యోబు గ్రంథము

అధ్యాయం 28 · Job Chapter 28 · 28 వచనములు

అధ్యాయము 28

గ్రంథము: యోబు గ్రంథము· నిబంధన: పాత నిబంధన· వచనములు: 28

1వెండికి గని గలదు పుటమువేయు సువర్ణమునకు స్థలము గలదు.

2ఇనుమును మంటిలోనుండి తీయుదురు రాళ్లు కరగించి రాగి తీయుదురు.

3మనుష్యులు చీకటికి అంతము కలుగజేయుదురు గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెదకుచు వారు భూమ్యంతముల వరకు సంచరింతురు.

4జనులు తిరుగు స్థలములకు చాల దిగువగా మనుష్యులు సొరంగము త్రవ్వుదురు వారు పైసంచరించువారిచేత మరువబడుదురు అచ్చట వారు మానవులకు దూరముగానుండి ఇటు అటు అల్లాడుచుందురు.

5భూమినుండి ఆహారము పుట్టును దాని లోపలిభాగము అగ్నిమయమైనట్లుండును.

6దాని రాళ్లు నీలరత్నములకు స్థానము దానిలో సువర్ణమయమైన రాళ్లున్నవి.

7ఆ త్రోవ యే క్రూరపక్షికైనను తెలియదు డేగ కన్నులు దాని చూడలేదు

8గర్వముగల క్రూర జంతువులు దాని త్రొక్కలేదు. సింహము ఆ మార్గమున నడవలేదు

9మనుష్యులు స్ఫటికమువంటి బండను పట్టుకొందురు పర్వతములను వాటి కుదుళ్ల సహితముగా బోర్ల ద్రోయుదురు.

10బండలలో వారు బాటలు కొట్టుదురు వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును.

11నీళ్లు ఓడిగిలిపోకుండ వారు జలధారలకు గట్టు కట్టు దురు మరుగైయున్న వస్తువును వారు వెలుగులోనికి తెప్పించు దురు

12అయితే జ్ఞానము ఎక్కడ దొరకును? వివేచన దొరకు స్థలము ఎక్కడ నున్నది?

13నరులు దాని విలువను ఎరుగరు ప్రాణులున్న దేశములో అది దొరకదు.

14అగాధము అది నాలో లేదనును సముద్రమునాయొద్ద లేదనును.

15సువర్ణము దానికి సాటియైనది కాదు దాని విలువకొరకై వెండి తూచరాదు.

16అది ఓఫీరు బంగారమునకైనను విలువగల గోమేధికమునకైనను నీలమునకైనను కొనబడునది కాదు.

17సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటికావు ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్య బడదు.

18పగడముల పేరు ముత్యముల పేరు దానియెదుట ఎత్తనేకూడదు. జ్ఞానసంపాద్యము కెంపులకన్న కోరతగినది

19కూషుదేశపు పుష్యరాగము దానితో సాటికాదు. శుద్ధసువర్ణమునకు కొనబడునది కాదు.

20అట్లైన జ్ఞానము ఎక్కడనుండి వచ్చును? వివేచన దొరకు స్థలమెక్కడ నున్నది?

21అది సజీవులందరి కన్నులకు మరుగై యున్నది ఆకాశపక్షులకు మరుగుచేయబడి యున్నది.

22మేము చెవులార దానిగూర్చిన వార్త వింటిమని నాశన మును మరణమును అనును.

23దేవుడే దాని మార్గమును గ్రహించును దాని స్థలము ఆయనకే తెలియును.

24ఆయన భూమ్యంతములవరకు చూచుచున్నాడు. ఆకాశము క్రింది దానినంతటిని తెలిసికొనుచున్నాడు.

25గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించి నప్పుడు ప్రమాణమునుబట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు

26వర్షమునకు కట్టడ నియమించినప్పుడు ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరచి నప్పుడు

27ఆయన దాని చూచి బయలుపరచెను దానిని స్థాపనచేసి దాని పరిశోధించెను.

28మరియుయెహోవాయందలి భయభక్తులే జ్ఞాన మనియు దుష్టత్వము విడచుటయే వివేకమనియు ఆయన నరు లకు సెలవిచ్చెను.