Chapter 26 of 31 · వ్యాసాలు · Articles in Telugu

ఫిలదెల్ఫియ సంఘము

Original souvenir pp. 170–171

ఫిలదెల్ఫియలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయి. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయ వీలు లేకుండా తీసేవాడును, ఎవడు తీయలేకుండా వేసేవాడు అయిన సత్యస్వరూపియైన పరిశుద్ధుడు చెప్పే సంగతులు ఏవనగా నీ క్రియలను నేనెరుగుదును, నీకున్న శక్తి కొంచెమై వుండినా నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగను అనలేదు. ఇదిగో తలుపు నీ యెదట తీసి ఉంచాను. దానిని ఎవరును వేయనేరడు. యూదులు కాకుండానే తాము యూదులమని అబద్ధమాడే సైతాను సమాజపు వారిని రప్పిస్తాను. వారు వచ్చి నీ పాదములయెదుటపడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించానని తెలుసుకునేటట్లు చేస్తాను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొన్నావు గనుక భూనివాసులను శోధించడానికి లోకమంతటి మీదికి రాబోయ్యే శోధన కాలంలో నేను నిన్ను కాపాడతాను. నేను త్వరలో వస్తున్నాను. ఎవడు నీ కిరీటం అపహరించకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో, జయించే వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తాను. అందులోనుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని వద్దనుండి దిగివస్తున్న నూతనమైన యెరుషలేము అనే దేవుని పట్టణపు పేరును నా క్రొత్తపేరును దాని మీద రాస్తాను. సంఘములతో ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినునుగాక!

యోహాను 14:21 లో ప్రభువన్నాడు, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనేవాడే నన్ను ప్రేమించేవాడు. ఫిలదెల్ఫియ సంఘ జీవితంలో ఇదే సత్యం రుజువైంది. సార్డిస్, లవొదికయ సంఘాలమధ్య ఫిలదెల్ఫియ ఉన్నది అంటే రెండు ముళ్ళ మధ్య గులాబి పువ్వులాగ ఉన్నది అని అర్థం. సార్డిస్ సగం చచ్చి, ఆ రెండో సగం చావడానికి సిద్ధంగా ఉంది. లవొదికియ సంఘమేమో ఎందుకు కొరగాని సంఘం. ఈ రెండింటి మధ్యలో ఫిలదెల్ఫియ ఎంతో మంచి సాక్ష్యమున్న సంఘం. ప్రధానకాపరి ఫిలదెల్ఫియ మీద తప్పేమి మోపలేదు. యేసుప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిన సంఘం ఫిలదెల్ఫియ. ఫిలదెల్ఫియ అంటే సహోదర ప్రేమ. ఏడు సంఘాలలో ఇది సార్డిస్‌కు యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది. 19దో శతాబ్దం మొదలుకొని సంఘం ఎత్తబడేవరకు ఉండే సంఘచరిత్ర యిది. నమ్మకమైన సంఘం. ఈ రోజున ప్రతిశాఖనుండి దేవుని వాక్యం విని వాక్యప్రమాణాలకు తన జీవితం సరిదిద్దుకునేవారందరు కలిసి ఫిలదెల్ఫియ అని చెప్పవచ్చు. ఇప్పుడిది టర్కీలో ఉన్న పట్టణం. కోగామిస్ నది ఈ పట్టణం గుండా ప్రవహిస్తుంది. ఐదుకొండలపై నిర్మించబడిన పట్టణమిది. ఇక్కడ భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయి. ఫిలదెల్ఫియ గ్రీసు దేశానికి వలస కేంద్రం. దీనిని చిన్న ఏథెన్సు అనేవారు, మంచి సారవంతమైన భూమి. అట్టాలస్ అనే రాజుకు యూమెనస్ అనే పెర్గము రాజు సోదరుడు. వీరిద్దరి మధ్య ఎంతో ఘాఢమైన సహోదర ప్రేమ ఉండేది. దాన్నిబట్టి ఫిలదెల్ఫియ అనే పేరు వచ్చింది. స్మర్న సంఘం మీద ఏ నేరము ప్రభువు మోపలేదు. అలాగే ఫిలదెల్ఫియలో కూడా ఏ తప్పిదము ప్రభువుకు కనబడలేదు. క్రైస్తవ సహోదర ప్రేమకు ఫిలదెల్ఫియ ప్రతీక. 13 శతాబ్దం వరకు ఈ సంఘం ఉంది. ఇప్పుడు ఆ పట్టణం ఉంది కాని సంఘం లేదు. ఫిలదెల్ఫియ వాక్యాన్ని ప్రేమించింది, బోధించింది.

ప్రభువు సంఘదూతకు ఈ ఉత్తరం రాస్తూ, తనను తాను పరిచయం చేసుకుంటూ అన్నాడు. నేను సత్యస్వరూపిని పరిశుద్ధుడను దావీదు తాళపు చెవి నా చేతిలో ఉంది. నేను తీసిన తలుపు ఎవరువేయలేరు. నేను వేసిన తలుపు ఎవరు తీయలేరు. యోహాను 6:69 పేతురిచ్చిన సాక్ష్యం. నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము. మార్కు 1:24 లో దయ్యం కేకలు వేస్తూ సాక్ష్యం ఇచ్చింది, అన్నది - నీవు ఎవరివో నాకు తెలుసు నీవు దేవుని పరిశుద్ధుడవు. ఆయన మహిమలో ఉన్న క్రీస్తు, ఆయన మహా యాజకుడు, ప్రధానయాజకుడు అంటూ ప్రభువు తనను తాను ప్రకటన 11వ అధ్యాయంలో ప్రత్యక్షపరచుకున్నాడు. నేను పరిశుద్ధుడను అంటూ ఫిలదెల్ఫియ సంఘంతో చెప్తున్నాడు. ఆయన పుట్టుక పరిశుద్ధం, ఆయన మరణం పరిశుద్ధం, ఆయన ఈ రోజున పరిశుద్ధ ప్రధాన యాజకుడు. లూకా 1:35 మరియతో దూత అన్నాడు, నీకు పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు ఆయన దేవుని కుమారుడు. అపొ. 2:27 నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్ళుపట్టనియ్యవు. ఇది యేసును గురించిన ప్రవచనం. యేసు తన మరణ పునరుత్థానములలో కూడా పరిశుద్ధుడు. హెబ్రీ 7:26 పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశమండలముకంటే మిక్కిలి హెచ్చు అయిన వాడు అయిన ఇట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు. యోహాను 14:6 ప్రభువు తోమాతో అన్నాడు. నేనే మార్గమును సత్యమును జీవమును. సత్యము అంటే పరిపూర్ణత, సంపూర్ణత. యోహాను 6:32-35 వరకు యేసు అన్నాడు. పరలోకమునుండి వచ్చే ఆహారము మోషే మీకియ్యలేదు. నా తండ్రి పరలోకంనుండి వచ్చే నిజమైన ఆహారమును మీకు అనుగ్రహిస్తున్నాడు. పరలోకంనుండి దిగివచ్చి, లోకానికి జీవమిచ్చేది దేవుడనుగ్రహించే ఆహారమై ఉన్నది. జీవాహారము నేనే! నా వద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలిగొనడు. నా యందు విశ్వాసముంచేవాడు ఎప్పుడు దప్పిగొనడు. ప్రభువు ఇంకా ఇలా అన్నాడు. నా వద్ద దావీదు తాళపు చెవులున్నాయి. ప్రకటనగ్రంథం 1:18 మరణము యొక్క పాతాళము యొక్క తాళపు చెవులు తనకున్నట్లు ప్రత్యక్షపరచబడింది. ఈ సమస్త విశ్వానికి తాను పరిపాలకుడు. ఆయనకు అధికారమున్నది అనడానికి దావీదు తాళపు చెవులు నాకున్నాయి అన్నాడు. లూకా 1:32,33 ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకిస్తాడు. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలుతాడు. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉంటుంది. వెయ్యేండ్ల పాలనలో ఆయన దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు. ఇప్పుడైతే ఆయన పరలోకమందు తన తండ్రి సింహాసనముపై కూర్చున్నాడు. శత్రువులందరూ ఆయనకు పాదాక్రాంతులయ్యేవరకు ఆయన తండ్రి పార్శ్వమందు కూర్చుని ఉంటాడు. ఆయన తలుపు తెరిచాడు అంటే ఎవ్వడూ మూయలేదు, మూశాడు అంటే ఎవ్వడూ తెరువలేదు. ఆయన మూయడానికి కాని, తెరవడానికి కాని సమర్ధుడు. మత్తయి 28:18-20 వరకు ఆయనకు పరలోకమందు, భూమిమీద సర్వాధికారము ఇయ్యబడిఉంది. యుగసమాప్తివరకు ఆయన సదాకాలము మనతో ఉన్నాడు. నీ క్రియలను నేనెరుగుదును. నీ ముందు తలుపు తెరిచి ఉంచాను. దీనిని ఎవరూ మూయలేరు. నీకున్న బలము కొంచెమే అయినా నా వాక్యాన్ని గైకొన్నావు. నా నామమును ఎరుగను అనలేదు. దేవుడు తలుపులు తెరిచినప్పుడే ప్రవేశించాలి. తలుపులు దేవుడు మూశాడు అంటే ఎవడు అందులో ప్రవేశించలేదు. ఫిలదెల్ఫియ సంఘం దేవుని వాక్యాన్ని అంటిపెట్టుకొని ఉంది. ఈ రోజువరకు దేవుని వాక్యానికి నమ్మకంగా ఉన్న

సంఘాలున్నాయి. ఏ శాఖ అయినా వాక్యాన్ని నమ్మకంగా బోధించే సంఘాలకు ఫిలదెల్ఫియ గొప్పమాదిరి. ఫిలదెల్ఫియ సంఘాన్ని ఏడు విషయాల్లో ప్రభువు ఎంతో మెచ్చుకున్నాడు.

  1. నేను నీ క్రియలను ఎరుగుదును. ప్రభువు తన సంఘమందు ఫలవంతమైన క్రియలను చూడగోరుచున్నాడు. విశ్వాసి జీవితము సత్‌క్రియలతో నిండినదై క్రియాత్మకమైన విశ్వాసము గలిగి ప్రభువు దృష్టికి అందంగా కనబడుతుంది. మరచిపోకండి. రక్షణ క్రియల ద్వారా రాదు. కృపచేత విశ్వాసము ద్వారా రక్షణ కలుగుతుంది. రక్షించబడిన ప్రతివ్యక్తి సత్కార్యాలు చేయ బద్ధుడై ఉన్నాడు. విశ్వాసము సత్‌క్రియలను ఉత్పత్తి చేయకపోతే నీ విశ్వాసములో ఏదో లోపము ఉన్నది అని అర్థం. యాకోబు భక్తుడు అందుకే సవాలు చేస్తూ ప్రశ్నించాడు. క్రియలు లేకుండా విశ్వాసాన్ని రుజువుచేసుకోగలవా? విశ్వాసం రక్షిస్తుంది గాని, విశ్వాసం ఒంటరిగా ఉండదు. అది సత్‌క్రియలతో జతచేయబడి ఉంటుంది.
  1. నేను నీ యెదుట తలుపు తెరిచాను. దానిని ఎవరూ మూయలేరు. ఆనందానికి ద్వారం తెరిచాను, సువార్త ప్రకటనకు ద్వారం తెరిచాను. వాక్కు ప్రత్యక్షానికి ద్వారం తెరిచాను, తలుపులు బార్లాగా తెరిచాడు ప్రభువు. అవకాశ ద్వారాలు దేవుడు తెరిచిఉంచాడంటే ప్రభువు ఫిలదెల్ఫియ సంఘాన్ని ప్రశంసిస్తున్నాడని అర్థం. దేవుడు తెరిచిన తలుపులు, ప్రవేశ ద్వారాలు తెరువబడిఉన్నాయి. సంఘమా వెంటనే ప్రవేశించు.
  1. నీకున్న బలం కొంచెమే. మనం స్వశక్తితో ఎంతచేసినా అందులో అతిశయపడదగింది ఏదీ లేదు. అది ప్రభువు దృష్టిలో అతి స్వల్పం. మనం మన గొప్పతనాన్ని అంచనా వేసుకోవడం అవివేకం. మనం ఆయన జతపనివారం. పౌలు ఏమన్నాడు, నన్నునేను విమర్శించుకొనను నా తప్పులేవో, ఒప్పులేవో నిర్ణయించాల్సింది ప్రభువు. ఆయన సన్నిధిలో నిలిచే వరకు నా పని నాణ్యత నాకెలా తెలుస్తుంది. అయినా నా శక్తి సామర్థ్యాలు ఏపాటివి? నేనాయన జతపనివాణ్ణి అంటే అది ఆయన కృపే.
  1. నీవు నా వాక్యమును గైకొన్నావు. దేవుని వాక్యము దైవప్రేరితమని అధికారపూర్వకమైనదని ఆ సంఘం నమ్మింది. దేవుని వాక్యమంతా నమ్మదగింది అందులో ఒక్కపొల్లైనా వృధా పోదు, నిరర్థకం కాదు. సంఘం వాక్యంమీద పూర్తిగా ఆధారపడి వుంది.
  1. నా నామమును కాదనక ఒప్పుకున్నావు. ఫిలదెల్ఫియ సంఘం యేసు యొక్క దేవత్వాన్ని నమ్మింది. ఆయన పాపులకొరకై ప్రాయశ్చిత్తార్థ బలియైన దేవుడు. యేసు నామం శక్తిభరితమైన నామం అని నమ్మింది ఫిలదెల్ఫియ. సువార్తప్రకటించే సంఘమిది. సేవాసంఘం, సజీవసంఘం, అది ఉజ్జీవ సంఘం. బైబిలును పూర్తిగా నమ్మిన సంఘం. వాక్య ప్రమాణానికి అనుగుణంగా జీవించే సంఘం, అది బైబిలు సంఘం అనవచ్చు. పదమూడో శతాబ్దం వరకు ఫిలదెల్ఫియ సంఘం ఉంది. తరువాత శత్రువులు వచ్చి దాన్ని ధ్వంసం చేశారు. విశ్వాసులను హతమార్చారు. ఫిలదెల్ఫియ ఎందరో సువార్తికులను విదేశాలకు పంపింది. ప్రేషిత ఉద్యమానికి ఫిలదెల్ఫియ గొప్ప కేంద్రం. మన దేశానికి సువార్త వచ్చిందంటే ఫిలదెల్ఫియ యొక్క ఉద్యమ స్ఫూర్తి కారణమని చెప్పక తప్పదు. తాము యూదులు కాకపోయిన మేము యూదులమే అంటూ అబద్దాలు చెప్పేవారున్నారు. వీరు సైతాను సమాజానికి చెందినవారు నేను నిన్ను ప్రేమించానని వారు తెలుసుకునేటట్లు చేస్తాను. వారిని తెచ్చి నీ పాదాలముంద పడేస్తాను అంటున్నాడు ప్రభువు. యూదులలో శేషిత ప్రజలు సమాజమందిరాన్ని విడిచిపెట్టారు. ధర్మశాస్త్రాన్ని విసర్జించారు. పరిశుద్ధత నియమాలను పూర్తిగా త్రోసిపుచ్చారు. వీరిని గురించే పౌలు రోమా 9:6 లో అన్నాడు. ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీయులు కారు. ప్రభువు వైపునకు మరలినవారే నిజమైన ఇశ్రాయేలీయులు. ఈ కపట ఇశ్రాయేలీయులు సైతాను సమాజకులు రోమా ప్రభుత్వంలో ఇశ్రాయేలీయులు పలు స్థలాలలో చెదరిపోయి వున్నారు. వారందరూ సమాజాలుగా ఏర్పడ్డారు.
  1. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అని సైతాను సమాజపువారు తెలుసుకుంటారు. వారు నీ పాదాలముంద పడతారు. తీర్పు విషయమైన వాక్యమును గైకొన్నావు. రాబోయే శోధనకాలంలో నిన్ను కాపాడతాను. భూనివాసులందరికీ గొప్ప శోధన రాబోతుంది.
  1. సహనశీలం గలిగి వాక్యమును గైకొన్నందుకు ప్రభువు ఫిలదెల్ఫియ సంఘమును ప్రశంసిస్తున్నాడు. 2 థెస్స 3:5 దేవునియందలి ప్రేమ క్రీస్తు చూపిన ఓర్పు మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించును గాక! ఈ రోజున దేవుని వాక్యం ఎక్కడచూసిన కనబడుతుంది, వినబడుతుంది. ప్రభువు రాకడను గురించి అందరూ మాట్లాడుతున్నారు. హెబ్రీ 6:12 మీరు మాంద్యులు కాక విశ్వాసముచేత, ఓర్పుచేత వాగ్దానములను స్వతంత్రించుకొని మీలో ప్రతివాడు మీ నిరీక్షణపరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచండి. మహా శ్రమలు వచ్చినప్పుడు సంఘం ఇక్కడ ఉండదు, ఎత్తబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. 1 థెస్స 4:13 నుండి 18 వరకు, తీతు 2:13 ఇదియే సత్యాన్ని పునరుద్ఘాటిస్తున్నాయి. అప్పుడు సంఘం సదాకాలం ప్రభువుతో కూడా ఉంటుంది. ఇది మనకు గొప్ప ఆదరణ ఆయన మహిమ యొక్క ప్రత్యక్షత మన శుభప్రద నిరీక్షణ. ఫిలదెల్ఫియ సంఘయుగం సంఘం ఎత్తబడేవరకు కొనసాగుతుందని మనం గ్రహించాలి. అయితే లవొదికయ సంఘం నిజమైన సంఘం ఎత్తబడిన తరువాత ఇక్కడే ఉంటుంది. అది భ్రష్టమైన సంఘవ్యవస్థ. అయితే అందులోనుండి కొందరు రక్షించబడి సంఘవధువులో భాగమై ఎత్తబతారు అందుకే ప్రభువు లవొదికయకు పిలుపునిస్తున్నాడు. నేను త్వరగా వస్తాను నీ కిరీటాన్ని అపహరించే దొంగలున్నారు జాగ్రత. అని ఫిలదెల్ఫియకు ప్రభువు హెచ్చరిక చేస్తున్నాడు. నీకు కలిగిందేదో దానిని జాగ్రత్తగా పట్టుకో, ఆయన అకస్మాత్తుగా వస్తాడు. అనుకొనని ఘడియలో వస్తాడు. సఘం సిద్ధపడేది శ్రమలదినం కోసం కాదు. తాను ఎత్తబడే దినం కోసం. అదే సంఘమునకున్న శుభప్రద నిరీక్షణ. ఫిలదెల్ఫియాలాంటి స్థానిక సంఘాలే ఎత్తబడతాయి. ఎత్తబడిందే అసలైన, నిజమైన సంఘం. జయించే విశ్వాసి, జయించే సంఘం ఒక స్తంభం. దేవుని ఆలయ స్తంభం. చరిత్రలో ఆయా సంఘాలు ఇక్కడ లేకపోవచ్చు. అసలైన సంఘంలో పరలోకంలో ఒక స్తంభమై స్థిరస్తాయిగా ఉంటుంది. దేవుని పేరు, నూతనయెరూషలేము పేరు, దేవుని పట్టణపు పేరు, ప్రభువుయొక్క క్రొత్తపేరు ఫిలదెల్ఫియా మీద వ్రాయబడుతుంది. పరలోకపు పాస్‌పోర్టు, వీసా సంఘానికి ఇవ్వబడతాయి. యేసు క్రొత్తపేరు మనమీద వ్రాయబడుతుంది. ఆ పేరేమిటో అప్పుడే మనకు తెలుస్తుంది. ఫిలదెల్ఫియ సంఘమా నీకు అభినందనలు.

ప్రభువైన యేసు క్రీస్తువారి కృప, తండ్రియైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యెక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతమూ తోడైయుండును గాక! ఆమెన్!

This article was set in a legacy (non-Unicode) Telugu font in the printed souvenir. It has been re-typed into Unicode Telugu for this web edition so that it can be searched, resized and read by screen readers. The original printed pages are reproduced below.

View the original printed pages