సమూయేలు మొదటి గ్రంథము

అధ్యాయం 27 · 1 Samuel Chapter 27 · 12 వచనములు
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

అధ్యాయము 27

గ్రంథము: సమూయేలు మొదటి గ్రంథము· నిబంధన: పాత నిబంధన· వచనములు: 12

1తరువాత దావీదునేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలుచేత నాశన మగుదును; నేను ఫిలిష్తీయుల దేశములోనికి తప్పించుకొని పోవుదును, అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల సరి హద్దులలో నన్ను వెదకుట మానుకొనును గనుక నేను అతని చేతిలోనుండి తప్పించుకొందునని అనుకొని

2​లేచి తనయొద్దనున్న ఆరువందలమందితో కూడ ప్రయాణమై మాయోకు కుమారుడును గాతు రాజునైన ఆకీషునొద్దకు వచ్చెను.

3​దావీదు గాతులో ఆకీషునొద్ద చేరగా అతడును అతని వారందరును తమ తమ కుటుంబముల సమేతముగా కాపురముండిరి. యెజ్రెయేలీయురాలగు అహీనోయము, నాబాలు భార్యయైయుండిన కర్మెలీయు రాలగు అబీగయీలు అను అతని యిద్దరు భార్యలు దావీదుతోకూడ ఉండిరి.

4​దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెదకుట మాని వేసెను.

5​అంతట దావీదురాజపురమందు నీయొద్ద నీ దాసుడనైన నేను కాపురము చేయనేల? నీ దృష్టికి నేను అనుగ్రహము పొందినవాడనైతే బయటి పట్టణములలో ఒకదానియందు నేను కాపురముండుటకు ఒక స్థలము ఇప్పించుమని ఆకీషును అడుగగా

6​ఆకీషు సిక్లగు అను గ్రామమును ఆ దినమున అతని కిచ్చెను. కాబట్టి నేటివరకు సిక్లగు యూదారాజుల వశమున నున్నది.

7​దావీదు ఫిలిష్తీయుల దేశములో కాపురముండిన కాల మంత ఒక సంవత్సరము నాలుగు నెలలు.

8​అంతలో దావీదును అతని వారును బయలుదేరి గెషూరీయుల మీదను గెజెరీయులమీదను అమాలేకీయులమీదను పడిరి ప్రయాణస్థులు పోవుమార్గమున షూరునుండి ఐగుప్తువరకు నున్న దేశములో వారు పూర్వము కాపురముండగా

9​దావీదు ఆ దేశస్థులను హతముచేసి, మగవానినేమి ఆడు దానినేమి యెవరిని సజీవులుగా విడువక గొఱ్ఱలను ఎడ్లను గార్దభములను ఒంటెలను వస్త్రములను దోచుకొని తిరిగి ఆకీషునొద్దకు వచ్చెను.

10​ఆకీషుఇప్పుడు మీరు దండెత్తి దేశములో జొరబడితిరా అని దావీదు నడుగగా దావీదుయూదా దేశమునకును యెరహ్మెయేలీయుల దేశమున కును కేనీయుల దేశమునకును దక్షిణముగా మేము ఒక ప్రదేశములో జొరబడితిమనెను.

11​ఆలాగున దావీదు చేయుచు వచ్చెను. అతడు ఫిలిష్తీయుల దేశములో నివ సించినంత కాలము ఈ ప్రకారముగా చేయునని తమ్మును గురించి వారు చెప్పుదురేమో అని గాతుకు వర్తమానము తేగల మగవానినైనను ఆడు దానినైనను దావీదు బ్రతుక నియ్యలేదు.

12​దావీదు తన జనులైన ఇశ్రాయేలీయులు తనయందు బొత్తిగా అసహ్యపడునట్లు చేసెను గనుక అతడు సదాకాలము నాకు దాసుడుగాను ఉండునని అనుకొని ఆకీషు దావీదు మాట నమ్మెను.