కీర్తనల గ్రంథము

అధ్యాయం 45 · Psalms Chapter 45 · 17 వచనములు

అధ్యాయము 45

గ్రంథము: కీర్తనల గ్రంథము· నిబంధన: పాత నిబంధన· వచనములు: 17

1ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజునుగూర్చి రచించినదానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలమువలె నున్నది.

2నరులకంటె నీవు అతిసుందరుడవై యున్నావు నీ పెదవులమీద దయారసము పోయబడియున్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును.

3శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము.

4సత్యమును వినయముతోకూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలు దేరుము నీ దక్షిణహస్తము భీకరమైనవాటిని జరిగించుటకు నీకు నేర్పును.

5నీ బాణములు వాడిగలవి ప్రజలు నీచేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును.

6దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము.

7నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్రకంటె హెచ్చ గునట్లుగా నిన్ను ఆనందతైలముతో అభిషేకించి యున్నాడు.

8నీ వస్త్రములెల్ల గోపరస వాసనే అగరు వాసనే లవంగిపట్ట వాసనే దంతముతో కట్టిన నగరులలో తంతివాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి.

9నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిలుచుచున్నది.

10కుమారీ, ఆలకించుము ఆలోచించి చెవియొగ్గుము నీ స్వజనమును నీ తండ్రి యింటిని మరువుము

11ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము.

12తూరు కుమార్తె నైవేద్యము తీసికొనివచ్చును జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదకుదురు.

13అంతఃపురములోనుండు రాజుకుమార్తె కేవలము మహిమ గలది ఆమె వస్త్రము బంగారు బుట్టాపని చేసినది.

14విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజు నొద్దకు ఆమె తీసికొని రాబడుచున్నది ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు నీయొద్దకు తీసికొని రాబడుచున్నారు.

15ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు రాజనగరులో ప్రవేశించుచున్నారు.

16నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు భూమియందంతట నీవు వారిని అధికారులనుగా నియ మించెదవు.

17తరములన్నిటను నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు.