#599
క్రైస్తవ వైద్యశాలలు – క్రీస్తు అనుగ్రహించు స్వస్థత
పల్లవి · Pallavi
పరమ వైద్యుండ భారతీయల – వ్యాధి బాధలన్ బాపుమా – పరులకుపచార బొనర్చుట – పరమ విధియని చూపుమా || పరమ ||
చరణము 1
ప్రేమతో వైద్యులను దాదులను – పెంపున బొందగ జేయుమా – గ్రామ రోగులన్ గాంచి వారికి – క్షేమమును దయ చేయుమా || పరమ ||
చరణము 2
భరత ఖండము నందు వైద్యపు – బడులను నెలకొల్పుమా – పరగ నీవే వైద్యశాలలన్ – పాలనంబు సలుపుమా || పరమ ||
చరణము 3
కుంటి గ్రుడ్డి మూగ శాలలన్ – గూర్మితో దర్శించుమా – యంటు రోగుల యాశ్రయముల – నంటి పరామర్శించుమా || పరమ ||
చరణము 4
లెక్కలేని గర్భవతుల – యెక్కరలను తీర్చుమా – దిక్కు లేని బిడ్డలకు నీ – దీవెనల సమకూర్చుమా || పరమ ||
చరణము 5
యంత్రశాలల గనులయందు – నలయు వారలన్ బ్రోవుమా – మంత్ర తంత్రములందు లొక్కు న – మాయకులను గావుమా || పరమ ||
చరణము 6
గ్రామ వైద్య సేవ జేసెడి – ఘనులన్ బరిపాలించుమా – గ్రామవాసులన్ గాల్చు వ్యాధులన్ – గాంచి నిర్మూలించుమా || పరమ ||
చరణము 7
దురభిమాన మూఢ భక్తిని – ద్వరగ దూరపరుచుమా – మరియు శుచిచే రోగములు మటు – మాయమగునని కరపుమా || పరమ ||
చరణము 8
దేహశుద్ధిని జిత్తశుద్ధిని దేశ జనులకు గూర్చుమా – దేహములు బర శుద్ధమగు నీ – దేవళములుగా మార్చుమా || పరమ ||