యోహాను సువార్త

అధ్యాయం 6 · John Chapter 6 · 71 వచనములు
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21

అధ్యాయము 6

గ్రంథము: యోహాను సువార్త· నిబంధన: క్రొత్త నిబంధన· వచనములు: 71

1అటుతరువాత యేసు తిబెరియ సముద్రము, అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్లెను.

2రోగుల యెడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహు జనులు ఆయనను వెంబడించిరి.

3యేసు కొండయెక్కి అక్కడ తన శిష్యులతో కూడ కూర్చుండెను.

4అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను.

5కాబట్టి యేసు కన్నులెత్తి బహు జనులు తనయొద్దకు వచ్చుట చూచివీరు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పు నడిగెను గాని

6యేమి చేయనై యుండెనో తానే యెరిగియుండి అతనిని పరీక్షించుటకు ఆలాగడిగెను.

7అందుకు ఫిలిప్పువారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను రెండువందల దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను.

8ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ

9ఇక్కడ ఉన్న యొక చిన్న వానియొద్ద అయిదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి గాని, యింత మందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా

10యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాల పచ్చికయుండెను గనుక లెక్కకు ఇంచుమించు అయిదువేలమంది పురుషులు కూర్చుండిరి.

11యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞ తాస్తుతులు చెల్లించి కూర్చున్నవారికి వడ్డించెను. ఆలాగున చేపలుకూడ వారికిష్టమైనంత మట్టుకు వడ్డించెను;

12వారు తృప్తిగా తినిన తరువాత ఏమియు నష్టపడకుండ మిగిలిన ముక్కలు పోగుచేయుడని తన శిష్యులతో చెప్పెను.

13కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన అయిదు యవల రొట్టెల ముక్కలు పోగుచేసి పండ్రెండు గంపలు నింపిరి.

14ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను చూచినిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి.

15రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని యేసు ఎరిగి, మరల కొండకు ఒంటరిగా వెళ్లెను.

16సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రము నొద్దకు వెళ్లి దోనె యెక్కి సముద్రపు టద్దరినున్న కపెర్నహూమునకు పోవుచుండిరి.

17అంతలో చీక టాయెను గాని యేసు వారియొద్దకు ఇంకను రాలేదు.

18అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను.

19వారు ఇంచుమించు రెండు కోసుల దూరము దోనెను నడిపించిన తరువాత, యేసు సముద్రముమీద నడుచుచు తమ దోనెదగ్గరకు వచ్చుట చూచి భయపడిరి;

20అయితే ఆయన నేనే, భయపడకుడని వారితో చెప్పెను.

21కనుక ఆయనను దోనెమీద ఎక్కించుకొనుటకు వారిష్టపడిరి. వెంటనే ఆ దోనె వారు వెళ్లుచున్న ప్రదేశమునకు చేరెను.

22మరునాడు సముద్రపుటద్దరిని నిలిచియున్న జన సమూహము వచ్చి చూడగా, ఒక చిన్న దోనె తప్ప అక్కడ మరియొకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడ దోనె ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్లిరనియు తెలిసికొనిరి.

23అయితే ప్రభువు కృతజ్ఞతా స్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటు నకు దగ్గరనున్న తిబెరియనుండి వేరే చిన్న దోనెలు వచ్చెను.

24కాబట్టి యేసును ఆయన శిష్యులును అక్కడ లేకపోవుట జనసమూహము చూచి నప్పుడు వారా చిన్న దోనెలెక్కి యేసును వెదకుచు కపెర్నహూమునకు వచ్చిరి.

25సముద్రపుటద్దరిని ఆయనను కనుగొనిబోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా

26యేసు మీరు సూచనలను చూచుటవలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుటవలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

27క్షయమైన ఆహారముకొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగ జేయు అక్షయమైన ఆహారముకొరకే కష్టపడుడి; మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రియైన దేవుడు ఆయనకు ముద్రవేసియున్నాడని చెప్పెను.

28వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయ వలెనని ఆయనను అడుగగా

29యేసు ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియయని వారితో చెప్పెను.

30వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు? ఏమి జరిగించుచున్నావు?

31భుజించు టకు పరలోకమునుండి ఆయన ఆహారము వారికి అను గ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి.

32కాబట్టి యేసుపరలోకమునుండి వచ్చు ఆహారము మోషే మీకియ్యలేదు, నా తండ్రియే పరలోకమునుండి వచ్చు నిజమైన ఆహారము మీకను గ్రహించుచున్నాడు.

33పరలోకమునుండి దిగి వచ్చి, లోకమునకు జీవము నిచ్చునది దేవుడనుగ్రహించు ఆహారమై యున్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను.

34కావున వారు ప్రభువా,యీ ఆహారము ఎల్లప్పుడును మాకు అనుగ్రహించు మనిరి.

35అందుకు యేసు వారితో ఇట్లనెను - ''జీవాహారము నేనే; నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి గొనడు. నాయందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు.

36మీరు నన్ను చూచి యుండియు విశ్వసింపక యున్నారని మీతో చెప్పితిని.

37తండ్రి నాకు అనుగ్రహించువారందరును నాయొద్దకు వత్తురు; నాయొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయును.

38నా ఇష్టమును నెరవేర్చు కొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చితిని.

39"ఆయన నాకు అనుగ్రహించిన దానియంతటిలో నేనేమియు పొగొట్టుకొనక, అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపినవాని చిత్తమైయున్నది."

40కుమారుని చూచి ఆయనయందు విశ్వాస ముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వానిని లేపుదును.''

41కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సణుగు కొనుచు -

42ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? ఈయన తల్లిదండ్రులను మన మెరుగుదుము గదా? - నేను పరలోకము నుండి దిగివచ్చియున్నానని ఈయన ఏలాగు చెప్పుచున్నాడనిరి.

43అందుకు యేసు - ''మీలో మీరు సణుగుకొనకుడి;

44నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు; అంత్యదినమున నేను వానిని లేపుదును.

45వారందరును దేవునిచేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడియున్నది గనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతివాడును నాయొద్దకు వచ్చును.

46దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి యుండలేదు; ఈయనే తండ్రిని చూచియున్నాడు.

47విశ్వసించువాడే నిత్యజీవము గలవాడు.

48జీవాహారము నేనే.

49మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి.

50దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమిదే.

51పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును; మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవముకొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను'' అనెను.

52యూదులు- ఈయన తన శరీరమును ఏలాగు తిననియ్యగలడని యొకనితో ఒకడు వాదించిరి.

53"కావున యేసు ఇట్లనెను -''మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని, మీలో మీరు జీవము గలవారు కారు."

54నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు; అంత్యదినమున నేను వానిని లేపుదును.

55నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై యున్నది.

56"నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును, నేను వానియందును నిలిచియుందుము."

57జీవముగల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును.

58ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము; పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు; ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడును జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను'' అనెను

59ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పెను.

60"ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని - ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి."

61యేసు తన శిష్యులు దీనినిగూర్చి సణుగుకొనుచున్నారని తనకుతానే యెరిగి వారితో ఇట్లనెను దీనివలన మీరు అభ్యంతరపడుచున్నారా?

62అలాగైతే మనుష్యుకుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన యెడల ఏమందురు ?

63"ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై యున్నవి, గాని"

64"మీలో విశ్వసించనివారు కొందరున్నారు'' అని వారితో చెప్పెను. విశ్వసించనివారెవరో, తన్ను అప్పగింపబోవువాడెవడో, మొదటి నుండి యేసునకు తెలియును."

65మరియు ఆయన - ''తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నాయొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితిని'' అనెను.

66"అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి, మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు."

67కాబట్టి యేసు - ''మీరు కూడ వెళ్లిపోవలెనని యున్నారా?'' అని పన్నెండు మందిని అడుగగా.

68"సీమోను పేతురు - ప్రభువా, ఎవనియొద్దకు వెళ్లుదుము ? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు;"

69నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి యున్నామని ఆయనతో చెప్పెను.

70అందుకు యేసు - ''నేను మిమ్మును పన్నెండు గురిని ఏర్పచు కొనలేదా? మీలో ఒకడు సాతాను'' అని వారితో చెప్పెను.

71సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా పన్నెండు మందిలో ఒకడైయుండి ఆయనను అప్పగింపబోవు చుండెను గనుక వానిని గూర్చియే ఆయన ఈ మాట చెప్పెను.