English | తెలుగు | हिन्दी

అధ్యాయం 1

పరిచయం

రండి, మనం నిర్మించుదాం · బఖ్త్ సింగ్

పరిచయం

ఇశ్రాయేలీయులు బబులోను దేశంలో డెబ్బై సంవత్సరాలు చెరలో గడిపి, కోరెషు రాజు పరిపాలనా కాలంలో యెరూషలేముకు తిరిగి వచ్చారు (2 దిన.36: 22; Ezra 1:1-11). వారు తిరిగి వచ్చినప్పుడు యెరూషలేము పట్టణం, దాని గుమ్మములు కాల్చివేయబడి, గోడలు పడగొట్టబడి ఉండటం చూశారు. యెరూషలేము పరిస్థితిని గురించిన ఈ వార్తను కొందరు యూదులు నెహెమ్యాకు తెలియజేశారు (నెహె.1: 2-3). యెరూషలేము మరియు దేవుని ప్రజల పరిస్థితిని గురించి విన్నప్పుడు, అతడు కన్నీళ్లతో, ఉపవాసంతో ప్రార్థించడం మొదలుపెట్టాడు. అతడు ఇశ్రాయేలీయులకు దేవుడు చేసిన వాగ్దానాన్ని (లేవీ.26: 40-45) ఆయనకు జ్ఞాపకం చేయడం మొదలుపెట్టాడు. మొదట అతడు తన సొంత పాపాలను, తన తండ్రి ఇంటివారి పాపాలను మరియు దేవుని ప్రజల పాపాలను ఒప్పుకొన్నాడు.

ఈ రోజుల్లో అనేక మంది విశ్వాసుల పరిస్థితి నెహెమ్యా కాలంలోని ఇశ్రాయేలీయుల పరిస్థితిని పోలి ఉంది. వారు తమ జీవితాల్లో దేవునికి, ఆయన వాక్యానికి మరియు ఆయన మందిరానికి తగిన స్థానం ఇవ్వకపోవడం వలన వారి మధ్య విచారకరమైన బీడుభూమి పరిస్థితి ఏర్పడింది (1 కొరిం.3: 1-6). మనం మనలను తగ్గించుకొని, నిజమైన మారుమనస్సుతో దేవుని వైపు తిరిగి, ఆయనను హృదయపూర్వకంగా గౌరవించినప్పుడే ఆయన సమృద్ధిగా ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందగలుగుతాము. మనం దేవుని ముందు వణకుతూ మన పాపాలను ఒప్పుకొన్నప్పుడు, దేవుడు మన ప్రార్థనలు వింటాడు, మన పాపాలను క్షమించి మనలను ఆశీర్వదిస్తాడు. 2 దిన.7: 14లో దేవుడు చేసిన వాగ్దానాన్ని నమ్మి, నెహెమ్యా కొన్ని రోజులపాటు దుఃఖంతో, ఉపవాసంతో ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఇదే సూత్రం విశ్వాసులకు కూడా వర్తిస్తుంది. వారు తమను తాము తగ్గించుకొని, తమ పాపాలను ఒప్పుకొని దేవునికి ప్రార్థించినప్పుడే వారు తమకు మొదట ఉన్న ప్రేమను తిరిగి పొందగలుగుతారు. అప్పుడు దేవుడు కూడా వారిపై ప్రార్థన మరియు విజ్ఞాపన ఆత్మను కుమ్మరించడం ద్వారా వారిలో పనిచేయడం మొదలుపెడతాడు (నెహె.1: 5-8). ఈ విధంగా మనలను మనం తగ్గించుకొని, మన తప్పులను ఒప్పుకోవడం వలననే మనం సంపూర్ణంగా ఫలభరితులమవుతామని మనం చూస్తున్నాము. మరొకసారి మనం మొదట అనుభవించిన దేవుని ఆశీర్వాదాలను పొందుతాము.

↑ పైకి వెళ్ళండి ← పుస్తకానికి వెనుకకు ← పుస్తక భాండాగారానికి

↑