పరిచయం
నిజమైన జయించేవారు కావాలనుకునే వారందరికీ దానియేలు గ్రంథం ఒక సందేశాన్ని ఇస్తుంది. ప్రభువు కొద్దిమంది యువకులను ఎన్నుకొని సిద్ధపరచి, తరువాత దేవుని ప్రజల శత్రువును ఓడించడానికి వారిని ఎలా ఉపయోగించాడో మనం దీనిలో చూస్తాము. దేవుని సేవకులు తప్పకుండా గొప్ప శ్రమను, హింసను అనుభవించవలసి ఉంటుంది, కాబట్టి సాతాను దాడులన్నింటిని ఎదుర్కొనేందుకు వారికి సిద్ధపాటు అవసరం. దానియేలు గ్రంథం వారికి గొప్ప సహాయంగా ఉంటుంది.
ఇటీవలి వరకు భారతీయులు చైనీయుల చేత తాము దాడి చేయబడతామని కలలో కూడా అనుకోలేదు. వారు చైనీయులను తమ మిత్రులుగా భావించారు. అకస్మాత్తుగా ఒక మంచి ఉదయం, చైనా చాలాకాలంగా భారత్పై దాడి చేయడానికి గొప్ప సిద్ధపాటు చేస్తున్నట్టు వారు మేల్కొని కనుగొన్నారు. నిజమే, వారికి అనేకసార్లు హెచ్చరిక ఇవ్వబడింది, కానీ వారు విషయాలను గంభీరంగా తీసుకోలేదు. దాడి వాస్తవంగా వారిపై విరుచుకుపడేంత వరకు, వారు తమ ప్రమాదం యొక్క తీవ్రతను గ్రహించలేదు. ఇప్పుడు భారత్ రక్షణకు తమవంతు కొంత సహకారం అందించగలిగేలా ఏదో ఒక త్యాగం చేయడానికి భారతీయులు ప్రతిచోటా ఆసక్తిగా ఉండటం మీరు చూస్తారు.
సాతాను చైనా కంటే మరింత కుటిలుడు. అతని ప్రధాన దాడులకు లక్ష్యం దేవుని ప్రజలు, దేవుని సేవకులు. కాబట్టి దేవుని ప్రజలుగా మనం మన ప్రమాదాన్ని ముందుగానే తెలుసుకోవాలి, దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా, సన్నద్ధంగా ఉండాలి. దానియేలు గ్రంథంలో అధ్యయనాలు ప్రారంభిస్తూ ఈ నేపథ్యాన్ని గుర్తుంచుకుందాం.
↑ పైకి వెళ్ళండి ← పుస్తకానికి వెనుకకు ← పుస్తక భాండాగారానికి
