కీర్తనల గ్రంథము

అధ్యాయం 32 · Psalms Chapter 32 · 11 వచనములు

అధ్యాయము 32

గ్రంథము: కీర్తనల గ్రంథము· నిబంధన: పాత నిబంధన· వచనములు: 11

1తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు.

2యెహోవాచేత నిర్దోషి అని యెంచబడినవాడు ఆత్మలో కపటములేనివాడు ధన్యుడు.

3నేను మౌనినై యుండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వనివలన నాయెముకలు క్షీణించినవి.

4దివారాత్రులు నీ చెయ్యి నామీద బరువుగా నుండెను నా సారము వేసవికాలమున ఎండినట్టాయెను. (సెలా.)

5నా దోషమును కప్పుకొనక నీ యెదుట నాపాపము ఒప్పుకొంటిని యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పు కొందు ననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు. (సెలా.)

6కావున నీ దర్శనకాలమందు భక్తిగలవారందరు నిన్ను ప్రార్థనచేయుదురు. విస్తార జలప్రవాహములు పొరలివచ్చినను నిశ్చయముగా అవి వారిమీదికి రావు.

7నా దాగు చోటు నీవే, శ్రమలోనుండి నీవు నన్ను రక్షించెదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు

8నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గ మును నీకు బోధించెదను నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను

9బుద్ధి జ్ఞానములులేని గుఱ్ఱమువలెనైనను కంచరగాడిద వలెనైనను మీరు ఉండకుడి అవి నీ దగ్గరకు తేబడునట్లు వాటి నోరు వారుతోను కళ్లెముతోను బిగింపవలెను.

10భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యెహోవాయందు నమి్మకయుంచువానిని కృప ఆవ రించుచున్నది.

11నీతిమంతులారా, యెహోవానుబట్టి సంతోషించుడి ఉల్లపించుడి యథార్థ హృదయులారా, మీరందరు ఆనందగానము చేయుడి.