Professor Muthyala Theophilus · He Walked with God
రచయిత జి.ఆర్. లార్న్ · అనువాదకులు జి. జాన్ గారు · రెండవ ముద్రణ, 2024
ప్రొఫెసర్ శ్రీ ముత్యాల థియోఫిలస్, బి.డి. (7 మే 1895 – 10 డిసెంబర్ 1946) జీవిత చరిత్ర — కాకినాడ బాప్టిస్టు వేదాంత పాఠశాల ఉపాధ్యాయుడు, 'పేదల బాంధవుడు', ఉత్తర సర్కారుల బాప్టిస్టు మహాసభ నాయకుడు, కనేడియన్ బాప్టిస్టు మిషను భక్తశ్రేష్ఠుడు. జి.ఆర్. లార్న్ 1948లో వ్రాసిన గ్రంథమునకు జి. జాన్ గారి తెలుగు అనువాదము; ప్రొఫెసర్ ముత్యాల థియోఫిలస్ ఫౌండేషన్ 2024 పునర్ముద్రణ. పూర్తి పుస్తకమును అధ్యాయము వారీగా వినండి, పాఠ్యముతో పాటు చదవండి.
17 భాగములుపూర్తి పాఠ్యముతోతెలుగు వ్యాఖ్యానముEnglish edition available
అనువాదకులు: జి. జాన్ గారు (మేనేజర్, సి.బి.యం. హయ్యర్ ఎలిమెంటరీ పాఠశాల, సామర్లకోట)
ప్రొఫెసర్ శ్రీ ముత్యాల థియోఫిలస్, బి.డి. (7 మే 1895 – 10 డిసెంబర్ 1946)
మొదటి ముద్రణ
బాప్టిస్ట్ బుక్ రూమ్, కలెక్టరేట్, పోస్ట్ ఆఫీస్, కాకినాడ ద్వారా ప్రచురించబడింది. కాకినాడ జార్జ్ ప్రెస్ వద్ద ముద్రించబడింది. 21-12-1948. 1949, బాప్టిస్టు పుస్తక భాండాగారము, కాకినాడ.
రెండవ ముద్రణ
ప్రొఫెసర్ ముత్యాల థియోఫిలస్ ఫౌండేషన్, హైదరాబాద్ ద్వారా ప్రచురించబడింది. 25-10-2024.
అంకితము
కనేడియన్ బాప్టిస్టు మిషన్ పితామహులు రెవరెండ్ జాన్ మెక్లారిన్, డి.డి. చిరస్మరణకు అంకితము.
నా స్నేహితుడును తోటిపనివాడునునగు యం. థియోఫిలస్ గారి జీవిత చరిత్రకు ఉపోద్ఘాతము వ్రాయు భాగ్యము నాకు లభించుటను నేనెంతయు ధన్యుడను. ఒక తరములో ఒక దేశమునకు గాని, సంఘమునకు గాని థియోఫిలస్ గారి వంటి ఉత్తమ పురుషుల నెక్కువమందిని దేవుడనుగ్రహింపడు. ఆంధ్రదేశములో క్రైస్తవ సంఘ చరిత్రలో విషమ పరిస్థితులయందీయనకుగల దూరదృష్టి, శ్రేష్ఠమగు క్రైస్తవ ప్రవర్తన నిమిత్తమై దేవునికి మేమత్యంత కృతజ్ఞులమై యున్నాము.
ఈయన అత్యధికముగా దైవాశీర్వాదములు పొందిన వ్యక్తి. క్రైస్తవ వేదాంత శాస్త్రమునందు ఉత్తమ పండితుడు. అందువలన ఆయన విద్యార్థులీయనను ప్రేమించి ఘనపరిచిరి, హిందూదేశ క్రైస్తవ సంఘ చరిత్రలో ప్రాముఖ్యమగు పాత్రను వహించినందున ఉత్తమ వ్యక్తిగా పరిగణింపబడెను. ఈయన దేశాభిమాని యైనందున భారతదేశమును హృదయ పూర్వకముగా ప్రేమించెను.
కుటుంబములో తనబిడ్డలకు ఆదర్శప్రాయుడగు తండ్రిగాను, భార్యకు ప్రేమానుబంధుడగు భర్తగాను జీవించి, క్రీస్తు యేసును దినసేవకునిగా వెంబడించెను. పూజనీయుడగు ఈయన జీవిత చరిత్ర హిందూదేశములోని క్రైస్తవ సంఘములకు భావికాలమున అమూల్యమగు నిధియైయున్నది.
జె.బి. మెక్లారిన్,
కనేడియన్ బాప్టిస్టు మిషన్ విదేశాంగ సర్వీయ
కార్యదర్శి. టొరంటొ, కెనడా.
యేసు ప్రభువు యొక్క రాజ్యాభివృద్ధికై స్వర్గీయ ముత్యాల థియోఫిలస్ గారు చేసిన సేవ, భారత క్రైస్తవ సంఘ చరిత్రలో, సుగంధ పూరితమగు ఘట్టములలో నొక్కటై విలసిల్లును. ఈయన జీవితకథను వ్రాయుటలో లభ్యమగు వృత్తాంతములన్నిటినుండియు కథావస్తువును సేకరించితిని. ఇయ్యది ఆయన జీవిత బాటపై నచ్చటచ్చట నేనేరిన పుష్పగుచ్ఛము మాత్రమే. కాలమానానుసరణిని వ్రాయబడిన జీవిత చరిత్ర కాదు; అందందు నా కంటపడిన ఆయన సౌశీల్య ప్రశంస మాత్రమే! క్షయరోగమను శ్రమానుభవములో, ప్రభుపాదసన్నిధిని ఆయన నేర్చిన జీవిత రహస్యమే ఆయన కీర్తికి కారణము. ఆయన నిత్య జీవపు నదిలో తనివిదీర దప్పిక తీర్చుకొనిన యొక యాత్రికుడు. ఆయన నడిచిన బాట పుష్పపథము గాదు; కఱుకైన పుంత; జనసామాన్యము నడిచిన వీధి గాదు; సాహసికులు మాత్రము త్రొక్కనగు ప్రమాద మార్గము. దేహమారోగాధీనము; పరిస్థితుల ప్రతి కూలములు; కార్యభారమా అసాధారణమగు బాధ్యతలు; ఐనను ఫల సాఫల్యత అత్యద్భుతము.
ఈయన జీవితము ప్రభు ప్రసాదము. బాప్టిస్టు సంఘములు అనేక విషయములలో వర్ధిల్లుటకు దేవుడు విరివిగా వాడుకొనిన సాధనము. దర్శకుని దృష్టితో భావి విషయములను గమనించుచు, ప్రవక్త ధైర్యముతో నైతిక ఆధ్యాత్మిక విషయములను ప్రసంగించుచు, శిల్పకారుని హస్తముతో తన స్వీయ జీవితమును, బాప్టిస్టు సంఘజీవితమును, దేవుని చిత్తములో మలచిన నేర్పరి. ఉచిత సేవకుల తర్ఫీదు, సంఘకేంద్రితమగు సువార్త సేవ, సంఘైక్యతయను యీ మూడు విషయములను ఆయన జీవిత కార్యక్రమములో ప్రధాన స్థానమలంకరించెను. బాప్టిస్టు మహాసభ యొక్క నిర్మాతయై తోటి క్రైస్తవులకు చిరస్మరణీయుడైన హితుడై, యువజనులకు ఆదర్శప్రాయుడై, అనేకుల సంతోషమునకు కారణమాయెను. ఆయన హృదయములో నెల్లప్పుడు పనిచేయుచుండిన యేసుక్రీస్తు యొక్క శక్తియు, దేవునితో ఆయన యనుభవించిన ప్రార్థన సహవాసమును, సువార్త సేవాభిలాషయు, ఆయనను ఏసుక్రీస్తు సంఘములో ప్రజ్వలించు చుండిన యొక జ్యోతిగా ప్రదర్శించెను.
ఆయన జీవిత సౌరభము అనేకుల నాకర్షించెను. వివిధ క్రైస్తవ మత శాఖలలో నీయన నాయకుడుగా పరిగణింపబడెను. ఈయన నెరిగియు, ఈయననను ప్రేమింపలేకుండుట అసాధ్యము. అనేకులీయన సేవను ప్రశంసించుచు, "పేదల బాంధవుడు"; వేదాంత కళాశాల జీవకళ", "బాప్టిస్టు మహాసభయొక్క నాయకమణి" అను పదపుష్పములతో ఈయన స్మరణ నలంకరించిరి.
ఇట్టి భక్తవరుని జీవిత కథను, వ్రాయగల్లుట నా భాగ్యము, వ్రాయు కొలది ఈయన యందలి నా గౌరవము హెచ్చినది. ఈ భక్త శ్రేష్ఠుని జీవితమును గూర్చి స్వదేశీయులేమి, విదేశీయులేమి, ప్రభుని కొరకు ఘనకార్యములను తలపెట్టువారందరును, తెలుసుకొన గలందులకే యీ వినయయత్నము. రచనము నందును, శైలి యందును పెక్కు లోపములున్నవని నేనెరుగుదును. ఐనను ఈ గ్రంథపఠనము ద్వారా దేవార్పితమగు నొకరి జీవితము ద్వారా దేవుడెట్లు మహిమపర్చబడగలడో విదితమగుచో, అదియే నాకు పదివేలు, నాస్వప్న సిద్ధి.
ఈ సందర్భమున ఈ కార్యమునందు నాకు తోడ్పడిన నా మిత్రులు శ్రీ ఓగిరాల గాబ్రియేలు గారు, ముఖ్యముగా రెవ. ఏ.బి. మాసిలామణి గారు, జే. మోజెస్ గారు ఈ గ్రంథమును అనువదించిన శ్రీ జాన్ గారు. వీరికి నా వందనములాచరించుచున్నాను.
జి.ఆర్.లార్న్
కాకినాడ, దక్షిణ ఇండియా, డిసెంబర్: 1949.
మన ప్రభువు మరియు రక్షకుడు యేసు క్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. 2023, అక్టోబర్ 25న పరమపదించిన మా ప్రియ తండ్రి గారు, దివంగత ముత్యాల బెంజమిన్ రంజిత్ గారి మొదటి వర్ధంతి సందర్భంగా, మా తాతగారు ముత్యాల థియోఫిలస్ జీవిత చరిత్ర జి.ఆర్. లార్న్ రాసిన 'హి వాక్డ్ విత్ గాడ్' (1948లో మొదట ప్రచురించబడినది), ఈ గ్రంథాన్ని మరల ముద్రించి విడుదల చేయడం మాకు ఎంతో గర్వంగాను, గౌరవంగాను ఉంది. ఈ కాలాతీతమైన రచనను కనుగొనడం మాకు నిజంగా ఆశీర్వాదం. ఈ ప్రేరణాత్మక గ్రంథాన్ని పున:ముద్రణలో పాలు పంచుకోవడంలో మేము ఎంతగానో సంతోషిస్తున్నాము.
మా తాతగారి అపూర్వమైన లక్షణాలను మేము వ్యక్తిగతంగా లోతుగా అర్థం చేసుకోగలిగాము. ఆయన వినయం, నిరుపేదల యెడల దయ, బాప్టిస్టు మిషన్‌లో దార్శనిక నాయకత్వం, అలాగే దేవుని పట్ల ఉన్న అచంచలమైన భక్తి మాకు చాలా ప్రేరణనిచ్చాయి. ఈ విలువల ప్రభావం ఈ పుస్తకంలోని విషయం మరియు సారాంశంలో స్పష్టంగా ప్రతిబింబిస్తూ, ప్రతి ఒక్కరూ మెచ్చుకోగలిగేలా ఉంటుంది.
ముత్యాల థియోఫిలస్ గారి జీవితాన్ని మరియు దేవునితో ఆయన చేసిన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రతిబింబించే లోతైన, ప్రభావవంతమైన పుస్తకం 'He walked with God'. ఈ మహనీయుని అసాధారణ జీవితం అందరికీ ఒక దివ్యదర్శనముగా ఉంటుంది. ఈ పుస్తకంలోని అధ్యాయాలను పరిశీలిస్తుండగా, మీరు పరిశుద్ధ స్థలంలో నడుస్తున్నట్లుగా అనిపిస్తుంది. రెవ. ఎ. గోర్డన్ గారు ముత్యాల థియోఫిలస్ గారిని తన కాలంలో భారతీయ సేవకులలో మరియు సువార్తీకులలో ప్రధాన నాయకుడిగా వర్ణించారు. ఆయన బోధన, దేవుని పట్ల చేసిన నిస్వార్థమైన సేవ, భారతదేశంతో పాటు కెనడా, శ్రీలంక, బర్మా వంటి సుదూర దేశాల్లో కూడా గుర్తింపు పొందింది. ముత్యాల థియోఫిలస్ గారి జీవితాన్ని, కాలాన్ని 76 సంవత్సరాల క్రితం వెలుగులోకి తీసుకొచ్చిన రచయిత G.R. లార్న్ గారికి ఈ సందర్భంలో మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఆయన ప్రభావం లేకుండా మా తాతగారి నిజమైన గొప్పతనాన్ని ఎప్పటికీ వెలికి తీయలేక పోయేవాళ్లమేమో.
మా లక్ష్యం ముత్యాల థియోఫిలస్ గారు చూపిన మాదిరిని అనుసరిస్తూ, దేవుని పట్ల అచంచలమైన అంకితభావాన్ని మరియు క్రైస్తవ సమాజానికి సేవ చేయాలనే నిబద్ధతను ప్రతిబింబించడమే. సమాజ శ్రేయస్సుకు తోడ్పడడమే కాక, దేశ నిర్మాణంలో కూడా మా పాత్రను సద్వినియోగం చేసేందుకు కృషి చేస్తాము. ఆయన దార్శనిక నాయకత్వం, సహానుభూతి, కరుణ మరియు నైతిక సమగ్రత వంటి విలువల వారసత్వాన్ని కాపాడటానికి మేము అంకితమయ్యాము. శ్రేష్ఠతపై స్థిరదృష్టి మరియు దాతృత్వ స్ఫూర్తితో మా సామర్థ్యాలకు తగ్గట్లుగా సమాజానికి సేవ చేయడానికి ఎదురు చూస్తున్నాము. ఈ ప్రయాణంలో మేము దేవుని నడిపింపును వెదకుతున్నాము. ప్రేమా, ఆశీర్వాదాలతో...
రాజీవ్ ముత్యాల, రవి ముత్యాల మరియు రణధీర్ ముత్యాల
ప్రొఫెసర్. ముత్యాల థియోఫిలస్ ఫౌండేషన్ హైదరాబాద్, ఇండియా 25 అక్టోబర్ 2024
మా దివంగత పితరులు ప్రొఫెసర్ ముత్యాల థియోఫిలస్, బి.డి మరియు శ్రీమతి కమలమ్మ ముత్యాల ప్రాతినిధ్యం వహించిన ముత్యాల కుటుంబ వారసత్వాన్ని నిలబెట్టడానికి మరియు ముందుకు తీసుకెళ్లడానికి 'ప్రొఫెసర్ ముత్యాల థియోఫిలస్ ఫౌండేషన్' జూలై 2024 లో స్థాపించబడింది, మా దివంగత పెదనాన్న, రెవరెండ్ థియోడర్ సుధాకర్ ముత్యాల మరియు మా దివంగత తల్లిదండ్రులు ముత్యాల బెంజమిన్ రంజిత్ మరియు ముత్యాల రోహిణి రోజ్ యొక్క సేవ మరియు అంకితభావాలను అనుసరించి ఇది స్థాపించబడింది. 'అయ్యగారు' అని ఆప్యాయంగా పిలుచుకునే ప్రొఫెసర్ ముత్యాల థియోఫిలస్ క్రైస్తవ సమాజంలో ఎంతో గౌరవం, అభిమానం ఉన్న వ్యక్తి. దూరదృష్టి గల నాయకత్వం, సేవ పట్ల అచంచలమైన అంకితభావం, అణగారిన వర్గాల పట్ల ప్రగాఢమైన కరుణతో పాటు ఆయన తన జీవితాంతం అనేక ప్రధాన విలువలను కలిగి ఉన్నారు. సహానుభూతి, ఔదార్యం మరియు నిరంతర అభ్యాసం పట్ల నిబద్ధతతో నడిచే వ్యక్తులు మరియు సంఘంపై ఆయన వారసత్వం లోతైన ప్రభావాన్ని ప్రతిబింబిస్తుంది.
ఫౌండేషన్ యొక్క దార్శనికత, లక్ష్యం మా పూర్వీకులు నేర్పిన మూల విలువలపై ఆధారపడి ఉంటుంది. విశ్వాసంతో కూడిన ఒక శక్తివంతమైన సమాజాన్ని పెంపొందించడం, ప్రభావవంతమైన ప్రచురణలను రూపొందించడం, వైద్య సహాయం, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు మరియు న్యాయ సహాయం ద్వారా విద్య మరియు కారుణ్య సంరక్షణను అందించడంతో మా దార్శనికత, ఇవన్నీ దేశ ఐక్యత మరియు సమగ్రతకు దోహదం చేస్తాయి.
చిన్నారులు, కుటుంబాలు మరియు సమాజంలో జీవితాలను మెరుగుపరచడానికి ఫౌండేషన్ అంకితభావంతో పనిచేస్తుంది. మేము కమ్యూనిటీ ఆధారిత భాగస్వామ్యం మరియు సుస్థిర అభివృద్ధి ద్వారా, కమ్యూనిటీ మరియు సంఘ అవసరాల మూల కారణాలను పరిష్కరించడంపై దృష్టి పెడతాము. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం ద్వారా మరియు సువార్త నిరీక్షణను పంచుకోవడం ద్వారా క్రీస్తు చూపిన ఆదర్శాలను అనుసరించడానికి ప్రయత్నిస్తున్నాము. ఫౌండేషన్ యొక్క మిషన్ ప్రధానంగా శిష్యత్వం మరియు వ్యక్తులలో విశ్వాసాన్ని పెంపొందించేందుకు శిక్షణ అందించడంలో ఉంటుంది. అట్టడుగు వర్గాలకు న్యాయ సహాయం అందించడం ద్వారా క్రీస్తు ప్రేమను మా సేవల ద్వారా ప్రదర్శించాలని మేము యోచిస్తున్నాము.
మేము మా ప్రాజెక్టులను సక్రమంగా ప్రారంభించడానికి ప్రణాళికలు రూపొందించి నప్పటికీ, రాబోయే సంవత్సరాల్లో అర్థవంతమైన మరియు శాశ్వత ప్రభావాన్ని సృష్టించడానికి మా కృషిని మరింత విస్తరించాలని ఆశిస్తున్నాము. ముత్యాల థియోఫిలస్ వారసత్వాన్ని గౌరవిస్తూ, విశ్వాసం మరియు సేవ ద్వారా మా సమాజాన్ని పునరుజ్జీవింపజేయాలనే ఈ గొప్ప కార్యక్రమంలో ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నాము. మనం కలిసికట్టుగా కృషి చేస్తూ, కరుణ మరియు అంకితభావం వంటి విలువలతో శాశ్వత మార్పును సృష్టించగలమని నమ్ముతున్నాము.
దేవుని ఆశీర్వాదాలతో, మనం ఆయన కృపకు పాత్రలుగా, ఆయన శాంతికి పరికరాలుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాము. మీ మద్దతుకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు, మరియు దేవుని కృప ఎప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటున్నాము.
రాజీవ్, రవి, రణధీర్ ముత్యాల మరియు వారి కుటుంబాలు
ప్రొఫెసర్. ముత్యాల థియోఫిలస్ ఫౌండేషన్
జూబ్లీహిల్స్, హైదరాబాద్ – 500 033, ఇండియా ఫోన్: +91 87976 11879 ఈమెయిల్: contact@muthyalafondation.org
నిశ్చలమైన గాలిలో సంగీతం వినబడ్డం లేదు;
కఅకు చలువరాతిలో శృంగారం కనబడ్డం లేదు;
సంగీతం ప్రవహించాలంటే, శృంగారం వికసించాలంటే, వైణికుని హస్తం కావాలి;
శిల్పకారుని ప్రజ్ఞ కావాలి. మాలోనున్న సంగీతం సమసి పోకుండునట్లు, ఓ ప్రతిభాకరా!
నీ హస్త నైపుణ్యత మమ్ము తాకు గాక!
మాలోనున్న నీ స్వరూపం కమలిపోకుండునట్లు అసమాన శిల్పకారీ!
నీ సంప్రాజ్ఞత మమ్ము మలచు గాక!
వంశము
చెన్న రాష్ట్రమున కృష్ణామండలమందు గున్ననపూడియను చిన్నగ్రామము కలదు. కెనడా దేశపు మిషనెరీవారు ఆంధ్రదేశమున తొలుదొల్త సువార్త సేవను ప్రారంభించిన గ్రామములలో నిది మొదటిది. ఈ గ్రామ జనాభా సుమారు ఐదువందలు. ఐనను పెక్కండ్రు సువార్తికులీ గ్రామమునుండియే వెలువడియుండిరి. ఈ గ్రామమున బెన్యామిను మరియమ్మలను క్రైస్తవ దంపతులుండిరి. వీరికి కొంత భూమి కలదు. తద్వారా వీరు సుఖజీవనము చేయుచుండిరి. బెన్యామిను గారు దైవభక్తి, విధేయత, సాత్వికము, దయాళుత్వము, తెలివి తేటలుగల సజ్జనుడు. మరియమ్మ నిరాడంబరి. ఉన్నత విద్య నభ్యసింపకున్నను, మనోగణితమున నెట్టిచిక్కు లెక్కలనైనను చక్కగా చేయగలిగిన ఇల్లాలు, సౌందర్యము, సద్గుణములు గల సాధ్వి. ఈ దంపతులు క్రేగ్ దొరగారి కాలమును సామర్లకోటలో వేదాంత పాఠశాలయందు మూడేండ్లు విద్య నభ్యసించిరి. పిదప ఆకివీడులో సంఘాధ్యక్షులుగనుండిరి. ఆ కాలమున 1895 వ సంవత్సరము మే నెల ఏడవ తేదీన 'ముత్యాల' యనబడు వారి ఇంటిపేరును సార్థకముచేయు నొక శ్రేష్ఠమగు ముత్యము వీరి గర్భమున నుద్భవించెను. ఈయనయే బాప్టిస్టు సంఘములలో భక్తాగ్రగణ్యుడగు నాయకుడు, థియోఫిలస్. జనకుని వినయవిధేయతలు, భక్తి మర్యాదలను జనని యొక్క సద్గుణ సౌందర్యములును బాలునియందు మూర్తీభవించియుండెను.
బాల్యము
బాలుడగు థియోఫిలస్ గున్ననపూడి ప్రాధమిక పాఠశాలలో విద్యనభ్యసింప ప్రారంభించెను. పువ్వు పుట్టుటతోడనే పరిమళించునన్నట్లు మొదటి తరగతిలో నుండగానే విద్యాశాఖాధికారి యాబడిని దర్శించినపుడు థియోఫిలస్ యొక్క యసామాన్య జ్ఞానమున కచ్చెరువంది రెండవతరగతి చదువకుండగానే మూడవతరగతిలో ప్రవేశింప ననుజ్ఞయిచ్చెను. తరగతులలో నెల్లప్పుడును ప్రధమస్థానమున నుండెడివాడు. బడిలో శ్రద్ధగలిగి విద్యనభ్యసించెడి వాడు. ఇంటియొద్ద తల్లిదండ్రులకు విధేయుడై యుండెను. ఒక్కొక్కప్పుడు తనతల్లి తనను దృష్టాంతముగదీసికొని తనచెల్లి యవిధేయతను గద్దించుచు "చూడు! అన్నయ్య యెంత మంచివాడో!" అని యాతని సుగుణములను కొనియాడెడిది. 1907 సం॥ జూలైలో ఆకువీడు సి.బి.యం. బోర్డింగు ప్రాథమికోన్నత పాఠశాల యందు నాలుగవ తరగతిలో ప్రవేశించి యుత్తీర్ణుడై మరుసంవత్సరము సామర్లకోట మిడిల్ స్కూల్లో చేరెను. క్రమముగా నిచట మూడవఫారములో జయము పొంది 1912 సం॥న కాకినాడ మెక్లారిన్ హైస్కూలునందు నాలుగవ ఫారములో చేర్చబడెను. ఇచట విద్యార్థిగ నున్న కాలమున ఈతని జ్ఞానము, జ్ఞాపకశక్తి యెక్కువగా ప్రకటితమాయెను. గణిత శాస్త్రమున తన తరగతిలో పేరొందెను. సామాన్యముగ మంచివాడనిపించు కొనెడివాడు. అయినను అప్పటికి మారుమనసు పొందియుండనందున పరీక్షలలో బాలురకు సహాయము చేయుట యొకయుపకార కార్యమనియెంచి తాను వ్రాసిన కాగితములను పరిసర బాలురకిచ్చెడువాడు. కాన పరీక్షసమయములలో విద్యార్థులీయన చేరువనే కూర్చుండుట కెంతయో ప్రయాసపడుచుండెడివారు. ఒక్కొక్కప్పుడాయన కాగితములు ఒకరి తరువాత మరియొకరు వాడుటచే చివరకు చినిగిపోయి చేతికి వచ్చెడివి.
సహజ లక్షణము
థియోఫిలస్ తరగతిలో మిక్కిలి తెలివితేటలుగలిగి యుండెడివాడు. ఆయన స్నేహితులాయనను మెచ్చుకొనెడివారు. ఎన్నడైనను ద్వేషము, అసూయ కనుపరచక హృదయ పూర్వకముగ ఆయనను ప్రేమించెడివారు. ఏలయన ఆయన సహజ గుణములగు సాత్వికము, ప్రేమ వారి నాకర్షించెను. ఎంత సాధువైనను ఒక్కొక్కప్పుడు పరిమిత కోపము నగుపరచెడి వాడు. దుర్బలుడగుటయే యిందులకు ప్రబల కారణము.
బంతిఆట యందొకనాడీతనికి దెబ్బతగిలెను. అన్యాయముగ నా దెబ్బగొట్టినవానిని సహింపజాలక అత్యుగ్రుడై ఆటను విడిచిపెట్టి వానిపై కలియబడెను. తదితర బాలురాయాటను విడిచి యాకలహమును జూడ గుమిగూడిరి. వారెంత ప్రయత్నించినను ఈయనను శాంతింపలేక పోయిరి. ఈ ముంగోపితనము చాలాకాలము వరకు ఆయనలో నుండెను. కాని తరువాత ఆయన బహుకాలము పీడింపబడిన యనారోగ్యము యొక్క ఫలితముగ సంపూర్ణ సహనమును నేర్చుకొనెను. తన యౌవనకాలమున తన యారోగ్యము విషయమై ఎక్కువగ నశ్రద్ధజేసెను. ఉత్సాహపూరితులై ఆడుకొను యువకులను చూచి "బుద్ధిహీనులు! తమకాలము నెట్లు వ్యర్థము చేయుచున్నారో చూడుడు" అని చేరువనున్న వారితో చెప్పెడివాడు. ఇరువది సంవత్సరముల యనంతరమున తన యారోగ్యమును నిర్లక్ష్యపెట్టిన యవివేకమును గుర్తించి తీవ్రమగు హృదయవేదనతో "ఒకడు తన దేహారోగ్యము విషయము నిర్లక్ష్యముగా నుండుటయు నొక పాపమే; నా యనారోగ్యము దైవసేవకెట్లు ఆటంకముగా నున్నదో చూడుడు!" అనెను. బోర్డింగులోనున్న బాలురకు దినమునకు నియమింపబడిన పనులను చేసికొనుట యలవాటు. థియోఫిలస్ బోర్డింగులోనున్నప్పుడు పోస్టాఫీసుకు జాబులను తీసుకొని పోవుటయు అటు నుండి యుత్తరములను తెచ్చుటయు తన పనియై యుండెను. ఆయన యీ కార్యము నతినమ్మకముగ జేసి మిషనరీవారి యాదరాభిమానములకు పాత్రుడయ్యెను.
ఆధ్యాత్మికా వికాస చిహ్నములు
థియోఫిలస్ సత్క్రైస్తవ కుటుంబములో జనించినందు వలనను తన తల్లిదండ్రులాతనిని క్రైస్తవభక్తి మర్యాదలలో పెంచినందునను ఈయన దైవారాధనలకు హాజరగుచు, వేద వాక్యమును పఠించుచు, ఆయా సమయమందేర్పాటు చేయబడిన వివిధ ఆత్మీయ కూటములలో పాల్గొనుటయందత్యాశక్తి కలిగియుండెను. ఐనను ఇది యంతయు నామకార్థముగ ఆచారముల ననుసరించుచున్నట్టుండెను. 1914 సం॥న విద్యార్థిగనున్నప్పుడే 'బాప్టిస్టు మిషను విద్యార్థి సంఘము' ఆనునొక దానిని కృష్ణామండలములో స్థాపించెను. బాల్యమున నీతనికి గల నాయకత్వ లక్షణములును నూతనోద్యమము నందలి ఆసక్తియను తన భావికాలమున దైవసేవలో సహాయపడెను.
సామాన్యముగ యువకులకుండు దురలవాటులకీయన దూరముగ నుండెను. అందుచేతనే నిర్దుష్ట వర్తనమును బరీక్షించుచుండిన మిత్రులీయనందే నేరమును కనుగొనజాలక యెక్కువ గౌరవాభిమానములను చూపెడివారు. సహజముగా నిర్మలమనస్సాక్షి గలిగి తన యంతరంగ జీవిత మనింద్యముగ నుంచుకొనుట కలవరచు కొనెను. కావున నపవిత్రతలంపులను జయించి సదా యాధ్యాత్మిక చింతతో తన యౌవనకాలమును గడిపెను. ఏలయన దైవ కార్యముల యందు శ్రద్ధబూని పనిచేయు కోరిక తన హృదయములో నిప్పటినుండియే ప్రారంభమాయెను. ఈతని శరీర దౌర్బల్యతయే నహజముగ యువకులయందగపడు అల్లరిచేష్టలు ఈతని యందు లేకుండునట్లు కాపాడెను. తన జీవితమున నచిరకాలముననే క్రీస్తును వెంబడించుటకు చేసిన ప్రయత్నములలో నీ ప్రారంభ జీవితము చాలవరకనుకూలముగ నుండెను. రానురాను తన జీవితమున ప్రేమ, మౌనము, నిరాడంబరము, ఆశానిగ్రహము, మనోనిశ్చయత, పట్టుదల మొదలగు శ్రేష్ఠమగు గుణముల నలవడజేసికొనెను.
ఒక వేసవి యందీయన స్వగ్రామము అగ్నికాహుతియయ్యెను. అగ్నిజ్వాల లాకాశమున కంటెను. మండువేసవిలో మంటలార్పు యీ యువకుడు ప్రారంభము నుండియు అగ్నినార్పి వేయుటకు ప్రబల ప్రయత్నములను చేసినను ప్రయోజనము లేకపోయెను. ఆబాలగోపాలము గొల్లున వాపోవుచుండ కొంతసేపటిలో నాపూరియిండ్లు బూడిదయై మొండిగోడలు మిగిలెను. ఎంతలోనెంతపని జరిగినది. సూక్ష్మబుద్ధిగల ఈ యువకుడు విపత్తును చూచుచు నూరకుండక వెంటనే జిల్లా కలెక్టరుకును, కెనడాలో నున్న మిషనెరీవారికిని తెలియజేసి కావలసిన సహాయమును సంపాదించి వర్ష ఋతువునకు ముందే వరుసగా యిండ్లన్నియు గట్టుటకేర్పాట్లు చేసెను. ఈ విధముగ తన శక్తి సామర్థ్యములను తెలివితేటలను వినియోగించి స్వగ్రామ ప్రజలకు సౌఖ్యమును చేకూర్చెను. తన ప్రవర్తన స్థిరపడుచున్న యీ బాల్యదినములలో నిట్టిసత్కార్యములను చేయుట ద్వారా తన బాల్యమును పోషించుకొనెను.
విద్యార్థిగనున్నపుడు తనయందు గాఢమగు విశ్వాసము ప్రబలము గాక పూర్వమే హిందూమతము నుండి క్రైస్తవ సంఘములోనికి చొరబడి యింకను నశింపని అత్యాచారములను చూచినపుడెల్ల ఆయన హృదయము అమిత వేదనతో నిండియుండెను అట్టి దురాచారములను నిర్మూలము చేయనీతడు పూనుకొనెను.
కావున నప్పటికాలమున నాతని నెరిగినవారు "థియోఫిలస్ ప్రారంభము నుండియు మంచి కుర్రవాడే" అని చెప్పెడివారు. గొప్ప ఐశ్వర్యము కంటె మంచిపేరును వెండి బంగారముల కంటె దయయు కోరదగినవి కావా!
సెలవు దినములు
థియోఫిలస్ క్రిస్మస్, వేసవి సెలవు దినముల నెప్పుడును వ్యర్థముగ గడుపలేదు. తన పాలికాపులతో కలసి భూమిని దున్నుట, విత్తనములను చల్లుట, నారతో బలమైన త్రాళ్ళను పేనుట, పొలములోనికి బండ్లపై ఎరవులను తోలుట యిత్యాదికార్యముల నుత్సాహముతో సామాన్య కర్షకునివలె చేసెను. అప్పుడప్పుడు పంటచేల గట్టులందిటునటు విహరించుచు, పసిడిచాయనుబోలు పండిన వరివెన్నులు భారముచే తలలువంచి కనుచూపు మేర నందముగ గన్పట్టుచుండ నాదృశ్యమును తిలకించి యానందించి సృష్టికర్తకు స్తోత్రములు చెల్లించుచుండెడివాడు.
థియోఫిలస్ యువకుడుగ నున్నపుడు పేదసాదల బాధలగని హృదయవేదన నొందెను. పల్లెలందుండు విద్యలేని పామరులనిన నీయన కెంతయో ప్రీతి. చదువుకొనినవాడననెడి స్వాతి శయము లేక కూలినాలి వలన జీవించు పేదల యెడల జాలిపడి వారితో కలసి మెలసి యుండెను. సామాన్య జనులీతని సరళహృదయమును గమనించి, ప్రేమలొలుకు ఈతని మధురవాక్కుల కాకర్షింపబడి, హృదయపూర్వకముగను, మిక్కుటముగను యీయనను ప్రేమించిరి.
ఒకనాడీతనినొకరు పెండ్లి విందున కాహ్వానించిరి. భోజనమునకు వచ్చిన వారిలో గొందరు ఆదియాంధ్ర, ఆదిమ ద్రావిడుల నుండి క్రైస్తవులైన వారును నుండిరి. అందొక తెగకు విందు ప్రధాని నీచమగుస్థానమున భోజనము నేర్పాటుచేసెను. ఈతనిని ఉన్నతస్థానమున గూర్చుండబెట్టెను. అట్లు పక్షపాతమును జూపుట క్రైస్తవ ధర్మము కాదని యజమానిపై నాగ్రహించి తానున్న ఉన్నత స్థానము విడిచి హీనపరచబడిన వారితో గలసి భుజించెను. సాంఘీక సంస్థలలో భేదములు మతనిష్ఠ, చాదస్తము మొదలగునవి మొదటి నుండియు నీతనికయిష్ఠము. జ్ఞానమందును, వయసునందును పెరుగుకొలదిని శ్రేష్ఠమగు క్రైస్తవాశయములు కలిగి వర్ధిల్లుచుండెను. ఇట్లు మతసంబంధమగు శ్రేష్ఠమగు అభిప్రాయములింకను ననేకము లీతని జీవితమున నంకురించి కాలక్రమమున నభివృద్ధిజెందెను.
దుఃఖసముద్రము
1915 వ సంవత్సరమున మెక్లారిన్ ఉన్నత పాఠశాల యందున్నత విద్యయందుత్తీర్ణుడై థియోఫిలస్ శ్రీపీఠికాపురాధీశ కళాశాలలో ప్రవేశించెను. ఈ కాలమున నీయనయందింత దనుక దాగియున్న మానసిక శక్తులు అగ్నిపర్వతమువలె విజృంభించెను. గణిత శాస్త్రమున నీయన గొప్ప మేధావియని పరిగణింపబడెను. రెండేండ్లు శ్రద్ధతో చదివి తన కాలమును జయకరముగ గడిపెను. విశ్వవిద్యాలయ పరీక్షలకు విద్యార్థులెల్లరును సిద్ధపడుచుండిరి. ఆదినములలో గున్ననపూడి గ్రామమున కలరా చెలరేగియుండెను. థియోఫిలస్ తండ్రియగు బెంజమిను ఆ అంటువ్యాధి వలన నాకస్మికముగ మరణించెను. తల్లియగు మరియమ్మ తన భర్తకు పరిచర్య చేయుచుండుటచేత తానుకూడ పది దినముల లోపుననే యాభయంకర వ్యాధివలన ప్రాణమును కోల్పోయెను. జననీ జనకుల యకాల మరణవార్త థియోఫిలస్కు తెలిసినచో మతి భ్రమించి పరీక్షలు సరిగా వ్రాయలేడని మిషనరీ వారీవిషయమును విశదపరచక తంతివార్తను దాచి యుంచిరి. కాని కాకినాడ బోర్డింగులోనున్న గున్ననపూడి వాసియగు తుంటరి బాలకుడొకడెట్లో యీ వార్తను తెలిసికొని థియోఫిలస్ను చాటునకు బిలచి చల్లగా నీవార్తను చెవిలోనూదెను. పొంగుచున్న పాలపై చన్నీరు జల్లినట్లీయువకుని యుత్సాహమనిగెను. తననెక్కువగ బ్రేమించి పెంచి పెద్దవానిగ జేసి విద్యాబుద్ధులు నెఱపిన తల్లిదండ్రులు ఒక్కసారి యీ జీవితయాత్రను చాలించి దివినలంకరించిరని తెలియుట తోడనే యీ యువకుని కోమల హృదయము కృంగిపోయెను. తనపై నొక పిడుగు బడినట్లాయెను. రేపో, మాపో పరీక్షలు ప్రారంభమగుననుకొనుచుండగ నీవార్త థియోఫిలస్ను కలతపరచెను. ఎట్లో పరీక్షలు గడచిపోయినవి. ఏమి వ్రాసెనో తానే యెరుగడు. జయమెట్లు చేకూరును?
తల్లిదండ్రులను గోల్పోయినంతనే లోకానుభవములేని యీ యువకునిపై కుటుంబ భారము పడెను. తన తమ్ముడగు దైవసహాయమును, చెల్లియగు ఎవియమ్మను చదివించుటయు, ఎనుబదియేండ్ల వృద్ధురాలగు తన యమ్మమ్మను పోషించుటయు, వ్యవసాయ సంబంధమగు వ్యవహారములను చక్కబెట్టుకొనుట మొదలగు విషయము లీయన విద్యాభ్యాసమునకాటంకమయ్యెను తన చెల్లి ఎవియమ్మ నెంతయో గారాబముగా జూచెను. ఆమెను బుజ్జగించుటలో తల్లివలెను తగిన జాగ్రత్తదీసికొని సలహాలనిచ్చి పెంచుటలో తండ్రివలెను చూచి పెంచెను. అందుచేనామె తన బాల్యదినములను జ్ఞాపకము చేసికొని తన జీవితములో పలుమారులిట్లు తలపోసికొనుచుండెను. "నేను ఆశీర్వదించబడుటకు, అభివృద్ది చెందుటకు ఇట్టి ఉన్నతస్థాయి యందు ఉండుటకు నా అన్నగారి ఆశీర్వచనమును, నడిపింపులే కారణములు." ఒకసారి థియోఫిలస్ తన చెల్లికి జ్ఞానోపదేశమును చేయుచు "చెల్లీ! మనమీలోకములో మంచివారముగనున్న యెడల మన తల్లిదండ్రులు ఆ లోకములో సంతోషింతురు." అనిచెప్పెను. ఈమాటలామె హృదయసీమ నెల్లప్పుడును ప్రతిధ్వనించుచు నామె యాధ్యాత్మిక జీవితమున కెంతయోతోడ్పడెను.
ఒకసారి యొక పేదవాని గృహమున వివాహ సందర్భంగా యీతని కుటుంబ మాహ్వానింపబడెను. ఆ యింటికి బోవుటయాయని ఎవియమ్మ వెనుదీయుచుండ థియోపిలస్ ఆమెను మందలించి "అమ్మా'! పేదల సుఖదుఃఖములందు పాల్గొను వారియందు దేవుడా నందించును." అని చెప్పెను. అంతట వారుత్సాహము నాయుత్సవమునకరిగిరి. ఈతడు యీరీతిగ తన బాల్యమున తమ్ముని, సోదరిని ప్రేమించుటయే గాక వారు పెరిగి పెద్దవారైనప్పుడు కూడా వారి సుఖదుఃఖములలో పాల్గొనెను.
మెక్లారిన్ ఉన్నత పాఠశాల యందు ఉపాధ్యాయుడు
1917 జూలై నెలలో థియోఫిలస్ కాకినాడ మెక్లారిన్ ఉన్నత పాఠశాలయందొక యుపాధ్యాయుడుగ నేర్పాటు చేయబడెను. ఇచట నీయన సేవయందొక విషయము గమనింపగ సంవత్సరాంతమున విద్యాశాఖాధికారి బడి పరీక్షించుటకు వచ్చెను. వరుసగా తరగతులను చూచుచు థియోఫిలస్ బోధించుచున్న గదిలో ప్రవేశించెను. ఆ సమయమున ఈయన విజ్ఞాన శాస్త్రమును బోధించుచుండెను. అధికారి కొంతతడవు గమనించి యాకస్మికముగ నడ్డువచ్చి, "పంతులు గారూ! మీరు బోధించునది తప్పు." అని చెప్పెను. వెంటనే థియోఫిలస్ వెలుపలికిబోయి తెరచిన పుస్తకము నొకదానిని తొందరగా చేతబట్టుకొని వచ్చి అధికారికి చూపి, "అయ్యా! ఇటు చిత్తగించండి. బోధించునది ఈ పుస్తకము నుండి. ఈ పుస్తకమే తప్పా?" అని ప్రశ్నించగా పరీక్షాధికారి నిశ్చేష్టితుడై నిలచెను. తానే పొరపడెనని తెలిసికొని తర్కమును మాని అధికారి తిరిగిపోయెను. సత్యమును గూర్చి వాదించుటలో నీయనసాహస మింతయని వర్ణింపనలవికాదు. తాను సరియగు మార్గముననున్నట్లు గ్రహించినచో నెట్టిబలవద్విరోధినైనను ఎదిరించుటలలో వెనుదీసి యెరుగడు.
సువార్త సేవకు పిలుపు
1919 జూలై నెలలో థియోఫిలస్ను మిషనరీ వారు సిరంపురములోని వేదాంత కళాశాలకు (బి.డి.) విద్య నభ్యసింప నంపిరి. తల్లిదండ్రులు లేనివరగుటచే తన జీవితములో నేదో యొక యున్నతోద్యోగమును సంపాదించుకొన వీలగునని యీ వృత్తియందు ప్రవేశించెను. తానొకటితలచిన దైవమొకటి దలచెనన్నట్లు సౌలును తనసేవలో వాడుకొనుటకై పౌలుగా మార్చిన ప్రభువు ఈ యువకుని నత్యుత్తమసేవలో ప్రవేశపెట్టుటకిది ప్రారంభదశయని మాత్రము గ్రహించలేదు కాబోలును.
సిరంపురము కళాశాలలో నుండగా నీయన చక్కని మాదిరి జీవితమును ప్రదర్శించెను. తన సహాధ్యాయియగు యన్. దానియేలుగారు ఈయన విషయమిట్లు చెప్పిరి. "థియోఫిలస్ను నేనెరుగుదును. నాకంటె యొకతరగతి ముందు చదువుచుండెడివాడు. వేదాంతవిద్య యందీయనకుగల నిపుణత యాయన తెలివితేటలను యసామాన్యమగు జ్ఞానమును బ్రకటించును. ఈయన యొక్క శ్రేష్ఠమగు ప్రవర్తనయును క్రైస్తవసేవయును ఈయన యొక్క భక్తి తాత్పర్యములను విశదపరచును." సుమారిరువదిమూడు సంవత్సరముల పిదప సిరంపురపు కళాశాలలో నీయనవిద్యార్థిగనున్నప్పటి జీవితమును గూర్చి ఆ కళాశాల పత్రికలో క్లుప్తముగ నిట్లువ్రాయబడెన. "థియోఫిలస్ యొక్క ఉపాధ్యాయులును సమకాలికులును ఈయన యొక్క యోచనాశక్తిని, శాంతమును, ఖచ్చితమైన స్వభావమును కొనియాడుచుండెడివారు." ఈయన సిరంపురములో నుండగ జరిగిన యొక విషయమెన్నటికిని మరపునకు రాదు. ఒకనాడీయన తన సహచరులతో కలసి హుగ్లీనదిలో నౌకావిహారమునకు బయలుదేరెను. కొంతదవ్వఏగిన పిదప వారున్న చిన్న నావలోనికి రంధ్రము ద్వారా నీరు వచ్చుటచే నదిలో మునిగిపోజొచ్చెను. అందున్నవారు నీట దుమికి యీదుకొని సురక్షితముగ ఒడ్డుకు చేరిరి. కాని థియోఫిలస్ తన నూతన పాదరక్షలు పాడగునని నీట దుముకుటకు వెనుదీయుచుండ నాపడవ మునిగిపోయెను. ఈయనయు యానావతో పాటు మునిగిపోయెను. సహచరులీయన పాటున కత్యంత విచారగ్రస్తులై తేరిచూచుండిరి. కొంతసేపటికి యాయన నెమ్మదిగ దరిజేరి గట్టున కెక్కుచుండెను. అత్యద్భుతముగ నీవిపత్తు నుండి యీయన రక్షింపబడుటకచ్చెరు వొంది "నీవెట్లు బయటికి రాగలిగితివి" అని మిత్రులు ప్రశ్నింప, "నా తల్లిదండ్రులు దేవదూతలవలె నాకిరుప్రక్కలనుండి చేయిపట్టి పైకిలేవనెత్తి ఒడ్డునకు తీసికొనివచ్చిరి" అని చెప్పెను. ఈ విషయమునీయన తన మిత్రులతో ముచ్చటించునపుడెల్ల దైవకృపను దలచి స్తోత్రములు చెల్లించెడివాడు.
మదనపల్లి క్షయరోగుల విశ్రాంతిపురము
వేదాంతకళాశాల నుండి థియోఫిలస్ కృష్ణానగర్‌లో జరిగిన క్రైస్తవ విద్యార్థి సంఘ సమావేశమునకు రాయబారిగా పంపబడెను. ఇచటనే తన జీవితములో నొకముల్లుగా నుండిన క్షయ రోగచిహ్నము కన్పించెను. 1922 సెప్టెంబరు 28వ తేదీన టెన్నీస్ యనబడు బంతియాటనాడుచుండగా నీయన ఆకస్మికముగ రక్తము గ్రక్కెను. వైద్యులు పరీక్షించి తన శ్వాసకోశములలో క్షయరోగము ప్రారంభమగు సూచనలు కనబడుచున్నవని గుర్తించిరి. అప్పుడు డాక్టర్. జార్జిహోవెల్స్ కళాశాలాధిపతిగా నుండెను. ఈయన థియోఫిలస్ ఆస్పత్రిలోనున్నంత కాలమును విద్యార్థివేతనము (స్కాలర్షిప్) నిచ్చెదనని వాగ్దానమిచ్చి వెంటనే మదనపల్లి చికిత్సాలయమునకు పంపెను. వారి మిషనులో విద్యాసమితి అధ్యక్షుడగు రెవ. ఆర్.సి. బెన్సను దొరగారు ఈయనకు కొంత ద్రవ్యసహాయము చేయనెంచెను. కాని థియోఫిలస్ "నాయవసరతలకు గావలసిన సొమ్మున్నది. ఇక నాకేమియు నక్కరలేదు" అని చెప్పెను.
మూడేండ్ల చదువు ముగిసెను. ఇంకను నొకవత్సరము చదువవలసియుండెను. వేదాంత విశ్వవిద్యాలయములోని విద్య పూర్తి కాకమునుపే దేవుడీయనను శ్రమలతో కూడిన దైవశిక్షణశాలకు దీసికొనిపోయెను. శ్రమలతో జీవితాంతము వరకును నలుగుచు ననేక దివ్యపాఠములాయన నేర్చుకొనునట్లు దేవుడాయనను శ్రమానుభవములోనికి నడిపించెను. ఇచ్చట ఆస్పత్రిలో నున్నంతకాలమును యువకుడగు థియోఫిలస్ బహుధైర్యముగ నీశ్రమలను సహించెను.
పారమార్థికోత్తేజము
థియోఫిలస్ ఆస్పత్రిలో 27-10-1922 నుండి 22-09-1923 వరకు నుండెను. ప్రశాంతముగనున్న ఆ కాలమున తన యనుభవముల నిట్లువెలిబుచ్చెను. "రోగిజీవితము నిరుత్సాహకరమైనది అయినను ఆస్పత్రిలోని రోగులు నాకు చిరకాలములోనే మిత్రులై యేకాకినై దిగులుపడుచున్న నన్ను ధైర్యపరచి యెక్కువగ నాదరించిరి. నేనును వారినప్పుడప్పుడు ఉత్సాహపరచితిని, అప్పుడప్పుడు వారితో మా వేదాంత విశ్వవిద్యాలయము యొక్క మూల సిద్ధాంతమును అనగా "దేవుని నుండి ఉత్తమమైన వాటికై నిరీక్షింపుము, దేవుని కొరకు ఉత్తమమైన వాటిని చేయుము." అను వాక్యమును చెప్పి యందలి సత్యమును వివరించెడి వాడను. నేను ఆస్పత్రిలో నుండగా యితరములగు పనులు ఏమియులేనందున ప్రశాంతమగు సమయము నాకెక్కువగా లభించెను. కాన నేను శారీరకముగను ఆధ్యాత్మికముగను వృద్ధిజెందుచుంటిని. ఎంత కఠినహృదయుడైనను తాను రోగిగా నున్నప్పుడు చింతించి వాటిని దిద్దుకొని భావికాలమున జయప్రదమైన జీవితమును జీవించుటయెట్లో యోచించును. ఇట్లు ఆస్పత్రిలో నుండు కాలము మానవుడు గుణపడుటకు అనేక తరుణముల నిచ్చును. ఆరోగ్యముగనున్న వారికిగూడ ప్రశాంతమగు సమయము అప్పుడప్పుడు లభించినను, దానినెక్కువగ సద్వినియోగ పరచుకొనకపోవచ్చును. కాని రోగులా నిర్మలమగు కాలమును నిశ్చలమగు మనసుతో పరమ పిత యొక్క సహవాసము నపేక్షించెదరు. వ్యర్థమగు గతజీవితమును దలంచి విచారించి భావికాలమున భయభక్తులుకలిగి పవిత్రముగా ప్రభుసన్నిధిలో బ్రతుకుట కాసక్తిగలిగియుండుట కిదియే సరియగు యదునని గ్రహించితిని, సహజముగ మానవులకు ఏ విషమపరిస్థితిలోనో, శ్రమలలోనో, పేదరికములోనో, బంధుమిత్ర వియోగమందుననో రోగశయ్యపైనున్నపుడో, కారాగారమందున్నపుడో, భయంకర విపత్కాలముననో, మరణావస్థనుండి అత్యద్భుతముగ విముక్తిగలిగినపుడో అట్టియేదో యొకవేళ జ్ఞానోదయమై గుణపడెదరు. సవ్యముగ నన్నివిధముల జీవితయాత్ర సాగిపోవుచున్నపుడు ఆధ్యాత్మిక చింత మానవున కవసరత లేనట్లుండును. సృష్టిని పరీక్షించి యానందించుటకును, శ్రమానుభవములోనున్న తోటిరోగుల సహవాసములో నుండుటకును దొరకు అనేకములగు తరుణములలో నొకడు తన ఆత్మీయ జీవితమును ఎక్కువగ వికసింపజేసికొనుటకై అవకాశముండును. "క్రీస్తు కుమారుడైయుండియు తాను పొందిన శ్రమలవలన విధేయత నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణసిద్ధి పొందినవాడై మెల్కిసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవునిచేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికిని నిత్యరక్షణకు కారకు డాయెను." (హెబ్రి 5:8-10)
ఈ వాక్యమీయన కీసమయమున నెక్కువగ సహాయకారిగ నుండెను. ఇంతవరకును లోకసంబంధమగు నీతిపైనాధారపడిన థియోఫిలస్యొక్క మంచితనము ప్రభువుదృష్టిలో పరిపూర్ణమైనది కాదని తానురోగశయ్యపైనున్నపుడు గ్రహించెను. ధ్యానములోనున్న కొలదిని తనలోటులు తనకు తేటతెల్లమగుచుండెను. కలువరిగిరిపై శిలువమీద వ్రేలాడుచున్న ప్రేమమూర్తియగు క్రీస్తుయొక్క విలువగు, రక్తధార తన పాపములను పరిహరించినట్లు ఆయన మనోనేత్రములకు బాగుగనగుపడెను. ఆ క్షణమననే తన జీవితమును ప్రభువునకు సంపూర్ణముగ సమర్పించుకొనెను. పరిపూర్ణమగు తన జీవిత పరివర్తనమును ఆయన బాగుగ గ్రహించెను.
థియోఫిలస్ యొక్క జీవితమాచికిత్సాలయములోనున్న రోగుల కెంతయో నాదర్శ ప్రాయమగనుండెను. ఈయన ఆస్పత్రిని విడిచివచ్చు సమయమున రోగులైన యీయన మిత్రులిట్లు చెప్పిరి. "గడచినవత్సరమందు నీవు మాకు నిజముగా శ్రేష్ఠమగు స్నేహితుడవై యుంటివి. నీకందరును మిత్రులే, శత్రులెవ్వరును లేరు. నీవుచూపిన అత్యుత్తమ మాదిరి జీవితమును మేమవలంబింప నెల్లప్పుడును ప్రయత్నింతుము."
ఆరోగ్యవంతుడై 1923 అక్టోబరునుండి మరల సిరంపురములో వేదాంతవిద్య ముగించుటకు థియోఫిలస్ మదనపల్లి నుండి తిరిగివచ్చెను. చదువవలసిన సంవత్సరమును కూడా చక్కగముగించి బి.డి. పట్టమునొందెను. విద్యార్థులను వీడ్కోల్పు సమయమున నా విద్యాశాలయాధికారి డాక్టర్ హోవెల్ థియోఫిలస్ను పిలిచి యాబడిలోనే పండిత పదవిని స్వీకరింపనాహ్వానించెను. కాని థియోఫిలస్ సమ్మతింపక ఆయనను తర్భీతునకంపిన బాప్టిస్టుమిషనులోనే పనిచేయుటకై తీర్మానించుకొనినట్లు తెలియజేసెను.
రామాయపట్నం
తెలుగుబాప్టిస్టు సెమినెరి యందు అధ్యాపకులు
థియోఫిలస్ 1924 సం॥ జూలై నెలలో రామాయపట్నం వేదాంతపాఠశాలలో నుపాధ్యాయుడుగ నేర్పాటుచేయబడెను ఆ కాలమున అమెరికన్లను, కనెడియన్ బాప్టిస్టు మిషను పనివారేకమై యిందు తర్భీదు నొందుచుండిరి. ఇచట నీయన 1926 జూన్ నెల వరకు అనగా రెండేండ్లు సేవ జేసెను.
పరిచర్య ప్రారంభము
ఉత్తరసర్కారుల కనేడియన్ బాప్టిస్టుమహాసభ 1926వ సం॥లో కృష్ణామండల మందలి ఉయ్యూరులో జరిగెను. ఆ సంవత్సరము మహాసభను జరుపవలసిన నాయకులు అందరును యువకులైనందున అది యెక్కువ ప్రాముఖ్యమైనదిగ పరిగణింపబడెను. వారిలో కొందరు భావికాలమున బాప్టిస్టుమిషనులో ప్రాముఖ్యస్థానములందుండి ఆంధ్ర సంఘముల నాయకుడుగ ఉన్న శ్రీ జి.ఎ.సాముయేలు గారు ఆ సభాధ్యక్షులుగ నుండిరి. ఆంధ్ర సంఘముల నాత్మీయాభివృద్ధికి నడుపబూనిన నాయకుడగు థియోఫిలస్ ఆ మహాసభలో భక్తి కూటములను నడుప నేర్పాటుచేయబడెను. అప్పటికి ప్రాముఖ్య విషయములలో పాల్గొనిన ఆయువకులిద్దరును సిగ్గు భయములతో నిండినవారై యేమిచేయను తోచక నాలోచించుచుండిరి. ఆ కాలమున ఇప్పటి బేతెల్ ఆస్పత్రిని కట్టుటకు రాళ్ళు, యిసుక, దూలములు మొదలగు సామాగ్రి సమకూర్చబడి యుండెను. సాయంసమయమున నాచోటికీ యువకులిద్దరును పోయి మోకరించి ప్రభువు యొక్క సహాయమునకై ప్రార్థించి బలపడి పనులను ప్రారంభించిరి. సభలు జయప్రదముగ జరిగెను.
"యెహోవా, నీధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్ల నేను దానిని ధ్యానించు చున్నాను.
నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి.
నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి.
నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను.
కావున నా బోధకులందరికంటె నాకు విశేష జ్ఞానము కలదు.
నేను నీ వాక్యము ననుసరించునట్లు దుష్టమార్గములన్నింటిలోనుండి నాపాదములు తొలగించుకొనుచున్నాను.
నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయవిధులనుండి నేను తొలగకయున్నాను.
నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనెకంటె తీపిగానున్నవి."
దా.కీ. 119: 97–103.
1926 సం॥ జూలై నెలలో జగన్నాయకపుర మందలి బాప్టిస్టు వేదాంత పాఠశాలలో థియోఫిలస్ ఉపాధ్యాయుడుగ నేర్పాటుచేయబడెను. ఇది దేవుని ప్రత్యేక పిలుపని గాఢముగ నమ్మెను. గాన తమకు సంఘాధ్యక్షులుగ నుండవలెనని మూడు సంఘములు వరుసగ నాహ్వానించినను ఈయన అంగీకరింపలేదు.
మాదిరి ఉపాధ్యాయుడు
బడిలో పండితుడుగ నున్న కాలమున నీయన ఆదర్శప్రాయమగు జీవితమునగుపరచెను. పాఠములను బాగుగ చదివి సిద్ధపడెడివాడు. ఏదోయొక ప్రాముఖ్యమగు కూటమునకు పోయినను సరియైన వేళకు క్రమముగా బడికి హాజరయ్యెడివాడు. ఒక్కొక్కప్పుడు గ్రామంతరమునుండి వచ్చునప్పటికి బడివేళయైనచో త్రోవలోనున్న తనయింటికి పోకుండగనే రైలు స్టేషనునుండి తిన్నగా పాఠశాలకే పోయేడివాడు. సక్రమముగ దినకార్యములను నిర్వహించుటయును, సరియైన వేళకు తన పనులను జరిగించుటయును నీ రెండు సదలవాటులు నీయన జీవితములో బాగుగ ప్రకటితమగుచున్నవి. తనయావజ్జీవితములో నొక్కసారి మాత్రమే రైలు బండినందుకొనలేకపోయెను. కాలమునెన్నడును వ్యర్థముగ గడుపలేదు. రేపోమాపో చేయవచ్చునని తన పనుల నెప్పుడును వెనుకబడి యుండనీయలేదు. ఇదియే యీయన యతివిస్తారమగు సేవ చేయగలుగుటకుగల ముఖ్యరహస్యము. తానుచేయవలసిన వాటినెల్ల సక్రమముగచేసి ముగించిన తరువాత పండుకొనకముందు తనదినచర్య నంతటిని వ్రాసెడివాడు. ఉదయమగునప్పటికి మరియొక నూతనకార్యము నుత్సాహముగ జేయునెదురుచూచు చుండువాడు. తానుబోధించు తరగతిని సరియగు క్రమశిక్షణలో నుంచుకొనుటలో నీయన అగ్రగణ్యుడు. అత్యుత్సాహముగను, ఆకర్షణీయముగను, ఆనందదాయకముగను నుండు విశ్వసనీయమగు నీయన బోధనలను విని తరించిన బోధకులు జన్మాంతము వరకును నీపండితుని స్మరించుకొనుచుందురు. ఈయన యుపన్యాసములనిన నువ్విళ్ళూరుచు ననేకులత్యాసక్తితో నాలకింప నరుదెంచుచుందురనుట అతిశయోక్తి కాదు.
వినయము
థియోఫిలస్ ప్రవర్తనయంతటిలోను వినయమే ముఖ్యలక్షణము. నిరాడంబరమగు ఆయన జీవితమెల్లరకును ఆదర్శప్రాయమైనది. ఆయన నభిషేకించుటకై 1931 వ సం॥న మిషనులోని నాయకులు కొందరు ఒక సలహాను తీసికొనిరాగా తానప్పటికి సిద్ధపడియుండలేదని చెప్పెను. మరి తొమ్మిదేండ్లయనంతరము ఆయభిప్రాయమే మరల పొడసూపినపుడు ఈయన వలదని యాయవకాశమును పోనిచ్చెను. తదనంతరము మరియొక సారి తన మిత్రులీయనను బలవంత పెట్టినపుడు అభిషేకము తనకు వద్దని తేటగా చెప్పెను. రెవరెండనబడు బిరుదును తననామమునకు చేర్చికొనుట కాయనకిష్టము లేకుండెను. ముఖస్తుతులీయనకెంతయో అసహ్యము. ఈయనకున్న వినయస్వభావమే యితరుల ముఖస్తుతులకు దాసుడుకాకుండునట్లు యీయనను భద్రపరచెను. ఒక సంవత్సరము వేదాంత పాఠశాల యందుత్తీర్ణులై యోగ్యతా పత్రములను బొందినవారిని వీడ్కోల్పు సందర్భముగ నీయన యిట్లుచెప్పెను. "గత కాలమున విద్యార్థులు వేదాంత పాఠశాలలో విద్యను ముగించి వెళ్ళుచున్న సందర్భమున తమ యుపాధ్యాయులను అమితముగ పొగడుట అలవాటుగనుండెను. కాని ఈ సంవత్సరము ఉత్తీర్ణులైన విద్యార్థులు తమయుపాధ్యాయులనట్లు పొగడలేదు. అందుచేత వీరు చెప్పిన జవాబులలో ముఖస్తుతులుగాని వేషధారణగాని లేదు, సత్యమే చెప్పిరి." ఈ వాక్యమునుబట్టి థియోఫిలస్ యిచ్చకములనెంతగా ద్వేషించెనో కనబడు చున్నది.
1936 సం॥న థియోఫిలస్ వేదాంత పాఠశాలయొక్క ధర్మకర్తల సమితికి అధ్యక్షుడుగ నుండెను. అందుచేనాసంవత్సరము కృతార్థులైన వారి యోగ్యతా పత్రములపై సంతకములు చేయవలసిన సమయము వచ్చెను. అట్టి ఆధిక్యతయందేమాత్రమును ఇష్టములేనివాడై ఆయనయిట్లనెను. "నేను యీస్థానమున నుండుటకంటె యీ పాఠశాలకు సంబంధించని ప్రముఖుడగు మరియొక వ్యక్తియుండిన నెంతయోబాగుగ నుండెడిది" ఈ వాక్యము తనలోని మరికొన్ని దివ్యలక్షణములను సూచించుచున్నది. ఆయన యెన్నడును అధికారమును, ఆధిక్యతను, గౌరవ పదవులను, ప్రజాభిమానములను కోరలేదు. అట్టియవకాశములు తటస్థమైనను సాధ్యమైనంత వరకు తప్పించు కొనుటకే ప్రయత్నించుచుండెడివాడు. ఈ వినయ లక్షణమునకు మూలము యీయన పలుమారులు చెప్పిన యొక యభిప్రాయమునుబట్టి బయలు పడుచున్నది. అదేదనగా "నేను క్రీస్తు నెంతలోతుగా గ్రహించుచుంటినో అంతగా నేనంత అల్పుడనో చూడగలుగుచున్నాను." క్రీస్తును గాఢముగ హత్తుకొనినకొలది థియోఫిలస్ యొక్క వినయము, నిరాడంబరము, తనహృదయసీమనంకురించి, స్థిరపడి అత్యధికముగ నభివృద్ధిజెందెను.
విద్యావంతులగు పనివారు
1936 లో సిరంపురములోని విశ్వవిద్యాలయముతో జీవామృత పాఠశాలను సంధించుటయ గత్యమా' యనుసమస్యను వేదాంతపాఠశాలయొక్క ధర్మకర్తల సమితి యాలోచింపవలసి వచ్చెను. కొందరీవిషయము సాధ్యమనిరి. ఏలనన, పదియవ తరగతి పాసయిన విద్యార్థులీబడికి వచ్చుట దుర్లభమనియు, పెద్దతరగతుల నిచటస్థాపించుటకు అదనముగా కొంత ద్రవ్యమవసరమనియు, నట్టిమొత్తము ఒక్కసారి చేకూరదనియు చెప్పిరి. థియోఫిలస్ దీర్ఘముగానాలోచించి లేచియిట్లనెను. "ఉన్నత వేదాంత విద్య (ఎల్.టి.ఎచ్) నిచట ప్రారంభించుట చాలామంచిది, అసాధ్యమేమియులేదు. సదుద్దేశముతో ప్రారంభించినచో నిధి చక్కగా సాధ్యమగును." దూరదృష్టిగల యీ నాయకుడు కార్యసాధనకైగడంగి ద్రవ్యమునకై యొకదరఖాస్తును ప్రకటించెను. ప్రభుని చిత్తప్రకారము చేయువారికి సమస్తము సమకూడి జరుగునన్నట్లు ఈయనయభిప్రాయ మెల్లరకునునత్యుద్రేకమును గలిగించినందున నిందులకు వలయు విత్తము సమకూర్చబడెను. 1946 వ సం॥ ఎల్.టి.ఎచ్. తరగతి యీ పాఠశాలలో ప్రారంభ మాయెను. దృఢవిశ్వాసముగల యీ నాయకునియూహలు నేడు కార్యసిద్ధి జెందెను.
సిరంపూర్ విశ్వవిద్యాలయ కార్యనిర్వాహక సమితి సభ్యుడు
(సెనెటర్, సిరంపూర్ యూనివర్సిటి)
సిరంపురపు విశ్వవిద్యాలయ కార్యాలోచన సభలో ఇండియా దేశపు బాప్టిస్టు సంఘముల తరపున అభ్యర్థిగా థియోఫిలస్ ఎన్నుకొనబడెను. ఆ సభలోనున్నంత కాలమును ఇండియా దేశపు వేదాంత పాఠశాలలన్నిటిలో విద్యార్థులకు ఉన్నతవిద్య నొసగు సదుపాయము లకై యీయన సర్వవిధముల ప్రయత్నము చేయుచుండెడి వాడు.
విద్యార్థుల మధ్య నాదర్శప్రాయమగు జీవితము
వస్త్రాడంబరము థియోఫిలస్కు లేకున్నను విద్య, వినయములీయన కత్యంత గౌరవము దెచ్చెను. ఈయన ప్రవర్తన తన విద్యార్థుల నాకర్షించి వారిని క్రీస్తునొద్దకు నడిపించునదై యుండెను. విద్యార్థులీయన పద్ధతులను పఠించి యీయన సమస్త చర్యలను చదివి గ్రహించి మరియెక్కువగ నాయనవైపున కాకర్షింపబడిరి. ఆయన దయార్ద్ర దృష్టియును, ప్రభునితో నీయనకుగల సమీప సంబంధమును, మనఃపూర్వకమగు సేవాభిలాషయును, నీయనకెంతయో వన్నెతెచ్చెను. వి.యి.దత్తుగారు సిరంపురపు కళాశాల పత్రికలో నీయన మరణానంతరమున జీవామృత పాఠశాలలో నీయన చేసిన సేవనుగూర్చి ఇట్లు కొనియాడిరి; "థియోఫిలస్ వేదాంత పాఠశాలలో చేసిన యిరువదియేండ్ల సేవ చాలా ఘనమైనది. ఈయన పరిపూర్ణ జ్ఞానము గలవారు. ఉపాధ్యాయుడుగానుండ సమర్థుడు. సంవత్సరముల వెంబడి వరుసగా విద్యార్థుల నెందరినో తర్బీదు చేసెను. ఈయన తన విద్యార్థులకు ప్రియమిత్రుడు. ఈయన బోధన వలన విద్యార్థులు అధ్యాత్మికముగను, నైతికముగను అత్యంతాభివృద్ధిజెంది విజ్ఞానవంతులైరి.
ఈయన సహవాసమువలన విద్యార్థులు లోతైన అనుభవములోనికి నడిపింపబడిరి. ఈయనలోని శాంతి నమాధానములను అనుకరించిరి. ఆత్మీయ స్థితిలో నాయా సమయములందు కలుగు తమ నిరుత్సాహ స్థితులలో నీయనయొద్దకు విద్యార్థులు వెళ్ళినపుడు తగిన సహాయము చేయుచుండెడివాడు. బడిలో నాయనయొద్ద విద్య సభ్యసించునపుడు మాత్రమేకాక వారియిండ్లయొద్ద నున్నప్పుడు కూడ ఆయనను తమ జీవితనాయకునిగ నెన్నుకొనిరి. అధికార స్వభావము నేమాత్రమును కనుపరచక యీయన వారి కార్యములందు తోడ్పడెడివాడు. తన యిష్టానుసారముగ వారి వ్యవహారములలో పాల్గొననిష్టపడక తన సలహాలకొరకు వచ్చిన విద్యార్థులకు తగిన సహాయము చేయుచుండెడివాడు. పితృభావమున దనప్రియులైన పాఠకులను ప్రేమించుటచే నందరును నీయనయెడల నత్యంతాభిమానులై యుండిరి. వారిజీవితము నందును దైవసేవయందును, ఉన్నతాదర్శములు కలిగియుండుటకై వారిని ప్రోత్సహించెడివాడు. వారి మధ్య థియోఫిలస్ ఒక మాదిరి పురుషుడుగ జీవించెను. తన విద్యార్థులలో నొకరిట్లు వ్రాయుచున్నారు: "విద్యార్థులు సహజముగ నుపాధ్యాయుల యొద్ద ననేకవిషయములను నేర్చుకొందురు; నేను మాత్రము విధేయత, పెద్దలను గౌరవించుట థియోఫిలస్ అయ్యగారి పాదములవద్ద నేర్చికొంటిని". గోదావరి మండలమందున్న ఒక సంఘకాపరి థియోఫిలస్ గారి మరణానంతరమున ఆయననుగురించి యిట్లు వ్రాసెను; "వేదాంతపాఠశాలకు థియోఫిలస్ జీవమై యున్నాడు". కృష్ణామండలమందలి యొక సంఘకాపరి థియోఫిలస్ను గురించి యిట్లు చెప్పెను; "సంఘములో చేయవలసిన పరిచర్య కొరకు సేవకులను తర్బీదు చేయుటలో నాయకునికి ఉండవలసిన లక్షణములన్నియు నాయనయందు మూర్తీభవించి యుండెను. ఈయన కీర్తి బహుకాలము నిలచియుండును. ఈయన చనిపోయినను యీయన కార్యములు జీవించియే యుండును." గతించిన 23 సం॥ల సేవలో ననేకులీయన ద్వారా తర్బీదు చేయబడి సి.బి. మిషనులోనున్న ఆయా సంఘములకు కాపరులుగ నేర్పాటు చేయబడిరి. ఈ పురుషోత్తముని ఆదర్శప్రాయమగు జీవితమును నిష్కళంకమగు ప్రవర్తనను అనుభవపూర్వకముగ నెరిగిన వారాయన నెన్నడును మరువలేరు.
సంఘకాపరులతో నీయనకు గల సంబంధము
వేదాంత విద్యను ముగించి వెడలిపోవు సంఘకాపరులను థియోఫిలస్ అతి జాగ్రత్తతో గమనించుచుండెడివాడు అవకాశము తటస్థించినచో వారిసేవ నభిమతించెడివాడు. కాని లోటు పాటులను గమనించినచో నిర్మోహమాటముగ మందలించెడివాడు. వారు ప్రసంగములను సిద్ధపరచుకొనునప్పుడు వారికి తోడ్పడి, తొందరలోనున్నప్పుడాదరించి చిక్కులు యిక్కటులు చెలరేగియున్నవుడు వానినుండి తప్పించుకొనుటకు చక్కని సలహాలనిచ్చి, వారియవసరములలో నండగానుండి చాలవరకు సహాయము చేయుచుండెను.
(2) సంఘకాపరుల చిక్కులను పరిష్కరించు సమితి నొకదానిని స్థాపించుట. (పాస్ట్రల్ సెటిల్మెంట్ కమిటీ) ఒక్కొక్కప్పుడు సంఘాధ్యక్షులు ఎంతవరకు సక్రమముగ తమపనులను సాగించుకొనుచున్నను సంఘస్థులలో గొందరాయన నెట్లో ప్రయత్నించి మరియొక సంఘమునకు మార్పించుటయో లేక పనినుండి తొలగించుటయో చేయుచుండుట పరిపాటి. కాన పనివాడు స్థిమితముగ నొకచోట స్థిరమైన సేవచేయ నవకాశములు లేక సంఘస్థుల బెదరింపుల కదరిపోవుట శోచనీయము. ఈ కొఱతను సరిచేయుటకై పైసమితి నేర్పాటుచేసెను. సంఘాధ్యక్షులకుద్యోగములిచ్చుట, మార్చబడుట మొదలగు హక్కులీసమితికియ్యబడెను. అట్లుచేయుటచే సంఘములు పొలములమధ్య నైక్యతయేర్పడి ప్రేమానుబంధము పెంపొందుటకు కూడ నవకాశముండును.
(3) మితార్జననిధి (ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్) ముందు జీవితమునకు వలయు ధనమును సమకూర్చు పద్ధతినమలులో పెట్టుట; వృద్ధాప్యమున పనినుండి విరమించిన మిషనుపనివారెన్నో యిబ్బందులుపడుట సహజము. అట్టిసమయమున సహాయ పడుటకీపద్ధతి సంఘకాపరులకు మహోపకార మొనరించెను.
(4) సంఘకాపరియే సువార్తసేవలో ముఖ్యుడుగ పరిగణింపబడుట. ఉపాధ్యాయులీ కార్యమును నిర్వహించుటలో సహకారులుగనుందురు. థియోఫిలస్ తన యావచ్ఛక్తి నుపయోగించి సంఘములోని సమస్త కార్యములలో సంఘాధ్యక్షుడే ముఖ్యుడుగనుండునట్లు అతని స్థానమును హెచ్చింపబ్రయత్నించెను.
భావ ప్రకటనములు
సంఘ యేకాంతత్వము: (లోకలైజేషన్ ఆఫ్ చర్చెస్) అనగా ఒక ప్రాంతములో నున్న సంఘము (ఆర్థికముగా స్వతంత్రత సంపాదించుకొనిన పట్టణ సంఘము) తన మట్టుకు తానే జీవించుటకు ప్రయత్నించుట. ఒక విధముగా నయ్యది వాంఛనీయమైనను, మహాసభ దృక్పథమున, యితర సంఘముల శ్రేయమునకు అది భంగము కలుగజేయును. తత్ఫలితముగా గ్రామాదులలో ఆర్థికముగా బలహీనములైన సంఘములకు యీ పెద్ద సంఘములు ఎట్టి సహాయమును చేయకపోవుట; అట్టి వాటి అధ్యక్షుల యెడల జరుగు నిర్దయా కార్యములను మందలించువారు లేకపోవుట; మహాసభలో అన్యోన్యత లేకపోవుట మొదలగు ఆక్రైస్తవ భావములు జనించును.
పొలస్వార్ధత (ఫీల్డ్ ఎక్స్క్లూసివిజమ్): ఇట్టి భావములు గల పొలములలో ఎవరి విషయములను వారే మనస్కరించుకొనుట; ముఖ్యముగా ఆ పొలమునందున్న సంఘములలో గల సమస్యలను, కార్యములను, ఆ పొల మిషనెరియే, వ్యక్తిగతమగు తన యుద్దేశముతో, సాధింపబూనుట, యిత్యాది కార్యములు జరుగును. దీని ద్వారా, మహాసభ ప్రాంతమంతటిలో క్రమమైన, సమమగు, పరస్పరమగు పరిపాలనా విధానము లేకుండును.
ఉపాధ్యాయ సువార్తికుడు (టీచర్ ఎవాంజెలిస్ట్): ఈ పద్ధతిని బట్టి ఒక గ్రామములోని ఉపాధ్యాయుడు, ఆ గ్రామములోని సువార్తసేవ, ఆరాధనాదికార్యభారమును వహించుట; దీని కొరకై మిషన్‌వారు కొంత వేతనమిత్తురు. అతడు నేరుగా మిషనరీకి మాత్రము ఉత్తరవాదియై యుండును. కాని, యిప్పుడు అట్టి ఉపాధ్యాయులు, అర్చకేతరులుగా పరిగణింపబడి, సంఘకాపరికి, తమ పనినిమిత్తము ఉత్తరవాదులై యున్నారు.
విశ్వాసము ఎచ్చట ఉండునో
అచ్చట ప్రేమయుండును;
ప్రేమ ఎచ్చట ఉండునో
అచ్చట సమాధానముండును
సమాధాన మెచ్చట ఉండునో
అచ్చట దేవుడుండును;
దేవుడు ఎచ్చట ఉండునో
అచ్చట లేమి ఉండదు.
థియోఫిలస్ నివసించిన భవనము కడు విశాలమైనది. చుట్టును పెద్ద వరండా కలదు. ఆఫీసు గది విశాలముగను అందముగనుండును; పటములు, పుస్తక భాండాగారము కలిగి చూచుట కత్యంతానందదాయకముగనుండును. ఈ భవనము చాలాకాలము క్రిందట నొక డచ్చి వ్యాపారస్తుడు నివసించుచు, కారణాంతరములచే విడిచి వెళ్ళిపోయిన యింటివలె యగపడును. ఇంటనున్నప్పుడాయనను దర్శింపవచ్చిన వారికి స్వాగతమిచ్చుచున్నవోయన్నట్లు ఆయన ఆఫీసు ద్వారములు తెరుపబడియే యుండేడివి. ఆఫీసులో నాయనకూర్చుండు నదియొక పేముకుర్చీ. దానిముందర యొక చిన్న బల్ల యుండును. ఎడమ ప్రక్కగా పుస్తకముల బీరువాయుండును. బల్ల ఎదుట రెండు, మూడు కుర్చీలు తనను దర్శింపవచ్చిన వారికొరకు వేయబడియుండును. వీటికంటె తాను కూర్చుండు కుర్చీ కొంచెమెత్తు తక్కువగనుండును. ఆయనను చూడవచ్చిన వారితో గొంతసేపు సంభాషించిన తరువాత మామూలుగా తేనీరొసగి వారిని సన్మానించుట యొక అలవాటు.ఆయన సతీమణి తేనీటిని తీసికొనివచ్చుచుండగా నీయన యెదురేగి యాపాత్రను తానే అందుకొని మర్యాదగా తనతో సంభాషింప వచ్చినవారికిచ్చును. దర్శింపవచ్చినవారి యెడల ఆయనచూపు గౌరవము మర్యాద చూపరులకెంతయో సంతోషకరముగ నుండును. చెడ్డవారని ద్వేషింపక, పేదలని చిన్న చూపుచూడక, ఎట్టి వివక్షతయు లేకుండ ఎవరెప్పుడు యేపనిమీద వచ్చినను అందరిని సగౌరముగ నంగీకరించియీయన మాట్లాడెడివాడు.
దుఃఖములో నున్నవారి నోదార్చెను. పేదలనాదరించి శక్తికొలది సహాయముచేసెను. ఇట్లు చేయుటద్వారా పౌలుచెప్పినట్లు, "నేను అందరి విషయము స్వతంత్రుడనైయున్నను ఎక్కువమందిని సంపాదించుకొనుటకై అందరికిని నన్ను నేనే దాసునిగ చేసికొంటిని," అను వాక్యమును తన జీవితమున సార్థకపరచెను.
క్రేగ్ మెమోరియల్ సంఘాధ్యక్షులుగ బహుకాలము సేవచేసిన రెవ.యం. జగన్నాయకులు గారి కనిష్ఠపుత్రిక శ్రీమతి కమలమ్మను థియోఫిలస్ 1929 జూలై 10వ తేదిన వివాహమాడెను. ఆమె సౌందర్యవతి; చిరునవ్వొలుకు ముఖ వర్చస్సును చూడగనే యామె యెట్టి దురదృష్టమునైన కష్టమునైనను సరకుచేయని ధైర్యస్థైర్యములు గలిగిన యువతియని చక్కగ విశదమగుచుండును. ఈ దంపతులను దేవుడాశీర్వదించెను. సుందరులగు నిరువురు పుత్రులు వీరికి జన్మించిరి.
ఈయన దైవ కృపలను తలచి ధ్యానించి స్తుతించుటకు తన పుట్టుక దినమునొక ప్రత్యేక దినముగ నాచరించెడివాడు. ఆ సంతోషకరమగు సమయమందాయన యిట్లు ప్రభువును స్తుతించి ప్రార్థించెడివాడు, "ఓ ప్రభువా గతకాలములో నాయెడల మీరు జరిగించిన కృపాకార్యములన్నిటి నిమిత్తము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుచున్నాను. ఇట్లే నన్ను భావికాలమున కాపాడెదరని నమ్మి నిన్ను స్తుతించు చున్నాను. నేను తమ దయకు పాత్రుడనుకాను. నేను ధ్యానించుచు మీ విస్తారమగు కృపను గ్రహించునపుడు నేనెంత అల్పుడనో గుర్తించి హృదయ పూర్వకముగా మరియొకసారి మీకు నన్ను నేను సమర్పించుకొనుచున్నాను. దేవా! నాకు శరీరారోగ్యము, ఆత్మబలముననుగ్రహించి నన్ను తమ ఘనమగు సేవలో వాడుకొనుమని మనవి చేయుచున్నాను." ఆ దినమున నేవిధమగు యితరపనులను చేయక దైవధ్యానము నిమిత్తము ప్రత్యేకించుకొనెడివాడు.
థియోఫిలస్ ఆహారమునకై అధికముగ వెచ్చింపక సామాన్యమగు భోజనమునే చేయుచు సంతుష్టి కలిగి యుండువాడు. ఈ స్వల్ప ఆహారములోనే అతిథులు వచ్చినపుడు వారినాహ్వానించి సంతృప్తిగ భుజింప ననుగ్రహించెడివాడు. తన కుటుంబ ఖర్చులను ఎంత తగ్గించుకొనినను భావి కాలమున యిబ్బందులకై వాడుకొనుటకు కొంచెమైనను సొమ్మును కూడబెట్టుకొనలేక పోయెను. సాధారణముగ లౌక్కుని దైవసేవ కాకర్షించు నట్టియు, దైవభక్తి గలసేవకుని శోధించుటకు ప్రబలసాధనమైనట్టిదియునైన, ధనము థియోఫిలస్ నేమాత్రమును నాకర్షింపలేకపోయెను.
సేవకుల యెడల దయ
థియోఫిలస్ సేవకులను తన స్వంతబిడ్డలట్లు చూచి ప్రేమించెడువాడు. వారినెంతయో దయతో నాదరించెడువాడు. ఈ దయార్ద్ర హృదయుడు సేవకులను గురించి తన ప్రసంగములలో నితరుల నీరీతిగ హెచ్చరించెడువాడు. "సేవకుల యెడల దయగలిగి యుండుము. వారును మానవులేయని మరువరాదు. పాపము! వారెంతకష్టపడి పనిచేయుచుందురు! వంగి, లేచి దినమెల్ల పనులు చేయునపుడు వారి వీపులు నొచ్చి అలసి పోయినను కొందరు యజమానులు వారినింకను కఠినముగ గద్దించి చీవాట్లు పెట్టుచుందురు. ఇది యెంతక్రూరము? మీ కుక్కులకు సహ కడుపు నిండునట్లు పెట్టి దయతో చూచుకొందురు. పిల్లులను కూడ ప్రేమింతురు. అయితే సృష్టిలో నుత్తముడైన మానవునియట్లు నిర్దయగను, కఠినముగను చూచుట యెంతటియవివేకము? వారును ఆత్మగలిగిన మానవులే యనుమాటను పూర్తిగ మరచిపోయినారా? వారిని మంచిగ చూచుటమాత్రము చాలదు. వారి కాయకష్టమునకు దగిన వేతనము నియ్యవలయును. వారు నీ కుటుంబములో నొకరనునట్టి భావమును వారికి కలుగచేయవలయును. నీవు దయతో చూచుచున్నావని వారికిచ్చు వేతనమునుబట్టి బుజువగును. వారిని నీ సోదరుల వలెనమ్ముము. వారినెల్లప్పుడును సంతోషపెట్టుటకు ప్రయత్నించుము. వారినప్పుడప్పుడు నీతో కలసి భోజనము చేయనిమ్ము. నీవొకానొకప్పుడు వాటితోపాటు చాపమీద కూర్చుండవచ్చును. అది మాత్రముచాలదు. నీతోపాటు నీ సేవకుని కుర్చీలో కూర్చుండ నీయవలయును. నీవు నీ సమయము యెంత ప్రశస్తమైనదని తలంతువో, వారి కాలము కూడ నట్లే విలువైనదని గమనించుము. నీ చాకలి గాని, నీ సేవకుడు గాని నీ కొఱకు గంటలకొలది నీ యింటియొద్ద కనిపెట్టుకొనియుండనేల? వెంటనే వారికి తగు సమాధానము చెప్పి పంపివేయవచ్చును గదా? నీకున్న రీతిగా వారికి మాత్రము తొందర పనులుండవా? వారు విసుగుకొనునట్లు చేయుట యేమిప్రయోజనము?
నీ సేవలకులను ప్రేమించుము. వారు భయమునుబట్టి నీకు విధేయులగుటగాక నిన్ను హృదయపూర్వకముగను మిక్కుటముగను ప్రేమించునట్లు వారియెడల ప్రవర్తించుము. అధికారము కంటె ప్రేమయెక్కువగా కార్యసిద్ధికలగుజేయగలదు.
ప్రభువైన యేసుక్రీస్తు మానవునికిని దేవునికి, మానవునికి మరియొక మానవునితో గల నూతన సంబంధమును స్థాపించెను. అదేదన, దేవుడు, మనకందఱికును తండ్రి; మనమందరమును సోదరులము. ఇదియొక క్రొత్త విధానము. ఫిలోమోనను యజమాని యొద్దనున్న ఒనేసీమను బానిస పారిపోయి దోమాపురిలో ఖైదులోనున్న అపోస్తలుడగు పౌలు యొద్దకు చేరెను. పౌలు అతనికి క్రీస్తును గూర్చి చెప్పగనతడు మారుమనస్సు పొందెను. అప్పుడు పౌలు ఫిలోమోనుకొక జాబును వ్రాసి ఒనేసీమునకిచ్చి పంపెను. ఆ యుత్తరములో పౌలు ఒనేసీమును మరల చేర్చుకొనుమనియు వెనుకటి రీతిగా బానిసవలెగాక క్రీస్తునందొక సోదరునివలె నతనిని చూడవలసినదని ఫిలోమోనుకు మనవి చేసెను. ఇదియే మనుజునకును మరియొక మనుజునకును మధ్య క్రీస్తు స్థాపించిన నూతన సంబంధము
రవి పత్రిక ఆఫీసులో నొక క్రైస్తవ బంట్రోతు కలడు.అతడు థియోఫిలస్ యింటికి రవిపత్రిక సంబంధమైన పనులు లేక మరియే యితర పనులను గూర్చియైనను అప్పుడప్పుడు వెళ్ళుచుండెడివాడు. ఇతడు థియోఫిలస్ టీ త్రాగుసమయముననచటికి వెళ్ళినచో, అతనిని కూడా ఆయనతోపాటు కుర్చీలో కూర్చుండబెట్టి టీ నిచ్చెడువాడు. యీవిధముగా పేదలగువారు పెద్దలతో కలసి తిరుగునపుడు వారుకూడా తమ ఆత్మగౌరవమును మరువక, ఉన్న తాశయములను కలిగియుండునటుల థియోఫిలస్ అవకాశములు కలిగించుచుండెను.
పేదల యెడల జాలి
ఎల్లప్పుడును పేదల యెడల థియోఫిలస్ హృదయము మిక్కుటమైన జాలితో నిండియుండేడిది. ఒకప్పుడు తల్లి చనిపోయి అనాధస్థితిలోనున్న యెకబిడ్డను వీరు చేరదీసి పెంచిరి. ఆ పిల్లక్రమముగా పెద్దదైనపుడు బడికి పంపి ఉన్నత పాఠశాలలో కొంతకాలము విద్యను చెప్పించిరి. కొంతకాలమునకాపిల్లను ఉన్నత విద్య చదువుటకు తగిన తెలివితేటలు లేనందున నర్సు ట్రయినింగునకు పంపవలసివచ్చెను. అప్పుడు థియోఫిలస్ బహుగా విచారించుచు నిట్లుచెప్పెను. "ఈ పిల్ల తెలివిగలదై, ఉన్నత పాఠశాలలో విద్యను ముగియువరకు చదివి, జీవితములో వృద్ధినొందినచో నెంతయో బాగుండెడిది."
క్షయరోగమువలన చనిపోయిన క్రైస్తవయువకుని భార్యయు బిడ్డయు ననాధులుగానుండగ థియోఫిలస్ కనికరించి వారిని తన యింటచేర్చుకొనెను. ఒక సంవత్సరము వఱకు వారి నాదరించి పోషించెను. నిరాధారురాలైయున్న యీ విధవకు కొంత నిరీక్షణ వీరి ద్వారా కలిగెను. అయితే ఒక సంవత్సరము వరకు మాత్రమే ఆమెను పోషించగలిగిరి. వారి యింట నుండి మరియొక చోటికి వెడలిపోవలసి వచ్చినప్పుడు ఆయన విచారముతో నీవిధముగ ప్రార్థించెను. "దేవా! ఈమె నిరాధారమగుస్థితిలో నున్నది. ఈమెనాదరించి తన జీవనోపాదికై యొక మార్గమును తెలుపుము."
పేదలు, దిక్కులేనా వారు, అనాధలు, సాధారణముగా నిరాశచెంది దుఃఖసముద్ర మున మునిగియుండు వారిని థియోఫిలస్ ప్రత్యేకముగా నాదరించెను.
ఆయన రాబడి చాలా తక్కువయినను పేదలయెడల నాయనకు గల జాలి తన హృదయమును విశాలపరచినందున వారిని యెక్కువగాచేరదీసి పోషింపగలిగెను. "తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, యిహలోకమాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే". ఈ వాక్యము ఆయన జీవితమున సార్థకమయ్యెను.
థియోఫిలస్ పేదవిద్యార్థులకు డబ్బు బట్టలను ఇచ్చి సహాయముచేసెను. ఒకప్పుడు ఒక చొక్కానే కలిగి, బట్టలు లేక బాధపడుచున్న ఒక పేద కుర్రవానికి బట్టలు కుట్టించుకొనుటకు కొంతసొమ్ము నిచ్చెను. ఈ సంగతి తెలిసికొని మరి యిద్దరు కుర్రవాండ్రు ఆయన యొద్దకువచ్చి తాముకూడా పేదలనియు తమకు సాయము చేయవలసినదనియు వేడిరి. అయితే ఆయన ఆయన యొద్ద వారికిచ్చుటకేమియు లేనందున హృదయ వేదనతో యీరీతిగా చెప్పెను; "చాలా మంది నిరుపేదలు తమ దుస్థితిని తెలియచేయుచు నాయెద్దకు వత్తురు. వారికి సాయము చేయుటకు నాయొద్ద ఏమైన యున్నయెడల యెంత బాగుండును! వారికి సాయము చేయలేక పోవుచుండట నన్నెంతయు బాధించుచుండెను."
థియోఫిలస్, శ్రమానుభవము తనజీవితములో బాగుగా కలిగియున్నందున యితరుల శ్రమలతో వారికి తోడ్పడు మనస్సు గలిగియుండెను.
కాకినాడ సముద్రతీరమున గల పురాతనమగు రేవుపట్టణము. అప్పుడప్పుడు తుఫానులు రేగినపుడీ పట్టణమందు కొంత తొందర కలుగుచుండును. ఈ పట్టణమునకును సముద్రమునకును మధ్య కొన్ని పల్లెగుడిసెలున్నవి. 1945 వ సంవత్సరమున ఒక గొప్ప తుఫానురాగా సముద్రము పొంగెను. అప్పుడు పేదలగు పల్లెవారి గుడిసెలు గాలికెగిరిపోయి జలమయమయ్యెను. నిలువ నీడలేక వారందరును కుటుంబ సమేతముగా పట్టణముచేరి, తల దాచుకొనుటకు స్థలమునకై వెదకజొచ్చిరి. పాపము! వర్షమునకు తడిచి చలిగాలికి వణికి బాధపడుచున్న యీ పేదలకు నిలువ నీడ దొఱకలేదు. అట్టిసమయమున వారు థియోఫిలస్ గృహమునకేగి తలుపుతట్టగనే యుదారస్వభావముగల మహనీయుడు వెంటనే తలుపుతెఱచి వారిని తనయింటిలోనికి రానిచ్చెను. పేదలకు పెన్నిధి దొరికిన చందమున దొరికినదే తడవుగా వారందరు ఒక్క పెట్టున నాయింటిలో ప్రవేశించిరి. తానున్న ఆఫీసు గది నిండిపోగా వేరొక గదిలోనికి ఆయన వెళ్ళి వారికానాడు స్థలమిచ్చి యాదరించెను. ఇట్టి ఘనకార్యముల నీయన చేసినను చేయని వానివలె ప్రవర్తించెను.
ఒకనాడాయన 80 నెంబరు నేత దోవతుల జతను అప్పుడే బజారునుండి కొనితెచ్చి అందొక దానిని ధరించుకొనబోవుచుండగ నొకపేద సువార్తికుడు చినిగిన వస్త్రములతో యెదుట కనబడెను. కనికర హృదయముతో ఆయనను పిలిచి, అయ్యా ఇదిగో దీనిని తీసికొనుమని చెప్పి వెంటనే ఆ రెండవ పంచెనాయన కిచ్చివేసెను.
పఠనము
ఇంటి యొద్దనున్నపుడు థియోఫిలస్ చేతిలో నేదో యొక పుస్తకమునుబట్టి చదువు చుండుట ఆయనను దర్శించినవారు కనుగొందురు. అత్యాతురతతో పరిశుద్ధ గ్రంధమును పఠించి, తనివితీరని తృష్ణతో నూతనాభిప్రాయముల కొరకు బైబిలు సంబంధమైన యితర పుస్తకములను చదివి తన విజ్ఞానమునభివృద్ధిచేసికొనెను. భక్తుల జీవితచరిత్ర లాయనకెక్కువ ప్రియమైనవి. ఆయన వాటిని చదివి ధ్యానించుచుండువాడు. సాధుసుందర్సింగు, అస్సిసివాసియగు పరి. ఫ్రాన్సిస్, సి.టి.స్టడ్, పరి॥ ఫ్రాన్సిస్డిసేల్సు మొదలగు భక్తుల జీవితచరిత్రములు ఆయననకు ప్రియమైనవి. ఫ్రాన్సిస్డిసేల్సును గూర్చి చదివిన పిదప యిట్లు వ్రాసెను, 'ఈయన జీవితము నా ఆధ్యాత్మిక జీవితమును సరిచేసి కొనుటకు నూతనాభిలాషను పుట్టించెను'. సి.టి.స్టడ్ జీవిత మాయన కాత్మీయ యుద్రేకము కలిగించెను, "స్టడ్ గొప్పవిశ్వాసము, ధైర్యము గలవాడు. ఆయన దగ్గువల్ల బహుగా బాధపడెను. అయినను దక్షిణ ఆఫ్రికాలో అనేకులను రక్షించగలిగెను. ఆయన జీవితచరిత్ర చదివినందున ధృడవిశ్వాసము నాకుగలుగగా, నూతన సమర్పణ చేసికొనుటకు నేను ప్రోత్సహింపబడితిని. ఇతర పుస్తకములను కూడా యీయన చదివెను. అవి క్రైస్తవ మతసంబంధమైనవైనను కాకపోయినను తన భక్తిజీవితమును వృద్ధిచేసికొనవలెనను ముఖ్యోద్దేశముతో నీయన ప్రతి పుస్తకమును చదివెడివాడు. జవహర్లాల్ ఆత్మకథను చదివి తత్ఫలితము నిట్లు వర్ణించెను."నెహ్రూ తన దేశముకొరకు చేసిన త్యాగమును, తన దేశభక్తిని, సేవను, నా జీవితముతో సరిపోల్చినచో క్రీస్తు సేవకుడనైన నేను, నా కొరకు తన ప్రాణమిచ్చిన క్రీస్తు నిమిత్తము ఎంతవరకు సమర్పించుకొనవలసియున్నది!"
ఆయన స్నేహితులు
థియోఫిలస్కు చాలా మంది స్నేహితులు కలరు. వారాయన జీవితములో నమూల్యమగు విషయములెన్నో ఆయన తదనంతరమున జ్ఞాపకముంచుకొనిరి. అవి వారి జీవితమును దిద్దుకొనుటకెంతయో తోడ్పడుచుండును. స్నేహితులతో ఆయనకు గల సంబంధము క్రీస్తు ప్రేమ మీదనే ఆధారపడియుండెను. ఆయన బాల్యస్నేహితులను మరువక బహువిశ్వాసముతో వారియెడల ప్రవర్తించుచు, లోకరీతిగా నేర్పడిన పూర్వస్నేహమును క్రీస్తునుబట్టి నిలిచియుండు మైత్రిగా స్థిరపరచెను. ఏ పని మీదనైను తన స్నేహితులున్న గ్రామములకు వెళ్ళినపుడు వారిని తప్పక దర్శించి దైవవాక్యముతో వారిని హెచ్చరించి ప్రార్థించుట ఆయన వాడుక. తన స్నేహితుని యందొకప్పుడు చెడుగు కనబడినను, స్నేహమును విడనాడక, ప్రేమించి, వానిని సరిచేయుటకు ప్రయత్నించువాడు. ఆయన మైత్రిలో రహస్యమీవిధముగ వివరించనగును: 'ఒకనిలోని యుత్తమోత్తమ గుణములను మాత్రమేగాక, అధమలక్షణములనను సహా తెలిసియు యధావిధిగా ప్రేమించువాడే నిజమైన స్నేహితుడు. మన స్నేహితుల ప్రేమ గౌరవములకు పాత్రులము కావలెననిన మనము నిరాడంబరముగను నమ్మకముగను వేషధారణ లేకను మెలగవలయును.' 'నేను మీకాజ్ఞాపించువాటిని చేసినయెడల మీరు నాస్నేహితులై యుందురు. నేను ఇకను మిమ్ములను స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నియు మీకు తెలియజేసితిని.' అని ప్రభువు తన శిష్యులతో చెప్పిన పై వాక్యములను ఈయన తనకును తన విద్యార్థులకును మధ్యగల సంబంధమును నెలకొల్పుటకు మూలసూత్రముగా వాడుకొనెను. విద్యార్థులు తనయెద్ద విద్య ముగించిన పిదప వారినాయన ప్రియమైన స్నేహితులుగా భావించెను.
సంభాషణ
థియోఫిలస్తో సంభాషించువారు ఆధ్యాత్మికస్థితియందు వృద్ధినికాంచుదురు. ఆయన పవిత్రతలంపులందానందింతురు. తన యమూల్యమగు నూత నానుభవములోనికి నడిపించుటవలన వారి జీవితమును ప్రజ్వలింపజేయును. ఆయన నోట నుండి వెలువడు పలుకులు ప్రేమపూరితమైనవియై, తన స్వానుభవము యొక్క ఫలితములైయున్నవి. అందుచేతను వినువారావిషయములను గూర్చి సంశయింపక వేదవాక్యములుగా నంగీకరించువారు. అనేకులాయన సలహాలనపేక్షించుచుండువారు. తమవిశ్వాసమందు దృఢనిశ్చయులై బాహాటముగ బయలుపరచువారి నాయన నభినందించువారు. ఆయన యుద్దేశేములకు ప్రతికూలముగా మాట్లాడు వారితో ననవసరముగా వాగ్వాదము పెట్టుకొనక వారి పొరపాటులను తాత్కాలికముగా సహించి తరువాత సావకాశముగ ప్రేమతో వారికి సరియగు విధమున విశదపరచును. ఇతరుల ద్వారా అనేక విషయములను తెలిసికొనగోరి, తానెక్కువగా మాటలాడక ఓపికతో యితరులు చెప్పెడి వాటిని వినెడివాడు. 'ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడు వాడును మాట్లాడుటకు నిదానించువాడునై యుండవలెను.'
హాస్యరసము
థియోఫిలస్ ఒక్కొక్కప్పుడు ఆనందదాయకమగు హాస్యపు పలుకులతో తన సంభాషణ నలంకరించువాడు. ఆయన హాస్యము బహుసూక్ష్మమైనదై ప్రబోధనాసాధనమై ఆయన యంతరంగిక జీవిత క్రమశిక్షణను బయలుపరచుచుండెడిది. ఒకనాడయాన ఒక సంఘకాపరితో కాకినాడ నుండి విశాఖపట్టణము వరకు ప్రయాణము చేయుచు అనేక విషయములను గూర్చి సంభాషించెను. ఆయనతో నున్న సంఘకాపరి అతని యధికారి తన యెడల జరిగించుచున్న అన్యాయమును గూర్చి నాలుగు గంటలు వరకు చెప్పుకొనుచుండగా సుమారు నూరుమైళ్ళ ప్రయాణము ముగియవచ్చెను. ఈ సంభాషణలో తనయుద్దేశమును వెలిపుచ్చు ఒక్కమాటయైనను థియోఫిలస్ పలుకక తలయూపుచు తన వాడుక ప్రకారము 'ఎస్, ఎస్,' అనుచు వినుచుండెను. సంఘ కాపరి తాను ఆశించినట్లు ఆయన తన సానుభూతిని త్వరలో వెలిబుచ్చనందులకై వ్యసనపడి, "ఏమండీ: అయ్యగారు, ఇంతసేపూ నా గాధను వింటూ 'ఎస్, ఎస్,' అంటూనే కాలం గడిపివేశారు. మీ 'ఎస్' నా భాధను తొలిగించునా?" అనెను. థియోఫిలస్ ఆయన చెప్పిన సంగతులన్నియు సావధానముగా విని, గమనించి ఆత్మలో ప్రార్థనచేసి తుదకు చిరునవ్వుతో నాయన నాదరించెను.
ఒకానొక సమయమున వేదాంత పాఠశాల యందు విద్యార్థులు తర్బీదు కొరకు ప్రసంగించుచుండిరి. తక్కిన యుపాధ్యాయులతో కూడా థియోఫిలస్ కూడా వారి ప్రసంగములను పరీక్షించుచుండెను. అందొకరు ప్రార్థన అంశముపై మాట్లాడుచు నిట్లుచెప్పిరి, "మన ప్రార్థనలు మనము ప్రార్థించు మందిరపు పైకప్పునకైనను చేరవు; దేవుడు అట్టి ప్రార్థనలనెట్లు వినగలడు?" ఈ ప్రసంగము ముగించిన వెంటనే థియోఫిలస్ హాస్యరసముతో "మన ప్రార్థనలు ప్రార్థనమందిరపు పైకప్పునుదాటి దేవుని యొద్దకు చేరకపోవచ్చును గాని దేవుడు ఆ కప్పు పైనేగాని క్రింద లేడా?" అని ప్రశ్నించి తప్పాభిప్రాయమును సున్నితముగా విమర్శించెను.
"నేను నమ్మినవారిని నేనెరుగుదును." 2 తిమోతి 1:13
అందుచేత నాగుఱిని, నాసేవలను, భావిస్థితిని నేనెరుగుదును.
(అ) నా గురి:- క్రీస్తు యొక్క సారూప్యమున నెదుగుట.
(ఆ) నా సేవ:- క్రీస్తు రాజ్యాభివృద్ధికై పాటుపడుట.
(ఇ) నా భావిస్థితి:- జీవితాంతమయిన ఆత్మరూపమున దైవసేవచేయుట
1927 వ సం॥న థియోఫిలస్ దక్షిణ కాకినాడ పొలమునకు ఫీల్డు సూపరింటెండెంట్‌గా నియమింపబడెను. ఈ సేవల ప్రాముఖ్యమైనదియును, బాధ్యతతో కూడినదియునైయున్నది. ఇట్టి సేవ యిదివరలో నేయాంధ్రనాయకునికి నివ్వబడియుండలేదు. ఈ పరిచర్యను అంగీకరింపవలసినదిగా, మెక్లారిన్గారు రెండు పర్యాయములు కోరినను తానందుకు అర్హుడుకానట్లు తెలియజేసెను. తప్పక ఈ సేవ చేయనంగీకరింప వలసినదని మెక్లారిన్ గారు మరల కోరగా థియోఫిలస్ దీనిని గైకొనెనను. ఆయన యాపని నెప్పుడు చేయనంగీకరించెనో అప్పటినుండియు నది ఒక బాధ్యతగా గుర్తించెను.
థియోఫిలస్ క్రీస్తుసంఘమును గాఢముగా ప్రేమించెను. ఆత్మలను ప్రభువు కొఱకు సంపాదించుట ద్వారాను విచ్చిన్నములైన కుటుంబములలో తిరిగి సమాధానము నెలకొల్పుట వల్లను సంఘము యొక్క ఆత్మీయస్థితి నభివృద్ధిచేయుటకై పాటుపడుట చేతను, తనకు క్రీస్తుసంఘము మీదగల ప్రేమను బయలు పరచెను.
ఆత్మలను సంపాదించుట
ఒక యౌవనుడు తన దుష్ప్రవర్తన వలన జీవితమును పాడుచేసికొని, మనశ్శాంతిలేక తిరుగుచు బాప్టిస్టుసంఘమును విడచి రోమన్ కథోలిక్కు సంఘమునాశ్రయించెను. కొన్ని నెలలిచ్చట ఉన్నను మనశ్శాంతిని సంపాదించుకొనలేక, పశ్చాత్తాపపడి తిరిగి సంఘములో చేర్చుకొనుడని బాప్టిస్టు మిషనెరీ వారిని కోరెను.అతని విశ్వాసమును పరీక్షించకుండా మరల సంఘములో చేర్చుకొనుట సంఘ క్రమశిక్షణకు భంగముగాన యతనిని మిషనెరీవారు వెంటనే చేర్చుకొనలేదు. ఆ యువకుడు థియోఫిలస్తో సంప్రదింపవలయునని ప్రేరేపింపబడి ఆయన యెద్దకు వెళ్ళెను. థియోఫిలస్ సలహా యేమనగా; "ఓపికతో కొంతకాలము కనిపెట్టుము; ప్రార్థన చేయుము; క్రమముగా సంఘారాధనలకు హాజరగుచుండుము." పిమ్మట థియోఫిలస్ ఆ యౌవనస్తునితో కలసి ప్రార్ధించగా ఆ యువకుడు కన్నీళ్ళు కార్చెను. థియోఫిలస్ ప్రార్థన ముగించుచు, "దేవా, ఈ యువకుడు సంఘములో చేర్చుకొనబడునట్లును తన హృదయాభిలాషనుబట్టి ప్రభుకృపాసంస్కారమున పాల్గొనునట్లును మార్గము తెరుపుము" అని పలికెను.
మిషను పనిలో నున్న యొక యుపాధ్యాయుడు పనిని విడిచివెళ్ళిపోయెను. అతని హృదయములో నేదియో రహస్య పాపముండుటవలన తన జీవితములో శాంతి ఏమాత్రమును లేకుండెను; ఎంత దు:ఖించినను నెమ్మది దొరకలేదు; అంతనతడు చనిపోయిన తన ప్రియపుత్రిక యొక్క సమాధియొద్దకేగి ఆబిడ్డ యాత్మ తన కైమైనను శాంతియొసగగలదేమోయని మోకరించి ప్రార్ధించెను. కాని యిదియు నిష్ప్రయోజన మాయెను. అప్పుడతను థియోఫిలస్ యొద్దకేగి తన హృదయవేదదను. వెలిబుచ్చెను. అంతటాయన అతని కొరకు ప్రార్ధించి, "నీవు పోయిన నీవెవరికి విరుద్ధముగా పాపము చేసితివో వారియెదుట ఆ పాపము నొప్పుకొనుము" అని సలహానిచ్చెను. అతడాప్రకారము చేయగా అతని హృదయములోనున్న వేదన తొలగిపోయి శాంతి సమాధానములు చేకూరెను.
రోగుల మధ్య సేవ
థియోఫిలస్ జీవితమున రోగుల మధ్య పరిచర్య చేయు కోరిక ఒక విశేషమగురీతిని ప్రవేశించెను. ఒక విశ్వాసిగృహములో నొక యౌవనస్తుడు జబ్బుగానుండెను. వారు థియోఫిలస్ కొఱకు కబురు పంపి, "అయ్యా, మీరీరోగివద్ద ప్రార్ధించినచో స్వస్థత కలుగును" అని చెప్పిరి. ఆయన అట్లు ప్రార్ధించగా రోగి స్వస్థత పొందెను. అప్పటి నుండియు ఆయన రోగుల నెక్కువగా దర్శించి ప్రార్ధించుచుండువాడు.
పిఠాపురము ఆస్పత్రిలో విషజ్వరముతో బాధపడుచున్న యొకరీయనకు కబురు పంపగా పదిమైళ్ళు వెళ్ళి అతని కొఱకు ప్రార్థించెను. మరొకసారి మరణకరమగు వ్యాధితో పీడితుడగు సోదరుని దర్శించుటకై నూరుమైళ్ళు ప్రయాణము చేసి వెళ్ళి ఆయన యొద్ద ప్రార్ధించెను. ఈరీతిగా ఆయన రోగులను దర్శించి వారి కొఱకు ప్రార్థించెడివాడు.
క్రైస్తవ కుటుంబములలో సేవ
థియోఫిలస్ నూతన కుటుంబములను కట్టుటలోను, విచ్చిన్నమైన కుటుంబములను పునర్ద్ధురించుటలోను, బహు శ్రద్ధవహించుచుండెను. పదునేండ్ల కుటుంబ జీవితములో పదు నేడుగురి వివాహములను జరిగించెను.
క్రైస్తవయువకులు తాము పెండ్లాడగోరు యువతుల నుండి స్త్రీ ధనమపేక్షించుట పాడాగాదని యీయన చెప్పుచుండెడివాడు. తల్లిదండ్రులు లేని పేద యువకుడొకడు తాను వివాహమాడబోవు వధువునుండి కొంతసొమ్మును స్త్రీ ధనముగ నపేక్షించెను. థియోఫిలస్ ఆ యౌవనస్తుని గద్దించి, తానే ఆ వివాహమును ఆదర్శప్రాయముగ జరిగించెను. అతిథులకు శాకాహారములీయబడెను. వధూవరులు సాధారణ దుస్తులనే ధరించిరి. వివాహఖర్చులు చాలావరకు తగ్గించబడెను. క్రైస్తవులలో ననేకులు తమ వివాహమునకై యధిక ధనమును వ్యర్థముగా వ్యయపరచి అప్పులతో కుటుంబ జీవితమును ప్రారంభింతురు. ఈ యువకుడట్లు అప్పులపాలు కాకుండా థియోఫిలస్ కాపాడెను. క్రైస్తవ వివాహ సంబంధములు ద్రవ్యమునుబట్టి కాక, ప్రేమను బట్టియే యేర్పాటు కావలెనని థియోఫిలస్ యీ కార్యమునుచేసి సూచించెను.
ఒకసారి ఆరుగురు బిడ్డలుగల తల్లి థియోఫిలస్ దగ్గరికి వచ్చి తన భర్తయొక్క ప్రవర్తన సరిగాలేనందున తనకుటుంబమును నిర్లక్ష్యపెట్టెనని తన భర్తపై నిందమోపెను. ఆమె చెప్పిన మాటలను బట్టి ఆమెయే దోషియనియు, ఆమె భర్తలో నేలోటును లేదని గ్రహించి, యాయన యామెకీరీతిగా సలహా నిచ్చెను: "అమ్మా, ప్రేమ, శాంతము, ప్రార్ధనల వలన నీ భర్తను నీవు మార్చగలవు."
మరియొక సారియొక యుపాధ్యాయుడును అతని భార్యయు తగలవులాడి, తమకు న్యాయము తీర్చవలెనని ఆయన దగ్గరకు వచ్చిరి. ఆయన వారిద్దరితో కలసి ప్రార్ధించగానే వారు తమ లోటులను గ్రహించి దిద్దుకొని సమాధానము కలిగి జీవించుటకు తీర్మానించుకొని సంతోషముతో వెడలిపోయిరి. ఈ రీతిగా థియోఫిలస్ క్రైస్తవ కుటుంబజీవితములను సరిచేయుట ద్వారా క్రీస్తుశరీరమగు సంఘమును కట్టెను.
క్రీస్తు సంఘము పట్ల ఆయన ప్రేమ
"థియోఫిలస్ తన్ను తాను ప్రేమించుకొనిన దానికంటె తన సంఘము నెక్కువగ ప్రేమించేనని" తన తోటిపనివారు ఆయన మరణానంతరమున సాక్ష్యమిచ్చిరి. "నేను సంఘములో (లేమెన్) మధ్య చేయుచున్న సేవ నా ప్రాణముతో సమానము" అని ఆయన తన భార్యతో పలుమార్లు చెప్పెను. మీరు చనిపోయినచో నా సంగతి యేమని ఆయనభార్య ఆయన నడుగగా ఆయన యిట్లు చెప్పెను. "దేవుడే నిన్ను గూర్చి జాగ్రత్త తీసుకొనును."
తన చివరి దినములలో ఆయన యేసంఘములో ప్రసంగించినను సంఘముయొక్క పవిత్రతను గూర్చియే మాట్లాడెను. ఆయన ఆత్మీయ జీవితమునందెదుగుకొలది సంఘమును గూర్చిన శ్రద్ధయు, జ్ఞానమున ఆయనయందు హెచ్చగుచుండెను. ఒకసారి ఒక విద్యార్థి ఆయన దగ్గరకు వచ్చి, " అయ్యా, సంఘములో ననేకలోటుపాటు లున్నవని బాగుగా గ్రహించియు, మీరెందుచేత సంఘమునంత యెక్కువగా ప్రేమించి, దానిని గూర్చియే పలుమారులు ప్రసంగించుచుందురు?" అనగా థియోఫిలస్ యీరీతిగా జవాబిచ్చెను, "సంఘములో నెన్ని లోటుపాటులున్నను దేవునిరాజ్యము నీలోకములో స్థాపించుటకు సంఘమే సాధనము. అందుగల పొరబాటులన్నిటికిని సంఘ సభ్యులమగు మనమేగదా కారకులము?"
మానవుని నుండి దేవుడు ఆపేక్షించునది ప్రేమయే; దేవుని ప్రేమించుటయే దేవునియెడల మానవునికి గల బాధ్యత. ఇట్టి దైవప్రేమ థియోఫిలస్ జీవితములో ప్రధానమయినదిగ నుండెను. క్రీస్తును, క్రీస్తు సంఘమును ఆయన గాఢముగ ప్రేమించెను. స్వార్థత్యాగమునను విరామము లేని సేవ ద్వారాను ఆ ప్రేమను బయలుపరచెను.
సువార్తికులను పరామర్శించుట
థియోఫిలస్ తన మాదిరి జీవితము వలన సువార్తికుల జీవితములను జ్వలింపజేసెను. ప్రతి సువార్తికునిలోని బలహీనతల నెక్కువగ గమనింపక సుగుణములనే వెదకి వాటిని ప్రజ్వలింప జేసుకొనవలెనని వారిని ప్రోత్సహించెను. ఆయన యెన్నడును యెట్టివారిని గూర్చి యయినను అసంతృప్తికరమగు మనసునగుపరచలేదు. అయినను నమ్మకమగు సేవచేయువారిని మెచ్చుకొనుటనుబట్టి సోమరులు తమ లోటులను గ్రహించెడివారు. ఆయన తోటిపనివారియందాయన కెక్కువ నమ్మిక కలదు. బలహీనులగు తన సహపనివారిని ఆయన గద్దించి నిరుత్సాహపరచక తగువిధముగ ప్రేమించి మంచి సలహాను నిచ్చిబలపరచువాడు. అందుచేత ఆయన వారి మనస్సులను బాధించి నిరుత్సాహపరచు శిక్షలను యెన్నడును వినియోగించలేదు. నెలసరి సభల సమయమున వారిని భోజనమున కాహ్వానించు చుండెను. ఆయన సహవాసమున వారెంతయో యానందించుచుండిరి. థియోఫిలస్ తన క్షేమముకంటె సువార్తికుల క్షేమము నెక్కువ ప్రాముఖ్యముగ నెంచెను. ఒక సమయమున రాబడి తగ్గినందున సువార్తికుల జీతములు కొంత తగ్గించవలసివచ్చెను; అయితే అట్లు చేయ నిష్టపడక తానిట్లు నిశ్చయించుకొనెను; "దక్షిణ కాకినాడ పొలములో నున్న సువార్తికుల వేతనములు తగ్గించవలసి వచ్చినది. వారు పేదవారు. ఈ పని కొరకై మిషనుద్వారా పొందుచున్న పరిరూపాయల సహయమును నేనే సమర్పించుకొనుటకు సిద్ధముగనున్నాను."
ఉజ్జీవ కూటములు
సువార్తికులను ఆధ్యాత్మికముగ ఉజ్జీవింప జేయుటయు థియోఫిలస్ తరచుగ భక్తికూటముల నేర్పాటుజేసెడువాడు. ఉజ్జీవకూటముల సమయమున పరిసరముల మార్పు యెక్కువతోడ్పడుననెడి నమ్మిక ఆయనకు గలదు. సమూహముల మధ్య కంటె చిన్నచిన్న గుంపుల మధ్య ప్రత్యేక కూటములు ఫలవంతములై యుండును. ఆన్యోన్యసహవాసమునకు ఎక్కువ వీలుండును. జయకరమగు భక్తికూటము జరుగవలెనన్న అందరును ఆత్మయందేక భావము గలిగియుండుటయు అవసరము. సభికులు విద్యావంతులయినను, విద్యా హీనులయినను సామాన్య జనులయినను, వారిని తన సహవాసమున పెంచుటకై ప్రసంగికుడు తన్ను తాను తగ్గించుకొనవలయును. సభికులతో కలిసిమెలసి యుండవలయును. వారితోనే కలసి భుజించవలయును. తన స్వానుభవమును వారికి తెలియజేయవలయును. పాపి మారుమనస్సు నొందునపుడు సామాన్యముగా నగుపరచు ఉద్రేకము నంతగా ఆయవ పాటించడు. తాత్కాలికమగు బాహ్య చిహ్నములకన్న నెక్కువగ నాత్మీయపరివర్తన మాయన కోరుచుండెను. ఆత్మశుద్ధీకరింప పవిత్రముగ జీవించుటయే యవసరమని నమ్మెను. అట్టి శక్తివంతమగు ఆత్మీయజీవితమును స్థిరపరచుటకై దైవవాక్యపఠనమే కూటములలో ముఖ్యాంశముగ నాయన ఏర్పాటు జేసెడువాడు. పరిశుద్ధ గ్రంథములోని యోసేపు, మోషే, యిర్మియా, నెహెమ్యా, దానియేలు, పేతురు, పౌలు, ఆంద్రేయ, మార్కు, అబ్రహాము మొదలగు భక్తవరుల చరిత్రల సారాంశమును సిద్ధపరచెను. కాకినాడలో నున్న మిషను కేంద్రపాఠశాలలోని విద్యార్థులకొరకైన ఉజ్జీవకూటములలో (రిట్రీట్) యీ చరిత్రలు ఎంతగనో తోడ్పడెను. ఆయన చేసినట్టి యీ మహోత్తమ సేవ దక్షిణ కాకినాడ పొలములో మాత్రమేగాక, యితర ప్రదేశములలో గూడ ప్రసిద్ధిజెందెను. మెక్లారిన్ ఉన్నత పాఠశాల, రక్షణోదయ బోధనాభ్యసన పాఠశాల, వేదాంత పాఠశాలయందలి విద్యార్థుల కొరకు ప్రతిసంవత్సరము నేర్పాటుచేయబడు భక్తికూటములలో ప్రముఖనాయకుడుగ నాయన పరిగణింపబడెను. ఈయన కార్యక్రమము నేర్పాటు జేయుచు, సకల విషయములలోను తగు సాయమొనర్చు, మంచి సలహాల నిచ్చుచు, అన్నిటి కన్న తన సహవాసముచే ప్రజల నుజ్జీవింపచేయుచుండెను.
ఇతర మిషనులోని నాయకులును యాయన చేయుచున్న ప్రశస్తమయిన సేవలను గమనించిరి. లూథరన్, అమెరికన్ బాప్టిస్టు మిషనులవారును, ఆంగ్లమిషన్ తదితర సంఘముల వారును ప్రత్యేక సభలు, భక్తికూటములు, అభిషేక కూటములు మొదలగు సమావేశములలో నీయనను నాయకునిగ నాహ్వానించిరి. ఈయన సేవాఫలితమును అనేక సంఘములను భవించినవి.
హిందువుల మధ్య సేవ
తాను దుర్బలుడైనను సరకుచేయక, దక్షిణ కాకినాడ పొలములో పలుగ్రామములను దర్శించి, వీలుకానిచోటుకు కాలినడకను పోయి సేవ చేసెను. ఆయా గ్రామాదుల యందలి క్రైస్తవులును, క్రైస్తవేతరులు సయితము యాయన యొక పట్టణవాసియగు యధికారి యని భావింపక తమవంటి సామాన్య వ్యక్తియని తలచి తమ కష్టసుఖములను ఆయనకు తెలియజేసెడువారు. థియోఫిలస్ గ్రామ క్రైస్తవునకు తండ్రివలెను, బోధకునకు కష్టసుఖములలో పాలివాడగు సోదరునివలెను, హిందువునికి నమ్మదగిన స్నేహితునివలెనుండెను.
హిందువులు క్రీస్తుయొక్క దైవత్వము నొప్పుకొని క్రీస్తును తమ రక్షకునిగనంగీకరింప నడిపించెను. వారి నంతటితో విడువక, బాప్తిస్మము ద్వారా తమ విశ్వాసమును బయలుపరచవలెననియు, బహిరంగ సాక్షమీయవలయుననియు ప్రోత్సహించెను. అట్లు బాహాటముగ ప్రభువును గూర్చి వారు సాక్ష్యమిచ్చునట్లు చేయుటలో ఆయన యెప్పుడును వెనుదీయలేదు. హిందువులతో ఆయన సంభాషించునవుడు క్రైస్తవ్యమునకును, హిందూమతమునకును గల భేదమును వ్యక్తపరచి యిట్లనెను, "హిందూమతములో క్రీస్తు లేడు; ఆయితే క్రైస్తవ మతములో క్రీస్తు కలడు".
థియోఫిలస్ యొక్క జీవితము హిందువులకు బహు ఆకర్షణీయముగ నుండెను. ఒకనాడు ఆయన జనసమమర్థమగు కాకినాడ వీధిలో నడచిపోవుచుండగా హిందువుడగు వ్యాపారస్థుడు ఆయనవంక తేరిచూచుచు అచ్చట కూర్చున్న వారితో నాశ్చర్యముతో నిట్లనెను, "ఆ పోవుచున్న వ్యక్తి యెవరైయుందురు? నా వ్యాపారమును కట్టిపెట్టి ఆయన వంక చూచునట్లు నన్ను పలుమారు లాకర్షించెడు ఉత్తమశక్తి యాయనలో యున్నది. ఈ వ్యక్తి యెవరో?"
ఉపమండలాధ్యక్షుడు (ఫీల్డు మినిస్టర్)
దక్షిణ కాకినాడ పొలముయొక్క సువార్తసేవలో థియోఫిలస్ చూసిన భక్తి విశ్వాసములును, సమర్థతయును, సువార్తికుల యెదుట ఆయన చూపిన మాదిరి జీవితమును, ప్రభువు సేవలో తన శ్రమకుదగినట్లు ఫలించెను. అంతయుగాక భావికాలమున మిషనరీలవలెనే ఆంధ్రనాయకులును విచారణకర్తలుగ (మినిస్టర్స్) నుండి సమర్థతతో సువార్తసేవను జరిగించ గలరనెడు విషయమును జీవితమున దృఢపరచెను. ఈ విధమగు పూచీతో కూడిన ప్రాముఖ్యస్థానముల నాంధ్రనాయకులకిచ్చునట్లు ప్రధమమున నీయనయే తన జయకరమగు సేవ ద్వారా మార్గమును తెరచెను.
ఈయన నూతన మహాసభ నిబంధనలు వ్రాసినప్పుడు అందు క్రైస్తవ ఆంధ్రనాయకునకు ఘనమగుస్థానము నిమిడ్చెను. అప్పటినుండియు 'ఫీల్డు మిషనెరి' యను పేరునకు బదులు 'ఫీల్డుమినిష్టరు' అను పదము అమలులోనికి వచ్చెను. 'ఫీల్డుమినిష్టరు' అనగా మిషను పొలమునకు సంబంధించిన సమస్తకార్యక్రమ బాధ్యతను నిర్వహించు నాయకుడు. ఆ స్థానమున మిషనెరీగాని లేక ఒక ఆంధ్రనాయకుడుగాని ఏ భేదమునులేక యుండవచ్చును. ఇక మీదట మనలనీ కార్యమును నడుపు మూలసిద్ధాంతమేదనగా "మహా ఘనమైన సువార్తసేవలో ఆంధ్రనాయకులును, కెనడా దేశపు మిషనెరీ వారును కలసి సంపూర్ణ సమానత్వ సహోదరభావమున పాలిభాగస్థులయి పనిచేయుటయే".
నాలోనున్న బాధ ఆకస్మిక సంభవము కాదు,
అయ్యది భగవత్సంకల్పము;
అదియె సిద్ధించు గాక!
నేను చూడనేరని దాని నాయన జూడ సమర్థుడు,
అగుచో,
ప్రతిసంకటమునకు ఉద్దేశమొకటి గలదు;
ఆయనాయుద్దేశమును విదితము చేసిననాడు భౌతిక నష్టము పారమార్థిక లాభమని గ్రాహ్యమగును.
1936 ఏప్రిల్ నెలలో థియోఫిలస్ తన దేహములో నాకస్మికముగ నొకమార్పును కనుగొనెను. ఒకప్పుడు ఆయనను బాధించిన క్షయరోగ చిహ్నములు మరియొకసారి బయలుపడెను. పాలకొండ, శ్రీకాకుళము ప్రాంతములలో ఉజ్జీవకూటములు జరిగించినపుడు తీవ్రముగ సేవ చేసినందున యెక్కువగ నలసిపోవుటచే బహు బలహీనుడాయెను. గొంతు రాసినది. తీవ్రమగుదగ్గు ప్రారంభమాయెను, దేహారోగ్యము పాడయ్యెను. ఈ స్థితిలో ఏమియు మాట్లాడక సంపూర్ణముగ రెండు మాసములు విశ్రాంతి తీసికొనవలెనని యాయనకు వైద్యులు సలహానిచ్చిరి.
గోపాలపురములోని విశ్రాంతి
(21-4-1936 - 20-06-36)
థియోఫిలస్ 1936 ఏప్రిల్ 21వ తేదీన సముద్రతీరముననున్న గోపాలపురములో రెండునెలలు విశ్రాంతి తీసికొనుటకు వెళ్ళెను.
మౌన వ్రతము
తన ఆరోగ్యము నిమిత్తము థియోఫిలస్ రెండు మాసములు మౌనముగా నుండుటకు నిశ్చయించుకొనెను. అట్లు మౌనముగా నున్నపుడు ఆయనకు కలిగిన అనుభవములను ఈ విధముగా వ్రాసెను. "మనము నోరు మూసుకొని మౌనముగా నుండుట సాధ్యమేకాని మన మనస్సులను నిశ్చలముగ నుంచగలమా? నాలుకను కట్టిపెట్టినను మనస్సు లోక సంచారము చేయును. అప్పుడప్పుడు ఆత్మీయ జీవితమును పాడుచేయు చెడు తలంపులు కూడ మనసులో పుట్టుచుండును. మౌనముగానున్నను, మనము చూచు దృశ్యములు గత జీవితమున గలిగిన అనుభవములు మనకు జ్ఞప్తికి వచ్చినప్పుడును కొన్ని ఆలోచనలు పుట్టుచుండును. చెడుతలంపులు క్రియారూపమును జెందక ముందే వానితో పోరాడి జయించుటకు యత్నింతును." ఈయన యీసమయమున మితభాషిగా మారెను. సుమారు రెండు నెలల వరకును ఆస్పత్రిలో నుండవలసి వచ్చినందున జనసమర్థమై, గందరగోళముగ నున్న పట్టణవీధులలోని అల్లరి నుండి దూరముగ నుండవలసి వచ్చెను. ఆ కాలమంతయు నితర వ్యవహారములనుండి దూరముగ నున్నందున ప్రభుపాదసన్నిధిని దేవుని గూర్చియు ఆయన రాజ్యమును గూర్చియు తలపోసికొనుచుండెను.
1936 సం॥ జూన్ 20 వ తేదీన థియోఫిలస్ గోపాలపురము నుండి కాకినాడ చేరెను. తాను విశ్రాంతినొందిన రెండు నెలలలో కలిగిన అనుభవమును గూర్చి యిట్లుచెప్పెను, "ఆ కాలమంతయు జ్వరము మానక వచ్చుచుండినను, నాయారోగ్య మభివృద్ధిజెందెను. నేనచ్చట నుండుట నాకెంతో ఇష్టము.
రాజమహేంద్రవరము-విశ్రాంతిపురము
(20-7-1936-23-4-1937)
తన ఆరోగ్యస్థితిని తెలిసికొనుటకై థియోఫిలస్ రాజమహేంద్రవరమున విశ్రాంతి పురములో డాక్టరు చేత పరీక్ష చేయించుకొనెను. అచ్చట యిదివరలో నున్న క్షయరోగము మరల పొడసూపెనని కనుగొనబడెను. ఈ విషాదవార్తను వినినప్పుడు తనకు కలిగిన దుఃఖమంతింత కాదు. పట్టరాని విచారముతో నిల్లు చేరెను. అట్లు విచారగ్రస్థుడగుటకు ఆయన హృదయమును కృంగజేయుటకును రెండు తలంపులు కారణము: "నేను పదనాలుగేండ్లకు పూర్వము క్షయరోగి నైనపుడు బ్రహ్మచారిగ నుంటిని గనుక ఈ వ్యాధిని యెక్కువగ లక్ష్యపెట్టలేదు. కాని నేనిపుడొక కుటుంబికుడనై యుంటిని గనుక యీ విషాద వార్త నాకెక్కువ బాధకరముగ నున్నది. అదిమాత్రమే గాక, నేను ఫిబ్రవరి నెలవఱకు సెమినెరిలో పనిచేసి వేసవిలో నాలుగైదు నెలలు విశ్రాంతి తీసుకొనవలెనని తలంచితిని. ఈ యుద్దేశము కూడ విఫలమయ్యెను. ఏలయన, నేననుకొనిన దాని కంటె యేడు నెలలు ముందు గానే పనినుండి విరమించవలసివచ్చినది."
1936 సం॥ జూలై 20 వ తేదీన థియోఫిలస్ విశ్రాంతి పురములో జేరి సుమారు తొమ్మిది మాసములచ్చటనే యుండెను. ఈ కాలములో ఆయనకు జ్వరము హెచ్చుగ నుండెను. ఆరోగ్యములో వృద్ధి కనబడలేదు. కావున తన మనస్సు కృంగిపోయి జీవితమునందు నిరాశ కలిగినను, ఉత్తమాభిప్రాయములును, పవిత్ర తలంపులును, తన హృదయమున నుద్భవించి నూతన సమర్పణను జేసికొనుట కాయననుద్రేకపరచెను.
స్వపరీక్ష
థియోఫిలస్ మదనపల్లి ఆస్పత్రిలో నుండగా తనజీవితమును ప్రభువుకు సమర్పించు కొనినను తరువాత తన జీవితములో ప్రవేశించిన చిన్నలోటుపాటులను ఈ కష్టపరిస్థితిలో పరీక్షచేసికొన నారంభించెను. మనోవాక్కాయకర్మలయందాయన యొనర్చినపరాధములు తనమనో నేత్రములకు వరుసగా కన్పించగా పాప క్షమాపణకై యిట్లు ప్రార్ధించెను: "దేవా! నన్ను క్షమించుము. నాయతి క్రమములును, అపజయములను అతి విస్తారముగా నున్నవి. నా అవిశ్వాసము నిమిత్తమును, నన్ను తరచుగా కలత పెట్టుచున్న భయము నిమిత్తము నిన్ను క్షమాపణ వేడుకొనుచున్నాను. కడచిన కాలములో నాయపవిత్ర తలంపులు నన్ను బహుగా తొందర పెట్టెను. నిష్కారుణ్యములగు కార్యములును స్వార్థపరత్వముతో కూడిన యుద్దేశములును నన్ను కలతపరచెను. దేవా! నన్ను మన్నించుము, ఆమెన్."
పవిత్ర జీవితమునకై దేవునితో చేసిన ఒడంబడిక
థియోఫిలస్ తన జీవితమును పవిత్రముగ గడుపుటకై దేవునితో ఇట్లు ఒడంబడిక జేసికొనెను: "పరిశుద్ధుడవగు దేవా, పాపులను శుద్ధీకరించు పవిత్ర రక్తప్రవాహము నీ నుండి బయలు వెడలుచున్నది. నీవు అవతారమెత్తినపుడు పాపరహితమగు పవిత్రజీవితమును జీవించితివి. నీవు కృపాసత్యములతో నిండి యున్నావు. నీవు మానవునకొక యాదర్శప్రాయమగు జీవితగురి నేర్పాటుజేసి దాని నతడపేక్షింప ప్రోత్సహించుచున్నావు. దీనుడనైన నాహృదయమును నీ సన్నిధితోనింపుము. నన్ను కలవరపరచు అపవిత్రమైనట్టియు, స్వార్థపరత్వముతో కూడిన తలంపులు నాలో నివాసమేర్పరచుకొనకుండునట్లు నాకు సహాయముచేయుము. నా స్వప్రయత్నమువల్ల నేను పాపేచ్ఛలతో పెనుగులాడుట కేవలము వ్యర్థమే. అట్టి పోరాటమువలన నాకు నిరుత్సాహమే కలుగుచున్నది. కాన నీవే నాకు సహాయము చేయుము. నాకు వేరొక ఆధారమేమియును లేదు. యేసు ప్రభువా! నేను నీ పరిశుద్ధవాక్యమును పఠించునప్పుడును, నీ సన్నిధిలోనున్నప్పుడును, పరిశుద్ధుల సహవాసములో నున్నప్పుడును, ఎట్టి పాపతలంపులును నన్ను తొందరచేయవు. ఇట్టియవకాశములనిచ్చినందులకు నీకు స్తోత్రములు. ప్రభువా! నా హృదయము నీ యాలయముగాన దానిని పవితప్రరచి యందు నివసింపుము. పాపము నసహ్యించు నట్టియు సమస్త సద్విషయములయందు దానందించునట్టియు పవిత్రమైన నూతన హృదయమును నాకిమ్ము. అప్పుడు నిష్కళంకమగు నా హృదయమున నీ పవిత్ర ముఖదర్శనమును గాంచగల్లుదును. ఈ మనవిని క్రీస్తునామమున సమర్పించు కొనుచున్నాను. ఆమెన్.
పరిశుద్ధ గ్రంథమును గూర్చిన నూతన దృష్టి
థియోఫిలస్ దైవగ్రంధము నిదివరలో ఒక సారియైనను సాంతముగ చదివియుండలేదు. ఇపుడు బైబిలు నామూలాగ్రము వరుసగా పఠింపవలెననెడి యొక నూతనవాంఛ యీయన కుద్భవించగా అయిదున్నర మాసములలో చదివి ముగించెను. కలిగిన తనయనుభవముల నిట్లు వ్రాసెను; "సృష్టి ప్రారంభము నుండి పాతనిబంధన చివరి వరకును చదువగా యూదులలోని ప్రవక్తలయును దూరదృష్టిగల భక్తులకును తెలుపబడినట్లు లోక రక్షకుని రాకకై లోకము అత్యాశక్తితో నిరీక్షించుచున్నట్టగుపడును. ఆ కాలమంతయు యూదుల ఆత్మీయజీవితములోని వృద్ధిక్షయములు చివరివరకును ఒకేవిధముగ నుండెను. పాతనిబంధనలోని శాశ్వత విలువ గలిగిన ముఖ్యోద్దేశము లేవనగా, దేవుడొక్కడేయను యభిప్రాయమును, ఆయన పరిశ్శుడనునవి.
పరిశుద్ధగ్రంధమంతటిని పఠించుటవలన పాతనిబంధన యెడల నాకుకలిగిన ప్రేమ వృద్ధియగుటమాత్రమేగాక, నూతన నిబంధనను నేను బాగుగా గ్రహించగలిగినట్టి విజ్ఞానమేర్పడెను."
పూర్వము పాతనిబంధనలోని కొన్ని భాగములను కధలని మాత్రమే భావించిన యీయన యిప్పుడు దైవగ్రంధమంతయు నేకాత్మ ప్రేరేపితమగు వ్రాతయని విశ్వసించెను. దైవవాక్య మీశ్రమదినములలో ఆయనను బహుగనాదరించెను. యోబుగ్రంధమునుండి యీ దిగువ పాఠములను ఆయన తీసికొనెను. యోబు దైవ సందర్శనము చేసినందున నూతన పరచబడెను. తానెంత శ్రమననుభవించుచున్నను, తన వేదనకు కారణమేమని సృష్టికర్తను ప్రశ్నించలేదు. దేవుడాయనను వెంటనే శ్రమనుండి విడుదలచేయలేదని సణగనులేదు. ఈ ధ్యానము వలన థియోఫిలస్ తన శ్రమను గూర్చి యేవిధమైన విసుగుదలయు జెందక యా శ్రమదైవ చిత్తాను సారమైనదనియే యెంచి తద్వారా గొప్ప ఆత్మీయ పాఠములను నేర్చుకొనెను.
కొన్ని నెలల యనంతరమాయన ఆరోగ్యము
7-11-1936 తేదీన అనగా సుమారు నాలుగునెలలు ఆయన ఆస్పత్రిలోనున్నను జ్వరముయొక్క తీవ్రత తగ్గలేదు. సుమారు 100° నుండి 104° వరకు జ్వరముండెడిది. అప్పుడు "దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము" అనువాక్యమును ధ్యానించుట వలన ఆయన చాలా ఆదరణ పొందెను. 15-12-1936: సుమారు అయిదునెలల అనంతరము జ్వరము తగ్గగా ఆయన జీవితము నూతనోత్సాహముతో నిండెను. యెహెజ్కేలు 37, 38 అధ్యాయములతో ప్రవక్తకు ఎండిన యెముకలను గూర్చి కలిగినదర్శనము చదివి ధ్యానించుటనుబట్టి యీయన జీవితము నూతనాశయములతో నిండెను. "యెహెజ్కేలుకు కలిగిన యీ దర్శనములు నా జీవితములో నొక గొప్ప నిరీక్షణను కలిగించెను. ఆ ప్రవక్త నిరుత్సాహకరమగు పరిస్థితులలోను ఉత్సాహకరమగు భవిష్యత్తును చూడగలిగెను". ఈ ధ్యానము వలన ఆయన తన జీవితమునకూడ శ్రేష్ఠమగు భవిష్యత్తును చూచి ఇట్లు ధ్యానించెను; "నీ సంఘము, నీ గ్రామము, నీ పట్టణము, నీ దేశమంతటిని గూర్చి నూతనాశయములు కలిగియుండుము. ప్రతివ్యక్తి యొక్క జీవితపరివర్తనమును గురించియు దేవుని రాజ్యాభివృద్ధిని గురించియు యుజ్జీవ నిరీక్షణలతో కూడిన దర్శనములను కలిగియుండుము".
థియోఫిలస్ తన్ను తానిట్లు ప్రశ్నించుకొనెను; "ఓ థియోఫిలస్, నీవు దేవుని రాజ్యమును భారతదేశీయుల హృదయములలో స్థాపించుటకు పూనుకొందువా?"
మరియు ఆయన యిట్లనుకొనెను; ఈ దినములలో గొప్ప ఆశయములనుకలిగి ముందుకు సాగిపోగలిగిన ప్రవక్తలు మనకవసరము. సహాయకులు యీ ప్రవక్తలతో కలసి పనిచేయుట కూడా అవసరము."
కొంత స్వస్థత కలిగినందున 1937 సం॥ ఏప్రెల్ 23 తేదీన ఆయన విశ్రాంతిపురము విడచి, దేవుడు తనసేవలో వాడుకొనుటకు మరియొక తరుణమను గ్రహించెనని సంతసించి కృతజ్ఞతతో నింటికి చేరి వెంటనే పనిలో ప్రవేశించి అయిదు నెలలుమాత్రము సేవచేసేను. అయితే మరల తన ఊపిరితిత్తులలో నొకటి పూర్తిగా చెడిపోయినట్లు తెలిసికొనెను.
రెవ.జె.బి.మెక్లారిన్
థియోఫిలస్ మరియొకసారి క్షయరోగుల ఆస్పత్రికి వెళ్లవలసివచ్చెను. అనేక విశ్రాంతిస్థలములకు రెవ.జె.బి.మెక్లారిన్ దొరగారు వ్రాసి ప్రయత్నించినను ఎచ్చటను చోటు దొరకలేదు. చివరకు బొంబాయి రాజధానిలోనున్న వెనుగుర్లలోని 'హిల్‌సైడ్ విశ్రాంతిపురము'లో ప్రవేశము దొరికెను. ఆ సమయమున థియోఫిలస్ తన కుటుంబమును నిరాధార స్థితిలో విడిచి వెళ్ళవలసివచ్చినందున విచారించుచుండెను. అప్పుడు మెక్లారిన్ గారీయనను దర్శించి యీలాగు ధైర్యపరచిరి; "థియోఫిలస్ గారూ, మీరు మీ కుంటుంబ విషయమై ఎక్కువగా విచారింపనవసరము లేదు. నేను ఇండియా దేశములో నున్నంతకాలమును నాకొక్క రొట్టెమాత్రమే మిగిలియున్నను అందునీకొరకు సగభాగమిచ్చెదను." ఆయన ఆస్పత్రిలో నున్నంత కాలమును ఆయనకగు ఖర్చులను దొరగారు భరించి కుటుంబఖర్చులగూడ కావలసిన ద్రవ్యసహాయము చేసి యెంతయో యాదరించిరి.
వెనుగుర్లలోని హిల్‌సైడ్ విశ్రాంతిపురము
(18-9-1937 - 28-3-1938)
16-9-37 వ తేదీన థియోఫిలస్ కాకినాడ నుండి బయలుదేరి 18-9-37 న వెనుగుర్ల చేరెను. ఈ ప్రయాణములో నొకయద్భుత సహాయమీయనకు దొరకెను. రైలుస్టేషను నుండి ఆస్పత్రికి సుమారు డెబ్బదిమైళ్ళ కారు ప్రయాణముచేయవలసి ఉండును. అది చాల కష్టమగు ప్రయాణము. ఆ సమయములో డాక్టరును తీసికొనిపోవుటకై ఆచోటికి వచ్చిన మోటారులో నీయనకు దైవికముగా స్థలము దొరికినందున బహుసురక్షితముగా దానిలో ప్రయాణముచేసి గమ్యస్థానము చేరెను.
వైద్యులు పరీక్షించి థియోఫిలస్ యొక్క ఊపిరితిత్తులలో నొకటి చెడిపాయెననియు, మరుసటిదినమున అందులకై శస్త్రచికిత్స చేయబడుననియు ఆయనకు తెలిపిరి. ఆవిపత్సమయమున తన్నాదరించునట్టి బంధుమిత్రులు లేక యేకాకియై యున్నందున ఆయన యెంతయో కృంగిపోయెను. ఈ సమయమున భక్తురాలయిన జూలియానా వ్రాసిన ధ్యానవాక్యము లీయన చేతికివచ్చెను. అందిట్లు వ్రాయబడియుండెను:
నీవు శోధింపబడవు, నీవు బాధింపబడవు, నీవు గాయపర్చబడవు, అని ఆయన చెప్పలేదు; నీవు జయింపబడవు అని మాత్రము సెలవిచ్చెను.
అప్పుడాయన దైవిక స్వస్థతనుగూర్చి ధ్యానింపదొడగెను, "క్రీస్తు కుష్ఠరోగినిముట్టగా నాతడు స్వస్థుడాయెను. క్రీస్తు పేతురు అత్తను తాకగా ఆమెను జ్వరము వెంటనే విడచెను. క్రీస్తు ఒక బాలికను చేయిపట్టి పిలువగానే ఆమె మృత్యువు నుండి సజీవురాలై లేచెను. క్రీస్తు తాకినందున ఆత్మపావనమగుట మాత్రమే కాక మృతులు సజీవులగుదురే."
యేసూ! శిలువ మూర్తీ! నా దినములు నీ చేతియందున్నవి; నా క్రూర పాపములు గాయపర్చిన నీచేయి, నా మార్గదర్శి; నేనమ్ముకొనిన నాయాశ్రయము.
క్రీస్తు యొక్క యత్యద్భుత శక్తిని గూర్చిన యీ ధ్యానములాయన విశ్వాసమును అధికముచేసెను.
దేవునితో ఆయన చేసిన విశ్వాసనిబంధన
పై ధ్యానము ఆయన ఆత్మను బలపరచగా ఈ దిగువ నుదహరించినరీతిని హబక్కూకు గ్రంధమందున్న వాక్యములను తీసికొని దేవునితో విశ్వాసనిబంధనను చేసికొనెను:-
"అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలీవ చెట్లు కాపు లేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొట్టెలు దొడ్డిలో లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించెదను నా రక్షణకర్తయైన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యోహోవాయే నాకు బలము ఆయన నాకాళ్ళను లేడి కాళ్ళవలె చేయును." హబక్కూకు 3:17-19
థియోఫిలస్ శస్త్రచికిత్స చేయబడుటకు ముందు ప్రార్థన పూర్వకముగా సిద్ధపడెను. తాను ప్రభువు సహాయమున తన హృదయమును పవిత్రపరచుకొని దైవచిత్తమైనచో తనకు శస్త్రచికిత్స చేయబడిన తరువాత జీవించి సేవచేయుటకు మరియొక తరుణము ననుగ్రహించుమని ప్రభువును వేడుకొనెను. "ఒకవేళ ప్రభువీయనను తనసన్నిధికి పిలుచుకొనినచో, ఆత్మరీతిని ఆయనను సేవించునట్టి కృపననుగ్రహించుమని కోరెను." తన కుటుంబమును దయాళుడగు పరమతండ్రి చేతులకప్పగించి వారిని కాపాడుమని దేవుని నత్యధిక భారమగు హృదయముతో బ్రతిమాలుకొనెను. తన ప్రియమైన చెల్లి కొఱకును, తన సోదరుని కొఱకును, వారి కుటుంబముల కొఱకును, స్నేహితులు, సెమినెరిలోని పాత నూతన విద్యార్థుల కొఱకును, దైవసేవ వృద్ధియగునట్లును ప్రార్థించెను.
నా దినములు నీ చేతి యందున్నవి నా దేవా; అవి యచటనే యుండుగాక! నా ప్రాణము, నా సన్నిహితులు, నా యాత్మ; సర్వము భవదీయార్పితమే!
21-9-37 తేదీన యీయనకు శస్త్రచికిత్స చేయబడెను. శస్త్రచికిత్స సమయమున ఓర్చుకొనుటకు తగినంత శక్తి ఆయనలో లేనందున చికిత్సానంతర మాయన జీవించి యుండుట చూచి వైద్యులే యాశ్చర్యపడిరి. చికిత్స జరిగిన తరువాత చాల దినముల వరకును మిక్కిలి బాధ ననుభవించుచు పడకపై నుండెను.
శ్రమలోనున్న వారి కొరకు ప్రార్థన
తాను శ్రమననుభవించుచున్నందున థియోఫిలస్ లోకములో శ్రమననుభవించుచున్న వారి నందరిని తలంచుకొని వారి నిమిత్తమై ప్రార్థించెను; "నా ప్రభువా! శ్రమపడు వారి కొరకు శ్రమపడుచు, శ్రమలోనుండి ప్రార్థించువారికి శ్రమనుసహించు బలము ననుగ్రహించుచుండు ప్రభువా, నా యెడల నీవు కనికరము చూపి నీ ప్రశాంతమగు సన్నిధిని నాకనుగ్రహించుము. బాధను భరించుటకు కావలసిన శక్తిని నాకు దయచేసి యద్భుత శక్తి గల నీ హస్తముతో ముట్టి నన్ను స్వస్థపరచుము. ఈ శ్రమలోనే నా హృదయమును విప్పి, నీ దివ్యమగు జ్ఞానవాక్యముతో నన్ను నింపుము. రాబోవు దినములలో నేను నీ ఉత్తమ సేవకునిగ నుండునటుల నా యనుభవమును నూతనపరచుము. బాధ, అన్యాయముననుభవించుచున్నవారిని, పేదరికములో నిబ్బందులు పడుచున్న వారిని కనికరించుము. మానవులు బాధననుభవించుట నీ చిత్తము కాదు గనుక లోకములో శ్రమ ననుభవించు వారందరును నీయందు నిరీక్షణ గలిగి బలవంతులగునట్లుగా చేయుము. నీ చిత్తము సంపూర్తిగా నెరవేరునటుల సమాధాన సంతోషములతో గూడిన రాజ్యమును ఈ లోకములో నెలకొల్పుము. క్రీస్తు నామమున యీ మనవిని సమర్పించు కొనుచున్నాను. ఆమెన్"
శ్రమలలో నన్నేల విడనాడితివి? నా దేవా? నారాజా! త్వరపడి రావే! మరణమా, నీవు నన్నుద్ధరింపకున్నచో; నాదేవా, నారాజా, త్వరపడి రమ్ము.
ఈ దినములన్నియు ఆయన కన్నీరుకార్చుచూ బాధపడుచున్నను దైవకృప ఆయన నేమాత్రము విడువలేదు గనుక సణుగుకొనకుండ శ్రమనంతటిని భరించెను. దేవుని మీదనే తన భారమునంతటిని వేసి ప్రార్థించినందున క్రీస్తుయొక్క సన్నిధి, ఆదరణ, ప్రేమ ఆయనతో గూడనుండెను.
కొన్ని దినములైన తరువాత పడకనుండి లేచి నడచుటకు ఆయనకు సెలవిచ్చిరి. మొదటి దినమున ఒక చిన్న కొండ నెక్కుటకు ప్రయత్నించి, కొంతదూరమేగి ఆయాస మధికమగుటచే అచట నిలచి, ఇటుల ధ్యానించెను; "జీవితములో ఉన్నత స్థితికి పోవుటకై చేయు ఏ యత్నమైనను, సాధింప తలచిన ఏ వాంఛయైనను, నెరవేర్చనెంచిన ఏ ఆశయ మైనను, కార్యసిద్ధి నొందవలసిన ఏ దర్శనమైనను, అధిగమించవలసిన ఏ ఆటంకమైనను సఫలపరచనెంచిన ఏ నిశ్చయత యైనను, సులభమైనది కాదు. ఇవి త్యాగసహితమైనవై యున్నవి. వీటిని నెరవైర్చుటకెంత సహనము అవసరము! అవరోహణ మతి సులభము ప్రవాహమున కెదురీదుట కష్టతరమైనను జీవమునకు సూచన. ప్రవాహముతో దిగువకు కొట్టుకొనిపోవుట నిర్జీవమునకు సూచన."
కృతజ్ఞతాస్తుతి
థియోఫిలస్ దేవుడు తనకు చేసిన మేళ్లను తలంచుకొని కృతజ్ఞతాస్తుతులను చెల్లించెను; "మరణచ్ఛాయ గల లోయలో నుండి నన్ను బయటికి పునర్జీవితుని జేసిన దేవునికి నేనెంత కృతజ్ఞుడను! ఈ దైవకార్య తలంపు నన్ను బహు దీనునిగా జేయుచున్నది. నాయంతరంగమా! ఆయన చేసిన కృపలన్నిటికిని, ఇంత వరకును నాకనుగ్రహించిన విశ్రాంతికొఱకును, ఆత్మీయోద్రేకమును కలిగించు పుస్తకములను, భక్తుల జీవిత చరిత్రలను చదువుకొను తరుణము నిచ్చినందులకును, శ్రమలో ప్రభువుని తోడ్పాటు కొరకును ఆయనకు స్తోత్రవందనములు చెల్లించుము." "ఓ దేవా! నీవు నాకనుగ్రహించిన ప్రియులందరి ప్రేమ కొరకును, వారి ప్రార్థనల ద్వారా నన్ను బలపరచుటకు నీవు నాకిచ్చిన స్నేహితులందరి కొరుకును, ఇతరుల కొరకు తమ జీవితములను సమర్పించుకొనిన వైద్యులు నర్సుల కొరకును, నాకు శ్రమలో నిచ్చిన నూతనానుభవముల కొరుకును, రెవ.జె.బి.మెక్లారిన్ దొరగారును, బాప్టిస్టు మిషవారును నాకనుగ్రహించిన విరాళములకొరకును, నూతనమైన అనేక స్థలమును చూచుభాగ్యము కొరకును, ఆత్మీయపోరాటములో నాకు కలిగిన జయముల కొరకును, నీకు నా హృదయ పూర్వకమైన స్తుతులను సమర్పించుచున్నాను."
"యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా! యెహోవాను స్తుతింపుము నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను." (కీర్తనలు: 46:1, 2) నా విమోచకుని స్తుతిని ప్రచురించుటకు నా దివ్య చక్రవర్తి మహిమను ప్రస్తుతించుటకు ఆయన కృపావిజయములను ప్రచురము జేయుటకు వేయినాలుకలున్నచో నేనెంత ధన్యుడను!
దైవసేవను గూర్చిన నిబంధన
మరియొకసారి దైవసేవకొరకు థియోఫిలస్ తనజీవితమును సమర్పించుకొనెను; "ఓ నా దేవా! పవిత్రమైన జీవితమునిచ్చి నన్ను నమ్మకమైన సేవకునిగ చేయుము. పూర్ణారోగ్యమను గ్రహించి నన్ను నీ సేవలో వాడుకొనుము. ప్రభువా! నాకు కలిగినదంతయు నీకు కృతజ్ఞతతో సమర్పించి, నా హృదయ పూర్వకముగా నిన్ను ప్రేమించి, మునుపటికంటె నిప్పుడు మరియెక్కువగా జీవితాంతము వరకును సేవించునట్టి భాగ్యమును గ్రహించుము. దేవా! నీకుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క నామము కొఅకై నేను మరల సమర్పించుకొనుటకు గాను ఆయన సారూప్యమును నాకిమ్ము. అనేకమైన సంఘములును, స్నేహితులును, నాయందుంచిన నమ్మికకు తగినట్లుగ సేవించుటకు కావలసిన శక్తి ననుగ్రహించుము."
ఈ శ్రమానుభవములో నూతనమైనట్టియు, పరసంబంధమైనట్టియు, గొప్పసేవా ఉద్యమములు ఆయన హృదయములో నుద్భవించెను. ఒక మానవుడు దుర్బలుడై చావసిద్ధముగ నున్నను దైవకార్యముల యెడల అతనికి కలిగిన ఆసక్తియే కదా అతని జీవింపజేయును!
వైద్యశాలలో సేవ
కొంచెము బలము చేకూరిన పిమ్మట ఆయన రోగుల మధ్యను క్రీస్తుని గూర్చి ప్రకటింప నారంభించెను. క్రైస్తవేతరులగు రోగులు మత సంబంధమైన అనేక చిక్కుప్రశ్నలకు జవాబుల నాయన నడిగి తెలసికొన గోరిరి. అదృష్టము, మానవుని జీవితమున దేవుని పూర్వ నిర్ణయము, దైవచిత్తము, మొదలగు ప్రశ్నలాధారముగ దీసికొని వారితో మాట్లాడి చివరకు క్రీస్తే దేవుడని వారితో ఒప్పించుచుండెడివాడు. ఆస్పత్రిలో శ్రమ ననుభవించుచున్న రోగుల సహవాసము నందు బహుగా ఆనందించెను. వారందరిని తన స్నేహితులుగ జేసికొనెను. 'నూతన జీవితము' అను ఆరోగ్య మాస పత్రిక నొకదానిని ప్రకటించుట కీయన ప్రారంభించెను. 'నూతన జీవితము' నకు థియోఫిలస్ ముఖ్య సంపాదకుడుగ నెన్ను కొనబడెను. "దేవుడేమైయున్నాడు" "దేవుని రాజ్య వ్యాప్తి" "నా జీవితయాత్ర" మొదలగు యంశములను 'నూతన జీవితము' లో నీయన ప్రచురించెను.
సర్వజ్ఞానియైన దేవుడు తన యత్యధిక కృపనుబట్టి థియోఫిలస్ యొక్క శ్రమకాలమున వినయము, ఓర్పు మొదలగు అనేక దివ్యలక్షణములనిచ్చి తనప్రియమైన సేవకునిగ మార్చుకొనెను. 28-3-1938 న, ప్రభువు సేవకొఅకై హృదయపూర్వమగు నూతనవేశముతో నిపంబపడి తన రాకకై వేచియు వివిధ కార్యభారములను వహించుటకు ఆస్పత్రి నుండి యిల్లు చేరెను.
రమ్ము, మరియొకమారు యాత్ర నారంభింతము; రమ్ము, ఆ శృంగార చిత్తమును సంతసమున నెరవేర్తము; నిరీక్షణాధారమగు సహనము, ప్రేమపూరిత పరిచర్య మనలోని తలాంతులను వికసింపజేయును.
ఓ యువజనమా! నిన్ను నేనెట్లు ఆకర్షించగలను
నీతో మాటలాడి నీవు వినునట్లు జేయగలనా?
నీ కండ్లను విప్పి నన్ను నీవు చూడగల్లునట్లు చేయగలనా?
నా సన్నిధి నిన్ను ఆకర్షింపగలదా?
గ్రహింప సంసిద్ధమైన హృదయముగల
ప్రవక్తయొకడు మీమధ్య నున్నచో
వరర్ధిల్లుచున్న నా మహిమను అతడు గమనించునట్లు
అతనికి నా మర్మములను విదితము చేసెదను;
అన్వేషణమును, గమ్యమునునేనే,
నేనే దేవుడను, నేనే తండ్రిని;
అతని హృదయముతో నేసంభాషించునట్లు
మీలోనొక ప్రవక్తయున్నాడాయని వెదకుచున్నాడు.
యువకుల మధ్య సేవ చాల యుపయుక్తమైనదని ఆయనకెక్కువ విశ్వాసము కలదు. ఏ వ్యక్తి యైనను తన జీవితమునంతటిని వినియోగించి యువకుల మధ్య సేవచేసినచో నది నిష్ప్రయోజనము కాదనియు, తగినకాలమందు ఫలము చేకూరుననియు ఆయన నమ్మెను. ఆయన స్థానిక ఆదివారపు బడులను ప్రోత్సహించెను. మరియు ఆదివారపు బడుల వార్షికోత్సవములను జరిగించెను. హిందూ దేశమంతటిలోగల సబ్బాతుబడులలోని విద్యార్థులకు పరీక్షాధికారులలో నొకనిగ నుండి తన కార్యమును నిర్వహించెను.
అఖిల భారత క్రైస్తవయత్న మహాసభ
అధ్యక్షుడు (1939-1941)
ఆ కాలమున కాకినాడలోని వివిధ సంఘములలోను బడులలోనున్న క్రైస్తవయత్న సమాజములలోని పని నీరసమాయెను. అప్పుడు థియోఫిలస్ బహు శ్రద్ధవహించి ఒక్కొక్క సమాజమును దర్శించి, పునర్జీవింపజేసి ఆ సమాజములన్నియు కలసి ఐక్యసభల నప్పుడప్పుడు జరిగించెడి యవకాశములను కల్పించెను. యౌవనస్థులు తమ వ్యక్తిత్వ విలువను గ్రహించునట్లును, పవిత్రజీవితము సార్థకమగునట్లును, వారి భావిజీవితముకొరకు బాల్యమునుండియే వారికుండవలసిన ముఖ్యలక్షణములను వృద్ధిచేసికొనునట్లును వారిని నడిపించెను.
దైవవాక్యపఠమువల్లను, సత్క్రైస్తవ సహవాసము వల్లను భక్తుల ఉపన్యాసమువల్లను యువకులజీవితము నూతన పరచబడెను. బాలబాలికలు క్రీస్తుతో సహవాసముగలిగి జీవించుటయు, వారు క్రీస్తువలెనె సత్కార్యములు చేయుటయు, యీ యత్నముల యుద్దేశములు. కాకినాడలోని ప్రతిసమాజమును వారమునకొకసారి సమావేశమై కూటమును జరిగించునట్లు వీరు ప్రోత్సాహము నిచ్చుచుండిరి.
ఈ సమాజముల వార్షికోత్సమే ప్రధమమున కాకినాడలో జరిగినప్పుడు ఇతర స్థలముల నుండియు రాయబారులాహ్వానింపబడిరి. ఆ సమయమున సమావేశమైన యువకుల సంఖ్య సుమారు ఆరువందలు. ఆ కూటములు బహుజయకరముగ జరుపబడెను. ఆ సమాజమునకు ఆయన అధ్యక్షులుగ యుండి సభను జరిపించిరి. ఆ సమయమున "దేవుని నెరిగిన యువకులు బలవంతులును, ఘనకార్యములను చేయువారునైయుందురు" అను అంశముపై ఆయన గంభీరోపన్యాసము నిచ్చెను. ఆ ప్రసంగము వలన యువకులెందరో యుద్రేకింపబడిరి. క్రైస్తవ యువజన సంస్థలు అప్పటినుండియు సంఘ కార్యక్రమములో ప్రాముఖ్యత వహించెను. 1934 వ సంవత్సరములో థియోఫిలస్ క్రైస్తవయత్న సమాజకులు నిపుణతతో పనిచేయుగలుగుటకై క్రైస్తవ యత్న సమాజపు దేశీయ నాయకులేర్పాటు చేసిన యొక యుత్తమ పరీక్షకొఅకు ప్రత్యేకముగ చదివి, వ్రాసి, దానియందుత్తీర్ణుడాయెను. అందువలన ఆయనకు క్రైస్తవయత్న సమాజములను స్థాపించుట యందలి జ్ఞానము, నిపుణతయు, అనుభవములోనికివచ్చెను. ఇతరులను తర్బీదుచేయు ఉపాధ్యాయులు తామే మొదట తగిన తర్బీదు పొందవలెననునది ఆయన ధృఢమైన నమ్మికమైయుండెను. ఈ సమయమున థియోఫిలస్ ఒక నాయకుడును, మార్గదర్శియునైయుండినను, తనసేవలో సమర్ధత గలిగియుండుటకై యొక విద్యార్థివలెనే సిద్ధపడుచుండెడివాడు. ఉత్తమ విద్యార్థియే ఉత్తమమగు ఉపాధ్యాయుడు కాగలడు.
1939 వ సంవత్సరమున తూర్పుగోదావరి జిల్లాలోని క్రైస్తవయత్న సమాజములనన్నిటిని ఐక్యపరచి ఒక మహాసభ నేర్పాటుచేసెను. పర్యాయములు చెన్న రాష్ట్రములోని క్రైస్తవయత్న సమాజముల సమావేశమునకు అధ్యక్షుడుగా నుండెను. యువకులాయన నెంతయో ప్రేమించి గౌరవించేడివారు. 1938 వ సంవత్సరమున వెనుగుర్లలోని క్షయరోగుల శరణాలయము నందు ఈయన వ్యాధిగ్రస్థుడై ఉండగా నర్సారావుపేటలో నున్న క్రైస్తవయత్న సమాజపు వారు ఎనిమిది రూపాయలు ఈయనకు వారి ప్రేమ సూచనగా పంపిరి.
ఇండియాలోని క్రైస్తవయత్న సమాజపు త్రిమాస పత్రికలో యువకుల కత్యుపయుక్త ములగు వ్యాసములను ఈయన వ్రాసెను. అట్టివ్యాసములలో ముఖ్యమైనవేవనగా: 'ప్రతివ్యక్తికిని క్రీస్తుకు నుండవలసిన సంబంధము', 'దేవుడెక్కడనున్నాడు?' 'అసమానుడైన క్రీస్తు', 'జీవించు చున్న క్రీస్తు' 'దేవుని రాజ్యము'. ఈ అంశములను చర్చించుట ద్వారా యువకుల హృదయమున క్రైస్తవ విశ్వాసమును స్థిరపరచెను.
ఆయన రాజమడ్రి విశ్రాంతిపురములో క్షయరోగ పీడితుడై యున్న సమయమున, కాకినాడలో క్రైస్తవయత్న సమాజపు మహాసభయొకటి జరిగెను. అంతబలహీనుడై యున్నప్పటికిని ఉన్నతాశయములతో కూడిన యీ సమాచారమును వారికి తంతి ద్వారా పంపెను:-
క్రీస్తునే యెంచుకొనుడి; ఆయన కార్యర్ధమే మీ ప్రాణము ధారవోయుడి: ముందుకు సాగిపోవుడి
థియోఫిలస్ తనపట్టణములోను, జిల్లాలోను, రాజధానిలోను ఉన్న క్రైస్తవయత్న సమాజముల మధ్యచేసిన ఘనమగు సేవను గుర్తించి, ఇండియా, బర్మా, సింహళపు సమాజములు వారాయనను తమ అధ్యక్షునిగ నెన్నుకొనిరి. ఈయన ఇట్టి గొప్ప అధిక్యతను వహించిన నమ్మకమగు సేవనుచేసి, గౌరవపాత్రుడాయెను. ఇట్లు అధ్యక్షుడుగనున్న సమయమున దేశములోని సర్వసమాజముల వారికి యీ దిగువ వర్తమానము పంపెను.:-
సంధిగ్ధములలో సహాయపడు క్రీస్తు
"మానవకోటి మానసిక స్థితిని నాగకరికతను జీవితోద్ధేశమునుక్రీస్తు సందేశము బహుగామార్చెను. ఈ లోకములో మానవుని జీవితమును యే మానవుడైనను మానసికముగ ఆధ్యాత్మికముగ వృద్ధిచేయగలిగినట్లు చరిత్రయందు కాన్పించదు. అయితే నవీనప్రపంచము, మానవునకు గ్రాహ్యమగు గూఢసమస్యలతో నిండియున్నది. ప్రస్తుత ప్రపంచ పరిస్తితుల నెదుర్కొనచేయుటకు క్రీస్తు సమర్ధుడా? అని అనేకులు ప్రశ్నింతురు. మన సంధిగ్దములన్నిటిలోను క్రీస్తునందే సహాయము లభించునని మన దృఢవిశ్వాసము. ఏలయన దేవుడు పరిశుద్ధుడనియు, ప్రేమ పూర్ణుడనియు, కార్యసాధకుడనియు, మనకు తండ్రియనియు, ప్రేమ పూర్ణుడనియు, కార్యసాధకుడనియు, మనకు తండ్రియనియు, మానవులెల్లరును సోదరులనియు, ప్రభువగు క్రీస్తు మనకు బయలుపరచెను. లోకమున దేవుని రాజ్యమును స్థాపించు కార్యక్రమమును క్రీస్తే మనకు చూపించెను. అదియును గాక క్రీస్తునరావతారుడైన క్రీస్తుగా మాత్రమేగాక నేటికిని మన మధ్య సజీవుడైయున్నట్లుగా మనము కనుగొనుచున్నాము. మొదటి శతాబ్దములో తన శిష్యుల జీవితమున అన్యోవ్యతతో ప్రత్యక్షుడైన క్రీస్తే యీ దినములలోను మనయనుభవములలో కూడను ప్రతిఫలించుచున్నాడు.
మానవులు తిరిగి క్రీస్తును ప్రేమించుట ద్వార ఆయనను హృదయవాసిగా చేసికొనవలయును. అప్పుడు ఆయన చిత్తము నెరవేర్చుట వలన స్థాపింపబడిన ఆయన రాజ్యము యదార్థమైనదని మనము గ్రహింతుము. సర్వమానవులు క్రీస్తును ఆత్మనాధునిగ నెన్నుకొని తమ జీవితములను గృహములను, తమదేశమును ఆయనకు సాధనము చేసినయెడల క్రీస్తు లోకములోని సర్వరాజ్యములకును ఏలికయగును. ఈ దినములలో కూడా క్రీస్తు మనకు అందుబాటులో నున్నాడను విషయమే మన అనుదిన జీవితములో నొక విశేషము. క్రీస్తు తన మైత్రి వలన మనబలహీనతలను తీసివేసి, ధైర్యవంతులుగను పరిశుద్ధులుగను. మంచివారినిగను మనలను మార్చగలడు. క్రీస్తునందే మనకు చివరగా నిరీక్షణ దొరకుచున్నది. ఏలయన మనక్లిష్ట పరిస్థితులనిన్నటిలోను మనలను దరిజేర్చుటకు క్రీస్తే సమర్థుడు. క్రీస్తే మనకు సర్వములో సర్వమై యున్నాడు.
విద్యార్థి క్రైస్తవోద్యమము
థియోఫిలస్ కళాశాలలో నుండు విద్యార్థుల ఆత్మీయజీవితములను వృద్ధిచేయు కార్యములన్నిటి యందును యెక్కువ శ్రద్ధ వహించెను. క్రిస్మస్ పండుగ సమయమున నొక సభలో పాల్గొనిన కళాశాల విద్యార్థులతో ప్రసంగించుచు నిట్లనెను: "మీరందరును ప్రభువుకొఱకు మీ హృదయములను సమర్పించుకొనిన యువతీయువకులయినచో మనము ప్రభువు సేవ ఎంత శక్తివంతముగ జేయగలుగుదుము!" 1939 వ సంవత్సరము ఆంధ్రదేశములోని కళాశాలలో నుండు క్రైస్తవ విద్యార్థుల సమాజమునకు అధ్యక్షుడుగ నీయన యెన్నుకొనబడెను. అధ్యక్షుడుగ నుండి విద్యార్థుల ఆత్మీయజీవితము విషయమై బహుగా పాటుపడెను. కళాశాలలోని క్రైస్తవ విద్యార్థులు సాధారణముగ క్రైస్తవజీవితము యెడలనిర్లక్ష్య భావమును చూపుచుందురు. క్రైస్తవ విశ్వాసమె దృఢముగ లేనందున వారి ఆధ్యాత్మిక జీవితమున అనేక చిక్కు సమస్యలు బయలుదేరును. క్రైస్తవ్యమును గూర్చిన జ్ఞానము చాల తక్కువగా నుండుటచేతను మతసంబంధమగు తర్ఫీతు సరిగా లేనందునను, వారికి ఆత్మీయజీవితము నందయిష్టత కలుగును. నాయకులు ఇతర సమస్యలతో పాటు ఈవిషయమును కూడ సరిచేయ వలసియున్నది.
1939 వ సంవత్సరమున విద్యార్థుల సమావేశము బందరులో నేర్పాటుచేయబడెను. థియోఫిలస్ పైన వివరించిన లోటులను సరిచేయుటకై ఆ సంవత్సరము "ప్రభువా! నేను క్రైస్తవునిగనుండగోరుచున్నాను;" అను మూలాంశమును సభలకై ఉండుటచేత ప్రతివారి జీవితమునకును, ఒక యొడంబికగను ఉండుటచేత ప్రతివారి జీవితమునకును చాల యుపయోగకరముగ నుండెను.
ఆ మూలాంశము నీక్రింది ధ్యానాంశములుగ విభజించిరి ప్రభువా!
నా హృదయమున క్రైస్తవునిగ నుండగోరుచున్నాను; నా గృహమున క్రైస్తవునిగ నుండగోరుచున్నాను; నా సాంఘిక జీవితమున క్రైస్తవునిగ నుండగోరుచున్నాను; నా మితృబృందముమధ్య క్రైస్తవునిగ నుండగోరుచున్నాను; నా వృత్తిలో క్రైస్తవునిగ నుండగోరుచున్నాను; రాజ్యాంగ విషయములలో క్రైస్తవునిగ నుండగోరుచున్నాను; నా సంఘములో క్రైస్తవునిగ నుండగోరుచున్నాను.
సమర్థులగు క్రైస్తవనాయకులీయంశములపై ప్రసంగించగా ఒక నూతన వాతావరణ మేర్పడి సభకు వచ్చిన యువకుల హృదయములు వికసించెను.
థియోఫిలస్ తన అధ్యక్షోపన్యాసములో 'క్రైస్తవుడు' అను నామమునకు మూలమును దాని ప్రాముఖ్యతను వివరించి చెప్పెను. క్రైస్తవుడనగా పరిశుద్ధ జనాంగముగను, రారాజు యొక్క యాజకుడుగను నుండుటకు పిలువబడి దైవాత్మ చేత అభిషేకింపబడి, క్రీస్తు అడుగుజాడలను వెంబడించువాడని అర్థము.
క్రైస్తవుడని దేనినిబట్టీ మనము గుర్తింపగలము? ఒకడు క్రైస్తవుడని చెప్పుటకు మూడు ప్రబల నిదర్శనములు గలవు. మొదటిది, సిలువవేయబడి పునరుత్థానుడై సజీవుడుగానున్న క్రీస్తునందలి (రక్షణార్థమగు) విశ్వాసము; రెండవది, యేసుక్రీస్తు యొక్క చిత్తమునకు సంపూర్ణ విధేయత; ఎందుచేతననగా 'ప్రభువా, ప్రభువా అని నున్నుపిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నాతండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును'. మూడవది క్రీస్తు యెడల మనకుండవలసిన ప్రేమ. ఎందుచేతననగా క్రీస్తు యెడల మనకు కలిగిన ప్రేమయే యీలోకములో దేవుని రాజ్యమును మనము స్థాపించుటకు సాధనమైయున్నది. మానవుల యెడల మనకుండవలసిన ప్రేమయే మన జీవితమూల సిద్ధాంతము.
మరియొక విధముగ చూచినయెడల ఒకడు క్రైస్తవుడని నాలుగు విషయములు ఋజువుచేయును. విశ్వాసమూలమున నొకడు క్రైస్తవుడనబడును; జీవిత విధానమును బట్టి ఒకని క్రైస్తవుడని ఋజువు చేయనగును. శ్రమానుభవమును బట్టి క్రైస్తవుడని దృఢపరచనగును. క్రీస్తునందలి ఒకని మరణమును బట్టి కూడ క్రైస్తవుడని సాక్ష్యమియ్యగలము. అల్ప సంఖ్యాకులు అగుటచే హిందూ దేశమున క్రైస్తవులకు పలుకుబడి తక్కువగా నున్నది. అయితే క్రీస్తును బట్టి సాంఘిక ఆధ్యాత్మిక జీవితమునందు మనమొక బలమైన జనాంగముగ మార్చబడవలయునన్న సవాలు మన యెదుటనున్నది. హిందూ దేశమున మనము క్రీస్తుకు ప్రతినిధులముగ నున్నాము. క్రైస్తవేతరులు మన విషయమై ఒకప్పుడు చెప్పినదేమనగా "క్రైస్తవ మతము సత్యమైనదికాదు"; కొంతకాలము గడచిన తరువాత వారు చెప్పినదేమన, "క్రైస్తవమతము క్రొత్తదికాదు"; అయితే యిప్పుడు వారు చెప్పుచున్నది, "క్రైస్తవ మతమనగా మీరు కారు!"
థియోఫిలస్ తన ప్రసంగము నీదిగువ మాటలతో ముగించెను. 'క్రైస్తవులమైన మనమీద వేయబడిన యీ సవాలెంత గొప్పది! క్రైస్తవుడనగ నెట్టివాడై యుండవలెనో యాలోచించుడి! ఈ దినములలో మనమీరీతిగా నిజమగు క్రైస్తవులుగనుండగలమో లేదో మన జీవితములను పరిశీలించుకొనుటకై దైవాత్మ మనకు సహాయము చేయునుగాక! క్రైస్తవ జీవితము జీవించుటకు మనము సమర్పించుకొందుము. ఈ శ్రేష్ఠమైన ప్రసంగము వలన థియోఫిలస్ కళాశాల విద్యార్థులను జీవింపజేసెను. ఈ సభ ఫలితముగ క్రైస్తవ విద్యార్థులు: (1) ఆత్మీయ జీవితమున మేల్కొలుపబడిరి. లోతైన అనుభవములోనికి నడిచి వెళ్ళిరి. (2) వారి సహాధ్యాయుల మధ్య క్రీస్తు కొఱకు మంచి సాక్ష్యమీయ ప్రోత్సహింపబడిరి.
ప్రభువు తన కృపతో ఆ కూటములలో ప్రాముఖ్యమగు సాధనముగ వాడుకొనినందున థియోఫిలస్ కడుదీనుడై యచట నుండి స్వగృహమునకు చేరెను. ఆ కూటముల నీయన అధ్యక్షుడుగ నుండి నడుపుటలో కలిగిన నూతనానుభావము పొందెను.
"అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించునప్పుడు సువార్తయందు నాకున్న యధికారమును పూర్ణముగ వినియోగపరచుకొనకుండ సువార్తను ఉచితముగ ప్రకటించుటయే." (1 కొరంథీ 9:18)
దేవునికి సమీపంగా ఉందామని,
ప్రజలకు తద్వారా దేవునివాక్యం అందిద్దామని,
ఆస్టర్లీటి గ్రామ సంఘాధ్యక్షుడు గుడి గోపురం మీద బసచేశాడు.
పరలోకం నుండి వర్షించాయని తాననుకొన్న తలపులను కొన్ని ప్రసంగరూపాన పొందుపర్చి క్రింద నుండు ప్రజల మధ్యకి విసరుచుండువాడు దినానికి రెండుసార్లు,
ఆ కాగితాల్ని ఒకనాడాతనిని భగవంతుడు సంబోధించి "క్రిందికి దిగి,
ప్రాణదానం చెయి" అన్నాడు.
"ప్రభూ! ఎక్కడ ఉన్నా వని" ప్రశ్నించాడు పాదిరి,
ఉద్ఘాటించాడు ప్రభువు,
"క్రింద ప్రజలమధ్య" అని.
థియోఫిలస్ ఉచిత సువార్త సేవకులను తర్ఫీదు చేయుట అగత్యమని గ్రహించెను. ఏలయన గ్రామసంఘములలో నట్టి యుద్యమమునకు తగిన తరుణమాసన్నమాయెను. గ్రామాదులలోని యుపాధ్యాయుల ద్వారా యీ దినములలో సువార్త సేవచేయుట కష్టమయ్యెను. అందుచే థియోఫిలస్ క్రైస్తవ లేమెన్ హృదయములలో నీ సువార్త సేవయొక్క యగత్యతను గూర్చి నాటనటుల సకల యత్నములుచేసెను. 'లేమన్' అనగా "మిషనులో గాని, సంఘములో గాని వేతనమును పొందు యేయుద్యోగములోను లేనివారు", అని ఆయన నిర్వచనము.
సువార్తసేవ సంఘముయొక్క విధ్యుక్తధర్మమని ప్రభువు సెలవిచ్చియుండగా యీకార్యము వేతనములు పొందుచున్న మిషనరీ వారియొక్కయు క్రైస్తవ బోధకులయొక్కయు పనియని అనేకులు భావించుచున్నారు. అందుచేత రానురాను అతిస్వల్ప సంఖ్యాకులు సంఘములో చేరుచున్నారు. కాన సంఘములలో సభివృద్ధియెక్కువగాలేదు. ఈతప్పు అభిప్రాయమును సరిచేయుటకును, సంఘములే సువార్తసేవకు క్రేంద్రములని దృఢపరచి లేమెన్ ద్వారా నీ ఘనమగుసేవను వృద్ధిచేయుటకు ఆయన పూనుకొనెను.
ఉచిత సేవకుల సంస్థ: ఉద్దేశములు, అవకాశములు
బాప్టిస్టుమిషను యొక్క తెలుగు ఒరియా కౌన్సిలులో యుచితసేవ యొక్క గొప్పవిలువను దీర్ఘముగ నాలోచించి 1941 వ సంవత్సరములో కొన్ని తీర్మానములను జేసిరి. అవి యీ యుద్యమము యొక్క యుద్దేశములను వ్యక్తపరచుచున్నవి:- "గ్రామ క్రైస్తవుల జనాభావృద్ధియగుచున్న కొలది వారి ఆత్మీయ అక్కరలుకూడ అభివృద్ధి జెందినవి. అయితే యీ అక్కరలను తీర్చుటకు సంఘకాపరి మాత్రమే క్రైస్తవులను క్రమముగా పలుమారు దర్శించుటకవకాశము లెక్కువగా లేవు. సంఘకాపరులును, క్రైస్తవ నాయకులును చేయదగిన నానావిధములైన సువార్తసేవ యెక్కువుగ నుండుట చేత ప్రభుసేవకు గ్రామ క్రైస్తవులనందరిని ఉద్యుక్తులనుగా చేయుటలో అగత్యత యొక్కువాయెను. ఉచిత సేవకు తర్ఫీదు పొందు క్రైస్తవ నాయకులు బైబిలును బాగుగ నేర్చుకొనుటకును, క్రైస్తవ సహవాసమును కలిగియుంటకును, చక్కని సదుపాయములీయుద్యమమునందేర్పాటు చేయబడెను. ఉచిత సేవకులను తర్ఫీదు చేయుటచేనికంను అనేకమైన మేళ్ళున్నవి. అందుచేత అన్ని పొలములును ఉచిత సేవకులకు వేదపఠనశాలలను స్థాపింపవలెనని యిందుమూలముగా మేము ప్రోత్సహించు చున్నాము."
ఉచిత సేవకులను నడిపించగల శక్తిసామర్థ్యములును తెలివితేటలును, సత్ప్రవర్తనయు గల క్రైస్తవులే యీ ఉచిత సేవలకు తర్ఫీదు చేయబడుటకు ఎన్నుకొనబడుదురు. వారు చదువను, వ్రాయను శక్తి కలిగి యుండవలయును. ఆత్మీయ అనుభవము గల యిద్దరు నాయకులైనను వీరికి తర్ఫీదునిచ్చు కాలమున అనగా 8 లేక 10 దినములు పూర్తిగ వారితో కూడ నుందురు. వారందరును ఒకే కుటుంబము వలె ఒక చోటనే భుజించి ఒక్క చోటనే బసచేయుదురు. ఈ బడిలో పదిమందికి తక్కువలేకుండను ఇరువది మందికి యెక్కువ కాకుండను విద్యార్థులు చేర్చుకొనబడుదురు. ఏలయన అల్పసంఖ్యాకులున్నచో నిరుత్సాహము కలుగును. అధిక సంఖ్యాకులైనచో నాయకులా విద్యార్థులలో నొక్కొక్కరితో సంభాషించి సహాయము చేయుటకు గాని వారితో నన్యోన్యసహవాసము కలిగియుండుటకు గాని వీలుండదు.
ఉచిత సేవకుల వలన ఫలితములు
తర్ఫీదు చేయబడిన సువార్తికుల వలన కలుగు ఉపయోగములు మెండు. థియోఫిలస్ తన యొద్దకు వచ్చిన సేవలకు నెంతయో ప్రేమించుటచే వారు సత్ క్రైస్తవానుభవము కలిగి తమ జీవితములను ప్రభువునకు సమర్పించుకొనెడివారు. 1940 నుండి 1942 వరకు నీ రెండుసంవత్సరములలో సి.బి. మిషనంతటిలోను 13 బైబిలుబడులు వీరికొఱకేర్పాటు చేయబడెను. అందు 206 గురు సేవకొఱకు తర్ఫీదు చేయబడిరి. రెండు సంవత్సరములలో బైబిలు బడుల వలన లభించిన మంచి ఫలితములు ఇట్లు వివరింపబడినవి.
"తర్ఫీదు కొఱకు వచ్చిన వారి జీవితములు మార్చబడెను. వారి సాక్ష్యముల ద్వారా యితరులను ప్రభువు దగ్గరకు ఆకర్షించుచుండిరి. కుటుంబారాధనలు జరుపుచుండిరి. కొందరు సబ్బాతుబడులలో నుపాధ్యాయులుగ నుండిరి. మరికొందరు సంఘాభివృద్ధికై యెక్కువ కృషిచేయుచుండిరి. కొందరు వయోజనులకు చదువును, వ్రాయుటను నేర్పుచుండిరి. మఱికొందరు మిషను పనివారు లేని గ్రామాదులందు సంఘారాధనలను జరిగించుండిరి. కూలి వల్ల జీవించు అబ్రహామను క్రైస్తవుడీ తర్ఫీదు నొంది దక్షిణ కాకినాడ పొలములో నొక గ్రామమందు పన్నెండుమందిని ప్రభువుతట్టు నకాకర్షించెను. అతడిపుడు యుద్ధసంబంధమగు కార్మికుడుగ నుండినను ఇంకను ప్రజలను క్రీస్తుకొఱకు సంపాదించుచునేయున్నాడు. మంగలి వృత్తి వలన జీవించు నాగన్నయనునతడు ఒక్క వారములోనే మేమెన్నో సంవత్సరములు కృషిచేసి సంపాదించలేని ఒక యువకుని బాప్తిస్మమునకు సిద్ధపరచి తీసికొనివచ్చెను. కృష్ణా జిల్లాలో నొక ప్రాముఖ్యమగు సంఘమందు ఒకడు పార్టీతత్వమును విడిచి సబ్బాతుబడిలో వయోజనులకు పాఠములు చెప్పుచున్నాడు. పారా మరియమ్మను గాజులమ్ముకొని జీవించు క్రైస్తవురాలు చాలాకాలము వఱకు నిర్జీవస్థితిలోనున్న తన గ్రామములో నిరువదిమందికి బోధించి బాప్తిస్మ మిప్పించెను. ఇట్టి సాదృశ్యములు మరికొన్ని కలవు. చాలామంది మిషనెరీలు, సంఘకాపరులు, నాయకులు ఈ ఉద్యమము యొక్క విలువను గ్రహించి దీని పురోభివృద్ధికై దోహదమిచ్చు చున్నారు. పరిసరములలోని యితర మిషనులలోని సంఘముల వారును ఈ యుద్యమము యొక్కశ్రేష్ఠతను గమనించి దీనివైపున కాకర్షింపబడిరి".
ఉచిత సేవకుల ఉద్యమము యొక్క భవిష్యత్తు
ఉచిత సేవలకు తర్బీదు మహాసభయొక్క కార్యక్రమములలో నొకటిగ నేర్పాటు చేయబడుట వలన నీయుద్యమము యొక్క భావిస్థితి స్థిరపరచబడెను. ఇదియు గాక సంఘాభ్యుదయమునకై పూచీ వహించి సంఘకార్యక్రమములలో పాలుపొందుటకు మహాసభలోని ఆయా సమితులు, కార్యవర్గముల యందు వీరిని సభ్యులుగ నెన్నుకొనుట వలన లేమెన్కు సంఘకార్యముల యందు నుత్సాహము బాధ్యత అధిక్యత హెచ్చెను.
పఠనశాలల విజయము యొక్క రహస్యము
కెనడాలోని సి.బి. మిషన్ ఫారిన్ బోర్డు సర్వీయ కార్యదర్శియగు డాక్టరు హెచ్.యి.స్టిల్ వెల్ దొరగారు థియోఫిలస్ చేసిన సేవలలోని లెమన్ బడుల స్థాపన విషయమీ క్రిందివిధమున నభినందించెను: "ఉచిత సేవలకులు చేయు సువార్తసేవలు ప్రబలముగ సాగుచున్నదని వినుటకు నేనెంతయో సంతసించుచున్నాను. నేను చాలాకాలము క్రిందటనే ఉచిత సేవకులు ఉద్రేకముతో నుద్యమింపనిదే హిందూ దేశమంతటను క్రీస్తు సువార్తను చాటుట దుర్లభమని తలంచితిని. స్వదేశీయుల వలన ఉచితముగా చేయబడు యిట్టి సేవలయే బలమైనదని యీ యుద్యమము ద్వారా మీరు దృఢపరచినందున మీ కెంతయో కృతజ్ఞుడనై యున్నాను."
"తెలుగువారి మధ్య" అనగా సి.బి.యం. నివేదికలో రెవ. జాన్హార్టుగారిట్లు వ్రాసిరి: "ఇండియా దేశ సంఘములో నున్న గొప్పలోటేదనగా, క్రైస్తవులు క్రీస్తు కొఅకు సాక్ష్యమియ్య కుండుట. ఈ లోటును ఉచిత సువార్తసేవకులను తర్బీదు చేయు యుద్యమము సరిచేయుటయేగాక యీక్లిష్ట పరిస్థితులలో స్వల్ప వేతనములతో పనిచేయు సువార్తికులకు తోడ్పడి, క్రీస్తురాజ్యాభివృద్ధికై పాటుపడుటకు ఇందుమూలమున నొక నూతన మార్గమేర్పడెను." డాక్టర్ గోర్డన్ బార్స్ దొరగారు తన యభిప్రాయము నిట్లు వెలిపుచ్చిరి: "తమ స్వగ్రామములలో స్థిరమైనట్టియు శక్తివంతమైనట్టియు సువార్తసేవలను చేయుటకు సామర్థ్యము గల యీ ఉచిత సేవకులను తర్బీదు చేయు యుద్యమమే చాలా శ్రేష్ఠమైనది. ఇట్టి యుత్తమ సంస్థ వేరొకటి మన మిషనులో నిదివరలో నెన్నడును లేదు."
థియోఫిలస్ యీ బడులను గూర్చి యిట్లునునుచుండిరి "హిందూ దేశములో క్రైస్తవ సంఘములను స్థిరముగ స్థాపించవలెననెడు దూరదృష్టి గల నాయకులయొక్క కర్తవ్యమేమనగా వారు తమ కాలమును శక్తి సామర్థ్యములను వినియోగించి గ్రామ క్రైస్తవులు తీరుబడిగనున్న కాలములందు ఉచిత సువార్తసేవ చేయుటకు సిద్దపరచుటయే. ఈ ప్రకారము ప్రతిసంవత్సరమును జరిగించినచో నచిరకాలములోనే సంఘపురోభివృద్ధికి తోడ్పడు ఉచితసువార్త సేవాదళములు యేర్పడును. ఈ యుద్యమ ఫలితముగ సంఘములు వర్ధిల్లి విస్తరించును. సంఘస్థులను ఆధ్యాత్మికముగ బలపరచి, సంఘములు కొలదికాలములో స్వపోషణ సంఘములుగ మారునట్లుచేయును. మన సంఘములను గూర్చిన ముందృష్టి యేదన క్రైస్తవులు ఆత్మలను సంపాదింపనాసక్తి గలవారగునట్లును మన సంఘములు సువార్తికులను నితర ప్రాంతములకు పంపగలుగునట్లును, సంఘస్తులు తమ్మును తాము దైవసేవకు సమర్పించుకొనునట్లు చేయుటయే. మన దేశములో సాధారణముగ వచ్చు చిక్కు సమస్యలను సరిచేయుటకీయుచిత సేవకుల యుద్యమమెంతయో తోడ్పడును."
థియోఫిలస్ తరచుగ నిట్లుచెప్పెను: "ఈ యుచిత సేవకుల యుద్యమము నా ప్రాణసమము." అందువలన నీయన తన జీవితములో ననేకులను ఉచిత సువార్తసేవ కొరకు తర్బీదు చేయుటకై కంకణము గట్టుకొని తనజీవితాంతము వరకును సేవ చేసెను. ఈ యుద్యమము థియోఫిలస్ స్మారక చిహ్నముగా నిలచియున్నది.
ఓ సత్ప్రభూ! నీకు చెల్లవలసిన విధముగా నిశ్చలమైన భక్తిపూరిత హృదయముతో నిన్ను సేవించుట నాకు నేర్పుము:
ఇచ్చుటకును దాని ఖరీదును మనస్కరింపకుండుటకును;
పోరాడుటకును, గాయములను గూర్చి ఆందోళనపడకుండుటకును;
సేవజేయుటకును, విశ్రాంతి వెదుకకుండుటకును;
పరిచర్యచేయుటకును, దాని ప్రతిఫలమపేక్షింపకుండుటకును నాకు నేర్పుము. నీ చిత్తమును నెరవేర్చుచున్నామను అనుభవము మాత్రము ప్రసాదించుము.
కనేడియన్ బాప్టిస్టు మిషను సంఘముల వర్ధనము
(మార్చి 1874 – జనవరి 1931)
ఉత్తర సర్కారుల బాప్టిస్టు సంఘముల వర్ధనమును గూర్చి 1931వ సంవత్సరము బాప్టిస్టు మహాసభలో శ్రీ జి.ఏ. సమూయేలుగారు ఈ విధముగా వివరించిరి:-
దక్షిణమున కృష్ణానదియు, ఉత్తరమున ఉత్కళరాష్ట్రమును, తూర్పున బంగాళా ఖాతమును హద్దులుగా గల యాంధ్రదేశమున నివసించు హిందువులను, మహమ్మదీయులును క్రీస్తునెరుగక యంధత్వమున బడియుండిరి. ఈ ప్రదేశమున ఆ కాలమున విద్యావిహీనత, అజ్ఞానాంధకారము, మూఢభక్తి, అస్పృశ్యత, విగ్రహారాధన, కులాచారము మొదలగు ఆనాచారములు ప్రబలియుండెను. అట్టిస్థితిలో నీప్రాంతమున దేవునివెలుగు ప్రకాశింప ప్రారంభించెను. మొదట గవర్నమెంటు టెలిఫోను డిపార్టుమెంటులో పనిచేయుచున్న థామస్ గాబ్రియేలను వ్యక్తి హృదయమున నీవెలుగు ప్రకాశించెను. దేవుడాయనను ముట్టినందున ఆయన సువార్తను గూర్చి సాక్షియయ్యెను. ఆత్మోద్రేకముతో కూడిన ఆయన సాక్ష్యము మరికొందరిని క్రీస్తు కొఅకాకక్షించెను. బ్రిటిషుసైన్యములో నొక యుద్యోగియగు దాస్ అంతర్వేదిగారు మధురగానప్రవీణులును ఆంధ్రక్రైస్తవ కవిసార్వభౌముడనదగు పురుషోత్తమ చౌధురిగారును, పైనుదహరింపబడిన చిన్న సంఘమున్నూ కాకినాడలో చేసిన సేవాఫలితమే తదుపరి సి.బి. మిషనువారి సేవకు పునాదిగ నేర్పడెను.
ఉత్తరసర్కారుల బాప్టిస్టు మహాసభ (జనవరి 1931)
ఇంతవరకు బాప్టిస్టు మిషనులోని కార్యక్రమమును రెండు సమాజములు నడుపుచుండెను. అందొకటి విదేశీయమిషనెరి వారే సభ్యులుగా గల సమాజము. (మినిస్ట్రీ కాన్ఫరెన్స్), రెండవది స్వదేశీయ సంఘప్రతినిధులు సభ్యులుగా గల మహాసభ (ఎన్.సి.బి.కాన్వెన్షన్). కాన్ఫరెన్సు మిషనులోని సువార్త విద్య, సాంఘిక సంస్థలన్నిటి పూచీ వహించియుండెను. థియోఫిలస్ 1931వ సంవత్సరము జగన్నాధపురములో జరిగిన 18వ ఉత్తరసర్కారుల బాప్టిస్టు మహాసభకు అధ్యక్షుడుగ నుండెను. తన సేవ నారంభించుట కాయన ప్రచురించిన మూలసూత్రములే తన అధ్యక్షోపన్యాసము:
1. విద్యావంతులైన సువార్తసేవకులను తర్బీదు చేయుట 2. సంఘనాయకత్వమును స్వదేశీయులు నడిపించుట 3. స్వపోషణస్థితికి సంఘములను నడిపించుట 4. సంఘక్షేమాభివృద్ధికై యువకులను క్రీస్తు నందు పెంచుట
5. సువార్త సేవ యందు మిషనుకు బదులు సంఘమునకు ప్రధాన స్థానము నిచ్చుట.
6. వివిధ క్రైస్తవ శాఖల మధ్య నైక్యతను నెలకొల్పుట 7. స్త్రీలు చేయవలసిన ప్రాముఖ్యసేవకు వారిని ప్రోత్సహించుట 8. విదేశీయ మిషనెరికిని, దేశీయ సంఘ కాపరికిని మధ్యనుండవలసిన సంఘ బంధము సహోదరత్వమే
ఆయన యీ ప్రసంగమును ముగించుచు స్వదేశ నాయకుల నిట్లు ప్రశ్నించెను; "మన పేరు గొప్ప పని కొద్ది, హోం మిషను పని తప్ప మనము చేయుచున్న యితర కార్యమేది? మన హక్కులు, విధానములు, బాధ్యతలు, ఏవి? మన మాండలిక సభలు (అసోసియేషన్స్) బలముగనున్నవి. మహాసభ బలహీనముగ నున్నది. సంకుచితమగు అస్సోసియేషను మనస్సు పోయి విశాలమైన మహాసభ మనస్సు రావలయును, సంకుచిత భావమును, స్థానిక హక్కులను గూర్చి తలంచుటయును వెనుకపెట్టి, విశాలమగు ఐక్యభావము కలిగి యుండవలయును. అధ్యక్షులను, సమితులను, ఉద్యోగస్థులను ఎన్నుకొనుటయే మహాసభ యొక్క పని కాదు; హక్కుల కొఅకు పోరాడుట విడచి భాధ్యతల కొఅకు యేకమనస్సు కొఅకు పాటుపడు మనస్సు వృద్ధికావలయును. అప్పుడే మన సభకు ఐక్యత, బలము, చేకూరును."
ఈ ఉద్దేశములు రెవ. జె.బి. మెక్లారిన్ యొక్క దూరదృష్టి నాకర్షింపగా ఆయన యిట్లనెను:- "మిషనెరీలమగు మేము కూడ నిట్టి పద్ధతుల నవలంబించుటయే మేలని తలంచుచున్నాము" థియోఫిలస్, యొక్క సలహా ప్రకారము మిషనులోని ఆయా సంస్థలయొక్క కార్యక్రమమును జరిగించుటకు వివిధ సమితులు ప్రధమమున ఈ మహాసభలో ఏర్పాటు చేయబడెను.
తెలుగు ఒరియా కౌన్సిలు (1934-1946)
ఈ నూతనాభివృద్ధిలో రెండవ మెట్టగు తెలుగు ఒరియా కౌన్సిలును 1934 లో ఏర్పాటు చేసిరి. ఈ ఆలోచన సభ మిషనెరీ వారి నుండియు మహసభ ప్రతినిధుల నుండియు వచ్చిన సభ్యుల వలన యేర్పడినది. ఇది కాన్ఫరెన్సు మహాసభలకు మధ్యముగనున్న మరియొక సభ. థియోఫిలస్ తెలుగు ఒరియా కౌన్సిలు యొక్క కార్యదర్శిగ కొన్ని వత్సరములుండి చేసిన సేవ ప్రశంసనీయమైనది.
ఆయా సమస్యలలో నీయన చూపిన చురుకుదనము వివిధ కార్యములలో పాల్గొను విధానము ఈయన జీవితమున తాను చూపిన శ్రేష్ఠమగు గుణలక్షణములు నాయకులను సంఘములను ఎక్కువగ ఆకర్షించెను. ఈ తెలుగు ఒరియా సభద్వారా యీయన దేశీయ క్రైస్తవ సభ్యులకును విదేశీయ మిషనెరీ వారికిని ఆన్యోన్య సహవాస మేర్పరచి వారొకరినొకరు గ్రహించి వారి యందు గల శక్తి సామర్థ్యములను తెలిసికొని ధైవరాజ్యాభివృద్ధికి పాలిభాగస్థులై పాటు పడునట్లుచేసెను. ఈ సభ దేశీయ క్రైస్తవ నాయకులు తర్బీదు నొందుటకు తోడ్పడెను. ఇదియే మహాసభకును మిషనెరీ వారి కాన్ఫరెన్సుకును మధ్య సంబంధమేర్పరచెను.
ఇండియాలో నున్న మిషనులన్నియు సువార్త భారమును దేశీయ నాయకుల కప్పగించుటకు కనిపెట్టుచున్న యీ కాలమున సి.బి. మిషనులో క్రైస్తవులును, మిషనెరీవారును, సంపూర్ణముగ నమ్మి ఆధారపడదగిన నాయకుడు థియోఫిలస్యేయని వారికి గోచరమయ్యెను. 1941 వ సంవత్సరమున చాలా కాలము మిషనెరీగనున్న రెవ. ఎ. గోర్డన్ గారు కనేడియన్ బాప్టిస్టు మిషను విదేశాంగ కార్యవర్గ సర్వీయ కార్యదర్శిగా నున్న డాక్టరు. జె.బి. మెక్లారిన్ దొరగారికిట్లు వ్రాసిరి. 'దేశీయ క్రైస్తవ పనివారిలో థియోఫిలస్ గారు నాయకశిఖామణిగా ముందుకు సాగుచున్నారు".
నాయకుడగు థియోఫిలస్
థియోఫిలస్ ఆయా పరిస్థితులను బట్టిగాని మానవ తోడ్పాటు వలన గాని నాయకుడు కాలేడు. తన అంతరంగిక జీవితమున దాగియున్న ఆయా శక్తులు క్రీస్తు నందు ఆయనకు ఒక ప్రత్యేక వ్యక్తిత్వమునిచ్చి ఆయన జీవితము ప్రకాశింపజేసెను. ఇదియే ఆయన నాయకుడు డగుటకు ముఖ్యకారణము. సామాన్యముగ సంకుచిత భావమును కలుగజేయు స్వనీతి యీయన యందిసుమంతయైనను కానరాదు. తాను స్వార్థ త్యాగియగుటచేత స్వార్థ పరులగు తదితర క్రైస్తవ నాయకులు దైవసేవకు ఆటంకబండలుగ నుండుటను గమనించి యీయన కడుచింతించెడివాడు. ఇతర నాయకులయందలి యుత్తమలక్షణములను కనిపెట్టి అట్టి గుణములకు దోహదమిచ్చు సదుపాయములను కలిగించువాడు. సంఘీభావబలమును గూర్చి యీయన నొక్కి వక్కాణించుచు, ఒక కార్యమును నిర్వహించుటలో వివిధ క్రైస్తవనాయకుల నేకీభవింపజేసెడివాడు. ఈయన ప్రవర్తన యందలి ఐక్య భావమీయన హృదయమును చాలా విశాలపరచెను. అందుచేత ప్రభువుయొక్క సేవలో నూతనమగు అనేక ఆధిక్యతలను అంగీకరింపగలిగెను.
థియోఫిలస్ మిషనుయొక్క భావిస్థితిని పరికించుటయే గాక ఒక ప్రవక్తవలె భారతదేశము సంఘ స్వపరిపాలనా స్థితికి సిద్ధముగా నుండెనని కనిపెట్టగలిగెను. మిషనులోని వివిధ సంస్థలలో ఆధునిక పరిస్థితుల కనుగుణ్యముగ నుండునటుల చేయుటలో ముఖ్యముగా నీయనయే పూచీవహించెను.
ఆయన యే సమితిలోనైనను సభ్యుడుగ నున్న యెడల అందు వ్యర్థమగు వాగ్వాదములలో పాల్గొనక ఏదోయొక గుఱిగలిగిన కార్యక్రమముండునట్లు సాధించెను. సమస్యలగానున్న విషయములను తన సూక్ష్మబుద్ధిచే సులువుగా సరిచేసెను. ఎప్పడైన నీయనయందొక నూతనోద్దేశము పుట్టినయెడల అది సత్యమైనదనియు దానిని సాధించుమార్గము సరియైనదనియు గుర్తెరిగినచో; ధైర్యముగను కృతనిశ్చయుడై దానిని సాధింపబూనెను. ఇట్టి కార్యసాధనా సామర్థ్యమును తన యుద్దేశముల యందలి సద్భావమును గ్రహించి యితర నాయకులు తన ప్రతిపాదనలను గౌరవించిరి. ఈ ఉత్తమాశయములు కార్యసిద్ధిజెందుటకు వలయు ధైర్యమీయనకు అవసరమైయుండెను.
క్రీస్తు నందు గల దృఢవిశ్వాసమే యీయనను దైర్యపరచెను. మహాసభలో ఆయా నూతన విధానములను ప్రారంభించుటలో ఇతర నాయకుల యొక్క విశ్వాసమును కూడ ఈయన బలపరచెను. వినయ స్వభావుడైనను ఆయా విషమ పరిస్థితులనెదుర్కొనవలసిన అవసరము వచ్చినపుడు యుద్ధ శూరునివలె థియోఫిలస్ పోరాడెను. ఇట్టి సమయములలో ప్రవక్తలకు కలిగిన ఆత్మీయోద్రేకమీయన నుండి వెలువడుచుండును. మిషనెరీ వారి నీవిధముగ హెచ్చరించెను: "ఇండియా దేశమునకు వచ్చిన మిషనరీ వారు క్రీస్తుకు కలిగగిన ప్రేమ, దయ, ఆదరణ స్వభావములతో నిండిన స్త్రీ పురుషులై యుండవలయును. సేవలో దేశీయ క్రైస్తవనాయకులతో వారు సమాన పాలిభాగస్థులై యేకీభవించుచుండలయును. ప్రారంభ దశలోనున్న ఇండియా దేశ సంఘసభ్యుల యొక్క నాయకత్వమును ప్రోత్సహించుచు అంగీకరించువారై యుండవలెను" దేశీయ క్రైస్తవనాయకులయందున్న బలహీనతలు కనబడునపుడు ఆయన వారిని గద్దించుచు నిట్లనెను. "మనలో కొందరు నాయకులు తగిన సామర్థ్యము లేకపోయినను ఆధిక్యతల నపేక్షింతురు. ఇందువలననే మహాసభ సక్రమముగా పనిచేయలేక పోవుచున్నది". ప్రజల కాయాసముగనుండునని తన భావమును మరుగుపరచునట్టి తీయని మాటలనీయన యుపయోగింపక ఉన్నది ఉన్నట్లుగ మాట్లాడువాడు.
ఆయన హృదయమునుండి ఒక విధమగు కదలికలు నలుదిశలు వ్యాపించి మిషనులోని సర్వకార్యక్రమములకు జీవమునిచ్చెను. 1946వ సంవత్సరము డిసెంబరు నెలలో ప్రచురింపబడిన సిరంపురపు కళాశాల పత్రికలో నీయన యొక్క సేవలను గూర్చి యిట్లు ప్రశంసింపబడెను: "బాప్టిస్టు సంఘములు ప్రస్తుతము అనేక విషయములలో ముందంజ వేసినవి. ఇట్లు ముందుకు సాగిపోవుటకు థియోఫిలస్ యొక్క ఆత్మీయోత్తేజమును కలిగించు నాయకత్వమే ముఖ్య కారణము."
డాక్టరు. జె.బి. మెక్లారిన్ దొరగారీయన సేవను గూర్చి యభినందించుచు నిట్లు ఆయనకు వ్రాసిరి. "మన ప్రభువును రక్షకుడునగు క్రీస్తునందు మీకు గల భక్తియు, సంఘముల యెడల గల యభిమానమును మిక్కిలిస్తోత్రార్హమైనవి. మీ నిమిత్తము దేవునికి వందనములు చెల్లించుచున్నాము. మీ వలెనునేకుల గౌరవ ప్రేమలకు పాత్రుడై యింత యెక్కువ త్యాగము చేసికొని, సువార్తసేవలో మాతో నిలిచియున్న మరియొక క్రైస్తవనాయకుడు మన సంఘములలో నున్నాడని నేననుకొనను."
మహాసభ బాధ్యతానిర్వహణము యొక్క అంత్యఘట్టము
1944 వ సంవత్సరము వచ్చునప్పటికి థియోఫిలస్ తెలుగు ఒరియా సమాలోచన సభలో ప్రముఖుడుగ నెంచబడెను. డివొల్యూషను యొక్క ప్రారంభమెట్టుగా స్థాపించబడిన యీ తెలుగు ఒరియాకౌన్సిలు 1934 నుండి చేయుచున్న పని యూయనకు సంతృప్తి కలిగింపలేదు. సి.బి. మిషను చేయుచున్న కార్యక్రమమంతయు మహాసభ కప్పగింపబడవలెనని యూయన కోరెను. కాన తెలుగు ఒరియాకౌన్సిలు కంటె బలవత్తరమగు మఱియొక సభ నీయన యపేక్షించెను. ఈ యుద్దేశమును తాను 8-8-1944న తెలుగు ఒరియా కౌన్సిలులో ఉపన్యాసములో బయలుపరచెను.
"మొత్తముమీద ప్రస్తుతము మనకు రెండుసభలున్నవి. అందొకటి మిషనరీవారి కాన్ఫరెన్సు, రెండవది ఉత్తర సర్కారుల బాప్టిస్టు మహాసభ. ఇవి రెండును ప్రత్యేకముగా తమ కార్యక్రమములను జరిగించుచున్నవి. ఈ ద్వంద పద్ధతి వలన సంఘములు బలపడు సూచనలు కనబడుటలేదు. కాన్ఫరెన్సు ప్రతి సంవత్సరమును కొన్ని బాధ్యతలతోకూడిన పనులను మహాసభ కప్పగించినను సంఘములు బలపడవు. ఏలయన మిషనెరీ మహాసభలో పాలిభాగస్థులు కానందున ప్రత్యేకముగ వుండి యీ సభలోని పొరపాట్లను గమనించుచుండుటయే సంభవించు చుండును. ఒకరితలంపులు మరియెకరికి తెలియపర్చుటకు ఒండొరుల యనుభవములలో పాలుపొందుటకును ఒకరి యెడలనొకరు సానుభూతి చూపుటకును వీలులేకున్నది. అందుచేత సాధ్యమైనంత త్వరలో తెలుగు ఒరియా సభను రద్దుపరచి కాన్ఫరెన్సు యొక్క కార్యక్రమమంతయు మహాసభ కప్పగింపవలెను."
ఉత్తరసర్కారుల బాప్టిస్టు మహాసభ యొక్క నిబంధనలు
పైను దహరింపబడిన యుద్దేశము అంగీకరింపబడెను. థియోఫిలస్ మహాసభ యొక్క నిబంధనల నేర్పాటుచేయు సమితికి అధ్యక్షుడుగ నెన్నుకొనబడెను. 1946వ సంవత్సరము నవంబరు నెల వచ్చునప్పటికి ఉత్తరసర్కారుల బాప్టిస్టు మహాసభ యొక్క నిబంధనలు 1947 సంవత్సరము జనవరి మహాసభలో ప్రవేశపెట్టబడుటకు సిద్ధము చేయబడెను. ఈ నిబంధన ప్రకారము తెలుగు ఒరియా కౌన్సిలు తీసివేయబడి మహాసభ మాత్రమే మిషను సర్వ కార్యక్రమమును ఇక మీదట జరుపవలయును.
తన కలను అన్వేషించి పయనమైతే, బుద్ధిహీనత అన్నారు
తన స్వప్నాన్ని అనుసరించి, కొండశిఖరానికని ప్రయాణమయ్యాడు;
"ఏం! లోయలో సంగీతం తక్కువా ఆనందం తక్కువా?
ఎందులకీ శ్రమాబాట; ఎందులకీ ప్రమాదపథం," అన్నారు ప్రజలు
కొండ పైభాగం నుండి ఏదో ఒక స్వరం వినవచ్చింది, అనతి కాలంలో పరిహాసకులంతా
ఆ వైపుకే చూశారు; పరిహాసం కట్టిపెట్టి: "అదిగో, ఆ ఉన్నత మార్గాన, ఆ ప్రమాదపథాన,
ఆ కారుమబ్బులో, అడిగో ఆ బుద్ధిహీనుడు అల్లదే అతడు కనుగొన్న ధననిధి."
తాళ్ళ సహాయంతో కర్రల ఊతతో చేరుకున్నారు అతని చేరువకు; ఆ పర్వతమార్గంలో,
తాను కనుగొన్న ధననిధిని ప్రదర్శించేడు;
"ఐతే మనమంతా పంచుకుందాం రండి" అని అతణ్ణి బాధపెట్టేరు; "ఇదంతా మీదే
తీసుకోండి నేనింక పైకి వెళ్తాను" అన్నాడు ఆ వీరుడు.
– జెస్సీ బ్రౌన్ పౌండ్స్
1946వ సంవత్సరము థియోఫిలస్ జీవితములో మిక్కిలి ప్రాముఖ్యమైనది.
క్రైస్తవ వివిధ శాఖల ఐక్యత
ప్రతి సంవత్సరమును థియోఫిలస్ బాప్టిస్టు సంఘక్షేమాభివృద్ధికై యేదోయొక నూతనోద్యమమును మహాసభ యెదుట పెట్టెడివాడు. 1946వ సంవత్సరములో నూతనయత్నము "క్రైస్తవమతములోని వివిధశాఖల మధ్య ఐక్యత" ఈయన విశాల హృదయుడగుటచేతను, (1) ఆంధ్రక్రైస్తవ సభలోని సభ్యుడుగను (2) అధ్యక్షుడుగను (3) జాతీయ క్రైస్తవ సభలో సభ్యుడుగ నుండి క్రైస్తవ మతములోని యితర శాఖల నాయకులతో సేవలో పాల్గొనుటచేత కలిగిన సహవాసము, ప్రేమానుబంధముల వలనను వివిధ క్రైస్తవశాఖలనెడి భేదాభిప్రాయములు ఆయన మనస్సులో నుండి తొలగిపోయెను. భేదములు లేక క్రైస్తవులెల్లరును ఐక్యమై సహవాసములో నుండుటకును మిగుల నపేక్షించెను. వివిధ శాఖలమధ్య క్రైస్తవ సత్యములను గూర్చిన భేదాభిప్రాయము వచ్చినప్పుడు ఆయన ఇట్లు ప్రార్ధించువాడు: '(ఓ ప్రభువా! సంఘయైక్యతను నెలకొల్పుము; నీ నామమును ధరించినవారు భేదాభిప్రాయములు లేక నీ మహిమార్ధము సాక్షులుగనుండునటుల నీయందు వారినందరిని ఐక్యపరచుము).' ఒక్క పట్టణములో రోమను కథోలిక్కు దేవాలయమును, ఒక ప్రొట్టష్టంటు దేవాలయమును నున్నవి. వాని మధ్య నొక దుకాణముండి వానిని వేరుపరచెను. దానిని గమనించి యీయన ఇట్టు దు:ఖించెను; "వివిధ క్రైస్తవ మతశాఖల మధ్యనున్న విభేదములు పశ్చిమ దేశములలో నొకబలహీనత మాత్రమే ఐనను హిందూ దేశమున క్రైస్తవ సంఘ వ్యాప్తికి ఒక గొప్పఆటంకముగ మారెను. అయ్యో! ఈ సంఘములన్నియు నొకైక్యసంఘముగ మారినచో నెంతమేలు!"
ఈయన వివిధ క్రైస్తవ శాఖల మధ్య సౌభ్రాతృత్వమును నెలకొల్ప మిగుల ప్రయాసపడెను. క్రీస్తు సంఘమును గూర్చిన ఈ క్రింది సత్యములు ఆయన హృదయములో నుండెను. "క్రైస్తవునికి దేవునికి మధ్య సహవాసమును నెలకొల్పుటయును, క్రైస్తవుల మధ్య అన్యోన్య సహవాసమును కల్పించుటయును సంఘముయొక్క ప్రాముఖ్య కర్తవ్యము. క్రైస్తవ సంఘముల మధ్య సోదరభావమును నెలకొల్పుట ద్వారా సంఘములు దేవుని రాజ్యమును స్థాపించును. అట్టి సహోదరత్వమును నెలకొల్పుటకు సంఘైక్యతయే ముఖ్యసాధనము. మానవులు సాధింప బూనిన యత్నములలో సౌభ్రాతృత్వమే ఉత్తమమైనదని యెంచనగును. సంఘము క్రీస్తుయొక్క దేహము. క్రీస్తు సంఘమునకు శిరసైయున్నాడు. అందుచేత సంఘములోనున్న విశ్వాసులే క్రీస్తు మహిమను లోకమున ప్రకాశింపచేయువారైయుందురు. సంఘ సభ్యుల మధ్య ఐక్యతను నెలకొల్పుట ద్వారా మాత్రమే అట్టి మహిమను సంఘము లోకమునకు చూపగలదు.
అవనిగడ్డలో ఉత్తరసర్కారుల బాప్టిస్టు మహాసభ
(జనవరి 1946)
పైనుదహరింపబడిన సంఘ ఐక్యతను గూర్చిన దృఢ నిశ్చయత థియోఫిలస్ను బలవంతపెట్టుచేత 'ఆధ్యాత్మికాతిధ్యము' (Spiritual Hospitality) అను ప్రతిపాదనను సభ్యుల ఆమోదమునకై జనవరి 1946 వ సంవత్సరము అవనిగడ్డలో జరిగిన మహాసభలో ప్రవేశపెట్టెను. ఈ ప్రతిపాదన ప్రకారము ఇతర క్రైస్తవ శాఖలలో ప్రభుకృపాప్రసాద సంస్కారమున పాల్గొనుచున్న వారిని బాప్టిస్టు సంఘములు సభ్యులుగ చేర్చుకొనవలయును. ఈ విషయమును బలపరుచుటకు ఆయనకు తగిన కారణములు కలవు. గత కాలమున బాప్టిస్టు సంఘములలో కొన్నింటిని లూథరన్ మిషను వారికిచ్చి, వానికి ప్రతిగా కొన్ని లూథరన్ సంఘములను సభ్యులకు ముంచడము ఇవ్వకుండగనే తీసికొనిరి. ప్రాచీనకాలమున మన బాప్టిస్టు సంఘములు ముఖ్యముగ మూడు విషయములలో బహునిష్ట గలిగియుండినవి. బాప్టిస్టు సంఘములలో ప్రసంగించుటకు బాప్టిస్టులు కానివారికి స్థలములేదు. (2) ప్రభుకృపాప్రసాద సంస్కారమున యితరులకు బాప్టిస్టు సంఘములలో పాలులేదు. (3) బాప్టిస్టు సంఘములలో ముంచడము లేకుండ నితరులను సభ్యులుగ జేర్చుకొనుటకు వీలులేదు. (అయితే యీ దినములలో నితరులు బాప్టిస్టు సంఘములలో ప్రసంగించుటకును, ప్రభుకృపా ప్రసాదమున పాల్గొనుటకు ఉన్న అభ్యంతరములు పోయినవి. " అందువలన ఇతర మిషనులలో ప్రభురాత్రి భోజనమున పాల్గొనుచున్న వారిని బాప్టిస్టు సంఘములలో సభ్యులుగ జేర్చుకొనుటకెందుకు అభ్యంతర పడవలయును?"
ఈ ప్రతిపాదనను మహాసభ అంగీకరించెను. అయితే వెంటనే కొందరు మహాసభ రాయబారులు బలముగా నీ విషయమునెదుర్కొని ఆమోదించుట భావ్యము కాదని తీవ్రముగా వాదించిరి. మరియు థియోఫిలస్ బాప్టిస్టు సిద్ధాంతములను పాటించుచున్నాడా? యనియు ప్రశ్నింపదొడగిరి.
రెవ. డి.ఆర్. ఐజక్కుగారి గృహమున
(మహాసభలో కొందరు సభ్యులు చూపిన అస్థిరమైన మనస్సునుబట్టి థియోఫిలస్ యెంతయో చింతించెను. ఈ విషయము ఆయననెక్కువగ బాధించి, తన జీవితాంతమువరకు ఆయనను కృంగజేసెను.) అవనిగడ్డ నుండి దైవసేవలో తన సోదరుడగు రెవ. డి.ఆర్.ఐజక్ గారీయనకు విశ్రాంతి నిచ్చుటకై గుడ్లవల్లేరులోని తన స్వగృహమునకు దీసికొనిపోయెను.
అచ్చట ఆయన వారితో రెండుదినములు గడిపెను. గత విషయమును గూర్చి పరితపించుచు థియోఫిలస్ యీవిధముగ తనలోతాను చెప్పుకొనెను: "మన దేశీయక్రైస్తవ సభ్యులే తమ నాయకుల యందు విశ్వాసముంచలేనపుడు మన మేలాగు మహాసభ కార్యక్రమ పూచీని వహించగలము?" రెండవ రాత్రి ఆయనకు మిక్కిలి ప్రమాదకరమాయెను. ఆయన దు:ఖ సముద్రమున మునిగి బహుగా కృంగిపోయి, గుండె దుర్బలతచే నీరసపడి ఒక గంటసేపు మాట్లాడలేక మిక్కిలి బాధపడెను. ఐజక్ గారీవిధముగ నుడివిరి: "ఆయన మా యింటిలో నుండగనే ప్రాణము విడుచునేమోయని మేము బహుగా భయపడితిమి. దేవుడు అత్యంత కృపచూపుటచేత ఆపద తొలగిపోయెను. దేవునికి స్తుతులు".
1946 ఏప్రిల్ నెలలో బాప్టిస్టు సిద్ధాంతముల యెడల థియోఫిలస్ విశ్వాసమును పరిశీలించుటకై ఒక ప్రత్యేకమగు సమితి కాకినాడలో సమావేశమాయెను. ఆ సభ లోనికి థియోఫిలస్ కూడ ఆహ్వానింపబడెను. ఆ సభలోని సభ్యులు కొందరు ప్రశ్నించిరి. మరికొందరు సమాధానము చెప్పిరి. థియోఫిలస్ నిశ్చలమగు మనసుతో మౌనముగా నాసభలో కూర్చుండి యుండెను. ఈ పరిస్థితి యూయనకు పరిశోధన కాలముగ నుండెను.
చూచుచున్న క్రీస్తు
వ్యాకులత చెందిన థియోఫిలస్ను 'చూచుచున్న క్రీస్తు' అను అంశముపై తన ధ్యానము యొక్కువగనోదార్చెను. "విషాదకరమగు జాబును నీవందుకొనినపుడును, భయంకరమగు వార్త నీ చెవినబడినపడును, నీ యున్నతాశయములు నిరర్థకమగుచున్నవని నీవు గ్రహించునపుడున దీర్ఘ కాలము నీవు కార్యనిమగ్నుడవూతూ చేసిన సేవ నిష్ఫలమగుచున్నట్లగపడునపుడును, నీవు జయింపవలెనని పోరాడుచున్న శోధన నీ శక్తికి మించినదై నిన్నే జయించునట్లు అగుపడునప్పుడును, ప్రేమతో నిండిన నేత్రములతో క్రీస్తు నీ వైపు కనిపెట్టి చూచుచున్నాడని మాత్రము మరువకుము."
ఈ సమయమందు డాక్టరు మెక్లారిన్గారు భిన్నుడైన థియోఫిలస్ను ఓదార్చుచు వుత్తరమును వ్రాసి, బహుగా ధైర్యపరచెను. 'మీరిటువంటి ఉపద్రవకరమగు పరిస్థితులను ఆదర్శనీయమగు క్రైస్తవ స్వభావముతో నెదుర్కొందురని నేను విశ్వసించుచున్నాను. ఏలయన క్రైస్తవసేవలో ఇది మీకు అలవడిన దివ్యలక్షణమే కదా!"
కొంత విమర్శ జరిగిన పిదప థియోఫిలస్ నాయకత్వమును విమర్శించుటకై యేర్పాటుచేయబడిన సమితి ఆయన యందు సంపూర్ణ విశ్వసమును వెల్లడించుచు నొక తీర్మానమును చేసిరి. ఆయన విశ్వాసమును విమర్శింప నగత్యత లేకపోయినను ఈ రీతిగ నాయనను పరిశోధించుటచేత అప్పటికే బహుగా బలహీనుడై యున్న యీయన మరింత దుర్భలుడయ్యెనని తన మిత్రులు గ్రహించిరి.
ఆయన విశ్వాసము
థియోఫిలస్ క్రైస్తవ మతములోని వివిధ శాఖల ఐక్యత కొరకు యెక్కువగ నపేక్షించుచున్నను, యీ ఆవేదన విశ్వాసులు బాప్తిస్మము పొందవలయునను సత్యమునుండి తిలగిపోవునట్లాయనను నడిపంచలేదు. సంఘము యొక్క ఐక్యత ద్వారా బాప్టిస్టులు క్రీస్తు దేహమైన సంఘములో పాల్గొను మార్గమును కనుగొనగోరెను. ఆయన నాయకత్వము నందలి విశ్వాసము యొక్క పున: స్థాపనాంతరము యధాప్రకారము ఆయన తన సేవను ప్రారంభించెను.
ఒక గ్రామమున క్రైస్తవ వివాహము
(మే 1946)
అది నడి వేసవి. కాకినాడకు సుమారిరువది మైళ్ళదూరములోనన్న అనపర్తియను గ్రామముననొక వివాహము జరుగుచుండ నచటికి థియోఫిలస్ కూడ వెళ్ళెను. వివాహనంతరము విందారగించిన పిదప రాత్రివేళ ప్రయాణ సౌకర్యము లేవియులేనందున ఇచటి నుండి థియోఫిలస్ కాలినడకను తాను బసచేసిన పాదిరి గారి యింటికి పోవలసివచ్చెను. ఫర్లాంగు దూరము నడిచిన పిదప థియోఫిలస్ దుర్బలుడగుటచే నికనొక యడుగైనను ముందునకు వేయనశక్తుడై నిలిచిపోయెను. మరియొక మైలుదూరమింకను నడువలసి యుండెను. సాగిపోలేక థియోఫిలస్ సమీపమందుగల యొక యరుగుమీద పరుండి మూడుగంటల సేపు విశ్రాంతిని తీసికొనెను. పిమ్మట బయలుదేరి తన మార్గమున నెమ్మదిగ నడువసాగెను.
గ్రంథకర్త ఆనాడాయన పడిన ప్రయాసనుగూర్చి "ఇంత బలహీనముగ నుండి థియోఫిలస్ ఆ పెండ్లి కెందుకుపోవలసి వచ్చెను?" అని విచారించగా పాదిరిగారిట్లు జవాబిచ్చిరి: "ఆ పెండ్లి కుమారుడు సువార్త సేవకునిగ ఒకప్పుడు ఉత్సాహముతో నుద్యమించి మరల నాతీర్మానమును మార్చుకొనెను. కాన థియోఫిలస్ అతనిని సువార్తసేవ కొరకు సంపాదింప బ్రయత్నింప వెళ్లెను."
ఒక గ్రామ క్రైస్తవ సంఘమును దర్శించుట
(జూన్ 1946)
మండపేటయను గ్రామము నీయన దర్శింపబోగా ఆ సంఘధ్యక్షుడు థియోఫిలస్ నిట్లడిగెను, "అయ్యా! తెలియనిరీతిగ నిట్లీ గ్రామమునకు వచ్చి రేమి?" అందులకు థియోఫిలస్ యిట్లు ప్రత్యుత్తరమిచ్చెను "పాస్టరుగారూ! మిమ్ము చూచుటకే వచ్చితిని."
ఆయన యాగ్రామములో ప్రార్ధనయను యంశము పై తన చివరి ప్రసంగమును చేసెను. "మనము దైవచిత్తమును ప్రార్థనలోనే తెలిసికొనగలుగుదుము. ప్రార్థన వలననే మన మానవులు దేవునికి విశదపరచగలము. ప్రార్ధించునపుడు దైవ సహవాసము వలన మన జీవితములో నొక గొప్ప మార్పును మనము కనుగొందుము. ప్రార్ధనయనగా మానవునికి దేవుని యందు గల ప్రేమను వెల్లడిచేయుటయు, విశ్వాసముతో ఆయన కొరకు జీవించుటయు సంపూర్ణముగ నాయనపై నాధారపడుటయే. మనము ప్రార్ధించునప్పుడు దేవుడు మన సేవకు మార్గమును సిద్ధపరచి తన సఫలకరమగు త్రోవలో మనలను నడుపును. ప్రార్థనలో మనమెక్కువ మాట్లాడుదుము. కాని దేవుడు మనతో మాట్లాడుట కవకాశమీయము. 'దేవా! నీ సేవకుడాలకించుచున్నాడు. సెలవిమ్ము' అనునదియే మన ప్రార్థన యొక్క యుద్దేశమై యుండవలయును. ప్రభువు యొద్ద కనిపెట్టి ఆయన చిత్తమును తెలిసికొనుము. ప్రార్థన దైవచిత్తమును తెలిసికొనుటకై ఆయన యొద్దకు పోవు ప్రయాణము వంటిది. ప్రార్థన యొక్క సంపూర్ణ సిద్ధియేమనగా, ప్రభువుతో సహవాసము చేయుటయే. ఇది మానవుడు తనంతటతాను మాట్లాడుకొనుట గాని, దేవుని భిక్షమడుగుటగాని కాదు. దేవునికి కలిగిన యైశ్వర్యమును మనము తీసికొనుటయే."
సంధ్యారాగము
(అక్టోబరు 1946)
కాకినాడలో కేంద్ర పాఠశాలల యొక్క ఉజ్జీవకూటములు 1946 అక్టోబరు నెలలో ఏర్పాటు చేయబడెను. ఈ గ్రంథకర్త కూడా ఆ కూటము నడుపు నాయకులలో నొకరుగా పిలువబడిరి. ఒక ఉపాధ్యాయుడుగాని, విద్యార్థిగాని, ప్రార్థనసభా భవనమున ప్రవేశింపక పూర్వమే థియోఫిలస్ అచటికి చేరెను. ఆయన యీ గ్రంథకర్తతో మాట్లాడుచు నిట్లుచెప్పెను, "రాబోవు సంఘముల మూలసర్థభములు యువకులగు మీరే." ఆయనను తేరిచూడగ ఆయన స్వరూపములో నెంతమార్పు గలిగినది! దేహధారుఢ్యము తగ్గి బహు కృశించెను. ఒకప్పుడు తుమ్మెద రెక్కలబోలు నల్లని దట్టమగు తలవెంట్రుకలలో నిపుడు అచటచ్చట తెల్లని నెరసిన వెంట్రుకలు కనబడుచుండెను.
అందమైన విశాల నుదిటి భాగము యొక్క వర్చస్సు తగ్గి ముడుతలేర్పడెను. కళగల విశాలనేత్రములు తన ధ్యానమనసును ప్రచురపరచుచుండెను. తన వాక్కులు తడపడుచుండెను. మృత్యుచ్చాయ అప్పటికే ఆయన ముఖమున వ్యక్తమగుచుండెను. ఆయన శారీరక మార్పువలెనే మానసికశక్తి కూడ మార్పుచెందెను. "ఎందుచేతనో యిదివరలో వలె నాకు స్వేచ్చగాను అనద్గళముగాను ప్రసంగించుటకు వర్తమానములు వచ్చుట లేదు," అని ఆయన చెప్పెను. చిన్నబిడ్డవంటి విశ్వాసముతో ఆయన "నేను చాల బలహీనముగనున్నాను. నేనెట్లు జీవించగలుగుచున్నానో నాకు చిత్రముగనున్నది. దయతో నా కొరకు ప్రార్థించుడి," అని గ్రంథకర్తతో చెప్పుట కాసన్నమగుచున్న మృత్యువును గ్రహించెనోయన్నట్లు తడపడెను. ఇట్టి దుర్బలస్థితిలోనున్నను ఆయన యెన్నడైనను పనిచేయలేనని చెప్పుటగాని, విశ్రాంతి కావలెనని కోరుటగాని లేదు. ఆయన యెదుట నిలిచియుండి తాను చెప్పుచున్న మాటాలను వినుచున్న గ్రంథకర్త హృదయమున నిరాశ యొక శీతల మేఘమువలె వ్యాపించెను. ఏలయన ఒక విషాదకరమైన విషయమాయన యందు తాండవమాడుచున్నట్లు ఆయన గుర్తించెను. ఇట్టి బలహీన స్థితిలోనున్న థియోఫిలస్ ఇక నెంతకాలము జీవించును!
విస్తారమగు సువార్త సంచారములు
(15, అక్టోబరు – 9, డిసెంబరు)
థియోఫిలస్ తన యమూల్యములగు సలహాలిచ్చుటకును, తాను స్వయముగ నుండి చేయవలసిన కార్యములనివార్యములగుటచేతను, ఆయా స్థలములకు తరచుగ ప్రయాణములు చేయవలసివచ్చెను. విరామములేని యాత్రలు చేసినందున తన ఆరోగ్యము యెక్కువగా చెడిపోయెను. ఇట్లు వివిధములగు దైవకార్యములలో నాయాచోట్ల పాల్గొనుట చేతనే హిందూ దేశములోని ప్రముఖులగు క్రైస్తవనాయకులతో నీయన పరిచయము సహవాసమును కలిగియుండెను. ఈ విధమగు సేవలో పాల్గొనుటచేతనే యీయనకు క్రీస్తుసంఘమును గూర్చి విశాల భావమేర్పడెను. కనేడియన్ బాప్టిస్టుమిషనులోని సంఘముల కార్యక్రమములను నడుపుటకును, మారుచున్న పరిస్థితుల కనుగుణముగ వానిని వృద్ధిలోనికి తెచ్చుటకును, వలయు విజ్ఞానము నీయన ఆయా సంస్థలలో పాల్గొనుట చేతనే సంపాదించెను.
థియోఫిలస్ తన మరణమునకు రెండునెలలు ముందుగా చాలా దూరము ప్రయాణము చేయవలసివచ్చెను. ఆ కాలమున ప్రజలు విస్తారముగ ప్రయాణము చేయుటచే రైలుబండ్లలో స్థలము లేకపోవుచుండెను. అయినను శ్రమయని యెంచక అట్లే యీయన ప్రయాణమును చేసెను. ఈయన నాగపూరులో జరుగనైయున్న (ఎన్.సి.సి.) జాతీయ క్రైస్తవ కార్యాలోచన సభకు పోవ సిద్ధపడుచుండగా ఆయన భార్య కష్టతరమగు ప్రయాణమును అట్టి బలహీనస్థితిలో చేయుట మంచిది కాదని అడ్డుపెట్టెను. అప్పుడాయన యిట్లనెను. "నేనవశ్యముగా పోవలయును. నేనింక ననేకవిషయములను నేర్చికొనవలసియున్నది."
పిదప పయనమై ప్రధమమున మద్రాసు పోయి అచట తన పాత విద్యార్థి యొద్ద – రెండు దినములు బసచేసెను. అచట నుండి తిన్నగా నాగపూరు వెళ్ళెను. తిరిగి యింటికి వచ్చుటకు తదితర సభ్యులతోపాటు రెండవతరగతి పెట్టెలో ప్రయాణము చేయుటకు కావలసినంత డబ్బు తన యొద్ద లేకపోవుటచేత తాను ఒక దినము అచటనే ఆగిపోవలసివచ్చెను. మరునాడు తన టికెట్టు కొనిన తరువాత నాయనయొద్ద ఒక్కరూపాయి యెనిమిది యణాలు మాత్రమే మిగిలియుండెను. అందుచే ఆ దీర్ఘప్రయాణములో అతి జాగ్రత్తగా డబ్బును వాడుకొనవలసి వచ్చెను. భోజనము చేయుటకు డబ్బు చాలనందున అప్పుడప్పుడు కొంచెము ఫలహారమును మాత్రమే తీసికొని యాకలితీర్చుకొనెను. తుదకు మిక్కిలి యలసినవాడై స్వగృహము చేరెను. ఇట్లు తానీదినములలో చేసిన ప్రయాణములన్నియు నత్యంతసాహసకృత్యములుగ నుండెను. అయితే యెట్టి కష్టపరిస్థితిలోనైనను థియోఫిలస్ తన విద్యుక్తధర్మమును నెరవేర్చుటకు వెనుదీయలేదు. ఇంటికి వచ్చిన పిదప థియోఫిలస్ తన భార్యతో నిట్లనెను: "కమలం, చూచవా! సిరంపూరు కళాశాల ప్రిన్సిపాలగు డాక్టరు ఆంగస్ గారు జ్వరముతోనున్నను కూటములకు వచ్చుట మానక, చేయూతగా నొకబెత్తమును చేబూని హాజరయ్యెను!"
కొన్ని దినములైన తరువాత ఆయన రామాయపట్టణము నందలి అమెరికన్ బాప్టిస్టుమిషను వారి వేదాంత పాఠశాల యందు కొన్ని యుపన్యాసములనిచ్చుటకు వెళ్ళెను. తిరిగి వచ్చునపుడు మార్గము నందు ఒంగోలులో నొక ఆదివారమున ఆగి గుడిలో ప్రసంగించవలసియుండెను. ఒంగోలు పోవునపుడు మాన్సూన్ గాలుల వలన తుఫాను రేగినందున నావర్షము చలిగాలిలోనే ఆయన ప్రయాణము చేయవలసి వచ్చెను. అచటి నుండి కృష్ణామండలి యందు గుడ్లవల్లేరు గ్రామమున యువజనసభలో ప్రసంగము చేయవెళ్ళెను. ఆ ప్రసంగసారాంశమిది: "ప్రభువు నేడు మిమ్మునీ ప్రశ్న నడుగుచున్నాడు. నేనెవనిని పంపుదును? నాకొఱకెవరు పోవుదురు?" ఇట్లుచెప్పి యువకులను హెచ్చరించెను. ఆయన మరికొన్ని గ్రామములను దర్శించిన పిదప తిరిగి డిసెంబరు 9వ తేదీ రాత్రి స్వగృహము చేరెను.
విరామము లేని కార్యకారి
థియోఫిలస్ అనుదినము వేకువనే లేచి మధ్యరాత్రి వరకు పనిచేసి పండుకొను చుండెడివాడు. విరామము లేక సదా పనిచేయుచుండును. తనకెంత కొద్ది సమయమున్నను దానిని ప్రభువు కొఱకు ఏరీతిగా యుపయోగించనా! యని యోచించువాడు. తన దినచర్య వ్రాసిన పుస్తకములో చూచినచో ఒక నాడు ఆయన రాజమహేంద్రవరములో భోజనశాలలో భుజించినపిదప రైలుకు వెళ్ళుటకుముందు కొద్ది సమయమేయున్నను దానిని సద్వినియోగపరచుటకై ఒక యంశమును అనువదించి రవిపత్రికకు పంపెను. ఇట్టి విరామములేని సేవ తనను క్షయ రోగమునుండి చనిపోకుండా కాపాడిన దేవుని యెడల తనకున్న సంపూర్ణకృతజ్ఞతను తెలియజేయుచున్నది. కడుబలహీనస్థితిలో నున్నందున స్వల్పకాలమే జీవింపగలుగుదుననెడి యోచనగలిగి అనుదినమును తనశక్తి కొలది ప్రభువుసేవకై యెక్కువ సమయమును వినియోగించుటకు కృతనిశ్చయుడయ్యెను.
ఒకసారీయన ఒకపుస్తకము నచ్చువేయుటకిచ్చెను. దానిని ముద్రించునపుడు అచ్చుపొరబాటులను దిద్దుటకు తన మిత్రులలో నొకరు తోడ్పడెదనని చెప్పగ నీయన, "వద్దు. నేనే దానిని చూడవలయునని చెప్పెను." తీరిక లేని పనుల భారమున్నను తన కార్యములు క్రమముగ నుండునట్లు స్వయముగ తానే నిర్వహించుకొనుచుండెను. ఇతరులపై నాధారపడువాడు కాడు. ఈ కాలమున వైద్యులీయనకు తన యారోగ్యమును వృద్ధిచేసికొనుటకై కొంతకాలము విశ్రాంతి దీసికొనవలెనని సలహానివ్వగ, యిట్లనెను. "అవును. నాకు విశ్రాంతి అవసరమనుట వాస్తవమేకాని నేను ప్రభువు సేవ చేయకుండా యుండలేను." తాను పూనిన కార్యములను నిర్వహించుటలో నెన్నడును తన ప్రాణము తనకెక్కువ ప్రియమైనదిగ నెంచుకొనలేదు.
ఈ విధముగ స్వార్ధమెరుగని తీవ్రమగు సేవాతత్పరుడగుటకు గల కారణము తనక్రీస్తు యేసునందుగల ప్రేమయే. ఆ ప్రేమయే తన మానసమనెడి మహాజలధిని కదలింప వివిధ కార్యక్రమములనెడు తరంగములు ఒక దాని వెనుకనొకటుద్భవించి పలుదిశలు నావరించెను. డిసెంబరు 9వ తేదీన తనయొద్ద నిలువయున్న జాబులకు ప్రత్యుత్తరములను వ్రాయుచు చాలా రాత్రి వరకు పనిచేసెను.
చివరి దినము
(1946, డిసెంబరు 10)
థియోఫిలస్ డిసెంబరు నెల పదియవ తేదీ యుదయమున యధాప్రకారము వేదాంతపాఠశాలకు పోయి మొదటి గంటలో బడి విషయమైన కొన్ని సమస్యలగూర్చి తనతోటి యుపాధ్యాయులతో సంభాషించెను. తరువాత ఆయన ఉపాధ్యాయుల విశ్రాంతిగదిలో నేకాంతముగ నుండి తాను బోధింపవలసిన పాఠమును చదివి సిద్ధపరచుచుండెను. గంట కొట్టబడెను. పాఠకులు తమ గదిలో నుండి యీయన రాక కొరకు ఎదరుచూచుచు 'ఎల్లప్పుడును గంట కొట్టిన వెంటనే తరగతిలోనికి ప్రవేశించు ఈ పండితుడు యేకారణమున ఈ నాడాలస్యముచేసెను?' అని యాలోచింపదొడగిరి. ఒక బాలకుడాయనను పిలుచుటకై ఆయన యున్నగదికి పోయి తన ప్రియగురువు స్పృహదప్పి నేలపై బడియున్న దృశ్యమును చూచి నిశ్చేష్టితుడయ్యెను. ఆయన చేతియందున్న పరిశుద్ధగ్రంథము రక్తముద్రితమయి యుండుటయు, తన నుదుటి గాయమునుండి స్రవించు రక్తధారను చూడ నాయన పరిశుద్ధ గ్రంథమును చదువుచునే పడిపోయెనని గ్రాహ్యమగుచుండెను. స్పృహదప్పెనేగాని ముఖముపై నెమ్మదితొలగలేదు. రక్తసిక్తములగు తన దుస్తులు, పరిసరములు, యీయన నొక ప్రశాంత హతసాక్షిగా ప్రదర్శించెను. విద్యార్థుల హృదయములు దు:ఖముతో నిండుకొనగా, కండ్ల నుండి ఆ ప్రయత్నముగా కన్నీరు ప్రవహించెను. కళాశాల సహోధ్యాపకుల మనసులు తత్తరిల్లెను. ఆకస్మికముగా సంభవించిన యీ విపత్తునకు వాపోయుచు అ చిరకాలములో ఆయనను కాకినాడ పెద్ద ఆస్పత్రికి గొంపోయిరి. స్పృహదప్పి యున్న యీయననొక పరుపు పై బరుండబెట్టిరి. సుమారు రెండు గంటల వరకును ఆయన యందనురాగముగల జనసమూహము గుంపులుగుంపులుగ నాయననుజూడ నేతెంచుచుండిరి. మధ్యాహ్నము ఒంటిగంట పదునైదు నిమిషముల వరకును ఆయన అట్లే నిస్పృహస్థితిలో నుండెను. తరువాత తమ ప్రాణముల నెక్కువ ప్రీతికరమైనవిగనెంచక పరలోకగతులైన వీరబృందము తన్నెదుర్కొనరాగా ప్రశాంతముగ దివ్యనిద్రలో తన భౌతిక యాత్రను ముగించుకొనెను. ఈ యోధుడిహమున ధైవకార్యార్థమై దేవుడనుగ్రహించిన బాహ్యేంద్రియములనియెడి యుద్ధపరికరముల నిచటనే విడిచి, తన నమ్మకమగు సేవాఫలితముగ పరమున దాచబడిన బహుమానమును పొందనై, తన సమకాలికులకంటె ముందుగనే పరమున కరిగెను.
"మరణము భక్తుడు భయపడవలసిన విషయము కాదు గాని నిత్యజీవమున బ్రవేశించుటకు అది గుమ్మమువంటిది." యని థియోఫిలస్ తాను జీవించియుండగనే తన ధ్యానమున గ్రహించెను. మరియు మరణమును గూర్చిన ఆయన ధ్యానము ఈరీతిగనుండెను: "మన దేహములు మరణమును దీర్ఘనిద్రజెందుట ద్వార మన యాత్మలు మహిమలోకములోనికి బ్రవేశించును. మన సారూప్యము మరణమువలన నిర్మూలము కాదు గాని క్రీస్తునందు సంపూర్ణసిద్ధినొందును. మృత్యువు వలన మహిమలోక దృశ్యము మనకు బయలుపడును. పరిశుద్ధుల పరలోక జీవితమునకిది ప్రారంభము.ఆత్మతో ప్రభువునారాధించి సేవించుటకు చావు మనకు మరియొక సదవకాశమును కలుగజేయును. క్రీస్తుతోకూడ నుండుట కిదియొక నూతన నిరీక్షణను కలుగజేయును."
థియోఫిలస్ తన జీవితమున చేసిన యీ దిగువ రెండు ప్రార్థనలును తన మరణ సమయమున సఫలమయ్యెను. "దేవా ఏక్షణమందైనను మృత్యువు నెదుర్కొనుటకు నన్ను సిద్ధపరచు ప్రభువా! నా జీవిత చివరి గడియ వరకు నన్ను నీ సేవలో నుంచుకొనుము."
"నేనైతె నీతిగలవాడనై నీముఖ దర్శనము చేసెదను. నేను మేల్కొనునప్పుడు నీ స్వరూప దర్శనముతో నాయాశ దీర్చికొందును." (కీర్తణ 17:15)
"ఓ మరణమా! నీ విజయ మెక్కడ? మరణామ, నీ ముల్లెక్కడ (1 కొరింథి 15:55).
థియోఫిలస్ పరలోక గతుడైన కొన్ని దినములకు 1947 సంవత్సరము జనవరి 6వ తేదీన బాప్టిస్టు మహాసభ కాకినాడలో ప్రారంభమాయెను. కెనడా బోర్డు మిషను కార్యదర్శియగు రెవ.జె.బి. మెక్లారిన్ గారు బాప్టిస్టు మిషను కార్యక్రమమును మహాసభ కప్పగించుటకు కెనడా నుండి వచ్చి ఆ సభకు హాజరయ్యెను. ఈ సభతో బాప్టిస్టు మిషనులో నొక నూతన శకము ప్రారంభమాయెను. ఈ నూతన సభ యొక్క పద్ధతులను కార్యక్రమమును ఏర్పాటుచేసిన ముఖ్యనాయకుడగు థియోఫిలస్కు యత్నములు కార్యసిద్ధి జెందినపుడు చూచి యానందించు భాగ్యము లేకపోయెను. నలువదియేండ్లు ఇస్రాయేలీయులనరణ్యములో అష్టకష్టముల కోర్చినడిపించి, కానానుదరిజేర్చి, చివరికావాగ్ధా దేశములో బ్రవేశింపకనేప్రాణముల విడచిన మోషేవలె నీయన బాప్టిస్టు మహాసభను ఆధునిక పరిస్థితులనుగుణ్యముగ నున్నతస్థితికి దెచ్చి, యాప్రారంభ సమావేశమున పాలుపొందక పూర్వమే ప్రభుసన్నిధికేగెను. మోషేకు పాలుతేనెలు ప్రవహించు దేశమును చూపుటకై పిస్కాకొండపైకి పిలిచినట్లు థియోఫిలస్ను కూడ దేవుడు మహిమ లోకమున ఆహ్వానించుకొనెను.
మహాసభ పరిపాలన విధానమున థియోఫిలస్ సేవా ఫలితము
చేయబడిన ముఖ్యమగు మార్పులు (డివోల్యూషన్లు)
1. 1946 డిసెంబరు నెల వరకును బాప్టిస్టు మిషనుకు సంబంధించి సువార్త సేవయు, ఆస్పత్రులలోని పనియును, సాంఘికసేవయు విద్యావిషయమగు సేవయును తదితర కార్యములన్నిటికిని మిషన్ కాన్ఫరెన్సు వారే పూచీ వహించియుండిరి. ఆ కార్యక్రమమంతయు నిప్పటి నూతన విధానమును బట్టి కనేడియన్ బాప్టిస్టు సంఘములనుండి ఎన్నుకొనబడిన సభ్యుల సమాజమగు మహాసభకు అప్పగింపబడెను.
2. పూర్వము మిషనెరీ వారిమీదనే సువార్త సేవ పూచీ ఆధారపడియుండెను. అయితే యిప్పటి పరివర్తనమును బట్టి సంఘము సువార్త సేవకేంద్రస్థానమయ్యెను. సంఘకాపరికి ప్రాముఖ్యత యివ్వబడెను.
4. మహాసభ యొక్క కార్యక్రమములో నాయకత్వమును దేశీయులెంతగా వహించిరో దానికి సరిసమానమగు ఆర్థిక భారమును గూడ వారు వహించుటకు పూనుకొనిరి. అందువలన కెనడా దేశమునుండి వచ్చుచున్న ద్రవ్య సహాయమికమీదట నదనముగనుండును. క్రమముగా తగ్గించబడును ఇప్పటి నుండియు దేశీయులే సంపూర్ణ బాధ్యతను వహించి చందాలు విరివిగా నిచ్చి సంఘములను స్వపోషణ స్థితికి నడుపవలెను.
5. ఇదివరలో సంఘస్థులు తమ సంఘమునకు సంబంధించిన కార్యములను నిర్వహించుటలో బాధ్యత వహించలేదు. సంఘాధ్యక్షుడే సమస్త కార్యములను నిర్వహించుకొను చుండెడివాడు. ఇప్పుడు సంఘధ్యక్షుడును, సంఘస్థులును సోదరులవలె నన్యోన్యమైత్రితో దైవసేవ జేయువలయును.
6. స్త్రీలకు గల సామర్థ్యమును, వరములను వివిధ సంఘ కార్యక్రమములలో నెక్కువగ నుపయోగించుకొనవలెను.
7. మిషనులో వేర్వేరు పొలములలో పనిచేయుచున్న మిషనెరీ వారు ఇదివరలో నొక విషయమును వివిధ రీతుల జరిగించుచుండెడివారు. కాని ఇప్పుడందరును ఏకాభిప్రాయము గలిగి ఒకే విధముగా పనులను జరిపించుట ఏర్పాటు చేయబడును.
థియోఫిలస్ మరణానంతరమున రెవ. ఎ. గోర్డన్ దొరగారు కెనడా నుండి థియోఫిలస్ గారి సతీమణియైన కమలమ్మ గారిని ఓదార్చుటకు వ్రాసిన ఉత్తరములో థియోఫిలస్ ను గురించి తన యభిప్రాయము నిట్లు వెల్లడించిరి:-
ప్రియమైన కమలమ్మగారికి,
గత రాత్రి మేము ఇంటికి చేరునప్పటికి థియోఫిలస్ ఆకస్మికముగ నిత్యవిశ్రాంతిలో బ్రవేసించిరను కబురు రాగా నిర్ఘాంతపోతిమి. వెంటనే మా మనసులు సుమారు ఆరువారముల క్రితము ఆయన మాకు వ్రాసిన జాబువైపునకు మరలెను. అందులో తానెంతగ నలసి నీరసముగా నుండెనో మాకు తెలియజేసెను. ఇంత త్వరలో నాయన మృతినొందుటను బట్టి చూడ జాబు వ్రాసినపుడాయన యెంతగా అలసియుండెనో గ్రహించిరి. ఔను! ఆయనకనేకములగు కార్యభారములు తనపై బడుచే వానినన్నింటిని నిర్వహించుచు విశ్రాంతి లేక అలసి కృశించి పోయెను. తన ప్రశాంతమగు నాయకత్వమును బట్టి నిజముగా నాయనయే మన క్రైస్తవ ముఖ్యనాయకుడని తేటతెల్లమగుచుండును. ఇతర నాయుకులను మించిన యున్నత మూర్తిత్వము ఆయన యందు కనబడుచుండెను. ఆయన యొక్క ఆధ్యాత్మిక జీవితం తాను ఆంధ్రక్రైస్తవుల ఆత్మీయ నాయకుడని వేనోళ్ళ జాటుచున్నది. బాప్టిస్టు క్రైస్తవులాయన నెంతో గౌరవించిరి ఇట్లు అందరి మన్ననలకును బాత్రుడై ప్రఖ్యాతి నొందుటకు కేవలమీయన అర్హుడని మేమాయన యెడల చూపిన మర్యాదలే సాక్ష్యమిచ్చుచున్నవి. నూతన మహాసభ పద్ధతుల నేర్పాటు చేయుటలో ఆయన చేసిన కృషియు, ఆయన యొక్క ప్రాముఖ్యతయు, తన అతి శ్రేష్ఠమగు నాయకత్వమును బుజువు చేయుచున్నవి. గతించిన మిషను కౌన్సిల్లో నూతన మహాసభ యొక్క నిబంధనోపనిబంధనలను ఆయన యిరువది పుటలు వ్రాసి చదివి వినిపించగ నాసభలో నున్న మిషనెరీలును ఆంధ్ర క్రైస్తవ నాయకులును ఆనందభరితులై యాయననెంతగా నభినందించింతిరో చెప్పనలవిగాదు. ఆ దృశ్యమును నేనెన్నడును మరువలేను. ఇకమీదట మహసభకు చెందిన బాప్టిస్టు సంఘములన్నియును ముందుకు సాగిపోవు తమ కార్యక్రమములు వీరు వ్రాసిన నిబంధనలను బట్టియే నుండును. ప్రయాసపడి యీ యేర్పాటులు ఆయన చేయకుండినచో ఆ కార్యవిధానమును మేమెన్నటికిని అంత నిపుణతతోను సఫలకరముగను చేసి యుండపోదుమని తప్పక ఒప్పుకొనవలసియున్నది.
జీవితాంతమున మరింత శ్రేష్ఠమగు సేవ నాలోకమున చేయుటకై మీ ప్రియమైన భర్తగారిని దేవుడు తన యొద్దకు పిలుచుకొనెను. దీనినిబట్టి ఆయన యీ లోకములో చేయవలసిన సేవనంతటిని ఘనముగాచేసి ముగించెననియు మహోన్నతమగు పరలోక జీవితము కొరకును ఆయన ఆత్మీయముగ నెక్కువసిద్ధపడెనని కనబడుచున్నది. అయితే ఆయన లేకపోవుట మనకు తీరని గొప్పలోటును కలుగజేసినది. వినయ, శాంత స్వభావుడగు యీమూర్తిని యికమీదట సభలలో చూడము గదా! ఆత్మీయోద్రేకమును కలిగించు ఆయన ప్రసంగము ఇక మనకు వినబడవు గదా! శక్తిసామర్థ్యములతో కూడిన ఆయన బోధనాపద్ధతులను, విద్యార్థులకాయన చూపిన మాదిరి జీవితమును, ఇకమీదట వేదాంత కళాశాలలో మనకు కనపడవు గదా! దక్షిణ కాకినాడ పొలములో మాత్రమే కాక బాప్టిస్టు సంఘసభ్యులందరి మధ్యను ఆయన నాయకత్వములోని క్రీస్తును బోలిన దివ్వలక్షణములిక మీదట మనకగపడవు గదా! మనొక్కొక్కరి ప్రత్యేక జీవితములలో ఆయనతో కలిగియున్న స్నేహము సహవాసమును ఇక మనకు దొరుకవు గదా! ఆయనకున్న ప్రేమపూర్వకమగు బాధ్యతయును, ఆయన యిచ్చు జ్ఞానోపదేశములు సంఘములు యిక మీదట ఆనుభవించనేరవు గదా! మిషను యొక్క కార్యక్రమమంతటిలోను ఆయన న్యాయమును, జ్ఞానములతో కూడిన సలహాలు యిక మీదట మనకు దొరకవు గదా! జీవితయాత్రలో నీతో కూడ నుండవలసిన నీ ప్రియమైన భర్తను పోగొట్టుకొనుట యందు మీకు గల దుఃఖమును, మీ ప్రియకుమారులిద్దరును వారితండ్రిని పోగొట్టుకొనుటలో వారికి గల నష్టమును మాకందరికిని కలిగిన నష్టమకంటె ఎంతో ఎక్కువైనవియు ఎవరును తీర్చలేనివైయున్నవి. అయినను మన పరలోకపు తండ్రి మిమ్మును ఆదరించి, ఓదార్చునని నేను నమ్ముచున్నాను. ఇట్లు మీ తోటి విశ్వాసి,
ఎ. గోర్డన్
1947వ సంవత్సరము మహాసభ అధ్యక్షులయిన శ్రీ జి.ఎ.సాముయేలు గారు థియోఫిలస్ యొక్క ఉత్తమత్వమునభినందించుచు నిట్లు చెప్పిరి:
"సోదరుడగు థియోఫిలస్ హిందూ దేశీయ క్రైస్తవసభకు సభ్యుడుగాను, ఆంధ్ర క్రైస్తవ సభకును అధ్యక్షుడుగను నుండి వారికి సంబంధించిన వాడగుటచేత బాప్టిస్టు మిషనులో మాత్రమే కాకుండా ఇతర మిషనులలోని క్రైస్తవులు కూడ నీయనను బాగుగనెరుగుదురు. ఈయన దైవభక్తి గలవాడనియు, పేదలకు ప్రియస్నేహితుడనియు చక్కని సలహాకారియనియు, ఆకర్షణీయమగు శీలము గలవాడనియు చాలా ప్రాంతములలో ప్రఖ్యాతిజెందెను. ఈయనకు గల వినయము, నిరాడంబర జీవితము, ఆదర్శప్రాయములగు ముఖ్యలక్షణములు, ఎట్టికష్టపరిస్థితులేర్పడినను సరకుచేయక సత్యమునకై ధైర్యముగ నిలిచి కార్యములను సాధించెడువాడు. ఆయన శక్తి సామర్థ్యములు గల ఉత్తమ నాయకుడు. ఈయన యందు గల ఉత్తమ లక్షణముల నన్నిటికిని మనము మరువజాలము."
మద్రాసులో నివసించు దైవజనుడైన ఎన్. దానియేలు గారు, థియోఫిలస్ మరణానంతరమాయనసతీమణికి ఆయన యొక్క సుగుణములను కొనియాడుచు నిట్లు వ్రాసిరి:
"ప్రియమైన తియోఫిలస్ సతీమణికి,
మీకు సంభవించిన ఆకస్మిక దుఃఖము నుండి మిమ్మునోదార్చుటకు మిక్కిలి విచారముతో నీయుత్తరము వ్రాయుచున్నాము. బాప్టిస్టుమిషనులో మీ భర్త అందరి వలనను ప్రేమింపబడి గౌరవింపబడిన స్వార్థరహితుడగు నాయకుడు. ఆయన జీవితము అలంకరించిన దైవకృపావరములు ఘనమైనవియు ఆశ్చర్యకరములునై ప్రభువనకెంతో మహిమను కలిగించెను. బాప్టిస్టు మిషనులో వినయమనస్కుడును, అతిశ్రేష్ఠుడును, భక్తివరుడునగు మీభర్తకు పరిచర్య చేయుట నీ భాగ్యమైయుండును. ఆయన భక్తిగల తత్పురుషుడని నేనాయనను పిలుతును. ఏలయన నాయనలో భక్తునికి గల ఉత్తమగుణములను మాత్రమే నేను కనుగొంటిని. అంత బలహీనుడైనను శక్తి సామర్థ్యములు గలిగి విస్తారమగు సేవ చేయుట చూడ నాకశ్చర్యము కలుగుచుండెడిది. పేదరికమున నవతరించిన రాజాధిరాజగు యేసుక్రీస్తు ఆయన స్వభావము నీయనకు బ్రసాదించెను. క్రీస్తుకు సంపూర్ణముగ సమర్పించుకొనిన యొకరి ద్వార దేవుడెంతటి ఘనకార్యముల చేయగలడో తలచినపుడు నాకాశ్చర్యము కలుగుచుండును. థియోఫిలస్ గారి వంటి మంచి స్నేహితుని నేను పోగొట్టుకొంటిని అట్టి ఉత్తమ మిత్రుడు నాకిక లభింపడు. నాకిది యెంతో దుఃఖకరముగ నున్నది. ఆయన అనారోగ్యముగనున్నను దేవుడాయన నింతవరకును జయకరముగ తన సేవలో వాడుకొనినందునను అట్టి శ్రేష్ఠ జీవితమాయనకను గ్రహించినందునను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రేమాభిమానములతో,
ఎన్. దానియేలు
రాజమండ్రి క్షయరోగుల విశ్రాంతిపురములో వైద్యుడగు డాక్టరు. పి.కె.కోషీ, థియోఫిలస్ చేసిన సేవలను ప్రశంసించుచు నిట్లు చెప్పెను.
"థియోఫిలస్ గారు క్రైస్తవ జనాంగమునకు బలమైన స్తంభము. ఆయన యొక్కనిజక్రైస్తవ లక్షణములును, శక్తి సామర్థ్యములును, భక్తి గల జీవితమును తనతో సంబంధము కలిగించుకొనిన వారినెల్ల నాకర్షించి వారి గౌరవాభిమానములకు పాత్రునిగ జేసినవి. చాలాకాలము వరకు ఈ క్షయరోగుల ఆశ్రయము యొక్క పాలక వర్గములో నొక సభ్యుడుగ నుండి యీయన తత్సంబంధమగు ననేక సమస్యలలో మంచి సలహాలనిచ్చి చేసిన సహాయము ప్రశంసనీయము. ఈయన కాలగతుడగుటచే నిశ్చయముగా ఈ సంస్థ కెంతయో వెలితిగలిగిట్లున్నది. ప్రభువు యొక్క అడుగుజాడలననుసరించి యీ లోకములో నడచినందున పరలోకపు తండ్రి యీయన యందానందించి తన యొద్దకు పిలుచుకొనెను. ఈ విశ్వాసము తన బంధుమిత్రుల నెంతగనైన నోదార్చగలదు."
ఆంధ్రక్రైస్తవ సభ ప్రారంభము నుండి థియోఫిలస్ ఆంధ్రక్రైస్తవ సంఘములో నొక ప్రాముఖ్యమగు సభ్యుడుగను రెండువత్సరములు ఈ సంఘమునకద్యక్షుడుగను నుండెను.
నంద్యాలలో నుండు బిషపు బన్యను యోసేవు గారు ఇట్లు వ్రాయుచున్నారు. "సోదరుడగు థియోఫిలస్ ఒక గొప్ప క్రైస్తవ సాధువు. భక్త వరుడు. ఈ ముఖ్యనాయకుడు లేక పోవుట క్రైస్తవాళికి తీరని గొప్పలోటు. ఈయన క్రైస్తవ సంఘములో నుండు సామాన్యమగు చిక్కులను లోటులను సవరించి సమాధానమును నెలకొల్పిన గొప్ప సహాయకుడు. ఈయన చూపిన మాదిరిననుసరించి ఆయనతో పాటు పరలోకములో పాలిభాగస్థులమగుటకు ప్రభువు మనకు తన కృపననుగ్రహించుగాక."
డిశెంబరు 1947 లో గుంటూరులో జరిగిన ఆంధ్రక్రైస్తవ సమితివారు, థియోఫిలస్ ఆ సమితిలో చేసిన సేవలనభినందించుచు నిట్లు వ్రాసిరి. "పండితుడగు థియోఫిలస్ గారిని తన సన్నిధికి పిలుచుకొనుట మన పరమ తండ్రికిష్టమైనందున కీర్తిశేషులగు యా మహనీయుని గురించి యీ తీర్మానము చేయుచున్నాము. "వారి లోతైన దైవభక్తిని ఆకర్షణీయమగు శక్తి సామర్థ్యములను, నాయకత్వ నైపుణ్యతను గుర్తించి కృతజ్ఞతతో జ్ఞప్తియందుంచుకొని, యీ సంఘములో నుండగ నాయన చేసిన సేవను తలంచి ప్రభువునకు స్తోత్రములు చెల్లించు చున్నాము."
అఖిలభారత క్రైస్తవ జాతీయ సంఘము తరపున సిరంపురపు వేదాంతకళాశాల ప్రిన్సిపాలగు డాక్టరు జి.హెచ్.సి.ఏంగస్ గారు థియోఫిలస్ను సిరంపూరు కళాశాలలో విద్యార్థిగనుండగను, సిరంపూరు విశ్వవిద్యాలయము యొక్క కార్యవర్గములో నొక సభ్యుడుగనుండను, క్రైస్తవ జాతీయ సంఘ సభ్యుడుగనుండగను బాగుగ నెరుగును. కావున ఆయన థియోఫిలస్ను గురించి ఇచ్చిన సాక్ష్యము:
"ముత్యాల థియోఫిలస్ను తలచినపుడెల్ల నాకొక వాక్యము తరచుగ జ్ఞప్తికి వచ్చుచుండను." ఆదేదన "ఇదుగో యితడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటములేదు.
ఇరువది యైదేండ్లకు పూర్వము సిరంపురపు కళాశాలలో నాయన విద్యార్థిగ జేరినపుడు మొదటనే నాయనను చూచితిని. ఆయన నెమ్మదియైనవాడుగను, నమ్మకమైన వాడుగను క్రీస్తు సేవాభిలాషిగను, మితభాషిగను నాకు కనబడెను. క్షయరోగ చిహ్నములు కనబడినందున ఒక సంవత్సరమీయన బడిని విడచి దేహారోగ్యమునకై వేరొక చోట నుండవలసివచ్చెను. ఆయనను మరల చూతుమను నిరీక్షణ మాకు లేదు గాని సంవత్సరాంతమున నాయన ఆరోగ్యవంతుడై తన విద్యను ముగించుటకు కడు నిశ్చయుడై తిరగి కళాశాలకు వచ్చెను. విద్య ముగిసిన వెంటనే సంఘములోని సేవను ఆరంభించెను. ఆయన వంటి అనారోగ్యము గల యొక వ్యక్తి సాధారణముగ నిరుత్సాహపడి తన సేవ నుండి విరమించియుడెడువాడు. కాని ఆయన తన దినములు కొద్దివని గ్రహించి సత్యాతురతతో ప్రతియవకాశమును సద్వినియోగము చేసెను. శక్తి సాహసములతో సేవను చేసెను. ఒక్కోకప్పుడు ఆయన యొక్క దౌర్భల్యస్థితిని గమనింపక తనయందలి నమ్మకముచేత మరియొక్కువ భారమైన పనులనాయనకప్పగించినను విసుగుజెందక నమ్మకముగ సమస్తమును చక్కగ ముగించెడువాడు. ఈ దివ్వలక్షణములను బట్టియే ఆయన నాయకులలో ఒక ఉత్తమ నాయకుడుగ పరిగణింపబడెను.
జాతి కుల భేదము దురాశ స్వార్థాపేక్ష లేక నమ్మకమగు సవ్వభావముగలవాడగుట చేతనే యీయన క్రైస్తవనాధ్యాపకుడగుటకర్హుడయ్యెను. ఇతరులలో సత్స్వభావమునే నిరీక్షించుచు, అట్టి మంచినే వారి జీవితముల నుండి తీసికొనువాడు. ఇట్టి సద్గుణరాశియగుట చేతనే మేమాయన సలహాలనంగీకరించి ఆయనను నమ్మి ప్రేమపూరితమైతిమి. అదియుగాక ఆయన యొక్క ప్రేమతత్వమును, ధైర్యమును, నమ్మకమగు స్వభావమును తాను ప్రేమించిన క్రీస్తుతో దగ్గర సంబంధము కలిగియుండుటచే అభివృద్ధిజెందెనని మేమెరుగుదుము. ఈ ఉత్తమ వ్యక్తిని దేవుడు మనకు ఈ విధంగా అనుగ్రహించినందున ప్రభువునకు స్తోత్రములు చెల్లించుదము. దేవుడు సజీవులకే గాని మృతులకు దేవుడు కాడని మనమానందభరితులమగుచున్నాము.
ఆంధ్ర ఇవాంజిలికల్ లూథరన్ సంఘము యొక్క అధ్యక్షులయిన రెవ.ఈ. ప్రకాశము గారు, డి.డి.
కీ॥శే॥ యం. థియోఫిలస్ గారి మరణ వార్త నాకెంతయో దుఃఖమును కలిగించెను. ఈయన నిర్యాణము వలన ఆంధ్రక్రైస్తవ లోకమునకు గొప్ప లోటు కలిగెనని చెప్పక తీరదు. థియోఫిలస్ గారి వంటి వ్యక్తి మరియొకరు లేరని చెప్పవచ్చును.
ఈయనతో నాకు గల పరిచయము: మొదట వీరు సిరంపురపు వేదవిద్య ముగించిన తరువాత నేనెరిగినప్పటికిని, వీరు మెక్లారిన్ ఉన్నత పాఠశాలలో చదువుకాలమందు పెద్దాపురములో చదువుచుండిన విద్యార్థులు వారిని మెక్లారిన్ ఉన్నత నక్షత్రమని పిలుచుచుండిన అపుడా నక్షత్రమును జూడవలెనని నేనెంతయు నాశించితిని గాని అప్పటిలో నాకు తరుణము చిక్కకపోయినను వారాపనిలో ప్రవేశించిన తరువాత నాకు వారితో గొప్పస్నేహమేర్పడెను. థియోఫిలస్ గారిలో నేను కనిపెట్టిన సుగుణములన్నియును నుదాహరించి తీరవలెను. థియోఫిలస్ గారు నిరాడంబర జీవితకాలములో నెన్నియో మార్పులు కలిగినను, వీరు ధరించిన దుస్తులలోగాని, వైఖరిలోగాని నెట్టిమార్పును గలుగలేదు. సరికదా సామాన్యుడుగనే మరణ పర్యంతము జీవించెను.
ఆలోచనపరుడు: ఆంధ్రక్రైస్తవ సభకు వీరు అధ్యక్షులుగ నుండిన కాలమున యీ సుగుణము విస్తారముగ ప్రజ్వరిల్లెను.
గొప్ప రచయిత: రవియను పత్రికలో వీరు వ్రాసిన ప్రసంగములను చదువుటకు నేనెంతయు గుతూహలపడువాడను.
ప్రసంగి: స్వరము చిన్నదేగాని తలంపులు, ధ్యానములును, భావమును చాలా ప్రశంసనీయమైనవి అగుటయే గాక విన్న వారిననేకులను మార్చెను.
మంచి స్నేహితుడు: ప్రభువునకు వలె నితరులకు మేలేగాని స్వలాభము నెన్నడును గోరనివ్యక్తి.
గొప్ప దేశాభిమాని: భారతీయ సంఘ స్వపోషణ, స్వతంత్రత, స్వపరిపాలన విషయమై వీరు చేసిన సేవ అవోఘము. జీతనాతములు పుచ్చుకొనకుండ ఉచితసేవ చేయుటకు తన తోడ్పాటునిచ్చుటలో నీయన తన సంఘమునకే గాక ఇతర సంఘములకును గొప్ప మార్గదర్శియాయెను.
'మీరేల అభిషేకమును తీసికొనరని' నేనొకమారు ప్రశ్నించగా, నేనింక సిద్ధముగ లేనని యీయన చెప్పెను గాని యనేకులయభిషేకారాధనలో వీరు ప్రసంగించుట చూచి నేను ఆశ్చర్యపడువాడను.
భారతీయ క్రైస్తవ సంఘనాయకులలో నగ్రగణ్యుడని చెప్పినను అతిశయోక్తి కాదనియే చెప్పవచ్చును. ఈయన మరణము వలన కలిగిన లోటును తీర్చునట్లు దేవుని ప్రార్థించుచు వీరు విడిచిన కుటుంబమనకును, మిత్రులకును నా సానుభూతిని తెలుపుచు నీ కొద్దిమాటలు వ్రాయుచున్నాను.
ఈ. ప్రకాశము,
ఆంధ్ర లూథరన్ సంఘాధ్యక్షుడు. గుంటూరు
ప్రొఫెసర్ ముత్యాల థియోఫిలస్ కుటుంబము భద్రపరచిన ఛాయాచిత్రములు.
కుటుంబ చిత్రములు
ఎడమ: ముత్యాల థియోఫిలస్. కుడి: ముత్యాల కమలమ్మ థియోఫిలస్. మధ్యలో పైన: ముత్యాల థియోడర్ సుధాకర్. మధ్యలో క్రింద: ముత్యాల బెంజమిన్ రంజిత్.
థియోఫిలస్ జన్మస్థలమైన గున్నపూడిలోని పందొమ్మిదవ శతాబ్దపు దేవాలయము.
సంతాప సందేశం
1946 డిసెంబరులో కాకినాడలో ముద్రించబడిన సంతాప సందేశము (ఆంగ్ల మూలము): "వేదాంత పాఠశాల, కాకినాడకు చెందిన దివంగత ప్రొఫెసర్ యం. థియోఫిలస్, బి.డి., 1895 మే 7వ తేదీన ఆకివీడులో జన్మించి, 1946 డిసెంబరు 10వ తేదీన మధ్యాహ్నం ఒంటిగంటకు కాకినాడలో పరలోక పిలుపు నందుకొనిరి. భారతదేశములో క్రీస్తు రాజ్యము కొరకు తమ ప్రాణములను సైతము లెక్కచేయని కొద్దిమంది అగ్రగాములలో ఆయన ఒకరు. ఆంధ్ర క్రైస్తవ సభ, అఖిల భారత క్రైస్తవయత్న సమాజము, ఉత్తర సర్కారుల బాప్టిస్టు మహాసభ, విద్యార్థి క్రైస్తవోద్యమము, తెలుగు ఒరియా మిషను కౌన్సిలు, కాకినాడ పాఠశాలల నిర్వాహకుల సంఘము వీటికి అధ్యక్షులుగను; సిరంపూరు కళాశాల, జాతీయ క్రైస్తవ సభ కార్యవర్గ సభ్యులుగను; ఉచిత సేవకుల తర్ఫీదు పఠనశాలల స్థాపకులుగను ఆయన అమోఘమైన సేవ చేసిరి. ఆయన జీవితము ప్రభువు పాదముల చెంత పగిలిన పరిమళ భరిణ. 'ఒక చుక్క పరిమళము కొరకు ఎన్నో పూలు నలిగిపోవును.' ఆయన భౌతిక దేహము జగన్నాయకపురము స్మశానవాటికలో సమాధి చేయబడెను."
వేదాంత పాఠశాల గ్రాడ్యుయేటింగ్ క్లాస్
వెనుక వరుస: గ్రాడ్యుయేటింగ్ క్లాస్. మధ్య వరుస: సిబ్బంది (ఎడమ నుండి కుడికి) మిస్టర్ అండ్ మిసెస్ ప్రేమానందం, శ్రీ మరియు శ్రీమతి భానుమూర్తి, శ్రీమతి జె.బి. మెక్లారిన్, డాక్టర్ జె.బి. మెక్లారిన్ (రిటైర్ అవుతున్న ప్రిన్సిపాల్), డా. జి.పి. బార్స్ (కొత్త ప్రిన్సిపాల్), శ్రీమతి బార్స్, శ్రీమతి మరియు మిస్టర్ థియోఫిలస్. ముందు వరుస: ప్రత్యేక కోర్సులో చదివే గ్రాడ్యుయేట్ల భార్యలు – లిజీ, మేరీ, రూపలత, మనోరంజిని మరియు కమల.
ముగింపు నివాళులు
నేను ఈ విషయం పట్ల కేవలం ఆశ్చర్యపోతున్నాను – ఒక మనిషి తాను యేసు క్రీస్తుకు అర్పించుకునే సమయంలో దేవుడు ఎంతటి గొప్ప కార్యాలు చేయగలడో. నా కోసం ఇది ఒక వ్యక్తిగత నష్టం అనిపిస్తోంది, ఎందుకంటే నేను మిస్టర్ థియోఫిలస్ లాంటి మిత్రుని పొందలేను. అటువంటి వ్యక్తిత్వానికి, ఆయనను అంతవరకు దయచేసి కాపాడిన దేవునికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
ఎన్. డానియల్
మద్రాస్. "ముత్యాల థియోఫిలస్ గురించి ఆలోచించేటప్పుడు నా మనసులో మళ్ళీ మళ్ళీ వస్తున్న ఒక పదం ఇలా ఉంది, "అరమరికలు లేని దైవత్వ ఇశ్రాయేలు......" ఆయన ఆఖరి రోజులు కొద్దిగా ఉండొచ్చని తెలుసుకున్నట్లుగా, "సందర్భాన్ని సద్వినియోగం చేసుకోవాలని" ఆయన ఎక్కువ ఆసక్తి చూపినట్లుంది. మనలో ఆయన ఒక నాయకుడయ్యారు, ఆ నాయకత్వం ఆయన యొక్క మరింత నిజాయితీ వల్లబీ ఆయన ఎటువంటి స్వార్థ ప్రయోజనం, వర్గం లేదా జాతి పేదరికం, చిన్నపాటి ఆకాంక్షల నుండి పూర్తిగా విముక్తుడు అనిపించారు... "మరియు మన హృదయాల్లో ఆయన ప్రేమ, ధైర్యం, నిజాయితీ అన్నీ యేసు క్రీస్తుతో ఉన్న ఆయన సఖ్యత నుండి ఉత్పన్నమయ్యాయి అని తెలుసుకుంటాము. ఆయన నిజంగా ఆయనతోనే నడిచారు."
ప్రిన్సిపాల్ – జి.హెచ్.సి. ఆంగస్,
సెరంపోర్ "దేవుడు ఒక దేశం లేదా తన సంఘం కోసం ఒకే తరంలో ముత్యాల థియోఫిలస్ వంటి ఎంతోమంది మనుషులను ఇవ్వడు. ఈ గొప్ప మనిషి, ఆయన యొక్క క్రైస్తవ చరిత్ర మరియు ప్రవక్తి దృక్పథం కోసం మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకొందాము. ఆయన జ్ఞాపకం భారతదేశంలోని క్రైస్తవ సంఘాల కోసం అత్యంత విలువైన సంపదలలో ఒకటిగా మిగిలిపోతుంది."