#505

మోక్ష నివాసము

రాగం: అసావేరి (ఛాయ: ఇప్పటి నరులారా) · తాళం: త్రిపుట · రచయిత: తూలూరి కొర్నేలియస్

Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం · Open in the hymnal app

పల్లవి · Pallavi
పరిశుద్ధం పరిశుద్ధం – పరిశుద్ధం బైన యా పరమ కానానున – కరుగున దెపుడో ||పరిశుద్ధం||
చరణము 1
పరిశుద్ధమయిన యా – యెరూషలేము పురము – వర పద్మరాగంపు – స్థిర పునాదులతోడన్ పరిఢవిల్లు సువర్ణ ప్రహరియు గోడలు – నవరత్న – ద్వారంబు లదిగో గల వహవహా ||పరిశుద్ధం||
చరణము 2
ఆ హితపురమున – నాకాశమున వెల్గు – భానుడు శశికాంతమ – బడబోవు దేదీప్య – మానంబై విలసిల్లు – మానిత గొర్రెపిల్ల – దానికి జ్యోతియై తనరుచుండు నహవహా ||పరిశుద్ధం||
చరణము 3
శృంగారమైనట్టి – బంగారు వీధులలో – చెంగు చెంగున దాట – శ్రేష్ఠ సమయంబున మంగళ ప్రదమైన – మహిమ రాజ్యమునందు – రంగైన ప్రభుయేసు – రాజున్ దర్శింతును ||పరిశుద్ధం||
చరణము 4
తళతళ మెరిసెడు – ధవళంపు టంగీలు – కళ లీనుచుండంగ – గాళ్లార ధరియించి భళీ భళీ యంచు – భక్తాళితో నెపుడు – నెళవుగా నుందుము – నిజ రక్షకుని చెంత ||పరిశుద్ధం||
చరణము 5
భూరి వీణెలు చేతన్ – బొల్పుగ ధరియించి – సారెకు మీటుచు – సంగీతములు పాడి శ్రీ రాజా నీకు జో – హారంచు ప్రభు యేసు – పేరన్ గీర్తింతురు – ప్రియ భక్తులందరూ ||పరిశుద్ధం||
చరణము 6
కరములు జోడించి – శిరముల్ కిందికి వంచి – వర పీఠమును జుట్టి – తిరుగు దూతలగూడి పరిశుద్ధం పరిశుద్ధం – పరిశుద్ధమని నేను – పరమ సంగీతంబు – పాడుచుండెద నాహా ||పరిశుద్ధం||