విలాపవాక్యములు

అధ్యాయం 5 · Lamentations Chapter 5 · 22 వచనములు
1 2 3 4 5

అధ్యాయము 5

గ్రంథము: విలాపవాక్యములు· నిబంధన: పాత నిబంధన· వచనములు: 22

1యెహోవా, మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసి కొనుము దృష్టించి మామీదికి వచ్చిన నింద యెట్టిదో చూడుము.

2మా స్వాస్థ్యము పరదేశుల వశమాయెను. మా యిండ్లు అన్యుల స్వాధీనమాయెను.

3మేము దిక్కులేనివారము తండ్రిలేనివారము మా తల్లులు విధవరాండ్రయిరి.

4ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితివిు క్రయమునకు కట్టెలు తెచ్చుకొంటిమి.

5మమ్మును తురుమువారు మా మెడలమీదికి ఎక్కి యున్నారు మేము అలసట చెందియున్నాము, విశ్రాంతి యనునది మాకు లేదు.

6పొట్టకూటికై ఐగుప్తీయులకును అష్షూరీయులకును లోబడియున్నాము.

7మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి మేము వారి దోషశిక్షను అనుభవించుచున్నాము.

8దాసులు మాకు ప్రభువులైరి వారి వశమునుండి మమ్మును విడిపింపగలవా డెవడును లేడు.

9ఎడారిజనుల ఖడ్గభయమువలన ప్రాణమునకు తెగించి మా ధాన్యము తెచ్చుకొనుచున్నాము.

10మహా క్షామమువలన మా చర్మము పొయ్యివలె నలు పెక్కెను.

11శత్రువులు సీయోనులో స్త్రీలను చెరిపిరి యూదా పట్టణములలో కన్యకలను చెరిపిరి.

12చేతులు కట్టి అధిపతులను ఉరితీసిరి వారేమాత్రమును పెద్దలను ఘనపరచలేదు.

13¸°వనులు తిరుగటిరాయి మోసిరి బాలురు కట్టెలమోపు మోయజాలక తడబడిరి.

14పెద్దలు గుమ్మములయొద్ద కూడుట మానిరి ¸°వనులు సంగీతము మానిరి.

15సంతోషము మా హృదయమును విడిచిపోయెను నాట్యము దుఃఖముగా మార్చబడియున్నది.

16మా తలమీదనుండి కిరీటము పడిపోయెను మేము పాపము చేసియున్నాము, మాకు శ్రమ.

17దీనివలన మాకు ధైర్యము చెడియున్నది. సీయోను పర్వతము పాడైనది

18నక్కలు దానిమీద తిరుగులాడుచున్నవి మా కన్నులు దీని చూచి మందగిలెను.

19యెహోవా, నీవు నిత్యము ఆసీనుడవై యుందువు నీ సింహాసనము తరతరములుండును.

20నీవు మమ్ము నెల్లప్పుడును మరచిపోవుట ఏల? మమ్ము నింతకాలము విడిచిపెట్టుట ఏల?

21యెహోవా, నీవు మమ్మును నీతట్టు త్రిప్పినయెడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరల మాకు కలుగజేయుము.

22నీవు మమ్మును బొత్తిగా విసర్జించి యున్నావు నీ మహోగ్రత మామీద వచ్చినది.