#329

క్షమాపణ వేడుట

రాగం: ఖమాసు · తాళం: త్రిపుట · రచయిత: సిరిపురపు కృపానందము

Category: దేశీయ ప్రేషితోద్యమ రీతి · Open in the hymnal app

పల్లవి · Pallavi
పాపిని కృప చూపుమయ్యా – దాపు జేరితిని యేసయ్యా – పాప భారము క్రింద శ్రమపడి – కృంగియున్నాను యేసయ్యా ॥పాపిని॥
చరణము 1
వేష భాషలతోడ నిండి – మోసపోతిని యేసయ్యా – దోసి లొగ్గి నిన్ను జేరితి – దాసునిగ బ్రోవు యేసయ్యా ॥పాపిని॥
చరణము 2
నీతి లేని నాదు జీవిత – మేల నశించనియ్యవు యేసయ్యా – నీతి గరపి బ్రోవుమయ్యా – నీతి నిధుడా యేసయ్యా ॥పాపిని॥
చరణము 3
నీదు సిలువలోని ప్రేమ – నెంచదరమౌనా? యేసయ్యా – నాదు కలుషమంత బాపి – కనికరింపుమా యేసయ్యా ॥పాపిని॥
చరణము 4
నీదు రక్తధారలే ఇల – పాపి కాశ్రయము యేసయ్యా – నీతిమంతుల జేయుమయ్యా – నీతిసూర్యుండా యేసయ్యా ॥పాపిని॥
చరణము 5
దాపుగోరినవారలకు నీ – ప్రాపునిచ్చెదవు యేసయ్యా – పాపశాపము బాపి నిత్య – జీవమిడువయ్యా యేసయ్యా ॥పాపిని॥
చరణము 6
శాంతి గోరువారలెల్ల నీ – చెంత కరిగినచో యేసయ్యా – చింతలెల్ల దీర్చగలవు – శాంతి నొసగెదవు యేసయ్యా ॥పాపిని॥
చరణము 7
పరమరక్షక నీదు ప్రేమ – నెరుగు తరమౌనా యేసయ్యా – పరులమైన మమ్ము బ్రోవ – వేచియున్నావా యేసయ్యా ॥పాపిని॥
చరణము 8
నాదు హృదయము నీదె సుమ్మా – నీవె గైకొనుమా యేసయ్యా – శుద్ధ హృదయము చేసి నన్ను నీ – సుతునిగ జేయు యేసయ్యా ॥పాపిని॥