యేసువైపు చూస్తూనే ఉండండి
యేసును గురించి మరింత
ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో, ప్రభువైన యేసుక్రీస్తు తన అపొస్తలుడైన యోహానుకు తన పరలోక మహిమలో ఎలా ప్రత్యక్షమయ్యాడో మనం చదువుతాము. తన రచనలలో ఆ అపొస్తలుడు తనను తాను ఆరుసార్లు 'యేసు ప్రేమించిన శిష్యుడు' అని పిలుచుకుంటాడు. ఇది ప్రభువైన యేసుక్రీస్తుకు మిక్కిలి సన్నిహితంగా ఉండాలనే గొప్ప కోరిక అతనికి ఉందని చూపిస్తుంది. కొందరు ప్రభువుచేత గౌరవించబడాలని ఆయన చుట్టూ ఉండాలని కోరుకున్నారు. ఒక గొప్ప వ్యక్తి ఒక పట్టణానికి వచ్చినప్పుడు కొందరు అతనికి మిక్కిలి సన్నిహితంగా ఉండాలని కోరుకుంటారు, అతనిని ప్రేమించడం వల్ల కాదు గాని, “మేము ఆ వ్యక్తిని చూశాము” అని చెప్పగలిగేలా ముందు వరుసలో ఉండాలని, తద్వారా మనుష్యులచేత గౌరవించబడాలని. కాని అపొస్తలుడైన యోహాను ఏ గౌరవం కోసమో ప్రభువు దగ్గర కూర్చోలేదు, ఆయనను ప్రేమించినందుకే, ఆయన ప్రేమను అనుభవించాలనే కోరికతోనే అలా చేశాడు. అందుకే అతడు ఇతర అపొస్తలుల కంటే దేవుని ప్రేమను గురించి చాలా ఎక్కువగా మాట్లాడతాడు. ఆ ప్రేమ కారణంగానే, తన వృద్ధాప్యంలో పత్మాసు ద్వీపంలో, తన జీవితమంతటిలో చూసినదానికంటే ప్రభువైన యేసుక్రీస్తును గురించి మరింత ఎక్కువగా చూసే భాగ్యం అతనికి కలిగింది. అప్పుడు యోహాను ఆయన మహిమను ఇంతకుముందు ఎన్నడూ చూడని విధంగా అద్భుతంగా చూశాడు. గత సంవత్సరాలలో అతనికి ఆయన మహిమను, సౌందర్యాన్ని అనేకసార్లు కొద్దికొద్దిగా చూసే భాగ్యం కలిగినప్పటికీ, ఇప్పుడు అతడు ఆయనను పూర్తిగా క్రొత్త విధంగా చూశాడు.
మనలో చాలామందికి ప్రభువైన యేసును గురించి అనేక అనుభవాలు కలిగి ఉండవచ్చు, వాటన్నిటికీ మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాము, కాని దేవుని వాక్యం ప్రకారం ఆయనను గురించి చూడవలసినది, నేర్చుకోవలసినది ఇంకా చాలా ఉంది. అయితే ఆయనను చూడటానికి మనకు కళ్ళు ఉండాలి. కొన్నాళ్ళ క్రితం ఒక యువకుడు బొంబాయికి వెళ్ళాడు. అతడు తిరిగి వచ్చినప్పుడు అతని స్నేహితులు అతనిని అడిగారు, “బొంబాయి నీకు ఎలా అనిపించింది?” “అది ఒక అద్భుతమైన నగరం” అని అతడు వారితో చెప్పాడు. “అది ఎందుకు అంత అద్భుతం” అని వారు అడిగినప్పుడు, “ఎందుకంటే వారు మాకు చాలా రుచికరమైన 'బిర్యానీ' పెట్టారు” అని అతడు జవాబిచ్చాడు. బిర్యానీతో అతడు ఎంతగా సంతోషించాడంటే, బొంబాయి గురించి అతడు చెప్పగలిగింది అదొక్కటే. భవనాలు గాని, సముద్రం గాని, తోటలు గాని, ప్రజలు గాని అతనిని ఏమాత్రం ఆకర్షించలేదు; కాని అతడు నిజాయితీగా, సంతోషంగా, “నేను ఎక్కడా ఇలాంటి బిర్యానీ తినలేదు” అని చెప్పగలిగాడు. బహుశా మీరు కూడా అలాంటి స్థితిలోనే ఉండి ఉండవచ్చు, ఎందుకంటే మీకు క్రీస్తును గురించి మరింత తెలియదు, అయినప్పటికీ ఆయనవైపు చూడటం ద్వారా దేవుడు మనకు ఇంకా చాలా ఎక్కువగా ఇస్తాడని మేము ఆశిస్తూ ప్రార్థిస్తున్నాము.
ప్రియశిష్యుడైన యోహాను - ఒంటరి ఖైదీ
మనలో చాలామంది అపజయం, సిగ్గుతో కూడిన జీవితాలు జీవిస్తున్నాము, మరియు మనం త్వరగా నిరుత్సాహపడిపోతాము, కృంగిపోతాము, దుఃఖితులమవుతాము. అపవాది చేత మనం ఎంత సులభంగా మోసగించబడుతున్నామో! శత్రువు చాలా కుయుక్తిగలవాడు, దుష్టుడు, మిక్కిలి శక్తిమంతుడని దేవుని వాక్యం ద్వారా మనకు హెచ్చరిక ఇవ్వబడింది. అతడు గర్జించే సింహంలా, చీల్చే తోడేలులా, వరదలా, లేదా వెలుగుదూతలా రావచ్చు. కాని మన ప్రభువు మనతో, “ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను” అని చెప్పాడు.John 16:33.శత్రువు తనకు నచ్చిన ఏ విధంగానైనా రానీయండి. మన కళ్ళు ప్రభువుపైనే స్థిరంగా ఉంచాలి; మనపైన గాని, ప్రసంగీకునిపైన గాని, వరాలు, ప్రతిభలు, స్థానము లేదా స్థలంపైన గాని కాదు. మనం Psalm 46:10,”ఊరకుండి నేనే దేవుడనని తెలిసికొనుడి”. మనం నిశ్చలంగా నిలిచినప్పుడే ప్రభువు ఎవరో మనకు తెలుస్తుంది. దేవుడు తన నిజమైన సౌందర్యాన్ని, మహిమను చూసేలా, ఆయనను గుర్తించేలా మనలను తీసుకువెళతాడు. ఈ దినాలలో ఇదే మా కోరిక, మా ప్రార్థన.
యోహాను ప్రభువుకు అత్యంత ప్రియమైన శిష్యుడు, అయినప్పటికీ తన వృద్ధాప్యంలో దేవుని వాక్యం కొరకు, ప్రభువు సాక్ష్యం కొరకు ఖైదీగా మారాడు. ఇతర సందర్భాలలో ప్రభువు తన దూతలను పంపి తన సేవకులను చెరసాల నుండి విడిపించినట్లు మనం చూస్తాము. ఆయన కోరుకుంటే ఒక్క క్షణంలో యోహానును విడిపించగలిగేవాడు, కాని ఆ ఒంటరి స్థలంలో అతడు ఖైదీగా ఉండటానికి ఆయన అనుమతించాడు. అతడు ఒక ప్రత్యేక ఖైదీగా కాక, సాధారణ ఖైదీగానే వ్యవహరించబడ్డాడు. అతడు దేవుని మనిషి, 'యేసు ప్రేమించిన శిష్యుడు' అయినప్పటికీ, అక్కడ అతడు ఒంటరి స్థలంలో ఖైదీగా ఉన్నాడు. యోహాను నిరుత్సాహపడి ఉండాలి, అనేక అంతరంగిక సంఘర్షణల గుండా వెళ్ళి ఉండాలి.
మనం Acts 6:7, 12:24, 13:49 మరియు 19:24లలో, దేవుని వాక్యం ఎలా వ్యాపిస్తూ, ప్రబలుతూ వెళ్ళిందో మనం చూస్తాము. కొద్దిమంది మనుష్యులు చాలా తక్కువ కాలంలో లోకాన్ని తలక్రిందులు చేశారని లేఖనం చెబుతుంది. వారు ఎక్కడికి వెళ్ళినా మనుష్యులు వణికిపోవడం మొదలుపెట్టారు. అయితే అకస్మాత్తుగా భ్రష్టత్వం వచ్చింది. చాలామంది విశ్వాసులు తమ మొదటి ప్రేమను కోల్పోయారు. డబ్బు కోసం, లోకసంబంధమైన లాభం, ప్రయోజనం కోసం చాలామంది వెళ్ళిపోయారు. వారు దేవుని కంటే లోకసంబంధమైన సుఖాన్నే ఇష్టపడ్డారు. మరోవైపు కొందరు దేవుని వాక్యం కొరకు బాధపడ్డారు, ఖైదీలు కూడా అయ్యారు. ఆ విధంగా చాలా కొద్దిమంది మాత్రమే చివరివరకు నమ్మకంగా నిలిచారు. అపొస్తలుడు ఇలాంటి పరిస్థితులను చూసినప్పుడు మిక్కిలి నిరుత్సాహపడ్డాడు. పత్మాసు ఎలా బీడు ద్వీపమో, అలాగే యోహాను ప్రజల మధ్య ఆత్మీయంగా అదే బీడుభూమిని చూశాడు. అతడు, “ఓ ప్రభూ! ఈ ఆత్మీయ బీడుభూమి ఎందుకు? నీ ప్రజలు ఎందుకు ఇంత చల్లగా, బలహీనంగా, నిర్లక్ష్యంగా మారారు? ప్రభూ, మనం ఇంతకుముందు చూసిన అదే శక్తిని ఇప్పుడు ఎందుకు చూడలేకపోతున్నాము?” అని మొరపెట్టుకున్నాడు. ఇలాంటి ప్రశ్నలు ఆ సమయంలో అపొస్తలుని మనసులో ఉండేవి. అతడు తన సొంత శారీరక అసౌకర్యం గురించి, బాధల గురించి అంతగా చింతించలేదని నేను భావిస్తున్నాను. వాటిని గురించి అతడు ఎన్నడూ ఫిర్యాదు చేయలేదు. కాని అతడు ప్రతిచోటా ఉన్న దేవుని ప్రజల ఆత్మీయ స్థితి గురించే శ్రద్ధ వహించాడు. శత్రువు అంత చురుకుగా ఉండటం చూసినప్పుడు అతడు నిరుత్సాహపడ్డాడు. దేవుని ప్రజలు నిస్సహాయంగా, బలహీనంగా ఉండటం చూసి అతడు క్రుంగిపోయాడు. ఈ దినంలో లోకంలోని ప్రతిభాగంలో దేవుని ప్రజల మధ్య, ఆయన సాక్ష్యంలో అదే స్థితి నెలకొని ఉంది. మనం కూడా, “ఓ ప్రభూ, ఇదెందుకు? ఓ ప్రభూ, ఎంతకాలం? ఓ దేవా, మాకు జవాబిమ్ము, నీ మార్గాన్ని మాకు చూపించు” అని చెప్పవలసి ఉంటుంది.
ప్రభువు మాట్లాడుతున్నాడు - వినండి, తిరిగి చూడండి
మొట్టమొదట యోహాను తన వెనుక ప్రభువు స్వరాన్ని విన్నాడని మనకు చెప్పబడింది (Rev 1:10-12). ప్రభువు అతని వెనుక నుండి ప్రత్యక్షమై మాట్లాడటానికి ఒక ప్రయోజనం ఉంది. ప్రభువు కావాలంటే అతని ముందు కూడా ప్రత్యక్షం కావచ్చు. ప్రభువు బాకా శబ్దంలా బిగ్గరగా, స్పష్టమైన స్వరంతో “నేనే అల్ఫాయు ఒమెగయు” అని పలికాడని లేఖనం చెబుతుంది. అప్పుడు అపొస్తలుడు, “నాతో మాటలాడిన స్వరమును చూడవలెనని నేను వెనుకకు తిరిగాను” అని చెబుతాడు. ఆయన అతని ముందు ఎందుకు ప్రత్యక్షం కాలేదు? అపొస్తలుని మనసులోని ప్రశ్నలకు జవాబివ్వాలని ఆయన కోరుకోవడమే దీనికి కారణం. అతని వెనుక ప్రత్యక్షమవడం ద్వారా ప్రభువు ఇలా చెబుతున్నాడు: “యోహానూ! నీవు ఏమి ఆలోచిస్తున్నావో నాకు సరిగ్గా తెలుసు. నీ భయాలు, కష్టాలు అన్నీ నాకు తెలుసు. నీవు నిరుత్సాహపడి ఓడిపోయినట్లు భావిస్తున్నావని నాకు తెలుసు. కాని యోహానూ, నీవు తప్పు దిక్కుకు చూస్తున్నావు. నీవు వెనుకకు తిరగడం మంచిది, అప్పుడు నీ ప్రశ్నలన్నిటికీ జవాబు దొరుకుతుంది, నీ సమస్యలు పరిష్కారమవుతాయి. నీవు పూర్తిగా వెనుకకు తిరిగినప్పుడు నన్ను చూసి నేనెవరో తెలుసుకుంటావు.” యోహాను ప్రభువును గురించి, ఆయన అద్భుతాలను, బోధలను గురించి అన్నీ తనకు తెలుసునని చెప్పగలిగేవాడు. ఆయన రూపాంతరానికి, ఆరోహణకు అతడు ప్రత్యక్ష సాక్షి. అయినప్పటికీ ఆదియు అంతమునైయున్న ప్రభువు ఇలా చెబుతున్నాడు, 'నేను చెప్పేదాని పూర్తి భావం నీకు అర్థం కావడం లేదా? అయితే పూర్తిగా వెనుకకు తిరిగి నన్ను చూడు, నేనెవరో నీకు తెలుస్తుంది.' అతడు వెనుకకు తిరిగినప్పుడు, ఇంతకుముందు ఎన్నడూ చూడని విధంగా ప్రభువును చూశాడు (17వ వచనం). వెనుకకు తిరిగినప్పుడు అతడు ఆ దర్శనంలో ఎంతగా లీనమయ్యాడంటే, “ప్రభూ, నీవు ఇంత మహిమాన్వితుడవని నేను ఎన్నడూ ఎరుగను. నీవు ఇంత గొప్పవాడవని నేను ఎన్నడూ ఎరుగను” అని ఆర్తనాదం చేశాడు. తనను తాను ప్రత్యక్షపరచుకోవడానికి మన ప్రభువు యోహానుతో అతని వెనుక నుండి ఈ విధంగా మాట్లాడాడు.
యేసువైపు చూస్తూనే ఉండండి
ఎందుకంటే మీరు ఆయనను ఆయన ఉన్నట్లుగా చూడటం లేదు. మనం అపజయపు జీవితం జీవిస్తున్నాము. మన కళ్ళు రెండు దిక్కులవైపు అస్థిరంగా చూస్తున్నాయి; ఒక కన్ను ప్రభువుపైన, మరొక కన్ను లోకంపైన.
చాలా సంవత్సరాల క్రితం అలహాబాదులో నేను ఒక బ్రాహ్మణ దుకాణదారుని చూశాను. అతని దుకాణంలో ఒక భాగం విగ్రహాలతో నిండి ఉండేది, మరో భాగంలో అతడు అమ్మే బియ్యం, పంచదార వంటి వస్తువులు ఉండేవి. ఎవరైనా ఏదైనా కొనడానికి వస్తే అతడు వారికి సేవ చేసేవాడు, తర్వాత మరో వైపుకు తిరిగి విగ్రహాలను పూజించడానికి వచ్చినవారికి సేవ చేసేవాడు. చాలామంది విశ్వాసుల విషయంలో కూడా అలాగే జరుగుతుంది; వారికి ఒక కన్ను ప్రభువుపైన, మరో కన్ను మరేదో దానిపైన ఉంటుంది. అందుకే వారు ఆత్మీయంగా గుడ్డివారవుతారు. మీరు నిజంగా ఆయనను చూడాలనుకున్నప్పుడు, మీ కళ్ళు ఆయనపైనే ఉండాలి. మీరు ఒకరిని కలవడానికి రైల్వే స్టేషనుకు వెళ్తారని అనుకుందాం. రైలు దిగుతున్న చాలామంది మీకు కనిపిస్తారు. మీరు వారిని చూస్తూ, “ఎంత మంచి మనిషి! ఎంత మంచి స్త్రీ! వారు ఎంత బాగున్నారు!” అని అంటారు. మీరు ఇలా నిమగ్నమై ఉండగా, మీ స్నేహితుడు నిశ్శబ్దంగా వెళ్ళిపోతాడు. మీరు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, మీ స్నేహితుడు అప్పటికే అక్కడ ఉండటం మీకు కనిపిస్తుంది. మీరు అతనిని ప్రశ్నిస్తూ, “నేను స్టేషనులో నీకోసం చూస్తున్నాను. రెండు గంటలు వెతికాను. కాని నిన్ను కనుగొనలేకపోయాను. నీవు ఇక్కడికి ఎలా వచ్చావు?” అని అడుగుతారు. మీ స్నేహితుడు జవాబిస్తాడు, “నేను నిన్ను అక్కడ స్టేషనులో చూశాను. కాని నీవు మిగిలిన ప్రయాణికులను చూస్తూ, మెచ్చుకుంటూ చాలా బిజీగా ఉన్నావు, అందుకే నీవు నన్ను చూడలేకపోయావు....”
సరే, ఇదే మన సమస్య కూడా; మనకు సంబంధం లేని వ్యక్తులను, వస్తువులను చూస్తూ మన సమయాన్ని వృథా చేసుకుంటాము, అందుకే మన జీవితం అంత బీడుగా ఉంటుంది. అపొస్తలుడైన యోహాను వంటి మనుష్యులు కూడా మోసపోగలరు. మన ప్రభువు యోహానును ప్రేమించాడు, అతనికి చూపించడానికి, ఇవ్వడానికి ఆయనకు చాలా ఉండేది. ప్రకటన గ్రంథంలో ఇతర గ్రంథాలలో కంటే ఎక్కువ రహస్యాలు మీకు కనిపిస్తాయి. కాని అవన్నీ యోహాను వృద్ధాప్యంలో అతనికి బయలుపరచబడ్డాయి. అతడు చెరసాలలో మిక్కిలి నిరుత్సాహంగా ఉన్నప్పుడు. అప్పుడు అతడు మరెవ్వరూ చూడని విషయాలు చూశాడు. మన ప్రభువు అతనికి పరలోకమంతటిని, తన రాజ్యమంతటిని చూపించగలిగాడు. ఈ భాగ్యం మనకు కూడా ఉంది. మన ప్రభువు స్వయంగా Matt 13:17 ఈ రహస్యాలు ఇప్పుడు మనకు బయలుపరచబడతాయని చెప్పాడు. కన్ను చూడనివి, చెవి వినినివి, మనుష్యుని హృదయంలోనికి ప్రవేశించనివి, మనకు బయలుపరచబడగలవని 1 Cor 2:9-10 చెప్పినట్లుగా, మనకు చూసే కళ్ళు, వినే చెవులు ఉంటే చాలు. కాని ఇప్పుడు మన విషయం ఇది; మన కళ్ళు అనేక ఇతర విషయాల చేత మోసపోయి, దూరంగా లాగబడ్డాయి. మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షించేవి ఏమిటి? మీరు మీ భార్యతో, పిల్లలతో బజారుకు వెళ్ళి వివిధ దుకాణాల గుండా వెళ్తారని అనుకుందాం. మీరు స్వీట్ల దుకాణం లేదా బొమ్మల దుకాణం దగ్గరకు వచ్చినప్పుడల్లా మీ పిల్లవాడు “నాన్నా” అని కేకవేసి ఆ స్వీటు లేదా బొమ్మను చూపిస్తాడు. ఆ పిల్లవానికి వాటిపైనే ఆసక్తి ఉంటుంది. మీరు చీరల దుకాణం దగ్గరకు వెళ్ళినప్పుడు మీ భార్య, “ఆ అందమైన చీర చూడు” అని అంటుంది. ఈ విధంగా మనకు ఎంతో ఇష్టమైన వస్తువులే మనలను ఆకర్షిస్తాయి. ఇప్పుడు ఆయన ఒక్కడివైపే ఆకర్షింపబడటం నేర్చుకోవడానికి ప్రభువు మీకు చూసే కళ్ళు ఇచ్చాడని మీరు చెప్పగలరా? అలా కాకపోతే, Psalm 119:18. “నా కన్నులు తెరువుము”
మన ప్రభువు అపొస్తలుని కళ్ళు తెరిచినప్పుడు అతడు ఏమి చూశాడు, ఏమి విన్నాడు, ఏమి చేశాడు? వాటిని మనం తర్వాత పరిశీలిస్తాము. చూసేందుకు మీకు కళ్ళు ఇవ్వమని ప్రభువును అడగండి; అప్పుడు మీరు ఇంతకుముందు ఎన్నడూ చూడని విధంగా ప్రభువైన యేసు సౌందర్యాన్ని, మహిమను చూస్తారు. యేసువైపు చూడండి, ఆయనవైపు చూస్తూనే ఉండండి; ఏ పురుషుడు గాని, స్త్రీ గాని, మరేదైనా గాని మీ దృష్టిని మరల్చనీయవద్దు.
చాలా సంవత్సరాల క్రితం, నేను లివర్పూల్ నుండి కెనడాకు ఓడలో ప్రయాణిస్తున్నాను. అదే ఓడలో కొత్తగా పెళ్ళైన ఒక జంట ఉండేది. వారు ఎల్లప్పుడూ కలిసి ఉండేవారు. మరెవరూ తమ దగ్గరకు రావడం వారికి ఇష్టం ఉండేది కాదు. వారు ఒకరిలో ఒకరు ఎంతగా లీనమై ఉండేవారంటే, వారు ఎక్కడికి వెళ్ళినా చుట్టూ ఉన్న ప్రజలను గమనించేవారు కాదు. వారి కళ్ళు ఒకరిపై ఒకరే ఉండేవి. మరేదీ మన దృష్టిని మరల్చకూడదని మన ప్రభువుకు కూడా అదే కోరిక ఉంది. మనం తనవైపు మాత్రమే చూస్తూ ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు.
↑ పైకి వెళ్ళండి ← పుస్తకానికి వెనుకకు ← పుస్తక భాండాగారానికి
