✨ Testimony

Acharya RRK Murthy — Life Testimony

“నేను - నా ప్రభువు” — ఆచార్య ఆరార్యే మూర్తి దంపతుల రక్షణ సాక్ష్యం

Read the life testimony of Acharya RRK Murthy (born Rayasam Radhakrishna Murthy), a scholar raised in an orthodox Telugu Brahmin family who came to Christ in 1955 and went on to found a long-running Telugu radio ministry and the Spandana monthly magazine — in 14 chapters, in Telugu or English, told in his own words, with his wife Smt. Varalakshmi Araarye's own testimony as the closing chapter. Full text is ready now in both languages; audio narration is being prepared.

Read the original booklet నేను - నా ప్రభువు — the printed 34-page Telugu booklet this page is transcribed and translated from (updated edition, publ. Spandana / Devasahayam Dandala, Vijayawada).

🎧 పూర్తి ఆడియోబుక్ వినండి

అన్ని 14 అధ్యాయాలు ఒకే ఫైల్‌లో, అధ్యాయాల మధ్య చిన్న విరామంతో. (ప్రస్తుతం సిద్ధం చేస్తున్నాము.)

అధ్యాయం 1

మా వూరు — మా వంశం — నా బాల్యం

source pp. 5-6

మా వూరు

మా వూరు గోవిందపురం. గుంటూరుజిల్లా నర్సారావుపేట తాలూకా, చిలకలూరిపేట రోడ్డు ప్రక్కగా వున్న కుగ్రామం. నేను పుట్టి పెరిగింది సాంప్రదాయిక నిష్ఠాగరిష్టమైన శ్రోత్రీయ బ్రాహ్మణ కుటుంబంలో. మా నాన్నగారి పేరు రంగనాయక శర్మ. అమ్మగారు కామేశ్వరమ్మ. అయిదుగురం అన్నదమ్ములం. అందరిలో నేను కడగొట్టువాడ్ని. నా పూర్తిపేరు రాయసం రాధాకృష్ణ మూర్తి. హరితస గోత్రం. పూర్వీకులు వైష్టదేవం, అగ్నిహోత్ర పూజ చేసేవారు. ఆర్వేల నియోగిశాఖ. ఇలవేల్పులు వీరభద్రుడు, భద్రకాళి.

వెంకట సుబ్బారావు, సత్యన్నారాయణ, విశ్వనాధం, కల్యాణ రామమూర్తి, వీరు నా అన్నలు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాను. చితికి పోయిన మధ్యతరగతి కుటుంబం. అక్కయ్య లిద్దరు, లక్ష్మీదేవమ్మ, శకుంతల.

మా నాన్నగారికి కోటప్పకొండ ధర్మకర్తృత్వం వుండేది. కవుల కుటుంబం. రాయసం వారు పూర్వం రాజుల ఆస్థానాలలో లేఖికులు, కవులు.

పెండ్లిండ్లకు, పండగ పబ్బాలకు వీరభద్రుడి పల్లె పెడతారు. ప్రతి కుటుంబంలో జేష్టుడికి వీరభద్రుడని, జేష్టురాలైతే భద్రమ్మ అని పేరు పెట్టటం అనవాయితీ. మా నాన్నగారి ద్వితీయ కళత్రానికి పుట్టామయ మేము. ప్రథమ భార్యకు వీరేశ్వర శర్మ, మహలక్ష్మమ్మ, దుర్గ అని ముగ్గురు సంతానం.

మా వంశం

మా వంశంలోనే కర్తీకం వుంది. కొత్తగా గ్రామ కరణాలకు సర్వే నేర్పించటానికి తహసీల్దార్లు తరగతులు పెట్టినప్పుడు సర్వేదండకమని మా పెదనాన్నగారు వ్యంగరచన చేశారు. మా నాన్నగారు అంతగా కవిత్వం రాయలేదు, గాని సంస్కృతాంధ్రాలలో పాండిత్యం గడించారు. కోర్టు వ్యవహారాలలో మద్రాసు వరకూ వెదుతూ వుండేవారు. తమిళంలో కూడా పరిచయం వుంది.

నా బాల్యం

నా బాల్యం అంతా గోవిందపురంలోనే గడిచింది. మత వాతావరణం. కదిలితే మెదిలితే పూజాపునస్కారాలు. జనార్ధనుడు, ఆంజనేయుడు, శివుడు, వీరభద్రుడు గ్రామ దేవళ్ళు. చాళుక్యుల కాలంలో నిర్మించిన వీరభద్ర దేవాలయం, నా బాల్యంలో అది శిథిలావస్థలో వుంది. మా నాన్నగారికి అయిదుగురు సోదరులు. పెద్దవాడు "కరణికోద్యోగ సంకలిత సత్‌ప్రవర్తి భద్రాత్ముడు వీర భద్ర మంత్రి" అలాగే నాలుగో పెదనాన్న "శంకరాచార్య కృతభష్య జాల వేది రమ్య సద్గుణ వేంకటరమణ సచివుడు". మా నాన్నగారేమో "అమర రంగ నాయక బుధుండు" ఈ విధంగా కవిత్వమో తమను తాము పరిచయం చేసుకున్నారు.

అధ్యాయం 2

మా అమ్మగారు — చిన్ననాటి వ్యాసంగాలు

source pp. 7-8

మా అమ్మగారు

మా అమ్మగారికి చదవను రాయను రాదుగాని, నాన్నగారి ద్వారా శ్రుతపాండిత్యం అలవడింది. ఆమె ఆచారం, మడి, దేవతార్చన జపతాపాలు ఏకాదశి ఉపవాసాలు, ప్రతి యేటా పెట్టే అష్టికాలు తద్దినాలు వీటితో సతమతమైపోతూ వుండేది. మా నాన్నగారు అకస్మికంగా చనిపోటంతో మాకుటుంబం ఆర్థికంగా ఎన్నో కష్టాలు ఎదుర్కోనవలసి వచ్చింది.

మా నాన్నగారు సంస్కృత పండితుడు. ధ్యానశ్లోకాలు, భగవద్గీత భాష్యాలు వల్లిస్తూవుండేవారు. మా అమ్మగారికి చదవటం, రాయటం రాదు. సంతకం మాత్రం ఎలాగో చేసేది. అయినా వినికిడి చేత ఎన్నెన్నో వేదాంత రహస్యాలు ఆమెకు తెలుసు.

అతికష్టముమీద నర్సరావుపేటలో హైస్కూలు చదువు ముగించి గుంటూరు ఆంధ్రక్రైస్తవ కళాశాలలో పై చదువుకు వెళ్ళాను. ఆరోగ్యం బావుండక రెండు సంవత్సరాలు చదువుకు అంతరాయం కలిగింది.

చిన్ననాటి వ్యాసంగాలు

నాకు చిన్నప్పటినుంచీ ఇంగ్లీషు, తెలుగు భాషలలో అభిరుచి ఎక్కువ. తెలుగులో కవిత్వం రాసేవాడ్ని. ఏవేవో పద్యాలు, పాటలు రాసి తోటి విద్యార్థులకు వినిపించేవాడ్ని. చిన్నతరహా అష్టావధానాలు గూడా చేశాను. విద్యార్థిగానే అసువగా పద్యాలు చెప్పటం అభ్యసించాను. తరగతిలో ఉత్తమ విద్యార్థినని పేరుంది గాని పరోక్షంగా అల్లరి చేసేవాడ్ని. రాజకీయాల్లో గూడా తలదూర్చి క్విట్ ఇండియా వుద్యమ సమయంలో తోటి స్నేహితులతో కలిసి వాల్ పోస్టర్లు అంటించడం మొదలైన పనులు చేశాను.

అధ్యాయం 3

వ్యతిరేక వైఖరి — అతిభక్తి — విద్యాభ్యాసం — అనారోగ్యం

source pp. 8-9

వ్యతిరేక వైఖరి

చిన్నప్పటినుంచీ క్రైస్తవులన్నా, బైబిలన్నా చాలా తేలిక అభిప్రాయం వుండేది. క్రైస్తవం విదేశీ మతం. మతంలేని నిమ్న కులాలకు యిదొకటి దొరికింది! అయినా యీ క్రైస్తవం హస్యాస్పదమైన మతమని హేళన చేసేవాడ్ని.

గ్రామ బోధకులకు అడ్డదిడ్డ ప్రశ్నలు వేసి సతాయించే వాడిని. చిన్నప్పటినుంచి క్రైస్తవులు వూరిబయట వుండే వారని, వారు తప్పు యీ క్రైస్తవాన్ని ఎవరు చేపట్టరని వ్యాఖ్యానించే వాడిని. మత గ్రంధాలు ఎన్నో వున్నాయి. అయితే వాటిలో బైబిలు చౌకబారు గ్రంధం. అది చదవాల్సిన అవసరమే లేదనుకున్నాను. ఇలాంటి మనోభావాలతో నేను పెరిగాను. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు సైతాను గుడ్డితనం కలిగిస్తాడంటే.

అతిభక్తి

చిన్నప్పటినుంచి అతిదేవతా భక్తిలో పెరిగాను. శంకరాచార్యుని స్తోత్రశ్లోకాలు నాకు కంఠతా వచ్చు. నా బాల్య స్నేహితుడు నాగేశంతో కలిసి చిన్నప్పుడు ఆడుకునేవాడిని. తపస్సు చేయటం, దేవుడు సాక్షాత్కరించటం యిలాంటి ఆటలు మా ఇష్టం. రావణుడి శివస్తోత్రం ఏకవీరిగిని వల్లించేవాడిని. మమ్మల్ని చూచి మా అమ్మగారు ఆశ్చర్యపోయేది.

గోవిందపురంలో మా యింటికి ఎదురుగా ఓ నంబి కుటుంబం వుండేది. ఎక్కువగా వాళ్ళ యింట్లో వుండేవాడిని. చదువు అంతగా కష్టపడకుండా సునాయాసంగా నాకు వచ్చింది. అయినా చదువు మీద శ్రద్ధ లేదు. కొన్నాళ్ళకు రెవిన్యూ డిపార్టుమెంటులో వుద్యోగం చేశాను. అది వది లేశాను. ఎక్కడా నిలకడలేదు. మానసికంగా అసంతృప్తి. ఆత్మ శాంతి లేదు. శివానంద సరస్వతి రచించిన వేదాంత గ్రంధాలు ఎన్నెన్నో చదివాను.

విద్యాభ్యాసం

నేను నరసరావు పేట హైస్కూల్లో చదువుకుంటున్నప్పుడు నతనయేలు అనే క్రైస్తవుల అబ్బాయితో స్నేహమైంది. అతడికి కవిత్వం పిచ్చి ఎక్కువ. యేసు ప్రభువు చెప్పిన ఉపమానాలు, ఆయన ప్రబోధాలను పద్యాల్లో రాసి తెచ్చేవాడు. నేను సరిచేసి పెట్టేవాడిని. నాకు నతనయేలు మంచి స్నేహితుడు కాని అతడి మతం – నాకు అసహ్యం, అయినా అతడి ఎదుట నేనేమీ విమర్శించేవాడిని కాదు.

అనారోగ్యం

సరే, నేను ఇంటర్‌మీడియేట్ చదువుతూ మానేసి, ఆరోగ్య కారణాన్ని బట్టి కాకినాడలో మా అన్నయ్య దగ్గరికి వెళ్ళాను. ఆయన ఫారెస్ట్ డిపార్ట్‌మెంటులో వుద్యోగం చేసేవాడు. మా పెద్దక్కయ్య బాల్య వితంతువు. మా అన్నయ్య దగ్గిరే వుండేది. నేనూ అక్కడే వుంటూ వుండగా నేనూహించని ఓ సంఘటన జరిగింది. సూత్రాల శేషగిరిరావుగారని ఒకాయన మా యింటికి వచ్చాడు. ఆయన మధ్వబ్రాహ్మణుడు. విదేశీయులకు తెలుగుభాష నేర్పుతున్నాడు. పాశ్చాత్య మిషనరీల మధ్య ఆయనకు మంచి పేరుంది. గొప్ప ఉపాధ్యాయుడు.

అధ్యాయం 4

మిషనరీల స్నేహం — చిన్న పెద్ద పుస్తకం

source pp. 10-11

మిషనరీల స్నేహం

మాటల సందర్భంలో శేషగిరిరావు నా విషయం ప్రస్తావించాడు. తనకు అసిస్టెంటుగా మిషనరీలకు తెలుగు నేర్పేందుకు నన్ను పెట్టుకుంటానన్నాడు. నేను సరే అన్నాను. మా అన్నయ్య వొప్పుకున్నాడు. తెల్లదొరలకు తెలుగు నేర్పుతూ కాకినాడ, రామచంద్రాపురం, ఉటి, కొడైకెనాలు ప్రాంతాలన్నీ తిరిగాను. వారికి తెలుగు నేర్పేటం నా పని, వ్యాకరణం నేర్పాలి. తెలుగులో వారితో సంభాషణ చేస్తూ వుండాలి. యోహాను సువార్త నాకివ్వబడిన వాచక పుస్తకం.

చిన్న పెద్ద పుస్తకం

ఆ చిన్న పుస్తకం చదివాను. అంతగా యిష్టం లేకపోయినా, ఉద్యోగం కోసం బలవంతాన చదివాను. మొదట అందులో భాష విలక్షణంగా వున్నట్టు తోచింది. ఇంగ్లీషులో యోహాను సువార్త చదివి దాన్ని తెలుగులో సరిపోల్చుకని అర్థం చేసుకున్నాను. ప్రతి వచనం చదివి భాషాపరంగా ప్రతిపదమూ విడదీసి వ్యాకరణం నేర్పుతూ వుంటే దొరులు ఆశ్చర్యపోయారు. ఒక దొర నాతో అన్నాడు. "యువకుడివి. మంచి అనుభవమున్న ఉపాధ్యాయుడిలాగా యోహాను సువార్తలోని పాఠాలు మాకు నేర్పుతున్నావు. అభివృద్ధిలోకి వస్తావు". మరో దొర నన్ను ఏకాంతంగా చిక్కించుకని "నీవు చదివి చెబుతున్నావే, ఈ యోహాను సువార్తనే గనుక నీవ నమ్మితే, తెలుగుదేశంలో మేటి బోధకుడు వవుతావు! దేవుడు నిన్ను దీవిస్తాడు" అన్నాడు.

అధ్యాయం 5

ప్రవచనం — సంఘర్షణ — తప్పెవరిది? — మిషన్ కాంపౌండు రాజకీయాలు

source pp. 11-13

ప్రవచనం

కొందరు దొరలు నన్ను "సెమినరీకి పంపిస్తాము వెడతావా?" అనడిగారు. నేను నవ్వి "చివరికి నేను క్రైస్తవ బోధకుణ్ణ అయ్యేది" అన్నాను. అయితే దేవుని సంకల్పంలో నేను బోధకుణ్ణే. మరో దొర ప్రవచనం చెప్పాడు గూడా. "ఒకానొక రోజున నీవు సువార్తను ప్రకటించే గొప్ప ప్రసంగికుడివి వవుతావు." నిజం – ఆ ప్రవచనమే నెరవేరింది.

యోహాను సువార్తను ఎన్నో వందల సార్లు చదివాను. మిషనరీలు చేత చదివించాను. అందులో ఏ అధ్యాయంలో ఏముందో నాకు తెలుసు. కాని యేసుక్రీస్తు నా రక్షకుడు. ప్రభువు కాదు! క్రైస్తవం నాకక్కర్లేదు. క్రీస్తుకు నేను వ్యతిరేకినేమి కాను అనే వేదాంతం కల్పించుకున్నాను. క్రీస్తును నా హృదయంలోకి రానివ్వకుండా నా వూహలను సమర్ధించుకోవటానికి ఎన్నెన్నో తార్కిక వాదనలను తయారు చేసికున్నాను. యేసుక్రీస్తు వాక్యేడే దేవుడు కాదు. ఏ దేవుడిని నమ్మినా వొకటే. దేవుళ్ళమధ్య పోటీ ఏమిటి? ఏ దేవుడు గొప్పవాడు అని మనకెందుకువాదం? అందరూ ఒకటే అనుకుంటే సరి పోతుందిలే అనుకున్నాను. మతాల మార్పిడి తప్పు. అని మిషనరీలతో వాదించాను. దేవుని అవతారాలెన్నెన్నో! యేసుక్రీస్తు ఒక అవతారం అనంత వరకూ వచ్చాను. మిషనరీలు నన్నెంతో ప్రేమించారు. నేనెంత విమర్శించినా ఏమీ అనేవారు కారు.

వారి దగ్గర వున్న పుస్తకాలెన్నో చదివాను. తద్వారా జ్ఞానం వృద్ధి అవుతుంది అనుకున్నాను. యేసును అంగీకరించి క్రైస్తవుడ్ని అవుతానని నేను కలలో గూడా వూహించలేను. కాని, దేవుని సంకల్పం నా పట్ల మరోలా వుంది. మిషనరీలు వేలకొలది మైళ్ళువచ్చి భాషనేర్చుకని ఇక్కడి ప్రజలకు యేసుక్రీస్తు సువార్త బోధిస్తున్నారే? వీరి దీక్ష ప్రశంసనీయం అనుకున్నాను. అప్పుడప్పుడు నాకనిపించేది. ఎందుకని వీరప్పుడూ వూరి బయట నిమ్నజాతుల మధ్య వుండిపోతారు? అది నాకు అర్థం కాలేదు. యేసు అందరికి ప్రభువంటూ, నిమ్నకులాస్తుల మధ్య వుండి పని చేస్తారేమిటి? అని అడగాలనిపించేది గాని ఎవరినీ ఆ ప్రశ్న అడగలేదు.

సంఘర్షణ

నాలో అనిర్వచనీయమైన సంఘర్షణ మహబూబ్ నగర్‌లో వుండగా మొదలైంది. హెచ్.జె. క్రాన్ అనే మిషనరీతో నాకు సన్నిహిత సహవాసం వుండేది. ఆయనా, నేను ప్రతిరోజూ గంటల తరబడి ఆధ్యాత్మిక విషయాలు చర్చించుకొనే వాళ్ళం. ఆయనతో నా సంభాషణ నాకు గొప్ప ఆశీర్వాదంగా పరిణమించింది. జటిలమైన ధియాలజీ సత్యాలు కరతలామలక మయ్యాయి.

తప్పెవరిది?

ఈ సందర్భంలో నేనో మాట చెప్పాలి. బైబిలులో తప్పులు పట్టుకుందామని చదివాను. బైబిలే నన్ను చదివి నాలో తప్పులు పట్టుకున్నది. బైబిలు మామూలు పుస్తకమైతేగా! అది దైవావేశం వల్ల కలిగిన లేఖనం. దేవుని ముఖ నిర్గతమైన మాట జీవప్రదం. ఆధ్యాత్మిక శస్త్రచికిత్సా సాధనం.

మిషన్ కాంపౌండు రాజకీయాలు

మిషనరీ లందరికి తెలుగు నేర్పాను. వారిని తెలుగు పరీక్షలకు సిద్ధపరిచాను. వారికి సంభాషణ, వ్యాకరణం నేర్పాను. యోహాను సువార్తలోని సారాంశమంతా వారికి నేర్పి, వారి చేత మాట్లాడించాను. మిషను కాంపౌండులోనే కాపురమున్నాము.

ఆ కాంపౌండులో ఒక మిషనరీ, అతని చుట్టూరా కొన్ని క్రైస్తవ కుటుంబాలు, ఒక బడి, ఒక గుడి, ఆసుపత్రి. మిషనరీ చుట్టూ ఉపగ్రహాలు కొన్ని తిరుగుతూ వుంటాయి. మిషను కాంపౌండు రాజకీయాలు ఒక పట్టాన ఎవరికీ అంతు పట్టవు. మిషనరీ ఆసరా చూసుకొని కొందరు అధికారం చెలాయించటం, ఒకరి మీద ఒకరు మిషనరీకి చాడీలు చెప్పటం – యిదంతా చూస్తువుంటే నాకంతా అయోమయంగా కనిపించింది. అయినా క్రైస్తవ సందేశం నా హృదయాన్ని ఆకట్టుకుంది. క్రైస్తవులను సానుభూతితో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను.

పరాయి దేశం నుంచి వచ్చిన మిషనరీ వూరికి దూరంగా ఓ బంగళా కట్టుకుంటాడు. అతడికి పనివారు కావాలి. వంట పని, తోట పని చెయ్యడానికి కొన్ని కుటుంబాలు కాంపౌండులో నివాస మేర్పరచుకని వుంటాయి. తరువాత మిషను సంస్థల్లో పని చేసే ఉపాధ్యాయులు, నర్సులు, డాక్టర్లు అదే కాంపౌండులో కాపురముంటారు. నేను వారిమధ్య కొంతకాలం వున్నాను.

అధ్యాయం 6

వాక్య పఠనం — పరివర్తన — సైతాను చర్యలు — బేరీజు

source pp. 14-16

వాక్య పఠనం

నారాయణ పేటలో కొన్నాళ్ళు కుటుంబంతో వున్నాను. దేవుని వాక్యమైన బైబిలును సునిశితంగా పరిచించాను. ఆలోచిస్తువున్నాను. ఎన్నో వ్యాఖ్యానాలు చూచాను. బైబిలు సత్యం నన్ను ముద్దాయిగా నిలబెట్టింది. బైబిలు మామూలు పుస్తకం కాదని, అందులో శక్తిభరితమైన సత్యం వుందని గ్రహించడానికి కొన్ని సంవత్సరాల కాలం పట్టింది. నారాయణ పేటలో "క్రాన్" అనే మిషనరీకి తెలుగు నేర్పుతూ వున్నాను. ఆ వూరు ఆర్యసమాజ కేంద్రం. అక్కడ వుంటూ వుండగా నాలో అనిర్వచనీయమైన పరివర్తన అంచెల వారీగా వచ్చింది.

పరివర్తన

క్రైస్తవుల బలహీనతలను తీవ్రంగా విమర్శించే నాలో వారి పట్ల ప్రేమ, సానుభూతి కలగసాగాయి. గ్రామీణ బోధకులతో గంటల తరబడి గడిపేవాడిని. వారు చెప్పేదంతా ఓపికగా వినేవాడిని. వారికీ నాకూ గాఢస్నేహం ఏర్పడింది. వారి అమాయకతను, క్రీస్తునందలి ప్రేమను గుర్తించాను. నైతికంగా బలహీనులే అయినా క్రీస్తునీతిని నమ్ముకున్న ఈ ప్రజలపై నాకు ఆదరాభిమానాలు కలగజొచ్చాయి.

సైతాను చర్యలు

రెండు మూడు సార్లు సైతాను నాలో క్రీస్తుపట్ల లేనిపోని అపోహలు పుట్టించాడు. నేను వెళ్ళిపోయేటట్టు చేశాడు. అయినా మళ్ళీ వచ్చేశాను. నా అంతరాంతరాలలో తీవ్ర సంఘర్షణ మొదలైంది. యేసు ప్రభువులోని అయాస్కాంతపు ఆకర్షణ ఒక చెంప, నా బంధుమిత్రాదులపై మమకారం ఒక చెంప. ఈ విధంగా నాలో ద్వంద్వయుద్ధం మొదలైంది. యేసుక్రీస్తు నన్ను పూర్తిగా కోరుతున్నాడు. నేనాయనకు సంపూర్ణంగా వశమైపోతే నా బంధువులకు దూరమైపోతాను. అటా, ఇటా, ఎటూ తోచని పరిస్థితి ఏర్పడింది. ఒకరోజు వూరి బయటికి వాహ్యాళిగా ఓ గట్టుపైకి ఎక్కి వెళ్ళాను. ఎంతోసేపు అక్కడే కూర్చుండి పోయాను. తీవ్రంగా తలపోశాను. క్రీస్తును అంగీకరిస్తే వచ్చే నష్టాలు, నిరాకరిస్తే వచ్చే కష్టాలు అంచనా వేసుకున్నాను.

బేరీజు

బంధువులు, బలగము నన్ను హేళన చేస్తారు. నిమ్నజాతులలో కలిసిపోయానని ఆడిపోసుకుంటారు. వారితో కలిసిపోతే తప్పేమిటి? రాజకీయాలలోనైతే ఇలాంటి త్యాగానికి గొప్ప పేరొస్తుంది. కాని క్రీస్తు విషయంలో యిది ఒక నిందగా పరిణమిస్తుంది. ఎందరో రాజకీయ నాయకులు నిమ్న జాతులలో తిరిగి గొప్ప నాయకులయ్యారు. కాని క్రీస్తు కోసం ఇది నాకు మోయవలసిన సిలువ అయింది. అయితే మటుకేం? క్రీస్తు కోసం నిమ్నజాతివాణ్ణే అవుతాను. అందరూ నన్ను అలాగే విమర్శించని్యి. అదే నాకు ఆత్మానందం. ఆత్మశాంతి.

అధ్యాయం 7

అంతస్సంఘర్షణ — నాలో నేను — మతంకాదు జీవం — సాక్షాత్కారం

source pp. 16-18

అంతస్సంఘర్షణ

సరిగ్గా యిప్పటికి 50 సంవత్సరాలు. 1955వ సంవత్సరం. ఆ రాత్రి నా జీవితంలో మరుపురానిది. అంతరాంతరాలలో చెప్పశక్యం కాని వ్యథ మొదలైంది. క్రీస్తు కోసం శిబిరం వెలపలికి వెళ్ళి నింద భరించడానికి నా ఆత్మ భయపడుతోంది. గజగజ వణికిపోయాను. నాలోని నవనాడులు కుంగిపోయాయి. పడకలో అటూ యిటూ పొర్లాడాను. అర్థరాత్రి భరించరాని శిరోవేదన మొదలైంది. అలాగే కునుకు పట్టింది. అది స్వాప్నిక అవస్థ. నాలోని మనిషితో నేనే తర్కానికి వ్యపక్రమించాను.

నాలో నేను

"నువ్వు యేసుకు విద్యార్థివి, శిష్యుడివి కావు." "ఎందుకు కానను? జ్ఞాన సముపార్జన చాలదా." "చాలదు. శిష్యుడు గురువు కాడిని మోయాలి." "శిష్యుడు కావాలంటే అంత వెల చెల్లించాల్సిందేనా?" "అది నావల్ల కాదు" "వెల చెల్లించందే శ్రేష్టమైంది దొరకదు."

ఈ విధంగా నేను మనసులోని మనసుతో ఎంతో రభసపడ్డాను. ఎటుపాల్పోవటం లేదు. క్రైస్తవంలో ఆకర్షణీయమైంది ఏదీ లేదు. కాని జాగ్రత్తగా వెతికితే బైబిలులో క్రీస్తు సాక్షాత్కరిస్తాడు! మతపుదిబ్బల్లో క్రీస్తును పూడ్చిపెట్టారు. అందుకే నాబోటి వారికి క్రీస్తును వెదకటం ప్రయాస అయిపోయింది. దీనికి బాధ్యులు క్రైస్తవ మతస్థులే అని నేను ఘంటా కంఠంతో చెబుతున్నాను.

మతంకాదు జీవం

మనుషులకు మతం కాదు జీవ మివ్వటానికి యేసు వచ్చాడు. నేటి అనుయాయుల్లో మతాలన్నీ మృతకళేబరాలు. క్రీస్తు సజీవుడు. సమకాలీనుడు. మతాతీతుడు. మత ప్రమేయంలేని క్రీస్తే నాకు కావాలి. అయనన్నే నేనారాధిస్తాను. అదే ఉత్కంఠ తీవ్రంగా నాలోబయలుదేరింది. ఎలాగైతేనేమి ప్రభువు కృపను బట్టి చివరికి తీర్మానం చేసుకోగలిగాను. "ఏది ఏమైనా సరే యేసూ, నువ్వేనా రక్షకుడివి ప్రభువువు." అంటూ నిర్ద్ధిష్టంగా చెప్పేసి లేచాను. ఉలికిపడ్డాను. నా అనుభూతినంతా మళ్ళీ పునర్విమర్శ చేసి చూసుకున్నాను.

సాక్షాత్కారం

ఆ మరునాటి రాత్రి నాకంటిపొరలు రాలిపోయినట్టు దర్శనం కలిగింది. ప్రభువు సాక్షాత్కారం పొందాను. గలతీ 2:20 నా హృదయ గుహలో మారుమోగింది. "నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి వున్నాను. ఇకను జీవించేవాడ్ని నేను కాదు. క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. ఇప్పుడు యీ శరీరంలో నేను జీవించే జీవితం నన్ను ప్రేమించి నాకోసమై తనను తాను అప్పగించుకున్న దేవుని కుమారునియందలి విశ్వాసం వల్లనే జీవిస్తున్నాను."

అధ్యాయం 8

కర్మ విముక్తి — పాప రేఖాగణితం — ఆధ్యాత్మిక జన్మం — బాప్తిస్మం

source pp. 18-20

కర్మ విముక్తి

ఈ వచనం నాకు ఆశీర్వచనమైంది. ఇందులో చావు బతుకుల అంతరార్థం నాకు బయలుపడింది. నేను క్రీస్తునందు వున్నాను. ఆయనతో సంయుక్తమయ్యాను. అంచేత ఆయనతో సిలువ వెయ్యబడిన అనుభూతి నాకు ప్రాప్తించింది. పాపిపైన క్రీస్తుతో సంయుక్తం కావటానికి ఆయనను అంగీకరించటం కృప. ఇది నా పాప కర్మకు విముక్తి, నా స్వార్థానికి మరణం. నేను లేను. క్రీస్తు నన్ను ఆక్రమించుకున్నాడు. ఇది నా జీవితం కాదు. క్రీస్తు నాలో వుండి జీవించే జీవితం. క్రీస్తు నాలోకి వచ్చాడు. పునరుత్థాన జీవితం ప్రసాదించాడు. నేను – నేను కాను. నాలోని క్రీస్తు తన జీవితాన్ని నాలో జీవిస్తువున్నాడు. చరిత్రలోని క్రీస్తు నా అనుభూతిలోకి అవతరించాడు. సిలువ వేయబడి తిరిగి జన్మించాడు. ఈ సత్యాన్ని నేను మననం చేసుకుంటున్న కొద్దీ నామీద నాకే కారుణ్యం కలిగింది.

పాప రేఖాగణితం

నాకున్న స్వార్థం మీద అసహ్యం, విద్వేషాలు కలిగాయి. నాలో మంచిదేది కనిపించలేదు. క్రీస్తు నాలోకి వచ్చిన బిందువువరకు నాగత జీవితమంతా ఎడతెగని ఒక పాప రేఖ. పాపపు పోడిగింపు. నా 30 సంవత్సరాల జీవితం పాపమే. క్రీస్తు లేని నా జీవిత భాగమంతా-పాపం. అప్పుడు సిలువ సందర్శనం చేసి సిలువ మీద క్రీస్తుకు చేతులు జోడించి ప్రథమంగా నమస్కరించాను.

ఆధ్యాత్మిక జన్మం

1955 సంవత్సరం సెప్టెంబర్ 26 నా ఆధ్యాత్మిక జన్మదినం. నేను నా తల్లి గర్భవాసన పుట్టినప్పుడు పాపిని. మొదటి పుట్టుకదినం చెప్పే తీర్పు యిదే. అయితే ఈ రెండో జన్మదినం నా పాప విముక్తిని ప్రచురిస్తుంది. క్రీస్తే నా విమోచకుడు. ఇది విజయం. నాలోని సంఘర్షణ అంతరించింది. నాకు ఇప్పుడు అంతా కొత్త. అదే రోజు హౌనీ క్రాన్ అనే సోదరుడికి తెలిగ్రామ్ ఇచ్చాను. ఆయన వచ్చాడు. "నేను క్రీస్తును నమ్ముకున్నాను. హృదయపూర్వకంగా ఆయనను విశ్వసిస్తున్నాను. దీనికి ఇలాంటి పరిణామం వచ్చినా వెనుదిరిగేది లేదు. నాకు బాప్తిస్మం ఇవ్వండి." అన్నాను. "ఇది అంతా ప్రభువు మహిమే. నిన్ను మేము నీ గురించి ప్రార్థించాము" అన్నాడు.

బాప్తిస్మం

"ఎందుకు నీకు బాప్తిస్మం?" అనడిగాడు.

"క్రీస్తు నా ఆధ్యాత్మిక భర్త. ఆయన మాట వినాలి. నమ్మి బాప్తిస్మం పొందమన్నాడు. ఆయనతో నా ప్రయాణంలో యిది మొదటి మజిలీ" అన్నాను. ఆ రోజు వర్షం భోరున కురుస్తోంది. లెక్క చెయ్యక అనుకున్న సమయానికి కొందరు బోధకులు వెంటరాగా నారాయణ పేటలో ఓ పెద్ద బావివద్ద బాప్తిస్మం దీక్ష తీసుకున్నాను. నాలో ఆత్మ తీవ్రత కలిగింది. క్రీస్తును పూర్తిగా అనుభవించటం కోసం నా హృదయం తహతహ చెందింది. నేను ప్రభువుతో సంయుక్తతా స్థితి పొందాను.

అధ్యాయం 9

విశ్వాస ఫలితం — నా భార్య

source pp. 20-21

విశ్వాస ఫలితం

విశ్వాసానికి నాలో సత్వరఫలితం కలిగింది. ఆత్మ నన్ను క్రీస్తు శరీరంలోకి ప్రవేశ పెట్టాడు. ఇది దివ్యానుభూతి. ఆయన వాగ్దానాలు నాలో నెరవేరుతున్నాయి. నూతన జన్మ, పరిశుద్ధత్మ నాలోకి రావటం, ముద్రించబడటం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇవన్నీ పరిశుద్ధత్మ నింపుదలలో సేవకు నన్ను ప్రేరేపించాయి.

నా భార్య

నా భార్య వరలక్ష్మి విషయం ఇక్కడ క్లుప్తంగా చెప్తాను. ఆమె కూడా శ్రోత్రీయ కుటుంబం నుంచి వచ్చింది. నేను ప్రభువును విశ్వసించిన తరువాత 4 సంవత్సరాలకు గాని ఆమె మనసు మారలేదు. ఎన్నో అభ్యంతరాలు ఆమెలో ముప్పిరి గొని వున్నాయి. విగ్రహారాధన సాంప్రదాయపు కటకటాలలో నుంచి విలికిరావటం అంత సులభం కాదు. కాని దేవుని ఆత్మ ఆమెలో పాపాన్ని గురించి, తీర్పును గురించి, నీతిని గురించి ఒప్పుదల కలిగించాడు. యోహాను 3:36 ద్వారా ఆమె రక్షణ పొందాను. నాకు వ్యతిరేకంగా వున్న తన వైఖరిని మార్చుకొని ప్రభువుకు విధేయత చూపి హైదరాబాదు నగరంలో బాప్తిస్మం తీసుకొని సేవలో నాకు సాటియైన సహాయం అయింది.

వేమము ఎన్నో ప్రాంతాలు పర్యటించాము. మహబూబ్ నగర్‌లో వుండి రేడియో సేవ ప్రారంభించాము. నాతో పాటు సేవ చేసింది. ఎందరో హిందూ స్త్రీలతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపి వారిని క్రీస్తు దగ్గరికి తెచ్చింది. క్రీస్తును బట్టి కలిగిన అనేక కష్టాలలో నాతో నిలిచి నాకు భాగస్వామిగా ఎంతో ఆదరణ, చేయుత యిచ్చింది. ఆమె కోసం దేవునికి సర్వదా కృతజ్ఞుడిని.

అధ్యాయం 10

విజయ సోపానం — సేవా దర్శనం — యజ్ఞోపవీతం — క్రీస్తు శరీరం

source pp. 21-23

విజయ సోపానం

దేవుడు మమ్మల్ని సేవలో విజయం నుండి అత్యధిక విజయానికి తీసుక వెడుతూ వచ్చాడు. పరిస్థితులను బట్టి దేవుని ఆజ్ఞ మేరకు మహబూబ్ నగర్ నుండి కర్నూలుకు అక్కడ నుండి గుంటూరుకు తరలి వచ్చాము. 1969వ సంవత్సరంలో మహబూబ్ నగర్ కల్వరి సంఘంలో నేను సేవకై అభిషేకించబడ్డాను.

సేవా దర్శనం

గుంటూరులో వుండగా హిందూ సోదరుల మధ్య సేవ చేయడానికి గొప్ప దర్శనం ప్రభువు చూపించాడు. రోమా 9:3 పదే పదే నాకు జ్ఞాపకం రాసాగింది. దేహ సంబంధులైన నా సోదరుల కోసం నేనేం చేయాలి? అనే ప్రశ్న ఎదురైంది. నా సమీప బంధువులెందరో క్రీస్తును గురించి అపోహలతో సతమతమవుతున్నారు. నేను క్రీస్తును ప్రైకెత్తుతాను. ఆయనే అనేకులను ఆకర్షించుకుంటాడు, అని సేవా దీక్షపూనాను. బ్రాహ్మణ్యం క్రీస్తుకు దూరంగా వుండిపోటం నాకు ఎముకలు విరిచినంత బాధ కలిగిస్తోంది. ఇంతటి ఆధ్యాత్మిక సంపత్తు క్రీస్తులో వుంటే లేని పోని అపోహలతో క్రీస్తును తిరస్కరించడం సబబుకాదు.

యజ్ఞోపవీతం

నేను యేసు క్రీస్తును స్వకీయ రక్షకుడుగా ప్రభువుగా అంగీకరించిన రోజున యీ పద్యం నా డైరీలో రాసుకున్నాను. అదే రోజు నా జందెం తీసివేశాను. ఉపనయనం రోజున నేర్చుకున్న సంధ్యావందనానికి స్వస్తి చెప్పాను.

క్రీస్తు శరీరం

"నాదు యజ్ఞోపవీతమే నీదు సిలువ ఆత్మ విప్లవ గీత మనర్గళంబు నాకు సంధ్యాస్తుతి వందనంబు దేవ!"

ఇప్పుడు నాకు 77 సంవత్సరాల వయసు వచ్చింది. నా జీవితంలో మొదటి 30 సంవత్సరాలు క్రీస్తు పూర్వం; రెండో భాగం మా కుటుంబంలో క్రీస్తు శకం నాతోనే మొదలైందనిపిస్తుంది.

ఒకసారి మా బంధువుల్లో ఒకాయన "ఓరేయ్, హిందూమతం ఎందుకురా వదిలావు? అందులో ఏదైనా లోపం వుందనుకుంటే నీకు చేతనయితే సంస్కరించి మార్చు" దానికి జవాబు "నేను మార్పుగలిగింది నాకెందుకు? నన్ను మార్చే క్రీస్తు నాకు కావాలి".

అధ్యాయం 11

రేడియో సేవ — సేవ ఫలితం — బైబిలనువాదం

source pp. 23-24

రేడియో సేవ

ఆత్మ నింపుదల పదే పదే నా సేవా జీవితంలో నాకు విజయ పరంపరలను చేకూర్చింది. 15 సంవత్సరాలు నేను రేడియోలో అవిరళ కృషిచేసి సువార్త ప్రకటించాను. పరలోకం రానురాను బహు సమీపమనిపిస్తోంది. ఎన్నో పాటులు రాశాను. ఆదికాండం మొదులుకని ప్రకటన గ్రంధం వరకు ఒక్క వచనం కూడా విడువకుండా దేవుని సంకల్పం వున్నదని వున్నట్టు బోధించాను. దూషణభూషణ తిరస్కారాదులను ప్రజలవద్ద నుండి పొందాను. కొన్నింటిని నేనున్నదు సరకు చేయలేదు. ఎన్నెన్నో ప్రాంతాలు పర్యటించాను. కొన్ని చోట్ల అవమానానికి గురయ్యాను. క్రీస్తు పాదాల చెంత నిరాడంబరంగా జీవించటం నేర్చుకుంటున్నాను. ఇహలోకంలో యేసు తప్ప నాకేమీ అక్కర్లేదు. ఆకాశంలో ఆయన తప్ప మరెవరున్నారు? యుద్ధ రంగంలో పోరాడి ప్రభువిచ్చిన బలాన్ని బలహీనతలో బయలు పరచడానికి ప్రయత్నించాను.

సేవ ఫలితం

దేవుడు మా సేవను ఎంతగానో ఆశీర్వదించాడు. మా అక్కగారు తన జీవిత చరమ దశలో ప్రభువుకు నమస్కరించి పరమపదించింది. మా బంధువుల రక్షణ కోసం అహర్నిశలు పట్టువిడువక ప్రార్థిస్తున్నాము. దేవుని కృప మా పట్ల ఎంతగానో విస్తరించింది. రేడియో సేవకు ప్రతిస్పందనగా గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలలో కొన్ని సంఘాలు ఏర్పడ్డాయి. మిషనరీల సాహచర్యంలో ఆధ్యాత్మిక, మానసిక తృప్తి పొందాను. కాని కొందరు మిషనరీల వల్ల చివరి దినాల్లో భేదాభి ప్రాయాలు వచ్చాయి. మొదటనుంచీ పాశ్చాత్య ద్రవ్యాన్ని ఉచ్చస్థంగా భావించాను.

అదే దీక్ష తుదివరకూ దేవుని కృపచేత కొనసాగింది. అన్నిక్రైస్తవ శాఖలతో అరమరికలు లేకుండా ప్రేమ పూర్వకమైన సహవాసం అనుభవించాను. క్రైస్తవ ప్రేమను ఎంతో ఎక్కువగా చవి చూచాను. ఇప్పుడు నా వయస్సు 77 ఏండ్లు. దేవుని కృపను పుణికి పుచ్చుకున్న నిండు దానం నాలో వుంది.

బైబిలనువాదం

లివింగ్ బైబిలు వారి ఆధ్వర్యంలో 'పరిశుద్ధ బైబిలు' అనువాదానికి దేవుడు నన్ను సాధనంగా వినియోగించుకున్నాడు. ప్రస్తుతం న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ అనువాదంలో నిమగ్నమై వున్నాను. ఈ మహోద్యమంలో నేను ఒక భాగం కావటం ప్రభువు కృపా విశేషమే! దేవుడు ఏ విషయంలోనూ నాకు తక్కువ చేయలేదు. గుంటూరు పట్టణంలో నా స్వంత జిల్లా కేంద్రంలో దేవుడు తన సేవలో మమ్మల్నెంతో హెచ్చించాడు. ప్రవత్త స్వదేశంలో ఘనత పొందడని వుంది. కాని దేవుడు మమ్మల్ని తన సేవలో గుంటూరులో ఎంతో హెచ్చించాడు. ఎందరెందరికో బాప్తిస్మ్యమిచ్చాను. పెండ్లిండ్లు చేయించాను. కర్మాలలో వుండగా మేము పొందిన అనుభవాలు మరుపురానివి. దావీదురాజు తాను మొదట పోగొట్టుకున్నదంతా తిరిగి సంపాదించుకున్నట్లు నేను అప్పుడు పోగొట్టుకున్న నా బంధువుల్ని తిరిగి సంపాదించుకునే దశాబ్దంలో యిప్పుడున్నాను. దేవునికి స్తోత్రం.

అధ్యాయం 12

ఉత్తరాల సేవ — రచనా పరిచర్య — అపజయాలు — పూర్వాశ్రమం — బైబిలు వచనాలు

source pp. 24-27

ఉత్తరాల సేవ

నా స్వహస్తంతో కొన్ని వేల వుత్తరాలు రాశాను, రాస్తున్నాను. సమస్యాత్మకమైన పరిస్థితిలో కొందరు దాపరికం లేకుండా నాకు తమ హృదయాలు కుమ్మరించుకుంటూ రాసిన ఉత్తరాలున్నాయి. ప్రార్థించి, వారికి నేను రాసిన వుత్తరాలు ఆత్మశాంతికి, స్థిరతకు బాసట అయ్యాయి. ఒక హెడ్‌మాస్టరు గారు నేను రాసిన వుత్తరాలు బైండు చేయించుకని, పదే పదే చదువుకుంటూ జీవితంలో చిట్ట చివరి ఘడియల్లో ప్రభువును అంగీకరించారు. కొందరిని ఆత్మహత్య ప్రయత్నం నుంచి ఈ వుత్తరాలు తప్పించాయి. దేవునికి స్తోత్రం.

రచనా పరిచర్య

స్పందన మాసపత్రిక ప్రస్తుతం వున్న క్రైస్తవ పత్రికల్లో తలమానికమైంది. అనేక వేల సర్క్యులేషన్ కలిగిన పత్రిక. దేవుడెంతో ఆశీర్వదించాడు. ప్రతినెలా పత్రిక కోసం పాఠకులు తహతహ చెందుతూ ఎదురు చూస్తుంటారు. పత్రికా పరిచర్యను నా ఆధ్యాత్మిక కుమారుడు దేవసహాయం కొనసాగిస్తున్నాడు. గ్రంధ రచనలోను గేయరచనలోను ప్రభువు నన్నెంతో ఆశీర్వదించాడు. నేను ప్రభువు ప్రేరణలో రాసిన పాటలు అశేష తెలుగు ప్రజల మధ్య విశేషాదరణ మన్నన పొందాయి. అనేక గ్రంధాలు రాశాను. అవన్నీ ప్రచురించటం జరిగింది.

ఈ సేవా విధానాలన్నిటిలో నాకు తోడ్పడిన సోదరీ సోదరులెందరో వున్నారు. విశేషించి నా సతీమణి యిచ్చిన ప్రోత్సాహం మాటల్లో చెప్పతరం కాదు. నెలకు 25 రోజులు సేవా పర్యటనల్లో వున్నా ఆమె ఎంతో వోర్పుతో కుటుంబాన్ని నిర్వహించింది. కేసెట్లు ఎన్నో వెలువరించాము. ప్రస్తుతం ప్రసంగాలు, పాటలు కేసెట్లు విడుదల చేయాలని ప్రార్థిస్తున్నాము.

అపజయాలు

నా జీవితంలో ఎన్నెన్నో అపజయాలు గూడా చూచాను. నాకున్న బలహీనతలు నన్ను ప్రేమించే వారికి తెలుసు. వారి నడిగి తెలుసుకోండి. అయితే వారు మీకు చెబుతారో చెప్పరో! సులభంగా మోసగించబడటం నా బలహీనత. ప్రతిచోటికి వెళ్ళాలనే విశేషాసక్తితో చాలాచోట్లకు వెళ్ళలేక పోయాను. ప్రభువును ప్రేమించని వారిపట్ల కఠినంగా ప్రవర్తించి, అపార్థాలకు గురి అయ్యాను. లౌకిక విధానాలు తెలియక, కొందరికి గర్విష్టిగా కనబడ్డాను. అయితే నామనస్సెరిగిన ప్రియులు ఎంతెందరో వున్నారు. వారికి నా కృతజ్ఞతలు.

ఫిబ్రవరి 29 నా జన్మదిన సందర్భంలో మాసిలామణి గారిచ్చిన సందేశం మరిచిపోలేను. "క్రీస్తు నందు ఈయన తన అద్రుస్సు పోగొట్టుకున్నాడు. తన పూర్వ కులమేదో ఎక్కడా అవసరమైతే తప్ప ఎప్పుడో ప్రస్తావించలేదు. రాయటానికి కూర్చుంటే ఎత్తిన కలం దించరు. తనేమి వున్నాడో యితరులు వుయ్యేట్టు గ్రహించలేరు. జాగ్రత్తగా పరిశీలిస్తేనే గాని, ఈయన అర్థం కాదు". ఆయన నన్ను బాగా ఎరిగిన మంచి సోదరులు, అలాగే యిప్పుడున్న క్రైస్తవ నాయకులందరూ నన్నెంతో ప్రేమిస్తారు.

పూర్వాశ్రమం

మొదట నేను మెనోనైటు సోదర సంఘంలో సేవకుడు అభిషేకించ బడ్డాను. అయితే సంఘపరిధి దాటి, నా సేవ బయటికి ప్రసరించింది. నాకు బాప్తిస్మ్యమిచ్చిన మిషనరీ హెచ్.జి.క్రాన్. ప్రభువునందు నిద్రిస్తూ నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే మిస్ ఎడిగర్ అనే మిషనరీ సోదరి మా గురించి ఎంతో ప్రయాసపడిన ప్రియబాంధవి. ఆమే కూడా ప్రభువు నందు నిద్రించింది. రెవ. పి.వి.బ్లాటర్స్ నా సేవాభిషేక కార్యక్రమం నిర్వహించిన సోదరుడు. ఆయన కూడా యిప్పుడు ప్రభువువద్ద వున్నారు. వివిధ అనుభవాల తోరణాలు నా జీవిత ప్రాంగణంలో వేలాడుతున్నాయి.

బైబిలు వచనాలు

నన్ను విప్లవాత్మకంగా మార్చుస్తూ వచ్చిన బైబిలు వచనాలు నాలుగు. రోమా 3:23, 6:23 యాకోబు 1:12, ప్రకటన 3:20. దేవుడు అగ్ని నుండి తీసిన కొరివిని నేను. నేనేమో వున్నానో అది దేవుని కృప మాత్రమే! యిది నా క్షుద్ర సాక్ష్యం. త్వరలో మరిన్ని వివరాలతో నా జీవిత యాత్రను పుస్తక రూపంలో వెలువరిస్తాను.

అధ్యాయం 13

నూతన ప్రచురణకు కొనసాగింపు: ఆశీర్వాదం — ఆధ్యాత్మిక కుటుంబం — సేవలో నా ఆశ

source pp. 28-29

— నూతన ప్రచురణకు కొనసాగింపు —

ఆశీర్వాదం

ప్రస్తుతం (డిసెంబరు 2005) నా వయస్సు 77 సంవత్సరాలు. దేవుడు మమ్మల్ని వృద్ధ దంపతులుగా ఆశీర్వదించాడు. గత 3 సంవత్సరాలు మాకు కలిగిన అనుభవాలు ఎంతో వైవిధ్యం వుంది. పిల్లలందరూ పెద్దవాళ్ళై పొయ్యారు. వారిసంసారాలు వారికున్నాయి. మేము ఒంటరిగా లేము. ప్రభువు మాతోవున్నాడు. ఎన్నో విజయాలు, అపజయాలు కలిగాయి. ఆరోగ్యం భౌతికంగా క్షీణించింది. ప్రభువు తన బలాధిక్యం కనపరుచుకుంటున్నాడు. అయితే సంవత్సరాల కిందట విశ్వాసవాణి వాక్యపరిచర్యలో దేవుడు ఘనవిజయం ప్రసాదించాడు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంధం వరకూ మరోసారి రికార్డు చేయటం జరిగింది. సేవకు ఎట్టి ఆటంకమూ కలుగకుండా ప్రభువు నడిపించాడు. గల్ఫ్ దేశాలకు, అమెరికాకు వెళ్ళివచ్చాము. ఆంధ్ర ప్రదేశ్‌లో యించుమించు అన్ని జిల్లా కేంద్రాలను దర్శించి సువార్త ప్రకటించాను. అద్భుతమైన ఫలితాలిచ్చాడు దేవుడు. ఈ మధ్య (నవంబరు 2005) శ్రీమతి ఆరార్యే గారికి పెద్ద ఆపరేషను జరిగింది. ప్రాణాపాయ స్థితినుండి ప్రభువు కాపాడాడు. ఆసుప్రతి బిల్లు 2 లక్షలకు పైగా అయింది. దేవుడు మేము అనుకొని విధంగా ఆదుకొని, మమ్మును ఆశ్చర్యపరిచాడు. ఎందరో ప్రార్థన చేశారు. ప్రార్థనలు వినేదేవున్నీ బట్టి మేము అంతగానో అతిశయ పడుతున్నాము.

ఆధ్యాత్మిక కుటుంబం

ఆంధ్ర ప్రదేశ్‌లో మా ఆధ్యాత్మిక కుటుంబం విస్తృతమైంది. మా ఆధ్యాత్మిక కుమారుడు దేవసహాయం మాకెంతో ఆదరణ, చేయుత నిచ్చాడు. దేవుడు నాతో నేరుగా అనేక అంశలు మాట్లాడుతున్నాడు. వాటిని చిన్న చిన్న పుస్తకాలుగా వెలువరించాలని మా దర్శనిచి దీక్ష. మా బంధువులను గురించిన భారం మా హృదయాలలో అధికమవుతున్నది. పాటలెన్నో రాయటానికి దేవుడు కృపాబలమిచ్చాడు. కేసెట్లు, సిడిలు రికార్డు అవుతున్నాయి. దేవునికి స్తోత్రాలు. సైతానీయ దుష్టశక్తుల నుండి దేవుడు మమ్మల్ని అనుక్షణమూ కాపాడుతున్నాడు. ఎందైనా, వెన్నెలైనా సర్వకాల సర్వావస్థలో ఆయన మమ్మల్ని కాపాడే దేవుడు.

మాకు నలుగురు పిల్లలు. విజయ, పుష్పిరాజ్, జ్యోత్స్న, ప్రసన్న. అందరికీ వివాహాలయిపోయాయి. వివిధ ఉద్యోగాలలో స్థిరపడి పోయారు. మాకిప్పుడు నలుగురు మనుమలు, ఇద్దరు మనుమరాండ్రు. ఒక మునిమనుమడు కూడా. ఇదంతా వెనక్కు చూచుకుంటే దేవుని కృపా బాహుళ్యమనిపిస్తుంది.

సేవలో నా ఆశ

నేను, మహిమ పిలుపు వచ్చేలోగా పుష్కలంగా సందేశాలు, ప్రసంగాలు కేసెట్ల రూపంలో, పుస్తకాల రూపంలో విడిచి వెళ్ళాలని ఆశిస్తున్నాను. మా గురించి విజ్ఞాపన ప్రార్థనలు చేయండి. శ్రీమతి మూర్తిగారితో కలిసి మీకు శుభములు చెబుతున్నాము.

ప్రభువుయేసులో నా ప్రేమతో మీ ఆరార్యే మూర్తి.

అధ్యాయం 14

శ్రీమతి ఆరార్యేగారి రక్షణ సాక్ష్యం

source pp. 30-33

పుట్టుపూర్వోత్తరాలు

నాపేరు వరలక్ష్మి. మా పుట్టిల్లు గుంటూరు. నేను పుట్టింది నిష్టగల బ్రాహ్మణ కుటుంబం. నా 15వ ఏట ఆరార్యేమూర్తిగారితో నాకు పెండ్లి అయ్యింది. వివాహం కాగానే వారితో కాపురానికి మహబూబ్ నగర్ వెళ్ళాను. మా వారు అక్కడ హైస్కూళ్ళలో పనిచేస్తూ, తీరిక సమయంలో మిషనరీలకు తెలుగు భాష నేర్పుతూ వుండేవారు. నేను విగ్రహారాధనలో సతమతమయ్యే దానిని. ప్రతాలు, నోములు, వ్రతవాసాలు, పూజ పునస్కారాలు మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి నేర్పింది. ఆయన నా భర్త కాబట్టి హైందవ స్త్రీగా నా ధర్మం నెరవేర్చుకొనేందుకు ప్రయత్నించాను. ప్రతిరోజు నానా దేవళ్ళకు మొక్కుకునే దాన్ని. తెల్లదొరల దగ్గరికి ఎక్కువగా వెడతారు. కొంపదీసి తమ మతంతో కలుపుకుంటారేమో అని, అలాంటిది జరగకూడదని ముక్కోటి దేవతలకు మొక్కేదాన్ని, పండుగలను పట్టుదలగా పాటించేదాన్ని. మూర్తిగారు ఏదో వుదాసీనంగా చూడటం నేను గమనిస్తూ ఉన్నాను. అంచేత నా మతనిష్ఠ యింకా వృధ్దతమైంది. మేము నారాయణపేటలో కాపురం పెట్టాక నా దగ్గరికి అదపదడపా బైబిలు విషయాలు మాట్లాడటానికి వారు వీరు వచ్చినా, నేను చోటు పెట్టేదాన్ని కాదు. విగ్రహారాధనలో నాకు తాత్కాలికమైన తృప్తి కలిగేది. మా అమ్మాయి విజయ ఎక్కువ కాలం అమ్మమ్మ దగ్గరే పెరిగింది. తరువాత మాకు పృధ్వీరాజు అనే కుమారుడు కలిగాడు.

ఆ నాటి సంఘటన నేనెన్నడూ మరువలేను. 1962 సంవత్సరం నవంబర్ నెల. మూర్తిగారు సంఘటబాదులో మిషనరీలకు తెలుగు నేర్పుతూ వుండేవారు.

సంఘర్షణ

ఆ రోజు ఆదివారం. అది మిషన్ కాంపౌండు. అందరు స్త్రీలు గుడికి వెడుతున్నారు. నేను కిటికీలోనించి చూచాను. అందరూ పిల్లలతో చర్చికి వెడుతున్నారు. నాకు వంట్లో సుస్తీగా వుంది. జ్వరం వచ్చినట్లుగా వుంది. మూర్తిగారు వూళ్ళోలేరు. నాకెందుకో గుడికి వెళ్ళాలని బుద్ధిపుట్టింది. వెంటనే సిద్ధమయ్యాను. పిల్లవాడిని చంకనేసుకుని గుడికి వెళ్ళాను. ఆ రోజున బోధకుడు జీవితం తరువాత విషయాన్ని గురించి, తీర్పును గురించి, మాట్లాడుతున్నాడు నాకు భయం వేసింది. యేసుక్రీస్తును తిరస్కరించటమంటే పరలోకాన్ని తిరస్కరించటమే అని, నరకానికి స్వాగతం పలకటమేనని ఆయన బోధించాడు.

వాక్యం మాట్లాడింది

ఆ ప్రబోధములోని ప్రతి మాట నన్నే వుద్దేశించి నొక్కి వక్కాణించి నట్లయింది. అందరూ వెళ్ళిపొయ్యాక, నేను అక్కడే కూలబడ్డాను. ఎవరో ఒక స్త్రీ నాకు సాయంచేసి, ఇంటికి చేర్చింది. పడుకున్నాను. నిద్రపట్టలేదు. అక్కడే క్రొత్తనిబంధన వుంటే, అది తీసుకని తెరిచాను. యోహాను 3:36 నా దృష్టిని ఆకర్షించింది. "కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్యజీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు. గాని, దేవుని ఉగ్రత వాని మీద నిలిచి వుంటుంది."

ఆత్మ విచారణ

ఈ వచనం నా అంతరాత్మలో ఘోష రేకెత్తించింది. నేను ఆయనకు విధేయురాలిని కాలేదు. అంచేత నాకు జీవం లేదు. పైగా దేవుని వ్రుగత రోజు రోజుకు నేను పెరబెట్టుకుంటున్నాను అనిపించింది. భయంతో నా గుండెలవిసిపోయాయి. "ప్రభా! నన్ను క్షమించు, నేనిప్పుడే నిన్నే నా స్వకీయ రక్షకునిగా అంగీకరిస్తున్నాను" అని కన్నీటితో వేడుకున్నాను. మాట తప్పని దేవుడు నా హృయంలోనికి వచ్చాడు. ఆయనకు హృదయ ద్వారం తెరిచాను. ఆయన పిలుపు విన్నాను. ఆయన నన్ను క్షమించాడు. ఆయన తన హస్తంతో ఆ గత పాపాలను కడిగి వేశాడు.

రక్షణానుభూతి

నా భర్త యింటికి రాగానే, ఆయనకు ఈ విషయం సవిస్తరంగా చెప్పాను. ఆయన సంతోషానికి మేరలేదు. హైదరాబాదు బేతేలు సోదర సంఘంలో బాప్తీస్మం తీసుకున్నాను. తదాదిగా సేవలో నా భర్తతో సహకరిస్తూ అనేక స్థలాలకు వెళ్ళి సాక్ష్యమిచ్చాను. స్త్రీలమధ్య దేవుడు నన్ను తన సాధనంగా వాడుకున్నాడు. మాకు దేవుడు నలుగురు సంతానం అనుగ్రహించాడు. మా కుటుంబం గురించి ప్రార్థించండి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అయితే రక్షించబడిన మనలను ఇంకా ఎక్కువ ప్రేమించి, ఇతరులను ఆయన పక్షాన ప్రేమించటానికి మనలను తన రాయబారులుగా ఈ లోకంలో వుంచాడు. మా బంధువుల రక్షణ భారం మా మీద వుంది. మా గురించి ప్రార్థించండి. దేవునికి స్తోత్రం!

- సమాప్తం -

📖 Full text transcribed from the original printed booklet. 🎤 Telugu audio narration is being prepared and will be added chapter by chapter without changing this page's structure.