#495

విశ్వాసి పునరుత్థానము

రాగం: యదుకులకాంభోజి · తాళం: రూపకము · రచయిత: తూటూరి కొర్నేలియస్

Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం · Open in the hymnal app

పల్లవి · Pallavi
మరణమునకు విజయమేది – మరణమోడిపోయెరా – మరణమొంది యేసు ప్రభువు – మరల బ్రతికి లేచెరా ॥ మరణము ॥
చరణము 1
క్షయమునందు విత్తబడియె – నక్షయమునందు లేచురా – ప్రియుడు క్రీస్తునందు మృతులు – పెంపు పొసంగు ధన్యులు ॥ మరణము ॥
చరణము 2
లౌకిక దేహము విడి పర – లోక దేహి యగునురా – భీకర యొర్దాను యేసు ప్రేమతోదాటించురా ॥ మరణము ॥
చరణము 3
ధరణి దుఃఖ బాధలన్ని – ధరణియందే విడుతుము – పరమ దేవుని యొడ్డున ఉండునట్టి– పరదైసునకు బోదము ॥ మరణము ॥
చరణము 4
గగన వీధినుండి యేసు – గ్రక్కున వేంచేయురా – జగతి సర్వ మృతుల నొక్క –క్షణములోనే బ్రతికించురా ॥ మరణము ॥
చరణము 5
బూరరావ మాలకించి – భూమి యెల్ల వణకురా – వారిధిలో మృతులుజీవ – ధారులై లేచెదరురా ॥ మరణము ॥
చరణము 6
భక్తులు విశ్వాసమునకు – ఫలము నొంద బోదురు – మూర్తి కిరీటము ధరించి –రక్తితో జీవింతురు ॥ మరణము ॥
చరణము 7
కరుణలేని మరణమునకు – వెరవకుండ నుండుడి – మరణ విజయుడైనప్రభుని – చరణములు నుతించుడి ॥ మరణము ॥