ప్రశ్నించని విధేయత
ప్రశ్నించని విధేయత
దేవుని స్వరమును వినుటయందును, గుర్తించుటయందును ఉన్న ఆ రహస్యమును నేర్చుకొనుటద్వారా, మన ప్రశ్నలన్నిటికి జవాబియ్యబడి, మన సమస్యలన్నియు పరిష్కరింపబడగలవని మనము మన హృదయములన్నిటితో నమ్ముచున్నామా?
సంఖ్యా. 7:89లో మనము చదువుచున్నామేమనగా, మోషేచేత గుడారముయొక్క పని ముగింపబడి, కొండపై ప్రభువు మోషేకు చూపిన నమూనా ప్రకారము అది జరిగించబడినప్పుడు మాత్రమే దేవుని స్వరము వచ్చెను. Exodus 40:34 లో మనము చదువుచున్నామేమనగా, దేవుని మహిమ గుడారమును నింపెను, మహాపరిశుద్ధస్థలములోని కెరూబులమధ్యనుండి ఆయన స్వరము వినబడనారంభించెను. ఎవడైనను దేవుని చిత్తమును తెలిసికొనగోరినయెడల అతడు ప్రధానయాజకునియొద్దకు రావలసియుండెను, ప్రధానయాజకుడు మహాపరిశుద్ధస్థలమునుండి మాటలాడు దేవుని స్వరమును వినవలసియుండెను. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మన నిత్యమైన పరలోకసంబంధమైన ప్రధానయాజకుడు, ఆయనను తమ వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించువారిలో ఆయన నివసించును. వారి శరీరములు పరిశుద్ధాత్మయొక్క ఆలయములగును.
ఇప్పుడు ఎవరైనను భూసంబంధమైన ప్రధానయాజకునియొద్దకు వెళ్ళవలసిన అవసరము లేదు. ప్రధానయాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా మనుష్యుడు దేవునితో స్వయముగా మాటలాడి, జవాబును పొంది, ప్రతిదినము దేవుని స్వరమును వినగలడు. కాని ఒక సంగతి అవసరము. దేవుని స్వరమును వినగోరు మనలో ప్రతివారును, తాము దేవుని ఆత్మచేత నివసింపబడుచున్నామని నిశ్చయపరచుకొనవలెను. దేవుని ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనము త్రివిధమైన మార్పును పొందుదుమని మనము ఇదివరకే చూచియుంటిమి. పాపులముగా మనకు మృతమైన ఆత్మయు, చీకటిమయమైన ప్రాణమును, అపవిత్రమైన శరీరమును కలవు. దేవుడు పరిశుద్ధుడు, మనలోనికి రాకముందు
47
CO ee I తలంపుచేతను, మాటచేతను, క్రియచేతను కలిగిన ప్రతి అంతరంగకల్మషమునుండి క్రీస్తుయొక్క అమూల్యరక్తముచేత మనలను శుద్ధిచేయవలసియుండును. పాతనిబంధనకాలములో మనుష్యులు దేవుని మహిమ గుడారముపై నిలిచియుండుటను చూడగలిగినట్లే, మరల జన్మించినవారు కూడా తమయందును తమతోను ఎల్లప్పుడును దేవుని సన్నిధిని గ్రహింతురు. ఆ అనుభవము మానవప్రయత్నముద్వారా రాజాలదు. తమను నడిపించుటకును సహాయపడుటకును హక్కుగలవానియొక్క దైవికసన్నిధిని వారు గ్రహింతురు.
ఆయన సన్నిధిని అనుభవించకుండ మనలను ఆపునది పాపము మాత్రమే, కాని పాపము మాటిమాటికిని క్షమింపబడి ఆయన అమూల్యరక్తముచేత శుద్ధిచేయబడగలదు.
మన ప్రభువైన యేసుక్రీస్తు తన బహిరంగపరిచర్యను ప్రారంభించినప్పుడు ఆకాశము తెరవబడి, పరిశుద్ధాత్మ పావురమువలె దిగివచ్చెను, పరలోకమునుండి ఆ స్వరము వినబడెను. మనకొరకు ఆకాశము తెరవబడునట్లును, పరిశుద్ధాత్మ మనపై నిలిచి, అన్ని విషయములలో మనలను నడిపించి, ప్రతిదినము దేవుని స్వరమును వినుటకు మనలను శక్తిమంతులను చేయునట్లును ఆయన ఈ లోకములోనికి వచ్చెను. ఆ స్వరమును వినుటకును దానికి విధేయత చూపుటకును వివిధమార్గములు కలవు. దేవుడు ఆత్మ, ఆయన స్వరము కూడా ఆత్మసంబంధమైనదే. కావున దేవుని ఆత్మను మీ చేతులతోగాని కాళ్ళతోగాని మీరు అనుభవింపజాలరు. మనము ఆయనను మన ఆత్మలో అనుభవించి, చూచి, వింటుము. ఆయన స్వరము ఆత్మసంబంధమైన స్వరము, దేవుని స్వరమును మన భౌతిక చెవులతో వినగలిగిన సందర్భములు ఉన్ననూ, ఆ సందర్భములు కొద్దియే. అయితే మన ఆత్మ దేవుని స్వరమును ప్రతిదినము స్పష్టముగా గ్రహింపగలదు, కాని ఆ స్వరమును వినుటకు మన ఆత్మ పవిత్రపరచబడియున్నదని మనము నిశ్చయపరచుకొనవలెను (Matthew 5:8, Acts 10: 14). “పరిశుద్ధత లేకుండ ఎవడును ప్రభువును చూడజాలడు” (Hebrews 12:14).
వివిధసాక్షులద్వారా మాటలాడుటకు ప్రభువు ఎట్లు ఎన్నుకొనెనో మనము చూచియుంటిమి. అపొ. కార్య. 8లో, దేవుని సాక్షి ఫిలిప్పు అని పిలువబడెను. సమరయ అను స్థలములో ప్రభువు అతనిని బలముగా ఉపయోగించెను. సమరయులు యూదులచేత ద్వేషింపబడి, తృణీకరింపబడువారు, కాని తృణీకరింపబడిన ఆ ప్రజలకు సువార్తను ప్రకటించుటకు ఫిలిప్పు సాక్షిగా వెళ్ళెను. దేవుడు అతనిని బలముగా ఉపయోగింపనారంభించెను. అతడు రూపాంతరము పొందిన వ్యక్తియైయుండనియెడల, అతడు సమరయకు ఎన్నడును వెళ్ళియుండేవాడు కాదు, ఏలయనగా ఆ ప్రజలయొద్దకు వెళ్ళుటకు అతనిని బలవంతము చేయుటకు దైవికప్రేమ అవసరమైయుండెను. కాని దేవుడు ఆ పట్టణములో అతని పరిచర్యను బలముగా ఉపయోగించెను. తరువాత అకస్మాత్తుగా దేవుని ఆజ్ఞ వచ్చెను: “లేచి దక్షిణదిక్కుకు వెళ్ళుము”. అతడు వెంటనే దేవునికి విధేయత చూపెను. అతడు సమరయలో ప్రభువుచేత మిక్కిలిగా ఉపయోగింపబడుచుండెను, అతని పరిచర్యయు సేవయు అక్కడ మిక్కిలి అవసరముగా ఉండెను. అతడు తన హృదయములో, “నేను చేయుచున్న పని ఎంత గొప్ప పని, అది దేవుని పనియే. ఈ క్రొత్త విశ్వాసులందరును ప్రభువులో బలపరచబడి, స్థిరపరచబడవలసియున్నారు. నేనింత ప్రాముఖ్యమైన పనిని విడిచి ఒంటరి అరణ్యమునకు ఎట్లు వెళ్ళగలను?” అని చెప్పియుండగలడు.
సమరయను వదిలి అరణ్యమునకు వెళ్ళవలసిన కారణమును దేవుడు ఎన్నడును అతనికి వివరింపలేదు. మనమిదివరకే చూచినట్లు, దేవుడు ఒకేసారి మనకు ఎక్కువగా చెప్పడు, కాని మనము, మనుష్యులముగా, ముందుగానే సంగతులను తెలిసికొనవలెనని కుతూహలపడుదుము. అది మన మానవబలహీనత, కాని దేవుడు ఒకసారికి కొన్ని మాటలను మాత్రమే చెప్పును. ఆరంభమునకు ఆయన పెద్ద కార్యక్రమమును ఇయ్యడు. అక్కడికి వెళ్ళవలసిన అవసరతకు కారణములను ఇయ్యకుండగనే దేవుడు ఫిలిప్పుతో, “లేచి గాజాకు వెళ్ళుము” అని చెప్పెను. అయినను అతడు విధేయత చూపగా అతడు ఆ కారణమును కనుగొనెను.
దేవుని స్వరమును వినుటకు ఇది ప్రధానమైన నిబంధన: దేవుడు మీతో చెప్పినది వాదింపకుండగనే వెళ్ళి చేయుటకు మీరు సిద్ధముగా ఉండవలెను. మీ మనస్సు అడ్డురాగా మీరు తరచుగా కనుగొందురు. మీరు దేవునితో ప్రశ్నించి వాదింపనారంభింతురు. అట్లయిన, ఆయన స్వరమును వినుటకు మీకు మరింత ఎక్కువ కాలము పట్టును, కాని మీ చెవిని సున్నితముగాను నిర్మలముగాను ఉంచుకొన్నయెడల, మీరు దేవుని స్వరమును స్పష్టముగా వినుదురు.
కొన్ని సంవత్సరముల క్రితము, పండుకొనుటకుముందు నేను అర్ధరాత్రి ప్రార్థించుచుండగా, దేవుని స్వరము వచ్చి, “సువార్తతో బయటికి వెళ్ళుము” అని చెప్పెను. నా ప్రతిస్పందన, “ఈ రాత్రి సమయమున బయట ఎవరుందురు?” అనునదే, కాని నేను నా కోటు ధరించి, సువార్తపత్రికలను తీసికొని బయటికి వెళ్ళితిని. నాకు ముందు ఇద్దరు వ్యక్తులు నడచుచుండుటను నేను చూచితిని. నేను వారితో, “దయచేసి ఒక నిమిషము ఆగగలరా?” అని అడిగితిని. వారు, “మేమెందుకు ఆగవలెనని కోరుచున్నావు?” అని అడిగిరి. నేను, “నేను పండుకొనబోవుచుండగనే దేవుని స్వరమును విని, ఆయన నాతో, ‘కుడివైపునకు వెళ్ళుము, కుడివైపునకు వెళ్ళుము’ అని చెప్పెను. మీ ఇద్దరికొరకు నాకొక సందేశము కలదు” అని జవాబిచ్చితిని. ఆ ఇద్దరు యువకులలో ఒకడు నాతో, “నీవు మిక్కిలి సరిగ్గా చెప్పితివి. దేవుడు నాకొరకు నిన్ను పంపెను, నేను జీవితమునందు అలసిపోయియున్నాను. దేవుని సందేశమును నాకిమ్ము” అని చెప్పెను. రక్షణమార్గమును అతనికి చూపుభాగ్యము నాకు కలిగెను.
ప్రశ్నించకుండగనే నేను విధేయత చూపుచు ఉండగా, ప్రభువు నాకు మరిన్ని ఆదేశములనిచ్చుచునే ఉండుననునది నేను అనుభవముద్వారా కనుగొంటిని. ఫిలిప్పుకు ఇదియే జరిగెను. అతడు అరణ్యములోనికి వెళ్ళెను. అక్కడ అతడు రథములో ప్రయాణించుచున్న ఒక వ్యక్తిని చూచెను, కాని అప్పుడు కూడా తనను వెళ్ళుమని ఎందుకు కోరెనో దేవుడు అతనికి చెప్పలేదు. ఫిలిప్పు, ‘నేను ఈ రథమువెంబడి దొంగవలె పరుగెత్తుచున్నట్లు కనబడుచున్నది!’ అని తలంచియుండగలడు, కాని అతడు దేవుని ఎన్నడును ప్రశ్నింపలేదు. Acts 8:30లో, ఫిలిప్పు రథమువైపు పరుగెత్తి, ఆ వ్యక్తి యెషయాయొక్క 53వ అధ్యాయమునుండి చదువుటను వినెను,
రహస్యమిదియే. ప్రభువు మీతో ఏమి చేయుమని చెప్పిననూ, దానిని త్వరగాను ఆనందముగాను చేయుడి. ఒకనాడు నా ముందు ఒక వ్యక్తి నడచుచుండుటను నేను చూచితిని. దేవుడు నాతో, “వెళ్ళి అతనిని ఆపుము” అని చెప్పెను. నేను వెళ్ళి నా చేతిని అతని భుజముపై పెట్టితిని, అతడు నిలిచి నన్ను, “నన్నెందుకు ఆపితివి. నేను మిక్కిలి రద్దీగానున్న వ్యక్తిని” అని అడిగెను. అతడు నడువసాగెను. మరల నేనతనిని ఆపితిని, అతడు అవే మాటలు చెప్పి, “నా కాలమును ఇట్లు ఎందుకు వ్యర్థపరచుచున్నావు?” అని కూడా చెప్పెను. నేను, “ప్రభువు నన్ను పంపినందున” అని జవాబిచ్చితిని. ఆ వ్యక్తి, “నేను దానిని నమ్మను. నా కాలమును ఇక వ్యర్థపరచకుము” అని ప్రత్యుత్తరమిచ్చెను. మరల నేనతని వెంబడి వెళ్ళి, “దయచేసి కొంచెముసేపు ఆగుము” అని బతిమాలుచు అతనిని ఆపితిని. అప్పుడతడు, “నీతో నిజాయితీగా చెప్పవలెనంటే, నేను నా జీవితము విషయమై అలసిపోయియున్నాను, ఆత్మహత్య చేసికొనుటకు వెళ్ళుచున్నాను” అని చెప్పెను. అప్పుడు నేనతనితో, “నిన్నట్లు చేయకుండ నేను ఆపుటలేదు. నీవిప్పుడైనను తరువాతైనను చేయవచ్చును. నాకు అరగంట సమయమిచ్చుటవలన నీవేమియు కోల్పోవు. తరువాత నీవు కోరిన చోటికి వెళ్ళి ఆత్మహత్య చేసికొనుటకు స్వేచ్ఛగా ఉందువు. నేను నిన్ను ఆపనని వాగ్దానము చేయుచున్నాను” అని చెప్పితిని. కావున అతడు ఒప్పుకొనెను. మేమిద్దరమును సమీపమునందున్న ఒక ఉద్యానవనమునకు వెళ్ళితిమి. నేను నా బైబిలును తీసికొని, కొద్దిగా ప్రార్థించిన తరువాత అతనికి సందేశమిచ్చితిని. మరల నేనతనితో ప్రార్థించి, “ఇప్పుడు నీవు వెళ్ళి ఆత్మహత్య చేసికొనుటకు స్వేచ్ఛగా ఉన్నావు” అని చెప్పితిని. కాని అతడు, “ఆత్మహత్య చేసికొనవలెననెడి నా కోరిక పోయినది. నిన్నెప్పుడు మరల చూడగలను?” అని జవాబిచ్చెను. అతడొకటిరెండుమారులు నన్ను దర్శించి, మరల జన్మించెను.
రహస్యము ప్రభువుకు నిస్సందేహముగా విధేయత చూపుటయే. అది దినములోని ఏ సమయమైననూ, అర్ధరాత్రియైననూ, తెల్లవారుజామైననూ, మధ్యాహ్నపు ఎండయైననూ, మీరేదైనా చేయుటకు లేదా చెప్పుటకు మిమ్మును బలవంతము చేయుటకు మిక్కిలి స్పష్టమైన, గాఢమైన ముద్రను పరిశుద్ధాత్మ మీ ఆత్మపై వేయును.
ఏమి ప్రసంగింపవలెనో దేవుడు ఫిలిప్పుకు ఎన్నడును చెప్పలేదు, కాని అతడు మాటలాడి చెప్పినది ఆత్మచేత బలవంతము చేయబడినదని మనము స్పష్టముగా చూడగలము. అతడు రథమునొద్దకు వెళ్ళి, ఆ ఇథియోపియా వ్యక్తి యెషయా 53వ అధ్యాయమును చదువుటను వినెను. అది ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అద్భుతమైన ప్రవచనము. ఈ ప్రవచనము క్రీస్తు కాలమునకు 750 సంవత్సరముల ముందు వివరముగా చేయబడెను. ఆ ఇథియోపియా వ్యక్తి ఆ భాగమును చదువుటను విన్నప్పుడు, గాజా మార్గములో వెళ్ళుమని దేవుడు తనను ఎందుకు కోరెనో అతనికి తెలిసెను. వెంటనే అతని ఆత్మ దైవికసందేశమును పొందుకొని, పరిశుద్ధాత్మద్వారా అతడు ఆ ఇథియోపియా వ్యక్తిని, “నీవు చదువుచున్నది నీకు అర్థమగుచున్నదా?” అని ప్రశ్నించెను. ఈ నిశ్శబ్దమైన రీతిలో ప్రభువు తన తలంపులను మాటలను మనలోనికి పెట్టును, మనము మాటలాడనారంభించునప్పుడు మాటలు ఏరువలె ప్రవహించుటను మనము తరచుగా కనుగొందుము. అతని ప్రశ్నకు ఆ ఇథియోపియా వ్యక్తి, “ఎవరైనను నాకు మార్గదర్శనము చేయనిదే నేనెట్లు అర్థము చేసికొందును?” (31వ వచనము) అని జవాబిచ్చెను. అతడు రథమెక్కి తనతో కూర్చుండుటకు ఫిలిప్పును అనుమతించెను. ఫిలిప్పు దగ్గరకు వచ్చిన వెంటనే ఆ రథమును ఆపుమని ఆ వ్యక్తిని అడిగియుంటే, ఫిలిప్పు తనకు హాని కలుగజేయగోరు దొంగయేమోనని తలంచి, ఆ వ్యక్తి అట్లు చేయుటకు తిరస్కరించియుండేవాడు.
అమెరికాలో అనేకమంది లిఫ్టుకొరకు వెళ్ళుచున్న కార్లను ఆపుదురు. కొన్నిసార్లు కారు ఆగి ఆ వ్యక్తికి లిఫ్టునిచ్చును, కొన్నిసార్లు ఇయ్యదు. కొన్నిసార్లు కారులోని వ్యక్తి అనుమానముకలవాడై ఆగకుండగనే వెళ్ళిపోవచ్చును. ఇది ఫిలిప్పుకు జరిగియుండవచ్చును, కాని అతడు మానవజ్ఞానమును ఉపయోగింపక పరిశుద్ధాత్మయొక్క ఆదేశములకు విధేయత చూపుచుండెను. ఆ ఇథియోపియా వ్యక్తి స్వయముగా రథమును ఆపి ఫిలిప్పును లోపలికి ఆహ్వానించెను. “దయచేసి వచ్చి నాతోకూడ కూర్చుండి ఈ భాగమును వివరింపుము” అని అతడు చెప్పెను. తరువాత ఫిలిప్పు ఆ భాగమును ఎంత స్పష్టముగా వివరించెనంటే, పాపుల నిమిత్తము యేసుక్రీస్తు మరణించిన సంగతినిగూర్చియు దాని భావమునుగూర్చియు అతనికి నచ్చజెప్పెను. దేవుని వాక్యమునకు మీరు విధేయత చూపుకొలది, Matt. 10:20, Luke 12:12; 21:15లోని ఆయన వాగ్దానము ప్రకారము. మిమ్మును నడిపించుచు, మెట్టుమెట్టుగా మార్గదర్శనము చేయుచు దేవుని స్వరమును మీరు వినుటమాత్రమేగాక, మీరు కలియు వ్యక్తికొరకు అవసరమైన తన సొంతమాటలను పరిశుద్ధాత్మ మీ పెదవులను తాకుచు మీలో పెట్టుటను కూడా మీరు కనుగొందురు.
ఒకసారి రైల్వేస్టేషనులో అర్ధరాత్రి నేనొక యువకుని కలిసికొంటిని. నేనతనికి కరపత్రమును సువార్తను ఇచ్చి, “ఆలస్యము చేయకుము, ఇప్పుడే ప్రభువైన యేసుక్రీస్తుకొరకు నిర్ణయించుకొనుము” అని చెప్పితిని. అతడు, “నేనిప్పుడు నిర్ణయించుకొనజాలను. దానిని గూర్చి ఆలోచింతును” అని జవాబిచ్చెను. నేనతనిని, “నీవు రూ. 5 పోగొట్టుకొంటివనుకొనుము, ‘రేపు లేదా ఎల్లుండి వెదకుదును’ అని చెప్పుదువా?” అని అడిగితిని. అతడు నన్ను, “నేను రూ. 5 పోగొట్టుకొంటిననెడి సంగతి నీకెవరు చెప్పిరి?” అని ప్రశ్నించెను. నేను, “ఎవరును చెప్పలేదు. నాకది ఏమాత్రమును తెలియదు” అని చెప్పితిని. ఆ యువకుడు, “ఇప్పుడే నేను బుకింగ్ కార్యాలయమునకు వెళ్ళి ఒక టిక్కెట్టును కొని, తొందరలో దానిని చిల్లరనుతీసికొంటిని, కాని లెక్కించినప్పుడు రూ. 5 తక్కువయుండుటను కనుగొంటిని. నేను తిరిగివెళ్ళి బుకింగ్ గుమాస్తాను అడిగితిని కాని అతడు వినుటకు తిరస్కరించెను. అందుకనే రూ. 5 పోగొట్టుకొన్నందుకు నేను కలవరపడుచున్నాను” అని చెప్పెను. నాకు అప్పటివరకును దీనిని గూర్చి ఏమియు తెలియదు. కేవలము కొన్ని సరళమైన మాటలే అతని హృదయమును మెత్తపరచెను, అతడు ఆ సందేశమును పొందుకొనెను. ఈ విధముగా దేవుడు మీ స్నేహితులకొరకును బంధువులకొరకును సరైన మాటను మీ నోటిలో పెట్టును. దేవుని స్వరమును మీరు స్పష్టముగా వినకపోయిననూ, నిశ్శబ్దమైన రీతిలో జీవముగల ప్రభువు తన నోటిపలుకువాహకునిగా మిమ్మును ఉపయోగించుకొనుటకు తన మాటలను మీ నోటిలో కుమ్మరించుచున్నాడు. అప్పుడు మీరు అనేకమందికి ప్రేరణకును, బలమునకును, ఆనందమునకును మూలముగా ఉందురు. ఆయన స్వరమునకు విధేయత చూపుట ఎంతటి ఆనందము! ప్రశ్నించకుడి. ఆయనతో వాదింపకుడి.
అనేక సంవత్సరముల క్రితము నేను తెల్లవారుజామున 4 గంటలకు మెలకువపడి, కిటికీ దగ్గర ఒక బృందము పాడుటను వింటిని. ఆ మాటలు నాకు స్పష్టముగా వినబడెను: Isa. 33:17. “నీ కన్నులు రాజును ఆయన సౌందర్యములో చూచును, మిక్కిలి దూరముననున్న దేశమును చూచును.” ఇది వరుసగా మూడు ఉదయములు, 4 గంటలకు జరిగెను. ఆ బృందము పాడుటను, ఆ మాటలను నేను వింటిని. ఆదివారము ఉదయము సందేశముకొరకు ఆ వాక్యభాగమును ప్రభువు నాకిచ్చుచున్నాడని నేను తలంచితిని. కావున ఆదివారము ఉదయము నేనా వాక్యభాగముపై సందేశమిచ్చితిని. సోమవారము ఉదయము కూడా అట్లే చేసితిని. నేను, “ప్రభూ, ఈ మాటలద్వారా నాకు నీ సందేశమేమిటి? గత నాలుగు ఉదయములుగా నీవు వీటిని నాకు పంపుచున్నావు” అని అడిగితిని. అప్పుడు ప్రభువు దూరదేశమునకు వెళ్ళుటకు సిద్ధపడుమని నాతో చెప్పెను. కావున నేను వెంటనే పాస్పోర్టుకొరకు దరఖాస్తు చేసితిని. ఎవరినుండియు నాకు ఆహ్వానము లేకపోయిననూ, సిద్ధపడుమని దేవుడు నాతో మాటలాడెనని నేను నమ్మితిని. ఆ దినములలో ప్రయాణమునకు ఢిల్లీలో దరఖాస్తు చేయవలసియుండెను. కొన్ని దినములలోనే ఒక నిర్దిష్టదినమున ఒక నిర్దిష్టనౌకపై నాకు ప్రయాణమునకు స్థానము ఇయ్యబడెనని జవాబు నాకు వచ్చెను. నాకింకను పాస్పోర్టు రాకపోయిననూ, దేవునికి నాకొరకు తన పరలోకసంబంధమైన ప్రణాళిక కలదని నేను నమ్మితిని. సాధారణముగా పాస్పోర్టు పొందుటకు ఒక నెల పట్టును. దేవుడు నా పక్షమున పనిచేయుటను, కదులుటను నేను చూచితిని, ఒక వారములోనే అది నాకు లభించెను.
నా నిశ్శబ్దసమయమున నాకీ మాటలు వచ్చెను, Ezra 8:1 లోనివి, “ఆరవ సంవత్సరమున, ఆరవ నెలలో, నెలయొక్క ఐదవ దినమున.” ఈ మాటలు నా నిశ్శబ్దసమయమున మిక్కిలి బలముగా వచ్చెను. నేను మరల ప్రార్థించి, “ఈ మాటలయొక్క భావమేమి?” అని అడిగితిని. ప్రభువు నాతో, “నీవు 1946వ సంవత్సరము జూన్ 5వ తేదీన లండనులో ఉండవలెనని నేను కోరుచున్నాను” అని చెప్పెను. కావున నేను బొంబాయికి వెళ్ళి నౌకాకంపెనీని కలిసితిని. వారిని, “జూన్ 5వ తేదీన లండనుకు చేరు నౌక ఏదైనా కలదా?” అని అడిగితిని. వారు, “అవును ఉన్నది అయ్యా, కాని దానిలో ఖాళీ లేదు” అని జవాబిచ్చిరి. నేను రెండుమారులు వెళ్ళి, “ఎవరైనా తమ ప్రయాణమును రద్దుచేసికొనిరా?” అని అడిగితిని. వారు, “లేదు అయ్యా, కాని వచ్చేవారము మరొక నౌక బయలుదేరును, దానిలో మేము మీకు ప్రయాణమిచ్చెదము” అని జవాబిచ్చిరి. జూన్ 5వ తేదీన నేను లండనులో ఉండవలెనని దేవుడు నాకు నిశ్చయముగా చెప్పియుండెను, ఆ తేదీన మరియొక నౌక అక్కడికి చేరునని నిశ్చయత లేకుండెను. ఏమైనప్పటికిని నేను రెండవ నౌకపై నా ప్రయాణమును బుక్ చేసికొంటిని, మేము జూన్ 5వ తేదీన లండనుకు చేరితిమి, కాని మొదటి నౌక తన యంత్రము పాడైనందున మేము చేరిన నాలుగు దినముల తరువాతనే చేరెను. రెండవ నౌక వేగమైన నౌక, నేను విధేయత చూపినందున సరైన సమయమునకు నేను చేరుకొంటిని.
తరువాత నా నిశ్శబ్దసమయమున ఒక వచనము నాకు వచ్చెను, Zech 9:10 లోనిది, “సముద్రమునుండి సముద్రమువరకు...” ప్రభువు నాతో, “నీవు మరియొక సముద్రమును దాటి మరింత ముందుకు వెళ్ళవలెను” అని చెప్పెను. నేను ప్రతి నౌకాకంపెనీకిని, ప్రతి విమానకంపెనీకిని వెళ్ళి, “స్థానము లేదు” అను అదే జవాబును పొందితిని. దేవుడు మాటలాడినందున, నేను మార్గమును కనుగొనవలెనని నేను నమ్మితిని. ఒక ఉదయమున నేను Isa. 43:16చదువుచుంటిని. “సముద్రములో మార్గమును, మహాజలములలో దారిని కలుగజేయు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.” కావున నాకు ప్రయాణము తప్పక లభించుననునదానిపై నాకు నిశ్చయత కలిగెను, నేను నౌకాకార్యాలయమునకు వెళ్ళి, “అయ్యా, నేటికి నాకేదైనా అవకాశము కలదా” అని అడిగితిని. ఆ వ్యక్తి, “అయ్యా, ఒక్క అవకాశమే కలదు. హైకమిషనరు మీ విషయమును సిఫారసు చేయగలిగినయెడల మీరు దానిని పొందగలరు. వారు సాధారణముగా ప్రభుత్వోద్యోగులకొరకు అట్లు చేయుదురు” అని జవాబిచ్చెను. వెళ్ళి ప్రయత్నించుటకు నేను నిర్ణయించుకొంటిని. నేను హైకమిషనరుయొక్క కార్యాలయమునకు వెళ్ళితిని, అక్కడనున్న వ్యక్తి నన్ను, “మీరు ప్రభుత్వోద్యోగియా?” అని అడిగెను. నేను, “కాదు అయ్యా, నేను దేవుని సేవకుడను” అని జవాబిచ్చితిని.
“అది సరిపోవును” అని అతడు జవాబిచ్చెను, నాకు ప్రయాణము లభించెను. నేను న్యూయార్కుకు చేరినప్పుడు, న్యూయార్కులోని రూబెన్ లాసన్ అను ఒక వ్యక్తి నన్ను చూచుటకు వేచియున్నాడని నాకొక సందేశము వచ్చెను. నేనతనిని అనేక సంవత్సరములుగా చూడలేదు. 1930లో నేనతనిని కలిసియుంటిని, అదియు కొంచెముసేపు మాత్రమే. గత 10 సంవత్సరములుగా అతడెక్కడ ఉన్నాడోయని నాకు తెలియదు. నేనక్కడికి చేరితిననెడి సంగతి అతడెట్లు తెలిసికొనెను? ఏమైనప్పటికిని నేను నౌకనుండి దిగినప్పుడు అతడక్కడ ఉండెను. అతడు నాతో, “నీవు ప్రార్థననుబట్టి అమెరికాకు వచ్చితివి. అమెరికాలోనున్న ఆ భారతీయులకొరకు సందేశములను రికార్డు చేయగోరుచున్నందున హిందీ తెలిసిన ఎవరికొరకో నేను ప్రార్థించుచుంటిని. ఈ ఉదయమే, ‘సహోదరుడు బఖ్త్ సింగ్ న్యూయార్కుకు వచ్చుచున్నాడు’ అని ఛాంబర్స్ గారు చెప్పుటను నేను వినియుంటిని. అందుకనే నిన్ను కలిసికొనుటకు నేను వచ్చితిని” అని చెప్పెను. దిగిన మొదటిదినముననే నేనొక సందేశమును రికార్డు చేసితిని. ముప్పది సందేశములను రికార్డు చేయు భాగ్యము నాకు కలిగెను; ఒక్కొక్క దినమునకు ఒకటి, ప్రతి సందేశము ముప్పదిఐదు నిమిషముల నిడివి కలిగియుండెను. నేటికిని అవి దక్షిణఅమెరికాలో ప్రసారము చేయబడుచున్నవి.
ఏ దేశమునైనను, ఏ దేశములోని ఏ పట్టణమునైనను చూడవలెననిగాని, దేనినైనను కొనవలెననిగాని నాకు కోరిక లేదని నేను యథార్థముగా, సంపూర్ణ వినయముతో చెప్పగలను. నాకున్నది ఒక్క కోరికయే, అది ఆయన సంపూర్ణచిత్తములో ఉండి ఆయన సాక్షిగా ఆయనచేత ఉపయోగింపబడుటయే. ఈ విధముగానే దేవుడు మనలో ప్రతిదినము నిశ్శబ్దముగా పనిచేయుచునే ఉండును. రక్షణమార్గమును ఎవరికైనను చూపుటకుగాని, ఎవరినైనను ఆదరించుటకుగాని, ఎవరికైనను సహాయపడుటకుగాని ఆయనచేత ఉపయోగింపబడుటకు మీరు సిద్ధముగా ఉన్నయెడల, దేవుని స్వరమును వినుట మీకు సులభమగుననునది మీరు కనుగొందురు. మీరు వాదింపరు, ప్రశ్నింపరు; ఆయన మీకు ఏమి ఆజ్ఞాపించిననూ, ఏమి చెప్పిననూ, మీరు విధేయత చూపుదురు. సంబంధిత వ్యక్తులకొరకు సందేశమును ఆయన మీకిచ్చును: సరైన వ్యక్తికొరకు పరలోకసంబంధమైన ప్రణాళికను. దీనిని రుజువుపరచుటకును, ప్రతిదినము ప్రతిమెట్టున దేవుని స్వరమును వినుటయందు ఒకనికుండు గౌరవమును గూర్చి తెలుపుటకును నేను మీకు అనేక కథలను చెప్పగలను.
విధేయత చూపుటకు సిద్ధముగా ఉండుడి. ఆయన చెప్పినది ఏదైనను ప్రశ్నించకుండగనే చేయుడి. ఆయనయొక్క మొదటి పిలుపునకు మీరు విధేయత చూపితిరా: “ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినయెడల, నేనతనియొద్దకు వచ్చెదను”? (Rev. 3:20). జీవముగల ప్రభువైన యేసు మీలోనికి వచ్చెనని నిశ్చయపరచుకొనుడి. మృతుడైన మనుష్యుడు దేవుని స్వరమును వినజాలడు. మీరు మరల జన్మింపనియెడల మీరు ఆత్మీయముగా మృతులు. దేవుడు మీ పాపములన్నిటిని క్షమింపనియెడల మీరు ఆత్మీయముగా చెవిటివారు, మూగవారు, గ్రుడ్డివారు. ప్రభువైన యేసుక్రీస్తును మీ జీవముగల రక్షకునిగాను స్నేహితునిగాను ముందుగా అంగీకరించి, తరువాత విశ్వాసముతో ప్రతిదినము, “ప్రభూ, నాతో మాటలాడుము, నన్ను ప్రతిదినము నడిపించుము, నాకు సహాయపడుము. ఓ ప్రభూ, నీకొరకు నేను జీవింపగోరుచున్నాను. నీవు నాతో మాటలాడువరకు, నీచేత నేను ఉపయోగింపబడజాలను. నీవు నన్ను ఎక్కడికైనను పంపవచ్చును లేదా ఎక్కడైనను ఉంచవచ్చును. నేను నీ చిత్తములో మాత్రమే ఉండగోరుచున్నాను. ఓ ప్రభూ, నీ ఆనందమును మరొకరితో పంచుకొను భాగ్యమును నాకిమ్ము” అని చెప్పుడని మేము మిమ్మును వేడుకొనుచున్నాము. అప్పుడు, మీరు వినుచుండగా, ఆయన మహిమాన్విత స్వరమును మీరు వినుదురు, మీరు విధేయత చూపుచుండగా, ఆయన వర్ణింపశక్యముకాని ఆనందముతో మీరు నింపబడుదురు, జీవితములోని ప్రతి వివరమునందు ఆయనచేత నడిపింపబడు భాగ్యమును మీరు కలిగియుందురు.
↑ పైకి వెళ్ళండి ← పుస్తకానికి వెనుకకు ← పుస్తక భాండాగారానికి
