#308
పాపము
పల్లవి · Pallavi
పాప కూపమునందు – పడి మునిగియున్నావు – పాటింపవది యెందుకొరకు – పాప జన్మము పాప కర్మము – పాప పూరితమైన హృదయము – ఓపరాని భయంకరోగ్రత – శాపములు సమకట్టియుండగా ॥పాప కూపమునందు॥
చరణము 1
పరమాత్మ మీదనే – గురి నిలుపమని దెల్ప – వరబోధ మది నెంచవు – నిరతమును రాత్రియును పగలును బవలును – నిరవు ధనమును ఘనమును సౌఖ్యము అలరయు చుందువు క్షణము నీవా – పరమ ధర్మము సరకుచేయవు ॥పాప కూపమునందు॥
చరణము 2
కనవినంగనుదగని – పనికిమాలిన క్రియల – దనిసి భ్రమయుచు నుందువు – ఘనుల పెద్దల జననీజనకులను – ననిశమును నిరసించి మెలగెడు వినయరహితంబైన జీవిత – మునకు నేమి ఘటిల్లునో కనను ॥పాప కూపమునందు॥
చరణము 3
పెరవారలను బ్రియాప్తు – లరులుగా బ్రేమింప – పరమాత్మ పురి గొల్పదే – పరులపై ద్వేషంబు పగగొని – పలుతెరంగుల బాధలపరుచుచు – ప్రాణహత్య లొనర్చు నీకు – పరమ పదము లభింప సాధ్యమే ॥పాప కూపమునందు॥
చరణము 4
పాప పరిహారార్థ – ప్రాయశ్చిత్తము జేసి – ప్రాణమర్పించె నెవరో – ఆ పరాత్పరు నాశ్రయించుము – శాపభారము బాపి బ్రోచును – మాపు రేపును లేని స్వర్గ – ప్రాప్తి కల్గును నిత్యశుభమగు ॥పాప కూపమునందు॥
చరణము 5
పాపభారము క్రింద – పడికుందు మీకునే – పరుగెత్తును శాంతిని – దాపునకు రండంచు పతితుల – దయను బిలచెడు యేసుక్రీస్తును – పాపి కాశ్రయుడంచు నమ్మి – భక్తితో ప్రార్థించి వేడవే ॥పాప కూపమునందు॥
చరణము 6
శరణీయు వరమోక్ష – పురమందు ఘనసౌఖ్య – పరమానందము లొందుచు – వరుల దూతల – భక్తగణముల – సరసదేవు స్మరించు భాగ్యము – గురుడు నీకడుగోరి పిలుచుచు – కరము చాపెను కౌగలింపవే ॥పాప కూపమునందు॥