Chapter 24 of 31 · వ్యాసాలు · Articles in Telugu
పాటలతో ప్రభువుని స్తుతించండి
Original souvenir p. 168
“ఆత్మపూర్ణులై యుండుడి, ఒకని నొకడు కీర్తనలతోనూ, సంగీతములతోనూ, ఆత్మసంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు, కీర్తించుచు....(making melody) ఎఫెసి 5:18 – 19
- ప్రస్తావన : క్రైస్తవ విశ్వాసము సంగీతయుక్తమైన విశ్వాసము. పరిశుద్ధ గ్రంథమంతా – మొదటినుండి చివరకు–అనేక పాటలతో నిండి వుంది. వ్యక్తులుగా, కుటుంబాలుగా, సమాజంగా, దేవుని ప్రజలు ఆయన పట్ల తమ ప్రేమను, కృతజ్ఞతను, పాటలద్వారా వెల్లడి చేసిన సందర్భాలు అసంఖ్యాకంగా వున్నాయి. అయితే రానురాను ఈ పాటలను మనం కేవలం ఆదివారపు ఆరాధనలకే పరిమితం చేసేశాము. గత తరంలో నైతే తెల్లవారుఝామున మరియు రాత్రి చీకటిపడే సమయాన క్రైస్తవ గృహాలున్న వీధిలో నడిచి వెళ్తుంటే, కుటుంబ ప్రార్థనలలో పాడే పాటలు దారి పొడవునా వినిపిస్తూ వుండేవి. నేడు అవి దాదాపుగా ఆగిపోయాయి. కారణాలు వేరుగా వివరించాల్సిన పని లేదు.
ఎఫేసి పత్రిక 5వ అధ్యాయంలో దేవాలయమును గూర్చిన ప్రస్తావనే లేదు. అయినా అక్కడ పరిశుద్ధాత్ముడు ఇచ్చే అనేక హెచ్చరికలలో “ఆత్మపూర్ణులై యుండుడి, ఆత్మ సంబంధమైన పాటలతో ప్రభువుని స్తుతించండి” అని తెలియజేస్తున్నాడు. చూశారా! పాటలు ఆదివారానికే పరిమితం కాదు. ఆత్మ పూర్ణులైన క్రైస్తవులు ఆత్మసంభందమైన పాటలు వీలుచిక్కినప్పుడల్లా పాడుతూ వుండాలి. ఆందరం మధురంగా పాడలేక పోవచ్చుగాని, పెదవులతో పలికే ఆ పదాలలోని మాధుర్యాన్ని హృదయంలో అనుభవించవచ్చు. ప్రక్కనున్న వారికి అలాంటి మధురమైన అనుభూతి కలిగినా, కలుగక పోయినా ప్రభువు మాత్రం తప్పక ఆనందిస్తాడు.
- పాటలంటే ప్రభువుకు ఇష్టం : కీర్తన 22:3లో ప్రభువు “ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడై” ఉంటాడు అని వ్రాయబడింది. ఎక్కడ స్తుతి గానాలుంటే అక్కడ ఆయన వచ్చి ఆసీనుడౌతాడు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అభయం, ఆశ్రయం, ఆశీర్వాదాలుంటాయి. యెషయా 6:1–4లో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన ప్రభువు సెరాపులనబడే మహదులచే “సైన్యములకధిపతియగు యెహువా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది.” అని ప్రస్తుతించబడుచున్నట్లుగా చూస్తాము. అలాగే ప్రకటన 5:9–14లో పరలోకంలో దేవుని సింహాసనం చుట్టూవున్న నాలుగు జీవులు, ఇరువది నలుగురు పెద్దలుకూడా క్రొత్తపాట పాడినట్లుగా చదువుతాం.
అన్నట్టు, ఈ లోకంలోనూ, పరలోకంలోనూ కూడా ఉండే పరిచర్య కేవలం పాటలు పాడే పరిచర్య మాత్రమే! ఎందుచేతనంటే, పరలోకంలో ఇంకెంత మాత్రం పరిశుద్ధ గ్రంథంతోగాని, ప్రార్థనతోగాని, ప్రసంగంతోగాని అవసరం ఉండదు. ఎందుకంటే మనం అక్కడ ప్రభువు సన్నిధిలోనే సదా కాలం ఉంటాం కాబట్టి! అక్కడ ఆయనను స్తుతిస్తూ దేవదూతలతో కలిసి పాటలు పాడడమే మన పరమావధి. మరి ఇప్పటినుండియే ఈ స్తుతి గానాలు చేయగలడం ఎంత గొప్పభాగ్యం!
- పాటలద్వారా వాక్యం కంఠస్థం : మనకు కలిగే మరియొక ప్రయోజనాన్ని పరిశుద్ధాత్ముడు కొలస్సి పత్రిక 3:16లో తెలియజేశాడు. పాటలద్వారా మనం ఒకరికొకరం బోధించు కొనవచ్చు, బుద్ధిచేప్పుకొనవచ్చుకుడా. అంత మాత్రమే కాకుండా – మన హృదయాలలో దేవుని గూర్చి గానంచేయుట ద్వార క్రీస్తువాక్యం మనలో సమృద్ధిగా నివసిస్తుంది. “దేవుడే నా కాశ్రయంబు దివ్యమైన దుర్గము” పాడుట ద్వారా 47వ కీర్తన, “దేవ సంస్తుతి చేయవే మనసా” పాడుట ద్వారా 103 వ కీర్తన, “దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది”. పాడుట ద్వారా 147వ కీర్తన “దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడూ”... పాడుట ద్వారా 150వ కీర్తన, ఇలా ఎన్నెన్నో వాక్యభాగాలు పాటలద్వారా మన మనసులో చెరగని రీతిలో ముద్రించబడతాయి.
- పాటలమాధుర్యాన్ని పొందడానికి/పెంపొందించుకోవడానికి సూత్రం : ఇష్టమైన పాటలను ముందుగా ఒక నోట్‌బుక్‌లో వ్రాసుకోండి. ఆ పాట సాహిత్యం (లిరిక్) తెలియకపోతే ఆ పాట ఉన్న క్యాసెట్‌ను మధ్యమధ్యలో పాజ్ చేస్తూ మనం వ్రాసుకోవచ్చు. అన్నట్టు, ప్రతి క్రైస్తవ గృహంలో C.D. ప్లేయర్ / MP3 ప్లేయర్ / iPod తప్పని సరిగా ఉండాలి. మీ ఇంట్లో కంప్యూటర్, దానికి ఇంటర్నెట్ కనెక్షన్ వుంటే ఏ ప్లేయర్ లేకుండానే www.uecf.net లో వేలాది పాటలు ఉచితంగా వినవచ్చు, నేర్చుకోవచ్చు – వాటిలో మీకిష్టమైన పాటలను ప్లే చేస్తూ మీరుకూడా గొంతుకలిపి పాడండి. “అనగ ననగ రాగమతి శయిల్లుచునుండు” అనే సామెత అక్షరాలా మన విషయంలో కుడా అనుభవ సత్యమౌతుంది. అలా పాడే సమయంలో, పాటలలోని మాటలపై ధ్యానముంచండి. స్వరంలో భావంపలికించడానికి ప్రయత్నించండి. స్నేహితులతో, కుటుంబసభ్యులతో కలిసి స్తుతి గీతాలు ప్రాక్టీస్ చేయండి. సంగీతం సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తుంది. అంతేకాదు, సంతోషాన్ని పెంపొందిస్తుంది. సంతోషం కలిగితే పాటలు అవే వస్తాయి. వచ్చి తీరుతాయి (యాకోబు 5:13బి).
మీరు అద్భుతంగా పాడగలిగారా లేదా అనే ప్రశ్న లేదు. ఎందుకంటే మీరు ఏ ఆడిషన్ టెస్ట్ కోసం పాడలేదు కదా. హృదయపూర్తిగా పాడిన పాటలలోని మాధుర్యాన్ని దేవుడు గ్రహిస్తాడు! పైగా పాట పాడడం ముగిసిన తర్వాత మీరు జాగ్రత్తగా ఆలకిస్తే, పరలోకపు అభినందన వినవచ్చు! కనీసం పాట ఆపినందుకు ఆనందంతో పక్కింటివారైనా అభినందించవచ్చు !!
దేవుడు మిమ్ము దీవించు గాక !!
This article was set in a legacy (non-Unicode) Telugu font in the printed souvenir. It has been re-typed into Unicode Telugu for this web edition so that it can be searched, resized and read by screen readers. The original printed pages are reproduced below.
View the original printed pages
