English | తెలుగు | हिन्दी

అధ్యాయం 6

జూన్

దేవుని రహస్యం · బఖ్త్ సింగ్

జూన్

జూన్ 1

“ఇదిగో నా ప్రియకుమారుడు, ఇతనియందు నేను ఆనందించుచున్నానను స్వరము ఆకాశమునుండి పలికెను.” (Matt 3:17)

బాప్తిస్మమిచ్చు యోహాను ప్రభువైన యేసుక్రీస్తుకొరకు మార్గమును సిద్ధపరచుటకు లోకములోనికి వచ్చెను. అతడు అరణ్యములో మారుమనస్సును ప్రకటించుటకు ప్రారంభించెను, కాని ఆ సందేశము ప్రజలు అంగీకరించుటకు తేలికైనదికాదు. ప్రజలు అతనిని వినుటకు దూరస్థలములనుండి వచ్చిరి, మరియు అతడు ప్రకటించినది వారిని సంతోషపెట్టు సందేశముకాదు, కాని జీవముగల దేవుని అధికారముతో కూడిన సందేశము. అతడు, “మారుమనస్సు పొందుడి, పరలోకరాజ్యము సమీపించియున్నది” అని చెప్పినప్పుడు అతడు ఏ భేదమును చూపలేదు.

ఆ సందేశమును వినినవారు తమ పాపములకు మారుమనస్సుపొంది వాటిని ఒప్పుకొని బాప్తిస్మము పొందిరి. అటువంటి గొప్ప ప్రవక్తచేత బాప్తిస్మము పొందుటవలన తమకు ఏదో ఆశీర్వాదము కలుగుననుకొనియుండవచ్చును. బాప్తిస్మము పొందుటకు వచ్చినవారిలో కొందరు జాతి నాయకులు కూడ ఉండిరి, మరియు వారిని చూచి యోహాను, “రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మిమ్మును బోధించినవాడెవడు? మారుమనస్సుకు తగిన ఫలములు ఫలింపుడి” అని కేకవేసెను.

ఒకనాడు ప్రభువైన యేసుక్రీస్తు స్వయముగా బాప్తిస్మము పొందుటకు వచ్చెను. యోహాను సువార్తలో లేఖనము చెప్పుచున్నదేమనగా, ఆ దినమువరకు, బాప్తిస్మమిచ్చు యోహానుకు ప్రభువైన యేసు వాస్తవముగా ఎవరో స్వయముగా తెలియకుండెను (John 1:31). మన ప్రభువైన యేసుక్రీస్తు జనసమూహములో మిక్కిలి నెమ్మదిగా వచ్చి బాప్తిస్మమిచ్చు యోహానును తనకు బాప్తిస్మమివ్వమని కోరెను. యోహానుకు సహజముగా యేసును గురించి కొంత తెలియును. అతని బంధువు అగుటచేత, కాని ఆయన మెస్సీయ అని అతనికి తెలియకుండెను. ఆకాశము తెరవబడుటను, పరిశుద్ధాత్మ పావురమువలె యేసుక్రీస్తుమీదికి దిగివచ్చుటను యోహాను చూచినప్పుడు, ఆయన ఎవరో అతనికి ఖచ్చితముగా తెలిసెను. మరుసటి దినమున, అతడు, “ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల” అని ప్రకటించెను.

నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “యెహోవాను ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి.” I Chron16:11.

జూన్ 2

“మార్గము ఇదే, దీనిలో నడువుడి.” (Isa.30. 21) దేవుని స్వరము పలికినప్పుడు మాత్రమే యేసు ఎవరో యోహానుకు తెలిసెను. మీరు కూడ దేవుని స్వరమును వినినిదే దేవుడెవరో మీకు ఎన్నడును తెలియదు. మీరు అనేక కూటములకు హాజరైయుండవచ్చును, మీకు బైబిల్‌గురించి ఎంతో తెలిసియుండవచ్చును, మరియు మీరు అనేక త్యాగములను చేసియుండవచ్చును, కాని మీరు దేవుని స్వరమును వినినిదే, ఇవన్నియు మీకు ఆత్మీయముగా ఎట్టి విలువను కలిగియుండవు.

ప్రభువు అద్భుతములు చేయుటద్వారా తన పరిచర్యను ప్రారంభింపలేదు. ఆ దినమువరకు ఆయన ఒక్క అద్భుతమునైనను చేయలేదు, ఒక్క ప్రసంగమునైనను ప్రకటింపలేదు. దేవుని స్వరము ఆయన గుర్తింపును ప్రకటించిన తర్వాతనే యోహాను గ్రహించి యేసు ఎవరో ప్రకటించెను.

మీరు దేవుని కృపను ఆస్వాదింపగోరుచున్నయెడల, ఆయన శక్తిని దాని సంపూర్ణతలో గ్రహింపగోరుచున్నయెడల, మరియు ప్రతిదినము దేవుని మనస్సును తెలిసికొనగోరుచున్నయెడల, అప్పుడు ప్రతిదినము, దినములో అనేకసార్లు ఆయన సన్నని లేత స్వరమును వినుటయే రహస్యము. దేవుడు మాట్లాడును, జీవముగలవాడును బలవంతుడునైన దేవుడు, మరియు ఆయన స్వరమును మనము వినవలెననియు ఆయనకు చెవియొగ్గవలెననియు ఆయన కోరుచున్నాడు. మనమందరము ఈ రహస్యమును నేర్చుకొందుము గాక. ‘మార్గము ఇదే, దీనిలో నడువుడి’ (Isa.30.21) అని దేవుని స్వరము ప్రతిదినము మనతో చెప్పుటను మనము వినవలెను. ఈ మాటలు ఎంత సరళమైనవి. మీరు కుడివైపునకుగాని ఎడమవైపునకుగాని తప్పు మలుపును తీసుకొనబోవుచున్నప్పుడు, ‘ఈ మార్గములో వెళ్లకుము, ఆ మార్గములో వెళ్లకుము; అక్కడ కొంత ప్రమాదమున్నది’ అని చెప్పు ఆ సన్నని లేత స్వరము వచ్చును. ఈ విధముగా మనమందరము ప్రతిదినము సరియైన మార్గములో నడిపింపబడగలము.

నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “ప్రతిదినము మనలను ఉపకారములతో మోయు యెహోవా స్తుతింపబడునుగాక.” Psalm 68:19.

జూన్ 3

“దేవుడు స్వరముచేత అతనికి జవాబిచ్చెను.” (Exod.19:19)

మనమందరము లోకములో ఉన్నంతకాలము మనమందరము శోధనను ఎదుర్కొనవలసియున్నది. మీరెవరు, మీరెక్కడ ఉన్నారు, లేదా మీరేమి చేయుచున్నారు అనునది ఫరవాలేదు. మనుష్యులముగా మనము అనేక శోధనలను కష్టపరిస్థితులను ఒక్కొక్క రకమైన కష్టములను ఎదుర్కొనవలసియున్నది. కాని దేవుని స్వరమును మనము స్పష్టముగా వినగలిగినప్పుడు మనము ఈ పరిస్థితులను విజయవంతముగా ఎదుర్కొనగలము. మన ఆత్మీయ జీవితము యొక్క ఆరంభమునుండియే ఆయన స్వరమును వినుటను మనము ఎట్లు నేర్చుకొనవలెనో దేవుడు తన వాక్యములో మనకు చూపించుచున్నాడు.

1రాజులు 19 ఆరంభమున, దుష్టరాణియైన యెజెబెలు ఏలీయాను చంపుదునని బెదిరించినప్పుడు, దేవుడు నిశ్చయముగా యెజెబెలును శిక్షించుననుకొనియుండవచ్చును. అతడు వెళ్లి యూనిపర్ చెట్టుక్రింద కూర్చుండెను, ఎందుకనగా ఆమెను శిక్షింపనందుకు అతడు దేవునిపట్ల కోపగించుకొనెను - ఇదియే మనము కొన్నిసార్లు ప్రవర్తించు విధానము. ఈ విధముగానే మనము దేవుని అపార్థముచేసికొని ఆయనను సందేహింపసాగుదుము. కాని దేవుని మార్గములు మన మార్గములుకావు అవి మన మార్గములకంటె ఉన్నతమైనవి: ఆయన మన విధముగా పనిచేయడు. యెజెబెలును శిక్షింపనందుకు దేవుడు తన కర్తవ్యమును నెరవేర్చుటలేదని బహుశా ఏలీయా తలంచియుండవచ్చును, కావున అతడు ప్రభువుతో: “ప్రభువా, ఈనాటినుండి, నేను నీ ప్రవక్తగా ఉండబోవుటలేదు” అని చెప్పెను. ఇప్పుడు, మీరు ప్రభుత్వ సేవలో ఉన్నయెడల మీరు రాజీనామా చేయగోరుచున్నయెడల మీరు ‘మూడు నెలల’ నోటీసునివ్వవలసియున్నది, కాని ఏలీయా కేవలము ఒక్క దినపు నోటీసునిచ్చెను! “ఈ దినమే నీ ప్రవక్తపదవిని నానుండి తీసివేయుము;” అని అతడు వాస్తవముగా చెప్పెను, ఈ దినమునుండి నేను నీ నామమున మాట్లాడబోవుటలేదు నీవు నిద్రించుచుండి నీ పనిని చేయకున్నావు!”

నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “క్రీస్తుయేసునందలి విశ్వాసముచేత మీరందరును దేవుని కుమారులు. Gal. 3:26.

జూన్ 4

“అగ్నితర్వాత ఒక సన్నని లేత స్వరము.” ( I Kings 19:12)

అనేకసార్లు మనము కూడ అదేవిధముగా తలంతుము. మనము దేవునికి ఆజ్ఞాపింపగోరుదుము. కాని దేవుడు నిద్రించుటలేదు! ఆయన ఏలీయాను పర్వతశిఖరమునకు తీసుకొనిపోయి అక్కడ ఒక అద్భుతమైన విధముగా అతనితో వ్యవహరించెను. మొదట మిక్కిలి బలమైన గాలి వీచెను; కాని దేవుడు ఆ గాలిలో లేకుండెను. అప్పుడు పర్వతమును కదిలించిన భూకంపము వచ్చెను. కాని దేవుడు ఆ భూకంపములో లేడని లేఖనము చెప్పుచున్నది. అప్పుడు అగ్నివచ్చెను, కాని దేవుడు ఆ అగ్నిలో లేకుండెను. దానితర్వాత, ఒక సన్నని లేత స్వరము వచ్చెను మరియు దేవుడు ఏలీయాతో మాట్లాడి ఆయన యెజెబెలును ఎక్కడ, ఎప్పుడు, ఎట్లు తీర్పుతీర్చునో అతనికి స్పష్టముగా చెప్పెను. అదే సమయమున రాబోవు సంఘటనలను గురించి మరి అనేక ఇతర విషయములను ఆయన అతనికి బయలుపరచెను.

బైబిల్‌లో దేవుడు మాట్లాడుటను మనము వినుదుము. దేవుడు మాట్లాడును, మరియు మీరు దేవునియందు నమ్మకముంచినయెడల, ఆయన మాట్లాడునప్పుడు మీరు వినవలెను. ఆయన అస్పష్టమైనది ఏదో కాదు. ఆయన ఒక వ్యక్తి. మనము ఆయనను తెలిసికొనగలము, వినగలము, ఆయనచేత నడిపింపబడగలము, మరియు మనము మరెవ్వరిని తెలిసికొనుటకంటె ఆయనను మిక్కిలి సన్నిహితముగా తెలిసికొనగలము. మీరు అనేక సంవత్సరములు మిత్రులతో జీవించియుండవచ్చును అయినను వారిని పూర్తిగా తెలిసికొననిదిగా ఉండవచ్చును. మీరు అనేక సంవత్సరములు మీ భార్యతోను పిల్లలతోను జీవించియుండవచ్చును అయినను మీరు వారికి ప్రతిదానిని చెప్పుటకు తెగింపలేరు. మనము ఇతరులతో పంచుకొనలేని కొన్ని ఆలోచనలు కలవు: కాని మనము దేవునితో స్వేచ్ఛగా మాట్లాడి ప్రతి ఆలోచనను ఆయనతో చెప్పగలము. మనము ఏ సమయమునైనను, ఎక్కడైనను ఆయనయొద్దకు వెళ్లి ఆయన స్వరమును వినగలము.

నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “మీ కన్నులు ధన్యమైనవి, ఏలయనగా అవి చూచుచున్నవి: మీ చెవులును ధన్యమైనవి, ఏలయనగా అవి వినుచున్నవి.” Matt 13:16.

జూన్ 5

“సర్వశక్తుడు మాట్లాడునప్పుడు ఆయన స్వరము” Ezek 10:5.

ఒకప్పుడు, ప్రవక్తలు లేదా ప్రధాన యాజకులు మాత్రమే దేవుని స్వరమును వినగలిగియుండిరి. దేవుడు చెప్పవలసినదానిని ఇతరులు వినగోరినయెడల, వారు మొదట ప్రవక్తయొద్దకుగాని ప్రధాన యాజకునియొద్దకుగాని వెళ్లవలసియుండెను. దావీదు కష్టములో ఉన్నప్పుడెల్లా, దేవుని స్వరమును వినుటకు తనకు సహాయపడుటకు అతడు ప్రధాన యాజకుడైన సాదోకును పిలువనంపవలసివచ్చెను. మనుష్యుడు దేవుని స్వరమును వినుటకు సహాయపడుటకు యేసుక్రీస్తు లోకములోనికి వచ్చెను, మరియు ఈ కారణముచేతనే, ఆయన పరిచర్య యొక్క ఆరంభమునందే, పరిశుద్ధాత్మ ఆయనమీదికి వచ్చెను మరియు దేవుడు ఆకాశమునుండి మాట్లాడెను.

తన బాప్తిస్మములో, మన ప్రభువు తాను ఎట్లు మరణించి, పాతిపెట్టబడి, తిరిగి లేవవలెనో ప్రవచించుచుండెను. తన పరిచర్య యొక్క ఆరంభమునందే ఆయన దీనిని ఈ సూచనార్థక విధముగా ప్రకటించెను. Mark 8:31, 9:31లో, ఆయన దీనిని మరింత స్పష్టముగాను నిర్దిష్టముగాను చెప్పుచున్నాడు, మరియు తన సిలువవేయబడుటకు ముందే, తన మరణమును ప్రవచించెను. బాప్తిస్మములో ఆయన పాపులకొరకు తన ప్రాణమునియ్యవలెననియు మరణమును జయించవలెననియు సూచనార్థకముగా చెప్పెను. అప్పుడు ఆకాశములు తెరవబడెను మరియు దేవుని స్వరము వినబడెను. అనుభవముచేత ప్రభువైన యేసును ఎరిగినవారు ప్రతిదినము ఆకాశము తెరవబడుటను చూతురు; వారు ప్రతిదినము దేవుని కృపను, కనికరమును, ప్రేమను, శక్తిని పొందుదురు; మరియు వారిని నడిపించుటకును, వారికి సహాయపడుటకును పరిశుద్ధాత్మ వరము వారికి కలదు, ఎందుకనగా రహస్యములను ఆత్మీయ సత్యములను సాధారణ జ్ఞానముచేత గ్రహింపజాలము. మీరు కూడ మీ అవసరతకు అనుగుణముగా ప్రతిదినము దేవుని స్వరమును విని, అంతరంగిక స్వరముద్వారా దేవుడు మీనుండి ఖచ్చితముగా ఏమి కోరుచున్నాడో, మీరు చేయవలెనని ఏమి కోరుచున్నాడో తెలిసికొనగలరు.

నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “నేను ఆత్మతోను... మనస్సుతోను కూడ ప్రార్థించెదను” I Corin 14:15.

జూన్ 6

“మారుమనస్సు పొందుడి, పరలోకరాజ్యము సమీపించియున్నది”. Matt 3:2

తర్వాతి ప్రశ్న, మనలో ఎవరైనను ప్రతిదినము దేవుని స్వరమును స్పష్టముగాను నిర్దిష్టముగాను ఎట్లు వినగలరు? జవాబు అదే అధ్యాయములో ఉన్నది, మత్తయి 3:2 “మారుమనస్సు పొందుడి!”. అదియే బాప్తిస్మమిచ్చు యోహానుచేత ధైర్యముగాను అధికారముతోను ప్రకటించబడిన మొదటి సందేశము. తన బాప్తిస్మపు దినమున ప్రభువైన యేసుక్రీస్తుచేత అదే సందేశము ఇయ్యబడెను ( Matt 4:17 ). గ్రీకులో ‘మారుమనస్సు’ అను పదము అర్థము ‘పూర్తిగా వెనుదిరుగుట’. మొదట నేను నేరుగా ముందుకు చూతును; తర్వాత నేను నా వెన్నుతిప్పి వేరొక దిక్కుకు తిరుగుదును. దానినే మారుమనస్సు అని పిలుతురు.

పాపులముగా మనము దేవునికి వెన్నుచూపుచు సాతానును ఎదుర్కొందుము, ఎందుకనగా దేవునికి లోబడుటకంటె సాతానుకు లోబడుటలో మనకు మిక్కిలి ఎక్కువ ఆనందము కలుగును. దేవుని వాక్యమును వినుటచేతను పాపము యొక్క ఫలితమును తెలిసికొనుటచేతను, మనము మారుమనస్సుపొంది సాతానుకు వెన్నుచూపి దేవునికి ముఖము తిప్పుదుము. కాని అనేక సందర్భములలో ఇది సగము మారుమనస్సు మాత్రమే, లేదా మూడింట రెండువంతుల మారుమనస్సు మాత్రమే! మనుష్యులు ఇద్దరు యజమానులను కోరుదురు! వారు కష్టములో ఉన్నప్పుడు వారు దేవుని కోరుదురు, లేనియెడల వారు సాతానును సేవించగోరుదురు. మారుమనస్సు అది సంపూర్ణమును పరిపూర్ణమునైయుండనిదే మారుమనస్సుకాదు. మారుమనస్సుపొంది సాతానుకు వెన్నుచూపుటకు మనకు దేవుని కృపయు సహాయమును అవసరము.

అదే అధ్యాయములో (వచనములు 13, 14) యేసు తనయొద్దకు వచ్చుటను చూచి యోహాను ఎట్లు ఆశ్చర్యపడెనో మనకు చెప్పబడినది. మీరు మిమ్మును దీనపరచుకొననిదే, దేవుని రాజ్యము యొక్క అర్థమును మీరు గ్రహింపజాలరు. యేసుకు బాప్తిస్మమిచ్చు యోహానుకంటె ఎంతో ఎక్కువ శక్తియు అధికారమును ఉన్నప్పటికిని, ఆయన మీ నిమిత్తముగాను నా నిమిత్తముగాను తనను తాను దీనపరచుకొని, బాప్తిస్మము పొందుటకు యోహానుయొద్దకు వెళ్లెను. దీనత్వము దైవిక కృపయొక్క రహస్యమని ప్రభువు సూచనార్థకమైన రీతిలో చెప్పుచుండెను.

నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “చెడు మాట ఏదైనను మీ నోటినుండి బయలువెళ్లనీయకుడి” Eph 4:29.

జూన్ 7

“బాప్తిస్మముచేత మనము ఆయనతోకూడ మరణములోనికి పాతిపెట్టబడితిమి.” (Rom 6:4)

మన ప్రభువు తన బాప్తిస్మముచేత మూడు విషయములను ప్రవచించెను. Rom 6నందు, బాప్తిస్మము మరణమును, పాతిపెట్టుటను, పునరుత్థానమును గురించి చెప్పుచున్నది; ఇది బాప్తిస్మములో బాహ్యముగా వ్యక్తీకరింపబడు మూడురెట్ల అంతరంగిక మార్పు. అనేక సందర్భములలో ఇది కేవలము ఒక ఆచారము లేదా కర్మకాండ మాత్రమే. అందుకనే క్రైస్తవులని పిలువబడు అనేకమందిలో ఇంత గొడ్రాలుతనమున్నది. బాప్తిస్మము ఒక సాక్ష్యము, కర్మకాండకాదు. దీనిని మనకు బోధింపనిదే, మనము మిక్కిలి పేద క్రైస్తవ జీవితములను జీవింతుము. మన పాపములు పాతిపెట్టబడి మరచిపోబడనిదే మనకు నిజమైన శాంతి ఉండదు. లేనియెడల చేసిన పాపముల జ్ఞాపకముచేత మనము వెంటాడబడబోవుచున్నాము. నేడు మీరు పాపము యొక్క ప్రతి జ్ఞాపకమునుండి విడుదల పొందగలరు. మన ఖండనమును తీసివేయుటకు ఆయన మరణించెను. మనము మన పాపస్వభావమునకు మరణించునట్లు ఆయన మరణించెను.

క్యాన్సరును దాని చుట్టుప్రక్కల కణజాలము కండరములతోకూడ తీసివేయవలసినట్లు, మన కోరికలకును ఆలోచనలకును మరణించుటకు మనము విశ్వాసముచేత మరణము యొక్క శక్తిని మనలోనికి తీసికొనవలెను. ఇట్లు చెప్పుటవలన మనము మరణించము. నేను ఉదయమున, ‘నేను దానిని చేయను; నేను దానిని చేయను’ అని చెప్పవచ్చును. కాని మెదడు పనిచేయుటకు ప్రారంభించును: అది, ‘ఫరవాలేదు; ఫరవాలేదు!’ అని చెప్పును మనము ముందుకుసాగి మరల పడిపోదుము. మన స్వంత శక్తిచేత మనము విజయమును పొందలేము. మనము మరణము యొక్క శక్తిని మనలోనికి పొందుకొన్నట్లే మనము ఆయన పునరుత్థానము యొక్క శక్తియను క్రొత్త జీవమును కూడ మనలోనికి పొందుకొందుము, అది నిత్యత్వపు విషయములకొరకు ఆకలిదప్పులను మనకిచ్చును. తగిన సమయమున దేవుని స్వరమును వినుటకు మనకు చెవులియ్యబడును.

నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “యేసు వారి విశ్వాసమును చూచి... కుమారుడా, నీ పాపములు క్షమింపబడియున్నవి అని చెప్పెను”. Mark 2:5.

జూన్ 8

“నా సన్నిధిలో నీ మార్గమును తిన్ననిదిగా చేయుము” Psa 5:8.

ఆరు దినములతర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎత్తైన పర్వతమునకు తీసుకొనిపోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. అప్పుడు ఆకాశమునుండి “ఇదిగో నా ప్రియకుమారుడు, ఇతనియందు నేను ఆనందించుచున్నాను” అను స్వరము వచ్చెను. దైవిక జీవము మనలోనికి రావలెనన్నచో, మనము మన పాత స్వభావమునకు మరణించవలెనని దేవుడు ఈ మార్గముద్వారా మనకు చెప్పుచున్నాడు. ఆయన సహాయములేకుండ మనము ఎన్నడును మనకుమనము మరణింపజాలము. ప్రభువు మరణించినప్పుడు మనలను మనకుమనము మరణించుటకు సహాయపడుటకే ఆయన మరణించెను. ఆధారము ఏమనగా మనము ఆయనకు ఎంత ఎక్కువగా లోబడుచున్నామో అంతగా మన ముఖములమీద దైవిక వెలుగు కనబడును. మనము దేవునికి లోబడుచుండగా ఇది క్రమేపి ప్రకాశించు దేవుని మహిమ యొక్క ప్రతిబింబము.

ప్రభువైన యేసుక్రీస్తు మనలోనికి క్రొత్త జీవమును, తన పునరుత్థానము యొక్క శక్తిని పోయుటకు తిరిగి లేచెను. ఆ జీవముచేతనే మనము సన్నని లేత స్వరమును వినగలము. అది, వాస్తవముగా, ఒక సన్నని లేత స్వరము. అది మానవ స్వరముకాదు, మరియు మనము ఆయనను అనుసరించుచుండగా అనుభవముచేతనే మనము దానిని గుర్తింతుము. శక్తిని కలిగియుండుటకు సరళమైన దైవిక మార్గమును అనుసరింపుడి, అప్పుడు ప్రతిదినము మీ ప్రశ్నలన్నిటికి జవాబియ్యబడగలదు. ఈ సరళమైన మార్గమును అనుసరించుటకు మీరు మొదట నిష్కాపట్యముగా మారుమనస్సు పొందవలెను. ప్రతి పాపమును సంకోచములేకుండ ఒప్పుకొనుడి. హృదయపూర్వకముగా నమ్మి సరళమైన విశ్వాసముతో ఇట్లు చెప్పుడి: “నా ఖండనమును తీసివేయుటకు, నా పాపములకొరకు, ప్రభువైన యేసుక్రీస్తు నాకు బదులుగా మరణించెను”. మీకొరకు మరణించినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లింపుడి. ఆయనతో ఇట్లు చెప్పుడి: “నీ దాగియున్న రహస్యములను, నేటికొరకును భవిష్యత్తుకొరకును నీ ప్రణాళికను నీ వాక్యమునుండి నాకు చూపుము”. అప్పుడు ప్రతిదినము దేవుని స్వరము మీ చెవులలోనికి వచ్చుటను మీరు కనుగొందురు.

నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “నేనే స్థితిలో ఉన్నను... సంతృప్తినొందుటకు నేర్చుకొంటిని” Phil 4:11.

జూన్ 9

“శరీరముయొక్క ప్రాణము రక్తములో ఉన్నది”. Lev.17:11

మనకు ఆత్మయు, ప్రాణమును, శరీరమును కలవు (Gen. 2:7). దేవుడు మనుష్యుని చేసినప్పుడు ఆయన తన స్వంత శ్వాసను అతనిలోనికి ఊదెను. ఎముకలు, రక్తము, కండరములు శరీరమును కూర్చును: బుద్ధిపూర్వక తర్కము, భావోద్వేగము, సంకల్పశక్తి ప్రాణమును కూర్చును; మనస్సాక్షి, అంతర్ప్రజ్ఞ, ఆరాధన ఆత్మయొక్క సామర్థ్యములు. ఇవి మనుష్యుని మూడు ప్రధాన భాగములు: శరీరము, ప్రాణము, ఆత్మ. పాపమువలన మరణము మన శరీరమునందేగాక మన ఆత్మయందు కూడ ప్రవేశించును. మన దేవునికి వ్యతిరేకముగా మనము చేయు ప్రతి ఆలోచనను, మాటను, క్రియను, మన మనస్సాక్షిని చంపుటద్వారానే మనము చేయుదుము. నేను అబద్ధమాడగోరినయెడల, నా మనస్సాక్షి. తెలియకయే మనము మన ఆలోచనలద్వారాను, మాటలద్వారాను, క్రియలద్వారాను మన ఆత్మలలోనికి మరణమును తీసికొనివత్తుము. మన మరణించిన ఆత్మవలన మనము దేవుని స్వరమును వినుటకుగాని, ఆయన సన్నిధిని అనుభవించుటకుగాని, ఆయనను ముట్టుకొనుటకుగాని అసమర్థులమైయున్నాము.

మనము యేసుక్రీస్తు జీవమును మనలోనికి పొందుకొన్నప్పుడు, మనము మరల మూడురెట్ల మార్పును అనుభవింతుము. దేవుని ప్రేమను ఆత్మలోనికి మాత్రమే పోయవచ్చును. దానిని నా ఎముకలలోగాని, రక్తములోగాని, కండరములలోగాని పెట్టలేరు. దేవుడు ఆత్మ, మరియు ఆ పవిత్రమైన జీవము నా ఆత్మలోనికి రావలెనన్నచో దేవుడు నన్ను శుద్ధిచేసి, నన్ను పవిత్రపరచి, నన్ను సంపూర్ణముగా పరిశుద్ధపరచవలెను. మన శుద్ధీకరణకొరకు మనము విశ్వాసముచేత ఆయన అమూల్యమైన రక్తమును కోరుదుము, ఎందుకనగా ఆయన రక్తము మాత్రమే నిత్యజీవమును కలిగియున్నది. మన రక్తము శారీరిక జీవమును కలిగియున్నది. మన హృదయములు కొట్టుకొనుచున్నంతకాలము మాత్రమే మనము జీవించుటను కొనసాగింపగలము. దేవుడు చాలాకాలము క్రితమే Lev.17:11లో ప్రకటించెను. ‘శరీరముయొక్క ప్రాణము రక్తములో ఉన్నది’.

నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “యెహోవాచేత విమోచింపబడినవారు తిరిగివత్తురు... వారు ఆనందమును సంతోషమును పొందుదురు.” Isa. 35:10.

జూన్ 10

“నీవు నా ప్రాణమును పాతాళములో విడనాడవు; నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు”. Psa. 16:10

ప్రభువైన యేసుక్రీస్తు పాపము చేయలేదు మరియు ఆయన పరిశుద్ధాత్మచేత గర్భందాల్చబడి పరిపూర్ణముగా పరిశుద్ధుడైయుండెను, మరియు ఆయన తన శత్రువులను ఇట్లు సవాలుచేయగలిగెను; “మీలో ఎవడు నామీద పాపమును రుజువుచేయగలడు? (John 8:46). ఎవడును ఆ సవాలును స్వీకరించుటకు తెగింపలేదు. అందుకనే ఆయన రక్తము మనకొరకు నిత్యజీవమును కొనియున్నది, మరియు కుళ్లుపట్టుటకూడ చూడలేదు (Psa. 16:10).

మన ప్రభువు శరీరము కుళ్లుపట్టుటను చూడలేదు, మరియు అదే శరీరములో ఆయన తిరిగి లేచెను. ‘నా శరీరమును తినువాడును నా రక్తమును త్రాగువాడును నిత్యజీవము కలిగియున్నాడు.’ మనము ఆ సత్యమును విశ్వాసముచేత పొందుదుము, ఎందుకనగా ఆయన రక్తముచేత మనము శుద్ధిచేయబడి ఆయన నిత్యజీవముతో నింపబడుదుము, మరియు అప్పుడు మాత్రమే మనము దేవుని సన్నిధిని అనుభవించగలుగుదుము. ఈ క్రొత్త జీవములో, దేవుని ఆత్మచేత మనలో నివసింపబడినప్పుడు, శరీరములో, ప్రాణములో, ఆత్మలో అనుపాతిక కార్యము సాగుచుండుటను మనము కనుగొందుము. అప్పుడు మనము ప్రతిదినము ఆయన స్వరమును ఇట్లు వినగలము: “మార్గము ఇదే, దీనిలో నడువుడి. నా కుమారుడా, జాగ్రత్తగా ఉండుము, జాగ్రత్తపడుము. నా బిడ్డా, నాయొద్దకు రమ్ము; నేను నీకు ఏదో చూపింతును: నేను నీకు ఏదో బోధింతును.”

కొన్నిసార్లు మనము గాఢనిద్రలో ఉన్నప్పుడు మనలను పిలుచు ఒక స్వరమును వినినట్లు అకస్మాత్తుగా మెలుకువ వచ్చును. నేను గాఢనిద్రలో ఉండి ఎవరో నా పేరు పెట్టి స్పష్టముగా పిలుచుటను వినియుంటిని. మొదట అది ఒక కలయో నా ఊహయో అనుకొంటిని. నేను తిరిగి నిద్రించినప్పుడు, నేను మరల ఆ స్వరమును విని మెలుకువ వచ్చితిని. కొన్నిసార్లు ఇది మూడుసార్లు జరిగియుండెను, ఆపై “నా బిడ్డా లేచుము, నేను నీతో మాట్లాడగోరుచున్నాను” అని చెప్పు స్వరము వచ్చెడిది. మన అవసరతకు అనుగుణముగా ప్రతిదినము దేవుని వాక్యమును పొందుట ఎంత ఆధిక్యతో, ఎంత గౌరవమో.

నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయనవలె ఉందుము; ఆయన యథార్థస్వరూపము మనము చూతుము.”1John 3:2

జూన్ 11

“దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయములో అనుకొనెను” Psalm 14:1. “కుమారుడా, ధైర్యము తెచ్చుకొనుము; నీ పాపములు క్షమింపబడియున్నవి.” Matt 9:2.

ప్రభువైన యేసు నా జీవితములోనికి రాకముందు నేను నాస్తికుడనైయుంటిని. “దేవుడు లేడు!” అని నేను చెప్పుకొంటిని. దేవునియందు నమ్మకముంచువారిని నేను ఎగతాళిచేయుచుంటిని. 1929 డిసెంబరు 16న, “నా కుమారుడా, నీ పాపములు క్షమింపబడియున్నవి” అని చెప్పు దేవుని స్వరమును నేను స్పష్టముగా ఒకనాడు వింటిని. ఆ విధముగానే నేను దేవునితో నా నడకను ప్రారంభించితిని. దేవుని జీవము నాలోనికి వచ్చెను, మరియు అది జరిగినప్పుడు నేను ఆత్మ, ప్రాణము, శరీరము యొక్క మూడురెట్ల మార్పును అనుభవించితిని. నాకు జీవముపొందిన ఆత్మయు, జ్ఞానోదయమొందిన ప్రాణమును, శుద్ధిచేయబడిన శరీరమును ఇయ్యబడెను. దానితర్వాత వెంటనే నేను 1930 జనవరి నెలలో ఆదికాండము గ్రంథమును చదువుటను ప్రారంభించితిని. అదే అధ్యాయములో “దేవుడు చెప్పెను” అను మాటలను నేను మాటిమాటికి కనుగొంటిని. ఈ మాటలు 500సార్లు పునరావృతమగుటను నేను కనుగొంటిని మరియు ఈ వాక్యభాగమే నాకు ఒక ఆశీర్వాదమాయెను: “దేవుడు మాట్లాడును, దేవుడు మాట్లాడును”. కావున నేను, “ఓ దేవా, నాతో మాట్లాడుము నేను నీ స్వరమును వినగోరుచున్నాను. మరి ఏ ఇతర అనుభవముకొరకును నాకు ఆశలేదు. నా ప్రాణము యొక్క ఆరాటమేమనగా నీవు నాతో మాట్లాడి ప్రతిదినము నీ మార్గమును నాకు చూపింపవలెననునదే” అని చెప్పితిని. నేను పసిపిల్లవానివలె నమ్మితిని. దేవుడు మాట్లాడవలెననే పాఠమును నేర్చుకొనుటకు కొంత సమయము పట్టినను, ఆయన వాస్తవమైనప్పుడు ఆయన మాట్లాడుననునది వాస్తవముగా మిగిలియున్నది. ప్రతిదినము ఆయన స్వరమును నేను వినుటకు ప్రారంభించిన దినము వచ్చెను. అందుకనే మీరు కూడ ఆయన స్వరమును విని ఆయన బోధింపగోరు పాఠములను నేర్చుకొనవలెనని నేను కోరుచున్నాను.

నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “ఈ దినమున మీకొరకు... ప్రభువైన క్రీస్తు అను రక్షకుడు పుట్టియున్నాడు.” Luke 2:11.

జూన్ 12

“నిజముగా నిజముగా నీతో చెప్పుచున్నాను, ఒక మనుష్యుడు తిరిగి జన్మించనియెడల అతడు దేవుని రాజ్యమును చూడజాలడు” ( John 3.3 )

ఇప్పుడు మనము ఆయన స్వరమును వినుటకు రెండవ మార్గమును చూడబోవుచున్నాము. మొదట క్రీస్తు బాప్తిస్మపు సమయమున ఆకాశము ఎట్లు తెరవబడెనో మనము చూచియుంటిమి. సౌలు దేవుని స్వరమును వినినప్పుడు పౌలుగా మారెను ( Acts 9:3 ). అతడు దైవిక వెలుగును చూచెను, సూర్యకాంతినికాదు. అది అకస్మాత్తుగా అతని చుట్టును మిక్కిలి ప్రకాశవంతముగా వెలుగుటకు ప్రారంభమయ్యెను. అతడు ఆ వెలుగును చూచినప్పుడు అతడు క్రిందపడెను. సౌలు చూచినటువంటి వెలుగును మీరు చూడకపోవచ్చును. కాని అదే వెలుగు కనబడకుండగనే మనమందరిలోనికి కదలగలదు.

ప్రభువైన యేసుక్రీస్తు లోకపు వెలుగు మరియు ఆయన మన అంతరంగిక స్థితిని చూపించు దైవిక వెలుగు. మరియు అనేక సంవత్సరములు దాగియుండిన పాపములు ఇప్పుడు వెలుగులోనికి వచ్చును. నాకు ఇది జరిగెను, అయినను ఈ సాధారణ కన్నులతో నేను ఆ వెలుగును చూడలేదు. John 3:3నందలి ఆ చిన్న వాక్యభాగమును చదువుటవలననే. ‘నిజముగా నిజముగా నేను మీతో చెప్పుచున్నాను’ అనుదానిచేత నా కన్నులు తెరవబడెను. ఈ మాటలు నా చెవులలో మారుమ్రోగుచునేయుండెను. ‘నీతో చెప్పుచున్నాను, నీతో చెప్పుచున్నాను, నీతో చెప్పుచున్నాను.’ నేను, “ప్రభువా అట్లయినయెడల, నేను పాపిని. నీకు వ్యతిరేకముగా దైవదూషణ మాటలను నేను పలికియున్నాను. 1919లో నేను బైబిల్‌ను చించివేసితిని.” అని జవాబిచ్చితిని. అప్పుడు నేను మోకరించి, పూర్తిగా మరచిపోయిన నా గత జీవితమునుండి అనేక విషయములను చూచితిని.

అదే విషయము సౌలుకు జరిగెను. అతడు బుద్ధిపూర్వకముగా దేవుని అనుసరించుటకు ప్రయత్నించుచుండెను, కాని అతడు తన అంతరంగిక స్థితిని చూడలేదు. ఇప్పుడు అతడు తనయొద్దకు వచ్చు వెలుగు అంతటిని చూచి Rom. 7:18నందు వలె మొరపెట్టుకొనెను. “ఇచ్చయించుట నాయందు కలదు; కాని మేలైనదానిని జరిగించుటకు మార్గము నేను కనుగొనలేను” కాని ప్రభువైన యేసుక్రీస్తు కొద్దిమాటలలో ఇట్లు చెప్పెను: “నీకు తెలియకయే నీవు నా పనికి నష్టము కలుగజేయుచున్నావు.” మనలోనికి వచ్చు వెలుగు మాత్రమే మనము దేవుని పనికిని మనకుమనమే ఎంత నష్టము కలుగజేయుచున్నామో మనకు చూపగలదు. దేవుని వెలుగు మాత్రమే మన నిజమైన స్థితిని మనకు చూపగలదు.

నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “దేవుని ఉన్నత పిలుపు... గురియైన బహుమానముకొరకు నేను ప్రయాసపడుచున్నాను” Phil 3:14.

జూన్ 13

“ప్రభువా, నీవెవడవని అతడు చెప్పగా, ప్రభువు: నీవు హింసించుచున్న యేసును నేనే: ములుకఱ్ఱలకు ఎదురుతన్నుట నీకు కష్టము అని చెప్పెను.Act.9:5

దేవుని వెలుగు మీలోనికి పూర్తిగా రానీయుడి. దానిని ఆటంకపరచకుడి. ఆరంభమున అది మిక్కిలి దీనపరచు అనుభవముగా ఉండును. సౌలు తన జ్ఞానమునుగూర్చియు నేర్పునుగూర్చియు అత్యంత గర్వముగా ఉండెను కాని దేవుని వెలుగు అతనిని బోర్లాపడవేసెను, అతడు తనకు తగిలిన ఏ విశ్వాసినైనను చెరసాలలో పెట్టుటకు అనుమతినిచ్చు యాజకుల అధికారముతో రెండుచేతులలోను అనేక కాగితములను మోసికొనుచుండెను. అతని మెదడు ఆలోచనలతో నిండియుండెను, అతని చేతులు వారంటులతో నిండియుండెను. దమస్కులో విశ్వాసులను పట్టుకొనుటకు అతడు పరుగెత్తుచుండెను, కాని అతని ఆలోచనలును కాగితములును ఎగిరిపోయెను. అక్కడ అతడు దుమ్ములో పడియుండెను మరియు ప్రభువు అతనితో ఇట్లు చెప్పుచుండెను, “నీవు నీ సమయమును, డబ్బును, శక్తిని వ్యర్థము చేయుచున్నావు. నీవు ములుకఱ్ఱలకు ఎదురుతన్నుచున్నావు నీవే గాయపడుదువు. సౌలూ, నీవు నా పనిని ఆపగలననుకొనుచున్నావా? నీవు నీకు నీవే ఎంత నష్టము కలుగజేయుచున్నావో నీకు తెలియదు”.

సౌలు మూడు దినములు గ్రుడ్డివాడైయుండెను, తద్వారా అతడు దేవుని ఎదుట తన ఆత్మీయ గ్రుడ్డితనమును ఒప్పుకొనునట్లు. “ప్రభువా, నీవెవడవు?” అని అతడు అడిగెను. ప్రభువు జవాబిచ్చెను: “నీవు హింసించుచున్న యేసును నేనే,” “మీరు నా ప్రజలను ద్వేషించి హింసించునప్పుడు మీరు దానిని నాకే చేయుచున్నారు. కాని నేను రక్షకుడను. నీవు నా నామమును ద్వేషించి దూషించినను, ఇంకను నేను నిన్ను ప్రేమించుచున్నాను. సౌలూ నేను నిన్ను ప్రేమించుచున్నాను సౌలూ నీకొరకైనను నేను నా రక్తమును చిందించి నా ప్రాణమునిచ్చితిని.

నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “మొదట నీ సహోదరునితో సమాధానపడుము, ఆపై వచ్చి నీ కానుకను అర్పింపుము.Matt. 5:24.

జూన్ 14

“ఆ దర్శనము అతడు చూచిన వెంటనే, దేవుడు వారికి సువార్త ప్రకటించుటకు మమ్మును పిలిచియున్నాడని రూఢిగా నిశ్చయించుకొని మాసిదోనియకు వెళ్లుటకు వెంటనే ప్రయత్నించితిమి” Acts 16:10.

సౌలు ఆ స్వరముతో: ‘ప్రభువా! నేనేమి చేయవలెనని నీవు కోరుచున్నావు?’ అని జవాబిచ్చెను. అతడు ఏమి చేయవలెనో అతనికి చెప్పబడు దమస్కుకు వెళ్లమని ప్రభువు అతనిని అడిగెను. అతడు బాగుగా తెలిసినవాడైయున్నను, అతడు అన్నిటికంటె మొదట దేవునికి లోబడి దేవుడు తనతో చెప్పినది సరిగ్గా చేయవలసియుండెను. ప్రభువు అనేక విషయములను వ్యక్తిగతముగా అతనితో చెప్పలేదు ( Acts 9:6). ఒక తెలియని వ్యక్తి అతనియొద్దకు పంపబడెను; అననీయ అను పేరుగలవాడు. అతడు అపొస్తలుడుకాక ఒక సాధారణ వ్యక్తి. అతనిని గురించి మనకు ఎక్కువగా తెలియదు. ప్రభువు కోరినయెడల ఆయన స్వయముగా పౌలుకు రక్షణ మార్గమంతటిని వివరించియుండగలిగెడివాడు, కాని ఆయన అట్లు చేయలేదు. ఆయనకు వివరించుటకు ఆయన అననీయను పంపెను. అదియే అతనికి దేవుని స్వరము మరియు సౌలు తనను తాను దీనపరచుకొని అననీయ తనతో చెప్పినదంతయు నమ్మెను. “ఈ అద్భుతమైన మార్గము నాకు తెలియును,” అని అతడు తలంచెను “నా పాపములు పోయియున్నవి. నాకొరకు మరణించినవానిని నేను హింసించుచుంటిని”. అప్పుడు అననీయద్వారా అతడు బాప్తిస్మము పొందెను. అప్పటినుండి అతడు దేవుని స్వరమును అనేకసార్లు వినెను.

తన జీవితమంతటిలోను పరిచర్యలోను, దేవుని స్వరమును వినుటద్వారా, సౌలు ఆయన చిత్తమును చేయుచుండెను (Acts 16). ప్రభువు గలతీయలోను మిసియాలోను బలముగా పనిచేయుటకు ప్రారంభించెను, మరియు పౌలు బితూనియకు వెళ్లగోరెను, కాని ఆత్మ అతనిని అనుమతింపలేదు. అప్పుడు అతడు, “ప్రభువా, మేము గలతీయలో ఉండవచ్చునా?” అని అడిగెను. అప్పుడు ప్రభువు, “వద్దు” అని చెప్పెను. మిసియాతో కూడ అదేవిధముగా జరిగెను. అప్పుడు దేవుని స్వరము వచ్చెను: “మాసిదోనియకు వచ్చి.” అది వేరొక ఖండములో ఉన్నను, అతడు లోబడెను. ఆ విధముగానే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్త ఐరోపాలోనికి ప్రవేశించెను. సౌలును అతనితోకూడ ఉన్నవారును విని లోబడిరి మరియు కష్టము Acts 18:9లో, ఆయన నామముకొరకు శ్రమనొందుట ఎంతటి భాగ్యమో!

నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “మీ దేవుడైన యెహోవా మీకు ముందుగా నడచుచు మీకొరకు యుద్ధముచేయును.” Deut 1:30.

జూన్ 15

“నేను ఎవనివాడనో నేను ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత ఈ రాత్రి నాయొద్ద నిలిచి, పౌలా, భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలువవలెను: మరియు ఇదిగో నీతోకూడ ప్రయాణము చేయువారందరిని దేవుడు నీకు దయచేసియున్నాడు అని చెప్పెను” ( Acts 27:23-24 ).

అపొస్తలుల కార్యములు 27లో, ఓడ గొప్ప ప్రమాదములో ఉండెను, మరియు ఓడలోని 276 మంది ప్రజలు తాము బ్రతుకుదుమనే ఆశ ఏమాత్రము లేకుండిరి. భయంకరమైన తుఫానువలన వారు భయపడుచుండిరి. ఓడను తేలికపరచుటకు వారు సామానులను బయటికి విసిరివేసియుండిరి, మరియు నావికులు కూడ పారిపోవుటకు ప్రయత్నించిరి, కాని పౌలు వారిని ఆపెను. ఆ రాత్రి దేవుడు పౌలుతో మాట్లాడియుండెను: “పౌలా, భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలువవలెను మరియు ఇదిగో! నీతోకూడ ప్రయాణము చేయువారందరిని దేవుడు నీకు దయచేసియున్నాడు.” దేవుని ఈ స్వరము విశ్వాసమును తీసికొనివచ్చెను. బాహ్యముగా వారు రక్షింపబడుట అసాధ్యముగా ఉండెను, మరియు ఏమాత్రము ఆశ మిగిలియుండలేదు, కాని దేవుడు తానును ఆ 276 మంది ప్రజలును క్షేమముగా ఉందురని అతనికి హామీయిచ్చియుండెను. పౌలు బాగుగా తినెను, బాగుగా నిద్రించెను. అతడు భయపడలేదు, మరియు ఇప్పుడు అతడు ఇతరులను కూడ తినమని ప్రోత్సహించెను. ఇది దేవుని స్వరముయొక్క చైతన్యమేగాని మనుష్యుని స్వరముకాదు. అన్నిటికంటె మొదట, దేవుని స్తుతించుటద్వారాను ఆయన వాక్యమును చదువుటద్వారాను దేవుని సన్నిధి గ్రహింపబడును, మరియు అప్పుడు మనము ఆయన స్వరమును వినుదుము. నా విశ్వాసము వృద్ధిచెందుటను నేను కనుగొనినయెడల అది మనుష్యుని స్వరముకాదని నాకు తెలియును, మరియు తర్వాతి అనుభవముచేత మనము ఆ స్వరమును మరింత సులభముగా గుర్తించుటకు వత్తుము.

మీరు దేవుని స్వరమును వినగోరుచున్నయెడల, ప్రభువైన యేసుక్రీస్తును వచ్చి మీ హృదయములో ఏలనీయుడి. ఆయన దైవిక వెలుగును పొందుకొని మీ పాపమును ఒప్పుకొనుటకు భయపడకుడి. మీ పాపములకొరకు ఆయన మరణించెనని జ్ఞాపకముంచుకొనుడి. ఆయనను మీ జీవముగల రక్షకునిగా అంగీకరించుడి, ఆపై ప్రతిదినము ఆయనతో మీ స్నేహితునివలె మాట్లాడుడి, ఎందుకనగా మీరు ఎక్కడైనను ఏ విషయమైనను ఆయనతో మాట్లాడగలరు, మరియు ఆయన నిశ్చయముగా మీతో మాట్లాడును. ఇది మాత్రమే జ్ఞాపకముంచుకొనుడి, మీరు ఆయన స్వరమును వినినప్పుడు, వెంటనే లోబడుడి.

నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “శరీరాత్మల మాలిన్యమంతటినుండి మనలను మనము శుద్ధిచేసికొందము”. 2 Corin 7:1

జూన్ 16

“యెహోవా స్వరము జలములమీద ఉన్నది,... మహిమగల దేవుడు ఉరుముచున్నాడు.” (Psa 29:3).

ఒకనాడు, నేను ఏ కూటమునకును వెళ్లకుండగనే లేదా ఎవరును నాతో మాట్లాడుటకు రాకుండగనే, నా స్వంత గదిలో దేవుడు నాతో మాట్లాడుటను నేను వింటిని మరియు నాతో మాట్లాడుచున్నది దేవుడేయని నాకు తెలియును. ఆయన నలుబది సంవత్సరముల క్రితము నా జీవితమును మార్చెను. నావంటి పాపిని ఆయన రక్షించినందుకును, ఇప్పుడు నేను ప్రతిదినము ఆయన స్వరమును విను ఆధిక్యతను కలిగియుండుటకును దేవునికి కృతజ్ఞతలు. నా ప్రశ్నలకు ఆయన జవాబిచ్చుననియు, నా సమస్యలు ఎంత కష్టతరమైనవైనను వాటిని ఆయన ప్రతిదినము పరిష్కరించుననియు నేను ఆయన మహిమకొరకు సాక్ష్యమివ్వగలను.

పవిత్రలేఖనముల యొక్క వివిధ భాగములను మనము అభ్యసించుచుండగా, పూర్వకాలపు అనేకమంది పురుషుల స్త్రీల జీవితములలోనికి దేవుడు ఎట్లు వచ్చెనో, ఆయన స్వరమును వినుటకు వారిని ఎట్లు శక్తులనుగా చేసెనో మనము చూడగలము. తన మార్గములను తెలిసికొనుటకు మనకు బోధించుటకు దేవుడు అనేక వివిధ మార్గములను పరిస్థితులను ఉపయోగించును. దేవుని సన్నని లేత స్వరమును వినుటయొక్క రహస్యమును ఆయన మనలో ప్రతి ఒక్కరికిని బోధించునుగాక. ఈ రహస్యము Matt 17:5లోని వాక్యభాగమునుండి బయలుపరచబడినది, ఆకాశమునుండి వచ్చిన మాటలలో: “ఇదిగో నా ప్రియకుమారుడు, ఇతనియందు నేను ఆనందించుచున్నాను, ఇతని మాట వినుడి”. ఆ సమయమున, దాని అర్థమేమిటో శిష్యులు గ్రహింపలేకపోయిరి. వారికి అది కేవలము మాటలును ధ్వనులును మాత్రమే. దేవుడు చెప్పినదానిని వారు ఆస్వాదింపలేకపోయిరి.

మరొకవైపు, సౌలు దేవుని స్వరమును వినినప్పుడు ఏదో జరిగెను. సౌలును అతని సహచరులును దమస్కు మార్గములో ఉన్నప్పుడు (Acts 9) ఈ మాటలు అతనికి స్పష్టముగా వచ్చెను: “సౌలూ, సౌలూ, నీవు నన్నెందుకు హింసించుచున్నావు?” ఇప్పుడు సౌలు సహచరులు ఆ స్వరమును విన్నారుగాని ఆ మాటలనుకాదు. వారికి అది ఉరుములా వినబడెను.

నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము”. 2 Tim 2:22.

జూన్ 17

“నీతిమంతుల మార్గము వేకువ వెలుగువలె నుండి, అది నట్టనడిమి పగలగువరకు అంతకంతకు ప్రకాశించుచుండును.” (Pro. 4:18.

ఇది Matt. 17లోని ప్రజల స్థితి. వారు మిక్కిలి సరళమైన అనేక ప్రసంగములను వినిరి, కాని వాటి నిజమైన అర్థమేమిటో వారు గ్రహింపలేకపోయిరి.

ఒకసారి మన ప్రభువైన యేసుక్రీస్తు, “పరిసయ్యుల పులిసినపిండిపట్ల జాగ్రత్తపడుడి” అని చెప్పెను, కాని ఆ దినమున వారు తమతోకూడ రొట్టెను తీసికొనిరాకపోవుటచేత జరిగినదేమనగా, తాము మరచిపోవుటవలననే ప్రభువు తమను హెచ్చరించుచున్నాడని శిష్యులు తలంచిరి. అనేకసార్లు, ఆయన అర్థమేమిటో వారు గ్రహింపలేకపోయిరి. అదేవిధముగా మీరు అనేక ప్రసంగములను వినుచుండవచ్చును కాని ఆ మాటలు మీ దైనందిన అనుభవముగా మారవు. అనేక సందర్భములలో అవి ఒక చెవిద్వారా ప్రవేశించి మరొక చెవిద్వారా బయటికి వెళ్లును. ప్రభువు మీతో మాట్లాడునప్పుడు వినుటను గ్రహించుటను నేర్చుకొనువరకు మానకుండునట్లు మేము మిమ్మును వేడుకొనుచున్నాము. మీరు దీనిని నేర్చుకొన్నప్పుడు మాత్రమే మీ జీవితములు రూపాంతరము పొందును. మీ భారములు తీసివేయబడుటను, మీ కన్నులు తెరవబడుటను, మీ భయములును సందేహములును తుడిచివేయబడుటను, శత్రువు యొక్క ఉపాయములన్నియు ఓడించబడుటను మీరు కనుగొందురు. ప్రభువు స్వరమును వినుట ఒక అద్భుతమైన విషయము.

దైవిక వెలుగులేకుండ మీరు ప్రభువు స్వరమును వినలేరని జ్ఞాపకముంచుకొనుడి. దేవుని స్వరమును స్పష్టముగాను నిర్దిష్టముగాను తెలిసికొనగోరుచున్నయెడల ఇదియే మొదటి అడుగు. దేవుని వెలుగు మీలోనికి వచ్చి రోజురోజుకు మరింత ప్రకాశవంతముగా వెలుగుచు కొనసాగును (Pro. 4: 18). ఆ వెలుగు మీకు ఒక చిన్న కిరణమువలె రావచ్చును, కాని మీరు ఆయనకు లోబడుచుండగా అది మరింత మరింత ప్రకాశవంతమగుచుండును. దైవిక వెలుగులేకుండ మీరు దేవుని తెలిసికొనలేరు, చూడలేరు లేదా వినలేరు.

నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను: నీకు కలదానిని గట్టిగా పట్టుకొనుము. Rev. 3:11.

జూన్ 18

“మేము ఆయనతోకూడ పరిశుద్ధ పర్వతముమీద ఉన్నప్పుడు ఆకాశమునుండి వచ్చిన ఆ స్వరమును మేము వింటిమి”. (2 Peter 1:18).

లో 2nd Peter 1:16-21 నందు మన ప్రభువైన యేసుక్రీస్తు తనకు ఎంత వాస్తవమాయెనో పేతురు మరల సాక్ష్యమిచ్చుచున్నాడు. తాను నేర్పుగా కల్పింపబడిన కథలను అనుసరించుటలేదని పేతురు తన పత్రికలో సాక్ష్యమిచ్చెను. పర్వతశిఖరమున వారు ప్రభువైన యేసుక్రీస్తు మహిమను చూచి దేవుని స్వరమును వినిరి, మరియు ఆ స్వరము వారిని పూర్తిగా మార్చెను (2 Pet. 1: 18). పేతురు, “దేవుని స్వరమును విను ఆధిక్యత గల ఏకైక ప్రజలము మేమేనని తలంపకుడి. మీరు మీ హృదయములో ఇట్లు చెప్పుకొనవచ్చును:“పేతురూ, పర్వతశిఖరముమీద ఉండి ఆయన మహిమను రూపాంతరమును చూచుట నీ ఆధిక్యత. మావంటి మనుష్యుల సంగతేమి? మేమెట్లు ఆయన స్వరమును విని ఆయన మహిమను చూడగలము. ఆ కాలములో అది నిజమైయుండవచ్చును, కాని ఈ కాలపు మావంటి మనుష్యులు ఆయన స్వరమును వినలేరు.” అను జవాబు తర్వాతి వచనములో ఉన్నది (2 Pet. 1: 19). “మరియు ప్రవచనవాక్యము మనకు మరి స్థిరముగా నున్నది; తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయించువరకు చీకటిగల చోటున వెలుగుచున్న దీపమునకు లక్ష్యముంచినట్టు మీరు ఆ వాక్యమునకు లక్ష్యముంచినయెడల మీరు బాగుచేయుదురు.” మీరు నిజముగా విశ్వాసముచేత దేవుని వాక్యమును మీ హృదయములలో పొందుకొన్నయెడల, మీలోనికి వచ్చు ఆ వాక్యము దేవుడు వెలుగు అని మీరు మీకుమీరే చూచుకొనునట్లు ప్రకాశించు వెలుగుగా మారుననునది పేతురు అక్కడ చెప్పుచున్నాడు. అది పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య. దేవుని వాక్యములో మొదట మనము మనలను మనమున్నట్లుగా చూతుము, తర్వాత మనము దేవుని ఆయన నిజమైన మహిమలోను ప్రేమలోను చూతుము.

నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “ఆత్మలేని శరీరము మృతమైనట్లు, క్రియలులేని విశ్వాసముకూడ మృతమే. James 2:26.

జూన్ 19

“దేవుడు వెలుగైయున్నాడు, ఆయనయందు చీకటి ఏమాత్రమును లేదు.”1 John 1:5.

ప్రభువు దృష్టిలో, ఏ రకమైన పాపమైనను సమానముగా చెడ్డది. ఒక గాయములో ఒక అపవిత్రపరచు స్పర్శ మరణమును తీసికొనిరాగలదు. ఒక చిన్న క్రిమి కుటుంబమంతటికిని మరణమును తీసికొనిరాగలదు. ఏ రకమైన పాపమైనను సమానముగా వినాశకరమైనది, భయంకరమైనది, ఘోరమైనది. మనలోనికి వచ్చు దేవుని వెలుగు మాత్రమే మన ఆలోచన, మాట, లేదా క్రియచేత కలిగిన నష్టమునుండి మనలను విడిపించును, మరియు అదే వెలుగు మన జీవముగల రక్షకుని మహిమను, సౌందర్యమును, ఔన్నత్యమును చూపించును. మనుష్యులు మన పాపములను బయలుపరచునప్పుడు వారు మనలను సిగ్గుపరచుటకే అట్లు చేయుదురు, కాని దేవుని వెలుగు మన పాపములను ఒప్పుకొని వాటిని శుద్ధిచేయబడునట్లు సహాయపడుటకు వాటిని బయలుపరచును. ఆయన మహిమను చూచుటకు మనము పర్వతశిఖరముమీదికి వెళ్లవలసిన అవసరము లేదను ప్రవచనపు హామీ మనకు కలదు. ఎక్కడైనను, మనమెక్కడ ఉన్నను, అక్కడ మనము ఆయన మహిమను సౌందర్యమును చూడగలము. దైవిక వెలుగు మనలోనికి వచ్చినప్పుడు మాత్రమే ఇది సాధ్యమగును, మరియు మనము మన ఆత్మలో దేవుని వాక్యమును పొందుకొందుము.

మీరు దేవుని వెలుగును పొందుకొనగోరుచున్నయెడల, అన్నిటికంటె మొదట బైబిల్ ఆదికాండమునుండి ప్రకటన వరకు దేవుని నిజమైన వాక్యమని మీ హృదయమునుండి నమ్ముడి. కొన్నిసార్లు మనము చదువునది మనము గ్రహింపలేకపోయినను, అది ఇంకను దేవుని వాక్యముగానే మిగిలియున్నది. అది ఎన్నడును మారజాలదు. అది ఏ వ్యక్తిగత భాష్యముచేతను కాదు, పరిశుద్ధాత్మచేత ప్రేరేపింపబడి దేవుని పరిశుద్ధమనుష్యులు మాట్లాడిరి. దేవుని వాక్యమును గౌరవముతోను, భయభక్తులతోను, విశ్వాసముతోను వినుడి చదువుడి మరియు అడుగడుగునా ఇట్లు చెప్పుచు కొనసాగుడి: “ప్రభువా నీ వాక్యమునుండి నాతో మాట్లాడుము.” దేవుని స్వరమును వినుటను మనము నేర్చుకొనగలుగు విధానము ఇదియే.

నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “ఏకమనస్కులై సమాధానముగా ఉండుడి; అప్పుడు ప్రేమయు సమాధానమునుగల దేవుడు మీతోకూడ ఉండును. 2Cor. 13:11.

జూన్ 20

“నీ సత్యమునందు నన్ను నడిపించి నాకు బోధింపుము.” (Psa. 25.)

బైబిల్‌ను మొదటిసారి చదివినప్పుడు, అది దేవుని వాక్యమని నేను ఒప్పించబడితిని. కావున నేను, “ప్రభువా, ఈ గ్రంథమును నేను గౌరవించుచున్నాను, ఇది నీ వాక్యము. దయచేసి దీని పుటలద్వారా నాకు బోధించి నాతో మాట్లాడుము. ఆరంభమున ప్రతిదానిని నేను గ్రహింపకపోయినను, ప్రభువా, నేను నీ వాక్యమును ఎన్నడును సందేహింపను. నీ స్వంత సమయమును తీసికొని నీ వాక్యపు అర్థమును నాకు బోధింపుము, ఇప్పుడైనను లేదా అది ఒకటి రెండు సంవత్సరములు పట్టినను. నేను నిన్ను ఇబ్బందిపెట్టను. నా అవసరతకు అనుగుణముగా నీవు ప్రతిదినము మాట్లాడవలెనని నేను కోరుచున్నాను” అని చెప్పితిని. అప్పుడు దేవుని వెలుగు రోజురోజుకు మరింత మరింత ప్రకాశవంతముగా వచ్చుటను నేను కనుగొంటిని. ఒకవైపు, నా అంతరంగిక భ్రష్టతను నేను చూచితిని, కాని మరొకవైపు నన్ను క్షమించి నన్ను కడుగుటకు ఆయన సమృద్ధియైన కృపను, నా అవసరతలో ప్రతిదినము నాకు సహాయపడుటకు ఆయన ఎట్లు ప్రతి ఏర్పాటును చేసియుండెనో నేను చూచితిని.

బైబిల్ జ్ఞానము కలిగియుండుటవలన నేను మరింత నీతిమంతుడనగుదుననుకొంటిని మొదట, కాని దేవుని స్వరమును వినుటవలన అది జ్ఞానముగాని, సూచనలుగాని, అద్భుతములుగాని కాదని తర్వాత నేను కనుగొంటిని. నిద్రించుటకుముందు నేను, “ప్రభువా, దయచేసి నాకు చెప్పుము, నేటి నా జీవితము నిన్ను సంతోషపెట్టెనా? నేనేదైనను తప్పులు చేసియుండినయెడల, ఆలోచనచేతను, మాటచేతను, క్రియచేతను నిన్ను దుఃఖపెట్టియుండినయెడల నాకు చెప్పుము. నేనేదైనను తప్పు చేసియుండినయెడల, ప్రభువా దానిని నాకు చూపుము” అని ప్రార్థించెడివాడను. ఆయన నాకు చూపెను, నేను దానిని ఒప్పుకొంటిని మరియు నా ప్రభువు నన్ను క్షమించెను, మరియు నాతో, “నీయందు నేను ఆనందించుచున్నాను, వెళ్లుము” అని చెప్పెను. వెంటనే నేను పండుకొని, బాగుగా నిద్రించెడివాడను. కాని నేను ఏదైనను తప్పుచేసి దానిని ఒప్పుకొననియెడల, నాకు నిద్రించుట కష్టముగా ఉండెడిది. అది నా తప్పే. నేను నిన్ను దుఃఖపెట్టితిని. దయచేసి నన్ను క్షమింపుము. అమూల్యమైన రక్తము యొక్క ప్రభావమును నేను నమ్ముచున్నాను. ప్రభువా, నన్ను క్షమింపుము.” అప్పుడు ఆయన నాతో, “నా బిడ్డా మరల పండుకొనుము. నీయందు నేను ఆనందించుచున్నాను” అని చెప్పెడివాడు. ఇప్పుడు నేను ప్రతిదినము సంతోషముగా ఉన్నాను. నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “హృదయశుద్ధిగలవారు ధన్యులు: వారు దేవుని చూతురు. Matt. 5:8.

జూన్ 21

“యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము, నీ త్రోవలను నాకు నేర్పుము.” (Psa. 25.4)

అదే పరిస్థితులు కలిగినయెడల మీకు కూడ అదేవిధముగా జరుగును. నేను ప్రతిదినము ఇట్లు చెప్పుటను నేర్చుకొంటిని: “ఇప్పుడు ప్రభువా, దయచేసి నేటి మార్గమును నాకు చూపెదవా? నేను నిస్సహాయుడను, నీవు నానుండి ఏమి కోరుచున్నావో నాకు స్పష్టముగా చూపుము. నేనెక్కడికి వెళ్లవలెనో, ఏమి చెప్పవలెనో నాకు చెప్పుము.” ప్రణాళికను కనుగొన్న తర్వాత, నేను వెంటనే లోబడుదును. రాత్రి వచ్చినప్పుడు నేను మరల నా మోకాళ్లమీద అదే ప్రశ్నను అడుగుదును. “ప్రభువా, నా ప్రేమ నీకు పూర్తి తృప్తినిచ్చినదా. నీవు తృప్తిపొందితివా? నాతో మాట్లాడుము, నీవు పూర్తిగా తృప్తిపొందితివా?”

క్రీస్తు ప్రకాశవంతమైన వేకువచుక్క. మీరు ఎన్నడైనను గ్రామములలో జీవించియున్నారా? చాలామంది రైతులు గడియారములచేతను వాచీలచేతను నడిపింపబడరని మీరు కనుగొందురు. వారు ఉదయమే పొలమునకు వెళ్లునప్పుడెల్లా, లేదా వారు ఉదయమే ప్రయాణించగోరునప్పుడు, వారు వేకువచుక్కచేత నడిపింపబడి, “ఇప్పుడు సమయమాయెను. నేను లేచి వెళ్లవలెను” అని చెప్పుదురు. వారు తమ దిక్కును కూడ అదే వేకువచుక్కచేత కనుగొందురు.

ప్రభువైన యేసుక్రీస్తు మనయొద్దకు ప్రకాశవంతమైన వేకువచుక్కగా వచ్చుచున్నాడు, మరియు ఆరంభమున మనము కొంత చీకటిని ఎరిగియున్నను, తిరిగి జన్మించిన వెంటనే ఎవరును పరిపూర్ణులుకారని జ్ఞాపకముంచుకొనుడి. మన చుట్టును చీకటిని మనము చూతుము, కాని వేకువచుక్క నాతో, “నా బిడ్డా, చీకటివైపు చూడకుము. ఒకటి రెండు గంటల తర్వాత సూర్యుడు లేచును,” అని చెప్పును, మరియు నిజముగానే, కొద్ది గంటల తర్వాత సూర్యుడు మనమీద ప్రకాశించుటను మనము కనుగొందుము. వేకువచుక్క ఏ మానవ సహాయములేకుండగనే మన చింతలన్నిటిని, సందేహములన్నిటిని జయించుటకు మనలను శక్తులనుగా చేయును, మరియు మనము మార్గమును కనుగొనగలుగుదుము. మనము ఎంత ఎక్కువగా లోబడుదుమో, అంతగా మనము వెలుగును పొందుదుము.

నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “యెహోవాయందు నమ్మకముంచువాడు పుష్టిపొందును. Prov 28:25.

జూన్ 22

“దానియేలు... దినమునకు ముమ్మారు మోకాళ్లూని తన దేవుని యెదుట ప్రార్థనచేయుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచుండెను.” (Dan. 6.10)

ఆరంభమున మీరు గ్రహింపలేని అనేక విషయములుండును. నేను బైబిల్‌ను నూరుసార్లుకంటె ఎక్కువగా చదివితిని మరియు అప్పుడు చివరకు కొంత అర్థమును చూచుటకు ప్రారంభించితిని, కాని ఇప్పుడు ఈ మాటల అర్థమేమిటో నాకు తెలియును: ‘ఆదియందు’, Gen. 1. మొదట వాటి అర్థమేమిటో నాకు తెలియకుండెను, మరియు తరచుగా చదువుచుండగా నేను నిద్రించెడివాడను. అనేక సంవత్సరముల తర్వాత ఇవే అధ్యాయములు లేదా వచనములు లేదా వాక్యభాగములు నాకు క్రొత్తవిగా మారియున్నవి. దేవుడు మనతో మాట్లాడువరకు మన మోకాళ్లమీద ఉండుటను మనము అలవాటుగా చేసికొని దేవుని వాక్యమును పొందుకొన్నయెడల, మార్గముమీద మరింత ప్రకాశవంతముగా వెలుగుచున్న దేవుని వెలుగు అదియే.

ప్రభువు తన శిష్యులతో Matt. 16:21 తాను పెద్దలవలనను ప్రధానయాజకులవలనను అనేక హింసలు పొంది, చంపబడి, మూడవదినమున తిరిగి లేవవలెనని ఆయన చెప్పెను. వారిని పర్వతమునకు తీసుకొనిపోయి తమ ఎదుట రూపాంతరము పొందుటకుముందు ఆయన ఇదంతయు వారితో చెప్పెను. తమ పాపములనిమిత్తమే తాను శ్రమపడి, చంపబడి, తిరిగి లేవవలెనని ఆయన సాదాభాషలో వారికి వివరించెను. పేతురు ఆయనను ఒకవైపునకు తీసికొనిపోయి ఆయనను గద్దించెను కూడ. అప్పుడు ఆరు దినములతర్వాత, ప్రభువు ఆయనను ఎత్తైన పర్వతముమీదికి తీసుకొనిపోయెను, మరియు “ఇతని మాట వినుడి!” అను ఈ మాటలు వచ్చెను. ఆయన స్వరమును ప్రతిదినము వినుడి, దానిని పూర్తిగా వినుడి, అప్పుడు ఆయన శ్రమ, మరణము, పాతిపెట్టుట, పునరుత్థానము, మహిమ యొక్క సంపూర్ణ అర్థమును మీరు తెలిసికొందురు. కావున దినము ప్రారంభించునప్పుడు ఆయన స్వరమును వినుడి. ఓపికతోను నిశ్శబ్దముగాను వేచియుండి, “ప్రభువా ఉదయము, మధ్యాహ్నము, రాత్రి నాతో మాట్లాడుము. నీ స్వంత వాక్యమునుండి నాతో మాట్లాడుము” అని చెప్పుడి. ఆయన, “అవును, నా కుమారుడా, నేను ఆనందించుచున్నాను; వెళ్లుము” అని చెప్పువరకు వేచియుండుడి.

నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెను. 1 Sam 7:12.

జూన్ 23

“మార్గము ఇదే, దీనిలో నడువుడని నీ వెనుకనుండి ఒక మాటను నీ చెవి వినును……” (Isa. 30:21)

ఈ వచనము నిశ్చయముగా దేవుని స్వరమును గురించి చెప్పుచున్నది. మన నిరంతర ప్రార్థన ఏమనగా మనము ఆ స్వరమును సాదాగాను స్పష్టముగాను వినుటను నేర్చుకొనవలెననునదే, ఎందుకనగా ఆయన స్వరమును వినుటవలననే మన ప్రశ్నలన్నిటికిని జవాబియ్యబడి మన సమస్యలన్నియు ప్రతిదినము పరిష్కరింపబడగలవు. దేవుని స్వరమును వినుటకు విశ్వాసమును ఓపికయును అవసరము. దేవుడు మాట్లాడును, అయితే కొద్దిమంది విశ్వాసులు మాత్రమే ప్రతిదినము స్పష్టముగా ఆయన స్వరమును విను ఆధిక్యతను ఆస్వాదింతురు. Psalm 29 నందు, ఆయన స్వరము మనయొద్దకు వచ్చినప్పుడు దేవుని శక్తి పూర్తిగా వ్యక్తమగుననునది స్పష్టముగా ఉన్నది (వ. 4- 5). దేవుని స్వరము దేవదారు వృక్షములను విరుచును (వ. 7). దేవుని స్వరము అగ్నిజ్వాలలను విభజించును (వ.8). అది అరణ్యమును కంపింపజేయును. మీ నా జీవితములకును అందుబాటులో నున్న దేవుని గొప్ప శక్తిని చూపించుటకు ఈ మాటలు పునరావృతమగుచున్నవి.

ఈ పాఠము ప్రవక్తయైన ఏలీయాకు ఎట్లు బోధించబడెనో మనము ఇప్పటికే చూచియుంటిమి. 1 రాజు 19:12లో, అతడు దేవుని సన్నని లేత స్వరమును వినెను. 1 Kings 18:38-46 నందు అతడు దేవుని గొప్ప శక్తిని చూచియుండెను. అయినను ఇక్కడ వ.4లో అతడు ఇక తాను జీవించగోరుటలేదని దాదాపు చెప్పుచున్నాడు. మనమందరము కొన్నిసార్లు నిరుత్సాహపడుదుము, కృంగిపోదుము, దిగులుపడుదుము. మనమందరము కొన్నిసార్లు మన భారములు మనకు మిక్కిలి బరువుగా ఉండుటను కనుగొందుము మరియు మనమందరము ఏదో ఒకప్పుడు ఆ యూనిపర్ చెట్టుయొద్దకు వత్తుము. కాని ఏలీయా 1రాజులు 19:12లో సన్నని లేత స్వరమును వినినప్పుడు, అతని భారము తీసివేయబడెను. చనిపోగోరు అతని కోరిక అతనిని విడిచిపెట్టెను మరియు దేవునిగురించిన అతని ప్రశ్నలన్నియు మాయమాయెను. అతడు ఒక క్రొత్త రహస్యమును నేర్చుకొనెను. దేవుని మార్గములు మనుష్యుని మార్గములుకావని అతడు నేర్చుకొనెను. మీరు ఆ రహస్యమును ఒకసారి నేర్చుకొన్నయెడల, మీ భారము లేదా సమస్య ఏదైనను, మీరు విజయవంతముగా బయటికివత్తురు. దేవుని వినుటయొక్కయు ఆయన మార్గములను తెలిసికొనుటయొక్కయు రహస్యమును మనము నేర్చుకొనవలెను.

నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని నీవు జ్ఞాపకముంచుకొనవలెను”. Deut. 8:2.

జూన్ 24

“నా ఆజ్ఞలుగలిగి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు.” (John. 14:21)

దేవుని స్వరమును వినుట యొక్క ఈ అనుభవములు మన అనుభవముకూడ ఎట్లు కాగలవు? అపొస్తలుడైన పౌలు తన మారుమనస్సు పొందిన సమయమునందే ఈ పాఠమును నేర్చుకొనెను. మొదటి అడుగు సౌలు పౌలుగా మారుటయే. దేవునినుండి మరింత వినగోరినయెడల అతడు లోబడవలెను. తాను ఏమి చేయవలెనో అతనికి చెప్పబడు దమస్కు పట్టణములోనికి వెళ్లమని అతనికి చెప్పబడెను. దేవుడు మీకు చూపిన దేనికైనను మీరు లోబడవలెను. మీరు తిరిగి జన్మించనిదే మీరు దేవుని స్వరమును వినలేరని నేను మరల మీకు చెప్పుచున్నాను. నిత్యజీవపు వరమును పొందినవారు ఏదో సమయమున, ఏదో స్థలమున ఆయన స్వరమును వినియుండవలెను. మీరు ఆ స్వరమునకు లోబడితిరా, లేదా మీరు దేవునితో వాదించితిరా?

దేవుడు ఆరంభమున మనకు ఎక్కువగా చెప్పడు. ఆయన కేవలము మిక్కిలి చిన్న వాక్యములను మాత్రమే చెప్పును. కాని మనము ఆయనకు అడుగడుగునా లోబడుచుండగా ఆయన మనకు అనేక విషయములను చెప్పును. దేవుడు మాట్లాడునప్పుడు దీర్ఘమైన సందేశముకొరకు వేచియుండకుడి. ఆయన మీకు చెప్పినంతమేరకు లోబడుడి. సౌలు స్వరమునకు లోబడి దమస్కుకు వచ్చినప్పుడు, అతనికి తెలియకుండగనే దేవుడు అతనియొద్దకు వెళ్లుటకు మరియొక సేవకుని సిద్ధపరచియుండెను. అననీయ సౌలుయొద్దకు వచ్చి అతనితో మాట్లాడుటకు ప్రారంభించెను (Acts 22:12). సౌలుతో మాట్లాడుచున్నది అననీయ యొక్క స్వరమువలె తోచెను, కాని వాస్తవముగా అది దేవుని స్వరము, మరియు అతడు దానిని నమ్మెను. “నా పాపములు పోయియున్నవి”, అని అతడు చెప్పగలిగెను. “నేను హింసించిన నా ప్రభువు నన్ను ఎన్నుకొని, నన్ను చేర్చుకొని, నన్ను అంగీకరించెను. ఆయన నన్ను క్షమించుట మాత్రమేగాక, నన్ను తన సాక్షిగా చేసియున్నాడు. నేను ఆయన మహిమను చూచుటను, ప్రతిదినము ఆయన స్వరమును వినుటను ఆయన కోరుచున్నాడు.”

నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “మారుమనస్సు పొందు ఒక్క పాపిని గురించి దేవుని దూతల యెదుట ఆనందము కలుగును.” Luke 15:10

జూన్ 25

“నా మాటను వినుచు నన్ను పంపినవానిని నమ్మువాడు నిత్యజీవముగలవాడు.” (John. 5:24)

ప్రభువు తనకు మంచిదని తోచినరీతిగా మనమందరితోను మాటలాడును. కావున ప్రసంగీకుడు తన వేలును మీవైపు చూపకముందే మీరు సభలో అశాంతిగా భావించినయెడల, “ప్రభూ, ఇది నీ స్వరమా లేక మనుష్యుని స్వరమా? అది నీ స్వరమైతే నేను అంగీకరించి నన్ను తగ్గించుకొందును. నాయందు కనికరముంచుము” అని ప్రార్థనలో చెప్పుడి. ప్రభువు అనేకసార్లు మీతో మాటలాడుటకు మరొకరిని ఉపయోగించుననునది మీరు కనుగొందురు, కావున ఆయన ఎల్లప్పుడును మీతో ప్రత్యక్షముగా మాటలాడుననుకొనకుడి.

పౌలు నిరుత్సాహపడి శత్రువు దాడి మిక్కిలి బలముగా ఉన్నప్పుడు, దేవుని స్వరము అతనియొద్దకు, “భయపడకుము, కాని మాట్లాడుము, మౌనముగా ఉండకుము. నేను నీతోకూడ ఉన్నాను ఏ మనుష్యుడును నిన్ను బాధింపడు; ఈ పట్టణములో నాకు అనేకమంది ప్రజలున్నారు” అని చెప్పుచు వచ్చెను. మనము ఆయన నోటిమాటలుగను సాక్షులుగను అగుచుండగనే మనము వేర్వేరు సమయములలో ఆయన స్వరమును వినుదుము.

మీ మిత్రులు మిమ్మును ఎగతాళి చేసినను, మీరు నిజాయితీగా, “నాకు తెలిసిన ఒక విషయము, నేను పాపిని, కాని ప్రభువైన యేసుక్రీస్తు నా పాపములను క్షమించెను. ఇది ఒక నిర్దిష్ట స్థలములో ఒక నిర్దిష్ట దినమున మొదటిసారి జరిగెను. నాకు తెలిసిన ఒక విషయము, నేను శాంతిని కనుగొంటిని” అని చెప్పగలరు. వారు మీరు చెప్పినదానిని అంగీకరింపకపోయినను, శాంతముగాను ఆనందముగాను సాక్ష్యమిచ్చుటను కొనసాగింపుడి. అప్పుడు ఒకనాడు మీరు శత్రువుచేత చుట్టుముట్టబడి ఒంటరిగా అనుభూతిచెందుచున్నప్పుడు, దేవుని స్వరము మీయొద్దకు ఇట్లు రావచ్చును: “భయపడకుము, నేను నీతోకూడ ఉన్నాను; భయపడకుము, ఎందుకనగా నేను నీతోకూడ ఉన్నాను. నా నామమున మాట్లాడుటను కొనసాగింపుము.” దేవుని స్వరమును వినుటకు మనలను అర్హులుగా చేయునది అటువంటి సాక్ష్యమేయే.

నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “మీలో ఎవడును తన పొరుగువానికి విరోధముగా చెడుతనమును తన హృదయములో ఆలోచింపవలదు.” Zec.8:17.

జూన్ 26

“మేము యేసును చూడగోరుచున్నాము”. (John 12:21).

మీరు దేవుని చిత్తములో ఉన్నప్పుడే దేవుని స్వరము మాటిమాటికి మీతో మాట్లాడుటను మీరు వినగలరు. దేవుని స్వరము ధృవీకరణగా వచ్చును. మీరు దేవుని స్వరమును స్పష్టముగా వినగోరుచున్నారా? అట్లయిన అతిచిన్న విషయములోకూడ ప్రతిదినము దేవుని చిత్తమును కనుగొని దానిని చేయుటను నేర్చుకొనుడి. ఎవరైనను నన్ను, “క్రైస్తవునిగా నీ అత్యున్నత ఆధిక్యత ఏమిటి?” అని అడిగినయెడల, దేవుని చిత్తమును తెలిసికొని దానిని చేయుటయే నా అత్యున్నత ఆధిక్యతని నేను జవాబిచ్చెదను. దేవుని చిత్తమును తెలిసికొని దానిని చేయుచున్నవారు, దానిని దేవుని వాక్యముద్వారాను, ఆయన దూతలద్వారాను లేదా ఇతర పరిస్థితులద్వారాను కనుగొందురు. John 12:21నందలి గ్రీకులు దూరమునుండి వచ్చి మన ప్రభువైన యేసుక్రీస్తును చూడగోరిరి. ఈ మనుష్యులు యేసును చూచుటకు పూర్ణ నిష్కాపట్యముతో వచ్చిరి. మన ప్రభువు వారితో, “మీరు కేవలం కొన్ని నిమిషములు మాత్రమే నన్ను చూడగోరుచున్నారు. కాని నన్ను నిత్యము చూచుటయు ఎల్లప్పుడు వినుటయు సాధ్యమే. మీరు మీ మరణమును నా మరణములో చూడగలిగి నా పునరుత్థాన జీవములో మీ జీవితమును జీవించగలిగినయెడల, అప్పుడు మీరు నిజముగా నన్ను ప్రతిదినము చూచి నా స్వరమును వినుదురు” అని చెప్పెను.

మన ప్రభువు John 13:28, “తండ్రీ, నీ కుమారుని మహిమపరచుము, అనేకులు నన్ను సంపూర్ణ మహిమలో చూచి నావలె అగుదురు”. అప్పుడు స్వరము వచ్చెను. మనము మన క్రియలద్వారా ఆయన నామమును మహిమపరచుచుండగనే మనము ఆయన స్వరమును వినుదుము. విశ్వాసముచేత ప్రార్థింపుడి. “ప్రభువా నీ నామమును మహిమపరచగల చోట నన్ను ఉంచుము. నేను వేరొక దేనిని వెదకనుగాని కోరనుగాని.” అప్పుడు మీరు దేవుని స్వరమును వినుదురని నేను మీకు హామీ ఇచ్చుచున్నాను. మీరు ఏమి చేయవలెనో మీకు చెప్పుటకు ఆకాశమునుండి ఒక స్వరము వచ్చును. దేవుడు మాట్లాడును, కాని మీరు ఆయన స్వరమును వినుటకుముందు మీరు ఆయన షరతులను నెరవేర్చవలసియున్నది.

నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “ఇదిగో ప్రభువైన యెహోవా బాహుబలముతో వచ్చుచున్నాడు.Isa.40:10.

జూన్ 27

“దేవునితో మాటలాడుటకు మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లినప్పుడు, కరుణాపీఠముపైనుండి తనతో మాటలాడు ఒకని స్వరమును అతడు వినెను.” (Num 7:89).

దేవుని స్వరమును వినుటయందును, గుర్తించుటయందును ఉన్న ఆ రహస్యమును నేర్చుకొనుటద్వారా, మన ప్రశ్నలన్నిటికి జవాబియ్యబడి, మన సమస్యలన్నియు పరిష్కరింపబడగలవని మనము మన హృదయములన్నిటితో నమ్ముచున్నామా?

మనం Num. 7:89 నందు, మోషేచేత మందిరపు పని పూర్తియై, పర్వతమున ప్రభువుచేత మోషేకు చూపబడిన మాదిరి ప్రకారము అది నెరవేర్చబడినప్పుడే దేవుని స్వరము వచ్చెను. Exodus 40:34 నందు దేవుని మహిమ మందిరమును నింపెననియు, అతిపరిశుద్ధస్థలములోని కెరూబులమధ్యనుండి ఆయన స్వరము వినబడుటకు ప్రారంభమాయెననియు మనము చదువుదుము. ఏ మనుష్యుడైనను దేవుని చిత్తమును కనుగొనగోరినప్పుడు, అతడు ప్రధాన యాజకునియొద్దకు రావలసియుండెను, మరియు ప్రధాన యాజకుడు అతిపరిశుద్ధస్థలమునుండి మాట్లాడు దేవుని స్వరమును వినవలసియుండెను. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మన నిత్యమైన పరలోక ప్రధాన యాజకుడు, మరియు ఆయనను తమ వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించి ఆయనచేత నివసింపబడువారు. వారి శరీరములు పరిశుద్ధాత్మ యొక్క ఆలయముగా మారును.

ఇప్పుడు ఎవరైనను భూసంబంధమైన ప్రధాన యాజకునియొద్దకు వెళ్లవలసిన అవసరము లేదు. మనుష్యులు దేవుని స్వయముగా మాట్లాడగలరు. ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా, జవాబును పొంది ప్రతిదినము దేవుని స్వరమును వినగలరు. కాని ఒక విషయము అవసరము. దేవుని స్వరమును వినగోరు మనలో అందరును, తాము దేవుని ఆత్మచేత నివసింపబడుచున్నామని నిశ్చయపరచుకొనవలెను. దేవుడు పరిశుద్ధుడు మరియు ఆయన మనలోనికి రాకముందు, ఆయన అన్నిటికంటె మొదట క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తముచేత మనలను శుద్ధిచేయవలసియున్నది. ఆయన సన్నిధిని అనుభవించకుండ మనలను నివారించునది పాపము మాత్రమే, కాని పాపము మాటిమాటికి క్షమింపబడి, ఆయన అమూల్యమైన రక్తముచేత శుద్ధిచేయబడగలదు.

నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “నా దేవుడైన యెహోవా హస్తము నామీద ఉండుటచేత నేను బలపరచబడితిని”. Exra 7:28.

జూన్ 28

“పరిశుద్ధత, అది లేకుండ ఎవడును ప్రభువును చూడజాలడు.”(Hebrews 12:14).

మన ప్రభువైన యేసుక్రీస్తు తన బహిరంగ పరిచర్యను ప్రారంభించినప్పుడు ఆకాశము తెరవబడెను మరియు పరిశుద్ధాత్మ పావురమువలె దిగివచ్చెను మరియు ఆకాశమునుండి స్వరము వినబడెను. మనకొరకు ఆకాశము తెరవబడునట్లును పరిశుద్ధాత్మ మనమీద నిలిచి, అన్ని విషయములలో మనలను నడిపించి, ప్రతిదినము దేవుని స్వరమును వినుటకు మనలను శక్తులనుగా చేయునట్లును ఆయన ఈ లోకములోనికి వచ్చెను. దేవుడు ఆత్మ మరియు ఆయన స్వరము కూడ ఆత్మీయమైనది. మన ఆత్మ ప్రతిదినము దేవుని స్వరమును స్పష్టముగా నమోదుచేసికొనగలదు, కాని ఆ స్వరమును వినుటకు మన ఆత్మ పవిత్రపరచబడియుండునట్లు మనము నిశ్చయపరచుకొనవలెను (Matt 5:8,Acts 10:14).

వేర్వేరు సాక్షులద్వారా మాట్లాడుటకు ప్రభువు ఎట్లు ఎంపికచేసుకొనెనో మనము చూచియుంటిమి. అపొస్తలుల కార్యములు 8లో, దేవుని సాక్షి ఫిలిప్పు అని పిలువబడెను. ప్రభువు అతనిని సమరయ అను స్థలములో బలముగా ఉపయోగించెను. అకస్మాత్తుగా దేవుని ఆజ్ఞ వచ్చెను: లేచి దక్షిణమునకు వెళ్లుము”. అతడు వెంటనే దేవునికి లోబడెను. అతడు తన హృదయములో: “నేను చేయుచున్న పని ఎంతటి గొప్ప పని, అది దేవుని పని. ఈ క్రొత్త విశ్వాసులందరు ప్రభువునందు బలపరచబడి కట్టబడవలసియున్నారు. ఇంతటి ప్రాముఖ్యమైన పనిని విడిచి ఏకాంతమైన అరణ్యమునకు నేనెట్లు వెళ్లగలను?” అని చెప్పుకొనియుండగలిగెను.

అతడు సమరయను విడిచి అరణ్యములోనికి ఎందుకు వెళ్లవలెనో దేవుడు ఎన్నడును అతనికి వివరింపలేదు. మనము ఇప్పటికే చూచినట్లు దేవుడు ఒకేసారి ఎక్కువగా ఎన్నడును మనకు చెప్పడు. ఆరంభమున ఆయన పెద్ద కార్యక్రమమునివ్వడు. దేవుడు ఫిలిప్పుతో, “లేచి గాజాకు వెళ్లుము,” అని అతడు అక్కడికి వెళ్లవలసిన అవసరతకు కారణములను ఇయ్యకుండగనే చెప్పెను. అయినను అతడు లోబడినప్పుడు అతడు ఆ కారణమును కనుగొనెను.

నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “అతడు నన్ను వేడుకొనును నేను అతనికి జవాబిచ్చెదను” .Ps. 91:15.

జూన్ 29

“మీరు చెప్పవలసినది ఆ గడియలోనే పరిశుద్ధాత్మ మీకు బోధించును.” (Luke 12:12).

‘నేను ఈ రథమునొద్దకు దొంగవలె పరుగెత్తుచున్నట్లు కనబడుచున్నది!’ అని ఫిలిప్పు తలంచియుండగలిగెను కాని అతడు దేవుని ఎన్నడును ప్రశ్నింపలేదు. acts 8:30నందు, ఫిలిప్పు రథమునొద్దకు పరుగెత్తి ఆ మనుష్యుడు యెషయా 53వ అధ్యాయమునుండి చదువుటను వినెను.

అది ప్రభువైన యేసుక్రీస్తును గురించిన ఒక అద్భుతమైన ప్రవచనము. ఈ ప్రవచనము క్రీస్తు కాలమునకు 750 సంవత్సరముల ముందు వివరముగా చేయబడెను. ఇథియోపియా మనుష్యుడు ఆ వాక్యభాగమును చదువుటను విన్నప్పుడు, దేవుడు తనను గాజా మార్గములో వెళ్లమని ఎందుకు అడిగెనో అతనికి తెలిసెను. వెంటనే అతని ఆత్మ దైవిక సందేశమును పొందుకొనెను మరియు పరిశుద్ధాత్మద్వారా, అతడు ఇథియోపియా మనుష్యునితో, “నీవు చదువుచున్నది నీకు అర్థమగుచున్నదా?” అని ప్రశ్నించెను. ఈ నిశ్శబ్ద మార్గములో ప్రభువు తన ఆలోచనలను మాటలను మనలోనికి పెట్టును, మరియు తరచుగా మనము మాట్లాడుటకు ప్రారంభించినప్పుడు, మాటలు ఏరులవలె ప్రవహించుటను మనము కనుగొందుము. అతని ప్రశ్నకు, ఇథియోపియా మనుష్యుడు, “ఎవరైనను నాకు మార్గదర్శకత్వము వహించనిదే నేనెట్లు అర్థముచేసికొందును?” (వచనం 31) అని జవాబిచ్చెను. అతడు రథములోనికి ఎక్కి తనతో కూర్చుండునట్లు ఫిలిప్పును అనుమతించెను. అప్పుడు ఫిలిప్పు ఆ వాక్యభాగమును అంత స్పష్టముగా వివరించెననగా అతడు దాని అర్థమును పాపులనిమిత్తము యేసుక్రీస్తు మరణమును గురించి అతనిని ఒప్పించెను. మీరు దేవుని వాక్యమునకు లోబడుచుండగా, మత్తయి 10:20లోని ఆయన వాగ్దానము ప్రకారము, ఆయన తన మాటలను మీ నోటిలో పెట్టుననుదానిని మీరు కనుగొందురు, Luke 12:12, 21:15. మిమ్మును అడుగడుగునా నడిపించుచు మార్గదర్శకత్వము వహించు దేవుని స్వరమును మీరు వినుట మాత్రమేగాక, మీరు కలిసికొను వ్యక్తికి అవసరమైన తన స్వంత మాటలను పెట్టుచు పరిశుద్ధాత్మ మీ పెదవులను తాకుటను కూడ మీరు కనుగొందురు.

నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “దేవా, నీవు నా దేవుడవు; నేను ఆతురతతో నిన్ను వెదకుదును“Psalm 63:1

జూన్ 30

“నీ కన్నులు రాజును ఆయన సౌందర్యమునందు చూచును, మిక్కిలి దూరముననున్న దేశమును అవి కనుగొనును.” Isaiah 33:17.

ఈ మాటలద్వారా ప్రభువు నన్ను దూరదేశమునకు వెళ్లుటకు సిద్ధపడమని చెప్పెను. కావున వెంటనే నేను పాస్‌పోర్టుకొరకు దరఖాస్తు చేసితిని. ఎవరినుండియు నాకు ఆహ్వానము లేకపోయినను, సిద్ధపడమని దేవుడు నాతో మాట్లాడెనని నేను నమ్మితిని. సాధారణముగా పాస్‌పోర్టు పొందుటకు ఒక నెల పట్టును. దేవుడు నా తరుపున పనిచేయుచు కదలుచుండుటను నేను చూచితిని మరియు వారము లోపునే దానిని పొందితిని.

నా ఏకాంత సమయమున నేను ఈ మాటలను పొందితిని, Ezra 8:1 “ఆరవ సంవత్సరమున, ఆరవ నెలలో, నెలయొక్క ఐదవ దినమున”నుండి. ఈ మాటలు నా ఏకాంత సమయమున నాకు మిక్కిలి బలముగా వచ్చెను. మరల నేను, “ఈ మాటలు నాకు ఏమి అర్థమిచ్చుచున్నవి” అని ప్రార్థించితిని. ప్రభువు నాతో, “1946 జూన్ 5న నీవు లండనులో ఉండవలెనని నేను కోరుచున్నాను” అని చెప్పెను. కావున నేను బొంబాయికి వెళ్లి ఓడ కంపెనీని కలిసితిని. నేను వారితో “జూన్ 5న లండనుకు చేరుకొను ఏదైనను ఓడ కలదా?” అని అడిగితిని వారు, “అవును, ఉన్నది సార్, కాని దానిలో ఖాళీలేదు” అని జవాబిచ్చిరి. నేను రెండుసార్లు వెళ్లి, “ఎవరైనను తమ ప్రయాణమును రద్దుచేసుకొనిరా?” అని అడిగితిని. వారు, “లేదు సార్” అని జవాబిచ్చిరి. “కాని మరియొక ఓడ వచ్చే వారము బయలుదేరును మరియు మేము దానిలో మీకు ప్రయాణమునివ్వగలము”. జూన్ 5న నేను లండనులో ఉండవలెనని దేవుడు నాకు ఖచ్చితముగా చెప్పియుండెను, మరియు తర్వాతి ఓడ ఆ తేదీన అక్కడికి చేరుకొనునని నిశ్చయత లేకుండెను. అయినను నేను రెండవ ఓడలో నా ప్రయాణమును బుక్‌చేసికొంటిని మరియు మేము జూన్ 5న లండనుకు చేరుకొంటిమి కాని మొదటి ఓడ మేము చేరిన నాలుగు దినముల తర్వాత చేరుకొనెను, ఎందుకనగా వారి యంత్రము పాడైయుండెను. రెండవ ఓడ వేగవంతమైన ఓడ, మరియు నేను లోబడినందున నేను సరియైన సమయమునకు చేరుకొంటిని.

నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “చాచిన బాహువుతో నేను మిమ్మును విమోచించెదను” Exodus 6:6.

↑ పైకి వెళ్ళండి ← పుస్తకానికి వెనుకకు ← పుస్తక భాండాగారానికి

↑