దేవుని వాక్కు వాహకులు
దేవుని వాక్కు వాహకులు
“నీ వెనుకనుండి, ‘ఇది మార్గము, దీనిలో నడువుము,’ అను ఒక మాట నీ చెవి వినును...”..
ఈ వచనము నిశ్చయముగా దేవుని స్వరమును గూర్చినదే. ఆ స్వరమును స్పష్టముగాను నిర్మలముగాను వినుటను మనము నేర్చుకొనవలెననునదే మన నిత్యప్రార్థనగా ఉండవలెను, ఏలయనగా ఆయన స్వరమును వినుటద్వారానే మన ప్రశ్నలన్నిటికి జవాబియ్యబడి, మన సమస్యలన్నియు ప్రతిదినము పరిష్కరింపబడును. దేవుని స్వరమును వినుటకు విశ్వాసమును ఓర్పును అవసరము. దేవుడు మాటలాడును, అయినను ఆయన స్వరమును ప్రతిదినము స్పష్టముగా వినుభాగ్యమును అనుభవించువారు మిక్కిలి కొద్దిమంది విశ్వాసులే. Psalm 29 లో స్పష్టముగా చెప్పబడియున్నదేమనగా, ఆయన స్వరము మనయొద్దకు వచ్చినప్పుడు దేవుని శక్తి సంపూర్ణముగా ప్రదర్శింపబడును (వచ. 4-5). దేవుని స్వరము దేవదారు వృక్షములను విరుగగొట్టును (వ. 7). దేవుని స్వరము అగ్నిజ్వాలలను చీల్చును (వ. 8). అది అరణ్యమును కంపింపజేయును. మీ జీవితమునకును నా జీవితమునకును లభ్యమైయున్న దేవునియొక్క గొప్ప శక్తిని చూపుటకే ఈ మాటలు పునరావృతమగుచున్నవి.
ప్రవక్తయైన ఏలీయాకు ఈ పాఠము ఎట్లు నేర్పబడెనో మనమిదివరకే చూచియుంటిమి. I Kings 19:12లో, అతడు దేవుని మెల్లని సన్నని స్వరమును వినెను. బలిని దహించు అగ్నిరూపమున దేవుని గొప్ప శక్తి దిగివచ్చుటను, తరువాత వర్షమును పంపుటను అతడు చూచియుండెను, అయినను అతడు నిరుత్సాహపడి, నిరాశతో బదరీవృక్షము క్రింద కూర్చుండుటను మనము కనుగొందుము. 4వ వచనమునందు, తాను ఇక జీవించుటకు ఇష్టపడనని అతడు దాదాపు చెప్పుచున్నాడు. మనమందరమును ఏదో ఒక సమయమున నిరుత్సాహమును, దుఃఖమును, కృంగుదలను అనుభవింతుము. మనమందరమును కొన్నిసార్లు మన భారములు మనకు మిక్కిలి భారముగా అనిపించుటను కనుగొందుము. మనము మరణమును, కష్టములను, ఇతర ఆపదలను గూర్చి వింటుము; మన శత్రువులు మనకు విరుద్ధముగా చెప్పు మాటలాడుటను వింటుము. ఈ దుఃఖకరమైన పరిస్థితులన్నియు మనలను దుఃఖాక్రాంతులనుగను నిరుత్సాహపరచినవారినిగను చేయును, మనమందరమును ఏదో ఒక సమయమున బదరీవృక్షమునొద్దకు వత్తుము. కాని ఏలీయా 1 రాజులు 19:12లో ఆ మెల్లని సన్నని స్వరమును విన్నప్పుడు అతని భారము తొలగిపోయెను. చనిపోవలెననెడి అతని కోరిక అతనిని విడిచిపెట్టెను, దేవునిని గూర్చిన అతని ప్రశ్నలన్నియు మాయమాయెను. అతడు క్రొత్త రహస్యమును నేర్చుకొనెను. దేవుడు తన మనస్సును అతనికి మిక్కిలి స్పష్టముగా తెలియజేసెను, తన పరిచర్యయొక్క ఆ సంవత్సరములన్నిటి తరువాత, దేవుని మార్గములు మనుష్యుని మార్గములు కావని అతడు నేర్చుకొనెను. ఆ రహస్యమును మీరు ఒకసారి నేర్చుకొంటే, మీ భారము లేదా సమస్య ఏదైనా సరే, మీరు విజయవంతముగా బయటకువత్తురు. దేవుని వినుటయందలి, ఆయన మార్గములను తెలిసికొనుటయందలి రహస్యమును మనము నేర్చుకొనవలెను.
దేవుని స్వరమును వినుటయొక్క ఈ అనుభవములు మన అనుభవముగా కూడా ఎట్లు అగును? అపొస్తలుడైన పౌలు తన మారుమనస్సు పొందిన సమయమునందే ఈ పాఠమును నేర్చుకొనెను. అపొస్తలుని జీవితమును అధ్యయనము చేయుచుండగా దీనిని గూర్చి మరికొంత మనము చూతుము. అపొ. కార్య. 9లో, ప్రభువు స్వయముగా అతనిని కలిసికొని అతనితో మాటలాడెను, సౌలు, “ప్రభూ, నేనేమి చేయవలెనని కోరుచున్నావు?” అను ఈ ప్రశ్నను వేసినప్పుడు, ప్రభువు అతనిని పట్టణములోనికి వెళ్ళుమని చెప్పెను, అయితే, తాను కోరుకొనియుంటే, అప్పుడే అక్కడనే అన్నిటిని ఆయన అతనికి చెప్పియుండగలడు. ఆయన సౌలుకు కనబడి, మధ్యాహ్నపు సూర్యునికంటె ప్రకాశవంతమైన తన మహిమను చూడనిచ్చి, “సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావు? నేను యేసునే” అని మిక్కిలి స్పష్టముగా అతనిని అడిగెను. ఇంతగా చెప్పి చూపిన తరువాత, ఆయన మరిన్ని ఆదేశములను అప్పుడే అక్కడనే ఎందుకు ఇయ్యలేదు? తాను ఎల్లప్పుడును ఒకే విధముగా కనబడి మాటలాడడని మన ప్రభువు అతనికి స్పష్టముగా చూపుచుండెను. మనము దేవుని మన ఆలోచనావిధానమునకు పరిమితము చేయుటవలననే మనలో అనేకులము కలవరపడుదుము. మనము ఆయనను పరిమితము చేయజాలము. తనకు మంచిదని తోచినరీతిగా మనతో మాటలాడు సంపూర్ణాధికారము ఆయనకున్నది. విశ్వాసముద్వారా ఆయన చెప్పునది మనము నమ్మవలెను. సౌలు పౌలుగా మారుటయే మొదటి మెట్టు. దేవునినుండి మరింత వినగోరినయెడల అతడు విధేయత చూపవలసియుండెను. తాను ఏమి చేయవలెనో అక్కడ చెప్పబడుననుచు దమస్కు పట్టణములోనికి వెళ్ళుమని అతనికి చెప్పబడెను. దేవుడు మీకు చూపినది ఏదైనను మీరు దానికి విధేయత చూపవలెను. మరల నేను మీతో చెప్పుచున్నాను, మీరు మరల మీరు మరల జన్మింపనిదే, మీరు దేవుని స్వరమును వినజాలరు. నిత్యజీవమను వరమును పొందుకొన్నవారు ఎప్పుడో, ఎక్కడో ఆయన స్వరమును విని ఉండియే తీరవలెను. ఆ స్వరమునకు మీరు విధేయత చూపితిరా, లేక దేవునితో వాదించితిరా?
అనేక సంవత్సరముల క్రితము మేము బహిరంగసభ ఒకటి జరుపుచుంటిమి. తరువాత మేము టీ తాగుటకు ఒక హోటలుకు వెళ్ళితిమి. కూర్చుండగా నేను దేవుని స్వరమును వింటిని: “ఆ మూలకు వెళ్ళి అక్కడ కూర్చున్న వ్యక్తికి సువార్తపత్రిక నివ్వుము.” నేను నా హృదయములో, “అతని మీసమును చూడుము” అని అనుకొంటిని. అతని మీసమును బట్టి అతడు సువార్తను వినడని నేను నిశ్చయించుకొంటిని. అటువంటి వ్యక్తితో మాటలాడుట కాలవ్యర్థమని నేను తలంచితిని. కాని ఆ స్వరము మరల మరల నాకు వచ్చెను: “నీవు అతనియొద్దకు వెళ్ళుము; నీవు అతనియొద్దకు వెళ్ళుము.” కొంచెము వెనుకాడుచు నేను వెళ్ళి వణుకుచున్న చేతులతో అతనికి సువార్తపత్రిక ఇచ్చితిని. “ఇదేమిటి?” అని అతడు అడిగెను. “అయ్యా, ఇది ప్రభువైన యేసుక్రీస్తుయొక్క సువార్త” అని నేను జవాబిచ్చితిని, అతడు, “సువార్తా! నాకు సంపూర్ణమైన ఉర్దూ బైబిలు కావలెను. రెండు సంవత్సరములుగా నాకెవరైనా సంపూర్ణమైన ఉర్దూ బైబిలును ఇవ్వవలెనని ఆరాటపడుచున్నాను” అని అరచెను. నా హృదయములో ఆనందముతో నేను, “ఇప్పుడు నా వద్ద ఒకటి లేదు, కాని మీరు మీ చిరునామా ఇచ్చినయెడల నేనొకదానిని మీయొద్దకు తీసికొనివత్తును” అని జవాబిచ్చితిని. మరుసటిదినమున నేనొక బైబిలును తీసికొని అతని ఇంటికి వెళ్ళి, దానిని ఎట్లు చదువవలెనో కూడా అతనికి వివరించితిని. అతడు మిక్కిలి కృతజ్ఞుడై, దేవుని వాక్యముకొరకు మిక్కిలి ఆకలిగలవాడై, బైబిలుకు వెలచెల్లించుటయేగాక నాకు కేకులను టీని కూడా సమృద్ధిగా ఇచ్చెను, రక్షణను గూర్చి అతనితో మాటలాడు భాగ్యము నాకు కలిగెను. నేను నా స్వంతజ్ఞానము ప్రకారము వెళ్ళియుంటే, నేను అతనితో మాటలాడకయో సువార్తపత్రిక ఇవ్వకయో ఉండియుందును. నేను విధేయత చూపినప్పుడు మాత్రమే దేవుడు ఎట్లు పనిచేయునో నేను చూడనారంభించితిని.
దేవుడు మొదట్లో మనకు ఎక్కువగా చెప్పడు. ఆయన కేవలము మిక్కిలి చిన్న వాక్యములను మాత్రమే చెప్పును. కాని మనము మెట్టుమెట్టుగా ఆయనకు విధేయత చూపుకొలది ఆయన మనకు అనేక సంగతులను చెప్పును. దేవుడు మాటలాడునప్పుడు దీర్ఘమైన సందేశముకొరకు వేచియుండకుడి. ఆయన మీతో చెప్పినంతమేరకు మాత్రమే విధేయత చూపుడి. సౌలు ఆ స్వరమునకు విధేయత చూపి దమస్కునకు వచ్చినప్పుడు, అతనికి తెలియకయే దేవుడు అతనియొద్దకు వెళ్ళుటకు మరియొక సేవకుని అతనియొద్దకు వెళ్ళుటకు సిద్ధపరచియుండెను. అననీయ సౌలుయొద్దకు వచ్చి అతనితో మాటలాడనారంభించెను (Acts 22:12). సౌలుతో మాటలాడుచున్నది అననీయయొక్క స్వరమువలె కనిపించెను. కాని వాస్తవానికి అది దేవుని స్వరమే. Acts 9: 10-15 లో, అననీయ మొదట సౌలుయొద్దకు వెళ్ళుటకు తిరస్కరించెను, కాని దేవుడు అతనిని అట్లు చేయుటకు సిద్ధపరచెను. దేవుడు అననీయను ఎట్లు సిద్ధపరచి పంపెనో సౌలుకు ఎన్నడును తెలియలేదు. అతడు సౌలుయొద్దకు వచ్చినప్పుడు అతనికి ప్రభువుయొక్క సందేశమునిచ్చెను. అవి అననీయయొక్క మాటలుకావుగాని సౌలుతో మాటలాడుచున్న ప్రభువైన యేసుక్రీస్తుయొక్క మాటలే, అతడు పౌలాయెను. దేవుడు తనను అంగీకరించెనని అననీయ అతనితో చెప్పెను, అతడు దానిని నమ్మెను. అతడు దానిని సందేహించి, “ఈ సంవత్సరములన్నిటిలో నేను ప్రభువైన యేసుక్రీస్తుకు ఎంత హానిని కలుగజేసితిని. ఎంతమంది శిష్యులను నేను చెరసాలకును ఇతర స్థలములకును ఈడ్చుకొనిపోయి ప్రభువైన యేసుక్రీస్తుపై దూషణమాటలు వాడితిని. ఇటువంటి భయంకరమైన పాపము ఇంత సులభముగా ఎట్లు క్షమింపబడును?” అని చెప్పియుండగలడు.
తాను పాపులలో ప్రధానుడనని ఒప్పుకొనుటకు పౌలు ఎన్నడును అలసిపోలేదు. ప్రభువైన యేసుక్రీస్తునుండి అననీయద్వారా సందేశము సరళరీతిలో వచ్చినప్పుడు, పౌలు నమ్మెను. “నా పాపములు తొలగిపోయినవి,” అని అతడు చెప్పగలిగెను. “నేను హింసించిన నా ప్రభువు నన్ను ఏర్పరచుకొని, నన్ను స్వీకరించి, నన్ను అంగీకరించెను. ఆయన నన్ను క్షమించుటమాత్రమేగాక నన్ను తన సాక్షిగా చేసియున్నాడు. ఆయన మహిమను చూచి, ఆయన స్వరమును ప్రతిదినము వినవలెనని ఆయన కోరుచున్నాడు.” కొద్దిమంది మాత్రమే దేవుని మాటలను నమ్మిరి. సౌలు, “అననీయా, నా పాపములు తొలగిపోయెనని నీకెట్లు తెలియును?” అని చెప్పియుండగలడు, కాని ఏ వాదనయు లేకుండగనే అతడు అంగీకరించెను, ఏలయనగా అతడు ప్రభువైన యేసునందు స్వయముగా విశ్వసించెను, ఆయనే అననీయద్వారా తనతో మాటలాడెనని నమ్మెను. ప్రభువు తన దూతలద్వారాను, సేవకులద్వారాను, సాక్షులద్వారాను ఈ విధముగానే మాటలాడును. ఎక్కడనో ఎవరో పలికిన మాటలు సాధారణమైన మాటలు కావని మీ మనస్సాక్షిలో మీకు తెలియును.
కొన్ని సంవత్సరముల క్రితము నేను ఒక యువకుని కలిసికొనుటకు ఒక ఇంటికి వెళ్ళితిని. కొంతసేపు మాటలాడుచుండగా, అకస్మాత్తుగా అతని స్నేహితులు నాతో, “మేము కొంచెము ఆహారము సిద్ధపరచుచుండగా, మీరు మాటలాడుచుండుడి” అని చెప్పిరి. అప్పుడు నేను ఆ యువకుని ముఖమును చూచితిని. అది నేను అతనిని కలిసికొన్న మొదటిసారి. నాలో ఒక స్వరము, “ఈ యువకునితో దీనిని చెప్పుము” అని వినబడెను, నేను, “ఈ యువకుని నేనెరుగను, కాని అతడు మిక్కిలి కోపగించుకొనుననునది నాకు తెలియును” అని తలంచితిని. మరల అవే మాటలు నాకు వినబడెను: “ఆ పాపమును విడువకున్న అతడు నరకమునకు వెళ్ళుననియు అతనితో చెప్పుము.” నేను అతనితో, “నీవు ఆ పాపమును విడువకున్న నీవు నరకమునకు వెళ్ళుదువు” అని చెప్పితిని. అంతలో అతని స్నేహితులలో ఒకడు కాఫీ తీసికొనివచ్చెను, ఆ యువకునితో మరింత మాటలాడకుండా అతడు నన్ను రక్షించినందుకు నేను సంతోషించితిని. మరుసటి ఉదయమున నాకొక టెలిఫోను వచ్చెను, ఒక వృద్ధుడు, “నేను వచ్చి మిమ్మును కలిసికొనవచ్చునా?” అని అడిగెను. నేను, “దయచేసి వెంటనే రండి” అని జవాబిచ్చితిని. మిక్కిలి పొడవైన వ్యక్తియొకడు నా గదిలోనికి నడచివచ్చి, కన్నీళ్ళతో నాతో, “నిన్న రాత్రి నా కుమారునితో మాటలాడినందుకు కృతజ్ఞతలు తెలుపుటకు నేను స్వయముగా వచ్చితిని” అని చెప్పెను. నేను, “అయ్యా, నేను అతనితో ఏమియు చెప్పలేదు” అని జవాబిచ్చితిని. అతడు నాతో, “మీరు మాటలాడిన ఆ యువకుడు నా కుమారుడు. అతడు రెండు సంవత్సరములుగా ఎవరితోనో పాపములో జీవించుచుండెను. అతడు ఇంటిని విడిచి వెళ్ళిపోయెను. నేనును నా భార్యయును మిక్కిలి హృదయవేదనను అనుభవించితిమి. మీరతనితో ఏమి చెప్పితిరో నాకు తెలియదు, కాని మిమ్మును కలిసిన తరువాత అతడు మాయొద్దకు వచ్చి మా పాదములపై పడి క్షమాపణ కోరెను” అని చెప్పెను. అది నేనా వ్యక్తిని కలిసికొన్న మొదటిసారి. నేనతనిని ఎరుగను. అతని వ్యక్తిగత జీవితమును గూర్చి కూడా నాకు తెలియదు. అయినను ప్రభువు నాతో స్పష్టముగా మాటలాడి, “నీవు ఆ పాపమును విడువకున్న నీవు నరకమునకు వెళ్ళుదువు” అని అతనితో చెప్పుమని పట్టుబట్టెను. ఈ విధముగా, తాను సిద్ధపరచిన హృదయములుగలవారితో మాటలాడుటకు ప్రభువు తన దూతలను, సాక్షులను ఉపయోగించును. కొన్నిసార్లు అవి ఆదరణమాటలు లేదా మార్గదర్శకమాటలుగా ఉండును. దేవుడు మీతో మాటలాడునప్పుడు దయచేసి శ్రద్ధగా వినుడి, దేవుడు అతనిద్వారా మాటలాడునప్పుడు ఆ ప్రసంగీకునిపై కోపగించుకొనకుడి.
కొన్ని సంవత్సరముల క్రితము ఒక యువకుడు మిక్కిలి బలవంతముపైన ఒక సభకు వచ్చెను. అతని తల్లి నిరంతరము అట్లు చేయుమని అతనిని అడుగుచుండెను కాని అతడు గతంలో ఎల్లప్పుడును తిరస్కరించుచుండెను.
ఒక సాయంకాలము ఎవరికిని చెప్పకుండగనే అతడు ఒక సభకు వచ్చెను. సభ ముగిసిన తరువాత అతడు ఇంటికి వెళ్ళి తన తల్లిపై మిక్కిలి కోపగించుకొనెను. అతడామెను, “నీవు వెళ్ళి ఆ ప్రసంగీకునికి నా గురించి అన్నియు ఎందుకు చెప్పితివి” అని అడిగెను. ఆమె అతనితో, “నా కుమారుడా, నేను నీ గురించి ఎవరితోను ఒక్క మాటయైనను చెప్పలేదు” అని చెప్పెను. ఆ బాలుడు ఆమెను నమ్ముటకు తిరస్కరించి, “వద్దు వద్దు, నీవు తప్పక అట్లు చేసియుంటివి. నేనొక మూలలో కూర్చుండగా ప్రసంగీకుడు నావైపు తన వేలును చూపెను. నేనా మూలను వదిలి వేరొక చోటికి వెళ్ళి కూర్చుంటిని, మరల అతడు తన వేలును చూపెను. తరువాత నేను వెళ్ళి వెనుక కూర్చుంటిని. మరల అతడు నావైపు తన వేలును చూపెను. అతడు చెప్పినదంతయు నా గురించియు, నాకొరకును, నా ఒక్కనికొరకును మాత్రమే. నా గురించి అతనికెట్లు తెలిసియుండును?” అని చెప్పెను. “వద్దు నా కుమారుడా, నేనతనితో ఏమియు చెప్పలేదు” అని తల్లి జవాబిచ్చెను. “దేవుడు నీతో మాటలాడుచున్నాడు. నీ పాపములకు పశ్చాత్తాపపడి క్షమింపబడుము.” అతడు పశ్చాత్తాపపడెను, ఎంతటి గొప్ప మార్పు కలిగెనో! అతడు ప్రభువుయొక్క నిజమైన సాక్షియయ్యెను.
ప్రభువు తనకు మంచిదని తోచినరీతిగా మనమందరితోను మాటలాడును. కావున ప్రసంగీకుడు తన వేలును మీవైపు చూపకముందే మీరు సభలో అశాంతిగా భావించినయెడల, “ప్రభూ, ఇది నీ స్వరమా లేక మనుష్యుని స్వరమా? అది నీ స్వరమైతే నేను అంగీకరించి నన్ను తగ్గించుకొందును. నాయందు కనికరముంచుము” అని ప్రార్థనలో చెప్పుడి. ప్రభువు అనేకసార్లు మీతో మాటలాడుటకు మరొకరిని ఉపయోగించుననునది మీరు కనుగొందురు, కావున ఆయన ఎల్లప్పుడును మీతో ప్రత్యక్షముగా మాటలాడుననుకొనకుడి.
లో ఉన్నటువంటి మాటలు Acts 19:9 పౌలుకు ఎల్లప్పుడును వచ్చెడివి కావు. కాని అతడు నిరుత్సాహపడి, శత్రువుయొక్క దాడి మిక్కిలి బలముగా ఉన్నప్పుడు దేవుని స్వరము అతనికి వచ్చి, “భయపడకుము, మాటలాడుము, మౌనముగా ఉండకుము. నేను నీతోకూడ ఉన్నాను, ఎవడును నిన్ను హింసింపడు, ఈ పట్టణములో నాకు అనేకమంది ప్రజలున్నారు” అని చెప్పెను. మనము ఆయన నోటిపలుకువాహకులుగను సాక్షులుగను అగుటవలననే వివిధసమయములలో ఆయన స్వరమును వింటుము. దేవుని రక్షించు, కాపాడు శక్తిని గూర్చి కొన్ని మాటలైనను చెప్పుటకు మనలో అనేకులము భయపడుదుము. ప్రతి విశ్వాసియు, గ్రుడ్డిగా జన్మించి చూపునొందిన వ్యక్తివలె దేవునికి సాక్షి, అతడు ధైర్యముగా, “నేను హింసింపబడిననూ సరే, ఒక్క సంగతి నాకు తెలియును, నేను గ్రుడ్డిగా జన్మించితిని, కాని ఇప్పుడు నేను చూచుచున్నాను” అని చెప్పెను.
మీ కళాశాల స్నేహితులతో దీనిని చెప్పుట మిక్కిలి ఎక్కువా? మనలో చాలామంది మనము మరల జన్మించితిమని ఎప్పుడో ఒక సభలో సాక్ష్యమిచ్చియుంటిమి, కాని స్నేహితులయెదుటను, బంధువులయెదుటను, తోటిపనివారియెదుటను, తోటివిద్యార్థులయెదుటను ఆయన రక్షించు శక్తికి మీరు సాక్షియైయుంటిరా? వారు మిమ్మును ఎగతాళి చేసిననూ, “ఒక్క సంగతి నాకు తెలియును, నేను పాపినైయుంటిని, కాని ప్రభువైన యేసుక్రీస్తు నా పాపములను క్షమించెను. ఇది మొదటిసారి ఒక నిర్దిష్టస్థలములో ఒక నిర్దిష్టదినమున జరిగెను. ఒక్క సంగతి నాకు తెలియును, నేను సమాధానమును పొందితిని” అని మీరు యథార్థముగా చెప్పగలరు. మీరు చెప్పునది వారు అంగీకరింపకపోయిననూ, శాంతముగాను ఆనందముగాను సాక్ష్యమిచ్చుచునే ఉండుడి. తరువాత ఒకనాడు మీరు శత్రువుచేత చుట్టుముట్టబడి ఒంటరిగా భావించునప్పుడు, దేవుని స్వరము మీయొద్దకు వచ్చి, “భయపడకుము, నేను నీతోకూడ ఉన్నాను; భయపడకుము, నేను నీతోకూడ ఉన్నాను. నా నామమున మాటలాడుచునే ఉండుము” అని చెప్పవచ్చును. ఇటువంటి సాక్ష్యమే దేవుని స్వరమును వినుటకు మనలను అర్హులనుగా చేయును.
నేను దీనిని అనుభవముద్వారా తెలిసికొంటిని, ఏలయనగా అనేకసార్లు నేను ముఖములకు భయపడితిని. తొలిదినములలో నేను ఒక్క మాటయైనను మాటలాడజాలకుంటిని. నేను నత్తివాడనుగను తడబడువాడనుగను ఉండి, మాటలాడుటకైనను నేను పోరాడవలసివచ్చెడిది. అది మిక్కిలి సిగ్గుపడు సంగతిగా ఉండెడిది, కాని దేవుని స్వరము, “భయపడకుము, నేను నీ నాలుకను తాకెదను. నీవు నా నోటిపలుకువాహకుడవు, నేను నిన్ను ఉపయోగించుకొందును” అని చెప్పెను. ఒక్క సంగతి నాకు తెలియును కావున నేను, “నా పాపములు తొలగిపోయెననియు నాకు నిజమైన సమాధానము కలదనియు నాకు తెలియును. మీకా సమాధానము కలదా?” అని చెప్పితిని. ఈ కొద్ది మాటలు మాత్రమే స్వేచ్ఛగా పలుకబడెను, తరువాత నేను, “నేను నీతోకూడ ఉన్నాను; నేను నీతోకూడ ఉన్నాను!” అను ఈ మాటలను వింటిని. ఆయన రక్షించు, కాపాడు శక్తికి సాక్ష్యమిచ్చుచునే ఉండుడి, ఆయన తప్పక మీతో మాటలాడును.
అపొస్తలుడైన పౌలుతో యెరూషలేమునకు వెళ్ళుమని దేవుడు చెప్పెను. తరువాత రోమునకు వెళ్ళవలెనని కూడా ఆయనతో చెప్పెను.
యెరూషలేమునకు మార్గములో, కైసరయలో అగబు అను ఒక ప్రవక్త పౌలుయొక్క నడికట్టును తీసికొని తన స్వంత చేతులను కాళ్ళను బంధించుకొని, “ఈ నడికట్టు ఎవనిదో ఆ మనుష్యుని యూదులు యెరూషలేములో ఈ ప్రకారము బంధించెదరని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు” అని చెప్పెను (Acts 21:11). దీనిని విన్నప్పుడు అతని స్నేహితులు అతనిని యెరూషలేమునకు వెళ్ళకుండ వారించుటకు ప్రయత్నింపనారంభించిరి. ఆ ప్రవక్త, “యెరూషలేమునకు వెళ్ళకుము” అని ఎన్నడును చెప్పలేదు. అక్కడికి వెళ్ళుటవలన పౌలు బంధింపబడుననియు అతడు ఎన్నడును చెప్పలేదు. తన స్నేహితులు తన ప్రయాణమును రద్దుచేయుమని అతనిని ఒత్తిడి చేసినప్పుడు పౌలు వారితో, “మీరేల ఏడ్చుచు నా హృదయమును బద్దలుచేయుచున్నారు? నేను బంధింపబడుటకు మాత్రమేగాక చనిపోవుటకు కూడా సిద్ధముగా ఉన్నాను” అని చెప్పెను. అప్పుడు వారు, “దేవుని చిత్తము నెరవేరునుగాక” అని అంగీకరించిరి. యెరూషలేమునకును తరువాత రోమునకును వెళ్ళుట తనకొరకు దేవుని చిత్తమని పౌలుకు బాగుగా తెలియును.
అతడు ఖైదీగా రోమునకు తీసికొనిపోబడినప్పుడు, గొప్ప తుఫానొకటి వచ్చి వారు నాశనమగుటకు సిద్ధముగా ఉండిరి. మనమిదివరకే చూచినట్లు, వారు తమ స్వంతచేతులతో ఓడ సామానులను పారవేయుచుండిరి. త్రాళ్ళు కోయబడెను, తెరచాపలు దించివేయబడెను. ఆ తుఫానులో బ్రతికియుండుటకు ఏ ఆశయు లేకుండెను. అప్పుడు మరల ప్రభువు అతనికి కనబడి తన చిత్తమును ధృవపరచెను (Acts 27:24). “పౌలూ, భయపడకుము. నేను నీతోకూడ ఉన్నాను. నీవు కైసరు యెదుట తీసికొనిరాబడవలెను. ఓడలోని వీరందరిని నేను నీకు అనుగ్రహించియున్నాను. వీరును రక్షింపబడబోవుచున్నారు.” ఇతరులు భయముతో ఏడ్చుచు, “మనము నశించిపోవుచున్నాము, మనము నశించిపోవుచున్నాము” అని చెప్పుచుండగా, తాము రక్షింపబడబోవుచున్నామని పౌలు వారికి నిశ్చయత కలుగజేసెను. అతడు వారితో, “నేనెవనివాడనో నేనెవనికి సేవచేయుచున్నానో ఆ దేవునియొక్క దూత నా ప్రక్కన నిలిచి, ‘పౌలూ, భయపడకుము. నీవు కైసరు యెదుట తీసికొనిరాబడవలెను, ఇదిగో, నీతోకూడ ప్రయాణించువారందరిని దేవుడు నీకనుగ్రహించియున్నాడు’ అని చెప్పెను” అని చెప్పెను. దేవుడు చెప్పినట్లే జరిగెను. అందరును రక్షింపబడిరి. పౌలు దేవుని స్వరమును ఎట్లు వినెను? అతడు దేవుని చిత్తమును గూర్చి నిశ్చయతగలిగియుండుటవలననే. తాను రోమునకు వెళ్ళవలెననునది తనకొరకు దేవుని చిత్తమని. అందుకనే అతని చెవులు దేవుని స్వరమునకు సున్నితముగా ఉండెను. మీరు దేవుని చిత్తములో ఉన్నప్పుడు మాత్రమే దేవుని స్వరము మీతో మాటిమాటికిని మాటలాడుటను మీరు వినగలరు.
దేవుని స్వరము ధృవీకరణగా వచ్చును. దేవుని స్వరమును స్పష్టముగా వినగోరుచున్నారా? అయిన యెడల, మిక్కిలి చిన్న విషయమునందు కూడా ప్రతిదినము దేవుని చిత్తమును కనుగొని జరిగించుటను నేర్చుకొనుడి. ఎవరైనను నన్ను, “క్రైస్తవునిగా నీ అత్యున్నత భాగ్యమేమి?” అని అడిగినయెడల, దేవుని చిత్తమును తెలిసికొని జరిగించుటయే నా అత్యున్నత భాగ్యమని నేను జవాబిచ్చెదను. దేవుని చిత్తమును తెలిసికొని దానిని జరిగించువారు, దేవుని వాక్యముద్వారాగాని, ఆయన దూతలద్వారాగాని, ఇతర పరిస్థితులద్వారాగాని దానిని కనుగొందురు.
లోని గ్రీసుదేశస్థులు John 12:21 దూరమునుండి వచ్చి మన ప్రభువైన యేసుక్రీస్తును చూడగోరిరి. వారు తమ విన్నపమును ఫిలిప్పుద్వారా పంపిరి, అతడు అంద్రెయయొద్దకు వెళ్ళెను, ఇద్దరును యేసుయొద్దకు వెళ్ళి, “ఈ గ్రీసుదేశస్థులు నిన్ను చూడగోరుచున్నారు” అని చెప్పిరి. యేసుయొక్క జవాబును మనము వచనములు 24,28,30లో కనుగొందుము. ఈ మనుష్యులు యేసును చూచుటకు పూర్తి యథార్థతతో వచ్చిరి. మన ప్రభువు వారితో, “మీరు నన్ను కేవలము కొన్ని నిమిషములు మాత్రమే చూడగోరుచున్నారు. కాని నన్ను నిత్యము చూచుటకును, ఎల్లప్పుడును వినుటకును మీకు వీలగును. కేవలము నన్ను చూచుటద్వారాను అద్భుతములను చూచుటద్వారాను మీరు శాశ్వతమైన సంతృప్తిని పొందలేరు. నేను మీకొక రహస్యమును బోధింపగోరుచున్నాను. నా మరణములో మీ మరణమును చూచి, నా పునరుత్థానజీవములో మీ నూతనజీవమును జీవించినయెడల, అప్పుడు మీరు నిజముగా నన్ను ప్రతిదినము చూచి, నా స్వరమును వినగలుగుదురు” అని చెప్పెను. ఇదియే 23వ వచనముయొక్క భావము. ఇది ఎట్లు జరుగును? జవాబు 24వ వచనమునందున్నది: గోధుమగింజ ఒకదానిని తీసికొని నేలలో విత్తి నీళ్ళుపోయుడి. ఒక సంవత్సరకాలములో మీరు ఐదువేల గింజలను కోయగలుగుదురు. ఆ గోధుమగింజలను ఐదు సంవత్సరములు విత్తుచు కోయుచునే ఉండుడి. అప్పుడు మొదటి ఒక్క గింజనుండి వచ్చిన మొత్తము గింజలు ఒక సరుకురైలును నింపుటకు మించి సరిపోవును. ఒక్క గింజ అనేక గింజలను ఫలించునట్లే, తన మరణము, సమాధి, పునరుత్థానముద్వారా, తనవంటి అనేకమంది కుమారులను ఆయన ఉత్పన్నము చేయుననునది మన ప్రభువు సూచించుచుండెను (1 John 3:2).
). మన ప్రభువు రెండవసారి వచ్చునప్పుడు మనము ఆయనను ఆయనయున్నట్లుగా చూతుము, ఆయనవలె అగుదుము. పరలోకమునకు వెళ్ళునప్పుడు మనము మన ప్రభువైన యేసుక్రీస్తును చూతుము, ఆయనచుట్టును ఆయనవంటివారు అనేకమందిని చూతుము. గ్రీసుదేశస్థులు, “మేము యేసును చూడగోరుచున్నాము” అని చెప్పుచుండిరి. మన ప్రభువు వారికి, “మీరు నన్ను చూడగోరుచున్నారు మాత్రమే, కాని నేను మిమ్మును నావలె చేయగోరుచున్నాను. అయితే, మొదట మీరు నా మరణములో చావవలెను, నా పునరుత్థానములో పాలివారు కావలెను, చివరకు మీరు నావలె అయి నిత్యత్వముకొరకు నా స్వరమును భరించుదురు” అని జవాబిచ్చెను.
మన ప్రభువు John 13:28లో ప్రార్థించెను. “తండ్రీ, నీ కుమారుని మహిమపరచుము, అప్పుడు అనేకులు నీ సంపూర్ణ మహిమలో నన్ను చూచి నావలె అగుదురు.” అప్పుడు ఆ స్వరము వచ్చెను. మన క్రియలన్నిటిద్వారా ఆయన నామమును మనము మహిమపరచునప్పుడు మాత్రమే మనము ఆయన స్వరమును వింటుము. విశ్వాసముతో ప్రార్థించుడి, “ప్రభూ, నా ద్వారా నీ నామము మిక్కిలిగా మహిమపరచబడునట్లు నేను జీవించగోరుచున్నాను. ప్రభూ, నా ప్రణాళికలద్వారాను, మాటలద్వారాను, క్రియలద్వారాను నీ నామము మహిమపరచబడుచున్నదా అని నాకు తెలియజెప్పుము.” సాధారణముగా మనము, “ప్రభూ, నీవు నా ప్రార్థనను తప్పక వినవలెను. నీవు జవాబిచ్చినయెడల నేను నీకు రు. 10 ఇచ్చెదను. నేను మొదటి తరగతిలో ఉత్తీర్ణుడనైతే రు. 10 ఇచ్చెదను, కాని మూడవ తరగతిలో ఉత్తీర్ణుడనైతే కేవలము రూ. 1 మాత్రమే” అని ప్రార్థింతుము. ఇదియే మన స్థితి. దానికి బదులుగా, మీ విజయముద్వారానైనను ఓటమిద్వారానైనను, జీవముద్వారానైనను మరణముద్వారానైనను, ఆరోగ్యముద్వారానైనను రోగముద్వారానైనను, దరిద్రతద్వారానైనను సంపదద్వారానైనను, ఆయన మహిమపరచబడవలెననియే మాత్రమే ప్రార్థింపుడి. “ప్రభూ, నీ నామమును నేను మహిమపరచగలిగినచోట నన్నుంచుము. మరేదియు నేను వెదకనుగాక, కోరనుగాక.” అప్పుడు మీరు దేవుని స్వరమును వినుదురని నేను మీకు నిశ్చయత ఇచ్చుచున్నాను. మీరేమి చేయవలెనో మీకు చెప్పుటకు పరలోకమునుండి ఒక స్వరము వచ్చును. దేవుడు మాటలాడును, కాని ఆయన స్వరమును మీరు వినుటకుముందు ఆయన నిబంధనలను మీరు నెరవేర్పవలెను.
అధ్యాయం 5
↑ పైకి వెళ్ళండి ← పుస్తకానికి వెనుకకు ← పుస్తక భాండాగారానికి
