#252

దేవుని వాక్యము

రాగం: ఖరహరప్రియ · తాళం: అట · రచయిత: పురుషోత్తము చౌదరి

Category: క్రీస్తు శ్రమలు — మరణము · Open in the hymnal app

పల్లవి · Pallavi
దేవుడిచ్చిన దివ్య వాక్యమి – దేను మన కొరకు యన్నలారా – భావ శుద్ధిని జేయు ఘన శుభ – వర్తమానము దీని పేరు ॥దేవుడిచ్చిన॥
చరణము 1
భయముతో భక్తితో జదివిన – ప్రాపు క్రీస్తుండటంచు దెల్పును – దయామయుడగు దేవుడే మన – తండ్రియని బోధించు నెల్లెడ ॥దేవుడిచ్చిన॥
చరణము 2
సత్య శాంతము లంకురించును – సత్క్రియా ఫలితములును బొడమును – నిత్య జీవము గలుగు దానిన్ – నిస్సందేహముగా నుండును ॥దేవుడిచ్చిన॥
చరణము 3
ఈ సుమంగళ దివ్య వాక్యము – నిప్పుడే మీరు అనుసరించుడి – దోషములు నెడబాసి మోక్షపు – ద్రోవ గోరినవారలెల్లరు ॥దేవుడిచ్చిన॥
చరణము 4
పాపములలో నుండి విడుదల – పరమ సుఖమని తలతురేనియు – తాప మార్పును లేచి రండి – త్వరగా క్రీస్తుని శరణు బొందను ॥దేవుడిచ్చిన॥
చరణము 5
దురిత ఋణములు తీర్చు మధ్య – స్థుండు గావలె నన్నవారలు – త్వరగా రండి త్వరగా రండి – వరదుడౌ క్రీస్తు కడకిప్పుడే ॥దేవుడిచ్చిన॥
చరణము 6
మరణమునకై భయము నొందెడి – మానసము గలవారలెల్లరు – పరమ శాంతి యొసంగు క్రీస్తుని – పజ్జ డాయగా రండి వేగము ॥దేవుడిచ్చిన॥
చరణము 7
నిర్మలాంతఃకరణ సౌఖ్యము – నిజముగా నిలవెదకువారు – ధర్మచిత్తుండైన క్రీస్తుని – దరికి రండి రండి వేగము ॥దేవుడిచ్చిన॥
చరణము 8
మోక్షరాజ్యము జేరగోరెడి – బుద్ధి గలిగినవారలెల్లరు – రక్షకుండగు యేసు నొద్దకు – రండి రండి విశ్వసించుచు ॥దేవుడిచ్చిన॥