Chapter 30 of 31 · వ్యాసాలు · Articles in Telugu

యబ్బేజు ప్రార్థన

Original souvenir p. 177

యబ్బేజు అనగా వేదన అని అర్థం. ఇతను తన సహోదరులందరిలో ఘనత పొంది ఉండెను. వేదన పడి ఇతని కంటినని ఇతని తల్లి యబ్బేజు అని పేరు పెట్టెను. ఇతను ఇశ్రాయేలీయుల దేవుడిని ఇలా మొర్ర పెట్టెను. 1. దిన 4-10, "నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థన చేయగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను". అనగా మనం దేవుని సన్నిధిలో విశ్వాసముతో ఏది అడిగిన మన దేవుడు తన చిత్తములో దానిని ఇచ్చేవాడుగ ఉన్నాడు. ఇక్కడ సహోదరులకంటే ఘనముగా ఉన్న వ్యక్తి, కుటుంబములో అన్ని విధాలుగా స్థిరపడిన యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుడిపై ఆధారపడవలసిన అవసరం వచ్చింది. మనం కూడా మన జీవితంలో ఎన్నోసార్లు దేవుడిని ఆశ్రయిస్తూ ఉంటాము. ఎలాంటి అనుమానాలు లేకుండా, విశ్వాసముతో దేవుని సన్నిధిలో అడిగితే మన తండ్రి అయిన దేవుడు, సర్వసృష్టి కర్త, మాట మన నోటికి రాక ముందే మన తలంపులను ఆలోచనలను తెలిసికొనే దేవుడు మనం చేసి ప్రార్థనను అంగీకరిస్తాడ్లు. యబ్బేజు గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా క్లుప్తంగా ఉంది కాని ఇతని ప్రార్థన మాత్రం చాలశక్తికలదిగ కనిపిస్తుంది.

  1. నిశ్చయమైన ఆశీర్వాదము : అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుడు, మాట తప్పని మహాదేవుడు తనకు ఖచ్చితముగా ఆశీర్వాదము ఇవ్వాలని యబ్బేజు ప్రార్థన చేసెను. యెహోవా ఆశీర్వాదము నొందినవారు భూమిని స్వతంత్రించుకొందురు. ఆదికాండము 12, 2,3, అబ్రహామును దేవుడైన యెహోవా ఈ విధముగా ఆశీర్వదించెను. "నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఆ తర్వాత యెహోవా చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. యెహోవా మాటకు లోబడి వెళ్ళిన అబ్రహాము బహు ధనవంతుడిగా, జనములకు తండ్రిగా ఆశీర్వాదం పొందెను.
  1. సరిహద్దులను విశాలపరచడం : యబ్బేజు తన ఆత్మీయ, అనుదిన జీవితంలో వచ్చే శోధనలను, ప్రతికూలపరిస్థితులను ఎదుర్కోవడానికి తండ్రి అయిన దేవుడి జ్యోక్యాన్ని అడిగినట్లు చూడవచ్చు. అవును నిజమే, మన లైఫ్‌లో ఉన్న సమస్యలసరిహద్దులను చెరిపివేయగలశక్తి ప్రార్థనకి ఉంది. కీర్తనలు 138:3, "నేను మొర్ర పెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నాప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి". కీర్తనలు 74:17 "భూమికి సరిహద్దులను నియమించినవాడవు నీవే" ఇలాంటి గొప్ప సృష్టికర్తను దేవుడిగా, తండ్రిగా కలిగిన మనము ధన్యులము.
  1. దేవుని హస్తము తోడు, కాపుదల : మనం దేవుని కాపుదలలో ఉంటే ఎలాంటి పరిస్థితులలో అయిన జయం పొందగలము. ఉదహరణ : మోషే, అబ్రహాము, యెహోషువా 1:5,6 నీవు బ్రదుకు దినములన్నిటను తను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువ లేక యుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై యుందును. నిన్ను విడువను, ఎడబాయను.. అనెను, అలాగే మోషే ని గురుంచి సంఖ్యా కాండము12: 3,6 "నా యిల్లు అంతటిలో నమ్మకమైన వాడు, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు" అని దేవుడైన యెహోవా చెప్పెను. ఇలాంటి ధన్యత మన జీవితాలలో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రియులారా! మరి మనము ఆయన దృష్టికి నిందా రహితులముగా, నిత్య రాజ్యానికి నమ్మకమైన వారసులముగా ఉంటున్నామా ? ఒక్కసారి ఆలోచించాలి.
  1. సమస్త కీడు (పాపము) నుండి విడుదల : దేవుడికి అవమానకరంగా మన జీవితం ఉందా? దైవ సన్నిధి నుండి మనలను ఎలాంటి కీడు దూరపరుస్తున్నది? దేవునికి విరోధముగా మన క్రియలు, ఆలోచనలు, ఉంటే అది కూడా కీడు కలిగించే అంశమే. ఏసుక్రీస్తు రక్తము ప్రతి కీడు నుండి మనలను పవిత్రపరుచును. సామెతలు 20:22 "కీడుకు ప్రతికీడు చెసెదను అనుకోవద్దు", మనం యెంత పాపులముగా ఉన్ననూ మన ప్రభువు మన యెడలకనికరము కలిగిన వాడై ఉన్నాడు. నిండు మనసుతో మన పాపాలను ఒప్పుకొని, ఆయన దృష్టికి అంగీకారమైన ప్రవర్తన కలిగి ఉంటే, అబ్రహామును, మోషేను, యబ్బేజును ఆశీర్వదించిన ప్రభువు నేడు మనలను కూడా అదే రీతిగా ఆశిర్వదించడానికి సంసిద్ధతతో ఉన్నాడు. మనం చేసే ప్రతి పని దేవుడి చిత్తనుసారంగా, ప్రార్థనా పూర్వకంగా చేయునట్లు దేవుడు కృప చూపును గాక!

"యెహోవా కొరకు కనిపెట్టుము ఆయన నిన్ను కనిపెట్టును ఆయన నిన్ను రక్షించును".

This article was set in a legacy (non-Unicode) Telugu font in the printed souvenir. It has been re-typed into Unicode Telugu for this web edition so that it can be searched, resized and read by screen readers. The original printed pages are reproduced below.

View the original printed pages