. చాలా శ్రద్ధగా చదివాను. ఆ తదనంతరం సువార్తలు చదివాను. కమ్యూనిస్టు మానిఫెస్టో కన్నా క్రీస్తు కొండమీద తెలిపిన మానిఫెస్టో నన్ను బాగా ఆకర్షించింది. అక్కడనుండి నా స్నేహితునితో కలిసి సువార్త కూటాలకు, సభలకు వెళ్ళడానికి ఇష్టపడ్డాను.

అలా స్నేహితుల ద్వారా సువార్త సభలకు వెళ్ళడానికి ఇష్టపడ్డ నేను కమ్యూనిజానికి దూరమవుతూ వచ్చాను. ఆ సందర్భంలోనే నా తల్లి గారు సూరమ్మ తన మేనకోడలితో నా వివాహం నిశ్చయించారు. నా స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా పోడూరులోనే నా మేనమామగారి ఇంటివద్ద నా వివాహం, నా చెల్లి వివాహం రెండూ కూడా ఒకే రోజు ఒకే సమయానికి ముగించారు. ఆ తదనంతరం కమ్యూనిస్టు పార్టీలోని నా యాక్టివిటీస్‌ని తగ్గించుకుంటూ వచ్చాను.

సువార్త కూటాలకు వెళ్ళడం, బైబిల్ చదవడం ప్రారంభించిన తరువాత నాకు ఒక ప్రశ్న తలెత్తింది. ఎందుకు అన్నయ్య గారు క్రీస్తు భక్తుడయ్యాడు? అని. అన్నయ్య గారి వివాహానంతరం సంతానం కోసం ఎదురు చూశారు. హైందవ కుటుంబం నుండి వచ్చిన వారు కావడం వల్ల ముక్కోటి దేవతలకు మొక్కుకున్నారు. ఎవరెవరు ఎటువంటి సలహాలు ఇచ్చినా అవన్నీ పాటించారు. అయినా సంతానం విషయంలో వారికి నిరాశే ఎదురయ్యింది. ఇదంతా గమనించిన క్రైస్తవ సోదరి, వదిన గారికి మొట్ట మొదటిగా క్రీస్తును పరిచయం చేయడం జరిగింది. వదినగారు ఆమె మాటలకు తల ఒగ్గి క్రీస్తును ప్రార్థించటం మొదలు పెట్టారు. ఆ తదనంతరం అన్నయ్య గారికి తెలిసి ఇష్టం లేకపోయినా సంతానం కోసం ప్రభుని అర్థించారు. కొన్ని నెలల తరువాత వారి ప్రార్థనలకు జవాబు దొరికింది. తొలిగా మగబిడ్డను, ఆ తదనంతరం ఆడబిడ్డను ప్రభువు సంతానంగా ఇచ్చాడు. ఇది అన్నయ్య గారింటిలో దేవుడు చేసిన అద్భుత కార్యం.

ఈ విషయం నేను తెలుసుకున్నాను. వెంటనే నాకు జ్ఞాపకం వచ్చిన సుమతీ పద్యం, "అక్కరకు రాని చుట్టము మొక్కిన వరమీని వేల్పు మోహరమున తానెక్కిన బారని గుర్రము గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ". ఈ పద్యంతో ఊరట చెందాను. వారు ప్రభువును నమ్మడానికి గల కారణం ఏ దేవుడిని మొక్కిన వరమివ్వలేదు గాని క్రీస్తు భగవానుడి వరసిద్ధి వల్ల ప్రభువును నమ్మగలిగారు. వరాలిచ్చే దేవుడు క్రీస్తు ఒక్కడే అని సాక్ష్యం చెప్పగలశక్తి ధైర్యం మా కుటుంబాలలో కలిగింది.

నేను బైబిలు చదివే ప్రతి సందర్భంలోనూ ఏవేవో ఇతర విషయాలు కూడా జ్ఞాపకం వస్తూ వుండేవి. ఉదాహరణకు సామెతల గ్రంథంలోని పదిహేడవ అధ్యాయంలోని పన్నెండవ వచనం చదివితే అక్కడ "పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగుబంటినైనా ఎదుర్కొన వచ్చుగాని మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు" అని ఉంది. భర్తృహరి శ్లోకాన్ని ఏనుగుల లక్ష్మణ కవిగారు ఇలా తర్జుమా చేశారు, "తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, దవిలి మృగతృష్ణలో నీరు ద్రావ వచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, జేరి మూర్ఖుని మనసు రంజింపరాదు". ఈ పద్యానికి ఆ వచనానికి ఉన్న దగ్గర సంబంధం నన్ను ఆలోచనల్లోకి నెట్టేసింది. బైబిల్ గ్రంథం మీద నాకు మక్కువ ఏర్పడింది. సామెతల గ్రంథం చదివే కొద్దీ చదవాలనే కోరిక ఎక్కువైంది. జీవిత సత్యాలు, మానవునికి కావలసిన జ్ఞానం మొత్తం సామెతల్లో చూడగలిగాను. బైబిల్ నా సొంతం చేసుకున్నాను.

ఒకచోట "తన పొరుగువానికి జామీను ఉండి పూట పడువాడు తెలివిమాలిన వాడు" అని చదివిన నేను ఒక్కసారిగా నిశ్చేష్టుడనయ్యాను. ఒకసారి మా వూళ్ళో ఒక తగాదా నేను విన్నాను. ఒక పెద్ద మనిషి దగ్గరకు తీర్పుకు ఇద్దరు వచ్చారు. ఒకాయన మరొకరికి అడ్డం వుండి డబ్బులు అప్పుగా ఇప్పించాడు. అప్పు కట్టని కారణంగా మధ్యవర్తిగా ఉన్న అతనిని అప్పు కట్టమని ఇచ్చిన వాడు మొరాయించాడు. మధ్యవర్తి తండ్రికి కోపం వచ్చి ఒక్కసారిగా "అడ్డం వుండి గడ్డిమేయటం" వంటి పల్లెటూళ్ళలోని జన సామాన్యపు మాటతో తిట్టాడు. ఆ తిట్టు సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనానికి దగ్గర వుంది. ఇలా అనేక విషయాలు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ విధంగా బైబిల్ అధ్యయనం చేసిన తరువాత బైబిల్‌ని పూర్తిగా నమ్మాను. దేవుడున్నాడు అని కూడా నమ్మాను. ఆయన క్రీస్తే అని కూడా స్పష్టంగా తెలుసుకున్నాను. ఇక వితండ వాదాలకు నేను పోనవసరం లేదు. కానీ, నేను విశ్వసించినదేదో దానిని పూర్తిగా విశ్వసిస్తున్నాను. మొదటి థెస్సలొనీకయులకు 5:21వ వచనంలో అన్నిటినీ పరిశీలించి మేలైన దేదో దానిని మాత్రమే చేపట్టుడి అన్న వాక్యాధారంగా నేను నా మనసులో క్రీస్తును అంగీకరించాను.

అధ్యాయం 6

బాప్తీస్మం, నూతన జీవితం

ఇదిలా వుండగా అప్పటికే కొందరు పాస్టర్లు నా ప్రెస్‌కు వస్తున్న కారణంగా నాకు స్నేహితులుగా మారారు. నేను బైబిల్ చదవడం, కూటాలకు వెళ్ళడం పరిశీలించిన నా క్రైస్తవ స్నేహితులు ప్రతి శనివారం ఒక అర్ధగంట ప్రెస్‌లో ప్రార్థన చేసుకుందాం అని నన్ను ప్రోత్సహించారు. దానికి నేను అంగీకరించాను. కొన్ని రోజులు ప్రార్థనలు అయిన తరువాత ఒక రోజు చివరిలో నన్ను కూడా ప్రార్థించమని నన్ను కోరారు. దానికి నేను అంగీకరించాను. నాకు ప్రార్థన క్రొత్త. కానీ వారు చేస్తున్నప్పుడు విన్న కారణంగానో ఏమో, నేను మోకరించి తలవంచి ప్రార్థించటం మొదలుపెట్టాను. నాకు తెలియకుండానే కన్నీటి పర్యంతమయ్యాను. అనేక విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు మొరపెడుతూ, నా బాధను వెళ్ళగక్కుతూ, కొన్ని విషయాలను బట్టి క్షమాపణ వేడుకున్నాను. నా కన్నీటి ధార నా ముందు సాక్ష్యం పలికింది. నేను ఆమెన్ అని తల పైకెత్తాను. నాకేమి అర్థం కాలేదు. నేను ప్రార్థన చేయడం, ఏడ్వడం, క్షమాపణ అడగటం ఇదంతా జరిగిపోయింది.

తెల్లవారితే ఆదివారం కారణంగా నా మిత్రులు, పాస్టర్ మోజెస్ గారు, ఉదయాన్నే పది గంటలకు మీరు ఒక జత బట్టలు తీసుకొని విజయవాడ పోలీస్ క్వార్టర్స్‌లోని తన చర్చీకి రమ్మని ఆహ్వానించగా వెళ్ళాను. ప్రక్కనేవున్న కాల్వలో నాకు బాప్తీస్మం ఇవ్వడం జరిగింది. ఆ విధంగా నా బాప్తీస్మ కార్యక్రమం ముగిసింది.

బైబిల్ డీప్‌గా చదవడం ప్రారంభించాను. ఆ తదనంతరం మనవాళ్ళ బోధలకు, క్రీస్తు పరలోక తత్వానికి, ఇహలోక సామాజిక తత్వానికి ఎంత వ్యత్యాసముందో నాకర్థమయ్యింది. బైబిల్ పరించడమంటే జ్ఞానాన్ని చిలకడమే. బైబిల్ చదవడమంటే చాలా శ్రమించాలి. బైబిల్ చదవడమంటే ఒక జీవిత కాలం సరిపోదు. బైబిల్ ఇహ, పరలోక విశ్వవ్యాపిత మానిఫెస్టో. బైబిల్‌ని ఎంత శ్రమించి చదివితే జ్ఞానమెంత చేకూరుతుందో అర్థం చేసుకోవాలి. కళ్ళతో చూసి, నోటితో చదివినంత మాత్రాన బైబిల్ చదివినట్లు కాదని నా అభిప్రాయం. నేను బైబిల్‌ని అర్థంచేసుకోవడానికి చాలా శ్రమపడాల్సి వచ్చింది. ఇంకా శ్రమిస్తూనే వున్నాను.

నేను కమ్యూనిస్టు కార్యకర్తగా సమాజసేవ చిన్న వయసులోనే చేశాను. క్రైస్తవుడయ్యాక క్రైస్తవుడుగా నేనేం చెయ్యాలి? క్రీస్తు మూడున్నర సంవత్సరాల్లోనే సమాజంలో తన సేవలను అందించి ముప్పైమూడున్నర సంవత్సరాల వయసులోనే తన తండ్రి వద్దకు చేరిపోయాడు. ప్రపంచానికి పరిచయమైయ్యాడు. నాటి నుండి నేటి వరకు ఆయన ఉనికి లేనిదే ప్రపంచం లేదు. అప్పటికి నా వయస్సు ముప్పై సంవత్సరాలు. ఇక నేను కూడా మూడున్నర సంవత్సరాల్లోనే ఏదో చేయాలి అనే తపన నాలో పెరిగింది.

అధ్యాయం 7

స్వర్ణదీపిక పుట్టుక

ఈ ఆలోచనతోనే నేనున్న సమయంలో విజయవాడ సింగ్‌నగర్ పాస్టర్ బాబారావుగారు ఒక ఆలోచనతో నా ప్రెస్‌కు వచ్చారు. ఆయన నాతో అన్నమాటలు, "బ్రదర్ నేను సిటీ ఎడిషన్, న్యూస్ పేపర్ లాంటిది ఒకటి మన క్రైస్తవ పత్రిక పెట్టాలనుకొంటున్నాను" అని నాతో ఆయన ఆలోచన పంచుకున్నారు. అది మీ వల్ల సాధ్యం కాదని, వెంటనే మీ ఆలోచన నాకొదిలి పెట్టండి, నాకు ప్రెస్ వుంది, విశాలాంధ్ర అనుభవం వుంది, అన్ని డినామినేషన్లను కలుపుకొని క్రైస్తవ వార్తా పత్రికను నేను ప్రారంభిస్తాను అన్నాను. ఆయన మరో మాట లేకుండా "మీరేచెయ్యండి, మేం మీ వెంట ఉంటాం" అని వెంటనే సమాధానమిచ్చారు.

ఆలస్యం చేయకుండా కొన్నిదినాలలోనే మూడు చక్కని టైటిల్స్ నేను తయారు చేసి నా మిత్రులకు చెప్పాను. దానిలో మొదటి టైటిల్ "స్వర్ణదీపిక"ను ప్రతిపాదించారు. దానితో పాటు మరో రెండు టైటిల్స్ పర్మిషన్‌కు పంపాను. మొదటి టైటిల్ స్వర్ణదీపిక రిజిస్టర్ అయ్యింది. క్రైస్తవ మిత్రులు పూర్తి సహకారంతో విజయవాడ, సువార్త వాణిలో, రాష్ట్ర క్రైస్తవ సంఘ పెద్దల సమక్షంలో స్వర్ణదీపికను ప్రారంభించాను.

1993వ సంవత్సరం అక్టోబర్ 3వ తేదీ ఆదివారం నేను బాప్తీస్మం తీసుకున్నాను. మరుసటి రోజు 4వ తేదీ సోమవారం సాయంత్రం 4 గంటలకు సువార్త వాణి హాలులో ఆంధ్రప్రదేశ్‌లో క్రైస్తవ సాహిత్య సేవలో కొనసాగుతున్న ప్రముఖుల చేతుల మీదుగా పత్రికను ఆవిష్కరించటం జరిగింది. వారిలో ప్రముఖులు నర్సాపురం జీవన్‌జ్యోతి పబ్లిషర్ రచయిత శ్రీ కె.విల్సన్, ప్రముఖ కవి రచయిత శ్రీ ఎండ్లూరి సుధాకర్, ఇంటింటిసువార్త సంస్థ సభ్యులు శ్రీ యం.యం.ప్రసాద్, వేదపథం ఎడిటర్ జి.ఆర్.ప్రకాష్, ప్రముఖ సువార్త గాయకులు రాజబాబు, నాటి కమర్షియల్ టాక్స్ కమీషనర్ రిటైర్డ్ టి.యస్.విజయకుమార్, స్థానిక సంఘాల నాయకులు అన్ని డినామినేషన్ల నుండి హాజరయ్యారు. సువార్త వాణి హాలు కిక్కిరిసి పోయింది. దేదీప్యమానంగా "స్వర్ణదీపిక" క్రైస్తవ సమాజ మందిరంలో వెలుగొందుతూనే వుంది.

ప్రారంభించిన మూడు సంవత్సరాలకే పత్రిక ఆంధ్రప్రదేశ్‌లోనే దాని ప్రత్యేకతను సంతరించుకుంది. నాటి నుండి నేటి వరకు అప్రతిహతంగా, పత్రిక నేటికీ పనిచేస్తుంది. ఆ తదనంతరం క్రైస్తవ రచయితలు, థియాలజిస్టులు, క్రైస్తవ సమాజానికి రచయితలు, దళిత చైతన్య రచయిత(త్రు)లు పేరెన్నిక గన్న ఎందరెందరివో వ్యాసాలు, కథలు, కవితలు, ప్రసంగాలు ముద్రిస్తూ ముందుకు కొనసాగుతున్నది స్వర్ణదీపిక. పత్రిక మొదలు పెట్టిన నాటినుండి నేటి వరకు పబ్లిషర్, చీఫ్ ఎడిటర్‌గా ముందుకు కొనసాగుతానే వున్నాను. ప్రారంభంలో మూడు సంవత్సరాల పాటు ఎడిటర్‌గా వేరొకరిని అపాయింట్ చేసుకోవడం జరిగింది. ఆ తదనంతరం స్వయంగా ఎడిటోరియల్స్ వ్రాస్తూ నడిపించడం జరుగుతున్నది.

క్రైస్తవ, దళిత సామాజిక వర్గాలను ఆధ్యాత్మికంగా, రాజకీయంగా చైతన్య పరచటంలో పత్రిక ద్వారా నేనెప్పుడు ముందు వరుసలోనే వున్నాను. 1993లో ప్రారంభించిన మన పత్రిక "స్వర్ణదీపిక" ఇరవై సంవత్సరాలు ముగించుకుంది. 1993లో క్రీస్తే దేవుడని, ఆయనే ఈ లోకానికి వెలుగని, ఆయనే మానవుల రక్షకుడని, ఆయన తప్ప మరొక్క దేవుడు లేడని పూర్తిగా విశ్వసించిన నేను క్రైస్తవ ఆధ్యాత్మిక, వార్తా విశేషాలతో కూడిన స్వర్ణదీపిక పత్రికా పరిచర్యను ప్రారంభించడం జరిగింది.

అధ్యాయం 8

సవాళ్లు, త్యాగాలు

మొదలుపెట్టిన నాటినుండి నేటి వరకు ఎన్నెన్ని ఒడిదుడుకులో, చెప్పనలవికానివి ఎన్నో. ఇంటా, బయటా బెదిరింపులు. ఇంటివారు క్రైస్తవులు, బయటివారు ఆరెస్సెస్ దాని అనుంగుశాఖలు. పత్రికన్నాక మంచి, చెడు రెండూ వ్రాయాలి. క్రైస్తవ సమాజానికైనా, సామాజిక నేపధ్యాలయినా తప్పనిసరి, అప్పుడే అది పత్రికనిపిస్తుంది. పత్రికన్నది సామాజిక చైతన్యానికి దోహదకారి కావాలి. ఆ గురితోనే, ఆ లక్ష్యంతోనే పత్రిక నేటికీ పనిచేస్తుంది.

ఈ ఇరవై యేళ్ళలో స్వర్ణదీపిక వివిధ కోణాల్లో క్రైస్తవ సంఘాలకు, బలహీన వర్గాలను చైతన్యపరచడంలో తనవంతు కృషి శక్తి వంచనలేకుండా కృషి చేసింది. క్రైస్తవ్యంపై జరుగుతున్న దాడులను సమూలంగా ఖండించింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయొద్దని గర్జించింది. ఆరెస్సెస్, శివసేన, భజరంగ్ దళ్ వంటి మత సంస్థలను నిషేధించాలని పదే పదే డిమాండ్ చేసింది. మెమోరాండంలను సమర్పించింది. అలిండియా క్రిస్టియన్ కౌన్సిల్, గ్లోబల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ క్రిస్టియన్స్ వంటి సంస్థల ద్వారా ఎన్నో రాస్తారోకోలు, మౌన ప్రదర్శనలు, రిలే నిరాహారదీక్షలు వంటి అనేక కార్యక్రమాల ద్వారా ప్రభుత్వాలకు క్రైస్తవ వ్యతిరేక శక్తుల పట్ల వినతి పత్రాలు అందజేసింది.

ఈ సందర్భాలలోనే క్రైస్తవ వ్యతిరేక శక్తుల ద్వారా వ్యక్తిగతంగా నన్ను దూషిస్తూ నాకు, నా కుటుంబానికి బెదిరింపు లేఖలు అందుకున్న సందర్భాలు, ఫోన్స్ ద్వారా తిట్ల పురాణాలు వంటి అనేక ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవటం జరిగింది. కొన్ని సందర్భాలలో నేను ఒంటరి ప్రయాణం చేయడానికి కూడా వెనుకంజ వేయడం జరిగింది. నాటి నుండి నేటి వరకు దేవుడే నా వెన్నుదన్ను.

"ప్రింటింగ్ వ్యాపారం చేసుకోక ఈ పత్రిక పని వాడికెందుకు?" అని నన్ను చిన్నచూపు చూసిన నా రక్త సంబంధీకుల సాటిపోటు మాటలకు చాలా బాధపడేవాడను. వారికి సామాజిక చైతన్యం, పత్రికా పరమార్ధం తెలియని కారణంగా కావచ్చు అని, రెండవదిగా వ్యాపారం చేసుకొని ఆర్థికంగా స్థిరపడక వీడికి ఇవన్నీ అవసరమా అని కూడా అయి వుండవచ్చు. ఏ బాధ అంతా బంధువులతో అయితే, ఇక బయటి వారి గుసగుసలు మరింత నొప్పి కల్గించేవి. తాత, ముత్తాతల నుంచి క్రైస్తవులమైన మమ్మల్ని దాటి ఇతగాడి పత్రికా హడావిడి ఏమిటి అంటూ అసూయపడ్డ వారూ ఉన్నారు.

పత్రిక నడిపేందుకు నాకు ఉన్నది ఒక్కటే, ఆత్మవిశ్వాసంతో కూడిన తెగింపు. డబ్బువిషయానికి వస్తే ఎప్పుడు తడువులాటే. ఏనాడూ బ్యాంక్ బ్యాలన్స్ ఉండదు, నేటికీ. ఎవరి దగ్గర నుండి పత్రిక కోసం ఆర్థిక సహాయం కోరలేదు. నేను ఇంట్లో ఎలా ఉన్నా ఇంటి గడవదాటుతున్నానంటే చాలా హుందాగా నన్ను బయటకు పంపే నా భార్య పద్మావతి గొప్పతనం. నన్ను, నా ఇద్దరి పిల్లల్ని నా భార్య అంత హుందాగా తయారుచేసేది. సామెతలు ముప్పైఒకటవ అధ్యాయం ఆమెకు అచ్చం అతికినట్లుంటుంది. నేను ఇంత ధైర్యంగా ఉంటూ సమాజంలోకి చొచ్చుకు పోతున్నానంటే దానికి ఆమె ప్రోత్సాహమే.

ఇరవై యేళ్ళలో విజయవాడలో ఉంటూ సొంత ఇల్లు అమర్చుకోలేని నన్ను చాలా మంది అసమర్థుడిగా భావిస్తుంటారు. ఇప్పటికి నేను తొమ్మిదిచోట్లకు నా ఇంటి అడ్రస్సు, ఆఫీసు అడ్రస్సులు మార్చాను. పత్రికా పరిచర్యలో నేను ఎదుర్కొన్న ఆర్థిక బాధల్ని ప్రక్కన బెడితే, బయటి దాడులు మరెన్నో. కొందరు బెదిరింపు లేఖలు వ్రాస్తే, మరికొందరు ఫోన్ బెదిరింపులు, ఇంకొందరు అంతర్గతంగానే మెలుగుతూ పత్రిక పట్ల, నా పట్ల వ్యతిరేకతను పాతకుల్లోనూ, రచయితల్లోనూ చొప్పించేందుకు ప్రయత్నాలు చేశారు. పత్రిక పనితీరు పట్ల నేను సంతృప్తి చెందేవాడను. ఆ సంతృప్తి కారణంగా నా ఆర్థిక పరిస్థితిని లెక్క చేసేవాడిని కాను. రెండు ఇండ్ల ప్లాటులను స్వర్ణదీపిక పరిచర్య నిమిత్తం అమ్మివేయటం జరిగింది. పత్రికకు ప్రత్యేకంగా ఆర్థిక లాభాలు అంటూ ఏనాడూ వుండవు. చందాల ద్వారానూ, అడ్వర్టైజ్‌మెంట్స్ ద్వారా వచ్చే పైకం యాభైశాతం ఖర్చు జమ అవుతుంది. మిగతా సగం నేను భరించ వలసిందే.

అధ్యాయం 9

పత్రిక ధర్మం, మీడియాపై నా ఆలోచనలు

వ్యక్తుల పొగడ్తలకు గాని, విపరీత పబ్లిసిటీ యాడ్స్‌కు గాని పత్రిక ఏనాడు పనిచేయలేదు. కొన్ని పత్రికలు సూవనీర్‌లాగా రిలీజ్ చేస్తుంటారు, అవి లాభసాటిగా ఉండొచ్చు గాక. స్వర్ణదీపిక మాత్రం ఏనాడూ ఆ దారి వెతుక్కోలేదు. చేసింది చెప్పాలి! చెప్పింది చెయ్యాలి!! ప్రభువు తనకిచ్చిన వరమేదో గుర్తించి దానిని ప్రజావ్యయోజనం కోరి నిరంతరం శ్రమించాలి. తద్వారా తనకు తన కుటుంబానికి, సంఘానికి క్షేమకారి కాగలదు.

"పత్రికొక్కటున్న పదివేల సైన్యంబు, పత్రికొక్కటున్న మిత్రకోటి, పత్రికలేకయున్న ప్రజకు రక్ష లేదు" అంటారు ప్రముఖ పాత్రికేయులు నార్ల వారు. ఈ మాటల్లో అసలు పత్రిక అంటే ఇలా ఉండాలి అన్నది పత్రిక యొక్క సారాంశాన్ని విపులీకరించారు. కానీ, నేటి ప్రింట్ మీడియా గాని, ఎలక్ట్రానిక్ మీడియాగాని వాస్తవాలను వెల్లడించడంలో విముఖత చూపడమేగాక, డబ్బుకు అమ్ముడు పోతున్నదని మరో కవి సద్విమర్శ చేశారు. "పత్రికలను గొనును ప్రజలనెల్ల గొనును, పట్టుబట్టి తాను ప్రభువనగును, ధనముకలిగనేమి ధరణి దాసోహమ్ము, కల్లకాదు సుమ్ము కవుల మాట". ఈ మాటల్లో మీడియా సహితం డబ్బుకు దాసోహం అన్న మాట స్పష్టమవుతుంది.

ఈ మధ్య మీడియా వ్యాపార ప్రకటనల కోసమే పత్రికలు అన్నట్టుగా మొదటి పేజీ మొత్తం ప్రకటనలనే గుప్పిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ మీడియా అయితే మరొక అడుగు ముందుకేసి తమ ఛానలే ప్రజలంతా చూడాలనే అత్యాశతో "మీ ఇంట్లోనే బాంబుల తయారీ ఎలా?" అంటూ ఒక మిలిటెంటు స్కూల్‌ని తలపించేటట్లు చేసింది. ఇలా మీడియా పక్కదోవకు వెళ్ళిపోతే దేశం ప్రగతిని కోల్పోయి ప్రమాద పరిస్థితుల్లోకి జారి పోవడం ఖాయం. ప్రజలు ఆదరించారు, కావాలనుకున్నారు కాబట్టి ప్రచురించాం, ప్రసారం చేశాం అంటారు మీడియా బాస్‌లు. ఇది పచ్చి మోసం. ఉన్నవి లేనట్లు, లేనివి వున్నట్లు చూపి ఏదో క్రొత్త విషయాన్ని ప్రజల ముందుకు తీసుకు రావాలనే తపనతో మంచికన్నా చెడు ఎక్కువగా కనబడుతోంది. ఈ కారణంగా మీడియాపై గౌరవం తగ్గిపోతుంది.

ఇక మన స్వర్ణదీపిక పత్రిక విషయానికొస్తే ఎప్పుడూ తను ఎన్నుకున్న క్రైస్తవ బడుగు, బలహీన వర్గాల జనచైతన్యం కోసం అహర్నిశలు కృషి చేస్తూనే వుంది. క్రొవ్వొత్తి చిన్నదే అయినా దాని వెలుగు విస్తృతం. స్వర్ణదీపిక కూడా అంతేనని సగర్వంగా చెప్పగలను.

ఇంతటి మహోన్నతమైన ఆశయంతో నడిపిస్తున్న ఈ పత్రికకు ఎందరో కవులు, రచయిత(త్రు)లు వారి కలం ఊత స్వర్ణదీపికకు వెన్నుదన్ను. ఆ విధంగా స్వర్ణదీపిక పరిచర్య ఆంధ్రప్రదేశ్‌లో ఎందరినో రచయితలుగా తీర్చిదిద్దింది. మరెందరో వర్ధమాన మన రచయితల్ని ప్రోత్సహించింది. క్రైస్తవ కవిసమ్మేళనాలు, సాహితీ సదస్సులు, క్రైస్తవ శంఖారావాలు ఘనంగా నిర్వహించింది. క్రైస్తవ ప్రముఖులెందరినో సముచితంగా సత్కరించింది. జాతీయ విపత్తులు సంభవించినప్పుడు మొక్కవోని ధైర్యంతో చేతనైనంత పరిచర్య చేసింది. మతోన్మాదుల దాడులని ఏకరువు పెట్టింది. బాధితుల కన్నీటి గాధల్ని పెద్దగొంతుకతో విన్నవించింది. క్రైస్తవుల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేసింది. పోరాటం కొనసాగిస్తూనే వుంది.

ఈ క్రమంలో ఎన్నో నిందల్ని, దూషణ భూషణల్ని భరించింది. గాయాలెన్ని సలుపుతున్నా, నెత్తురోడుతున్న కాళ్ళతో క్రైస్తవ జనపక్షపాతిగా వరుగు పెడుతూనేవుంది. నేనులేకుండా స్వర్ణదీపిక లేదు. స్వర్ణదీపిక లేకుండా నేనూ లేను. కన్నీటి జలధారల సుఖం ఎవరికి తెలుసు? నాకు తప్ప. అందుకే నేనెప్పుడు సంతోషంగా ఉంటాను. బ్రతకటం కోసం కావలసిన సమస్తాన్ని నా ప్రభువు నాకిస్తున్నాడు. ఆయన పనికోసం సమస్తం నన్ను సమకూర్చుకుంటున్నాడు. అది ఆయన వల్లే సాధ్యం. నా ప్రభువు నన్ను పుట్టుకతోనే సంపన్నుడుగా చేశాడు. ఇహలోకానుసారం అయితే కాదు.

అధ్యాయం 10

ముగింపు లేఖ, కృతజ్ఞతలు

"బ్రతకలేనివాడు బడి పంతులన్నట్టి కాలమానమందు గడపినాను, నా ముగింపు కథకు నాంది పల్కినయట్టి స్వర్ణదీపికకు వందనంబు" అన్న శ్రీ బూదాల ఆదాం సహజకవి నిర్వేదంతో వ్రాసిన ఆ పద్యంతో పాటు, ఆయన వ్రాసిన పోస్టుకార్డుపై వ్రాసిన మాటలు ఇవి.

"ఎడిటర్‌గారు! చివరిమజిలీలో ఉన్నాను. నా ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుంది. ఎప్పుడు రాలిపోతానో తెలియదు. మీ ప్రార్థన, పాఠకుల ప్రార్థన, నన్ను బలపరుస్తుందని తలంచుతాను. అయ్యా నేను నిరుపేదను, వృద్ధుడను, చూపుపోయింది. షుగరు, బిపితో బాధపడుతున్నాను. వైద్యములేదు. ఏ పద్యము చివరిదవుతుందో చెప్పలేను. చివరి ఊపిరి వరకు కలము పట్టి చనిపోతాను. ప్రార్థించండి."

శ్రీ బూదాల ఆదాము కవిగారి ఈ చిట్టచివరి ఉత్తరం నన్ను కలచివేసింది. ఆ నెలలో జరిగిన స్వర్ణదీపిక పదవ వార్షికోత్సవంలో విజయవాడ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న కవిగారిని బంధువుల డాక్టర్ గారి అనుమతితో, సభకు తీసుకువచ్చి సభలో సన్మానించి, క్రైస్తవ వేమన బిరుదునందించి, చేయగలిగినంత ఆర్థిక సహాయం అందించింది స్వర్ణదీపిక. నాకు ఆదాము కవిగార్కి ఉన్న సంబంధం తండ్రి కొడుకుల సంబంధంగా భావిస్తాను. ఆ తదనంతరం కొన్ని దినాలకే ఆయన ప్రభువునందు నిద్రించారు.

కవిగారు నన్ను గూర్చి, స్వర్ణదీపిక పత్రికను గూర్చి ఒక పద్యాన్ని వ్రాసి నాపై ఆయన పెంచుకున్న అభిమానాన్ని ఇలా కొనియాడారు:

"ఏ తల్లి చనుపాలు నిచ్చి పెంచెనో గాని క్షత్రియ కులగట్టు గడపదాటె, ఏ తండ్రి మమతలో నెదిగిపోయెనో గాని తాత తండ్రుల ప్రేమ తలుపు దాటె, ఏ ఇంతి కౌగిట నిమిడి పోయెనో గాని కట్టు బొట్టు నియమ కంచె దాటె, ఏ వంశ శిఖరంబు నెక్కిపోయెనో గాని వీర లక్ష్యపుటంబు విడిది దాటె, అతడు శివరాజు పేదలకాతృ బంధు, మహిమ శిలువను మోయగ మరలినాడు, అతని స్వర్ణదీపిక వాణి ఆకసంబుపైకి మెదిగి పోవుట సత్యమే యేసునందు."

ఇంతటి అభిమానం స్వర్ణదీపిక పాఠకులను, కవులను, రచయిత(త్రు)లను చూరగొందంటే అది దేవునికృప మాత్రమే.

ఆరాధన భక్తి ఛానల్‌తో స్వర్ణదీపిక ప్రయాణం, రెండు వేల సంవత్సరం నుండి రెండు వేల ఇరవై వరకు అనేక గౌరవ సత్కారాలు, సన్మానాలు, క్యాష్ అవార్డ్స్ పొందింది. గుంటూరు జిల్లా తాడేపల్లి సుందరయ్య నగర్ కట్టమీద దైవ సన్నిధి సంఘు కావరిగా 1996 నుండి కొనసాగుతూ ఉన్నాను. ప్రస్తుతం పేద ప్రజలతో కలిసి వారి సామాజిక, ఆధ్యాత్మిక అభివృద్ధిలో భాగస్వామిగా ఉంటూ, అన్నయ్య సుబ్బరాజు గారు, ఆత్మానంద రాజు గారు స్థాపించిన దైవ సన్నిధి సంఘానికి నేను, నా భార్య పద్మావతితో కలసి సేవ చేస్తున్నాము.

క్రైస్తవ మార్గదర్శకమైన సంఘ సేవలో ముందుకు వెళ్ళాలనే నా తలంపుకు ఆర్థిక సమస్య పీడిస్తున్నా, దేవునిపై భారం వేసి పెనుగులాడుతూ సాగిపోతు ఉన్నాను. మా సంఘ ఆత్మీయ ఎదుగుదలకు, చర్చి స్థలం, నిర్మాణం కొరకు ప్రార్థించండి.

🎙️ Narrated in Telugu using AI text-to-speech — not a recording of Pastor Bellamkonda Shivaji Raju’s own voice.