#333

పశ్చాత్తాపపడుటకు ప్రేరేపణ

రాగం: ఆనందభైరవి (ఛాయ: పరిశుద్ధాత్మను గోరుము) · తాళం: అట · రచయిత: మోర్త ప్రకాశము

Category: దేశీయ ప్రేషితోద్యమ రీతి · Open in the hymnal app

పల్లవి · Pallavi
పశ్చాత్తాపము బొందుము – జీవమా నీవు – ప్రభుని సన్నిధికేగుము – పశ్చాత్తాపము లేని – ప్రజలెవ్వరికిని గాని – నిశ్చయముగా గలుగు – నిత్యమౌ నరకంబు ॥పశ్చాత్తాపము॥
చరణము 1
ఎంత పాపమైనను – జీవమా క్రీస్తు – చెంత ప్రార్థన చేయుము – సంతోషమును మన – శాంతిని నొసంగును – నంతుండైన విమ – లాత్ముడాదరించు ॥పశ్చాత్తాపము॥
చరణము 2
జార చోర కార్యములు – ఏవైనను – బారదోలును వేగము – నా రాజ్యమును వెదక – నరులందరకు జీవ – ధార లిచ్చెదనని – కోరి కర్త వచించె ॥పశ్చాత్తాపము॥
చరణము 3
వినుము ప్రభువు వాక్యము – జీవమా నీవు – గనుము రక్షణ భాగ్యము – తనువు నిత్యముగాదు – నిన్ను నీవు నమ్మకుము – వినయ బుద్ధి క్రీస్తు – పుణ్యము వెతుకుము వేగ ॥పశ్చాత్తాపము॥
చరణము 4
దిక్కుమాలిన దానవే – జీవమా ప్రభుని – మ్రొక్కి పరమును జేరవే – నిక్కమిది నీ పాప – మెక్కువగానున్న – మక్కువతో నిన్ను – గ్రుక్కున విడిపించు ॥పశ్చాత్తాపము॥
చరణము 5
బలములేని దానవే – జీవమా యాత్మ – బలము బొందుము వేగమే – ఇలను విద్య ధన – బలముల నమ్మక – కలుష జాలము వీడి క – రము కడకేగుము ॥పశ్చాత్తాపము॥
చరణము 6
మంద పోషకుండగు – క్రీస్తు – జీవమా యేసా – నందపూర్ణుడు ధీరుడు – వందిత సత్సంఘ – మందు జేరిన సత్యా – నందంబు నిత్యంబు – నొందుచునుందువు ॥పశ్చాత్తాపము॥