Chapter 25 of 31 · వ్యాసాలు · Articles in Telugu

దేవుడు ఎవరికి మేళ్లు చేస్తాడు?

Original souvenir p. 169

'మునుపటికంటె అధికమైన మేలు మీకు కలుగజేసెదను'. (యెహె36:11)

కృతజ్ఞత కలిగిఉన్న యెడల:

దేవుడు ఇశ్రాయేలీయులను వారి పగవారైన ఐగుప్తీయులచేతిలో నుండి రక్షించెను. వారి మార్గమునకు అడ్డువచ్చిన ఎఱ్ఱ సముద్రములో మార్గము సరళము చేసెను. వారి శత్రువులలో ఒక్కడైనను మిగులకుండా ఎఱ్ఱసముద్రములో ముంచి వేసెను. అప్పుడువారు దేవునినమ్మి, నాట్యముచేయుచూ, ఆయనకు స్తుతికీర్తన పాడిరి అని 106వ కీర్తన 10,11,12 లో చదువుచున్నాము. మరి 13వ వచనములో వెంటనే ఆయన కార్యములను మరచిపోయిరి అనికూడా చదువుచున్నాము. ఆయన చేసినమేళ్లు తలంచి, తలంచి, తలంచి ఎల్లప్పుడు కృతజ్ఞతాస్తుతి చెలించ వలసినవారు, వెంటనే మరచిపోవుట వలన, వారి ఎదుటవున్న మంచినీరు చేదుగా మార్చబడినవి. గనుక వారి ప్రాణములు క్షీణించి సొమ్మసిల్లినవి. ఆ తరువాత దేవుని మాట వినినందువలన, 'మారా' మధురమైనట్లు చదువుచున్నాము. కృతజ్ఞత లేనివారి హృదయాలు అంధకారమయమగునని రోమా 1:22 లో చదువుచున్నాము. కృతజ్ఞత కలిగినవారే చేసిన మేలును మరువక స్తుతి చెల్లించెదరు.

మాటవినిన యెడల:

'అయ్యో! నా ప్రజలు నా మాట వినిన యెడల, నా మార్గమును అనుసరించిన యెడలలెంత మేలు!' (కీర్తన81:13).

ఇశ్రాయేలీయులు దేవుని మాట వినకపోయినందున, వారి హృదయాలు కలినమైనట్లు, మాటవినిన యెడలఎంతో మేలు కలుగునట్లు కీర్తన 81:11,12 లో చదువుచున్నాము. ఆయన మాటవినిన యెడల(1) శత్రువులను అణగద్రొక్కును. (2) శ్రేష్టమైన గోధుమలతో పోషించును. (3) కొండతేనెతో తృప్తి పరచును. ఇవ్వన్నీ దేవునిమాట విని అనుసరించేవారికి కలిగే మేళ్లని కీర్తన 81:14,15,16 వాక్యాలలో చదువుచున్నాము.

సమూయేలు ప్రవక్త, గాడిదలవెంట తిరుగుచున్న సౌలును అభిషేకించి, దేవుని స్వాస్త్యముమీద అధిపతిగా నియమించాడు. నా కంటే ముందుగా నీవు గిల్గాలునకు వెళ్లు, నేను నీ యెద్దకువచ్చి దహన బలులను, సమాధాన బలులను అర్పించి నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేసెదనని చెప్పాడు. (1సమూయేలు 10:8). ఆ ప్రకారమే సౌలు గిల్గాలుకు వెళ్లాడు. కాని సమూయేలు రావడము కొంత ఆలస్యమైనందున, సౌలు సాహసించి దహనబలి, సమాధానబలి, అర్పించేస్తాడు. (1సమూయేలు 13:8–13).అంతలోనే సమూయేలు వచ్చి సౌలుతో 'నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి; నీ రాజ్యమును ఇశ్రాయేలీయులమీద సదాకాలము స్థిరపచుటకు యెహోవా తలంచి యుండెను; అయితే నీ రాజ్యము నిలవదని' అంటున్నాడు. సౌలు తన రాజరికాన్ని కోల్పోవుటకుగలకారణము ఏమైవుంటుంది?

యాజకులే అర్పించవలసిన బలులు, సౌలు సాహసించి అర్పించెను. సమూయేలు సౌలుతో మాట్లాడినప్పుడు దేవుడు నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక అని అంటున్నాడు. వాస్తవానికి సౌలుతో అన్నది సమూయేలే కాని అది దేవుని ఆజ్ఞ అంటున్నాడు. దేవుని సేవకులద్వారా చెప్పబడిన మాట అది దేవుని మాటగా గుర్తించాలి. అలా గుర్తించక సాహసించి అవివేకపు పనులుచేసి, తమ ఆత్మీయ జీవితమును అనేకులు నాశనము చేసుకున్నారు. దైవ సేవకులమాట దేవుని మాటగా అంగీకరించనందువలన, శత్రువుచేతిలో అనేకులు నలిగిపోతున్నారు. దేవుని మాట విన్నవారికి జరిగే గొప్ప మేలు ఏదనగా, శత్రువుని క్షణాలలో దేవుడు అణగద్రొక్కుతాడని తెలుసుకోవాలి.

దేవుని మందిరమునకు వచ్చిన యెడల:

కీర్తన 65:4 లో మందిరములోని మేలుతో తృప్తిపొందెదము అని వ్రాయబడియున్నది. దేవుని మందిరములో ఏఏ విధములమేళ్లు ఉన్నాయో తప్పని సరిగా తెలుసుకోవాలి.ఆ మేళ్లు తెలిపినవారు దేవుని మందిరానికి వెళ్లకుండా ఉండలేరు. ఒక్క ఆదివారపు ఆరాధనకు వెళ్లనివారు 1000 దినములఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు.

(1) దేవుని మందిరములో దేవునితో నడిచే అనేకమంది సాక్ష్యాలువిని క్షేమాభివృద్ధి పొందవచ్చు.

(2) దేవుని మార్గాలు బోధింపబడగా నేర్చుకొని ఆయన మార్గాలలో నడవవచ్చు(యెషయ2:3)

(3) దేవుడు మనకిచ్చే సమస్త విధములైన రాబడిలో దేవుని సొమ్ము దేవునికి ఇచ్చి, శాపవిమోచన దేవుని మందిరములో పొందవచ్చు. మరికొన్ని అదృశ్యమైనవి, ఈ మేళ్లన్నీ పొందాలనుకుంటే దైవ ఆరాధన నిర్లక్ష్యపరచకూడదు. కొందరు సంవత్సరానికి ఒకటి రెండుసార్లు, పండుగ రోజుల్లోనే దేవుని మందిరములో కనిపిస్తారు. ఇలాంటివారు దేవునిద్వారా పొందవలసిన మేళ్లకు దూరమైపోతున్నారు. మునుపటికంటే మరెక్కువగా దేవుని మందిరాన్ని ఆశ్రయించి అధిక మేళ్లు పొందుటకు మీరు పాత్రులు కావాలి.

యధార్థముగా ప్రవర్తించిన యెడల:

యధార్థముగా ప్రవర్తించువారికి ఆయన ఏ మేలును చేయక మానడు. (కీర్తన 84:11)

హిజ్కియా రాజు మరణకరమైన రోగముతో ఉన్నప్పుడు అతడు గోడవైపు తిరిగి దేవునికి ప్రార్థన చేసాడు. ఆ ప్రార్థనలో 'యధార్థ హృదయుడవై నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో జ్ఞాపకము చేసికొనుమని' దేవునితో అంటున్నాడు.ఇలా దేవునితోనే తిన్నగా అనడమంటే సామాన్యమా? యధార్థవంతుడు గనుకనే, దేవునితో తన యధార్థతను గూర్చి అనగలిగాడు. ఇలా ప్రార్థన చేసిన వెంటనే అతని యధార్థతను జ్ఞాపకము చేసుకొన్న దేవుడు, హిజ్కియాను స్వస్థవరచి దేవుని మందిరానికి వెళ్లేటట్లు చేశాడు. మరణములోనుండి జీవములోనికి దాటించి మరో 15 సంవత్సరాలఆయుష్షు పొడిగించాడు. (11 రాజులు 20:2–6).

దేవుడు తన యెడలయధార్థహృదయము గలవారిని బలపరచునని యధార్థవంతులకొరకే ఆయన వెదకుచున్నాడని, (11దిన 16:9) లో చదువు చున్నాము. నీ వ్యాపారములోనైనా, దేవుడు నీ కిచ్చిన పిల్లలనుపెంచే విషయములోనైనా, చేయుచున్న ఉద్యోగములోనైనా, దేవుడిచ్చిన రాబడి విషయములోనైనా, పొలము, పంటలోనైనా, భార్య భర్తలపవిత్రబంధము విషయములోనైనా, పిల్లలవివాహవిషయాలలో, దశమభాగములో, దేవునితోచేసిన నిబంధనలో, మ్రొక్కుబడులలో, నీ యధార్థతను బట్టి నీవు అత్యధికమైన మేళ్లను పొందెదవని వాక్యము హెచ్చరించుచున్నది.

నా ప్రియమైన దేవుని ప్రజలారా! మనము దేవుడు చేసిన మేళ్లు మరువక ఎల్లప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ, దేవుని మాట వింటూ, దేవుని మందిరానికి వెళ్లుచూ, అన్ని విషయములలో యధార్థవంతులమై, దేవుని మేళ్లకు పాత్రులమవుదాము. ఆమెన్ !!

This article was set in a legacy (non-Unicode) Telugu font in the printed souvenir. It has been re-typed into Unicode Telugu for this web edition so that it can be searched, resized and read by screen readers. The original printed pages are reproduced below.

View the original printed pages