యోహాను సువార్త

అధ్యాయం 10 · John Chapter 10 · 42 వచనములు
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21

అధ్యాయము 10

గ్రంథము: యోహాను సువార్త· నిబంధన: క్రొత్త నిబంధన· వచనములు: 42

1గొఱ్ఱల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొకమార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునైయున్నాడు.

2ద్వారమున ప్రవేశించువాడు గొఱ్ఱల కాపరి.

3అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొఱ్ఱలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొఱ్ఱలను పేరుపెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడి పించును.

4మరియు అతడు తన సొంత గొఱ్ఱలనన్నిటిని వెలుపలికి నడిపించునపుడెల్ల వాటికి ముందుగా నడుచును; గొఱ్ఱలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబ డించును.

5అన్యుల స్వరము అవి యెరుగవు గనుక అన్యుని ఎంతమాత్రమును వెంబడింపక వానియొద్దనుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను.

6ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులెట్టివో వారు గ్రహించుకొనలేదు.

7కాబట్టి యేసు మరల వారితో ఇట్లనెను

8గొఱ్ఱలు పోవు ద్వారమును నేనే; నాకు ముందు వచ్చిన వారందరు దొంగలును దోచుకొనువారునై యున్నారు; గొఱ్ఱలు వారి స్వరము వినలేదు.

9నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును.

10దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరిదేనికిని రాడు; గొఱ్ఱలకు జీవము కలుగుటకును అది సమృధ్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

11నేను గొఱ్ఱలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱలకొరకు తన ప్రాణము పెట్టును.

12జీతగాడు గొఱ్ఱల కాపరికాడు గనుక గొఱ్ఱలు తనవికానందున తోడేలు వచ్చుట చూచి గొఱ్ఱలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొఱ్ఱలను పట్టి చెదరగొట్టును.

13జీతగాడు జీతగాడే గనుక గొఱ్ఱలనుగూర్చి లక్ష్యము చేయక పారిపోవును.

14నేను గొఱ్ఱెల మంచి కాపరిని.

15తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా గొఱ్ఱలను ఎరుగుదును, నా గొఱ్ఱలు నన్ను ఎరుగును. మరియు గొఱ్ఱలకొరకు నా ప్రాణము పెట్టుచున్నాను.

16ఈ దొడ్డివికాని వేరే గొఱ్ఱలును నాకు కలవు; వాటినికూడ నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొఱ్ఱల కాపరి ఒక్కడును అగును.

17నేను దాని మరల తీసికొనునట్లు నా ప్రాణము పెట్టుచున్నాను; ఇందు వలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు.

18ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను.

19ఈ మాటలనుబట్టి యూదులలో మరల భేదము పుట్టెను.

20వారిలో అనేకులువాడు దయ్యము పట్టిన వాడు, వెఱ్ఱివాడు; వాని మాట ఎందుకు వినుచున్నారనిరి.

21మరి కొందరుఇవి దయ్యము పట్టినవాని మాటలుకావు; దయ్యము గ్రుడ్డివారి కన్నులు తెరవగలదా అనిరి.

22ఆలయ ప్రతిష్ఠితపండుగ యెరూషలేములో జరుగు చుండెను.

23అది శీతకాలము. అప్పుడు యేసు దేవాల యములో సొలొమోను మంటపమున తిరుగుచుండగా

24యూదులు ఆయనచుట్టు పోగైఎంతకాలము మమ్మును సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి.

25అందుకు యేసుమీతో చెప్పితిని గాని మీరు నమ్మరు, నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.

26అయితే మీరు నా గొఱ్ఱలలో చేరినవారుకారు గనుక మీరు నమ్మరు.

27నా గొఱ్ఱలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును.

28నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహ రింపడు.

29వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటె గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలోనుండి యెవడును వాటిని అపహరింపలేడు;

30నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను.

31యూదులు ఆయనను కొట్టవలెనని మరల రాళ్లుచేత పట్టుకొనగా

32యేసు తండ్రి యొద్దనుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని; వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారినడిగెను.

33అందుకు యూదులునీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి.

34అందుకు యేసుమీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియుండలేదా?

35లేఖనము నిరర్థకము కానేరదు గదా, దేవుని వాక్యమెవరికి వచ్చెనో వారే దైవములని చెప్పినయెడలనేను దేవుని కుమారుడనని చెప్పినందుకు,

36తండ్రి ప్రతిష్ఠచేసి యీ లోకములోనికి పంపినవానితోనీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా?

37నేను నాతండ్రి క్రియలు చేయనియెడల నన్ను నమ్మకుడి,

38చేసినయెడల నన్ను నమ్మకున్నను, తండ్రి నాయందును నేను తండ్రియందును ఉన్నామని మీరు గ్రహించి తెలిసి కొనునట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పెను.

39వారు మరల ఆయనను పట్టుకొన చూచిరి గాని ఆయన వారి చేతినుండి తప్పించుకొని పోయెను.

40యొర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిస్మమిచ్చు చుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్లి అక్కడనుండెను.

41అనేకులు ఆయనయొద్దకు వచ్చియోహాను ఏ సూచక క్రియను చేయలేదు గాని యీయననుగూర్చి యోహాను చెప్పిన సంగతులన్నియు సత్యమైన వనిరి.

42అక్కడ అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి.