Chapter 27 of 31 · వ్యాసాలు · Articles in Telugu

పరిశుద్ధత

Original souvenir p. 172

"నా సన్నిధిలో నడుస్తూ నిందారహితుడవై వుండు" అని దేవుడు అబ్రహామును ఆజ్ఞాపించాడు. ఆది 17.1.

ఇశ్రాయేలు జాతి దేవునికి పరిశుద్ధ జనం. వారి ఆహారం, విహారం అన్ని పవిత్రమై ఉండాలి. యాజకుడి మీద "యెహోవా పరిశుద్ధుడు" అని చెక్కబడి వుంది. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన ప్రజలు కూడా పరిశుద్ధులుగా జీవించాలి.

భక్తి అంటే యెహోవా పరిశుద్ధ పర్వతానికి ఎక్కడం! కీర్తనలు 97.10 యెహోవాను ప్రేమించే వారలారా! చెడుతనాన్ని అసహ్యించుకోండి. క్రైస్తవం రాజమార్గం. అది పరిశుద్ధ మార్గం. అపవిత్రులు పోగూడని మార్గం. ఇదే సిలువ మార్గం. పరిశుద్ధతకే క్రైస్తవ నీతి అని మరో పేరు. హృదయశుద్ధి గలవారే దేవుడిని చూడగలరు. మత్తయి 5.48లో ప్రభువు చెప్పినట్లు మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మనమూ పరిపూర్ణులమై వుండాలి. కపటం లేని ప్రవర్తనే పరిశుద్ధత.

### సంస్కృతి, సభ్యత.

పరిశుద్ధత విశ్వాసుల ఆధ్యాత్మిక సంస్కృతి, సభ్యత. పాపము విషయమై మృతులకు మృతుడవై దేవుని విషయంలో బ్రతకడమే పరిశుద్ధత. నిత్య జీవం నాణ్యతగల పరిశుద్ధ జీవితం. ఇది ఆత్మానుసారమైన జీవితం. ఈ లోక మర్యాదను అనుసరించక మనసు మారి నూతనమై రూపాంతరం చెందాలి. విశ్వాసి పరిశుద్ధాత్మకు ఆలయం! ఈ ఆలయాన్ని పాడుచేసిన వాణ్ణి దేవుడు పాడు చేస్తాడు. విశ్వాసి పవిత్రురాలైన కన్యకగా యేసయ్యకు సమర్పించబడి ప్రధానం చేయబడి వున్నారు. విశ్వాసిలో పరిశుద్ధాత్మ పండించే ఫలం ప్రేమ. యిందులో నుంచి పరిశుద్ధ ఫలాలు పుట్టుకొస్తాయి. సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, సాత్వీకం, ఆశానిగ్రహం, యివన్నీ పరిశుద్ధతకు చిహ్నాలు. సంతుష్టి సహితమైన దైవభక్తి పరిశుద్ధ జీవితానికి రుజువు, అని మనం తెలుసుకోవాలి!

### తొలగిపోవాలి

ప్రభువు నామాన్ని ఒప్పుకునే ప్రతివాడు దుర్నీతినుండి తొలగిపోవాలి. లోక స్నేహం దేవునితో విరోధం. ప్రత్యేకించ బడి, దేవునికి ప్రతిష్ఠించబడిందే పరిశుద్ధం! అపో॥ కార్య 2.27 లో యేసు ప్రభువు "దేవుని పరిశుద్ధుడు" అని పిలువబడ్డాడు. ఈ పరిశుద్ధతను విశ్వాసం ద్వారా పొందిన వారే పరిశుద్ధులు. పరిశుద్ధ జీవితం కలిగినవారు! దేవుని గుణగణాలన్ని కిరణాలలాగా వచ్చి నీతి సూర్యుడైన క్రీస్తునందు కేంద్రీకరించినప్పుడు అదే పరిశుద్ధత! తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలలో ప్రతి ఒక్కరూ పరిశుద్ధులు. అయితే ఈ ముగ్గురిలో దేవుని పరిశుద్ధతను ప్రత్యేకంగా విశ్వాసులకు అన్వయం చేసేవారు పరిశుద్ధాత్మ!

దేవుడు తన ప్రజలలో పరిశుద్ధతను చూడగోరుతున్నాడు. యేసయ్య పరిశుద్ధతే విశ్వాసి సౌశీల్యానికి హామి కూడా ! హెబ్రి 2.11 దేవుడు పరిశుద్ధుడు. అది ఆయన ముఖ్య లక్షణం! పవిత్రత అంటే పాపాన్ని విడిచి దేవునికి మనలను మనం ప్రతిష్ఠించుకోవటం! దేవుని మహా పవిత్రతను మనం గ్రహించలేము. శిష్యుడైన యోహాను ప్రభువుకు ఎంతో సన్నిహితంగా వున్నవాడు. అయినా ప్రభువును తన మహిమలో చూచినప్పుడు చచ్చిన వానిలాగా పడిపోయాడు. 1 పేతురు 1.16లో "నేను పరిశుద్ధుణ్ణి గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి" అని చెప్పబడింది. అలాంటి స్థితిలో వుండటం ఎంత ధన్యత! దేవుని వాక్యం వెలుగులో సంచరిస్తూ, ఆత్మతో నింపబడినట్లయితే, మనం పాపరహిత జీవితం జీవించగలం.

### సంఘర్షణ

అనేకసార్లు మనం ఆధ్యాత్మిక జీవితంలో సంఘర్షణలకు లోనవుతూ వుటాము. ఆత్మ, శరీరాలకు ఎడతెగని పోరాటం ప్రవర్తిల్లుతూ వుంటుంది. ఈ పోరాటంలో ఎటూతేల్చుకోలేక చిక్కున పడుతూ వుంటాము. "మనం పాపము విషయంలో చనిపోయిన వాళ్ళుగా ఎంచుకోవాలి.(రోమా 6.11) కాని, మన విషయంలో పాపము యింకా చావలేదు. చాలాసార్లు ప్రార్థనలో కనిపెట్టడం మానివేసి లోకాశలవైపు మరులు కొల్పబడతాం! ప్రభువుకు నమ్మకంగా వుండలేక పాత స్వభావాన్ని అనుసరిస్తుంటాం.

మనం దేవునికి ఎంత సన్నిహితంగా జీవిస్తామో, అంతగా దైనందిన జీవితంలోని విషయాలలో విజయం సాధిస్తాం. మనం జయ జీవితం జీవించటానికి కావలసినవన్ని దేవుడు సమకూర్చాడు. అనుక్షణము ఆయన కృప అందుబాటులో వుంది. అయినా మనం తప్పిపోతున్నామంటే దానిక్కారణం దేవుడు అనుగ్రహించిన వనరులు వివియోగించుకోక పోవడమే.

### పవిత్రత

మనలను మనం నిజాయితీగా ఇలా ప్రశ్నించు కుందాం. "పాపానికి శిక్ష ఏమిలేదని గట్టిగా తెలిస్తే, అలాంటప్పుడు మనం చేసే పాపాలకు మితి వుంటుందా?" కేవలం మాటలలోనే పవిత్రతను గురించి చర్చిస్తున్నామా? పవిత్రత అంటే దేవుని పోలి వుండటమే. అలా కాదని ఎవరైనా బోధిస్తే అది చెడుగు, సైతాను సంబంధించిన మాట. మరి, మన జీవితాలు మాటేమిటి? మన ప్రార్థనలకు జవాబు రాకుండా ఏదైనా పాపం అడ్డు వస్తుందా? దేవుని ముఖాన్ని మరుగు చేసే పాపం ఏదైనా మన జీవితంలో పొడసూపిందా? దేవుని వాక్య వెలుగులో పరిశీలించుకొని ఆయన రక్తంలో కడుగుకొని పవిత్రులం కావాలి! ఏదో కొన్ని పనులు చెయ్యనంత మాత్రాన పవిత్రులం కాము. ఉదాహరణకు మద్యపానాలు సేవించడం, పొగ త్రాగడం, వ్యభిచారం చెయ్యకపోవచ్చు. కాని దేవుని స్తుతించక పోతే ఆయనకు సాక్షిగా జీవించక పోతే, నశించుచున్నవారి కోసం భారంతో విజ్ఞాపన చెయ్యకపోతే ..... అలాంటి వ్యక్తి పరిశుద్ధుడందామా? దేవుడు అపవిత్రమైన పాత్రలను తన సత్యంతో నింపేవాడు కాదు. పవిత్రమైన పాత్రలనే ఆయన తన మహిమకోసం వాడు కుంటాడు. కనుక నశించుచున్నవారికి దేవుని సత్యసువార్తను ప్రకటించడానికి పవిత్రమైప పాత్రలుగా వుండాలని మనందరి ఆశ, ప్రార్థన కావాలి !

This article was set in a legacy (non-Unicode) Telugu font in the printed souvenir. It has been re-typed into Unicode Telugu for this web edition so that it can be searched, resized and read by screen readers. The original printed pages are reproduced below.

View the original printed pages