పరిచయం
మంచి క్రైస్తవ కుటుంబంలో జన్మించాను. అమ్మ నాన్నల వైవాహిక జీవితంలో నేను ఒక సంవత్సర వయసులో ఉండగా, చెల్లి మా అమ్మ కడుపులో ఉండగా వారు విడిపోయారు. బంధువులెవ్వరు అమ్మను ఆదుకోలేదు. అమ్మ కూడ ఎవరి సహాయం కోరలేదు. అమ్మ టీచరుగా పని చేస్తూ మమ్మలను కష్టపడి పెంచారు. నేడు అమెరికాలో ఇంజనీరుగా స్థిరపడి భార్యాబిడ్డలతో జీవిస్తూ రక్షణ పొంది ఆత్మల జాలరిగా ఉన్నాను.
యెహోవా నాకాపరి, నాకు లేమి కలుగదు. కీర్తనలు 23:1.
పరిచయము:
ప్రభువు దివ్య నామములో మీకు శుభములు. నా పేరు చార్లెస్ ప్రవీణ్. నా జీవిత అనుభవాలు పుస్తక రూపంలో చేర్చుటను బట్టి దేవుడిచ్చిన విలువైన ధన్యతకై దేవున్ని స్తుతిస్తున్నాను. నేను 1973 అక్టోబర్ 8వ తేదిన జన్మించాను. నా జీవితంలో క్రీస్తును ఏ విధంగా తెలుసుకున్నానో, ఏ విధంగా క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించానో, నా జీవితంలో దేవుడు చేసిన మేలులన్నీ సాక్ష్యం ద్వారా మీకు వివరించాలని ఆశిస్తున్నాను.
నా బాల్యములో నా తల్లిదండ్రులు అనుకోని రీతిగా విడిపోవుట జరిగింది. నాటికి నేను కేవలం ఒక సంవత్సరం వయసు గలవాడిని అని అమ్మ ద్వారా విషయం తెలిసింది. నా చెల్లి మా తల్లి గర్భంలో ఉన్నది. నేను, చెల్లి, నాన్న తోడు లేకుండా గడిపాము. ఆ స్థితిలో నెల్లూరు ప్రాంతం చేరి మా అమ్మ ప్రైవేట్ స్కూలులో ఉపాధ్యాయినిగా పని చేసారు. మా తాతగారింటికి చేరాము.