సూత్రాలు 49–72
49. పాపపరిహార పత్రాలమీద నమ్మకంలేకపోయినా వాటిని కొన్నవాళ్ళకవి ఉపయోగకరంగానే ఉంటాయిగాని, వాటినిబట్టి దేవునిమీద వాళ్ళకుండాల్సిన భయభక్తులు తగ్గిపోతేమాత్రం అవే వాళ్ళకు హానికరంగా మారతాయని క్రైస్తవులకు బోధించాలి.
50. పాపక్షమాపణా పత్రికల్ని బోధకులు నిర్బంధంగా అమ్ముతున్నసంగతి పోపుకుగనక తెలిస్తే, తన గొర్రెల (సంఘస్తుల) రక్తమాంసాలతో పరిశుద్ధ పేతురు దేవాలయం కట్టబడటంకంటే అది కాలి బూడిద కావటానికే పోపు ఇష్టపడతాడని క్రైస్తవులకు బోధించాలి.
51. పాపక్షమాపణ పత్రికలమ్మేవాళ్ళు మోసపు మాటలు చెప్పి ప్రజలసొమ్ము దోచుకుంటున్నారన్న సంగతి పోపుకు గనక తెలిస్తే తన స్వంత డబ్బుల్తోపాటు అవసరమైతే పరిశుద్ధ పేతురు దేవాలయాన్ని సైతం అమ్మి వాళ్ళడబ్బులు వాళ్ళకు తిరిగివ్వటం తనధర్మంగా పోపు భావిస్తాడని క్రైస్తవులకు బోధించాలి.
52. ఈ పత్రికల్ని సరఫరా చేసేవాళ్ళుగాని, లేదా చివరికి పోపుగాని వాటిమీద తమ ఆత్మల్ని పణంగా పెట్టినప్పటికీ పాపక్షమాపణ పత్రికలద్వారావచ్చే రక్షణ అభయం వ్యర్థమైందే.
53. పాపక్షమాపణ పత్రికలగురించి చెప్పటంకోసం కొన్ని దేవాలయాల్లో దేవుని వాక్యం బోధించబడకుండా ఆటంకంపెట్టేవాళ్ళు క్రీస్తుకు, పోపుకు విరోధులు.
54. ఒక ప్రసంగంలో పాపపరిహార పత్రాలగురించి చెప్పటానికి దేవుని వాక్యంతో సమానంగాగాని, లేదా ఎక్కువగాగాని సమయాన్ని వెచ్చించినప్పుడు అది దేవుని వాక్యాన్ని కించపర్చినట్లవుతుంది.
55. చాలా చిన్నపాటి విషయమైన పాపక్షమాపణ పత్రాలకోసం ఒక గంటకొట్టి, ఓ వూరేగింపుచేసి, కొన్ని కర్మకాండలు జరిపినప్పుడు మహత్తరమైన సత్యసువార్తను ప్రకటించటంకోసం వందగంటలు కొట్టి, వంద వూరేగింపులు జరిపి వంద కర్మకాండలు చెయ్యాలని పోపు తలంచాలి.
56. ఈ పాపపరిహార పత్రికల్ని ఏ సంఘ ఖజానాలోంచి తీసి పోపు ఇస్తున్నాడో అది ప్రస్తావించబడలేదు, కైస్తవ ప్రజలకు దాన్నిగురించి ఏమీ చెప్పబడలేదు.
57. చాలామంది బోధకులు ఈ ఖజానాలోని మూలధనాన్ని ఇష్టమొచ్చినట్టు వాడిపారేయకుండా ఎంతో జాగ్రత్తగా సమకూర్చటం చూసినప్పుడు ఈ ఖజానాలోని ధనం కచ్చితంగా ఈలోక సంబంధమైంది కాదని అనిపిస్తుంది.
58. ఈ ఖజానాలోని మూలధనం క్రీస్తుకు, పరిశుద్ధులకు చెందిన పుణ్యఫలమేమీకాదు. ఎందుకంటే పోపుతో నిమిత్తం లేకుండానే ఇది అంతరంగపురుషుడికి క్రుపను, బాహ్యపురుషుడికి సిలువ, మరణం, నరకాలను ఇస్తుంది.
59. సంఘంలోని పేదవాళ్ళే సంఘానికి నిజమైన ఖజానా అని పరిశుద్ధుడైన లారెన్స్ అన్నాడు. అయితే తనకాలంలో ఆమాటకున్న వాడుకనిబట్టి ఆయన అలా అన్నాడు.
60. ఈలోకంలోనూ పరలోకంలోనూ బంధించటానికి, విప్పటానికి సంఘానికి క్రీస్తు అనుగ్రహించిన తాళపుచెవుల అధికారమే ఆఖజానాకి మూలధనమని మేముచెప్పటంలో తొందరపాటుతనమేమీలేదు.
61. అయితే కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో పాపవిధుల్ని కొట్టెయ్యడానికి పోపుకు స్పష్టమైన అధికారం చాలినంత ఉంది.
62. మహిమతో నిండిన మహాపరిశుద్ధమైన సువార్త, దేవుని క్రుప ఇవే సంఘానికి నిజమైన ఖజానా.
63. ఇది మొదటివాళ్ళని చివరివాళ్ళగా చేస్తుంది కాబట్టి సహజంగానే చాలామంది దీన్ని అసహ్యించుకుంటారు.
64. అయితే పాపపరిహార పత్రికల ఖజానా చివరివాళ్ళని మొదటివాళ్ళగా చేస్తుంది కాబట్టి సహజంగానే దీన్ని అందరూ మెచ్చుకుంటారు.
65. కాబట్టి సువార్త అనే ఖజానా గతంలో ధనవంతుల్ని దేవునికోసం పట్టే వల వంటిదై ఉంది.
66. ఇప్పుడైతే ఈ పాపపరిహార పత్రికల ఖజానా ధనంకోసం మనుషుల్నిపట్టే వలలాంటిదైఉంది.
67. ఇవి మహాగొప్ప కుపలు అంటూ బోధకులు కేకలుపెట్టి చెప్పే ఈ పాపపరిహార పత్రికలు నిజంగానే గొప్పవేమో అనిపిస్తుంది. ఏందుకంటే ఇవి దండిగా లాభాలు తెచ్చిపెడుతున్నాయిగదా!
68. అయితే దేవుని క్రుపపట్ల, సిలువపట్ల ఉన్న విశ్వాసాలతో పోలిస్తే నిజానికివి చాల చిన్నపాటి క్రుపలు.
69. బిషప్పులు, చిన్న పాదుర్లు ఈ పాపపరిహార పత్రికలు సరఫరాచేసేవాళ్ళని గౌరవంగా తమదగ్గరకు చేర్చుకోవాల్సిందే!
70. కానీ పోపు చెప్పమన్నదానికి బదులుగా తమస్వంత కల్పితాలు చెపుతున్నప్పుడు మాత్రం వాళ్ళమీద ఓకన్నేసిఉంచాల్సిన బాధ్యత వాళ్ళమీదుంది.
71. ఈ పాపపరిహార పత్రికలను గురిచిన వాస్తవాల్ని వ్యతిరేకించేవాడు దౌర్భాగ్యుడు, శాపగ్రస్తుడు.
72. అలాగే ఈ పాపపరిహార పత్రికలమ్మే బోధకుల దురాశల్ని, విచ్చలవిడితనాన్ని ఖండించేవాడు ధన్యుడు.
