ఆరాధన క్రమము
బో: తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున.
సభ: ఆమేన్
బో: నీ వెలుగును, నీ సత్యమును బయలు దేర జేయుము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును, నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠము నొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగచేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, ఆరాధించుచు, ప్రార్థించుచు నీకు కృతజ్ణతా స్తుతులు చెల్లించెదను.
పాపపుటొప్పుదల
బో: ప్రభువు నందు ప్రియులారా! యదార్థ హృదయముతో మన తండ్రియైన దేవుని సమీపించి, ఆయన యెదుట మన పాపముల నొప్పుకొని, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయ చేయుమని వేడుకొందము.
బో: ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది.
సభ: భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే.
బో: ప్రభువు సన్నిధిని నా యతిక్రమములు నేనొప్పుకొందు ననుకొంటిని.
సభ: నీవు నా పాప దోషము పరిహరించి యున్నావు.
బో: మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా! దీనులము పాపులము అగు మేము స్వాభావికముగా పాపులమనియు. అపవిత్రులమనియు తలంపు వలన, మాట వలన, క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితి మనియు నీ యెదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసు క్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము.
* సభ బోధకునితో కలిసి ఇట్లు చెప్పవలెను
మా కొరకు చనిపోవుటకై నీ జనితైక కుమారునిచ్చిన మిగుల కరుణ గల దేవా! మమ్మును కనికరించి, ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయుము. మేము నీ కృపచేత నిత్యజీవము పొందునట్లు నిన్ను గూర్చియు, నీ చిత్తమును గూర్చియు సరియైన ఙ్ఞానమును, నీ వాక్యమునకు తగిన విధేయతను మాయందు నీ పరిశుద్ధాత్మ వలన వృధ్ధి పొందింపుమని, మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్.
బో: మన పరలోకపు తండ్రియగు సర్వశక్తిగల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపొవుటకై తన యేక కుమారునిచ్చి, ఆయన మూలమున మన పాపములంటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారమిచ్చును. వారికి తన పరిశుధ్ధాత్మ ననుగ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా! ఈ రక్షణను మా యందరికి దయచేయుము.
సభ: ఆమేన్
ప్రారంభ గీతము
త్య్రేకుని మహిమ
తండ్రికిన్, కుమారునికిన్, పరిశుద్ధాత్మకును ఆదియందు, ఇప్పుడు ఎల్లపుడు యుగయుగము లందునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్.
ప్రభుని కనికరము
బో: ప్రభువా! మమ్మును కనికరింపుము.
సభ: ప్రభువా! మమ్మును కనికరింపుము.
బో: క్రీస్తూ! మమ్మును కనికరింపుము.
సభ: క్రీస్తూ! మమ్మును కనికరింపుము.
బో: ప్రభువా! మమ్మును కనికరింపుము.
సభ: ప్రభువా! మమ్మును కనికరింపుము.
సర్వోన్నతుని మహిమ
బో: సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమ. కలుగును గాక - దేవునికి మహిమ - కలుగును గాక = కలుగు నున్నతమైన - ఘన స్థలములందున - ఇలకు సమాధానం - నరుల కాయన దయ|| ప్రభువైన దేవా - పరమ రాజా - సర్వపరిపాలనా = పరిపూర్ణ శక్తిగల పరమజనక నిన్ను - మహిని స్తుతించుచు - మరి పొగడు చున్నాము ||
మహిమ పర్చుచు - ఆరాధించు చున్నాము నిన్ను = మహిమాతిశయమును - మది దలంచియు నీకు - మహిని మా స్తుతి కృతఙ్ఞత నిచ్చు చున్నాము. ||
*ఏక కుమారా - యేసు ప్రభువా - యెహొవా - తనయా - లోకపాపము మోయు - ఏక దేవుని గొఱ్ఱె - పిల్ల! మమ్మును కనిక - రించుము చల్లగ||
*లోకపాపములు - మోసుకుపోవు - యేసు రక్షకా = వాసిగ జనకుని కుడివైపున గూర్చుండు - యేసు ! మా ప్రార్థనా-లించి కనికరించు ||
పరిశుధ్ధుడవు - ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు = పరిశుద్ధాత్మతో తండ్రి - యైన దేవుని యందు - పరిపూర్ణ మహిమతో = ప్రబలు చున్నావెపుడు ||ఆమేన్||
బో: ప్రభువు మీతో నుండు గాక.
సభ: మీ అత్మతో నుండు గాక
బో: ప్రార్థింతము
సంగ్రహ ప్రార్థన
సభ: ఆమేన్
పాత నిబంధన పాఠము
*పాత నిబంధన భాగము చదువుట ముగియగానే పాడ వలసినది
సభ: పరిశుద్ధుడవగు దేవా! పావన శక్తుడ దేవా ! పావన అమర్త్య దేవా ! మమ్మును కనికరింపుము.
పత్రిక పాఠము
బో: ..... రోజుకు ఏర్పరుపబడిన పత్రిక వాక్యభాగము ...... వ్రాసిన పత్రిక ....... వ అధ్యాయము ...... వ వచనము నుండి ఈలాగు వ్రాయబడియున్నది.
బో: ఇంతటితో ఈ దినమునకైన పత్రిక పాఠము ముగియుచున్నది.
సభ: హల్లెలూయా ! హల్లెలూయా ! హల్లెలూయా !
* ప్రభుని శ్రమ కాలములో ఈ క్రింది వచనము పాడవలెను
సభ: నిందితుడై క్రీస్తు మరణ మొందునంతగా, శ్రమ నొందునంతగా, సిల్వ నొందునంతగా, ఇంపొందుగా తగ్గించుకొనియె నొనర వినయుడై
- సువార్త పాఠము -
బో: .....కు ఏర్పరుపబడిన పరిశుద్ధ సువార్త వాక్యభాగము పరిశుద్ధుడైన ..... వ్రాసిన సువార్త ..... వ అధ్యాయము ..... వ వచనము నుండి ఈలాగు వ్రాయబడి యున్నది.
సభ: ఓ ప్రభువా! నీకు మహిమ కలుగును గాక.
* సువార్త పాఠము చదివిన తరువాత
బో: ఇంతటితో ఈ దినమునకైన పరిశుద్ధ సువార్త పాఠము ముగియు చున్నది
సభ: ఓ క్రీస్తూ! నీకు స్త్రోత్రము కలుగును గాక.
అపోస్తులు విశ్వాస ప్రమాణము
భూమ్యకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రియైన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడగు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ము చున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యయైన మరియకు పుట్టి, పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వెయబడి చనిపోయి సమాధి వేయబడెననియు, అదృశ్యలోకములోనికి దిగెననియు, చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమున కెక్కి సర్వశక్తిగల తండ్రియగు దేవుని కుడిచేతి వైపున కూర్చుండి యున్నాడనియు సజీవులకును, మృతులకును, తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను.
పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణము, శరీర పునరుత్ఢానము, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్.
పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక, మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము. మా యెడల అపరాధములు చేసినవారిని మేము క్షమించియున్న ప్రకారము మా అపరాధములు క్షమించుము. మమ్మును శోధనలోకి తేక కీడు నుండి మమ్మును తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైయున్నవి. ఆమేన్
నికేయ లేక వైసియ విశ్వాస ప్రమాణము
భూమ్యాకాశములను, దృశ్యాదృశ్యమగు సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రియగు ఏకదేవుని నేను నమ్ముచున్నాను.
ఆయన జనితైక కుమారుడును అద్వితీయుడునగు ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికి ముందు తండ్రినుండి కలిగినవాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏక తత్వము గలవాడును, సమస్తమును కలుగచేసినవాడునై యున్నాడు.
ఈయన మానవులగు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకమునుండి దిగి కన్యయగు మరియ నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుష్యుడాయెననియు, పొంతి పిలాతు అధికారము క్రింద మన కొరకు సిలువ వేయబడి శ్రమనొంది సమాధి చేయబడెననియు, లేఖనముల ప్రకారము మూడవ దినమున తిరిగి లేచి పరలోకమున కెక్కి తండ్రి యొక్క కుడిచేతి వైపున కూర్చుండి యున్నాడనియు, సజీవులకును, మృతులకును తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చుననియు, ఆయన రాజ్యమునకు అంతము లేదనియు నమ్ముచున్నాను. తండ్రి నుండియు, కుమారుని నుండియు బయలు వెడలుచు తండ్రితోను, కుమారునితోను ఏకముగా ఆరాధింపబడుచు, మహిమ పరుప బడుచు ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును, జీవమునకు దాతయు ప్రభువునగు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపొస్తలుల యేక సంఘమును నమ్ముచున్నాను. పాపపరిహారమునకైన ఒకే బాప్తిస్మము నొప్పుకొనుచు మృతుల పునరుత్థానము కొరకును రాబోవు లోకసంబంధమైన బ్రతుకు కొరకును నిరీక్షించుచున్నాను. ఆమేన్.
“కర్తా మమ్మును” దీవించి
క్షేమంఇఛ్చి పంపుము
జీవాహార వార్త నిచ్చి
మమ్మును పోషించుము
ఇహ నిన్ను వేడుకొని
బహుగా స్తుతింతుము
పరమందు చేరి యింక
స్తోత్రము చెల్లింతుము