#309

క్రీస్తు సువార్త

రాగం: ముఖారి (ఛాయ: ఉన్నపాటున వచ్చుచున్నాను) · తాళం: త్రిపుట · రచయిత: రావూరి దావీదు

Category: దేశీయ ప్రేషితోద్యమ రీతి · Open in the hymnal app

పల్లవి · Pallavi
దారుణమగు మరణ – వారిధి దాటగ నే – వారి తరి శక్యము సోదర – ఘోరమగు కెరటములవలె వి – స్కారముగ నేరములు పైని గొని – పారుచుండునప్పుడద్దిరి – జేరుటెట్లు దారి గనరే ॥దారుణమగు॥
చరణము 1
ఒక్క పెట్టున నెగసి – చక్క వెళ్లుదమన్న హీ – రెక్క లెక్కరకు రావు – ఎక్కడెడైన నోడ గనుగొని – యెక్కిపోదమని తలంచిన – జెక్క నిర్మితమైన యోడ – లెక్కకు రావేమి సేతుము ॥దారుణమగు॥
చరణము 2
మంగళ ధ్వనులతో – శృంగారపురము వె – లంగుచున్నది ముందట – పొంగి పారుచు మరణనది త – రంగముల జలంగుచున్నది భంగపడకుడి మనకు క్రీస్తు – సువార్తయను పెను నావ యిదిగో ॥దారుణమగు॥
చరణము 3
వాద రహితుండైన – యాది దేవుడు దాని – నాథుండన బరంగును – బాధ లొందిన నరుల నందరి – జేరదీసిన క్రీస్తు యేసు – నాథుడే నావికుడు క్రైస్తవ – వేదమే చుక్కాని దీనికి ॥దారుణమగు॥
చరణము 4
మానవులందరు – మరణాంబుధిని దాట – మహనీయమగు నావ యిదే – దీనిలో నెక్కుటకు ముందే – మానుగ వాక్యమును విని సు – జ్ఞాన మొందినవారు క్రైస్తవ – స్నానమను పత్రికను బొందెదరు ॥దారుణమగు॥
చరణము 5
విదితంబుగా నిందు – విజ్ఞాన బోధకులు – వినిపించుదురు వాక్యమున్ – గొదగొనిన యాత్మములు తృప్తి – గొనును ప్రభు భోజనములోనే – హృదయములలో దేవునాత్మ – యెపుడు దీపంబై వెలుగును ॥దారుణమగు॥
చరణము 6
పలువిధ సంగీత – ములతో సాగుచు మనము – నలయకుండగ బోదము – బలముగల యీ యలలు దాటి – పరమ పురద్వారముల వెలుపల – గలిసికొని పరిశుద్ధ జనమును – గడకు మోక్షము చేరుకొందుము ॥దారుణమగు॥
చరణము 7
కరుణామయుని సభలో – జొరకపోవన నిత్య – నరకమంతమందున మరియు నంత్యదినపు బాధలు – విరివిగ విన గోరువారలు – మరణమొందకమును ప్రత్యక్షీ – కరణమను గ్రంథమును వినరే ॥దారుణమగు॥